Natyam Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ

Published Fri, Oct 22 2021 2:08 PM | Last Updated on Fri, Oct 22 2021 9:04 PM

Natyam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: నాట్యం
న‌టీన‌టులు: సంధ్యారాజు, కమల్ కామరాజు,  రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు
నిర్మాణ సంస్థ : నిశృంకళ ఫిల్మ్‌ 
నిర్మాతలు:  సంధ్యారాజు
దర్శకత్వం : రేవంత్ కోరుకొండ
సంగీతం :శ్రవణ్ బరద్వాజ్ 
సినిమాటోగ్రఫీ : రేవంత్ కోరుకొండ
విడుదల తేది : అక్టోబర్‌ 22, 2021

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..?
నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి  క్లాసికల్ డ్యాన్స్‌ అంటే పిచ్చి. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. రంగ ప్రవేశం చేసేందుకై కాదంబరి నాట్యం చేయాలనుకుంటుంది. దానికి గురువుగారు ఒప్పుకోరు. ఆ నాట్యం అభ్యసించడానికి ఎవరు ముందుకు వచ్చిన చనిపోతుంటారు. అయినప్పటికీ సితార తన రంగ ప్రవేశానికి ఆ నాట్యమే చేస్తానని పట్టుబడుతుంది. కట్‌ చేస్తే... సిటీలో ఉండే రోహిత్‌(రోహిత్ బెహాల్) మంచి వెస్ట్రన్ డ్యాన్సర్‌. అతను ఓ పనిపై నాట్యం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సితారతో పరిచమవుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఆమె చేసిన ఓ పని.. గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తుంది.దీంతో సితార ఆ గ్రామం విడిచి సిటీకి వెళ్తుంది. ఆ తర్వాత సితార జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమె చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన నెరవేరిందా లేదా? అసలు కాదంబరి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ. 

ఎవరెలా చేశారంటే?
సితార పాత్రకు పూర్తి న్యాయం చేసింది కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు. యాక్టింగ్‌ పరంగా పర్వాలేదనిపించుకున్నా.. డాన్స్‌ విషయంలో మాత్రం ఇరగదీసింది.  స్వతహాగా ఆమె మంచి క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడం సినిమాకు కలిసొచ్చింది. గురువుగారిగా ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. ఇక క్లాసికల్‌ డ్యాన్సర్‌ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్‌ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్‌, హీరోయిన్‌ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
తెలుగు తెరపై నాట్యప్రధానమైన సినిమాలు అప్పట్లో బాగానే వచ్చేవి.  'స్వర్ణకమలం'  'సాగర సంగమం' . 'ఆనందభైరవి' లాంటి కొన్ని చిత్రాలు ఆ కోవకు చెందినవే. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని యాడ్‌ చేసినప్పటికీ..  ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమను ఎలివేట్‌ చేసే బలమైన సీన్స్‌ కూడా లేవు.

పస్టాఫ్‌ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్‌ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తుంది. అయితే సెకండాఫ్‌ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది వర్కౌట్‌ కాలేదనిపిస్తుంది. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్‌.  ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement