సంగారెడ్డి జిల్లా జైలులో నూతనంగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువే. మొదటగా సీడ్ ట్రాక్ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ సిస్టమ్లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు.
మట్టి వినియోగం ఉండదు కాబట్టి మొక్క నిలబడటానికి మట్టి రాళ్లను ఆ తొట్టిలో ఉంచుతారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో సొల్యూషన్ ద్రావణాలు ద్వారా అందిస్తారు. సొల్యూషన్ మోతాదులను ప్రత్యేక పరికరాల ద్వారా రోజూ పరీక్షిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా జైలులో జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఈ విధానంతో ఖైదీలకు కావాల్సిన ఆకు కూరలు పండిస్తున్నారు. ఎప్పటికప్పుడూ నూతన పద్ధతులను అనుసరిస్తూ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
– బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment