‘‘కొందరు వ్యక్తులు ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు అంటే వినిపించుకోరు. కానీ కథ ద్వారా చెబితే వింటారు. ‘నాట్యం’ కథ తప్పొప్పులను చెబుతుంది’’ అన్నారు రేవంత్. నాట్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ – ‘‘నాకు విఠలాచార్య, కె. విశ్వనాథ్‌గార్లంటే అభిమానం. తెలుగులో మంచి సినిమాలంటే ముందుగా కె. విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. అందుకే దర్శకుడిగా నా తొలి సినిమాను క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో తీయాలనుకుని ‘నాట్యం’ తీశాను.
నాట్యం అనే ఊరిలోని ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఆ ఊరిలోని ఓ నాట్యగురువు వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతాడు. అయితే ఈ గురువు శిష్యురాలు తన నాట్య కళ ద్వారా ప్రజలను ఎలా చైతన్యవంతులను చేసింది? అన్నదే కథ. శిష్యురాలి పాత్రను సంధ్యారాజు చేశారు. ఈ సినిమాకు మెయిన్ లీడ్‌గానే కాదు.. నిర్మాత, సాంకేతిక నిపుణురాలిగా కూడా సంధ్యారాజు ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాటిక్ అంశాలను ‘నాట్యం’ చిత్రంలో పొందుపరిచాను’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment