Hydroponics method
-
హైడ్రోపోనిక్స్ సాగు పద్ధతి...నీటిని పొదుపుగా వాడుకోవచ్చు
-
సాగుబడి: హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గడ్డిసాగుతో మంచి ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు. మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది. ఏడాది పొడవునా ఆదాయం స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్లైన్లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం. హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే.. దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది. అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది. బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). -
వ్యవసాయం చేస్తున్నా
ఖాళీ సమయంలో వంటలు చేయడమో, బొమ్మలు గీయడమో, ఏదైనా నేర్చుకోవడమో.. ఇలా ఏదో ఒకటి చేస్తూ సినిమా స్టార్స్ కాలక్షేపం చేస్తున్నారు. హీరోయిన్ భూమి ఫడ్నేకర్ మాత్రం వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ (నేల అవసరం లేకుండా పండ్లు, కూరగాయల పెంపకం) చేస్తున్నారు. ‘‘మా అమ్మ (సుమిత్ర), నేను ఎప్పట్నుంచో హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆచరణలో పెట్టాం. హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్ ద్వారా మా గార్డెన్లో కూరగాయలను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫార్మింగ్ గురించి నాకు తెలియని విషయాలను నిపుణులను అడిగి తెలుసుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు భూమి ఫడ్నేకర్. ఇక సినిమాల పరంగా అయితే ప్రస్తుతం ‘దుర్గావతి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. తెలుగులో హిట్ సాధించిన అనుష్క ‘భాగమతి’ చిత్రానికి ‘దుర్గావతి’ హిందీ రీమేక్. -
ఇంటి సాగే ఇతని వృత్తి!
వ్యవసాయమా... అందునా ఇంటిపైనా.. అయ్య బాబోయ్ అంత శ్రమపడలేను, సమయం వెచ్చించలేనని ఎంతమాత్రం వెనుకాడవద్దు అంటున్నారు చెన్నైకి చెందిన 31 ఏళ్ల యువకుడు రాహుల్ ధోకా. నాలుగు గోడలు ఉంటే చాలు, రోజుకు కేవలం పది నిమిషాల సమయం గడిపితే చాలు ప్రకృతి వరప్రసాదం వంటి స్వచ్ఛమైన అనేక వ్యవసాయ ఉత్పత్తులు మీకు సొంతం అవుతాయని భరోసా ఇస్తున్నారాయన. విలాసవంతమైన జీవితంతోపాటూ ఎం.ఎస్. పట్టా చేతిలో ఉండి కూడా ఇంటిపంటల సాగునే వృత్తిగా చేసుకున్న విలక్షణ వ్యక్తిత్వం రాహుల్‌ది. తన ఉత్పత్తులతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆకట్టుకుంటున్నారు. వంటింటి అవసరాలకు మార్కెట్లకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వ్యవసాయ ఉత్పత్తులను హైడ్రోపోనిక్ పద్ధతిలో చేతికి మట్టి అంటకుండా సులభతరంగా సాగు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఆయన మాటల్లోనే.. అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ అయ్యాక యూకే వెళ్లి వార్విక్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే సేంద్రియ వ్యవసాయం వైపు ఆకర్షితుడినయ్యాను. తల్లిదండ్రుల వద్దకు చెన్నై తిరిగి వచ్చిన తరువాత 2013లో సేంద్రియ ఉత్పత్తుల విక్రయ స్టోర్ పెట్టాను. వంద రకాల ఉత్పత్తులను అమ్మేవాడిని. స్వయంగా సాగు చేయాలని 2016 డిసెంబరులో హైడ్రోపోనిక్ విధానంలో ‘ఆక్వాఫామ్స్’ పేరిట (నుంగంబాక్కం తిరుమూర్తి నగర్‌లోని) మా ఇంటి పైనే సాగు ప్రారంభించాను. చెన్నైలో తరచూ ఎదురయ్యే నీటి కొరత ప్రభావానికి గురికాని వ్యవసాయం చేయాలని తలపెట్టాను. మూడు నెలలు పరిశోధన చేసిన తరువాత వీటన్నింటికీ సమాధానంగా హైడ్రోపోనిక్ విధానంలో పంటల సాగు ఎంతో శ్రేయస్కరమని నమ్మి అనుసరిస్తున్నాను. పాలకూర, తోటకూర, గోంగూర తదితర ఆకుకూరలు, వాము పాక్చోయ్, బ్రహ్మి, తులసి, బంతి పెంచుతున్నాను. కొబ్బరి పొట్టు, క్లే బాల్స్ వేసి విత్తనాలు నాటి నర్సరీ పెంచుతున్నాను. మొక్కలు కొంచెం పెరిగిన తరువాత వాటిని పీవీసీ పైపులను నిలువుగా అనేక వరుసల్లో ఏర్పాటు చేసుకొని, వాటికి రంధ్రాలు పెట్టి, కేవలం రెండు అంగుళాలున్న ఆ కప్పులను ఆ రంధ్రాల్లో కూర్చోబెడుతున్నాను (ఈ కప్పుల్లో మట్టికి బదులుగా వరిపొట్టు, వర్మిక్యులేట్, స్పాంజ్‌లను కూడా వాడవచ్చు). మొక్కల కుదుళ్లకు కొబ్బరి పొట్టును ఏర్పాటు చేసి సాధారణ నీటిలో న్యూట్రిషన్ నీళ్లను కలిపి ప్లాస్టిక్ గొట్టాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ద్వారా ప్రవహింపజేస్తాను. ఎన్పీకే న్యూట్రిషన్తోపాటు మెగ్నీషియం సల్ఫేటు, కాల్షియం నైట్రేట్‌ను ద్రావణం రూపంలో కేవలం మొక్కల వేళ్ల ద్వారా ప్రవహింపజేయడం వల్ల ఎలాంటి దోషమూ ఉండదు. నేలపై అమర్చిన చిన్నపాటి వాటర్ ట్యాంక్ నుంచి మోటార్ ద్వారా పైప్‌కు పై భాగంలో ఈ నీటిని విడుదల చేస్తాను. అవి అలా ప్రవహిస్తూ అన్ని మొక్కలకు చేరుతాయి. మొక్కలకు అందగా మిగిలిన నీరు మళ్లీ కింద ట్యాంక్‌లో పడిపోతుంది. అదేనీటిని నిర్ణీత కాలవ్యవధిలో మళ్లీ వాడుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల ఒక్కనీటి చుక్క కూడా వృథా పోదు. ఆరు వారాల్లో 200 గ్రాముల దిగుబడి పాలకూర, తోటకూర, లెట్యుసీ, పాక్చోయ్, బ్రహ్మి, తులసి, మారిగోల్డ్ ఫ్లవర్, అజ్వైన్ తదితర ఆకుకూరలు పెంచుతున్నాను. పుదీనా, ఇటాలియన్ బాసిల్ (తులసి), పది తులసి రకాలు వేశాను. మట్టిలో సాధారణ సాగుతో పోల్చితే హైడ్రోపోనిక్ విధానంలో 90 శాతం నీరు ఆదా అవుతుంది. మట్టిని వాడకపోవడం వల్ల మొక్కలకు వ్యాధులు సోకవు. కలుపు మొక్కలు పెరగవు. ఇలా సాగుచేస్తున్న పంట ఆరు వారాల్లో చేతికి వస్తుంది. ఆకుకూర, ఔషధ మొక్కలనుంచి ఆరు నుంచి ఎనిమిది వారాల్లో 200 గ్రాముల దిగుబడి సాధించవచ్చు. 30 అడుగుల్లో 500 మొక్కలు డాబాపై 80 చదరపు అడుగుల్లో 6,000 కూరగాయ, ఔషధ మొక్కలు పెంచుతున్నాను. అయితే, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం కేవలం 30 చదరపు అడుగుల్లో 500 మొక్కలు పెంచుతున్నాను. నీటి పారుదల మట్టం కొంచం తగ్గించడం వల్ల ఆక్సిజన్ చేరుతుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్ విధానంలో సేంద్రియ విత్తనాలే వాడాల్సిన అవసరం లేదు. సాధారణ విత్తనాలు మొక్కలైనపుడు వాటిల్లోని దోషాలు వంద శాతం తొలగిపోతాయి. ఏదైనా చిన్నపాటి సమస్యలు తలెత్తినట్లయితే వేప నూనెను పిచికారీ చేయడం ద్వారా వాటిని రూపుమాపవచ్చు. వర్టికల్ పైప్‌లైన్ సాగు విధానంతో ఎంత చిన్న స్థలంలోనైనా మొక్కలను పెంచవచ్చు. గోడకు కూడా పైప్‌లైన్ వ్యవస్థను అమర్చుకుని మొక్కలు పెంచవచ్చు. ఏడాదికి నాలుగు దఫాలు దిగుబడి సాధించవచ్చు. రోజుకు పది నిమిషాలు చాలు! ముఖ్యంగా ఈ మొక్కల పెంపకం కోసం గంటల తరబడి శ్రమించాల్సిన అవసరం లేదు. 500 మొక్కల పెంపకానికి సరదాగా రోజుకు పది నిమిషాలు కేటాయిస్తే చాలు. ఎల్తైన పైప్‌లైన్ వ్యవస్థ వల్ల కిందకు వంగి శ్రమపడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది వృద్ధులకు ఎంతో సౌకర్యం. కేజీకి రూ. 20 ఖర్చు ఒక కేజీ ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంపకానికి కేవలం రూ.20లు మాత్రమే ఖర్చవుతుంది. అదే బజారులో కొంటే ఎంతో ఖరీదు. డాబాపై పంటలు వేసినపుడు అవసరమైన సూర్యరశ్మి అందుతుంది. అలా డాబా పైన ఖాళీ స్థలం లేని వారు నిరుత్సాహపడక్కర లేదు. ఇంటిలోపల కూడా సూర్యరశ్మికి బదులుగా ఎల్ఈడీ దీపాలను అమర్చి ఈ మొక్కలు పెంచవచ్చు. 12 గంటల ఎల్ఈడీ దీపాల వెలుగు ఆరుగంటల సూర్యరశ్మితో సమానం. ఒక పంట దిగుబడి తరువాత కొబ్బరి పొట్టు మారిస్తే తర్వాత పంటలోనూ మంచి ఫలితాలు పొందవచ్చు. సేంద్రియం కంటే హైడ్రోపోనిక్ మేలు సేంద్రియ సాగు కంటే హైడ్రోపానిక్ సాగు ఎంతో శ్రేష్టం. సేంద్రియ పంటల్లో సాల్మోనెల్లా, ఇకొలి అనే బ్యాక్టీరియాను న్యూయార్క్‌లో కనుగొని 75 శాతం ఉత్పత్తులను వెనక్కు పంపివేశారు. సేంద్రియ వ్యవసాయంలో కొందరు ఉత్పత్తుల సైజు పెంచడం కోసం ఆక్సిటోసిన్ హార్మోన్‌ను వినియోగిస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ఆక్సిటోసిన్‌తో తయారైన ఉత్పత్తులను భుజించడం వల్ల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. ఇంటింటా హైడ్రపోనిక్ పంటే లక్ష్యం హైడ్రోపోనిక్ వ్యవసాయం అందరికీ అందుబాటులోకి రావాలి. తమకు అవసరమైన మొక్కలను ఎవరికి వారు పెంచుకునే స్థాయికి చేరుకోవాలనేదే నా లక్ష్యం. మార్కెట్‌కు వెళితే అధిక ధరలతోపాటూ వాహనాలకు ఆయిల్ ఖర్చు భరించాల్సి ఉంటుంది. అంతేగాక ఎంతో సమయం వృథా అవుతుంది. ఈ వాస్తవాలపై అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2019 జనవరిలో చెన్నైలో ‘ఆక్వా ఫాం’ హైడ్రోపోనిక్స్ కన్సల్టెన్సీ ఆఫీసును ఏర్పాటు చేశాను. ముందుగా బంధువులకు నేర్పాను. మా ఆఫీసు ద్వారా ఎంతోమందికి సలహాలు, సూచనలు ఇస్తున్నాను. నెలకు రెండు శిక్షణా తరగతులను మూడు నెలలుగా నిర్వహిస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఎందరో తరగతులకు హాజరవుతున్నారు. ఇలా ఎంతోమందికి అవగాహన కల్పించాను. – కొట్ర నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై నేను పండించిన ఆకుకూరలు, ఔషధ మొక్కలను మా ఇంటిలో, బంధుమిత్రుల ఇళ్లలో వాడుకోగా మిగిలినవి ఇతరులకు అమ్ముతున్నాను. వినియోగదారుల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. ఇలా ఎందరో ఖాతాదారులు ఏర్పడ్డారు. రిటైల్ దుకాణాలకు కూడా సరఫరా చేస్తున్నాను. (రాహుల్ «ధోకాను 89395 49895 నంబరులో సంప్రదించవచ్చు) https://www.acquafarms.org -
జైలులో ‘హైడ్రో’ ఫార్మింగ్
తాజా ఆకుకూరలను ఖైదీలకు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా జైలులో వినూత్నంగా హైడ్రోపోనిక్ సాగు పద్ధతికి శ్రీకారం చుట్టారు. మొదటగా పాలకూరను పండిస్తున్నారు. ఈ పద్ధతిలో సాగుకు మట్టి అవసరం లేదు. మొక్కలు నీటిలోనే పెరుగుతాయి. నీటివినియోగం కూడా చాలా తక్కువ. నేలలో పంటలకు కావలసిన నీటిలో 5 శాతం చాలు. విత్తనాలను చిన్న ట్రేలలో కొబ్బరి పొట్టులో వేసి మొలకెత్తిస్తారు. మొక్కల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ద్రావణాల రూపంలో అందిస్తున్నారు. మున్ముందు కొత్తమీర, చుక్కకూరతోపాటు మిర్చి టమాట, వంగ తదితర కూరగాయ పంటలను సైతం పండించడానికి సన్నద్ధమవుతున్నా జైలు సూపరిండెంట్ నవాబు శివకుమార్ గౌడ్ ‘సాక్షి’కి వివరించారు. హైడ్రోపోనిక్ సాగు విధానం.. ప్లాస్టిక్ ట్రేలలో కొబ్బరిపొట్టు నింపి విత్తనాలు వేస్తారు. వారం రోజుల్లోగా ఆ విత్తనం మొలకెత్తుతుంది. ఎదిగిన మొక్కను తీసి నెట్ పాట్(జాలీ గ్లాసుల)లో పెట్టి, మొక్క నిలబడడానికి క్లేబాల్స్(మట్టి బంతులు), గులకరాళ్లు వంటివి వాడతారు. మొక్కలతో కూడిన జాలీ గ్లాసులను పీవీసీ పైపులలో ఉంచుతారు. పోషక ద్రావణాలతో కూడిన నీరు ఈ పైపులలో ఉంటుంది. అందులోని పోషకాలను మొక్కలు వేర్ల ద్వారా గ్రహించి పెరుగుతాయి. పీవీసీ లేదా ఫైబర్ పైపులను ఒకచోట అమరుస్తారు. ఇందుకు పెద్దగా స్థలం అవసరం ఉండదు. ఈ సాగుకు గాను పైపులకు సరిపడా గ్రీన్నెట్ లేదా షెడ్ నెట్ ఉపయోగించవచ్చు. 25 పైపులతో అమరిస్తే సుమారుగా 650 మొక్కలను సాగు చేసే అవకాశం ఉంది. అడుగుకు ఒక మొక్క పెడితే వేయి మొక్కలను సాగుచేయవచ్చు. మొక్కకు కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్స్ (స్థూలపోషకాలు), మైక్రోసొల్యూషన్స్ (సూక్ష్మ పోషకాలు) ద్రావణాల ద్వారా అందిస్తారు. పురుగుమందుల అవసరం ఉండదు. మొక్క పెట్టిన మొదట్లో నీటిలో పోషకాల స్థాయి 800 వరకు ఉంటే సరిపోతుంది. మొక్క ఎదుగుతున్న కొద్దీ పోషకాల స్థాయి 1500 వరకు ఉండాలి. ప్రతి రోజు రెండు గంటలు ఎండ తగిలే విధంగా పైపులను ఉంచుతారు. ప్రతి రోజు మొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి ద్రావణాల మోతాదును, నీటిలో పీహెచ్ విలువను ఖచ్చితంగా పీహెచ్ మీటర్ ద్వారా పరీక్షిస్తారు. అదే విధంగా పోషకాలు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి ఎలక్ట్రో కండక్టివిటీ మీటర్‌ను వాడతారు. ఆకుకూరలైతే మూడు నుంచి నాలుగు వారాలలోపే మొదటి పంట చేతికి వస్తుంది. కూరగాయలైతే నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. హెడ్రోపోనిక్ పద్ధతి ద్వారా సంగారెడ్డి జిల్లా జైలులోని 250 మంది ఖైదీల కోసం తాజా పాలకూర సాగు మొదలు పెట్టామని జైలు సూపరిండెంట్ శివకుమార్‌గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. ఉన్నతాధికారుల తోడ్పాటుతో కూరగాయలు కూడా పండించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. – కొలన్ దివాకర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి బి.శివప్రసాద్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
జైలులో కిచెన్ గార్డెనింగ్
సంగారెడ్డి జిల్లా జైలులో నూతనంగా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ ద్వారా ఆకుకూరలు పండిస్తున్నారు. ఈ పద్ధతిలో పంటలు పండించటానికి మట్టి అవసరం లేదు. ఎక్కువ స్థలం అవసరం లేదు. నీటి వినియోగం కూడా తక్కువే. మొదటగా సీడ్ ట్రాక్ లోని కొబ్బరి పీచు పొడిలో విత్తనాల్ని మొలకెత్తిస్తారు. తర్వాత పీవీసీ పైపులతో ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ సిస్టమ్‌లోని చిన్న జాలి తొట్టిలు, వస్తువుల్లో మొక్కల్ని పెంచుతారు. మట్టి వినియోగం ఉండదు కాబట్టి మొక్క నిలబడటానికి మట్టి రాళ్లను ఆ తొట్టిలో ఉంచుతారు. మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను మ్యాక్రో సొల్యూషన్, మైక్రో సొల్యూషన్ ద్రావణాలు ద్వారా అందిస్తారు. సొల్యూషన్ మోతాదులను ప్రత్యేక పరికరాల ద్వారా రోజూ పరీక్షిస్తారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సంగారెడ్డి జిల్లా జైలులో జిల్లా జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ ఈ విధానంతో ఖైదీలకు కావాల్సిన ఆకు కూరలు పండిస్తున్నారు. ఎప్పటికప్పుడూ నూతన పద్ధతులను అనుసరిస్తూ రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా జైలు ఇతర జైళ్లకు ఆదర్శంగా నిలుస్తోంది. – బి.శివ ప్రసాద్, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి -
తేలియాడే వ్యవసాయం
ఏడాది పొడవునా వరదలు. ఎటు చూసినా నీళ్లే. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ‘ద్వీప’మది. మరి పంటలు పండేదెలా, కడుపు నిండేదెలా? అస్సాంలో బ్రహ్మపుత్ర నది తీర ప్రాంతంలోని మజూలి ద్వీపవాసులు ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇప్పుడా సమస్య నీటి మబ్బులా తేలిపోయింది. హైడ్రోపానిక్ వ్యవసాయం అంటే తెలుసు కదా, అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోతున్న నగరాల్లో ఈ కొత్త తరహా వ్యవసాయం అందుబాటులోకి వచ్చింది. మట్టి అవసరం లేకుండా ఎంచక్కా మన రోజువారీ అవసరానికి తగ్గ కూరలు బాల్కనీల్లోనే పండించుకోవచ్చు. కానీ అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మజూలిలో అధికార యంత్రాం గం తమ బుర్రలకు మరింత పదునుపెట్టారు. హైడ్రోపానిక్ వ్యవసాయానికే మరింత మెరుగులు దిద్దారు. ఇంకా సహజపద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో, స్థానికంగా దొరికే వనరులతో నీళ్లల్లో తేలియాడే వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. దీంతో ఉపాధికి ఉపాధి, ఆదాయానికి ఆదాయం. హైడ్రోపానిక్ సాగు అంటే? 8 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పులో వెదురు బొంగులతో వ్యవసాయానికి అవసరమయ్యే హైడ్రోపానిక్ ట్రేని రూపొందించి అందులో విత్తనాలు వేస్తారు. మట్టిలో ఉండే పోషకాలన్నీ ఆ నీటిలో కలుపుతారు. మొక్కలు ఎదగడానికి వర్మీ కంపోజ్డ్ నీళ్లను జల్లుతారు. ట్రేలన్నీ వెదురుబొంగులతో చేసినవి కావడంతో అవి నీళ్లలో తేలుతూ ఉంటాయి. వరదలు ముంచెత్తినా పంట నీటిపాలవుతుందన్న భయం లేదు. ‘మాకున్న కాస్తో కూస్తో వ్యవసాయ భూమి నీళ్లల్లో మునిగిపోయింది. ఏం చేయాలో తెలీని స్థితి. అప్పుడే ఫ్లోటింగ్ వ్యవసాయం గురించి తెలిసింది. వర్షాలు కురిస్తే పంటలు నీట మునుగుతాయన్న బాధ లేదు. ఆ ట్రేలన్నీ హాయిగా నీళ్లల్లో తేలుతూ పచ్చగా కనువిందు చేస్తుంటాయి. ఇక మా బతుకులూ పచ్చగానే ఉన్నాయి‘ అని పవిత్ర హజారికా అనే రైతు చెప్పారు. ఎందుకీ అవసరం వచ్చింది? బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంలో ఉన్న మజూలిలో భూ ప్రాంతం ఏడాదికేడాది నీళ్లల్లో కలిసిపోతోంది. 1250 చదరపు కి.మీ.లు ఉన్న ఈ ప్రాంతంలో 75శాతం భూమిని నీరు ఆక్రమించేసింది. దీంతో అక్కడ నివాసం ఉండే 2 లక్షల మంది స్థానికుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2016లో స్థానిక అధికారులు అక్కడ రైతులకు ఈ హైడ్రోపానిక్ వ్యవసాయాన్ని పరిచయం చేశారు. మొదట్లో రైతులకు ఈ వ్యవసాయమేంటో అర్థం కాలేదు. మట్టి లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయా? అని ఆశ్చర్యపోయారు. కానీ అవసరం వాళ్లకి అన్నీ నేర్పించింది. ‘ఈ పద్ధతుల్ని అవగాహన చేసుకోవడానికి రైతులకు కొన్నాళ్లు పట్టింది. ప్రస్తుతం 620 మందిపైగా రైతులు 528 హైడ్రోపానిక్ ట్రేలలో వ్యవసాయం చేస్తున్నారు. వరి, బంగాళాదుంపలు, కంద, కూరగాయలు, మూలికలు, మిరప, కొత్తిమీర, పుదీనా, కేబేజీ పంటలు పండిస్తున్నారు. రైతులకు కాసుల పంట.. సంప్రదాయ వ్యవసాయంతో పోల్చి చూస్తే 3.58 రెట్లు అధికంగా లాభాలు వస్తున్నాయి. మొత్తం 10 ట్రేలలో 25 కేజీల వరకు పంట వస్తుంది. కూరగాయలు, ఆకుకూరల పంటలకు 2,500 రూపాయలు ఖర్చు అయితే 5 వేలవరకు తిరిగి వస్తుంది. అదే మూలికలు పెంచితే రూ.40 వేల వరకు ఆదాయం వస్తుందని ఈ ఫ్లోటింగ్ వ్యవసాయానికి మద్దతునిస్తున్న సౌత్ ఏషియా ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంట్ సంస్థ చైర్‌పర్సస్ దీపాయన్ దేవ్ చెప్పారు. రాష్ట్ర సీఎం సోనోవాల్ సొంత నియోజకవర్గం మజూలీ కావడంతో ఇక్కడ ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. త్వరలోనే ఈ జిల్లా కాలుష్యరహిత జిల్లాగా మారనుంది. వెదురుకర్రల ట్రేలో సాగు -
ఇంటిపంటలపై రేపు ఉద్యాన శాఖ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్
నగర, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు (అర్బన్ ఫార్మింగ్)పై పెరుగుతున్న ఆసక్తి దృష్ట్యా ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ ఈ నెల 24న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు జీడిమెట్ల విలేజ్(పైపులరోడ్డు)లోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనుంది. అర్బన్ ఫార్మింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్ తదితర అంశాలపై కేరళకు చెందిన నిపుణురాలు డాక్టర్ సుశీల శిక్షణ ఇస్తారు. 25 మంది సీనియర్ ఇంటిపంటల సాగుదారులు తమ అనుభవాలను వివరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఉద్యాన శాఖ ప్రధాన కార్యదర్శి పార్థసారథి, విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా పాల్గొంటారని ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ప్రవేశం ఉచితం. ఆసక్తిగలవారు 79977 24936, 79977 24983, 79977 24985 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు. -
‘హైడ్రోపోనిక్స్’తో అంతా ఆదాయే!
పాడి-పంట: పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణా పైనే ఖర్చవుతోంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదో వంతును కేటాయించాలి. అయితే సాగు నీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే... హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో... విత్తనాలను నానబెట్టి, మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7-10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో (షేడ్‌నెట్ కింద) ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురే. తేడా ఏమిటి? సాధారణ పద్ధతిలో రోజుకు 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎరువులు కూడా అక్కరలేదు. నీరు, విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కూలీల అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45-60 రోజులు పడితే ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు. ఎలా నిర్మించాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతి రోజూ 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్‌నెట్‌ను నిర్మించాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల్లో 14 అరలను (ఒక్కో వరుసలో 7 అరలు) ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్/ఫాగర్‌ను అమర్చాలి. ఏం చేయాలంటే... 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అం గుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవ చ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపరును పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి ఐ దారు కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు. ఇలా పెంచండి మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండె కట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపరుపై సమానంగా పరవాలి. షేడ్‌నెట్‌లో ఏర్పా టు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతి రోజూ విత్తనాలను ట్రేలో పరిచి, అరల్లో ఉంచాలి. గంటకొకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీ టిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్‌ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలను కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలోని పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ట్రేలలోని మొక్కలు 15-20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించొచ్చు. పోషక విలువలు అధికం సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఎలా మేపాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతి రోజూ 7-8 కిలోల వరకు మేపితే, పశువులకు రోజూ అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల సాగుకు సంబంధించి మరింత సమాచారం కావాలనుకుంటే యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వారిని (ఫోన్ : 9493619020) సంప్రదించవచ్చు. ఎ.కృష్ణమూర్తి, పశు పోషణ శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె కర్నూలు జిల్లా