‘హైడ్రోపోనిక్స్’తో అంతా ఆదాయే!
పాడి-పంట: పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణా పైనే ఖర్చవుతోంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదో వంతును కేటాయించాలి. అయితే సాగు నీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది.
హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే...
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో... విత్తనాలను నానబెట్టి, మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7-10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో (షేడ్‌నెట్ కింద) ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురే.
తేడా ఏమిటి?
సాధారణ పద్ధతిలో రోజుకు 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎరువులు కూడా అక్కరలేదు. నీరు, విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కూలీల అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45-60 రోజులు పడితే ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు.
ఎలా నిర్మించాలి?
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతి రోజూ 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్‌నెట్‌ను నిర్మించాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల్లో 14 అరలను (ఒక్కో వరుసలో 7 అరలు) ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్/ఫాగర్‌ను అమర్చాలి.
ఏం చేయాలంటే...
3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అం గుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవ చ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపరును పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి ఐ దారు కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు.
ఇలా పెంచండి
మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండె కట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపరుపై సమానంగా పరవాలి. షేడ్‌నెట్‌లో ఏర్పా టు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతి రోజూ విత్తనాలను ట్రేలో పరిచి, అరల్లో ఉంచాలి. గంటకొకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీ టిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్‌ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలను కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలోని పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ట్రేలలోని మొక్కలు 15-20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించొచ్చు.
పోషక విలువలు అధికం
సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి.
ఎలా మేపాలి?
హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతి రోజూ 7-8 కిలోల వరకు మేపితే, పశువులకు రోజూ అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల సాగుకు సంబంధించి మరింత సమాచారం కావాలనుకుంటే యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వారిని (ఫోన్ : 9493619020) సంప్రదించవచ్చు.
ఎ.కృష్ణమూర్తి, పశు పోషణ శాస్త్రవేత్త
జి.ధనలక్ష్మి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్
కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె
కర్నూలు జిల్లా