Natyam Movie
-
జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానం.. ఉత్తమ చిత్రంగా 'సూరారై పోట్రు'
దేశ రాజధాని ఢిల్లీలో 68వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన నటీనటులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆవార్డులు ప్రదానం చేశారు. డిల్లీలోని విఘ్నయన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హాజరయ్యారు. 2020వ సంవత్సరానికి గాను 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి.ఆర్.గోపినాథ్ జీవిత కథను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన 'సూరరై పోట్రు' జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తన భార్యతో జ్యోతిక కలిసి హాజరయ్యారు తమిళ హీరో సూర్య. సమాజంలోని కుల వివక్షను కళ్లకు కడుతూ తెరకెక్కిన 'కలర్ ఫొటో' తెలుగులో ఉత్తమ చిత్రంగా అవార్టు గెలుచుుకంది. సంప్రదాయ నృత్యానికి పట్టం కడుతూ.. రూపొందించిన తెలుగు చిత్రం 'నాట్యం' ఉత్తమ నృత్యాలు, మేకప్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది. పాటలతో అలరించిన 'అల వైకుంఠపురములో' చిత్రం సంగీత విభాగంలో అవార్డు కైవసం చేసుకుంది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి తాన్హాజీ జీవిత గాథతో హిందీలో తెరకెక్కిన 'తాన్హాజీ: ది అన్ సంగ్ వారియర్' ఉత్తమ సమగ్ర వినోదాత్మక చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. అందులో తానాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగణ్, సూర్యతో కలసి ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. -
జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది
‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’... ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్ ప్లే (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్ దేవగన్ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా... 68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫీచర్ ఫిల్మ్, నాన్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ రైటింగ్ సెక్షన్, మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు. 30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్ ఫిల్మ్ స్క్రీనింగ్‌కు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిం చిన ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్. సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో సాయి రాజేశ్ నిర్మించిన ‘కలర్ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రేవంత్ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది. మరోవైపు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది. అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’కు మూడు (బెస్ట్ యాక్టర్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్) జాతీయ అవార్డులు దక్కాయి. తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5, ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం. అలాగే మధ్యప్రదేశ్ మోస్ట్ ఫ్రెండ్లీ ఫిల్మ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. ‘ద లాంగెస్ట్ కిస్’కు ‘ది బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్ క్రిటిక్ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది. సేమ్ సీన్! 67వ జాతీయ అవార్డుల్లోని సీన్ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్ (‘అసురన్’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (భోన్స్లే)లు షేర్ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్ దేవగన్ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’ చిత్రానికిగాను..) బెస్ట్ యాక్టర్ అవార్డును షేర్ చేసుకున్నారు. ఇక కెరీర్లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్ దేవగన్‌కు మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్’ (1998), ‘ది లెజండ్ ఆఫ్ భగత్‌సింగ్’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్ దేవగన్ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. దివంగత దర్శకుడికి అవార్డు మలయాళ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కిగాను దర్శకుడు కేఆర్ సచ్చిదానందన్ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది. ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి. ఓటీటీ చిత్రాల హవా! 68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి. తొమ్మిదో అవార్డు కెరీర్లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్’కిగాను ఎడిటింగ్ విభాగంలో శ్రీకర్ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్’ (1989), ‘రాగ్ బైరాగ్’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (2002), ‘ఫిరాక్’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఈ క్రెడిట్ నాది కాదు ► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్ చేసుకుంటారా? నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్ కూడా ఆయనదే. ► ట్యూన్స్ ఇచ్చింది మీరు కదా.. (నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్‌గా పిక్ చేయగల డైరెక్టర్ కాబట్టే కరెక్ట్ ట్యూన్స్‌ని త్రివిక్రమ్‌గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్ ఎలివేట్ అయిందంటాను. ► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా? ఏమాత్రం టెన్షన్ పడలేదు. త్రివిక్రమ్‌గారు మమ్మల్నందర్నీ కూల్‌గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్ ఆయనకే ఇస్తున్నాను. ► మరి.. పూర్తి క్రెడిట్‌ని మీరెప్పుడు తీసుకుంటారు? ‘ఇండిపెండెంట్ మ్యూజిక్’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్’ ఉన్నాయి. మ్యూజికల్ అవార్డ్స్ అవి. ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్ బిగ్’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్ ఎఫర్ట్. అందుకే అవార్డు క్రెడిట్‌ని ఒక్కడినే తీసుకోవడంలేదు. – తమన్ బాధ్యత పెరిగింది – సాయి రాజేష్ నిజంగా మా ప్రేమకథ (‘కలర్ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్‌కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని. అవార్డుల విజేతల వివరాలు ∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగన్ (తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్ సచ్చిదానందన్ (అయ్యప్పనుమ్ కోషియుమ్) ∙ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ విభాగంలో అనిశ్ మంగేశ్ గోస్వామి (టక్టక్), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్ తెందుల్కర్ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్ జూనియర్ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: మండోన్నా అశ్విన్ (మండేలా తమిళ ఫిల్మ్) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్సంగ్ వారియర్ ∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్ ఫిల్మ్ ఆన్ సోషల్ ఇష్యూ: ఫ్యూర్నల్ (మరాఠి) ∙ఉత్తమ స్క్రీన్ ప్లే: షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్: నచికేత్ బార్వే, మహేశ్ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్సంగ్ వారియర్) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్ఎస్ తమన్ (అల...వైకుంఠపురములో...) ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్‌కుమార్ (సూరరైపోట్రు – తమిళం) ∙ఉత్తమ గీత రచన : మనోజ్ ముంతిషిర్ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: అనీష్ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్) ∙ఉత్తమ సౌండ్ డిజైనర్: అనుమోల్ భవే (ఎమ్ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనీయుం ఇన్నుమ్ సిల పెన్‌గళుమ్– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్ జయాన్ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్ డిజైనింగ్ (ఫైనల్ మిక్స్): విష్ణు గోవింద్, శ్రీశంకర్ (మాలిక్ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్ కోషియుమ్ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్ దేశ్ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్ భోల్ (అవిజాత్రిక్– బెంగాలీ). -
సంధ్యారాజు 'నాట్యం'పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఇటీవల `నాట్యం` సినిమాలో తన డ్యాన్స్, మరియు నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం `ఫినామినల్ ఉమెన్`కు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫినామినల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. మన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డ్యాన్సర్ జాతీయ స్థాయిలో ప్రసిద్ది చెందిన ఏఆర్ రెహమాన్ ప్రశంసలు అందుకోవడం గర్వించదగిన క్షణం. Sandhya Raju / Modern Kuchipudi / Performance Poetry / Maya Angelou's P... https://t.co/oUHeimC2Ai via @YouTube — A.R.Rahman (@arrahman) March 13, 2022 -
ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన 'నాట్యం' మూవీ
‘‘డ్యాన్స్, వ్యాపార రంగం నుంచి వచ్చిన మీరు ‘నాట్యం’ లాంటి సినిమాను ఎందుకు చేస్తున్నారు? అని చాలామంది అడిగారు. ‘ఇఫీ’ వేడుకల్లో మా ‘నాట్యం’ సినిమా ప్రదర్శితం కానుండటమే ఆ ప్రశ్నకు సమాధానం. మా చిత్రానికి ఆ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది’’ అని సంధ్యారాజు అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. కాగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(ఇఫి) ఈ నెల 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ 52వ ‘ఇఫి’ వేడుకల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ‘నాట్యం’ ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ– ‘‘నాట్యం’ సినిమాతో భారతీయ, తెలుగు సంస్కృతులు, సంప్రదాయల గురించి మాట్లాడుకుంటే చాలనుకున్నాం.. కానీ ఇప్పుడు మా చిత్రం ప్రేక్షకులు గర్వపడే తెలుగు సినిమాగా నిలిచింది. మా చిత్రాన్ని కె.విశ్వనాథ్, చిరంజీవి, బాలకృష్ణ, రామ్‌చరణ్, రవితేజ.. వంటి చాలామంది ప్రోత్సహించారు.. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాట్యం’ సినిమా గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు’’ అన్నారు నటుడు కమల్ కామరాజు. నిర్మాతలు ప్రసన్న కుమార్, వి.మోహన్ పాల్గొన్నారు. -
‘నాట్యం’ మూవీపై బాలయ్య రివ్యూ
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు. (చదవండి: ‘నాట్యం’మూవీ రివ్యూ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాట్యం చిత్రాన్ని చూశాను. ఇది సినిమా కాదు కళాఖండం. సినిమా అనేది కేవలం వినోదం కోసం కాదు. మరుగున పడిపోతోన్న కళలు, సంస్కృతులకు జీవం పోసి, భావి తరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. కెమెరామెన్ కూడా ఆయనే కావడంతో సన్నివేశాలను చక్కగా క్యాప్చర్ చేశారు. సినిమాను ఎన్నిసార్లు చుసిన తనివి తీరదు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాతలకు అభినందనలు’ అన్నారు. ‘నాట్యం’పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు నాట్యం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి.. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు. -
'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Natyam Movie Heroine Sandhya Raju Family Background Details: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఉపాసన,ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేశ్, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.చదవండి : కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి అయితే క్షణం తీరిక లేకుండా గడిపే బిగ్ స్టార్స్ ఇంత ప్రత్యేకంగా ఈ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అసలు ఎవరీ సంధ్యారాజు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఈమె ఎవరంటే... వేల కోట్లకు అధిపతి, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు. అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు. సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దేశ విదేశాల్లో కలిపి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. చదవండి : Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
Natyam Review: ‘నాట్యం’మూవీ రివ్యూ
టైటిల్: నాట్యం నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు నిర్మాణ సంస్థ : నిశృంకళ ఫిల్మ్ నిర్మాతలు: సంధ్యారాజు దర్శకత్వం : రేవంత్ కోరుకొండ సంగీతం :శ్రవణ్ బరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రేవంత్ కోరుకొండ విడుదల తేది : అక్టోబర్ 22, 2021 ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే పిచ్చి. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. రంగ ప్రవేశం చేసేందుకై కాదంబరి నాట్యం చేయాలనుకుంటుంది. దానికి గురువుగారు ఒప్పుకోరు. ఆ నాట్యం అభ్యసించడానికి ఎవరు ముందుకు వచ్చిన చనిపోతుంటారు. అయినప్పటికీ సితార తన రంగ ప్రవేశానికి ఆ నాట్యమే చేస్తానని పట్టుబడుతుంది. కట్ చేస్తే... సిటీలో ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) మంచి వెస్ట్రన్ డ్యాన్సర్. అతను ఓ పనిపై నాట్యం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సితారతో పరిచమవుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఆమె చేసిన ఓ పని.. గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తుంది.దీంతో సితార ఆ గ్రామం విడిచి సిటీకి వెళ్తుంది. ఆ తర్వాత సితార జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమె చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన నెరవేరిందా లేదా? అసలు కాదంబరి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? సితార పాత్రకు పూర్తి న్యాయం చేసింది కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించుకున్నా.. డాన్స్ విషయంలో మాత్రం ఇరగదీసింది. స్వతహాగా ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కావడం సినిమాకు కలిసొచ్చింది. గురువుగారిగా ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలుగు తెరపై నాట్యప్రధానమైన సినిమాలు అప్పట్లో బాగానే వచ్చేవి. 'స్వర్ణకమలం' 'సాగర సంగమం' . 'ఆనందభైరవి' లాంటి కొన్ని చిత్రాలు ఆ కోవకు చెందినవే. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసినప్పటికీ.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ కూడా లేవు. పస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండాఫ్ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది వర్కౌట్ కాలేదనిపిస్తుంది. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాట్యం హీరోయిన్ సంధ్యారాజ్ లేటెస్ట్ ఫోటోస్
-
‘చిరంజీవి, రామ్ చరణ్ వల్ల మా జీవితమే మారిపోయింది’
‘సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి, రామ్ చరణ్ మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది’అన్నారు ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ►చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను. ►నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే. ►నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. ►మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది. మనలోని యూనిక్ పాయింట్‌ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు. ► చిరంజీవి ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు. ► చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు. కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది. కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ► క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం. కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి. ► నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పని చేస్తూ వచ్చాను. అలా హీరోయిన్లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది. ► నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.. ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది. ► నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది. ► నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉంది. ► మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలను చేయను. డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను. ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను. మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను. అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను. ► మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్
‘‘కొందరు వ్యక్తులు ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు అంటే వినిపించుకోరు. కానీ కథ ద్వారా చెబితే వింటారు. ‘నాట్యం’ కథ తప్పొప్పులను చెబుతుంది’’ అన్నారు రేవంత్. నాట్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ – ‘‘నాకు విఠలాచార్య, కె. విశ్వనాథ్‌గార్లంటే అభిమానం. తెలుగులో మంచి సినిమాలంటే ముందుగా కె. విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. అందుకే దర్శకుడిగా నా తొలి సినిమాను క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో తీయాలనుకుని ‘నాట్యం’ తీశాను. నాట్యం అనే ఊరిలోని ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఆ ఊరిలోని ఓ నాట్యగురువు వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతాడు. అయితే ఈ గురువు శిష్యురాలు తన నాట్య కళ ద్వారా ప్రజలను ఎలా చైతన్యవంతులను చేసింది? అన్నదే కథ. శిష్యురాలి పాత్రను సంధ్యారాజు చేశారు. ఈ సినిమాకు మెయిన్ లీడ్‌గానే కాదు.. నిర్మాత, సాంకేతిక నిపుణురాలిగా కూడా సంధ్యారాజు ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాటిక్ అంశాలను ‘నాట్యం’ చిత్రంలో పొందుపరిచాను’’ అన్నారు.