టైటిల్:వాల్తేరు వీరయ్య
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శ్రుతిహాసన్, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని,రవిశంకర్
దర్శకత్వం: కేఎస్ రవీంద్ర(బాబీ)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: ఆర్థన్ ఎ.విల్సన్
ఎడిటర్: నిరంజన్ దేవరమనే
విడుదల తేది: జనవరి 13,2023
గాడ్ ఫాదర్ లాంటి సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ‘అన్నయ్య’ తర్వాత మెగాస్టార్‌తో కలిసి రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా కావడంతో వాల్తేరు వీరయ్యపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయింది.దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాస్ సాంగ్, పూనకాలు లోడింగ్ పాటలు జనాల్లోకి విపరీతంగా చొచ్చుకెళ్లాయి. సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి సందర్భంగా నేడు(జనవరి 13)విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వైజాగ్‌లోని జాలరిపేటకు చెందిన వీరయ్య(చిరంజీవి) పోర్ట్‌లో ఓ ఐస్ ఫ్యాక్టరీ రన్ చేస్తుంటాడు. సముద్రంలో అణువణువు తెలిసిన అతను.. అవసరం అయినప్పుడు నేవీ అధికారులకు సైతం సహాయం చేస్తుంటాడు. వీరయ్య వీరత్వం గురించి తెలుసుకున్న పోలీసు అధికారి సీతాపతి(రాజేంద్ర ప్రసాద్).. తన సహోద్యోగులను కిరాతకంగా చంపి, తన సస్పెండ్‌కు కారణమైన డ్రగ్ డీలర్ సాల్మన్ సీజర్( బాబీ సింహా)ను మలేషియా నుంచి ఇండియాకు తీసుకురావాల్సిందిగా కోరతాడు. దీని కోసం రూ.25 లక్షలతో డీల్ కూడా కుదుర్చుకుంటాడు. అలా మలేషియా వెళ్లిన వీరయ్య.. సాల్మన్‌ని అట్టి పెట్టుకొని అతని అనయ్య మైఖేల్ సీజర్ అలియాస్ కాలా(ప్రకాశ్ రాజ్)కు ఎర వేస్తాడు. అసలు మైఖేల్ సీజర్‌కు, వీరయ్యకు మధ్య ఉన్న వైరం ఏంటి? మలేషియాలో వీరయ్యకు పరిచమైన అదితి(శ్రుతిహాసన్) ఎవరు? వీరయ్య సవతి సోదరుడైన ఏసీపీ విక్రమ్ సాగర్(రవితేజ) గతమేంటి? డ్రగ్స్ కేసుకు వీరయ్యకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు మైఖేల్‌ను ఇండియాకు తీసుకొచ్చి ఏం చేశాడు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
చిరంజీవి సినిమా అనగానే అభిమానులు కొన్ని లెక్కలేసుకుంటారు. మంచి ఫైట్ సీన్స్, డ్యాన్స్, కామెడీ.. ఇవన్నీ ఉండాలని కోరుకుంటారు. అందుకే కథ ఎలా ఉన్నా.. ఈ హంగులన్నీ పెట్టడానికి దర్శకులు ప్రయత్నిస్తుంటారు. వాల్తేరు వీరయ్యలో కూడా అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు బాబీ. అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్, తన మార్క్ కామెడీ, భారీ యాక్షన్ సీన్‌లతో కథను తీర్చిదిద్దాడు. అలా అని ఇది కొత్తగా ఉంటుందని చెప్పలేం. ఈ తరహా కథలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి. కాకపోతే చిరంజీవి ఇమేజ్‌పై దృష్టి పెట్టి.. దానికి తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంతో ఎక్కడా బోర్ కొట్టిన ఫీలింగ్ రాదు. అలాగే మాస్ మహారాజ రవితేజ ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయింది.
పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులను సాల్మన్ అతికిరాతంగా చంపడంతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫస్ట్ సీన్‌లోనే విలన్ పాత్ర ఎంత కిరాతకంగా ఉండబోతుందో చూపించాడు దర్శకుడు. ఆ తర్వాత నేవీ దళాన్ని కాపాడడానికి సముద్రంలో వీరయ్య చేసే ఓ భారీ ఫైట్‌తో హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. వీరయ్య మలేషియాకు షిఫ్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సాల్మన్‌ని కిడ్నాప్ చేయడానికి వీరయ్య టీమ్ వేసే ప్లాన్ నవ్వులు పూయిస్తుంది. అలాగే శ్రుతీహాసన్‌తో చిరు చేసే రొమాన్స్ అభిమానులను అలరిస్తుంది. కానీ కథనం నెమ్మదిగా సాగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అదిరిపోతుంది.
ఇక అసలు కథ సెకండాఫ్‌లో మొదలవుతుంది. ఏసీపీ విక్రమ్‌గా రవితేజ ఎంట్రీ, అన్నదమ్ముల మధ్య వచ్చే టిట్ ఫర్ టాట్ ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్‌లో చిరంజీవి సినిమా డైలాగ్ రవితేజ చెప్పడం.. రవితేజ సినిమా డైలాగ్ చిరంజీవి చెప్పడం నవ్వులు పూయిస్తుంది. అయితే ఇవన్ని ఇలా వచ్చి అలా పోతుంటాయి కానీ.. ఎక్కడా వావ్ మూమెంట్స్‌ని ఇవ్వలేకపోతాయి.
అలాగే అన్నదమ్ముల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందనేది బలంగా చూపించలేకపోయాడు. డ్రగ్స్ పట్టుకునే సీన్స్ కూడా పేలవంగా ఉంటాయి. అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ కారులో చిరంజీవి, రవితేజ మాట్లాడుకోవడం.. చిరు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను ఎమోషనల్‌కు గురిచేస్తాయి. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ప్రయోగాలకు పోకుండా.. అభిమానులు కోరుకునే అంశాలతో ఓ రొటీన్ కథను అంతే రొటీన్‌గా చెప్పాడు డైరెక్టర్. అయితే చిరంజీవి ఇమేజ్‌కు తగ్గట్టుగా సన్నివేశాలు డిజైన్ చేసుకోవడంలో మాత్రం బాబీ సఫలం అయ్యాడు.
ఎవరెలా చేశారంటే..
చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. వీరయ్య పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా కాలం తర్వాత మెగాస్టార్‌ని మాస్ లుక్‌లో చూస్తారు. ఒకప్పుడు చిరు చేసే కామెడీ, ఫైట్ సీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. తెరపై చాలా యంగ్‌గా కనిపిస్తాడు. ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టేశాడు. ఇక ఏసీపీ విక్రమ్‌గా రవితేజ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అదితిగా శ్రుతిహాసన్ ఉన్నంతలో చక్కగా నటించింది. అయితే ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. కానీ ఫైట్ సీన్‌లో మాత్రం అదరగొట్టేసింది. డ్రగ్స్ మాఫియా లీడర్ సాల్మన్ సీజర్‌గా బాబీ సింహా, అతని సోదరుడు మైఖేల్‌గా ప్రకాశ్ రాజ్ తన పాత్రలకు న్యాయం చేశారు. కానీ వాళ్లది రొటీన్ విలనిజమే. వెన్నెల కిశోర్ కామెడీ పంచ్‌లు బాగున్నాయి. పోలీసు అధికారి సీతాపతిగా రాజేంద్రప్రసాద్‌తో పాటు షకలక శంకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక సాంకేతిక విషయానికొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం. 'బాస్ పార్టీ' నుంచి 'పూనకాలు లోడింగ్' సాంగ్ వరకు డీఎస్పీ కొట్టిన సాంగ్స్ ఓ ఊపు ఊపేశాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. ఆర్థన్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టి, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment