Padi panta
-
ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు!
రైతులు బెండసాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొంటున్నారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్. దీనివలన భూసారంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రసాయన ఎరువుల ఖర్చులను ఆదా చేసుకుని అధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించవచ్చని సూచిస్తున్నారు. వచ్చే వేసవి బెండ సాగుకు అనుకూలమని, పంట సాగుకు అవలంబించాల్సిన పద్ధతులు ఆయన మాటల్లోనే.. వాతావరణం : వేడి వాతావరణం అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందు వలన పంట వర్షాకాలం, వేసవికాలంలో పండించడానికి అనుకూలమైనది. నేలలు : సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు, మురుగు నీటి సౌకర్యం గల తేలికపాటి రేగడి నేలలు అనుకూలం. విత్తే సమయం : వర్షాకాలపు పంటకు జూన్ నుంచి జూలై వరకు, వేసవి పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు : వేసవి పంటకు ఎకరాలకు 7 నుంచి 8 కిలోల విత్తన సరిపోతుంది. రకాలు : పర్భని క్రాంతి, అర్కఅనామిక, అభయ విత్తన శుద్ధి.. విత్తనాలను విత్తే ముందు 12గంటలు నీటిలో నాన బెట్టాలి. ఆవు మూత్రం ద్రావణంలో (1:5 నిష్పత్తిలో నీటిలో కలిపి) 30 నిమిషాలు శుద్ధి చేయాలి. విత్తనశుద్ధికి 100 మి.లీ. ఆవు మూత్రం, 100 గ్రాములు ఆవు పేడ, 100 గ్రాములు గట్టుమట్టి, లేదా పుట్ట మట్టి కలిపిన నీటిలో ఒక గంట వరకు నానబెట్టి, నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. భీజామృతం లేదా అమృత జలం లేదా పంచగవ్యం ద్రావణంలో 8గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. పొలం తయారీ, విత్తే పద్ధతి.. నేలను 4–5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాలపు పంటను 60 సెం.మీ ఎడంలో బోదెలపై 30 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. నేలను మళ్లుగా చేసి, వరుసల మధ్య 45 సెం.మీ, మొక్కల మధ్య 15 నుంచి 20 సెం.మీ. దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక్కో రంధ్రానికి 2–3 విత్తనాలను విత్తుకోవాలి. పోషకాల యాజమాన్యం.. 10 నుంచి 15 మి.లీ. కోడిగుడ్లు, నిమ్మకాయ రసం ద్రావణాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి దిగుబడులు పెంచవచ్చు. మొక్కలు మొలిచిన 3–4 రోజుల్లో తొలిసారి 3 శాతం పంచగవ్య ద్రావణం పిచికారీ చేయాలి. పూత దశకు ముందే 5 శా తం పంచగవ్య పిచికారీ చేయాలి. పంట రెండు వారాల వయస్సులో 400 లీటర్ల జీవామృతం సాగు నీటిలో అందించాలి. మొక్క 4–6 ఆకుల దశలో తులసీ–కలబంద కషాయం పిచికారీ చేయాలి. పంటపై 2 శాతం పంచగవ్య పిచికారీ చేస్తే దిగుబడులు పెరుగుతాయి. రక్షణ పంటలు : తోట చుట్టూ జొన్న, సజ్జ, బంతి మొక్కలను పెంచాలి. అంతర పంటలు : పైరు మధ్యలో బంతి మొక్కలను ఎర పంటగా వేయాలి. అంతర పంటలుగా ముల్లంగి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, కొత్తిమీర సాగు చేసుకోవచ్చు. నీటియాజమాన్యం : గింజలు విత్తిన వెంటనే నీరు కట్టాలి. తరువాత 4–5 రోజులకు రెండోసారి నీరు పారించాలి. వేసవి పంటకు అయితే ప్రతి 4–5 రోజులకు ఒకసారి తప్పనిసరిగా నీరు పెట్టాలి. దిగుబడి : 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. భూసార యాజమాన్యం ఇలా.. దబోల్కర్ పద్ధతిలో వివిధ రకాల విత్తనాలను విత్తి పెరిగిన తర్వాత భూమిలో కలియదున్నాలి. ఎకరానికి పశువుల ఎరువు 10 టన్నులు, 500 కిలోల ఘనజీవామృతం, వేప పిండి 100 కిలోలు, వేరుశనగ పిండి 32–40 కిలోలు, 2 కిలోలు అజోస్పైరిల్లం, 2 కిలోలు పాస్పోబ్యాక్టీరియా, ఆఖరి దుక్కిలో వేసి, కలియదున్నాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతం, 15 రోజుల వ్యవధిలో సాగు నీటిలో అందించాలి. -
రేడియో ‘చిన్నమ్మ’ ఇక లేరు
సాక్షి, అమరావతి: ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతిరోజూ ప్రసారమయ్యే ‘పాడి–పంట’ కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్‌లో మరణించారు. ఈ నెల 8న కూడా ఆమె ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్యక్రమమే అయినా అన్ని వర్గాల శ్రోతలను ఆమె ఆకట్టుకునేవారు. ఆకాశవాణి కేంద్రం ద్వారా వ్యవసాయదారులకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుని రేడియో సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నిర్మలా వసంత్ పల్లెటూరి యాసతో పాడిపంటకు జీవం పోశారని ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ జాతీయ నాయకుడు వలేటి గోపీచంద్ కొనియాడారు. -
బిర బిర పెరిగే బీర..
నిజామాబాద్: ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కూరగాయల్లో బీర ఒకటి. అధిక డిమాండ్ కల్గి ఉండి తొందరగా చేతికందే పంట బీర. అతి తక్కువ వ్యయంతో తక్కువ వ్యవధిలో బీర సాగు ఎలా చేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యాజమాన్య పద్ధతులు మేలు.. బీర తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో యాజమన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు వస్తాయి. విత్తన ప్రక్రియ ఆరంభమైన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు. ఎక్కువ మంది కూలీలు అవసరం లేదు. ఒకే వ్యక్తి ఒక రోజులో క్వింటాలు వరకు బీరకాయలను తెంపగలుగుతారు. అదే ఇతర పంటలైతే ముగ్గురు, నలుగురు కూలీలు అవసరమవుతారు. ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తి అయ్యే బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులంతా ఒకేసారి ఈ పంట వేయకుండా అంచెలంచెలుగా వేస్తే ధర స్ధిరంగా ఉండే ఆవకాశాలున్నాయి. కానీ ఒక్కోసారి ఉత్పత్తి పెరిగి ధర తగ్గిపోవడం వల్ల నష్టాలను కూడా చవి చూడాల్సి వస్తోంది. తీగజాతి కూరగాయల పంటలకు ఎక్కువగా తెగుళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఆ తెగుళ్లుపై ముందే జాగ్రత్తపడి తగిన మందులు పిచికారీ చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తే మరిన్ని దిగుబడులు వచ్చే అవకాశముంది. విత్తన శుద్ధి.. కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున థైరం, ఐదు గ్రాముల చొ ప్పున ఇమిడా క్లొప్రిడ్, ఒక దాంతో మరోటి కలిపి విత్తనశుద్ధి చేసుకో వాలి. ఎరువులు విత్తే ముందు ఎకరాకు 6 నుంచి 8 టన్నుల సహజ ఎరువు, 40 కిలోల భాస్వరం, 20 కిలోల పోటాష్‌ను పంట చేనులోని గుంతల్లో వేయాలి. 40 కిలోల నత్రజని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 రోజులకు పూత పిందె దశలో వేసుకోవాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేస్తే నీటి తడిని అందించాలి. విత్తే పద్ధతి.. నీటి కాలువలకు తోడుగా మురు గు నీరు పోవడానికి రెండు మీటర్ల దూరంలో కాలువలు ఏర్పాటు చే యాలి. అన్నిరకాల పాదులకు మూడు విత్తనాలను 1.2 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. ఎరువులు.. విత్తే ముందు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది టన్నుల పశువుల ఎరువు 32–40 కిలోల భాస్వరం, 16–20 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను గుంటల్లో వేయాలి. నత్రజనిని 32–40 కిలోలను రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25–30 రోజులకు పూత, పిందె దశలో వేసుకోవాలి. నీటి యాజమాన్యం.. పాదు చుట్టూ 3–5 సెంటీ మీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరివ్వాలి. వారానికోసారి నీటి తడులు ఇస్తే బాగుంటుంది. నీరు ఎక్కువకాలం పాదు చుట్టూ నిల్వకుండా జాగ్రత్తపడాలి. తెగుళ్లు.. తీగజాతి రకంలో తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశాలున్నాయి. అందులో బూజు తెగులు, బుడిద తెగులు, వేరుకుళ్లు తెగులు, పక్షి కన్ను తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు వెంటనే ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించి మందులు పిచికారీచేయాలి. సస్యరక్షణ చర్యలు - ఎండాకాలంలో లోతుగా దుక్కి దున్నుకోవాలి - పంట మార్పిడి తప్పనిసరిగా చేపట్టాలి. - కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - వంద గ్రాముల విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి రెండు గ్రాముల చొప్పున వాడి విత్తనశుద్ధిచేయాలి. -
వేప ఉత్పత్తులు.. కీటక నాశకాలు
జగిత్యాల అగ్రికల్చర్: వేప చెట్టును నీడనిచ్చే చెట్టుగానే కాకుండా, వేప ఉత్పత్తులు అద్భుత కీటకనాశనులుగా పనిచేస్తున్నాయి. పంటలకు సోకే తెగుళ్లు, పురుగుల నివారణకు పురుగుమందులకు బదులు, వేప పిండి, వేప నూనెలు వాడటం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో వేప ఉత్పత్తులు, వాటి పనితీరుపై పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త వెంకటయ్య వివరించారు. వృక్ష సంబంధ రసాయనాలు అంతర్భాగమే.. సమగ్ర సస్యరక్షణ విధానంలో భాగంగా వృక్ష సంబంధ రసాయనాలు వాడటం జరుగుతుంది. ఉష్ణమండలపు వృక్షం అయిన వేప మన ప్రాంతంలో ఎక్కువగా పెరుగుతుంది. పంటలను నాశనం చేసే 200 కీటకాలను వేప ఉత్పత్తులు అదుపు చేస్తాయి. వేప ఉత్పత్తులు వ్యవసాయంలో చక్కటి ఎరువుగా, ధాన్యం నిల్వ చేసే పదార్థంగా, పురుగు మందుల తయారీకి, నేరుగా పురుగులను అదుపు చేయడానికి, బయోమాస్ తయారీకి, పశువుల మేతగా, నేల కొత అరికట్టడానికి, భూములు చౌడుబారి పోకుండా, పర్యావరణంలో ఆక్సిజన్ లభ్యతను మెరుగుపరచడానికి, పక్షి స్థావరాలుగా, వాయు నిరోధకంగా.. చాల ప్రయోజనాలు ఉన్నాయి. వేపలో రసాయనాలు వేపలో లిమినాయిడ్స్ అనే తొమ్మిది రసాయనాలు ఉన్నాయి. వీటిలో అజాడిరక్టిన్, శలానిన్, నింబిన్, నింబిడిన్, మిలియాంట్రియోల్ ముఖ్యమైనవి. పోట్టు తీసిన ప్రతీ గ్రాము వేప గింజలో 2 నుంచి 4 మిల్టీగ్రాముల అజాడిరాక్టిన్ ఉంటుంది. వర్షం, తేమ అధికంగా ఉన్న ప్రాంతాల్లో పెరిగే వేప గింజల్లో అజాడిరాక్టిన్ తక్కువగా ఉంటుంది. సస్యరక్షణ చర్యలు.. 1930లో వేపపిండిని వరి, చెరకు పంటల్లో కాండం తొలుచు పురుగులు, చెదల నివారణకు వాడారు. 1937లో మిడతల దండు నివారణకు వేపాకుల రసాన్ని వాడినట్లుగా తెలుస్తోంది. వేప మందులు పిచికారీ చేస్తే పంటలపై కీటకాలు దరిచేరవు. వేపలోని చెడువాసన వల్ల కీటకాలు వికర్షింపబడతాయి. అజాడిరాక్టిన్ కీటకాన్ని లద్దెపురుగు దశ నుంచి కోశస్థ దశకు, రెక్కల పురుగు దశకు చెరకుండా అడ్డుకుంటుంది. దీంతో, వివిధ కంపెనీలు వేప సంబంధిత పురుగుమందులను మార్కెట్లో వివిద రూపాల్లో అమ్ముతున్నారు. వేపమందు దీపపు పురుగులు, పేను, తెల్ల ఈగలు, పిండి పురుగులు, తామర పురుగులు మొదలగు వాటిన్నింటినీ అదుపు చేస్తుంది. రైతులు పొలం గట్లపై, బంజరు భూముల్లో వేప చెట్లను విస్తారంగా పెంచితే ప్రత్యక్షంగా వచ్చే అదాయంతోపాటు, పరోక్షంగా పురుగుమందులు కూడా వచ్చినట్లే. వేప నూనె తయారీ.. వేప గింజలను చెట్టు నుంచి రాలిన వెంటనే సేకరించాలి. రాలిన గింజలను దాదాపు 12 గంటలపాటు ఆరబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. గింజల్లో తేమ 7 శాతం ఉండేలా చూసుకోవాలి. గోనెసంచుల్లో నింపి తేమ తగలకుండా భద్రపరచాలి. వేప గింజల నుంచి పలుకులను వేరు చేసి, గ్రైండర్లో పొడి చేసి కొద్ది కొద్దిగా> నీటిని కలుపుతూ పేస్టులాగా తయారైన దాన్ని మూట కట్టి ఒక గంటసేపు అలాగే ఉంచాలి. తర్వాత రెండు చేతులతో గట్టిగా నొక్కితే వేప నూనె బయటకు వస్తుంది. పంటలపై పిచికారీ చేయుటకు 10–20 మి.లీ వేపనూనెను లీటర్ నీటిలో కలిపి 10 గ్రాముల సబ్బు జతచేసి బాగా కలిపిన తర్వాత పిచికారీ చేయాలి. వేప కషాయం తయారీ.. సాధారణంగా 5 శాతం ద్రావణాన్ని సిఫారసు చేస్తారు. కాబట్టి 50 గ్రా. వేప పలుకుల పొడిని ఒక లీటర్ నీటికి కలిపి ఒక రోజంతా నానబెట్టి, మరునాడు వడపోసి, సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. పంటలపై పురుగుల కషాయంలోని ఆవిరిని పీల్చడం వల్ల పురుగుల శరీరంలో గ్రంథులు సక్రమంగా పనిచేయక చనిపోతాయి. -
నీటి ఆదాతోనే ఆదాయం
పరిగి: రైతుకు ప్రతి వేసవిలో ఎదురయ్యే నీటి సమస్య సర్వసాధారణమే అయినా.. గతేడాది ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఈసారి ఏడాది ప్రారంభంలో నీరు సమృద్ధిగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపు సెట్లకు 24 గంటల ఉచిత కరంటు సరఫరా చేస్తున్నప్పటి నుంచి నీటి వృథా బాగా పెరిగింది. దీంతో భూగర్భజలాలు అనుకున్న కంటే శరవేగంగా అడుగంటుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు నీటి సమస్య నుంచి బయట పడేందుకు సంసిద్ధం కావాల్సిన అవసరం ఉంది. భూమిలో నీరు అడుగంటడం, పారించిన నీరు పొలంలో వెంటనే ఆవిరవటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో రైతులు ప్రధానంగా వరిని పక్కన పెట్టి కూరగాయలు వంటి ఆరుతడి పంటలు సాగుచేసుకుంటే పరిస్థితులు అనుకూలిస్తాయని వ్వవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏటా అడుగంటుతూ వెళుతున్న భూగర్భ జలాలు రైతుకు మరింత సవాలుగా మారుతున్నాయి. బిందు సేద్యంతో సాగు చేసిన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం వేసవి సమీపిస్తుందంటే చాలు కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తున్న రైతుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. దానికి కారణం నీటి ఎద్దడి. ఈ సీజన్లో భూగర్భ జలాలు అడుగంటుతాయి. భూమిలోని తేమ వెంటనే ఆవిరవుతుంది. భాస్పోత్సేకం(ఆకుల నుంచి నీరు ఆవిరికావటం) ఎక్కువగా జరుగుతుంది. ఇదే సమయంలో కాపుమీద ఉన్న చెట్లకు వేసవిలో నీటి అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలతో పంటలకు నీరు సరిపడా అందదు. దీంతో కాయల బరువు, నాణ్యత, సైజు తగ్గటం ద్వారా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి కారణాలతో రైతు పూర్తిగా నష్టపోయే ప్రమాదముంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే రైతులు తమ పంటల్ని కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో పొలాల్లో తేమను కాపాడుకోవటం, నీటి వృథాను అరికట్టడం ఎలా అనే అంశంపై రైతులకు నీటి యాజమాన్యంపై వ్యవసాయ శాఖ సహాయ సంచాలుకులు నగేష్‌కుమార్ సలహాలు సూచనలు అందిస్తున్నారు. మల్చింగ్ సేద్యంతో నీరు ఆవిరి కాకుండా పొలాలకు పారించే నీటిని ఆదా చేయాలి... పారించిన నీరు వెంటనే ఆవిరి కాకుండా నివారించాలి. ప్రస్తుత పరిస్థితిలో ఇదే నీటి యాజమాన్యంలో కీలక మంత్రం. ప్రధాణంగా బిందు సేద్యంతో 50 శాతం వరకు నీటిని ఆదా చేస్తే పొలంలోని నీరు ఆవిరి కాకుండా మల్చింగ్ (ప్లాస్టిక్ పేపర్లు భూమిపై కప్పటం) విధానం అవలంభించాలి. దీంతో రైతు అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీటితో గట్టెక్కే అవకాశం ఉంది. వీటితో పాటు పొలాల్లో చెట్లకు పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకల ఎరువులతో పాటు వర్మి కంపోస్టు లాంటి ఎరువులు వేసుకోవాలి. అలాగే ఆముదం, వేప, కానుగ వంటి చెట్ల ఆకులు లేదా పిండి చెట్ల మొదళ్లలో వేసుకోవాలి. ఇలాంటి సేంద్రియ ఎరువులు భూమిలో తేమను పట్టి ఉంచటంతో పాటు చెట్లకు కావాల్సిన పోషకాలు కూడా అందిస్తాయి. చెట్ల మొదళ్లలో ఆకులు, వేరుశనగ పొట్టు, వరి పొట్టు, గింజలు తీసిన మొక్కజొన్న కంకులు వంటి పంట అవశేషాలు నాలుగు అంగులాల మందంతో వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల తేమ త్వరగా ఆరిపోకుండా ఉండటంతో పాటు కలుపుమొక్కల బెడద కూడా తగ్గుతుంది. కొన్నిరోజుల తరువాత ఆ వ్యర్థ పదార్థాలన్నీ సేంద్రియ ఎరువులా మారి పంటకు పోషకాలను అందిస్తాయి. కొన్నిరకాల పండ్ల చెట్లు ఆకుల్ని విపరీతంగా రాలుస్తాయి. ఉదాహరణకు 20 సంవత్సరాల బంగినపల్లి(బెనిషాన్) మామిడి చెట్లు సంవత్సరంలో 42 వేల ఆకుల్ని రాలుస్తుంది. రాలిన ఆకులు తీసివేయకుండా చెట్టు మొదలులోనే ఉంచాలి. అది కూడా కుళ్లి ఎరువుగా మారుతుంది. పైపులైన్లతో నీరు పెట్టాలి కాలువల ద్వారా నీరు పారిస్తే నీరు ఆవిరై ఎక్కువగా వృథా అవుతుంది. నీరంతా కాలువలు తడపటానికే సరిపోతుంది. కాబట్టి రైతులు పైపులతోనే నేరుగా చెట్ల వరకు నీరు పారేలా చూసుకోవాలి. ఇదే సమయంలో బిందు సేద్యం ద్వారా నీటిని మొక్కలకు పారిస్తే 40శాతం వరకు నీరు ఆదా అవుతుంది. అవే పైపుల ద్వారా ఎరువులను అందిస్తే(ఫర్టిగేషన్) 20–30 శాతం ఎరువులు ఆదా అవుతాయి. కలుపు మొక్కల బెడద కూడా తగ్గి చెట్ల పెరుగుదల వేగంగా ఉండి తద్వారా దిగుబడులు కూడా పెరుగుతాయి. ప్రధానంగా వేసవిలో బావులు, బోరుబావులలో లభ్యమయ్యే నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఇందుకోసం చెట్ల పాదుల సైజు కూడా తగ్గించుకోవాలి. దీని ద్వారా అవే నీటిని ఎక్కువ చెట్లకు అందించవచ్చు. వర్షాకాలం రాగానే మళ్లీ చెట్ల పాదుల సైజు పెంచుకోవాలి. -
‘మినుము’తో రైతుకు బలము
బాల్కొండ : సాధారణంగా రబీలో నవంబర్ మూడోవారం వరకే మినుములు సాగు చేస్తారు. మాగాణుల్లో అయితే డిసెంబర్ 15 వరకు ఈ పంట సాగు చేయవచ్చు. ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో పంటలసాగు ఆలస్యమైంది. దాని ప్రభావం రబీపైనా పడింది. దీంతో ప్రస్తుతం పలువురు రైతులు మినుముల సాగుకు సన్నద్ధమవుతున్నారు. విత్తన శుద్ధి పంట తొలి దశలో రసం పీల్చు పురుగులు, ఇతర తెగుళ్లు ఆశించే అవకాశముంది. విత్తనశుద్ధితో వీటిని నివారించవచ్చు. కిలో విత్తనాలకు 40 గ్రాముల కార్బోసల్ఫాన్, 2.5 గ్రాముల థైరమ్‌తో విత్తనశుద్ధి చేయాలి. మొదటిసారి ఈ పంట సాగు చేసే భూముల్లో.. 200 గ్రాముల రైజోబియం, పీఎస్బీ 200 గ్రాముల కల్చర్ ను కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల నత్రజని, భాస్వరం అవసరం 50 శాతం తగ్గుతుంది. విత్తనం ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు విత్తనం అవసరం. రైతులకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై అందిస్తోంది. నేల తయారీ, విత్తేవిధానం తేమను నిలుపుకోగలిగే భూములు పంట సాగుకు అనుకూలం. ముందుగా భూమిని బాగా దుక్కిదున్ని, విత్తడానికి ముందు ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి గొర్రుకొట్టాలి. వరి మాగాణుల్లో అయితే ఎరువుల అవసరం ఉండదు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య పది సెంటీ మీటర్ల దూరం ఉండేలా విత్తుకోవాలి. మాగాణుల్లో విత్తనాలను వెదజల్లినా సరిపోతుంది. నీటి తడులు ఒకటి రెండు నీటి తడులతో పంట చేతికి వస్తుంది. విత్తనాలు మొలిచిన తర్వాత 30 రోజుల దశలో మొదటిసారి, 55 రోజుల తర్వాత రెండోసారి నీరు అందించాలి. రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. కలుపుంటే.. పంటను మొదటి 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. ఇందు కోసం 20 నుంచి 30 రోజుల దశలో గొర్రు లేదా దంతి ద్వారా అంతర కృషి చేయాలి. ఇలా చేయడం వల్ల కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలు పు బెడద ఎక్కువగా ఉంటే విత్తిన వెంటనే 24 గంటలలోపు ఎకరాకు 1.25 నుంచి 1.50 లీటర్ల పెండి మిథాలిన్ లేదా అలాక్లోర్ కలుపు మందు ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. చీడపీడల నివారణకు.. రెండాకుల దశ నుంచే పురుగులు ఆశించే అవకా శం ఉంటుంది. పచ్చ రబ్బరు పురుగు రెండాకుల దశ నుంచి ఆశిస్తుంది. ఆకుల మధ్యలో ఇది గూ డు అల్లుకుంటుంది. గూడులో ఉండి తొడిమెల దగ్గర నుంచి పత్రహరితాన్ని తింటుంది. దీంతో ఆకులు ఎండి, రాలి పోతాయి. లద్దె పురుగులు రాత్రి వేళల్లో ఆకులను తినడం వల్ల మోడుల్లా మారుతాయి. వీటి నివారణకు విషపు ఎరలను వాడాలి. 5 కిలోల తవుడు, కిలో బెల్లంలో లీటరు మోనోక్రొటోపాస్ లేదా కిలో కార్బారిల్ లేదా 250 గ్రాముల థయోడికార్ట్ నీటిలో కలిపి ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలం అంతటా సమానంగా వేయాలి. ఇంకా ఇతర చీడపీడలు సోకితే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. -
బిందు సేద్యం.. సిరులు సాధ్యం
మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నదాతల ఆలోచనలూ మారాలి.. ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేసి మంచి ఫలితాలు రాబట్టాలి.. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ.. కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలి. అవకాశాలను అందిపుచ్చుకుని.. ఆదర్శ వ్యవసాయం చేయాలి. వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు.. అందుబాటులో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి మంచి మార్గమే ‘బిందు సేద్యం’.. మరి ఈ విధానం ద్వారా కలిగే లాభాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న చేయూతను పరిశీలిద్దామా.. ► డ్రిప్పు పద్ధతితో.. నాణ్యమైన దిగుబడులు, అధిక లాభాలు ►మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచిత అవకాశం ►బీసీ, ఓసీలకు తొంభై శాతం సబ్సిడీ చేర్యాల తులసీదాస్, నంగునూరు: వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఆరు తడి పంటలను ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో బిందు సేద్యం ద్వారా అనేక ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. డిప్పు పద్ధతిన ఆరుతడి పంటలు సాగు చేస్తే నాణ్యమైన దిగుబడులతో పాటు అధిక లాభాలు పొందవచ్చని మైక్రో సిబ్బంది చెబుతున్నారు. బిందు సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండిచవచ్చని పేర్కొంటున్నారు. అంతేకాకుండా యూరియా, డీఏపీ వంటి ఎరువులను ఈ పద్ధతిలో సులువుగా వేసుకోవచ్చని పేర్కొం టున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్’ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ, ఓసీ రైతులకు తొంభై శాతం రాయితీ ప్రకటించిం ది. ఐదు నుంచి పది ఎకరాలలోపు ఉన్న రైతులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. ఈ లెక్కన ఎక రం పొలం ఉన్న రైతులకు రూ. 50 వేలకు గాను రూ. 6 వేలు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రూ.10 వేలు చెల్లిస్తే లక్ష రూపాయల విలువైన పరికరాలను అందజేస్తారు. పది సంవత్సరాల నుంచి ప్రభుత్వ రాయితీ పొందని ప్రతీ రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారికి మైక్రో ఇరిగేషన్ పీడీ డ్రిప్పును మంజూరు చేస్తారు. ఎవరికి దరఖాస్తు చేసుకోవాలి ►ప్రతి మండలానికి ఒక మైక్రో ఇరిగేషన్ ఏరియా కో ఆర్డినేటర్ ఉంటారు. ► అతని వద్ద లభించే ఫారాన్ని తీసుకుని వివరాలను పూరించాలి. ► మీ సేవా కేంద్రం నుంచి 1బీ, ఆధార్ లేదా రేషన్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, భూమికి సంబంధించిన సర్వే నక్షా కాపీలను దరఖాస్తు ఫారానికి జతచేయాలి. ►ఎస్సీ, ఎస్టీలైతే మీ సేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి. ►డ్రిప్పు మంజూరైన రైతు పీడీ టీఎస్ ఎంఐపీ పేరిట డీడీ (డిమాండ్ డ్రాఫ్ట్) తీసి అధికారులకు అందజేయాలి. ఏ పరికరాలు అందజేస్తారు. ►బోరు మోటర్లు ఉన్న రైతులకు స్క్రీన్ఫిల్టర్, వ్యవసాయ బావులు ఉన్న రైతులకు సాండ్ఫిల్టర్తో కూడిన డ్రిప్పు అందజేస్తారు. ►హెడ్యూనిట్ పరికరాల్లో ల్యాట్రల్, పీవీసీ మెయిన్ లైన్, సబ్ లైన్ కంట్రోల్ వాల్వ్స్, ఎయిర్ రిలీజ్ వాల్వ్, ప్రెజర్ క్రేజ్. ఇస్తారు. ►యూరియా కలుపుకోవడానికి ట్యాంక్, వెంచూరిలు కూడా అందజేస్తారు. ►21 రకాల కంపెనీలకు చెందిన పైపులు అందుబాటులో ఉన్నాయి. రైతులు కోరిన కంపెనీ పైపులను అందజేస్తారు. ►కంపెనీకి చెందిన వ్యక్తులు రైతు భూమిని సర్వే చేసి డ్రిప్పును బిగించి సలహాలు, సూచనలు అందజేస్తారు. ►వీరు బిగించిన పరికరాలకు 5 సంవత్సరాల పాటు కంపెనీ వారంటీ ఉంటుంది. ఏ పంటలు సాగు చేసుకోవచ్చు ►ఆరుతడితోపాటు అన్ని రకాల పంటలను ఈ విధానం ద్వారా పండిచుకోవచ్చు. ►మామిడి, బొప్పాయి, అరటి, ద్రాక్ష, సపోట, దానిమ్మ, అరటి, మల్బరీ, జామ, సీతాఫలం తదితర తోటలు.. ►వరి, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, వేరుశనగ (పల్లి), చెరకు, అల్లం, పసుపు, బంగాళదుంప, మిరప, కూరగాయ పంటలకు ఇది ఎంతో సౌకర్యవంతమైనది. డ్రిప్పు వల్ల ఉపయోగాలు ►ఎత్తుపళ్లాలు ఉన్న భూములు, గరప నేలల్లోనూ బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయొచ్చు. ►50 శాతం నీరు ఆదా అవుతుంది. ►కలుపు, చీడ పీడల బెడద ఉండదు. ►కూలీల కొరతను సులువుగా అధిగమించ వచ్చు. ►20 నుంచి 30 శాతం నాణ్యమైన, అధిక దిగుబడి పొందవచ్చు. ►ఖర్చు భారీగా తగ్గించుకోవచ్చు. ఫోన్ చేస్తే మేమే వస్తాం ఆరుతడి పంటలకే కాకుండా అన్ని రకాల పంటలకు డ్రిప్పు బిగించుకోవచ్చు. దీని ద్వారా పంటలు పండిస్తే నీరు, ఫెర్టిలైజర్ నేరుగామొక్కలకు అందడంతో 15 నుంచి 20 శాతం ఎక్కువ దిగుబడులు వస్తాయి. సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన ఏ రైతుకు డ్రిప్పు కావాలన్నా ఫోన్ చేస్తే చాలు.. స్వయంగా వచ్చి దరఖాస్తు ఫారాలు అందజేసి డ్రిప్పు మంజూరు చేయిస్తాం. ఇదే కాకుండా రోజుకో గ్రామం చొప్పున తిరుగుతూ డ్రిప్పు వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. - అర్జున్, సిద్దిపేట నియోజకవర్గ ఏరియా కో ఆర్డినేటర్, ఫోన్: 8374449858 -
ఇప్పుడు ఏం చేయాలంటే...
పాడి-పంట: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి... వీటన్నింటి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రైతులు వివిధ పంటల్లో చేపట్టాల్సిన చర్యలపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం సంచాలకులు అందజేస్తున్న సూచనలు... ఈ పంటలు వేసుకోవాలి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రైతులు పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, సోయాచిక్కుడు విత్తనాలను త్వరగా వేసుకోవాలి. తెలంగాణ రైతులు ఆముదం, పొద్దుతిరుగుడు, కంది పంటలు వేసుకోవాలి. ఏ పంట వేసినా విత్తనశుద్ధి తప్పనిసరి. రైతులు ఇప్పటికే వర్షాధార పంటలు వేసుకున్నట్లయితే మొదటి దఫా పైపాటు ఎరువులు వేయాలి. రెండు రాష్ట్రాల రైతులు ఇప్పుడు ఆముదం విత్తనాలు వేసుకోవచ్చు. ఇందుకోసం వారు అనువైన లేదా హైబ్రిడ్ రకాలను ఎంచుకోవాలి. ఆముదం విత్తనాలు వేసే సమయంలో ఎకరానికి 25 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. కలుపు నివారణ కోసం విత్తిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేయాలి. వర్షాధార వేరుశనగ పైరు విత్తేటప్పుడు ఎకరానికి 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 33 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. పత్తి పైరు 20-25 రోజుల దశలో ఉన్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని ఎకరానికి 30-35 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత భాస్వరం ఎరువు వేయకూడదు. ఇక మొక్కజొన్న పైరు 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు ఎకరానికి 45-50 కిలోల యూరియాను పైపాటుగా వేసుకోవాలి. రసాన్ని పీలుస్తాయి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పైరును రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ ఆశించి నష్టపరిచే ప్రమాదం ఉంది. పిల్ల, పెద్ద పేనుబంక పురుగులు ఆకుల అడుగు భాగాన, కొమ్మల పైన రసాన్ని పీలుస్తూ జీవిస్తాయి. దీనివల్ల మొక్క ఎదగదు. ఈ పురుగులు విసర్జించే తేనె వంటి పదార్థం కారణంగా ఆకులు, కాండం పైన మసి తెగులు వ్యాపిస్తుంది. పచ్చదోమ తల్లి పురుగులు మధ్య ఈనెకు దగ్గరగా లేదా ఆకు తొడిమ లోపలికి గుడ్లను చొప్పిస్తుంది. పిల్ల, పెద్ద దోమలు అడ్డంగా నడుస్తూ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారతాయి. చివరికి ఆకు మొత్తం ఎర్రబడుతుంది. ఆకులు ముడుచుకొని, దోనె మాదిరిగా కన్పిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు తొలి దశలో పురుగు మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయకూడదు. కాబట్టి పైరు 20 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రొటోఫాస్ + నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో లేత కాండం మీద పూయాలి. లేత మొక్క చనిపోతుంది పత్తి పైరును రైజోక్టోనియా వేరుకుళ్లు తెగులు సోకే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులు అన్ని దశలలోనూ పైరును నష్టపరుస్తుంది. ముఖ్యంగా భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని తాకిడి అధికంగా ఉంటుంది. తెగులు సోకిన లేత మొక్క ఒక్క రోజులోనే అర్థాంతరంగా చనిపోతుంది. ఆ మొక్క చివరి భాగం కొద్దిగా తడిగా, జిగటగా ఉంటుంది. వడలిపోయిన ఆకులు చాలా కాలం వరకూ చెట్టు పైనుంచి కిందికి వేలాడుతూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు చేలో గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. వాటిని పీకితే తేలికగా ఊడివస్తాయి. ఎదిగిన మొక్కలు వడలిపోతాయి. ఆకులు ఎర్రబడతాయి. పీచు వేర్లు కుళ్లి ఊడిపోతాయి. చేలో తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల స్ప్రింట్ లేదా 3 గ్రాముల సాఫ్/కంపానియన్/మాస్టర్ చొప్పున కలిపి, ఆ ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధితో 2-3 సార్లు మొక్కల మొదళ్లు బాగా తడిసేలా పాదులో పోయాలి. మొక్కజొన్నలో... మొక్కజొన్న పైరులో కాండం తొలుచు పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల చొప్పున మోనోక్రొటోఫాస్ కలిపి 10-12 రోజుల వయసున్న పైరుపై పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో... ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున టమాటా, వంగ, మిరప నారుమడులు పోసుకోవాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో బెండ, చిక్కుడు, తీగజాతి కూరగాయ పంటల విత్తనాలు వేసుకోవాలి. కూరగాయ పంటల నారుమడుల్లో రసం పీల్చే పురుగులు కన్పిస్తే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. నారుకుళ్లు తెగులు సోకితే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి, ఆ మందు ద్రావణంతో నారుమడిని తడపాలి. -
ఈ మొక్కలు దిగుబడులను హరిస్తాయి
పెనుగొండ (పశ్చిమ గోదావరి): వరి నాట్లు వేసిన 25-30 రోజులకు కూలీలతో కలుపు మొక్కలను తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అప్పటికే ఈ మొక్కలు భూమిలోని పోషకాలను చాలా వరకూ గ్రహిస్తాయి. దీంతో వరి పైరుకు నష్టం జరుగుతోంది. కలుపు వల్ల వరి దిగుబడి 20-34% తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ నేపథ్యంలో వరిలో కలుపు నివారణపై పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మానుకొండ శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన రెడ్డి అందిస్తున్న సూచనలు... ఇవి మూడు జాతులు వరిని 3 జాతుల కలుపు మొక్కలు నష్టపరుస్తాయి. గడ్డి జాతికి చెందిన వరి మొక్క, అదే జాతికి చెందిన కలుపు మొక్క ఒకేలా ఉంటాయి. అందువల్ల వీటిని గుర్తించి తీసేయడం చాలా కష్టం. వరి చేలో ఊద, గరిక, కరిగడ్డి/కారిగడ్డి, నక్కపీచు/నక్కతోక, చిప్పర గడ్డి, ఉర్రంకి వంటి గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తుంటాయి. ఇక తుంగ జాతి కలుపు మొక్కల వేర్లలో అక్కడక్కడ దుంపలు ఉంటాయి. వీటిలోని ఆహారాన్నే మొక్కలు నిల్వ చేసుకుంటూ పెరుగుతాయి. కాబట్టి ఈ మొక్కను దుంపతో సహా పీకేయాలి. వరి చేలో తుంగ, నీటి తుంగ, బొడ్డు తుంగ, చలి తుంగ, రాకాసి తుంగ వంటి తుంగ జాతి మొక్కలు కన్పిస్తుంటాయి. కొన్ని కలుపు మొక్కల ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఈ మొక్కలు విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. తూటికూర, తూటికాడ, గుంట గలిజేరు, చిన్న నక్కపూత చెట్టు, పులిచింత, నీరుదంటు, ఆమడకాడ, తోటకూర వంటివి ఈ జాతికి చెందిన కలుపు మొక్కలు. యాజమాన్య పద్ధతులతో... గట్ల మీద, సాగు నీటి కాలువల్లో ఉన్న కలుపు మొక్కలను తొలగించాలి. పొలాన్ని బాగా దమ్ము చేస్తే కలుపు బెడద సగం తగ్గుతుంది. పోషకాలు, సాగు నీటి యాజమాన్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పైరు నేలంతా కమ్ముకొని కలుపును పెరగనీయదు. ప్రతి సంవత్సరం వరి పైరునే వేయకుండా వరి తర్వాత వేరుశనగ లేదా ఇతర పంటలు వేసుకుంటే కలుపు తాకిడి తగ్గిపోతుంది. నాట్లు వేసిన తర్వాత 20, 30 రోజులప్పుడు కలుపు మొక్కలను వేర్లతో సహా తీసేయాలి. అవసరమైతే 40 రోజులప్పుడు మూడోసారి కలుపు తీయించాలి. మొదటిసారి కలుపు తీసిన తర్వాత నత్రజని ఎరువును పైపాటుగా వేస్తే మొక్కలకు ఎక్కువ పిలకలు వస్తాయి. కలుపు తీసిన తర్వాతే ఎరువు వేయాలి. రసాయనాలతో... ఎకరం విస్తీర్ణంలో నాటేందుకు సరిపడే నారుమడిలో విత్తనాలు చల్లిన 7-8 రోజులకు ఊద ని ర్మూలన కోసం 200 లీటర్ల నీటిలో 1.5-2 లీట ర్ల బ్యూటాక్లోర్ కలిపి పిచికారీ చేయాలి. లేకుం టే విత్తనాలు చల్లిన 14-15 రోజులప్పుడు 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ 10% కలిపి పిచికారీ చేసుకోవాలి. మాగాణి వరిలో ఊద వంటి ఏకవార్షిక గడ్డి జాతి మొక్కల నిర్మూలనకు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 1-1.5 లీటర్ల బ్యూటాక్లోర్ 50% లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ 30% లేదా 500 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్ 50% లేదా 1.5-2 లీటర్ల బెంధియోకార్బ్ 50% మందును 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. లేకుంటే ఎకరానికి 35-50 గ్రాముల ఆక్సాడయార్జిల్ 80% పొడి మందును 500 మిల్లీలీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని నాటిన 3-5 రోజుల మధ్య పొడి ఇసుకలో కలిపి చల్లాలి. చేలో తుంగ, గడ్డి, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు సమానంగా ఉన్నప్పుడు నాట్లు వేసిన 3-5 రోజుల మధ్య ఎకరానికి 4 కిలోల బ్యూటాక్లోర్ 5% గుళికలు+4 కిలోల 2,4-డి ఇథైల్ ఎస్టర్ 4% గుళికలను 20 కిలోల పొడి ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు వెదజల్లినప్పుడు... దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తనాలను వెదజల్లినప్పుడు... విత్తనాలు చల్లిన 8-10 రోజుల్లో బ్యూటాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 1.25 లీటర్లు లేదా 500 మిల్లీలీటర్ల అనిలోఫాస్ లేదా ప్రెటిలాక్లోర్+సేఫ్‌నర్ కలిసిన మందు 600 మిల్లీలీటర్లు లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను 25 కిలోల ఇసుకలో కలిపి వెదజల్లాలి. విత్తనాలు చల్లిన 15-20 రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 80 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం లేదా 400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్ కలిపి పిచికారీ చేయాలి. విత్తనాలు వేసిన 25-30 రోజులప్పుడు వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఎకరానికి 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ 80% పొడి మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు అవసరం కలుపు మందు పిచికారీ చేయడానికి స్ప్రేయర్‌కు ఫ్లడ్జెట్ లేక ప్లేట్ఫేస్ నాజిల్‌ను ఉపయోగించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు రసాయనాలు పిచికారీ చేసినా లేదా గుళికలు చల్లినా పనిచేయవు. కలుపు మందును ద్రవ/గుళికల రూపంలో ఇసుకలో కలిపి వాడినప్పుడు చేలో 2-5 సెంటీమీటర్ల వరకు నీటిని నిలగట్టాలి. మందును పొలమంతా సమానంగా పడేలా చల్లుకోవాలి. బయటి నీరు లోపలికి రాకుండా, లోపలి నీరు బయటికి వెళ్లకుండా గట్లను కట్టుదిట్టం చేయాలి. నాలుగైదు రోజుల వరకు ఆ నీటిని తీయకూడదు. పైరు దశ, కలుపు మొక్క జాతిని బట్టి తగిన మందులు వాడాలి. -
ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి
గత దశాబ్ద కాలంలో వరి సేద్య పద్ధతుల్లో ఎన్నో విప్లవాత్మక మా ర్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో డ్రమ్‌సీడర్ వినియోగం ఒకటి. దీనివల్ల విత్తన మోతాదు, నీటి వినియోగం, చీడపీడల బెడద, పంటకాలం, సాగు ఖర్చు... ఇవన్నీ తగ్గుతాయి. ఒకవేళ డ్రమ్‌సీడర్ అందుబాటులో లేకుంటే మొలకెత్తిన విత్తనాలను చేలో నేరుగా వెదజల్లవచ్చు. ఈ నేపథ్యంలో డ్రమ్‌సీడర్ వినియోగంపై ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఓ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న సూచనలు... వరి పండించే భూములన్నింటిలోనూ డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించవచ్చు. అయితే సమస్యాత్మక నేలలు పనికిరావు. సాధారణ పద్ధతిలో మాదిరిగానే పొలాన్ని తయారు చేయాలి. పొలం లో నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నీరు ఎక్కువైతే బయటికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకూ పొలా న్ని చదును చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకుంటే చదును చేయడం, నీరు పెట్టడం తేలికవుతుంది. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తనాలు వేసే రోజే ఆఖరి దమ్ము చేసి, చదును చేసి, పలచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. ఎలా వేయాలి? రకాన్ని బట్టి ఎకరానికి 10-15 కిలోల విత్తనాలు సరిపోతాయి. కాండం గట్టిగా-వేరు వ్యవస్థ దృఢంగా ఉండి, పడిపోని రకాలైతే బాగా అనువుగా ఉంటాయి. విత్తనాలను ముందుగా 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని గోనెసంచిలో వేసి లేదా వాటిపై గోనెసంచిని కప్పి 24 గంటల పాటు మండె కడితే విత్తనాలు మొలకెత్తుతాయి. వాటిని నీడలో ఆరబెట్టి, ఆ తర్వాతే సీడర్లో నింపాలి. విత్తనాలు వేసేటప్పుడు చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. సీడర్కు 4 ప్లాస్టిక్ డబ్బాలు, ఒక్కో డబ్బాకు 18 రంధ్రాలు ఉంటాయి. రంధ్రాల మధ్య 2.5-3 సెంటీమీటర్లు, డబ్బాల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒకసారి సీడర్‌ను లాగితే 8 వరుసల్లో, 20 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. గింజలు పొలంలో రాలడానికి వీలుగా ప్రతి డబ్బాలో 3/4వ వంతు మాత్రమే విత్తనాలను నింపాలి. సీడర్‌ను నేర్పుగా, ఒకే వేగంతో లాగాలి. విత్తిన 24 గంటల వరకూ నీరు పెట్టకూడదు. కలుపు సమస్య ఎక్కువే తొలి దశలో చేలో నీరు నిలగట్టకుండా, ఆరుతడిగా వరిని సాగు చేయడం వల్ల కలుపు సమస్య ఎక్కువగానే ఉంటుంది. దాని నివారణకు విత్తనాలు వేసిన 2-3 రోజుల్లో ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పెండిమిధాలిన్/400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్/35 గ్రాముల ఆక్సాడయార్జిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే 200 లీటర్ల నీటిలో 80-100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం కలిపి పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా ఉంటే 200 లీటర్ల నీటిలో 300-400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలపై పడేలా మందును పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో నీరు ఉండకూడదు. పైరు పెరిగే దశలో కూలీలతో కలుపు తీయించాలి. నీరు-ఎరువుల యాజమాన్యం విత్తనాలు వేసినప్పటి నుంచి పైరు పొట్ట దశకు చేరుకునే వరకూ చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి కోతకు వారం పది రోజుల ముందు వరకూ చేలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేయాలి. పొటాష్‌ను 2 సమాన భాగాలుగా చేసుకొని దమ్ములో, పైరు 60-65 దశలో (మూడో దఫా నత్రజని ఎరువుతో కలిపి) వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమాన భాగాలుగా చేసి విత్తిన 15-20 రోజులకు, 40-45 రోజులకు, 60-65 రోజులకు మూడు దఫాలుగా వేసుకోవాలి. ఎన్నో ప్రయోజనాలు డ్రమ్‌సీడర్‌ను వినియోగించడం వల్ల పంట వారం పది రోజుల ముందే కోతకు వస్తుంది. నారుమడి పెంపకం, నాట్లు వేయడం వంటి పనులు ఉండవు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.3,000 వరకూ తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడినంత ఉండడం వల్ల దిగుబడి 10-15% పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయవచ్చు. ఎకరం పొలంలో విత్తనాలు వేయడానికి 2 గంటలు చాలు. పైగా ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. చీడపీడల తాకిడి కూడా తక్కువగానే ఉంటుంది. కోనోవీడర్ నడిపితే... డ్రమ్ సీడర్‌తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు చేలో కోనోవీడర్‌ను నడపాలి. దీనివల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి. ఆ తర్వాత చేలో కలుపు ఉన్నా, లేకపోయినా 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు కోనోవీడర్‌ను తిప్పితే భూమి బాగా కదిలి, వేరు వ్యవస్థకు గాలి-పోషకాల లభ్యత పెరుగుతుంది. పీచు వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. పిలకలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, మొక్క గుబురుగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. కోనోవీడర్‌ను నడపడానికి ముందు రోజు సాయంత్రం పొలానికి పలచగా నీరు పెట్టాలి. -
ఈ పంటలకు సమయం మించలేదు
పాడి-పంట: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడిప్పుడే వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అయితే రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో వేసుకునేందుకు కూడా అనువైన పంటలు ఉన్నాయి. వర్షాలు తక్కువగా పడినప్పుడు లేదా సకాలంలో పడనప్పుడు అవి పడే సమయాన్ని, నేల స్వభావాన్ని బట్టి ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకొని సాగు చేయవచ్చునని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ కో-ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమీ) డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు) సూచిస్తున్నారు. ఆ వివరాలు... ఆంధ్రప్రదేశ్‌లో... ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తా వ్యవసాయ వాతావరణ మండలంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల రైతులు, విశాఖపట్నం జిల్లాలోని మైదాన ప్రాంతాల రైతులు ఆగస్టులో తేలిక నేలల్లో రాగి, ఉలవ, జొన్న, కంది వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో రాగి, మినుము, జొన్న, ఉలవ, గోరుచిక్కుడు, కంది, మొక్కజొన్న (స్వల్పకాలిక రకాలు), మొక్కజొన్న+కంది వేసుకునే అవకాశం ఉంది. సెప్టెంబరులో తేలిక నేలల్లో పెసర, ఉలవ, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు. గోదావరి మండలంలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు ఆగస్టులో తేలిక నేలల్లో రాగి, ఉలవ, జొన్న, పిల్లిపెసర, అలసంద వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో రాగి, ఉలవ, మిరప, జొన్న, పొద్దుతిరుగుడు విత్తుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో మినుము వేసుకోవాలి. కృష్ణా మండలంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, జొన్న వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో కంది, అలసంద, పత్తి+కంది వేసుకోవచ్చు. తేలిక నేలల్లో సెప్టెంబరులో మినుము వేసుకునే అవకాశం ఉంది. దక్షిణ మండలంలోని చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో రాగి, కంది, పెసర, ఆముదం, జొన్న వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువైన నేలల్లో ఉలవ, అలసంద, వేరుశనగ, పొద్దుతిరుగుడు విత్తుకోవాలి. సెప్టెంబరులో తేలిక నేలల్లో మినుము, పెసర, ఉలవ, జొన్న వేసుకునే అవకాశం ఉంది. అత్యల్ప వర్షపాత మండలంలోని కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో కొర్ర, ఉల్లి, జొన్న, వేరుశనగ, సజ్జ, ఉలవ పంటలు వేసుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో ఆముదం, వేరుశనగ+కంది, పొద్దుతిరుగుడు, పొగాకు వేసుకోవాలి. సెప్టెంబరులో తేలిక నేలల్లో జొన్న, పెసర, సజ్జ, ఉలవ విత్తుకోవచ్చు. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, పొగాకు వేసుకునే అవకాశం ఉంది. తెలంగాణలో... ఉత్తర, మధ్య తెలంగాణ మండలాలకు చెందిన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, పొద్దుతిరుగుడు, ఆముదం వేసుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, కంది వేసుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో ఉలవ వేసుకోవాలి. దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతులు తేలిక నేలల్లో ఆగస్టులో ఉలవ, జొన్న, సజ్జ, రాగి, ఆముదం విత్తుకోవాలి. మధ్యస్థ నుంచి బరువు నేలల్లో పొద్దుతిరుగుడు, ఆముదం, కంది వేసుకోవచ్చు. సెప్టెంబరులో తేలిక నేలల్లో ఉలవ, పెసర విత్తుకోవచ్చు. రెండు రాష్ట్రాల రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే జొన్నను చొప్ప కోసం మాత్రమే విత్తుకోవాలి. కంది విత్తనాలను దగ్గర దగ్గరగా వేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం రైతులు చేపట్టాల్సిన పనులపై రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు అందిస్తున్న సూచనలు... రెండు రాష్ట్రాలలోనూ... వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల (200 చదరపు మీటర్లు) నారుమడిలో కిలో చొప్పున కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు వేసుకోవాలి. పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు విత్తనాలు వేసిన 20 రోజులకు మోనోక్రొటోఫాస్+నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి ఆ మందు ద్రావణాన్ని మెత్తని బ్రష్‌తో లేత కాండం మీద పూయాలి. ఇక తెలంగాణలో... రైతులు ఇప్పటికే వర్షాధార పంటలు వేసుకున్నట్లయితే ప్రస్తుతం కురుస్తున్న వానలను ఆసరాగా చేసుకొని మొదటి దఫా ఎరువులను పైపాటుగా వేసుకోవాలి. ఆముదం విత్తనాలు విత్తేటప్పుడు ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం అందించే ఎరువులు వేయాలి. విత్తనాలు వేసిన 48 గంటల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేసుకుంటే కలుపు బెడద ఉండదు. మహబూబ్‌నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పత్తి పంటను పిండినల్లి ఆశిస్తోంది. దీని నివారణకు పొలం గట్లపై ఉన్న కలుపు మొక్కలను వెంటనే పీకి నాశనం చేయాలి. ఎందుకంటే ఈ పురుగులు ముందుగా కలుపు మొక్కలను ఆశ్రయిస్తాయి. -
నారు పోయలేదా? దిగులొద్దు..!
గుడ్లవల్లేరు (కృష్ణా): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణంగా జూన్‌లో వరి నారుమడులు పోసుకుంటారు. అయితే జూలై మొదటి పక్షం పూర్తి కావస్తున్నప్పటికీ రెండు రాష్ట్రాల్లోనూ ఇంకా సరైన వర్షపాతం నమోదు కాలేదు. దీనివల్ల ఇప్పట్లో కాలువలకు సాగు నీరు చేరే పరిస్థితులు కన్పించడం లేదు. మరోవైపు వరి సాగు ఇప్పటికే నెల రోజులు ఆలస్యమవడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ విధంగా పంట సాగు ఆలస్యమైనప్పుడు రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యం గా స్వల్పకాలిక రకాలను ఎంచుకంటే పంటకా లం కలిసొస్తుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా వేసుకునేందుకు అనువైన వరి రకాలు, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కాకి నాగేంద్రరావు, డాక్టర్ టి.అనురాధ అందిస్తున్న సూచనలు... ఆంధ్రప్రదేశ్‌లో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సాగు ఆలస్యమైతే... కృష్ణా మండలంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు, గోదావరి మండలంలోని తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల రైతులు స్వర్ణ, చైతన్య, విజేత, కాటన్దొర సన్నాలు రకా లు వేసుకోవాలి. ఉత్తర కోస్తా మండలానికి చెం దిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రైతులకు వసుంధర, సురక్ష, వంశి, కాట న్దొర సన్నాలు అనువుగా ఉంటాయి. దక్షిణ మండలంలోని నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల రైతులు స్వర్ణముఖి, సత్య, అపూర్వ రకాలను ఎంచుకోవాలి. ఇక వర్షపాతం తక్కువగా ఉండే కర్నూలు, అనంతపురం జిల్లాల రైతులకు సాంబమసూరి, సోనా మసూరి, నంద్యాల సన్నాలు, సత్య, సోమశిల రకాలు అనువుగా ఉంటాయి. తెలంగాణలో... తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు ఆలస్యమైన పక్షంలో ఉత్తర తెలంగాణ మండలంలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు కేశవ, సురేఖ, పోతన, భద్రకాళి, ఇందూర్ సాం బ, శివ, ఎర్రమల్లెలు రకాలను ఎంచుకోవాలి. మధ్య తెలంగాణ మండలానికి చెందిన వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల రైతులకు కావ్య, సురేఖ, ఎర్రమల్లెలు, సత్య, తెల్లహంస రకాలు అనువుగా ఉంటాయి. దక్షిణ తెలంగాణ మండలంలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు సురేఖ, ఎర్రమల్లెలు, సత్య, తెల్లహంస, కృష్ణహంస, రాజవడ్లు రకాలు వేయాలి. ఏం చేయాలి? వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ జూన్ 15వ తేదీ లోగా నారుమడులు పోసుకొని, జూలై 15వ తేదీ నాటికి నాట్లు వేసుకోవాలి. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట సాగు ఆలస్యమవుతోంది. కాబట్టి రైతులు ఇప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించాలి. నారుమడుల్లో నీరు తక్కువైతే ప్రతి 4 సెంట్ల నారుమడికి కిలో చొప్పున మ్యురేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. దీనివల్ల మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకొని, దృఢంగా పెరుగుతాయి. 50 రోజుల వయసు దాటిన మధ్యకాలిక రకాల నారు, 60 రోజుల వయసు దాటిన దీర్ఘకాలిక రకాల నారు నాటేందుకు పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకొని, నారు పోసుకోవడం మంచిది. నారు పీకడానికి వారం రోజుల ముందు సెంటు నారుమడిలో 160 గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలు వేసి, రెండు రోజుల పాటు నీటిని నిలగట్టాలి. లేదా నారు మొక్కలను తీసిన తర్వాత వాటిని ముందుగా క్లోరిపైరిఫాస్ మందు ద్రావణంలో ముంచి ఆ తర్వాత నాటాలి. ఒక్కో కుదురుకు 3-4 మొక్కలు నాటుకోవాలి. ఎంత ఆలస్యమైనప్పటికీ సెప్టెంబర్ మొద టి వారానికి నాట్లు వేయడం పూర్తయ్యేలా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఆ సమయం దాటే లా ఉంటే వేరే పంటను ఎంచుకోవాలి. నారుమడిలో ఇనుప ధాతు లోపం, ప్రధాన పొలంలో జింక్ లోపం కన్పిస్తే వాటి నివారణకు మందులు పిచికారీ చేసుకోవాలి. నారుమడి పైన, ప్రధాన పొలం పైన హిస్పా, ఉల్లికోడు, దీపపు పురుగులు దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన మందులు పిచికారీ చేసి వాటిని నివారించాలి. నీటి ఎద్దడి ఏర్పడితే కలుపు మొక్కల బెడద కూ డా అధికంగానే ఉంటుంది. వాటిని కూడా సకాలంలో నిర్మూలించేందుకు మందులు వాడాలి. ముదురు నారు నాటాల్సి వస్తే... ఒకవేళ ముదురు నారు నాటాల్సి వస్తే కుదుళ్ల సంఖ్యను పెంచాలి. ఒక్కో కుదురుకు 4-5 మొక్కలు నాటాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కంటే 25% పెంచాలి. సాధారణంగా నత్రజనిని మూడు దఫాలుగా వేస్తారు. అయితే ముదురు నారు నాటినప్పుడు రెండు దఫాలుగా... సిఫార్సు చేసిన మోతాదులో 70% దమ్ములోనూ, మిగిలిన 30% అంకురం దశలోనూ... వేసుకోవాలి. త్వరగా విత్తుకోండి గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3-4 రోజుల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాలను ఆసరాగా చేసుకొని రైతులు పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, సొయాచిక్కుడు వంటి పంటల విత్తనాలను త్వరగా వేసుకోవాలి. కూరగాయ పంటల నారుమడులు పోసుకోవాలి. విత్తనాలు విత్తుకోవాలి. బీటీ పత్తి విత్తనాలు విత్తేటప్పుడు ఎకరానికి 20-24 కిలోల భాస్వరాన్ని అందించే ఎరువును వేయాలని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వాతావరణ పరిశోధనా కేంద్రం వారు సూచిస్తున్నారు. -
చిన్న రైతుకు పెద్ద వరం!
రసాయన ఎరువుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి బారి నుంచి పంటల్ని కాపాడుకోవాలంటే సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ప్రపంచ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని, నాణ్యమైన వ్యవసాయోత్పత్తుల్ని అందించడానికి కూడా వీటి వాడకం అవసరమే. వర్మి కంపోస్ట్ ద్వారా... గతంలో రైతులు పశువులు/జీవాల ఎరువు, కంపోస్ట్, వేప/వేరుశనగ చెక్క వంటి సేంద్రియ ఎరువులు బాగా వాడేవారు. అయితే ఇప్పుడు వాటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో... పరిమితంగా లభిస్తున్న సేంద్రియ పదార్థాల్ని ఉపయోగించి తక్కువ పెట్టుబడి-శ్రమతో సేంద్రియ ఎరువుల్ని తయారు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అధిక పోషక విలువలు కలిగిన వర్మి కల్చర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. పనికిరాని సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని వానపాముల సాయంతో సారవంతమైన ఎరువుగా మార్చడాన్నే వర్మి కంపోస్ట్ అంటారు. వానపాములు సేంద్రియ వ్యర్థ పదార్థాల్ని ఆహారంగా తీసుకొని జీవిస్తూ, మట్టిని సారవంతం చేస్తాయి. వర్మి కంపోస్ట్ తయారీకి భూమి పైపొరల్లో సంచరించే వానపాములు అనువుగా ఉంటాయి. వర్మి బెడ్ అంటే... ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పద్ధతుల ద్వారా వర్మి కంపోస్ట్‌ను తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న పని. అయితే చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన వానపాముల ఎరువును సులభంగా తయారు చేసుకునే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పద్ధతి వారికో పెద్ద వరం. అదే పోర్టబుల్/మొబైల్ ‘వర్మి బెడ్’. దీనికి ఎక్కడికైనా తీసికెళ్లవచ్చు. మనకు అనువైన స్థలంలో, తేలికగా అమర్చుకోవచ్చు. మొబైల్ వర్మి బెడ్‌ను వ్యవసాయ శాఖ సబ్సిడీ మీద రైతులకు అందజేస్తోంది. 12 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు ఉండేలా వర్మి బెడ్‌ను తయారు చేస్తారు. ఇది దృఢంగా ఉంటుంది కాబట్టి చినిగిపోదు. ఎండ, వానల్ని తట్టుకుంటుంది. అన్ని వైపుల నుంచి లోపలికి గాలి తగులుతుంది. ఒక్కో వర్మి బెడ్ నుంచి 45-60 రోజుల్లో 1.5 టన్నుల కంపోస్ట్ తయారవుతుంది. వ్యవసాయాధికారుల సూచనల మేరకు వర్మి బెడ్లను అమర్చుకోవాలి. వర్మి కంపోస్ట్ తయారీకి పశువులు/జీవాల ఎరువు, కలుపు మొక్కలు, కూరగాయలు/పండ్ల వ్యర్థాలు, వివిధ పంటల వ్యర్థాలు అవసరమవుతాయి. అయితే ఇనుము, గాజు, రాయి, పాలిథిన్, సింథటిక్ వంటి వాటిని వాడకూడదు. ఏం చేయాలి? బెడ్ అడుగున ఎండుటాకులు, గడ్డి, చెత్తాచెదారం వంటి వ్యర్థాల్ని 15 సెంటీమీటర్ల మందాన వేయాలి. వాటి మీద బాగా కుళ్లిన పశువులు/జీవాల ఎరువును 15 సెంటీమీటర్ల మందంతో రెండో పొరగా వేసుకోవాలి. పశువుల మూత్రంలో పశువుల ఎరువు కలిపి, దానిని ఆ పొర మీద చల్లుకోవాలి. దానిని 2 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత ఒక చదరపు మీటరుకు వెయ్యి వానపాముల చొప్పున వదలాలి. వాటి పైన పాక్షికంగా కుళ్లిపోయిన సేంద్రియ పదార్థాల్ని 20 సెంటీమీటర్ల మందాన పరవాలి. బెడ్లో వానపాముల్ని వదిలిన తర్వాత ప్రతి రోజూ కొద్దికొద్దిగా నీరు చల్లుతూ ఉండాలి. బెడ్లో 30-40% తేమ ఉండాలి. తేమను కాపాడటానికి, పక్షుల దాడి నుంచి వానపాముల్ని రక్షించుకోవడానికి బెడ్ పైన పాత గోనె సంచులు/వరిగడ్డిని పరవాలి. 45-60 రోజుల్లో తయారయ్యే వర్మి కంపోస్ట్ నల్లగా, తేలికగా ఉంటుంది. ఎలాంటి చెడు వాసన రాదు. వానపాములు పైకి వస్తాయి. అప్పుడు బెడ్ పైన 3-4 రోజుల పాటు నీటిని చల్లితే వానపాములు తేమ కోసం బెడ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ విధంగా సంవత్సరానికి 5-6 సార్లు వర్మి కంపోస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందులో సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, రాగి, జింక్ వంటి పోషకాలు లభిస్తాయి. ఎలా వాడాలి? వరి నాట్లు వేసిన తర్వాత ఎకరానికి టన్ను వర్మి కంపోస్ట్ వేసుకోవాలి. పత్తి, మిరప, మొక్కజొన్న పసుపు పంటల్లో టన్ను, చెరకు, పొద్దుతిరుగుడు పంటల్లో 1.5 టన్నులు, బెండ, టమాటా, వంగ పైర్లలో 1-1.5 టన్నుల వర్మి కంపోస్ట్‌ను దుక్కిలో వేయాలి. మామిడి, కొబ్బరి, నిమ్మ, దానిమ్మ తోటల్లో చెట్లు నాటేటప్పుడు ఒక్కో చెట్టుకు 2 కిలోలు, 1-5 ఏళ్ల వయసున్న చెట్టుకు 5 కిలోలు, 6-9 ఏళ్ల వయసున్న చెట్టుకు 10 కిలోలు, పదేళ్ల పైబడిన చెట్టుకు 20 కిలోల చొప్పున వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు. ఉపయోగాలెన్నో... వర్మి కంపోస్ట్ నేలను గుల్లబరుస్తుంది. భూసారాన్ని పెంచుతుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరగడానికి దోహదపడుతుంది. వాటికి చీడపీడల్ని తట్టుకునే సామర్థ్యం చేకూరుతుంది. పంట దిగుబడి, నాణ్యత పెరుగుతాయి. నేలకు నీటిని పట్టి ఉంచే సామర్ధ్యం కూడా పెరుగుతుంది. వర్మి వాష్‌ను ఎలా వాడాలంటే... వర్మి బెడ్ నుంచి వర్మి వాష్ అనే ద్రవ పదార్థాన్ని కూడా సేకరించవచ్చు. దీనిని 4-5 లీటర్ల నీటిలో లీటరు కలిపి పంటపై పిచికారీ చేసుకోవచ్చు. లేదా లీటరు వర్మివాష్, లీటరు ఆవు మూత్రాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరుగుతాయి. చీడపీడల్ని తట్టుకునే సామర్ధ్యాన్ని పొందుతాయి. డాక్టర్ ఎన్.మల్లిఖార్జునరావు పోగ్రాం కో-ఆర్డినేటర్ ఎం.స్వాతి, రిసెర్చ్ అసోసియేట్ కృషి విజ్ఞాన కేంద్రం, వైరా, ఖమ్మం జిల్లా -
శుచి-శుభ్రతే ముఖ్యం.. ఏం చేయాలి?
రేపు జూనోసిస్ డే పాడి-పంట: మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు సంక్రమించే స్వభావం ఉన్న వ్యాధుల్ని జూనోటిక్ వ్యాధులు అంటారు. ఈ రకంగా సుమారు 200 వ్యాధులు సంక్రమిస్తాయని అంచనా. వీటి బారిన పడితే ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి వీటిపై ప్రజలకు సరైన అవగాహన ఉండడం మంచిది. 1885 జూలై 6న లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త తొలిసారిగా యాంటీ రేబిస్ టీకాను ఉపయోగించి, పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. అందుకే ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీని ‘జూనోసిస్ డే’గా పాటిస్తున్నారు. ఎలా వ్యాపిస్తాయి? గాలి, నీరు, ఆహారం, కలుషితమైన పశు ఉత్పత్తుల ద్వారా జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఇవి వైరస్, బాక్టీరియా, పరాన్నజీవుల ద్వారా కూడా వ్యాపించి మనుషుల ప్రాణాలు హరిస్తాయి. వైరస్ కారణంగా సంక్రమించే వ్యాధుల్లో అత్యంత ప్రాణాంతకమైనది రేబిస్. పిచ్చికుక్క కాటు వల్ల సోకే ఈ వ్యాధి కారణంగా ఏటా మన దేశంలో 20-30 వేల మంది చనిపోతున్నారు. అలాగే మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్) వ్యాధి కారణంగా ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. విచ్చలవిడిగా తిరిగే పందుల శరీరంపై దోమలు కాటేయడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇక బాక్టీరియా ద్వారా బ్రూసెల్లోసిస్, సాల్మోసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, దొమ్మ, గ్లాండర్స్ వ్యాధులు సంక్రమిస్తాయి. పరాన్నజీవుల కారణంగా అంకైలోస్టోమియాసిస్, హైడాటిడోసిస్, అలర్జీ, గజ్జి, అమీబియాసిస్, బాలాంటిడియాసిస్, టాక్సోప్లాస్మా వ్యాధులు సోకుతాయి. వీరికి జాగ్రత్తలు అవసరం కుక్కలతో సన్నిహితంగా మెలిగే వారికి రేబిస్, హైడాటిడోసిస్ వ్యాధులు వస్తాయి. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధం ఉండే పరిశ్రమల్లో పనిచేసే వారికి, కసాయి వారికి దొమ్మ వ్యాధి సోకుతుంది. డెయిరీ ఫారాల్లో పనిచేసే సిబ్బందికి, పశు వైద్యులకు బ్రూసెల్లోసిస్ రావచ్చు. కలుషితమైన పాలను ఉపయోగించే వారికి క్షయ, పౌల్ట్రీ ఫారాల్లో పనిచేసే వారికి సిట్టకోసిస్, ఎలుకలు ఎక్కువగా సంచరించే ధాన్యం గోదాముల్లో తిరిగే వారికి లెప్టోస్పైరోసిస్ సోకే ప్రమాదం ఉంది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు టీబీ, సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్ వంటి జూనోటిక్ వ్యాధులు త్వరగా సోకే అవకాశం ఉంది. కాబట్టి వీరందరూ ఆయా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యాధులు సోకుతాయి పశువుల కారణంగా మశూచి, బ్రూసెల్లోసిస్, దొమ్మ, టీబీ, రేబిస్, మ్యాడ్ కౌ, గాలికుంటు, పాశ్చరెల్లోసిస్ వ్యాధులు వ్యాపిస్తాయి. మేకల ద్వారా మశూచి, అస్పర్జిల్లస్, రింగ్వార్మ్, తలసేమియా, లిస్టిరియోసిస్ సోకుతాయి. గుర్రాల కారణంగా మెదడువాపు, దొమ్మ, టీబీ, బ్రూసెల్లోసిస్, రింగ్వార్మ్, గ్లాండర్స్ వ్యాధులు వస్తాయి. పందులు టీబీ, రేబిస్, బ్రూసెల్లోసిస్, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, ఇన్ఫ్లుయంజా వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కుక్కల ద్వారా రేబిస్, బ్రూసెల్లోసిస్, లిస్టిరియోసిస్, లెప్టోస్పైరోసిస్, హైడాటిడోసిస్, ప్లేగు, లైష్మేనియాసిస్ వ్యాధులు వస్తాయి. ఎలుకలు ప్లేగు, లెప్టోస్పైరోసిస్, మెదడువాపు, క్యూఫీవర్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. కోతుల కారణంగా డెంగ్యూ, అమీబియాసిస్, ఫైలేరియాసిస్, రేబిస్, సాల్మోనెల్లోసిస్, మీజిల్స్, కైసనూర్ ఫారెస్ట్ వ్యాధులు వస్తాయి. కుందేళ్ల ద్వారా తలసేమియా, గజ్జి, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, స్మాటిడ్ ఫీవర్ వ్యాధులు వస్తాయి. పక్షులు సాల్మోనెల్లోసిస్, లిస్టిరియోసిస్, టాక్సోఫ్లాస్మోసిస్, మెదడువాపు, ప్లేగు, సిట్టకోసిస్, అస్పర్జిల్లోసిస్ వ్యాధుల్ని వ్యాపింపజేస్తాయి. ఇప్పటికే పలు దేశాలు జూనోటిక్ వ్యాధుల నిర్మూలనకు నడుం బిగించాయి. ఆ దిశగా కొన్ని దేశాలు విజయం సాధించాయి కూడా. కాబట్టి జూనోటిక్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడానికి పశు సంవర్ధక, ఆరోగ్య, పంచాయితీ, మున్సిపల్ శాఖలు జూలై 6వ తేదీన (ఆదివారం) వివిధ కార్యక్రమాలు చేపట్టాలి. పల్స్‌పోలియో, హెపటైటిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులపై ప్రజలను చైతన్యపరుస్తున్న లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు రేబిస్ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. నివారణ ఇలా... మన దేశంలో సోకే జూనోటిక్ వ్యాధుల్లో అత్యంత భయంకరమైనది రేబిస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం 75% కంటే ఎక్కువ కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలు వేస్తే తప్ప ఈ వ్యాధిని నిర్మూలించలేము. కాబట్టి ప్రజలందరూ జూనోసిస్ డే రోజున పెంపుడు కుక్కలకు విధిగా టీకాలు వేయించాలి. టీకాలు వేయించని ఊరకుక్కల్ని నిర్మూలించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు, పశు వైద్యులు కూడా ముందు జాగ్రత్త చర్యగా టీకాలు వేయించుకోవడం మంచిది. పశువులు, కుక్కలకు క్రమం తప్పకుండా అంతర పరాన్నజీవుల నిర్మూలన మందుల్ని తాగిస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధుల్ని నివారించవచ్చు. పందుల్ని గ్రామానికి దూరంగా, పరిశుభ్రమైన వాతావరణంలో పోషిస్తే మెదడువాపు వ్యాధి బారి నుంచి రక్షణ పొందవచ్చు. శుచి, శుభ్రత పాటిస్తే జూనోటిక్ వ్యాధులు దరిచేరవు. పాలు, మాంసం, గుడ్లు మొదలైన పశు ఉత్పత్తుల్ని విధిగా ఉడికించి తీసుకోవాలి. పరిసరాలు, పశువుల పాకల్ని ఎప్పటికప్పుడు క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి. చనిపోయిన పశు కళేబరాలను లోతైన గోతిలో పాతిపెట్టాలి. -డాక్టర్ సిహెచ్.రమేష్ హైదరాబాద్ -
నారుమడిని నష్టపరిచే పురుగులివే
పెనుగొండ (పశ్చిమ గోదావరి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొంతమంది రైతులు ఇప్పటికే వరి నారుమడులు పోసుకున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నారు పోసుకుంటున్నారు. వరిలో మంచి దిగుబడులు సాధించాలంటే చీడపీడలు ఆశించని ఆరోగ్యవంతమైన నారును పెంచాల్సిన అవసరం ఉన్నదని పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ సీనియర్ కీటక శాస్త్రవేత్త డాక్టర్ కె.వసంతభాను, డెరైక్టర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధనరెడ్డి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి నారుమడిని ఆశించే హిస్పా, కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు పురుగుల నివారణకు వారు అందిస్తున్న సూచనలు... రైతులు ముందుగా తమ ప్రాంతానికి అనువైన, చీడపీడల్ని తట్టుకునే వంగడాల్ని ఎంపిక చేసుకోవాలి. తెగుళ్లు చాలా వరకు విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన పొలం నుంచే విత్తనాలను సేకరించాలి. లేదా విత్తనాలను విధిగా శుద్ధి చేయాలి. ఇందుకోసం లీటరు నీటిలో ఒక గ్రాము చొప్పున కార్బండజిమ్ కలిపి, ఆ మందు ద్రావణంలో కిలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టి, ఆ తర్వాత మండె కట్టాలి. నారుమడిని ప్రతి రోజూ గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముందుగా గడ్డిని ఆశ్రయించి... తొలకరిలో కురిసిన వర్షాలకు పొలం గట్ల పైన, పొలంలో గడ్డి బాగా పెరుగుతుంది. నారు పోయకముందే హిస్పా పురుగులు ఈ గడ్డిని ఆశ్రయిస్తాయి. ఆ తర్వాత నారుపై దాడి చేస్తాయి. హిస్పా అనేది నీలం, నలుపు రంగులతో కూడిన పెంకు పురుగు. దీని శరీరంపై ముళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. తల్లి పెంకు పురుగు కూడా నారుమడిని నష్టపరుస్తుంది. ఈ పురుగులు ఆశించడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు, తెల్లని నిలువు చారలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి. వర్షాలు ఆలస్యమైతే... తొలకరి వర్షాలు జూన్ మొదటి వారంలో పడి, నారుమడులు సకాలంలో పోసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు తాకిడి ఉండదు. అయితే ఇప్పుడు పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జూలై ప్రవేశించినా వరుణుడు కనికరించడం లేదు. ఒకవేళ ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ నారుమడిని కాండం తొలుచు పురుగు ఆశించే ప్రమాదం ఉంది. దీని రెక్కల పురుగులు పసుపు రంగులో ఉంటాయి. రెక్కల ముందు, రెక్కల మధ్యలో నల్లని మచ్చలు కన్పిస్తాయి. ఒక్కో పురుగు ఆకుల చివరి భాగంలో 20-70 గుడ్లను సముదాయాలుగా పెట్టి, వాటిని వెంట్రుకలతో కప్పుతుంది. ఈ గుడ్ల నుంచి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వచ్చి, మూడు రోజుల్లో కాండం లోపలికి చేరి కణజాలాన్ని తినేస్తాయి. దీనివల్ల మొవ్వు ఆకు ఎండి చనిపోతుంది. అంకురం వృద్ధి చెందదు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కోస్తాకు, తెలంగాణలోని అన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉల్లికోడు పురుగు ఇటీవలి కాలంలో ఇతర ప్రాంతాలకూ వ్యాప్తి చెందుతోంది. సాధారణంగా ఉల్లికోడు పురుగులు పిలక దశ తర్వాతే పంటపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తుంటాయి. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంట సాగు ఆలస్యమవుతుండడంతో ఈ పురుగు తాకిడి నారుమడి దశలోనే కన్పిస్తోంది. ఉల్లికోడు పురుగులు ముదురు ఎరుపు రంగులో దోమల మాదిరిగా ఉంటాయి. ఇవి ఆకులపై విడిగా కానీ లేదా 2-3 గుడ్లను కలిపి కానీ పెడతాయి. వీటి నుండి వారం రోజుల్లో పిల్ల పురుగులు బయటికి వస్తాయి. అవి అంకురం వద్దకు చేరి, అక్కడ ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. దీనివల్ల అంకురం ఆకుగా వృద్ధి చెందదు. అది పొడవాటి గొట్టంగా మారి, ఉల్లికోడు మాదిరిగా బయటికి వస్తుంది. ఇవి కూడా... నారుమడి పోసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే... ముఖ్యంగా మెట్ట నారుమడుల్ని తామర పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు ఆకుల చివర్ల నుండి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకు చివర్లు ఎండిపోతాయి. ఒకవేళ నారుమడి పోసిన తర్వాత వర్షాలు బాగా కురిసి మొక్కలు ముంపుకు గురైతే వాటిని నారును కత్తిరించే లద్దె పురుగులు ఆశిస్తాయి. ఇవి రాత్రి సమయంలో నారుమడిని ఆశించి, మొక్కల్ని కొరికేస్తాయి. పగటి వేళ కలుపు మొక్కల పైన, భూమిలోనూ ఉంటాయి. ఏం చేయాలి? నారు పోసిన ఏడవ రోజు నుంచే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్/ప్రొఫెనోఫాస్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకుంటే నారు తీయడానికి వారం రోజుల ముందు 160 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3జీ లేదా 50 గ్రాముల ఫోరేట్ 10జీ గుళికల్ని ఇసుకలో కలిపి సెంటు నారుమడిలో చల్లుకోవాలి. ఆ సమయంలో నారుమడిలో నీరు పలచగా ఉండాలి. నారుమడిని లద్దె పురుగు ఆశిస్తే పైన తెలిపిన మందుల్ని సాయంత్రం వేళ పిచికారీ చేసుకోవాలి. -
ఈ పురుగుతో జాగ్రత్త సుమీ!
అనకాపల్లి (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. అయితే నిన్న మొన్నటి వరకు అనేక చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. వడగాలులు వీస్తూనే ఉన్నాయి. వాతావరణంలో చోటుచేసుకునే ఇలాంటి మార్పులు పంటలపై ప్రభావం చూపడం సహజమే అయినప్పటికీ దీర్ఘకాలిక పంటలపై ఆ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరిలో నీటి వసతి కింద వేసిన చెరకు పంటలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ పురుగు నివారణకు రైతులు ఎప్పటికప్పుడు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త (చెరకు) డాక్టర్ ఎం.భరతలక్ష్మి. ఆ వివరాలు... బెడద పెరుగుతోంది చెరకు పంటను సుమారు 100 రకాల కీటకాలు ఆశిస్తున్నప్పటికీ కొన్ని మాత్రమే అధిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది పీక/కాండం తొలుచు పురుగు. ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల కారణంగా ఈ పురుగుల తాకిడి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఈ పురుగుపై రైతులు సరైన అవగాహన ఏర్పరచుకుని, సమగ్ర చర్యల ద్వారా వాటిని నివారించగలిగితే దిగుబడి, రస నాణ్యతలో ఏర్పడే నష్టాన్ని కొంతవరకైనా తగ్గించుకోవచ్చు. పైరు తొలి దశలో ఉన్నప్పుడు దీనిని పీక పురుగు అంటారు. పైరు కణుపులు వేసిన తర్వాత ఆశిస్తే దానిని కాండం తొలుచు పురుగు అంటారు. గత 3-4 సంవత్సరాలుగా ఈ పురుగు జూలై నుంచి చెరకు పైరుపై దాడి చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఎలా నష్టపరుస్తుంది? తల్లి పురుగు 3-4 రోజుల పాటు జీవిస్తుంది. ఒక్కో పురుగు ఆకుల అడుగు భాగాన, మధ్య ఈనెకు సమాంతరంగా, 2-3 వరుసల్లో 400కు పైగా తెల్లని గుడ్లు పెడుతుంది. ఈ గుడ్ల నుంచి బయటికి వచ్చే పిల్ల పురుగులు ఐదారు రోజుల్లో ఆకులు, ఆకు తొడిమల్ని ఆశిస్తాయి. వాటిపై ఉండే పచ్చని పదార్థాన్ని గోకి తింటాయి. ఆ తర్వాత అవి క్రమేపీ లేత కణుపుల్లోకి చొచ్చుకుపోయి లోపలి పదార్థాన్ని తినేస్తాయి. దీనివల్ల కణుపులపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు ఆశించిన కణుపులు గట్టిపడి, లోపలి కణజాలం ఎర్రబడుతుంది. గొంగళి పురుగులు కింది భాగం నుండి పై భాగం వరకు గడను తొలుచుకుంటూ పోవడం వల్ల మొవ్వులు ఎండిపోతాయి. గొంగళి పురుగులు కోశస్థ దశలోకి ప్రవేశించే ముందు కాండం నుంచి బయటికి వస్తాయి. అవి ఆకు తొడిమల దగ్గర కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత 7-10 రోజుల్లో రెక్కల పురుగులు బయటికి వస్తాయి. పురుగు ఆశించిన చెరకు తోటలో దిగుబడి, రసంలో పంచదార శాతం తగ్గిపోతాయి. ఏం చేయాలి? పీక/కాండం తొలుచు పురుగుల నివారణకు సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తన ముచ్చెలు సేకరించాలి. నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదులో, సకాలంలో వాడాలి. సమయం దాటితే నత్రజనిని వాడకూడదు. ఆలస్యంగా వచ్చిన పిలకల్ని (వాటర్ షూట్స్) తీసేయాలి. ఈదురుగాలులకు పడిపోకుండా మొక్కలకు జడచుట్లు వేసి నిలగట్టాలి. తోటలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మురుగు నీటిని ఎప్పటికప్పుడు బయటికి పంపాలి. చెరకు తోటలో కాండం తొలుచు పురుగుల్ని నిర్మూలించడానికి ఎకరానికి 10 చొప్పున లింగాకర్షక బుట్టల్ని అమర్చాలి. పైరు 120 రోజుల దశలో ఉన్నప్పటి నుంచి వాటిని గాలి వీచే దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 30 రోజులకు ఒకసారి వాటిలోని ఎరల్ని మార్చాలి. గడల కింది ఆకుల్ని రెలవాలి. ఆ తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ చొప్పున కలిపి 15 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. లేకుంటే ఎకరానికి 20 వేల చొప్పున ట్రైకోగామా ఖిలోనిస్ గుడ్ల పరాన్నజీవుల్ని తోటలో వదలాలి. పైరు 120 రోజుల దశకు చేరుకున్నప్పటి నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున ఆరుసార్లు వీటిని తోటలో వదలాల్సి ఉంటుంది. -
నట్టలతో జీవాలకు ఎంతో నష్టం
పాడి-పంట: గొర్రె లేదా మేక శరీరంపై దాడి చేసే అంతర పరాన్నజీవుల్లో ఏలిక పాములు, బద్దె పురుగులు, జలగలు ప్రధానమైనవి. వీటివల్ల జీవాలకు పోషకాలు సరిగా అందక నీరసించి బక్కచిక్కిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటికీ సుమారు 95% జీవాలను విస్తృత లేదా సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నారు. ఈ పద్ధతిలో జీవాలను బయళ్లు, అడవుల్లో తిప్పుతూ మేపుతుంటారు. అలా ఆరుబయట మేసే జీవాలకు తరచుగా ఎదురవుతున్న ప్రధాన సమస్య నట్టల తాకిడి. ఇవి ఆశించడం సహజమే అయినప్పటికీ జీవాల శరీరంలో వాటి సంఖ్య ఎక్కువైతే అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. వీటివల్ల జీవాల పెంపకందారులు తమ ఆదాయంలో 30% వరకు కోల్పోవాల్సి వస్తోంది. ఎంత మేపినా జీవాలు బలం పుంజుకోవడం లేదని పెంపకందారులు కలవరపడుతుంటారు. ‘బలం’ మందు పేరుతో నట్టల నివారణ మందును తాగిస్తూ సమస్యను తాత్కాలికంగా అధిగమిస్తుంటారు. వీటివల్లే నష్టం ఎక్కువ తీగ పురుగులు, పేగు పురుగులు, నల్ల పారుడు పురుగులు, కొరడా పురుగులు... ఇవన్నీ ఏలిక పాములు. జలగల్లో పొట్టి జలగలు, కార్జ్యపు జలగలు, రక్తపు జలగలు అనే రకాలు ఉంటాయి. వీటితో పాటు బద్దె పురుగులు కూడా జీవాలను ఆశించి వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. ఏం జరుగుతుంది? జీవాల కాలేయం, ఊపిరితిత్తులు, ప్రేవులు, జీర్ణాశయం, ఇతర అంతర్గత అవయవాల్లో నట్టలు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇవి గొర్రెలు, మేకల్లోని పోషకాలను, రక్తాన్ని హరిస్తాయి. దీంతో జీవాలు రక్తహీనతకు గురవుతాయి. గొర్రెలు బరువు పెరగవు. ఎంత మేపినా చిక్కిపోతుంటాయి. మేత తినవు. పొట్ట లావుగా ఉంటుంది. దవడ కింద నీరు చేరుతుంది. విరేచనాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో అజీర్ణం, అధిక దాహం, ముక్కు-నోటి నుంచి రక్తం కారడం, కడుపుబ్బరం, దగ్గు వంటి లక్షణాలు కూడా కన్పిస్తాయి. సాయంత్రం వేళ దవడ కింది భాగం వాస్తుంది. ఉదయానికి తగ్గిపోతుంది. ఎలా నివారించాలి? నట్టల నివారణకు మందుల వాడకం (డీవార్మింగ్) తప్పనిసరి. సంవత్సరానికి 3-4 సార్లు ఈ మందుల్ని క్రమపద్ధతిలో తాగిస్తే నట్టల్ని సమర్ధవంతంగా నిర్మూలించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో, వర్షాకాలం మధ్యలో, వర్షాకాలం తర్వాత... ఈ మందుల్ని తాగించడం మంచిది. మందులు తాగించడానికి ముందు జీవాల పేడను పరీక్ష చేయించాలి. దీనివల్ల గొర్రె లేదా మేకను ఏ రకం నట్టలు ఆశించాయో తెలుస్తుంది. అప్పుడు ఆ నట్టలపై ప్రభావం చూపే మందుల్ని వాడాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకానీ సహచరులు వాడే మందునో లేదా మందుల షాపు వారు ఇచ్చిన దానినో లేదా పక్క గ్రామంలోని మందలకు వాడుతున్న మందునో తెచ్చి వినియోగించడం వల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు. సాధారణంగా ఏలిక పాముల నిర్మూలనకు ఫెన్బెండజోల్, లెవిమిసోల్, టెట్రామిసోల్ మందుల్ని వాడతారు. క్లొసంటాల్, ఆక్సిక్లొజనైడ్ మందులు జలగల్ని నిర్మూలిస్తాయి. బద్దె పురుగుల భరతం పట్టడానికి నిక్లోజమైడ్ వంటి మందుల్ని వాడాలి. ప్రయోజనాలెన్నో... జీవాలకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందును ఇస్తే మంద వేగంగా వృద్ధి చెందుతుంది. పెంపకందారులు మంచి ఆదాయం పొందుతారు. ఈ మందుల వల్ల జీవాలు ఆరోగ్యంగా, బలంగా, చురుకుగా ఉంటాయి. వాటిలో వ్యాధి నిరోధక శక్తి అధికమవుతుంది. పాలు, మాంసం, ఉన్ని దిగుబడి పెరుగుతుంది. వాటి నాణ్యత కూడా బాగుంటుంది. జీవాల బరువు సగటున 2-3 కిలోల చొప్పున పెరుగుతుంది. తద్వారా వాటి నుంచి మంచి రాబడి వస్తుంది. జీవాలు త్వరగా ఎదకు వచ్చి ఈనతాయి. ఎక్కువ సంఖ్యలో పిల్లలు పుడతాయి. వాటి బరువు కూడా అధికంగానే ఉంటుంది. గొర్రె పిల్లల్లో, పెద్ద జీవాల్లో మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ఈ జాగ్రత్తలు అవసరం జీవాల శరీర బరువును దృష్టిలో పెట్టుకొని, తగు మోతాదులో నట్టల నివారణ మందును తాగించాలి. మేకల్లో కంటే గొర్రెల్లో పరాన్నజీవుల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గొర్రెలకు ఓ క్రమ పద్ధతిలో మందు తాగించాలి. గ్రామంలోని గొర్రెలన్నింటికీ ఒకేసారి సామూహికంగా మందును తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది. పెంపకందారులు తాము వినియోగించిన మందు పేరును రాసిపెట్టుకోవాలి. వైద్యుని సిఫార్సు మేరకే మందు వాడాలి కానీ విచక్షణారహితంగా వినియోగించకూడదు. అవసరం లేకపోయినా మందు తాగించినప్పుడు, తగిన మందును ఎంపిక చేయలేనప్పుడు అది సరిగా ప్రభావం చూపదు. కాబట్టి వైద్యుని సూచన మేరకు తగిన మందును ఎంపిక చేసుకోవాలి. - డాక్టర్ సిహెచ్.రమేష్, హైదరాబాద్ ‘డీవార్మింగ్’ను మరవద్దు జీవాల పెంపకందారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గొర్రెలు, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం తెలంగాణలో ఈ నెల 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జీవాలకు ఉచితంగా, సామూహికంగా మందులు వేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జూలై 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మందులు అందిస్తారు. రెండు రాష్ట్రాలలోని జీవాల పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ జీవాలకు మందులు వేయించి, అంతర పరాన్నజీవుల బారి నుంచి వాటిని రక్షించుకోవాలి. -
పాడి-పంట: వేరుశనగ సాగు ఇలా...
కడప (అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రా ష్ట్రాల్లో ఇప్పటికీ నైరుతి రుతుపవనాల ప్రభావం కన్పించడం లేదు. వరుణుడు ముఖం చాటేస్తున్నాడు. తొలకరి జల్లులు ఎప్పుడు పడతాయా అని రైతులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఎం దుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనూ తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతులు తమ పొలాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. ఈ పంటను తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు. కోస్తాలో సాగు విస్తీర్ణం తక్కువగానే ఉంటోంది. విత్తనాలు వేసింది మొదలు పంట నూర్పిడి వరకు ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగులో చేపట్టాల్సిన యాజమాన్య చర్యలపై వైఎస్సార్ జిల్లా ఊటుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ అందిస్తున్న సూచనలు... ఎప్పుడు వేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు జూలై నెల వరకు వేరుశనగ విత్తనాలు వేసుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఆలస్యంగా కురిసినట్లయితే దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలోనూ ఆగస్ట్ 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. విత్తన మోతాదు-శుద్ధి వేరుశనగ సాగుకు ఏ రకాన్ని ఎంచుకున్నప్పటికీ లావు గింజ రకాలైతే ఎకరానికి 60 కిలోలు, మధ్యస్థ గింజ రకాలైతే 50 కిలోల చొప్పున విత్తనాలు అవసరమవుతాయి. పంటకాలంలో పైరును ఆశించి నష్టపరిచే చీడపీడల నివారణకు విత్తనశుద్ధి తప్పనిసరి. కిలో విత్తనాలకు 4.8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడె లేదా 3 గ్రాముల మాంకోజెబ్ లేదా ఒక గ్రాము టెబుకొనజోల్ (2% డీఎస్) లేదా ఒక గ్రాము కార్బండజిమ్ (50% డబ్ల్యూపీ) చొప్పున పట్టించి విత్తుకోవాలి. వేరు పురుగు ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 6.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ (20% ఈసీ) కలపాలి. కాండంకుళ్లు తెగులు, వెర్రి తెగులు తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కిలో విత్తనాలకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ (17.8% ఈసీ) పట్టించాలి. విత్తనశుద్ధి చేసేటప్పుడు ముందుగా పురుగు మందును కలపాలి. ఆ తర్వాత విత్తనాల్ని ఆరబెట్టి, శిలీంద్ర నాశక మందుల్ని పట్టించాలి. అవసరమైతే రైజోబియం కల్చర్‌ను కూడా కలపవచ్చు. ఎలా విత్తాలి? కే-6, నారాయణి, ధరణి వంటి గుత్తి రకాలు వేసుకునే వారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలి. ఐసీజీయస్-14, 44 వంటి తీగ/పెద్ద గుత్తి రకాలు వేసే వారు వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాల్ని గొర్రుతో లేదా నాగలి సాళ్లలో వేసుకోవాలి. ఆ సమయంలో భూమిలో తగినంత తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు మించకుండా వేసుకోవాలి. ఎరువుల యాజమాన్యం ఆఖరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల బాగా కుళ్లిన పశువుల ఎరువు, 16 కిలోల భాస్వరం (100 కి లోల సూపర్ ఫాస్ఫేట్), 8 కిలోల నత్రజని (18 కిలోల యూరియా), 20 కిలోల పొటాష్ (33 కి లోల మ్యురేట్ ఆఫ్ పొటాష్) వేసుకోవాలి. పూత దశలో లేదా కలుపు తీసే ముందు ఎకరానికి 200 కిలోల జిప్సం వేసుకుంటే కాయల సైజు బాగుంటుంది. నాణ్యమైన గింజలు వస్తాయి. సూక్ష్మ ధాతువులు లోపిస్తే... వేరుశనగ పైరులో సూక్ష్మ ధాతువులు... ము ఖ్యంగా జింక్, ఇనుము... లోపించే అవకాశం ఉంది. జింక్ లోపిస్తే ఆకులు చిన్నవిగా మారి, గు బురుగా కన్పిస్తాయి. మొక్కలు గిడసబారతాయి. ఆకు ఈనెల మధ్య భాగం పసుపు రం గుకు మారే అవకాశం ఉంది. ఇక ఇనుము లోపి స్తే లేత ఆకులు ముందుగా పసుపు రంగుకు, ఆ తర్వాత తెలుపు రంగుకు మారతాయి. భూమిలో జింక్ ధాతు లోపం ఉన్నట్లయితే 3 పంటలకు ఒకసారి ఎకరానికి 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేయాలి. లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఇనుప ధాతు లోప నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది + ఒక గ్రాము నిమ్మ ఉప్పు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు నివారణ ఎలా? చేలో కలుపు మొక్కలు మొలవక ముందే... అంటే విత్తనాలు వేసిన వెంటనే లేదా 3 రోజుల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% లేదా లీటరు అలాక్లోర్ లేదా 1.25-1.5 లీటర్ల బుటాక్లోర్ కలిపి నేలపై పిచికారీ చేయాలి. చేలో గడ్డి జాతి కలుపు మొక్కలు కన్పిస్తే విత్తనాలు వేసిన 21 రోజుల లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 400 మిల్లీలీటర్ల క్విజలాఫాప్ ఇథైల్ కలిపి కలుపు మొక్కలపై మాత్రమే పడేలా సాళ్ల మధ్యలో పిచికారీ చేయాలి. కలుపు మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు ఈ మందును పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేరుశనగ పైరును వేరు పురుగు, పేనుబంక, తామర పురుగు, పచ్చదోమ, ఆకుముడత పురుగు, ఎర్ర గొంగళి పురుగు, శనగపచ్చ పురుగు, లద్దె పురుగు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు సకాలంలో సిఫార్సు చేసిన మోతాదులో మందులు పిచికారీ చేసుకోవాలి. -
సమగ్ర చర్యలే మందు!
పాడి-పంట: వివిధ రకాల పండ్ల తోటలపై బాక్టీరియా తెగుళ్లు దాడి చేస్తుంటాయి. వీటి కారణంగా పంటకు తీవ్రమైన నష్టం జరుగుతోంది. రైతులు ఆర్థిక ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి పండ్ల తోటల రైతులు బాక్టీరియా తెగుళ్లపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని, వాటిని సకాలంలో గుర్తించాలి. సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నివారించాలి. అప్పుడే నాణ్యమైన దిగుబడులు, మంచి ఆదాయం లభిస్తాయి. అరటిలో... పెద్ద పచ్చ అరటి, పొట్టి పచ్చ అరటి, తెల్ల చక్కెరకేళి రకాలకు బాక్టీరియా దుంపకుళ్లు తెగులు ఎక్కువగా సోకుతుంది. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్లయితే తెగులు ఉధృతి అధికమవుతుంది. చిన్న మొక్కలతో పాటు పెద్ద మొక్కల్ని కూడా ఈ తెగులు నష్టపరుస్తుంది. ముందుగా కాండం మొదలులో భూమికి దగ్గరగా... అంటే కాండం, దుంప కలిసే భాగంలో... కుళ్లు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత దుంప క్రమేపీ కుళ్లిపోతుంది. కొత్తగా నాటిన పిలకలకు తెగులు సోకితే మొవ్వు ఆకు కూడా కుళ్లి, మొక్క చనిపోతుంది. పెద్ద మొక్కల్లో కాండం మీద నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి. దుంప పైభాగం నుంచి కుళ్లిన వాసన వస్తుంది. కింది వరుస ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. చివరికి ఆకులన్నీ ఎండిపోయి, మొక్క చనిపోతుంది. మొక్కల పిలకలకు కూడా తెగులు సోకే అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు వేసవిలో తోటకు సరిపడా నీరు అందించాలి. ఆరోగ్యంగా ఉన్న తోటల నుంచి మాత్రమే పిలకల్ని సేకరించి నాటాలి. పిలకల్ని మందు ద్రావణంలో (కాపర్ ఆక్సీక్లోరైడ్+మోనోక్రొటోఫాస్) ముంచి ఆరబెట్టి, ఆ తర్వాతే నాటాలి. వరి, చెరకు వంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవడం ద్వారా తెగులును నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కల్ని దుంపలతో సహా తీసేసి, తోట బయట చిన్న చిన్న ముక్కలుగా నరికి, ఎండుగడ్డి వేసి తగలబెట్టాలి. మొక్కలు తీసేసిన చోట, ఆ చుట్టుపక్కల ఉన్న ఆరోగ్యవంతమైన మొక్కల మొదళ్ల వద్ద బ్లీచింగ్ పొడి ద్రావణాన్ని (లీటరు నీటికి 25 గ్రాముల చొప్పున కలపాలి) మట్టి బాగా తడిసేలా పోయాలి. నిమ్మలో... నిమ్మ తోటల్ని బాక్టీరియా గజ్జి తెగులు ఎక్కువగా నష్టపరుస్తుంది. తెగులు సోకిన తోటల్లో లేత ఆకులు, చిన్న-పెద్ద కొమ్మలు, కాయలు, కాండం మీద మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే చెట్లు ఎండిపోతాయి. తెగులు సోకిన చెట్ల మీద ఎండుపుల్లలు ఎక్కువగా కన్పిస్తాయి. ఈ తెగులును ‘బాలాజీ’ రకం బాగా తట్టుకుంటుంది కాబట్టి దానిని సాగు చేయడం మంచిది. తోటలో తెగులు సోకిన కొమ్మల్ని కత్తిరించాలి. ఆ తర్వాత 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్+ఒక గ్రాము స్ట్రెప్టోసైక్లిన్ చొప్పున కలిపి వర్షాకాలంలో 20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలి. చెట్టు మొదలు పైన, పెద్ద కొమ్మల పైన తెగులు లక్షణాలు కన్పిస్తే బెరడును కత్తితో గోకి బోర్డో పేస్టు పూయాలి. దానిమ్మలో... దానిమ్మ తోటలకు సోకే తెగుళ్లలో బాక్టీరియా మచ్చ తెగులు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ తెగులు జూలై-అక్టోబర్ నెలల మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 27 నుంచి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉన్నప్పుడు, గాలిలో తేమ 70 శాతానికి పైగా ఉన్నప్పుడు దాడి చేస్తుంది. అంతేకాదు... వేసవిలో కురిసే అకాల వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పులు కూడా తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. తెగులు సోకిన చెట్లకు అంటుకడితే నర్సరీ దశలోనే తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన తోటల్లో ఆకులు, కొమ్మలు, పిందెల పైన ముందుగా నీటి మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత అవి క్రమేపీ పెద్దవై ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. దీంతో ఆకులు రాలిపోతాయి. కొమ్మలు కణుపుల వద్ద విరుగుతాయి. కాయల పైన ఏర్పడిన మచ్చలు నలుపు రంగుకు మారతాయి. కాయలపై ఇంగ్లీషు ‘వై’ లేదా ‘యల్’ ఆకారంలో పగుళ్లు కన్పిస్తాయి. బాక్టీరియా మచ్చ తెగులును నివారించాలంటే ఆరోగ్యవంతమైన అంటు మొక్కలు నాటాలి. తెగులు సోకిన కొమ్మల భాగాల్ని అంగుళం కింది వరకూ కత్తిరించి, తోట బయట కాల్చేయాలి. కత్తిరింపులకు ముందు కత్తెర్లను 1% సోడియం హైఫోక్లోరైడ్ ద్రావణంలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. కత్తిరింపులు పూర్తయిన వెంటనే మొక్కలపై 1% బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. రసాయన ఎరువుల్ని సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. వాటితో పాటు జింక్, బోరాన్, ఇనుము వంటి సూక్ష్మ ధాతువుల్ని కూడా అందిస్తే చెట్లకు తెగుళ్లను తట్టుకునే సామర్ధ్యం చేకూరుతుంది. తెగులు సోకిన కాయల్ని ఎప్పటికప్పుడు తీసేయాలి. తెగులు లక్షణాలు కన్పించిన వెంటనే లీటరు నీటికి 200 మిల్లీగ్రాముల స్ట్రెప్టోసైక్లిన్+3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. - డాక్టర్ ఎం.రాజా నాయక్, శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, విజయరాయి పశ్చిమ గోదావరి జిల్లా -
రకాల ఎంపికే కీలకం
పాడి-పంట: కడప (అగ్రికల్చర్): మరో నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్ని తొలకరి జల్లులు పలకరించబోతున్నాయి. వర్షాలు పడిన వెంటనే రైతులు పొలాల్లో వేరుశనగ విత్తనాలు వేసుకుంటారు. రకాన్ని బట్టి ఎకరానికి 50-60 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. మేలైన రకాల్ని ఎంపిక చేసుకొని, పంటకాలంలో తగిన యాజమాన్య-సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే అధిక, నాణ్యమైన దిగుబడులు పొందవచ్చునని ఊటుకూరులోని వైఎస్సార్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భాస్కర పద్మోదయ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేరుశనగ సాగుకు అనువైన రకాలు, వాటి ప్రత్యేకతలపై ఆయన అందిస్తున్న వివరాలు... అనువైన ‘తిరుపతి’ రకాలు తిరుపతి-1 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 7.2-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. బెట్ట పరిస్థితుల్ని తట్టుకుంటుంది. ఇది కోస్తా ప్రాంతంలోని ఇసుక భూములకు అనువైనది. తిరుపతి-2 రకం పంటకాలం 105 రోజులు. ఎకరానికి 6.4-8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఊడలు గట్టిగా ఉంటాయి. ఇది తేలికపాటి బంక నేలలకు అనువైన రకం. నులి పురుగును కొంత వరకు తట్టుకుంటుంది. తిరుపతి-4 రకం 105 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి అందిస్తుంది. వర్షాభావ పరిస్థితుల్ని కొంత వరకు తట్టుకోగలదు. ఈ ‘కదిరి’ రకాలు వేసుకోవచ్చు కదిరి-6 రకం పంటకాలం 100 రోజులు. కదిరి-9 రకం పంటకాలం 105-110 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ఆలస్యం గా వర్షాలు కురిసే ప్రాంతాలతో పాటు అధిక వర్షాలు కురిసే ప్రాంతాలకూ అనువైన చిన్న గుత్తి రకం. విత్తనాలకు 30 రోజుల నిద్రావస్థ ఉంటుంది. ఈ రకం రసం పీల్చే పురుగుల్ని తట్టుకోగలదు. కదిరి-8 (బోల్డ్-లావు కాయలు) పంటకాలం 120-125 రోజులు. వర్షాలు బాగా కురిసే ప్రాంతాల్లోనూ, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లోనూ వేసుకోవచ్చు. ఈ రకం ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. కదిరి-7 (బోల్డ్) రకం పంటకాలం 110 - 120 రోజులు. ఆకుమచ్చ తెగులును తట్టుకుం టుంది. అయితే ఇది ఎక్కువ వర్షపాతం కురిసే ప్రాంతాలకు అనువైన రకం కాదు. కదిరి హరి తాంధ్ర రకం పంటకాలం 105-110 రోజులు. బెట్ట పరిస్థితులతో పాటు తామర పురుగుల్ని, ఆ కుమచ్చ తెగులును తట్టుకుంటుంది. పైరు పక్వ దశకు వచ్చే వరకు ఆకుపచ్చగా ఉండి, ఎక్కువ పశుగ్రాసాన్ని అందిస్తుంది. కదిరి రకాలన్నీ ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తాయి. ‘ఐసీజీవీ’ రకాల్లో అనువైనవి ఐసీజీవీ-91114 రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8.2 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తొందరగా నూర్పిడికి వస్తుంది. పంట మధ్యలో, చివర్లో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకుంటుంది. ఐసీజీవీ-00350 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. బెట్ట పరిస్థితుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అనువైన జేసీజీ-జేఎల్-టీయంవీ రకాలు జేసీజీ-88 రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. జేఎల్-24 రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. మంచి వర్షపాతం, నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. గింజలు పెద్దవిగా ఉంటాయి. ఇది అన్ని ప్రాంతాలకూ అనువైనది. టీఎంవీ-2 రకం పంటకాలం 90-110 రోజులు. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది కూడా అన్ని ప్రాంతాలకూ అనువైనది. ఈ మూడూ చిన్న గుత్తి రకాలే. ఈ రకాలూ వేసుకోవచ్చు నారాయణి రకం పంటకాలం 100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొక్కలో అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయి. గింజ లేత ఎరుపు రంగులో ఉంటుంది. అభయ రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 9 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఈ పొట్టి రకం బెట్టను తట్టుకుంటుంది. దీని నీటి వినియోగ సామర్ధ్యం ఎక్కువ. దీనిలో మూడు గింజల కాయలు ఎక్కువగా ఉంటాయి. ఈ రకం తిక్కా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రసూన రకం 105-110 రోజుల్లో కోతకు వస్తుంది. ఎకరానికి 14-16 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కాళహస్తి తెగులును కొంత వరకు తట్టుకోగలదు. అనంత రకం పంటకాలం 105-110 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. కోస్తాలోని ఇసుక నేలలకు కూడా అనువైనది. ఈ చిన్న గుత్తి రకం బెట్ట పరిస్థితులతో పాటు రసం పీల్చే పురుగుల్ని, ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. రోహిణి రకం పంటకాలం 95-100 రోజులు. ఎకరానికి 8-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. తగినన్ని వర్షాలు కురిసే ప్రాంతాలకు, నీటి పారుదల సౌకర్యం ఉన్న భూములకు అనువుగా ఉంటుంది. భీమ రకం పంటకాలం 110-120 రోజులు. ఎకరానికి 10-12 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. గింజలు లావుగా ఉంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాలకు అనువుగా ఉంటుంది. ధరణి రకం పంటకాలం 100-105 రోజులు. ఎకరానికి 6-10 క్వింటాళ్ల దిగుబడి ఇస్తుంది. ఇది చిన్న గుత్తి రకం. బెట్టను తట్టుకోగలదు. వేరుశనగ రకాలకు సంబంధించిన అదనపు సమాచారం కోసం తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్ : 0877-2248739) లేదా అనంతపురం జిల్లా కదిరిలోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని (ఫోన్: 08494-221180) ఆయా ఫోన్ నెంబర్లలో కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు. -
పాడి-పంట: జల్లుల్లో జీవాలు జర భద్రం!
వర్షాకాలం రాబోతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ఈ వర్షాలకు బయళ్లలో పచ్చిగడ్డి మొలుస్తుంది. వర్షపు జల్లులు పడుతున్నప్పుడు జీవాల పాకల్లోనూ, వాటి పరిసరాల్లోనూ రొచ్చు చేరుతుంది. చెరువులు, కుంటల్లోని నీరు కలుషితమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జోరీగలు, దోమలు విజృంభిస్తాయి. ఈదురు గాలులు, వర్షపు జల్లుల్లో ఆరుబయట తిరిగే మందల్లోని జీవాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. బురద నేలల్లో తిరిగే జీవాల కాలిగిట్టలు మెత్తబడతాయి. మరోవైపు వ్యాధులతో చనిపోయిన గొర్రెలు, మేకల్ని రోడ్డు పక్కన, బొందల్లో, పాడుబడిన బావుల్లో, నీటి ప్రవాహాల్లో పడేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభంలో, మధ్యలో ఇలాంటి పరిస్థితుల్ని మనం అన్ని చోట్లా చూస్తూనే ఉంటాం. కొత్త పచ్చికను మేస్తే... వేసవిలో మేత దొరక్క, అర్థాకలితో అలమటించిన జీవాలు... వర్షాకాలం ప్రారంభంలో ఆరుబయట బీళ్లలో ఇపుడిపుడే మొలకెత్తుతున్న పచ్చికను చూడగానే ఆత్రంగా, కడుపు నిండా తింటాయి. అలాగే వేసవి దాహంతో అల్లాడిపోయిన గొర్రెలు, మేకలు వర్షాకాలంలో దారి పక్కన గుంతలు, కుంటలు, చెరువుల్లో కలుషితమైన నీటిని చూడగానే గబగబా తాగేస్తుంటాయి. ఇవన్నీ సహజమే అయినప్పటికీ జీవాల ఆరోగ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి. కొత్తగా పెరిగిన పచ్చికను అతిగా మేయడం వల్ల జీవాల శరీరంలో విష పదార్థాలు విడుదలవుతాయి. ఫలితంగా జీవాలు ‘చిటుక’ వ్యాధికి గురవుతాయి. చిటుక వేసేంత సమయంలోనే చనిపోతాయి. ఈ వ్యాధులూ రావచ్చు వర్షాకాలంలో దోమలు, పిడుదులు, జోరీగలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అవి కుట్టిన గొర్రెలకు ‘నీలి నాలుక’ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన జీవాల మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక, ముఖం వాచి ఎర్రబడతాయి. నాలుక నీలి రంగుకు మారుతుంది. కొన్ని జీవాలు ‘సర్రా’ వ్యాధి బారిన కూడా పడతాయి. జీవాలు బురద నేలల్లో తిరిగితే వాటి గిట్టల మధ్య చర్మం మెత్తబడి వాచి చిట్లుతుంది. ఆ భాగంలో చీము పడుతుంది. జీవాలు విపరీతమైన నెప్పితో ముందు కాళ్లపై గెంతుతూ నడుస్తాయి. మేత తినవు. అలాగే అక్కడక్కడ జీవాలకు ‘దొమ్మ’ వ్యాధి కూడా సోకవచ్చు. ఈ వ్యాధి సోకిన జీవాలు అకస్మాత్తుగా చనిపోయే ప్రమాదం ఉంది. వర్షపు జల్లుల్లో ఎక్కువ సమయం తిరిగే జీవాలు న్యుమోనియా, గొంతువాపు వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతాయి. చెరువులు, కుంటల్లో నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల, నత్తలు ఉండే ప్రాంతాల్లో మేయడం వల్ల జీవాలకు ‘జలగ’ వ్యాధి వంటి అంతర పరాన్నజీవుల సమస్యలూ వస్తాయి. ఏం చేయాలి? చిటుక, గొంతువాపు వంటి వ్యాధులు సోకకుండా ముందుగానే టీకాలు వేయించాలి. బాహ్య పరాన్నజీవుల నిర్మూలనకు బ్యూటాక్స్ వంటి మందుల్ని పిచికారీ చేయాలి. దీనివల్ల నీలి నాలుక, సర్రా వంటి వ్యాధుల్ని నివారించవచ్చు. వర్షాకాలం ప్రారంభంలో పేడ పరీక్ష చేయించి, దాని ఫలితాలను బట్టి నట్టల నివారణ మందుల్ని తాగిస్తే జలగ వ్యాధి సోకదు. కొత్తగా మొలిచిన గడ్డిని జీవాలకు అతిగా మేపకూడదు. ఇంటి దగ్గరే తగినంత తాగునీటిని అందిస్తే జీవాలు ఆరుబయట మురుగు నీటిని తాగాల్సిన అవసరం ఉండదు. జీవాలను బురద నేలల్లో ఎక్కువగా తిరగనీయకూడదు. సాధ్యమైనంత వరకు పొడి ప్రదేశాల్లో తిరిగేలా చూడాలి. వర్షపు జల్లులు, ఈదురు గాలులు, తుపాన్లకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. జీవాలు విద్యుద్ఘాతానికి గురికాకుండా చూడాలి. ఈ సీజన్లో ఏ కారణం చేతనైనా జీవాలు మరణిస్తే లోతైన గొయ్యి తీసి పాతిపెట్టాలి. దీనివల్ల అంటువ్యాధులు వ్యాపించకుండా నివారించొచ్చు. పాకల్లో... ఆలపాటికి అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రము ఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఆలపాటి సత్యనారాయణకు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రండ్షిప్ సొసైటీ రాష్ట్రీయ గౌరవ పురస్కారాన్ని అందజేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ గవర్నర్ భీష్మ నారాయణ్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. భారత వ్యవసాయ రంగానికి, ఆర్థికాభివృద్ధికి అందజేసిన సేవలకు సత్యనారాయణను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఇంతకుముందు పప్పు ధాన్యాల రంగంలో విశేష కృషి చేసినందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆయనను ప్రతిష్టాత్మక ‘హుకర్’ పురస్కారంతో గౌరవించింది. సత్యనారాయణ గతంలో లాం ఫామ్ ఏడీఆర్‌గా, ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులుగా పనిచేశారు. శ్రీవరి సాగు విధానానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా ఆయన అందరికీ సుపరిచితులు. జీవాల పాకను ప్రతి రోజూ శుభ్రం చేయాలి. దానిని పొడిగా ఉంచాలి. వారానికొకసారి పొడి సున్నం చల్లాలి. పేడ కుప్పల్ని దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. పాకల్లోకి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేలా చూడాలి. సాయంత్రం వేళ పాకల దగ్గర పొగ పెట్టాలి. వీలైతే ఫ్యాన్లు, లైట్లు వేసి ఉంచాలి. జీవాలు ఇంటికి చేరగానే వాటి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి. జీవాలకు తౌడు, మొక్కజొన్న, చెక్క, ఖనిజ లవణ మిశ్రమాన్ని అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మందను వేగంగా వృద్ధి చేయవచ్చు. -డాక్టర్ సి.హెచ్.రమేశ్, హైదరాబాద్ -
‘హైడ్రోపోనిక్స్’తో అంతా ఆదాయే!
పాడి-పంట: పాడి పశువుల పోషణకయ్యే ఖర్చులో సుమారు 70% మేత కోసమే వెచ్చించాల్సి వస్తోంది. దీనిలోనూ ఎక్కువ భాగం దాణా పైనే ఖర్చవుతోంది. అయితే పచ్చిమేతలు పుష్కలంగా లభిస్తే దాణపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పచ్చిగడ్డిలో విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది పాడి పశువుల ఎదుగుదలకు, సంతానోత్పత్తికి, పాల దిగుబడి పెరగడానికి దోహదపడుతుంది. కాబట్టి పాడి పరిశ్రమను నిర్వహించే ప్రతి రైతు పచ్చిమేత పైర్లను సాగు చేయాలి. ఇందుకోసం తనకున్న భూమిలో పదో వంతును కేటాయించాలి. అయితే సాగు నీటి కొరత, కరువు పరిస్థితులతో పాటు పచ్చిమేతల సాగుకు రైతులు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఇది సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పశుగ్రాసాల సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి ఎంతో అనువుగా ఉంటుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతి అంటే... హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల్ని సాగు చేయడానికి పెద్దగా స్థలం అవసరం లేదు. కృత్రిమ పద్ధతిలో... విత్తనాలను నానబెట్టి, మొలకెత్తిస్తారు. ఆ మొలకలను 7-10 రోజుల పాటు పాక్షికంగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో (షేడ్‌నెట్ కింద) ఉంచుతారు. స్ప్రింక్లర్లు లేదా ఫాగర్ల ద్వారా అవసరాన్ని బట్టి నీరు అందిస్తారు. దీనికి ప్రధానంగా కావాల్సింది విత్తనాలు, కొద్దిగా నీరు, వెలుతురే. తేడా ఏమిటి? సాధారణ పద్ధతిలో రోజుకు 600 కిలోల పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయాలంటే 10,000 చదరపు మీటర్ల స్థలం కావాలి. అదే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కేవలం 50 చదరపు మీటర్ల స్థలం చాలు. నేల సారవంతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎరువులు కూడా అక్కరలేదు. నీరు, విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. కూలీల అవసరం కూడా తక్కువే. సాధారణ పద్ధతిలో పచ్చిమేత కోతకు రావడానికి 45-60 రోజులు పడితే ఈ పద్ధతిలో కేవలం వారం రోజులు చాలు. వాతావరణంలో ఒడిదుడుకుల ప్రభావం కూడా ఉండదు. ఎలా నిర్మించాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సూర్యరశ్మిని నియంత్రించడానికి షేడ్‌నెట్‌ను ఏర్పాటు చేసుకోవాలి. వెదురు కర్రలు లేదా ఇనుప పైపులతో దానికి ఆధారాన్ని కల్పించాలి. ప్రతి రోజూ 600 కిలోల పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయాలంటే 25 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉండేలా షేడ్‌నెట్‌ను నిర్మించాలి. దాని లోపల 3 అడుగుల వెడల్పుతో 2 వరుసల్లో 14 అరలను (ఒక్కో వరుసలో 7 అరలు) ఏర్పాటు చేసుకోవాలి. మధ్యలో దారిని వదలాలి. నీటిని అందించడానికి వీలుగా ప్రతి 2 అడుగులకు ఒక స్ప్రింక్లర్/ఫాగర్‌ను అమర్చాలి. ఏం చేయాలంటే... 3 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 3 అం గుళాల ఎత్తు ఉండే ట్రేలను కొనుగోలు చేయాలి. ఒక్కో ట్రేలో 1.5 కిలోల విత్తనాలను వేయవ చ్చు. ట్రే అడుగు భాగాన రంధ్రాలు ఉంటాయి. ట్రే అడుగున ప్లాస్టిక్ పేపరును పరవాలి. దానికి కూడా అక్కడక్కడ రంధ్రాలు చేయాలి. ట్రేలలో బార్లీ, గోధుమ, మొక్కజొన్న వంటి పశుగ్రాసాల విత్తనాలను వేసుకోవచ్చు. వీటిలో మొక్కజొన్న విత్తనాలు శ్రేష్టమైనవి. కిలో విత్తనాల నుంచి ఐ దారు కిలోల పుష్టికరమైన మేతను పొందవచ్చు. ఇలా పెంచండి మొక్కజొన్న విత్తనాలను 5% కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత 24 గంటల పాటు వాటిని మండె కట్టాలి. మొలకలను ట్రేలో ప్లాస్టిక్ పేపరుపై సమానంగా పరవాలి. షేడ్‌నెట్‌లో ఏర్పా టు చేసుకున్న అరల్లో పై అరలో ట్రేను ఉంచాలి. పశువుల సంఖ్యను బట్టి ఇలా ప్రతి రోజూ విత్తనాలను ట్రేలో పరిచి, అరల్లో ఉంచాలి. గంటకొకసారి స్ప్రింక్లర్లతో 5 నిమిషాల పాటు ట్రేలపై నీ టిని చిమ్మాలి. ఇందుకోసం టైమర్‌ను అమర్చుకుంటే మంచిది. ఈ పద్ధతిలో కిలో విత్తనాలకు వారం రోజులకు 3 లీటర్ల నీరు సరిపోతుంది. నీటిలో ఎలాంటి పోషకాలను కలపాల్సిన అవసరం లేదు. విత్తనంలోని పోషకాలే మొక్క పెరుగుదలకు సరిపోతాయి. ట్రేలలోని మొక్కలు 15-20 సెంటీమీటర్లు పెరిగిన తర్వాత వాటిని పచ్చిమేతగా వినియోగించొచ్చు. పోషక విలువలు అధికం సాధారణ పద్ధతిలో సాగు చేసే పచ్చిమేతల్లో కంటే హైడ్రోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసిన పచ్చిమేతల్లో మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిలో పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు తక్కువగా ఉంటాయి. ఎలా మేపాలి? హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పెంచిన గడ్డిని వేర్లతో సహా పశువులకు మేపవచ్చు. ఈ గడ్డిని ఒక్కో పాడి పశువుకు ప్రతి రోజూ 7-8 కిలోల వరకు మేపితే, పశువులకు రోజూ అందజేసే సమీకృత దాణా మోతాదును కిలో మేరకు తగ్గించుకోవచ్చు. అంతేకాక పాల ఉత్పత్తి 15% పెరుగుతుంది. తక్కువ స్థలంలో, తక్కువ నీటితో పచ్చిగడ్డిని ఉత్పత్తి చేయవచ్చు. భూమి లేని పాడి రైతులకు, వర్షాభావ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పచ్చిమేతల సాగుకు సంబంధించి మరింత సమాచారం కావాలనుకుంటే యాగంటిపల్లె కృషి విజ్ఞాన కేంద్రం వారిని (ఫోన్ : 9493619020) సంప్రదించవచ్చు. ఎ.కృష్ణమూర్తి, పశు పోషణ శాస్త్రవేత్త జి.ధనలక్ష్మి, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె కర్నూలు జిల్లా