
నిర్మలా వసంత్
సాక్షి, అమరావతి: ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతిరోజూ ప్రసారమయ్యే ‘పాడి–పంట’ కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్‌లో మరణించారు. ఈ నెల 8న కూడా ఆమె ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్యక్రమమే అయినా అన్ని వర్గాల శ్రోతలను ఆమె ఆకట్టుకునేవారు. ఆకాశవాణి కేంద్రం ద్వారా వ్యవసాయదారులకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుని రేడియో సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నిర్మలా వసంత్ పల్లెటూరి యాసతో పాడిపంటకు జీవం పోశారని ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ జాతీయ నాయకుడు వలేటి గోపీచంద్ కొనియాడారు.