మట్టి పాత్రలో నీళ్లు
డాక్టర్ చంద్రశేఖర బిరదర్ కర్ణాటకలో పుట్టారు. రోదసీ శాస్త్రవేత్త. ఈజిప్టు రాజధాని నగర కైరోలో నివాసం ఉంటున్నారు. విదేశాల్లో నివాసం వల్ల మన ఆకుకూరలు, కూరగాయలు అక్కడ దొరకని పరిస్థితుల్లో కుండీల్లో ఇంటిపట్టునే పండించుకోవడం అలవాటు చేసుకున్నారు. అనేక సంవత్సరాలుగా సేంద్రియ ఇంటిపంటల సాగులో అనుభవం గడించారు. ‘సేంద్రియ ఇంటిపంటల సాగు ఓ అదనపు పని ఎంత మాత్రం కాదు. ఇదొక ఆనంద దాయక వ్యాపకం’ అంటున్నారు డా. చంద్రశేఖర. కేవలం 50 చదరపు అడుగుల రూఫ్‌టాప్ గార్డెన్‌లో 50 రకాల పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలను గత పదేళ్లుగా సాగు చేస్తున్నారు. చోటు తక్కువ ఉందని బాధ పడకుండా.. ఐదు అంతస్థుల్లో, ఒకే కుండీల్లో అనేక ఎత్తుల్లో పెరిగే పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. 5 లేయర్ మోడల్ అన్నమాట. పెద్ద కుండీలు పెట్టుకోవాలి. ఎక్కువ మొక్కలు, చెట్లు పెరగాలి కాబట్టి వెడల్పు, లోతు వీలైనంత ఎక్కువగా ఉండాలి. మూడున్నర అడుగుల ఎత్తయిన కుండీలు/తొట్లలో 5 అంతస్తుల సాగు చేస్తున్నారాయన.
కుండీ ఎత్తు కనీసం 30–50 సెం.మీ (12 అంగుళాల నుంచి 20 అంగుళాల వరకు)., కుండీ అడుగున కనీసం 40–60 సెం.మీ.(16 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు) వెడల్పు ఉండాలి అన్నది ఆయన సూచన. బహుళ అంతస్తుల్లో కలిసి పెరిగే రకరకాల కూరగాయ, పండ్ల, ఆకుకూర మొక్కలను ఒకే కుండీలో పెంచటం వల్ల పరస్పర తోడ్పాటు వల్ల చీడపీడల నుంచి తట్టుకోగలుగుతాయి. ఒక కుండీ ద్వారా పొందే ఉత్పాదకత పెరుగుతుంది. రుచి, పౌష్టికత, వాసన ఇనుమడిస్తాయని డా. చంద్రశేఖర అంటున్నారు. ‘2“6 చదరపు అడుగుల బాల్కనీ ఉంటే చాలు 50 రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు. అయితే, రసాయనాలు లేని స్వచ్ఛమైన ఆహారం తినాలన్న బలమైన కోరిక ఉండాలి సుమా. మనసుంటే మార్గం ఉంటుంది కదా’ అంటున్నారాయన.
సేంద్రియ పద్ధతుల్లో పెరిగే చెట్లు, మొక్కలు తాము తయారు చేసుకున్న పోషక ద్రవాలలో కొంత భాగాన్ని వేర్ల ద్వారా మట్టిలోని సూక్ష్మజీవరాశి పోషణ కోసం స్రవిస్తూ ఉంటాయి. ‘తులసి, మల్లె మొక్కలున్న కుండీలో పెరిగే లెట్యూస్ ఆకుల రుచి, వాసన ఇతర కుండీల్లో పెరిగిన లెట్యూస్ కన్నా భిన్నంగా ఉంటుంది’ అంటున్నారు డా. చంద్రశేఖర. 5 అంతస్తుల్లో మొక్కలన్నీ ఒకేసారి కాకుండా.. మొదట కొన్ని రకాలు పెట్టండి. ఆ మట్టి, నీరు, వాతావరణంలో అవి పెరుగుతున్న తీరును గమనిస్తూ.. మిగతా వాటిని దఫ దఫాలుగా జోడిస్తూ ఐదు అంచెల సాగుకు వెళ్లాలని ఆయన సూచిస్తున్నారు. 32 దేశాల్లో నివాసం ఉండటం వల్ల డా. చంద్రశేఖరతోపాటు ఆయన కుటుంబం విభిన్న వాతావరణాల్లో ఇంటిపంటల సాగులో అపారమైన అనుభవం గడించింది.
డాక్టర్ చంద్రశేఖర బిరదర్
వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములతో తక్కువ స్థలంలో కంపోస్టు తయారు చేసుకోవడానికి ఆయన పైపును వాడుతున్నారు. 6“3 సైజు పీవీసీ పైపును నిలువుగా కుండీ మట్టిలో జొప్పించి.. వ్యర్థాలను అందులో వేస్తున్నారు. అవి కుళ్లే దశలో ఊరే ద్రవాలు కుండీ మట్టిలోకి వెళ్తాయి. ఆ కుండీలో పెరిగే మొక్కలకు పోషకాల లోపం కూడా ఉండదు. మట్టి కుండల ద్వారా నీటిని అందించడం ద్వారా 90 శాతం నీటిని పొదుపు చేయవచ్చని డా. చంద్రశేఖర చెబుతున్నారు. మూతి మూసేసి ఉన్న మట్టి కుండలకు డ్రిప్ పైపులు అమర్చి వాల్వు తిప్పితే కుండలు నీటితో నిండేలా ఏర్పాటు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment