ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి | advantages with the drum seeder | Sakshi
Sakshi News home page

ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి

Published Thu, Jul 17 2014 10:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:26 AM

ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి

ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి

గత దశాబ్ద కాలంలో వరి సేద్య పద్ధతుల్లో ఎన్నో విప్లవాత్మక మా ర్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో డ్రమ్‌సీడర్ వినియోగం ఒకటి. దీనివల్ల విత్తన మోతాదు, నీటి వినియోగం, చీడపీడల బెడద, పంటకాలం, సాగు ఖర్చు... ఇవన్నీ తగ్గుతాయి. ఒకవేళ డ్రమ్‌సీడర్ అందుబాటులో లేకుంటే మొలకెత్తిన విత్తనాలను చేలో నేరుగా వెదజల్లవచ్చు. ఈ నేపథ్యంలో డ్రమ్‌సీడర్ వినియోగంపై ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఓ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న సూచనలు...

వరి పండించే భూములన్నింటిలోనూ డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించవచ్చు. అయితే సమస్యాత్మక నేలలు పనికిరావు. సాధారణ పద్ధతిలో మాదిరిగానే పొలాన్ని తయారు చేయాలి. పొలం లో నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నీరు ఎక్కువైతే బయటికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకూ పొలా న్ని చదును చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకుంటే చదును చేయడం, నీరు పెట్టడం తేలికవుతుంది. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తనాలు వేసే రోజే ఆఖరి దమ్ము చేసి, చదును చేసి, పలచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి.

ఎలా వేయాలి?
రకాన్ని బట్టి ఎకరానికి 10-15 కిలోల విత్తనాలు సరిపోతాయి. కాండం గట్టిగా-వేరు వ్యవస్థ దృఢంగా ఉండి, పడిపోని రకాలైతే బాగా అనువుగా ఉంటాయి. విత్తనాలను ముందుగా 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని గోనెసంచిలో వేసి లేదా వాటిపై గోనెసంచిని కప్పి 24 గంటల పాటు మండె కడితే విత్తనాలు మొలకెత్తుతాయి. వాటిని నీడలో ఆరబెట్టి, ఆ తర్వాతే సీడర్‌లో నింపాలి.

 విత్తనాలు వేసేటప్పుడు చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. సీడర్‌కు 4 ప్లాస్టిక్ డబ్బాలు, ఒక్కో డబ్బాకు 18 రంధ్రాలు ఉంటాయి. రంధ్రాల మధ్య 2.5-3 సెంటీమీటర్లు, డబ్బాల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒకసారి సీడర్‌ను లాగితే 8 వరుసల్లో, 20 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. గింజలు పొలంలో రాలడానికి వీలుగా ప్రతి డబ్బాలో 3/4వ వంతు మాత్రమే విత్తనాలను నింపాలి. సీడర్‌ను నేర్పుగా, ఒకే వేగంతో లాగాలి. విత్తిన 24 గంటల వరకూ నీరు పెట్టకూడదు.

కలుపు సమస్య ఎక్కువే
తొలి దశలో చేలో నీరు నిలగట్టకుండా, ఆరుతడిగా వరిని సాగు చేయడం వల్ల కలుపు సమస్య ఎక్కువగానే ఉంటుంది. దాని నివారణకు విత్తనాలు వేసిన 2-3 రోజుల్లో ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పెండిమిధాలిన్/400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్/35 గ్రాముల ఆక్సాడయార్జిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే 200 లీటర్ల నీటిలో 80-100 మిల్లీలీటర్ల బిస్‌ పైరిబాక్ సోడియం కలిపి పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా ఉంటే 200 లీటర్ల నీటిలో 300-400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలపై పడేలా మందును పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో నీరు ఉండకూడదు. పైరు పెరిగే దశలో కూలీలతో కలుపు తీయించాలి.

నీరు-ఎరువుల యాజమాన్యం
విత్తనాలు వేసినప్పటి నుంచి పైరు పొట్ట దశకు చేరుకునే వరకూ చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి కోతకు వారం పది రోజుల ముందు వరకూ చేలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేయాలి. పొటాష్‌ను 2 సమాన భాగాలుగా చేసుకొని దమ్ములో, పైరు 60-65 దశలో (మూడో దఫా నత్రజని ఎరువుతో కలిపి) వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమాన భాగాలుగా చేసి విత్తిన 15-20 రోజులకు, 40-45 రోజులకు, 60-65 రోజులకు మూడు దఫాలుగా వేసుకోవాలి.

ఎన్నో ప్రయోజనాలు
డ్రమ్‌సీడర్‌ను వినియోగించడం వల్ల పంట వారం పది రోజుల ముందే కోతకు వస్తుంది. నారుమడి పెంపకం, నాట్లు వేయడం వంటి పనులు ఉండవు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.3,000 వరకూ తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడినంత ఉండడం వల్ల దిగుబడి 10-15% పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయవచ్చు. ఎకరం పొలంలో విత్తనాలు వేయడానికి 2 గంటలు చాలు. పైగా ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. చీడపీడల తాకిడి కూడా తక్కువగానే ఉంటుంది.
 
కోనోవీడర్ నడిపితే...
డ్రమ్‌ సీడర్‌తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు చేలో కోనోవీడర్‌ను నడపాలి. దీనివల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి. ఆ తర్వాత చేలో కలుపు ఉన్నా, లేకపోయినా 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు కోనోవీడర్‌ను తిప్పితే భూమి బాగా కదిలి, వేరు వ్యవస్థకు గాలి-పోషకాల లభ్యత పెరుగుతుంది. పీచు వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. పిలకలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, మొక్క గుబురుగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. కోనోవీడర్‌ను నడపడానికి ముందు రోజు సాయంత్రం పొలానికి పలచగా నీరు పెట్టాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement