చిరంజీవి సినిమా.. రవితేజ చేయనన్నాడు: దర్శకుడు బాబీ | Director Bobby Says Ravi Teja First Reject Waltair Veerayya Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Waltair Veerayya Movie: వాల్తేరు వీరయ్యలో రవితేజ చేయనన్నాడు.. కథ చెప్తానన్నా వద్దని రిజెక్ట్‌..

Published Thu, Jan 18 2024 2:21 PM | Last Updated on Thu, Jan 18 2024 3:05 PM

Director Bobby Says Ravi Teja Reject Waltair Veerayya Movie - Sakshi

గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ రెండు వందల కోట్లకుపైగా రాబట్టింది. ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించాడు. నిజానికి మొదట్లో రవితేజను ఈ సినిమా కోసం అనుకోలేదట. తీరా అనుకున్నాక మాస్‌ మహారాజ సినిమా చేయనన్నాడట. ఆ విశేషాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు దర్శకుడు బాబీ అలియాస్‌ కేఎస్‌ రవీంద్ర.

నాకు బ్రేక్‌ ఇచ్చింది రవితేజ
'నేను ఈ సినిమా కథ చెప్పగానే చిరంజీవి ఓకే అన్నారు. అప్పటికింకా రవితేజ పాత్ర రాసుకోలేదు. కానీ నాకే ఎక్కడో తెలియని అసంతృప్తి. రవితేజ లాంటి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందనిపించింది. రచయితగా ఎన్నో కష్టాలు పడుతూ, అద్దె కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో రవితేజ నన్ను గుర్తించి దర్శకుడిగా నాకో అవకాశం ఇచ్చారు. అలా ఆయనతో పవర్‌ సినిమా తీశాను. అప్పటినుంచి పెన్ను పట్టుకుంటే చాలు రవితేజయే గుర్తొస్తుంటాడు. అలా ఓరోజు వాల్తేరు వీరయ్య కథ సెకండాఫ్‌లో రవితేజను తీసుకొద్దాం అని నా టీమ్‌కు చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు. కానీ అప్పటికే చిరంజీవితో 80 శాతం సినిమా పూర్తయింది.

రవితేజ పాత్రపై ఆరు నెలలు కష్టపడ్డా
అలాంటి సమయంలో తమ్ముడి పాత్రను హైలైట్‌ చేసి మళ్లీ షూటింగ్‌ చేద్దామంటే ఏమంటారోనని భయపడ్డాను. రవితేజ పేరు చెప్పకుండా సెకండాఫ్‌లో తమ్ముడి పాత్ర ఇలా ఉంటుందని చిరుకు చూచాయగా చెప్పాను. ఆయన వెంటనే ఆ తమ్ముడి పాత్ర చేసేది రవితేజ కదా.. అదిరిపోయిందన్నారు. నిర్మాతకు చెప్తే ఆయన కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. బడ్జెట్‌ పెరిగినా ఓకే, మేము చూసుకుంటాం.. కానీ మిస్‌ఫైర్‌ కాకుండా చూసుకో అని సుతిమెత్తగా హెచ్చరించారు. అప్పటివరకు షూట్‌ చేసిన సెకండాఫ్‌ పక్కనపడేశాం. అయితే రవితేజ ఎప్పుడూ సపోర్టింగ్‌ రోల్‌ చేయలేదు. ఆయన్ను ఎలా అడగాలా? అని నాలో నేనే మథనపడ్డాను. ఆరు నెలలపాటు ఆ పాత్రను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుకుని ఆ తర్వాత రవితేజ దగ్గరకు వెళ్లాను.

రవితేజ ఒప్పుకోలేదు
సర్‌, నాకు రేపు ఒక గంటపాటు సమయం కేటాయిస్తే కథ చెప్తాను అన్నాను. చిరంజీవి సినిమా అయిపోయాక మాట్లాడుకుందాం అన్నారు. నేను ఓ క్షణం ఆగి చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని చెప్పాను. ఆయన సినిమాలో నాకోసం ఓ పాత్ర అనుకుంటున్నావా? అని నేరుగా అడిగేశారు. అందుకు నేను అవును సర్‌, ముందు కథ చెప్తాను.. నచ్చితేనే చేయండి అన్నాను. ఆయన మాత్రం వద్దులే అబ్బాయ్‌.. ఇప్పటికే నాకు వరుసగా సినిమాలున్నాయ్‌.. మళ్లీ నువ్వు కథ చెప్పాక నచ్చలేదంటే బాగోదు. చిరు అన్నయ్య సినిమాను రవి రిజెక్ట్‌ చేశాడన్న పేరు వద్దన్నారు.

మొత్తానికి సరేనన్నారు
సర్‌, మీరు కథ వినండి.. నచ్చకపోతే చేయొద్దు. అసలు నేను మిమ్మల్ని సంప్రదించిన విషయం కూడా ఎవరికీ చెప్పనన్నాను. అప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. కట్‌ చేస్తే తెల్లారి కలుద్దామన్నారు. వెళ్లి కథ చెప్పగా.. అన్నయ్యతో ఎప్పటినుంచో చేయాలనుంది, చేసేద్దాం అన్నారు. అలా వారిద్దరి కాంబినేషన్‌ కుదిరింది' అని చెప్పుకొచ్చాడు బాబీ. కాగా వాల్తేరు వీరయ్య చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మించారు. ప్రకాశ్‌ రాజ్‌, బాబీ సింహా, కేథరిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement