జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది | 68th National Film Awards Winners Special story | Sakshi
Sakshi News home page

జాతీయ సినిమా అవార్డులు: ఆకాశం మెరిసింది

Published Sat, Jul 23 2022 12:46 AM | Last Updated on Sat, Jul 23 2022 10:35 AM

68th National Film Awards Winners Special story - Sakshi

‘‘ఆశలు నెరవేర్చుకోవడానికి ఆకాశమే హద్దు అవ్వాలి.. అప్పుడే ఆకాశం వరకూ ఎగిరే రెక్కలు దక్కుతాయి’’...  ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!) స్టోరీలైన్‌ ఇది. సూర్య, అపర్ణ బాలమురళి జంటగా సుధ కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (సూర్య), నటి (అపర్ణ), స్క్రీన్‌ ప్లే  (సుధ కొంగర), నేపథ్య సంగీతం (జీవీ ప్రకాశ్‌కుమార్‌).. ఇలా మొత్తం ఐదు అవార్డులు దక్కాయ

అలా జాతీయ అవార్డుల్లో ‘ఆకాశం..’ మెరిసింది. కాగా ఉత్తమ నటుడి అవార్డుకి సూర్యతో పాటు అజయ్‌ దేవగన్‌ (‘తన్హాజీ’)ని ఎంపిక చేశారు. ఇక తెలుగుకి నాలుగు అవార్డులు దక్కాయి. జాతీయ ఉత్తమ సంగీతదర్శకుడిగా తమన్‌ (‘అల.. వైకుంఠపురములో’), ‘నాట్యం’ చిత్రకథానాయిక సంధ్యారాజుకి ఉత్తమ కొరియోగ్రఫీకి, ఇదే చిత్రానికిగాను టీవీ రాంబాబుకి ఉత్తమ మేకప్‌ అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్‌ ఫొటో’ ఎంపికైంది. ఇంకా శుక్రవారం వెలువడిన 68వ జాతీయ అవార్డుల వివరాలు ఈ విధంగా...

68వ జాతీయ అవార్డులను ఐదు విభాగాలుగా విభజించడం విశేషం. దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, ఫీచర్‌ ఫిల్మ్, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్, బెస్ట్‌ రైటింగ్‌ సెక్షన్, మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌... ఇలా ఐదు భాగాలుగా అవార్డులను ప్రకటించారు.

30 భాషల్లో దాదాపు 305 చిత్రాలు ఫీచర్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్‌కు, నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో దాదాపు 148 చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఈ అవార్డుల్లో తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా..!) హవా కనిపించింది. ఈ చిత్రం ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. తెలుగు చిత్రపరిశ్రమకు నాలుగు అవార్డులు దక్కాయి.

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిం చిన  ‘అల.. వైకుంఠపురుములో...’ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు తమన్‌.

సుహాస్, చాందినీ చౌదరి జంటగా సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో సాయి రాజేశ్‌ నిర్మించిన ‘కలర్‌ ఫోటో’ ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది.

రేవంత్‌ దర్శకత్వంలో సంధ్యారాజు నటించిన ‘నాట్యం’ ఉత్తమ కొరియోగ్రఫీ, మేకప్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోగలిగింది.

మరోవైపు మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ నాలుగు విభాగాల్లో (ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ నేపథ్య గానం, స్టంట్‌ కొరియోగ్రఫీ)లను దక్కించు కుంది.

అలాగే తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌’కు మూడు విభాగాల్లో (ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఎడిటింగ్, ఉత్తమ సహాయ నటి), ‘హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’కు మూడు (బెస్ట్‌ యాక్టర్, బెస్ట్‌ పాపులర్‌  ఫిల్మ్, బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌) జాతీయ అవార్డులు దక్కాయి.

 
తమిళ పరిశ్రమకు మొత్తం 10 (సూరరైపోట్రుకి 5,  ‘శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌’కి 3, మండేలాకి 2) అవార్డులు దక్కడం విశేషం.

అలాగే మధ్యప్రదేశ్‌ మోస్ట్‌ ఫ్రెండ్లీ ఫిల్మ్‌ స్టేట్‌ అవార్డును దక్కించుకుంది. 

‘ద లాంగెస్ట్‌ కిస్‌’కు ‘ది బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా అవార్డు దక్కింది. ఇక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును మరో సందర్భంలో ప్రకటించనున్నట్లు జ్యూరీ మెంబర్స్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు విభాగంలో ఎవర్నీ ఎంపిక చేయలేకపోయామని జ్యూరీ పేర్కొంది.

సేమ్‌ సీన్‌!
67వ జాతీయ అవార్డుల్లోని సీన్‌ ఒకటి 68వ జాతీయ అవార్డుల్లోనూ రిపీట్‌ అయ్యింది. 67వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు ధనుష్‌ (‘అసురన్‌’ చిత్రానికి గాను..). హిందీ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (భోన్‌స్లే)లు షేర్‌ చేసుకున్నారు. ఈసారి కూడా ఉత్తమ నటుడు విభాగాన్ని తమిళ నటుడు సూర్య (‘సూరరై పోట్రు’ చిత్రానికిగాను..), హిందీ నటుడు అజయ్‌ దేవగన్‌ (హిందీ చిత్రం ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ చిత్రానికిగాను..) బెస్ట్‌ యాక్టర్‌ అవార్డును షేర్‌ చేసుకున్నారు. ఇక కెరీర్‌లో సూర్యకు తొలిసారి జాతీయ అవార్డు దక్కగా, అజయ్‌ దేవగన్‌కు  మాత్రం ఇది మూడో అవార్డు. ఇంతకు ముందు ‘జఖ్మ్‌’ (1998), ‘ది లెజండ్‌ ఆఫ్‌ భగత్‌సింగ్‌’ (2002) చిత్రాలకుగాను ఉత్తమ నటుడు విభాగంలో అజయ్‌ దేవగన్‌ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు.  

 దివంగత దర్శకుడికి అవార్డు
మలయాళ హిట్‌ ఫిల్మ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ నాలుగు జాతీయ అవార్డులు దక్కించుకుంది. ఈ నాలుగు అవార్డుల్లో ఉత్తమ దర్శకుడు విభాగం కూడా ఉంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కిగాను దర్శకుడు కేఆర్‌ సచ్చిదానందన్‌ అవార్డుకి ఎంపికయ్యారు. అయితే 2020 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించడం ఓ విషాదం. దీంతో ఈ సంతోషకర సమయంలో ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రయూనిట్‌కు ఓ లోటు ఉండిపోయింది.  ఇక ఈ నాలుగుతో పాటు ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ప్రొడక్షన్‌ డిజైన్, యాక్షన్, ఆడియోగ్రఫీ, ఉత్తమ పుస్తకం.. ఇలా మలయాళ పరిశ్రమకు తొమ్మిది అవార్డులు దక్కాయి.

ఓటీటీ చిత్రాల హవా!
68వ జాతీయ అవార్డుల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన చిత్రాల జోరు కనిపించింది. ఐదు అవార్డులను గెల్చుకున్న ‘సూరరైపోట్రు’, తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచిన ‘కలర్‌ ఫోటో’ చిత్రాలు డైరెక్టర్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. అలాగే రెండు అవార్డులను గెల్చుకున్న తమిళ చిత్రం ‘మండేలా’ ముందుగా టీవీలో ప్రదర్శితమై, ఆ తర్వాత ఓటీటీ  స్ట్రీమింగ్‌కు వెళ్లింది. అవార్డులు సాధించిన వాటిలో మరికొన్ని ఓటీటీ చిత్రాలు ఉన్నాయి.

తొమ్మిదో అవార్డు
కెరీర్‌లో తొమ్మిదో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు తెలుగు సీనియర్‌ ఎడిటర్‌ శ్రీకర్‌ ప్రసాద్‌. 68వ జాతీయ అవార్డుల్లో తమిళ చిత్రం ‘శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌’కిగాను ఎడిటింగ్‌ విభాగంలో శ్రీకర్‌ ప్రసాద్‌కు అవార్డు దక్కింది. ఇది ఆయనకు 9వ అవార్డు. గతంలో ‘రాక్‌’ (1989), ‘రాగ్‌ బైరాగ్‌’ (1997), ‘నౌకా కరిత్రము’ (1997), ‘ది టెర్రరిస్ట్‌’ (1998), ‘వనప్రస్థం’ (2000), ‘కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌’ (2002), ‘ఫిరాక్‌’ (2008), 2010లో ‘కుట్టి స్రాంక్‌’, ‘కమినీ’, ‘కేరళ వర్మ పళస్సి రాజా’లకు గాను స్పెషల్‌ జ్యూరీ అవార్డులను దక్కించుకున్నారు.
శ్రీకర్‌ ప్రసాద్‌

ఈ క్రెడిట్‌ నాది కాదు
► ‘నీ కాళ్లను చూడు’ అన్నారు.. ‘బుట్ట బొమ్మ’ అన్నారు.. ‘రాములో’ అన్నారు.. జాతీయ అవార్డుని బుట్టలో వేసుకున్నారు.. మీ ఆనందాన్ని షేర్‌ చేసుకుంటారా?
నిజానికి ‘అల వైకుంఠపురము’లో విజయాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. మొత్తం క్రెడిట్‌ అంతా త్రివిక్రమ్‌గారిదే. ఈ జాతీయ అవార్డు క్రెడిట్‌ కూడా ఆయనదే.

► ట్యూన్స్‌ ఇచ్చింది మీరు కదా..
(నవ్వుతూ). నేనే. కానీ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి చేతుల్లోనే అంతా ఉంటుంది. కరెక్ట్‌గా పిక్‌ చేయగల డైరెక్టర్‌ కాబట్టే కరెక్ట్‌ ట్యూన్స్‌ని త్రివిక్రమ్‌గారు ఎంచుకున్నారు. అలాగే లిరిక్స్‌ విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా..’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాములా..’ ఇవన్నీ క్యాచీగా ఉన్నాయి కాబట్టే ట్యూన్‌ ఎలివేట్‌ అయిందంటాను.

► ఈ సినిమా విషయంలో మీరేమైనా ఒత్తిడికి గురయ్యేవారా?
ఏమాత్రం టెన్షన్‌ పడలేదు. త్రివిక్రమ్‌గారు మమ్మల్నందర్నీ కూల్‌గా ముందుకు నడిపించారు. ఆయన ప్రపంచలోకి వెళ్లి మేం పని చేశాం. అందుకే క్రెడిట్‌ ఆయనకే ఇస్తున్నాను.  

► మరి.. పూర్తి క్రెడిట్‌ని మీరెప్పుడు తీసుకుంటారు?
‘ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌’కి అవార్డు దక్కినప్పుడు తీసుకుంటాను. విదేశాల్లో ‘గ్రామీ అవార్డ్స్‌’ ఉన్నాయి. మ్యూజికల్‌ అవార్డ్స్‌ అవి. ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌కి అవార్డులు ఇస్తారు. ఇండియాలో నాకు తెలిసి అలాంటి అవార్డులు లేవు. అందుకే మావరకూ ‘సినిమా ఈజ్‌ బిగ్‌’. ఏడాదికి ఓ పది సినిమాలు చేస్తాం. అంటే దాదాపు అరవై పాటలు ఇస్తాం. వాటిలో ఒక పాటకు అవార్డు రావడం అంటే ఆనందించదగ్గ విషయమే. అయితే సినిమా అనేది కలెక్టివ్‌ ఎఫర్ట్‌. అందుకే అవార్డు క్రెడిట్‌ని ఒక్కడినే తీసుకోవడంలేదు.
– తమన్‌

బాధ్యత పెరిగింది – సాయి రాజేష్‌
నిజంగా మా ప్రేమకథ (‘కలర్‌ ఫోటో’ను ఉద్దేశించి...) ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు సాధిస్తుందని నేను అస్సలు ఊహించలేదు. నాతో పాటు చిత్రయూనిట్‌ అంతా చాలా సంతోషంగా ఉన్నాం. నా జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా ‘కలర్‌ ఫోటో’ కథను రాసుకున్నాను. నేను నల్లగా ఉంటానని నాకు ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ ఉండేది. ఈ అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించాం. రైటింగ్, ప్రొడక్షన్, దర్శకత్వం విభాగాల్లో ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచిందనే నమ్ముతున్నాను. అయితే ‘కలర్‌ ఫోటో’ సినిమా రిలీజ్‌కు ముందే మా నాన్నగారు మాకు దూరమయ్యారు. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే ఇంకా హ్యాపీ ఫీలయ్యేవాడిని.

అవార్డుల విజేతల వివరాలు
∙ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు ∙ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్‌ దేవగన్‌ (తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌) ∙ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) ∙ఉత్తమ సహాయ నటుడు: బీజూ మీనన్‌
(అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌) ∙ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌) ∙ఉత్తమ దర్శకుడు: దివంగత కేఆర్‌ సచ్చిదానందన్‌ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌) ∙ఉత్తమ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ విభాగంలో అనిశ్‌ మంగేశ్‌ గోస్వామి (టక్‌టక్‌), ఆకాంక్షా పింగ్లే, దివ్వేష్‌ తెందుల్కర్‌ (సుమీ) ∙ఉత్తమ తెలుగు చిత్రం: కలర్‌ ఫోటో ∙ఉత్తమ తమిళ చిత్రం: శివరంజనియుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌ ∙ఉత్తమ కన్నడ చిత్రం: డోలు ∙ఉత్తమ మలయాళం చిత్రం: తింకలచ్చ నిశ్చయమ్‌ ∙ఉత్తమ హిందీ చిత్రం: తులసీదాస్‌ జూనియర్‌ ∙ఉత్తమ బాలల చిత్రం: సుమి (మరాఠి) ∙ఇందిరాగాందీ అవార్డు ఫర్‌ బెస్ట్‌ డెబ్యూ ఫిలిం డైరెక్టర్‌: మండోన్నా  అశ్విన్‌ (మండేలా తమిళ ఫిల్మ్‌) ∙ఉత్తమ వినోదాత్మక చిత్రం: తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌
∙పర్యావరణ పరిరక్షణపై చిత్రం: తలెండా (కన్నడ) ∙బెస్ట్‌ ఫిల్మ్‌ ఆన్‌ సోషల్‌ ఇష్యూ: ఫ్యూర్నల్‌ (మరాఠి)
∙ఉత్తమ స్క్రీన్‌ ప్లే:  షాలిని ఉషా నయ్యర్, సుధా కొంగర (సూరరైపోట్రు – తమిళం)  ∙ఉత్తమ కొరియోగ్రఫీ: సంధ్యారాజు (నాట్యం) ∙ఉత్తమ మేకప్‌: టీవీ రాంబాబు (నాట్యం) ∙ఉత్తమ కాస్ట్యూమ్స్‌: నచికేత్‌ బార్వే, మహేశ్‌ శర్లా (హిందీ చిత్రం తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌) ∙ఉత్తమ సంగీతం (పాటలు): ఎస్‌ఎస్‌ తమన్‌ (అల...వైకుంఠపురములో...)  ∙ఉత్తమ సంగీతం (నేపథ్యం): జీవీ ప్రకాశ్‌కుమార్‌ (సూరరైపోట్రు – తమిళం)
∙ఉత్తమ గీత రచన : మనోజ్‌ ముంతిషిర్‌ (సైనా – హిందీ) ∙ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: అనీష్‌ నదోడి (కప్పెలా– మలయాళం ఫిల్మ్‌) ∙ఉత్తమ సౌండ్‌ డిజైనర్‌: అనుమోల్‌ భవే (ఎమ్‌ఐ వసంతరావు – మరాఠి) ∙ఉత్తమ ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ (శివరంజనీయుం ఇన్నుమ్‌ సిల పెన్‌గళుమ్‌– తమిళం) ∙ఉత్తమ ఆడియోగ్రఫీ: జాబిన్‌ జయాన్‌ (డోలు– కన్నడ) ∙ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌ (ఫైనల్‌ మిక్స్‌): విష్ణు గోవింద్, శ్రీశంకర్‌ (మాలిక్‌ –మలయాళం) ∙ఉత్తమ సంభాషణలు: మడొన్నే అశ్విన్‌ (మండేలా– తమిళం) ∙ఉత్తమ నేపథ్య గాయని: నంజియమ్మ (అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ –మలయాళం) ∙ఉత్తమ నేపథ్య గాయకుడు: రాహుల్‌ దేశ్‌ పాండే (మీ వసంతరావు– మరాఠి) ∙ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుప్రతిమ్‌ భోల్‌ (అవిజాత్రిక్‌– బెంగాలీ).

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement