ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు.
(చదవండి: ‘నాట్యం’మూవీ రివ్యూ)
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాట్యం చిత్రాన్ని చూశాను. ఇది సినిమా కాదు కళాఖండం. సినిమా అనేది కేవలం వినోదం కోసం కాదు. మరుగున పడిపోతోన్న కళలు, సంస్కృతులకు జీవం పోసి, భావి తరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. కెమెరామెన్ కూడా ఆయనే కావడంతో సన్నివేశాలను చక్కగా క్యాప్చర్ చేశారు. సినిమాను ఎన్నిసార్లు చుసిన తనివి తీరదు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాతలకు అభినందనలు’ అన్నారు.
‘నాట్యం’పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు
నాట్యం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి.. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment