Kitchen Gardening
-
5 లేయర్ కిచెన్ గార్డెన్
డాక్టర్ చంద్రశేఖర బిరదర్ కర్ణాటకలో పుట్టారు. రోదసీ శాస్త్రవేత్త. ఈజిప్టు రాజధాని నగర కైరోలో నివాసం ఉంటున్నారు. విదేశాల్లో నివాసం వల్ల మన ఆకుకూరలు, కూరగాయలు అక్కడ దొరకని పరిస్థితుల్లో కుండీల్లో ఇంటిపట్టునే పండించుకోవడం అలవాటు చేసుకున్నారు. అనేక సంవత్సరాలుగా సేంద్రియ ఇంటిపంటల సాగులో అనుభవం గడించారు. ‘సేంద్రియ ఇంటిపంటల సాగు ఓ అదనపు పని ఎంత మాత్రం కాదు. ఇదొక ఆనంద దాయక వ్యాపకం’ అంటున్నారు డా. చంద్రశేఖర. కేవలం 50 చదరపు అడుగుల రూఫ్‌టాప్ గార్డెన్లో 50 రకాల పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలను గత పదేళ్లుగా సాగు చేస్తున్నారు. చోటు తక్కువ ఉందని బాధ పడకుండా.. ఐదు అంతస్థుల్లో, ఒకే కుండీల్లో అనేక ఎత్తుల్లో పెరిగే పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. 5 లేయర్ మోడల్ అన్నమాట. పెద్ద కుండీలు పెట్టుకోవాలి. ఎక్కువ మొక్కలు, చెట్లు పెరగాలి కాబట్టి వెడల్పు, లోతు వీలైనంత ఎక్కువగా ఉండాలి. మూడున్నర అడుగుల ఎత్తయిన కుండీలు/తొట్లలో 5 అంతస్తుల సాగు చేస్తున్నారాయన. కుండీ ఎత్తు కనీసం 30–50 సెం.మీ (12 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు)., కుండీ అడుగున కనీసం 40–60 సెం.మీ.(16 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు) వెడల్పు ఉండాలి అన్నది ఆయన సూచన. బహుళ అంతస్తుల్లో కలిసి పెరిగే రకరకాల కూరగాయ, పండ్ల, ఆకుకూర మొక్కలను ఒకే కుండీలో పెంచటం వల్ల పరస్పర తోడ్పాటు వల్ల చీడపీడల నుంచి తట్టుకోగలుగుతాయి. ఒక కుండీ ద్వారా పొందే ఉత్పాదకత పెరుగుతుంది. రుచి, పౌష్టికత, వాసన ఇనుమడిస్తాయని డా. చంద్రశేఖర అంటున్నారు. ‘2“6 చదరపు అడుగుల బాల్కనీ ఉంటే చాలు 50 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు. అయితే, రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం తినాలన్న బలమైన కోరిక ఉండాలి సుమా. మనసుంటే మార్గం ఉంటుంది కదా’ అంటున్నారాయన. సేంద్రియ పద్ధతుల్లో పెరిగే చెట్లు, మొక్కలు తాము తయారు చేసుకున్న పోషక ద్రవాలలో కొంత భాగాన్ని వేర్ల ద్వారా మట్టిలోని సూక్ష్మజీవరాశి పోషణ కోసం స్రవిస్తూ ఉంటాయి. ‘తులసి, మల్లె మొక్కలున్న కుండీలో పెరిగే లెట్యూస్ ఆకుల రుచి, వాసన ఇతర కుండీల్లో పెరిగిన లెట్యూస్ కన్నా భిన్నంగా ఉంటుంది’ అంటున్నారు డా. చంద్రశేఖర. 5 అంతస్తుల్లో మొక్కలన్నీ ఒకేసారి కాకుండా.. మొదట కొన్ని రకాలు పెట్టండి. ఆ మట్టి, నీరు, వాతావరణంలో అవి పెరుగుతున్న తీరును గమనిస్తూ.. మిగతా వాటిని దఫ దఫాలుగా జోడిస్తూ ఐదు అంచెల సాగుకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. 32 దేశాల్లో నివాసం ఉండటం వల్ల డా. చంద్రశేఖరతోపాటు ఆయన కుటుంబం విభిన్న వాతావరణాల్లో ఇంటిపంటల సాగులో అపారమైన అనుభవం గడించింది. డాక్టర్ చంద్రశేఖర బిరదర్ వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములతో తక్కువ స్థలంలో కంపోస్టు తయారు చేసుకోవడానికి ఆయన పైపును వాడుతున్నారు. 6“3 సైజు పీవీసీ పైపును నిలువుగా కుండీ మట్టిలో జొప్పించి.. వ్యర్థాలను అందులో వేస్తున్నారు. అవి కుళ్లే దశలో ఊరే ద్రవాలు కుండీ మట్టిలోకి వెళ్తాయి. ఆ కుండీలో పెరిగే మొక్కలకు పోషకాల లోపం కూడా ఉండదు. మట్టి కుండల ద్వారా నీటిని అందించడం ద్వారా 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చని డా. చంద్రశేఖర చెబుతున్నారు. మూతి మూసేసి ఉన్న మట్టి కుండలకు డ్రిప్ పైపులు అమర్చి వాల్వు తిప్పితే కుండలు నీటితో నిండేలా ఏర్పాటు చేసుకున్నారు. -
సేంద్రియ ఇంటిపంటల పితామహుడు!
వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకోండి. మీకు నచ్చిన పంటలనే మీ ఇంటిపై పండించుకోండి. మీరు పండించుకున్న కూరగాయలు, ఆకుకూరలు, పండ్లనే ఇంటిల్లపాదీ తినండి! – దివంగత డా. బి.ఎన్. విశ్వనాథ్, భారతీయ సేంద్రియ ఇంటిపంటల పితామహుడు, బెంగళూరు నగరాల్లో సేంద్రియ ఇంటిపంటల చరిత్రలో ఒక విచారకరమైన ఘట్టం. భారతీయ ఆర్గానిక్ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ పితామహుడు డాక్టర్ బి.ఎన్.విశ్వనాథ్ ఇక లేరు. ఆదివారం బెంగళూరులోని ఆసుపత్రిలో కన్నుమూశారు. గత ఏడాదిన్నరగా కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న ఆయనను కరోనా బలితీసుకుంది. బెంగళూరు కేంద్రంగా రసాయనిక అవశేషాల్లేని సేఫ్ ఫుడ్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఆయన.. టెర్రస్‌లపై సేంద్రియ ఇంటిపంటల సాగును నిరంతర శ్రమతో ఉద్యమంగా విస్తరింపజేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీటక శాస్త్ర నిపుణుడిగా పనిచేసి రిటైరైన డా. విశ్వనాథ్ తమ ఇంటిపై 1995 నుంచి సేంద్రియ ఇంటిపంటలు సాగు చేయనారంభించారు. అంతేకాదు, నగరాలు, పట్టణాల్లో ఇళ్లు కట్టుకొని స్థిర నివాసం ఉంటున్న వారే కాదు, అపార్ట్మెంట్లలో అద్దెకుంటున్న వారు సైతం తమకు ఉన్న కొద్ది గజాల స్థలంలో అయినా సరే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చుకొని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవటం తమ బాధ్యతగా గుర్తెరగాలని ఎలుగెత్తి చాటిచెప్పారు. బెంగళూరు, మైసూరు, మాండ్య, ధార్వాడ్–హుబ్లీ తదితర చోట్ల అవిశ్రాంతంగా టెర్రస్ గార్డెనింగ్పై శిక్షణ ఇచ్చారు. ఈ పాతికేళ్లలో కనీసం వెయ్యికి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. కనీసం పది వేల మంది ముఖతా ఆయన దగ్గర శిక్షణ పొంది, టెర్రస్ గార్డెనింగ్‌ను తమ జీవితాల్లో భాగం చేసుకున్నారు. ముఖాముఖి సంభాషణకు వీలుగా ఉండాలని కేవలం పది, పదిహేను మందికి మాత్రమే ఒకసారి శిక్షణ ఇచ్చేవారు. ఉపన్యసించటం, పీపీటీ ద్వారా మెలకువలను విపులంగా తెలియజెప్పటంతోపాటు శిక్షణ పొందే వారందరికీ మట్టిలో చేతులు పెట్టి పనిచేయటం నేర్పించేవారు. కొన్నేళ్లు ఆయన స్వయంగా నిర్వహించిన శిక్షణా శిబిరాలను గత కొన్నేళ్లుగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఎఎంఇ ఫౌండేషన్ నిర్వహిస్తుండగా, డా. విశ్వనాథ్ రిసోర్స్ పర్సన్‌గా శిక్షణ ఇస్తున్నారు. కన్నడంలో, ఆంగ్లంలో టెర్రస్ గార్డెనింగ్పై పుస్తకాలు రాశారు. బెంగళూరు సిటీ ఫార్మర్స్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి చివరి వరకు అధ్యక్షునిగా సేవలందించారు. ఎవరి ఇళ్ల మీద వాళ్లు సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తినటం మొదటి దశ. అమృత సమానమైన మిగులు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర ఉత్పత్తులను అమ్మకానికి పెట్టించడం ద్వారా ప్రజలను సేంద్రియ ఇంటిపంటల సాగు వైపు ఆకర్షించే ప్రయత్నం చేయటం డా. విశ్వనాథ్ ప్రత్యేకత. ఇందుకోసం ‘ఊట ఫ్రం యువర్ తోట’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేసి.. మూడు నెలలకోసారి బెంగళూరు సిటీలో ఒక్కోచోట సేంద్రియ ఇంటిపంటల సంతలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 35 సంతల(www.ofyt.org)ను నిర్వహించారు. ఇతర నగరాల్లో ఇంటిపంటల సాగుదారులు బెంగళూరు అనుభవాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 1995 నుంచి ప్రారంభమైన టెర్రస్ ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ కార్యకాలాపాల రజతోత్సవాలను ఈనెల 15 నుంచి నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోగా ఆదివారం డా. విశ్వనాథ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. ఆహారోత్పత్తిలో రైతులతో సహానుభూతి చెందటం కోసం నగర, పట్టణవాసులు సిటీ ఫార్మర్స్‌గా మారి తమ ఇళ్లపైనే పంటలు పండించుకోవాలన్నది ఆయన సందేశం. అందుకోసమే పాతికేళ్లుగా శ్రమించారు. హుబ్లిలో ఏడేళ్ల క్రితం డా. విశ్వనాథ్ నిర్వహించిన జాతీయ సదస్సులో ‘సాక్షి’ తరఫున నేను పాల్గొన్నాను. అంతకుముందే బెంగళూరు వెళ్లి మరీ ఆయనను ఇంటర్వ్యూ చేశాను. తాజా పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు స్థానిక ఆహార భద్రతను అందించేవి సేంద్రియ ఇంటిపంటలే అని ఆయన మాటల ద్వారా, చేతల ద్వారా చాటిచెప్పారు. ఇంటిపంటలపై చిన్నచూపు మాని ఆ స్ఫూర్తిని కొనసాగించడమే ఆధునిక సేంద్రియ ఇంటిపంటల పితామహుడికి మనం ఇవ్వదగిన నివాళి. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ 24 నుంచి హైడ్రోపోనిక్స్‌పై కేరళ వర్సిటీ ఆన్లైన్ శిక్షణ మట్టి లేకుండా నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో ఆకుకూరలు, కొన్ని రకాల కూరగాయలు, ఔషధ మొక్కలను సాగు చేసే పద్ధతి హైడ్రోపోనిక్స్. నీటిలో మొక్కల వేళ్లకు ద్రవపోషకాలు అందించడం హైడ్రోపోనిక్స్ ప్రత్యేకత. నగర, పట్టణాల్లో షెడ్లలోనూ సాగు చేయడానికి వీలైన పద్ధతి ఇది. కరోనా కష్టకాలంలో ఈ పద్ధతిపై ఆసక్తి పెరుగుతున్న నేపధ్యంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన త్రిస్సూర్‌లోని హైటెక్ పరిశోధన–శిక్షణా కేంద్రం ఆన్లైన్ శిక్షణా శిబిరం నిర్వహించనుంది. మాధ్యమం ఆంగ్లం. ఆగస్టు 24 నుంచి 28 వరకు ఉ. 10.30 – 12.30 వరకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ ౖసైంటిస్ట్ డా. సుశీల తెలిపారు. హైడ్రోపోనిక్స్ సాగులో వివిధ పద్ధతులు, డిజైన్, నిర్మాణం, నీటి నాణ్యతా ప్రమాణాలు, పోషకాల నిర్వహణ, చీడపీడల యాజమాన్యం, కృత్రిమ కాంతి సంగతులను శాస్త్రీయంగా వివరిస్తారు. ఫీజు రూ. 4,500. ఈ కింది బ్యాంకు ఖాతాకు డబ్బు పంపిన తర్వాత పేరు, చిరునామా వివరాలను suseela1963palazhy@gmail.com and suseela.p@kau.inకు మెయిల్ చెయ్యాలి. తర్వాత ఆన్లైన్ తరగతుల లింక్ పంపుతారు. వివరాలకు.. Name: The Professor & Head, Instructional Farm, Vellanikkara, Account number: 67395972864, Branch:SBI, Ollukkara Branch, IFSE CODE: SBIN0070210 -
లాక్డౌన్: నిత్యావసరాలకు కొత్త ఆలోచన!
శ్రీనగర్: కరోనా లాక్‌డౌన్‌తో తలెత్తిన విపత్కర పరిస్థితుల నుంచి కొద్దిమేర గట్టేందుకు శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) కొత్త ఆలోచనకు తెరలేపింది. ఇంటి ఆవరణ, నివాసాల చుట్టూ ఉండే ఖాళీ ప్రదేశాల్లో పండ్లు, కూరగాయలు పండించాలని ప్రజలకు సూచించింది. ఇంటి పంటలతో లాక్డౌన్ లాంటి పరిస్థితుల నుంచే కాకుండా.. నిరవధిక కర్ఫ్యూ విధించినప్పుడు కూడా తరచూ బయటకు రాకుండా ప్రజలు సురక్షితంగా ఇళ్లల్లోనే ఉండొచ్చని ఎస్ఎంసీ శనివారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. భవిష్యత్‌లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో కిచెన్ గార్డెన్‌ను తప్పనిసరి చేస్తామని స్పష్టం చేసింది. (చదవండి: భర్త స్నానం చేయడం లేదని భార్య ఫిర్యాదు) ఇప్పటికే కిచెన్ గార్డెన్ పరికరాలను వ్యవసాయ విభాగం సబ్సిడీ ధరలకు అందిస్తోందని గుర్తు చేసింది. ఇక అధిక జనాభా ప్రాంతాల్లో ఒకటైన శ్రీనగర్‌లో లాక్డౌన్, కర్ఫ్యూలతో నిత్యావసరాలు లభించడం కష్టమవుతోంది. మరోవైపు శ్రీనగర్‌కు ప్రధాన మార్గమైన శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై రాకపోకలు వాతావరణ పరిస్థితులకు లోనై ఉంటాయి. కొండలు, గుట్టలతో ఉండే ఆ రహదారిపై ప్రయాణం మంచుకురియడంతో సంక్లిష్టంగా మారుతుంది. కొండ చరియలు విరిగిపడిపోవడంతో రాకపోకలు స్తంభించి సరుకు రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయి. (చదవండి: వలస కూలీలు: కేంద్రం కీలక మార్గదర్శకాలు) -
జైలులో కిచెన్ గార్డెనింగ్
సంగారెడ్డి జిల్లా జైలులో నూతనంగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువే. మొదటగా సీడ్ ట్రాక్ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ సిస్టమ్‌లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు. మట్టి వినియోగం ఉండదు కాబట్టి మొక్క నిలబడటానికి మట్టి రాళ్లను ఆ తొట్టిలో ఉంచుతారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో సొల్యూషన్ ద్రావణాలు ద్వారా అందిస్తారు. సొల్యూషన్ మోతాదులను ప్రత్యేక పరికరాల ద్వారా రోజూ పరీక్షిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా జైలులో జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఈ విధానంతో ఖైదీలకు కావాల్సిన ఆకు కూరలు పండిస్తున్నారు. ఎప్పటికప్పుడూ నూతన పద్ధతులను అనుసరిస్తూ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
మేడ మీద ము‘నగ’!
హైదరాబాద్ గుడిమల్కాపూర్ ఎస్.బి.ఐ. కాలనీలో రెండంతస్థుల సొంత భవనంలో నివాసం ఉంటున్న అర్చన, ఫార్మా ఉద్యోగి అరవింద్‌కుమార్ దంపతులు గత ఐదారేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటున్నారు. ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీపై సిల్పాలిన్ బెడ్స్ తీసుకొని టమాటా, వంకాయలు, అల్లంతోపాటు మునగ, బొప్పాయి చెట్లను పెంచుతున్నారు. పార్స్లీ, ఆరెగానో, తులసి, లెమన్‌గ్రాస్, కలబంద తదితర ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. పెద్ద సిల్పాలిన్ బెడ్లో నాలుగేళ్లుగా ఎత్తుగా పెరిగిన మునగ చెట్టు వీరి కిచెన్ గార్డెన్‌కు తలమానికంగా నిలిచింది. మునగ కాయలతోపాటు ఆకులను కూడా కూరవండుకుంటున్నామని అర్చన తెలిపారు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా పార్స్లీ, ఆరెగానో తదితర ఆకులను ఉపయోగించి ఇంట్లోనే పిజ్జాలు తయారుచేసుకొని తింటుండడం విశేషం. 30 ఏళ్ల నాటి ఈ రెండంతస్థుల భవనానికి పిల్లర్లు వేయలేదు. గోడలపైనే నిర్మించారు. అందువల్ల గోడలపైనే 8 సిల్పాలిన్ బెడ్స్, కుండీలను ఏర్పాటు చేసుకొని ఐదారేళ్లుగా ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. 15 రోజులకోసారి జీవామృతం మొక్కలకు మట్టి ద్వారా, పిచికారీ ద్వారా కూడా ఇస్తున్నారు. రోజూ దేశీ ఆవుపాలు సరఫరా చేసే వ్యక్తే జీవామృతాన్ని సైతం ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేడపైనే ఒక సిల్పాలిన్ బెడ్‌ను కంపోస్టు తయారీకి వాడుతున్నారు. టెర్రస్‌పైన ఇంటిపంటలు, షేడ్‌నెట్, ఇంటి చుట్టూ వెదురు తదితర మొక్కలు ఉండటం వల్ల తమ ఇంట్లో వేసవిలోనూ ఉష్ణోగ్రత 3–4 డిగ్రీల మేరకు సాధారణం కన్నా తక్కువగా ఉంటున్నదని అర్చన(98663 63723) సంతోషంగా చెప్పారు. అంటే.. ఇంటిపంటల కోసం శ్రద్ధతీసుకుంటే.. ఆరోగ్యంతోపాటు ఇంటి ఏసీ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట! మునగాకు చిన్న – పోషకాలలో మిన్న మునగను తింటే అనేక పోషకాలను పుష్కలంగా తిన్నట్టే లెక్క. ఇదీ మునగ ఆకులో నిక్షిప్తమై ఉన్న పోషకాల జాబితా.. విటమిన్–సి: కమలాల్లో కన్నా 7 రెట్లు ఎక్కువ విటమిన్–ఎ: క్యారెట్లలో కన్నా 4 రెట్లు ఎక్కువ కాల్షియం: పాలలో కన్నా 4 రెట్లు ఎక్కువ పొటాషియం: అరటి పండ్లలో కన్నా 3 రెట్లు ఎక్కువ విటమిన్–ఇ: పాలకూరలో కన్నా 3 రెట్లు ఎక్కువ మాంసకృత్తులు: పెరుగులో కంటే 2 రెట్లు ఎక్కువ మునగాకును పప్పులో, సాంబారులో వేసి వండవచ్చు. మునగాకు వేపుడు చేయవచ్చు. మునగకాయలో కంటే ఆకుల్లో పోషకాలు ఎక్కువ మునగ పొడి చేసేదెలా? ► తయారు చేయటం తేలిక – వాడటం తేలిక ► లేత మునగాకును కడిగి, నీడలో ఆరబెట్టాలి ► గలగలలాడేలా ఆరిన మునగాకును పొడి చెయ్యాలి ► పొయ్యి మీద నుంచి దించిన తరువాత కూరలు, చారు వంటి వాటిల్లో వేయచ్చు. మునగలో ఉపయోగపడని భాగం లేదు ఆకులు – కూర, పోషకాల గని గింజ – మందు, నూనె, నీటి శుద్ధి కాయ – కూర పువ్వు – మందు, చట్నీ బెరడు – మందు బంక – మందు వేరు – మందు పెరటిలో మునగ చెట్టు ఉండగ – విటమిన్లు, టానిక్కులు కొనటం దండగ. మునగ చెట్లు పెంచుదాం – మునగాకు వాడకం పెంచుదాం. వివరాలకు.. కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్(040–27610963) ఫొటోలు: ఇసుకపట్ల దేవేంద్ర, సాక్షి ఫొటో జర్నలిస్టు -
కిచెన్ గార్డెనింగ్ వర్క్‌షాప్‌కు విశేష స్పందన
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తాధ్వర్యంలో నిర్వహణ పెద్ద సంఖ్యలో హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సబ్సిడీపై కిట్ల పంపిణీ సాక్షి, సిటీబ్యూరో: జూబ్లీహిల్స్‌లో శనివారం జరిగిన కిచెన్ గార్డెనింగ్ వర్క్‌షాప్‌నకు విశేష స్పందన లభించింది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, సాక్షి మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ వర్కషాప్నకు పిల్లలు, వారి తల్లిదండ్రులు, స్థానికులు, ఇతరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రసాయనాలతో తలెత్తే ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకునే అంశాలను తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిచారు. ఇందుకు సంబంధించి పలు వివరాలను అధికారులను, నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ విభాగం అధికారి అరుణ సబ్సిడీ కిట్ గురించి వివరించారు. ఈ కిట్‌లో కిచెన్ గార్డెనింగ్‌కు అవసరమైన పరికరాలు ఉన్నాయన్నారు. రూ.6 వేల విలువ కలిగిన ఈ కిట్‌ను సబ్సిడీ పోనూ రూ.3 వేలకే అందజేస్తున్నామని ఆమె తెలిపారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం నుంచి రిసోర్స్ పర్సన్‌గా వచ్చిన చంద్రశేఖర్ కిచెన్ గార్డెన్లో తలెత్తే ఇబ్బందులు వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు అందజేశారు. కిచెన్ గార్డెనింగ్ సబ్సిడీ కిట్ అందుకున్న వారికి ఫాలోఅప్ మీట్స్ నెలనెలా నిర్వహించి వారికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తామని సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణీ రెడ్డి తెలిపారు. ప్రతి నెలా జరిగే పేరెంట్స్ మీట్లో భాగంగా అదనపు గంట నిర్వహించిన ఈ వర్క్‌షాపునకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. స్కూల్ పిల్లల్లో కూడా కిచెన్ గార్డెనింగ్ అలవాటును పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు.