akasavani
-
ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు..
ఆకాశవాణి రేడియో కేంద్రం.. ఆబాలగోపాలాన్ని అలరించిన అత్యంత ప్రియనేస్తం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. మన సంస్కృతిని సజీవంగా నిలిపిన ఓషధి. జాతీయ సమైక్యతకు సారథి. కళాకారులకు పెన్నిధి. ఒక్కమాటలో చెప్పాలంటే.. యావత్ భారత జనజీవనాన్ని అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను నిలపడంలో, కళలు మొదలు కరెంట్ అఫైర్స్ వరకు ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వివిధ సమయాల్లో ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. అలనాటి తరాన్ని అలరించిన ఆకాశవాణి.. ఇప్పుడు సింహపురి వాణిగా శ్రోతలను అలరిస్తోంది. నెల్లూరు(బారకాసు): ఆకాశవాణి.. విజయవాడ, విశాఖపట్నం కేంద్రమంటూ సమాజంలో జరిగిన ముఖ్యమైన విశేషాలను వార్తల రూపంలో ప్రసారాలతో శ్రోతలను రేడియోలకు కట్టిపడేసింది. పాడి పంటలు, నాటికలు, భక్తి గీతాలు, సినీపాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఇలా అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసి అలరించేది. సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు శ్రోతలను ఓలలాడించిన రేడియో ఆధునిక టెక్నాలజీ కారణంగా కనుమరుగైంది. టెలివిజన్ రంగం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈక్రమంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఎఫ్ఎం స్టేషన్లను తీసుకురావడం ద్వారా ఆకాశవాణి ప్రసారాల్లో నాణ్యత, స్పష్టత పెరిగింది. దీంతో శ్రోతలు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి (భారత ప్రజా సేవా ప్రసార సంస్థ)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల భాషకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన వివిధ కార్యక్రమాలను ప్రసారాలు చేయడం ప్రారంభించింది. చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు) నెల్లూరులో.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరుకు ఆకాశవాణి కేంద్రం మంజూరైంది. ఈ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు దీనిని గత నెల 27వ తేదీన ఆయన చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం. కార్పొరేట్ హంగులతో భవనాన్ని నిర్మించి అందులో అత్యాధునిక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో వంద మీటర్ల ఎత్తులో ప్రసార టవర్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈ కేంద్రం నుంచి 85 కి.మీ. మేర వరకు ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇదే కేంద్రం నుంచి కేవలం 45 కి.మీ. మేర లోపే ప్రసారాలు అందుబాటులో ఉండేవి. నెల్లూరులో స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, స్థానిక పండగల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. సింహపురిలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన రాష్ట్రంలో మొదటగా విజయవాడ తర్వాత విశాఖపట్నం, కడప, తిరుపతి రేడియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతకాలానికి అనంతపురం, కర్నూలు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఇటీవల నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడి కేంద్రం విశేషాలు ►నెల్లూరులో 2019 మేలో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభం ►అదే ఏడాది నవంబర్‌లో ఎఫ్ఎంఎస్ ఆధారిత సేవలు ►2020 ఫిబ్రవరిలో ఉదయం కార్యక్రమాలు ప్రారంభం. ►2020 సంవత్సరం జూలైలో ఆకాశవాణి కేంద్రాన్ని సింహపురి ఎఫ్ఎం కేంద్రంగా మార్చారు. ►2020 ఆగస్టులో సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ►న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచానికి సింహపురి ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి.. ►2021 నవంబర్‌లో జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ప్రత్యేక బులెటిన్ ప్రసారం. ►కరోనా కాలంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. ►నెల్లూరుకు చెందిన వారితో కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు ప్రసారం. ►స్థానిక సాహితీవేత్తల సహకారంతో ప్రకృతి నేర్పిన పాఠాలు, పెన్నా కథల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. ►ప్రసార సామర్థ్యాన్ని పెంచేందుకు టవర్ ఎత్తును వంద మీటర్ల వరకు ఏర్పాటు. ►ఎంత వ్యయంతో.. : రూ.15 కోట్లు ►ప్రసారాలు : ఉదయం 5.48 నుంచి రాత్రి 11.11 గంటల వరకు -
తూర్పున వాలిన సూర్యుడు
తెలుగు సాహిత్య వీధుల్లో అర్ధ శతాబ్ది పాటు రంగురంగుల వెలుగుపూలు పూయించిన సిద్ధుడు, అసాధ్యుడు శ్రీకాంత శర్మ. 1944లో గోదావరి జిల్లా రామచంద్రాపురంలో పుట్టారు. సంస్కృతాంధ్రా లలోనే కాక ఆంగ్లంలో సైతం మంచి పట్టు సాధించారు. కొద్దికాలం బడిలో పాఠాలు చెప్పారు. ఆనక పత్రికా రంగానికి వచ్చి ఒక ప్రముఖ వార పత్రిక సంపాదక వర్గంలో కుదురుకున్నారు. 1976లో విజయవాడ ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్‌గా శర్మని తీసుకున్నారు. ఎలాగంటే– ఆ ఉద్యోగానికి అర్హత ఉన్నత విద్యతోబాటు గరిష్టంగా 30 ఏళ్ల వయస్సు. అప్పుడు స్టేషన్ డైరెక్టర్‌గా బాలాంత్రపు రజనీకాంతరావు ఏలుతున్నారు. ఎలాగైనా ఇంద్రగంటివారి అబ్బాయిని రేడియోలోకి లాగితే స్టేషన్ బాగుపడుతుందనుకున్నారు. అన్నిట్లో నెగ్గిన శ్రీకాంత శర్మ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాయించారు. తీరా చేరాక, అన్నిరకాల రాత కోతల్లో శర్మ తల, చేతులు పెట్టాక, ఢిల్లీ నుంచి రజనీకి శ్రీముఖం వచ్చింది. మన విధి విధానాల్లో వయసు పరిమితి 30 కదా. శ్రీకాంత శర్మకి 32 కదా అంటూ తాఖీదిచ్చారు. రజనీ అంటే అప్పటికే అతడనేక యుద్ధముల నారితేరిన గడుసు పిండం. మంచిదనిపిస్తే ముందు చేయదలచిన పనులు పూర్తి చేసి తర్వాత సమర్థించుకోవడమే ఆయనకు తెలుసు. ‘అయ్యా, మన నిబంధనావళిలో ప్రిఫరబ్లీ 30 ఇయర్స్ అని ఉండటం చేతనూ, కుర్రవాడు చాకు అవడం చేతనూ రెండేళ్లని పక్కన పెట్టడం జరిగింది. అయినా, ఇకపై ఇలా హద్దు మీరడం ఉండదని మనవి’ అని జవాబిచ్చారు. చవగండాలు తప్పుకుని శ్రీకాంత శర్మ, ఏకు మేకై 1996 దాకా ఆకాశవాణిని సేవించారు. శర్మ పాడింది పాటగా విజయవాడ రేడియో నడిచింది. ఎన్ని పల్లవులు? ఎన్ని పాటలు? ఎమ్మెస్ శ్రీరాం అంటే ప్రఖ్యాత వైణికులు ఈమని శంకరశాస్త్రి మేనల్లుడు. ఆయన రేడియోలో సంగీత శాఖాధిపతిగా ఉన్నప్పుడు, శర్మకి ట్యూన్లు చెప్పి పాటలు ఇమ్మన్నాడు. ఆ ఒరవడిలో ఉరవడిలో వచ్చిన తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా.. పాట. అప్పటికీ ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందిన శర్మ పాట. శర్మ మనసులో పాట అలవోకగా పల్లవిస్తుంది. పరిమళిస్తుంది. ‘శ్రావణాన మధురమైన వలపు తలపు తేనె సోన..., కనరే నీలి వెన్నెల..., తెరపు మరపు మనసులో విరజాజి వెన్నెల నీడలో...’ ఇలా తెంపు లేకుండా రసికుల జ్ఞాపకాల్లోంచి వస్తూనే ఉంటాయ్. దేవులపల్లి కృష్ణ శాస్త్రీయం బలంగా ఆవహించి ఉన్నా, చెట్టు ఇస్మాయిల్ ధోరణి ఆవరించి ఉన్నా, శేషేంద్ర మధ్య మధ్య పలకరిస్తున్నా సకాలంలో వైదొలగి తన సొంత కక్ష్యలో ఏ ఉల్కల బారినా పడకుండా హాయిగా పరిభ్రమిస్తూనే గడిపారు. ప్రోజు, పొయిట్రీ, పద్యం, నాటకం, పత్రి కారచన– ఇలా అన్ని ప్రక్రియల్ని వెలిగించి పూయించారు శ్రీకాంత శర్మ. మితంగానే అయినా మంచి పాటలు సినిమాలకి రాశారు. కృష్ణ శాస్త్రి, భుజంగరాయశర్మల తర్వాత వెంపటి చినసత్యం మేష్టారికి కూచిపూడి నృత్యరూపక కర్తగా ఆ స్థాయిని నిలబెట్టారు. నలభై పైబడిన మా స్నేహంలో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు.చివరిదాకా హాస్యోక్తులతోనే మా మాటలు సాగాయి. శర్మ కాగితం మీదికి వస్తేనే సీరియస్గానీ లేదంటే హ్యూమరే! శర్మ చాలా తరచుగా మద్రాసు వచ్చేవారు. నాతోనే ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు మా అబ్బాయ్ అక్షరాభ్యాసం నిర్ణయమైంది. సామగ్రిని పిల్లాణ్ణి తీసుకుని రమణ గారింటికి వెళ్లాం. వాళ్లిద్దరి చేతా చెరో అక్షరం దిద్దించాలని సంకల్పం. తీరా అక్క డికి వెళ్లాక ‘మేం కాదు. ఇక్కడీ సాహితీ శిఖరం ఉండగా మేమా, తప్పు’ అంటూ బాపురమణ మా అబ్బాయిని శర్మగారి ఒళ్లో కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించారు. ఆ సన్నివేశం అలా సుఖాంతమైంది. కొన్నాళ్లు గడిచాయ్. బళ్లో మావాడి ప్రోగ్రెస్ కార్డు ఎప్పుడొచ్చినా, కాపీ తీయించి శర్మకి పోస్ట్ చేసేవాణ్ణి. ‘ఇదేంటండీ, నన్నీ విధంగా హింస పెడుతున్నారు. నేను వద్దు మొర్రో అంటున్నా వినకుండా నాతో దిద్దబెట్టించారు. నేనెప్పుడూ లెక్కల్లో పూరే. వాడికి లెక్కల్లో తోకలేని తొమ్మిదులు, తలలేని ఆర్లు వస్తుంటే నాదా పూచీ’ అంటూ జవాబులు వస్తుండేవి. అయ్యా, లెక్కలు సరే. తెలుగూ అట్లాగే ఉంది. ‘స్నానం పోసు కోవడం’ లాంటి మాటలొస్తున్నాయ్ అనే వాడిని. ఆప్తమిత్రుని అనారోగ్యం మాటలు వింటూనే ఉన్నా, ఇప్పుడే ఇంతటి విషాద వార్త వింటానని అనుకోలేదు. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రికి నేనంటే ఎంతో వాత్సల్యం. నాకో మంచి ముందుమాట రాశారు. శ్రీకాంత శర్మ సరేసరి. శ్రీమతి జానకి బాల, పిల్లలు మా స్నేహం నించి హితంగా సన్నిహితంగానే ఉన్నాం. ఇంద్రగంటి వారితో మూడు తరాల అనుబంధం. ఇంటిల్లి పాదీ మాటలకోర్లు. ఎప్పుడు కలిసినా ఎన్నాళ్లున్నా టైము మిగిలేది కాదు. శర్మ పార్థివ దేహాన్ని కడసారి దర్శించడానికి వెళ్లినపుడు దుఃఖం పెల్లుబికి వచ్చింది. మోహనకృష్ణ తన సినిమాకి తండ్రి రాసిన పాట గురించి ప్రస్తావించారు. కిరణ్మయి కూడా తనకు రాసిన పాట చెప్పింది. ప్రయోజకులై, బుద్ధిమంతులై, తల్లిదండ్రులను నడిపిస్తూ ఉండే పిల్లలున్న తండ్రి మా శ్రీకాంత శర్మ అన్పించింది. నా కళ్లలోంచి ఆనంద బాష్పాలు రాలాయి. స్నేహశీలికి అశ్రు తర్పణం. శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు -
రేడియో ‘చిన్నమ్మ’ ఇక లేరు
సాక్షి, అమరావతి: ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రతిరోజూ ప్రసారమయ్యే ‘పాడి–పంట’ కార్యక్రమంలో ‘చిన్నమ్మ’గా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం హైదరాబాద్‌లో మరణించారు. ఈ నెల 8న కూడా ఆమె ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్యక్రమమే అయినా అన్ని వర్గాల శ్రోతలను ఆమె ఆకట్టుకునేవారు. ఆకాశవాణి కేంద్రం ద్వారా వ్యవసాయదారులకు ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుని రేడియో సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. నిర్మలా వసంత్ పల్లెటూరి యాసతో పాడిపంటకు జీవం పోశారని ప్రోగ్రాం స్టాఫ్ అసోసియేషన్ జాతీయ నాయకుడు వలేటి గోపీచంద్ కొనియాడారు. -
మూగబోయిన 'వాణి '
కడప : ఆకాశవాణి కడప కేంద్రంలో సీనియర్ అనౌన్సర్‌గా పనిచేస్తున్న కొత్తమాసి పుష్పరాజ్(58) గురువారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొత్తమాసి పుష్పరాజ్ 1960వ సంవత్సరం సెప్టెంబరు 17వ తేదిన కర్నూలు జిల్లా మద్దూరులో జన్మించారు. 1991లో అనంతపురం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్‌గా విధుల్లో చేరారు. ఆ తర్వాత 2001లో కడప ఆకాశవాణి కేంద్రానికి బదిలీపై వచ్చారు. 27 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో రాయలసీమ వాసులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాటికలు, కథలు, కథానికలు, రూపకాలు నిర్వహించి శ్రోతల్లో ప్రత్యేక గుర్తింపు సాధించారు. కడప ఆకాశవాణి కేంద్రంలో ప్రతిరోజు ప్రసారమయ్యే హలో అభిరుచి ప్రత్యక్ష కార్యక్రమం ద్వారా ఎందరో శ్రోతల హృదయాల్లో స్థానం సంపాదించారు. చతురతతో, చమత్కార మాటలతో శ్రోతలను ఆకట్టుకుంటూ నవ్వుల వర్షం కురిపించేవారు. పుష్పరాజ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణం పట్ల ఆకాశవాణి కడప కేంద్రం అధికారులు, సిబ్బంది, నగర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూత
సాక్షి, విజయవాడ : ప్రముఖ వాగ్గేయ కారుడు, ఆకాశవాణి విశ్రాంత సంచాలకుడు, రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు(98) మరి లేరు. ఆదివారం ఉదయం విజయవాడ సీతారామపురంలోని తన స్వగృహంలో ఆయన కన్నుమూశారు. సంగీత, సాహిత్యాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రజనీకాంతరావు విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చినవారిలో కీలకమైనవారు. ఆకాశవాణి రజనీకాంతరావుగా ఆయన సుప్రసిద్ధులు. రజనీకాంతరావు 1920 జనవరి 29న పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జన్మించారు. ఆయన తండ్రి బాలాంత్రపు వేంకటరావు ప్రసిద్ధి చెందిన వేంకట పార్వతీశ కవుల్లో ఒకరు. బాలాంత్రపు 1941లో మద్రాస్ ఆలిండియా రేడియోలో ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా చేరి అంచెలంచెలుగా స్టేషన్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1947 ఆగస్ట్ 15న బాలాంత్రపు స్వయంగా రచించి బాణీలు సమకూర్చిన మోగించు జయభేరి..వాయించు నగారా గీతం మద్రాసు ఆకాశవాణి నుంచి ప్రసారమైంది. అలా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున రేడియోలో దేశభక్తి గీతం పాడిన ఘనత ఆయనకే దక్కింది. ‘మాది స్వతంత్ర దేశం.. మాదీ స్వతంత్ర జాతి’ అనే దేశభక్తి గేయాన్ని రచించి బాణీలు సమకూర్చారు. ఆ గీతం తెలుగుజాతికెంతో ఉత్తేజాన్నిచ్చింది. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఘంటసాల, సుశీల, టంగుటూరి సూర్యకుమారి తదితరులతో రేడియోలో అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేసిన ఘనత ఆయనది. తొలితరం సంగీత దర్శకుల్లో బాలాంత్రపు ఒకరు. లలిత సంగీతం, యక్షగానాలతో రేడియో శ్రోతల అభిమానాన్ని సంపాదించారు. ఆయన భక్తిరంజని, ధర్మసందేహాలు వంటి కార్యక్రమాలతో అందరికీ సుపరిచితులు. చండీదాస్, గ్రీష్మ రుతువు వంటి పలు స్వీయ రచనలు చేశారు. శతపత్ర సుందరి పేరుతో గేయ సంకలన రచన చేశారు. పలు చలనచిత్రాలకు సైతం బాలాంత్రపు సంగీతం అందించారు. ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు, రావు బాలసరస్వతిలను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది ఆయనే. జేజి మమయ్య పేరుతో చిన్న పిల్లల పాటను ఆకాశవాణిలో బాలాంత్రపు ప్రసారం చేశారు. రజనీకాంతరావు రచించిన వాగ్గేయకార చరిత్ర 20వ శతాబ్దంలో తెలుగులో వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఒకటి. దీనికిగాను ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 1961లో లభించింది. ఇదిగాక కళారత్న అవార్డు, కళాప్రపూర్ణ, ప్రతిభామూర్తి జీవితకాల సాఫల్య బహుమతి, నాథ సుధార్ణవ, పుంభావ సరస్వతి, నవీన వాగ్గేయకార వంటి మరెన్నో పురస్కారాలు కూడా ఆయనకు లభించాయి. 2015లో ఏపీ ప్రభుత్వం ఉగాది సందర్భంగా తెలుగు వెలుగు పురస్కారంతో సత్కరించింది. ఆయనకు ఐదుగురు సంతానం. ఏపీ సీఎం సంతాపం రజనీకాంతరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలువురి నివాళి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కా రంతోపాటు అనేక పురస్కారాలందుకున్న రజనీకాంతరావు మృతి సంగీత ప్రపంచానికి తీరనిలోటని పలువురు సంగీత అభిమానులు నివాళులర్పించారు. ఆయన భౌతికకాయాన్ని అభిమానులు, సంగీత ప్రియులు కడసారిగా దర్శించుకున్నారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఆకాశవాణి విశ్రాంత సంచాలకురాలు ప్రయాగ వేదవతి, పాండురంగ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ నగరంలోని స్వర్గపురిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం బాలాంత్రపు రజనీకాంతరావు మరణం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య, కళారంగాలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తెలుగుతల్లి ముద్దుబిడ్డల్లో రజనీకాంతరావు అగ్రగణ్యులని వైఎస్ జగన్ అన్నారు. రేడియో జర్నలిజం ద్వారా కళలను, సాహిత్యాన్ని, లలిత సంగీతాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లిన రజనీకాంతరావు చిరస్మరణీయులని, ఆయన మరణం సాహిత్య, కళారంగాలకు తీరని లోటని ఆయన అన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి
బాలాంత్రపు రజనీకాంతరావు పేరు చెబితే ఆకాశవాణి గుర్తుకొస్తుంది. ఆకాశవాణి పేరు చెబితే రజనీకాంతరావు గుర్తొస్తారు. ప్రారంభదశలో ఆకాశవాణికి జవం, జీవం ఇచ్చిన రూపశిల్పి ఆయన. తొలినాళ్లలో ఆకాశవాణికి దిశానిర్దేశం చేసిన దార్శనికుడాయన. గొప్ప గొప్ప కళాకారుల్ని పరిచయం చేయడమే కాక, భక్తిరంజని వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించిన సృజనశీలి... సంగీత, సాహిత్య శిఖరాలను అధిరోహించిన వాగ్గేయకారుడు రజనీకాంతరావుతో కొంతకాలం క్రితం సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి జరిపిన ప్రత్యేక సంభాషణ ఇది... మీ ఆధ్వర్యంలో ఆకాశవాణికి అంతర్జాతీయ అవార్డులూ వచ్చాయి. అప్పుడు మీ అనుభూతి..? అంతర్జాతీయ రేడియో కార్యక్రమాల పోటీలో మనం కూడా పాల్గొనాలి అని మా డైరెక్టర్ జనరల్ చెప్పారు. పోటీకి పంపాల్సిన కార్యక్రమాన్ని తయారు చేయమన్నారాయన. అది పిల్లలకు భౌగోళిక శాస్త్రం బోధించే విధంగా ఉండాలని చెప్పారు. అలా ఉండాలి అంటే... పిల్లలకు ఏ నదుల గురించో పర్వతాల గురించో వివరిస్తూ ఉన్నట్టుగా ఓ యాత్రాకథనాన్ని తయారు చేయాలనిపించింది నాకు. దాంతో ‘కొండ నుంచి కడలి దాకా’ అన్న కార్యక్రమానికి రూపకల్పన చేశాను. నది కొండల్లో పుట్టి సముద్రంలో కలుస్తుంది. ఆ క్రమంలో అది ఎన్నో ప్రాంతాలను స్పృశిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. కాబట్టి నా కార్యక్రమం ద్వారా ప్రజలకీ నదులకూ ఉన్న సంబంధం పిల్లలకు చెప్పినట్టు అవుతుంది అనిపించింది. అందులో అంతర్జాతీయ ఖ్యాతిని గడించడానికి తగిన అన్ని అంశాలూ ఉండటంతో ఊహించనంత పేరు, అవార్డూ వచ్చాయి ఆకాశవాణికి. స్వాతంత్య్రం వచ్చేనాటికి మీకు ఇరవయ్యేళ్లు. నాటి జ్ఞాపకాలేవైనా మాతో పంచుకుంటారా? అప్పట్లో బ్రిటిష్‌వాళ్ల ప్రాభవాన్ని చూశాను. స్వాతంత్య్ర ఉద్యమాన్నీ కళ్లారా చూశాను. రేడియోలో కూడా అందరూ ప్రసంగాలు ఇస్తుండేవారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ తన ప్రసంగం పూర్తయ్యాక జైహింద్ అనేవారు. అయితే అది ప్రసారం చేసేవాణ్ని కాదు నేను. జైహింద్ అనే సమయానికి స్విచ్ కట్టేసేవాణ్ని. అది దేశద్రోహం కాదు. ఆవిడ స్వాతంత్య్ర సమరయోధురాలు కాబట్టి అలా అనేది. కానీ నేను స్టేషన్ ఇన్చార్జిగా అన్నిటినీ సమానంగా చూడాలి కాబట్టి అలా చేసేవాడిని. మీరు ఎంతోమందిని పరిచయం చేశారు. పైకి తీసుకొచ్చారు. వారిలో మీరు గర్వంగా ఫీలయ్యే మీ శిష్యులెవరు? పన్నాల సుబ్రహ్మణ్యభట్టు, నేదునూరి కృష్ణమూర్తి, శ్రీపాద పినాకపాణి... వీళ్లు ముగ్గురూ నాకు మంచి శిష్యులు. సినిమాల్లో అవకాశాలొచ్చినా రేడియోలోనే ఎందుకు కొనసాగారు? నిజమే. కానీ నేను అప్పటికే రేడియోకి అలవాటు పడిపోయాను. పైగా అందులోనే ఉద్యోగం కాబట్టి వేరే దాని గురించి ఆలోచించడం అంతగా కుదరలేదు. పైగా ఒక రేడియో ఆఫీసర్‌గా నేను చాలా సంతోషాన్ని, గౌరవాన్ని అనుభవించాను. అందుకే నాకు రేడియోని వదిలిపెట్టబుద్ధి కాలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆకాశవాణిలో వచ్చిన మార్పులేంటి? అప్పట్లో మేము ఏదైనా రాస్తే... అది కచ్చితంగా అందరికీ ఉపయోగపడాలి అని ప్రతిజ్ఞ చేసి రాసేవాళ్లం. ఒకరి కంటే ఒకరు బాగా రాయాలని పోటీ పడేవాళ్లం. కానీ ఇప్పుడలా లేదు. కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు, సంగీత నాటక అకాడెమీ అవార్డు... ఈ రెండు అవార్డుల్నీ అందుకున్నవారు దేశం మొత్తంలో మీరొక్కరే. ఆ అనుభూతి గురించి చెప్తారా? సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. రాధాకృష్టన్‌గారు సాహితీ ప్రియులు. ఆయన వరండాలో ఉన్న ర్యాక్స్ నిండా పుస్తకాలే. అవన్నీ దాటుకుని, పైన ఉన్న ఆయన గదిలోకి వెళ్తే... ఆ గది నిండా కూడా పుస్తకాలే. ఆయన దగ్గర అన్ని ఉన్నా కూడా, నా చేతిలో ఉన్న పుస్తకం ఏంటా అని ఆయన ఆసక్తిగా చూసిన చూపుని నేను మర్చిపోలేను. అప్పుడు నా చేతిలో ఉన్నది ‘ఆంధ్ర వాగ్గేయకారుల చరితము’. దాన్ని తీసుకుని, అందులో ఉన్న ఓ పాటను పాడటం మొదలుపెట్టారాయన. అది మర్చిపోలేని అనుభవం. సంగీత నాటక అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అది కూడా చాలా సంతోషాన్ని కలిగించిన విషయం. చేయాలనుకుని చేయలేకపోయింది ఏదైనా ఉందా? జీవితంలో చేయాలనుకున్నవన్నీ చేశాను. ఏ వెలితీ లేదు. ఏ అసంతృప్తీ లేదు. టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి, ఘంటసాల, రాజేశ్వరరావు వంటివాళ్లందరితో మీరు పాటలు పాడించారు. వాళ్లంతా తర్వాత చాలా ఖ్యాతి గడించడం మీకు గర్వంగా అనిపించిందా? కచ్చితంగా గర్వించదగ్గ విషయమే. ఆగస్ట్ పదిహేను, అర్ధరాత్రి నెహ్రూగారి ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసారం పూర్తి కాగానే మద్రాస్ స్టేషన్లో డి.కె.పట్టమ్మాళ్ పాటను, తర్వాత నా పాటను ప్రసారం చేయాలి అనుకున్నారు. ఆ సందర్భం కోసం మంచి దేశభక్తి గీతాన్ని రాసి సూర్యకుమారితో పాడించాను. శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటను కూడా ఆమె నా ఆధ్వర్యంలోనే పాడింది. ఠాగూర్ పుట్టినరోజు కోసం‘ఓ నవ యువకా’ అనే పాట రాశాను. దానిని సరళ అనే ఆవిడతో పాడించాను. -
ఆకాశవాణి
-
ప్రముఖ రచయిత బాలాంత్రపు రజనీకాంతరావు ఇకలేరు
-
ఎన్నో చెవులు-కొన్నే పువ్వులు
చిత్తూరులో 1963లో ఆంధ్రప్రభ ఉద్యోగం నుంచి ఆకాశవాణి ఉద్యోగానికి హైదరాబాదు వెళ్తున్నప్పుడు ఈ దేశపు రెండో లోక్ సభ స్పీకరు అనంత శయనం అయ్యంగార్ అల్లుడు, నాకు అత్యంత ఆత్మీయులు కె.రామస్వామి అయ్యంగార్ ఒకే హితవు చెప్పారు. ‘‘మారుతీరావ్! ఎప్పుడూ నీ భార్యని నీ పక్కన ఉంచుకో. ఈ సమాజంలో ఏ కీడు జరిగినా నీకు గౌరవం, మర్యాద, స్థాయి పెరగాలంటే అది ముఖ్య సూత్రం’’ అని హితవు చెప్పారు. చిత్తూరులో ఉండగానే నాకు పెళ్లయింది. అప్పుడు చిత్తూరు కలెక్టరు బి.కె.రావుగారు. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సరిగ్గా అదే సలహాని ఆయనకి అనంతశయనం అయ్యంగార్ చెప్పారని రావుగారు చెప్పారు. జీవన ప్రయాణంలో భార్య, ధైర్యాన్నీ, హుందాతనాన్నీ, చేయూతనీ-ముఖ్యంగా పెద్దరికాన్నీ ఇస్తుంది. మన పురాణాల్లో మన్మదుడు శివుడిమీద పూలబాణం వేసినప్పడు కోపగించుకున్న శివుడు అతడిని భస్మం చేశాడు. నాకంత పరిజ్ఞానం లేదు కాని మల్లాది రామకృష్ణశాస్త్రి గారి భక్తుడినయిన నేను ఆయన రాసిన అపూర్వమైన యక్షగానంలో ‘ఈసుని దాసుగా సేతువా, అపసర అపచారము కాదా’ అన్న మాటల్ని మరిచిపోలేను. ఏతావాతా, ఆయన భార్య రతీదేవి ప్రార్థన మేరకు మన్మధుడు చావు తప్పి కన్నులొట్టపోయి బయట పడ్డాడు. కనుక ఏ విధంగా చూసినా భార్యల వల్ల భర్తలకు మేలు జరుగుతుందన్నది నిర్వివాదాంశం. అయితే ఇవన్నీ ఒక యెత్తు. పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు యాసిర్ షాకి-భార్య కారణంగా-జరిగిన మేలు అపూర్వం. అతను మత్తు పదార్థాలను తీసుకున్న అభియోగం మీద పడింది. ఆటనుంచి బర్తరఫ్ అయాడు. మంచి స్పిన్నర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం చాలామందిని బాధపెట్టింది. కాని యాసిర్ షా బాధపడలేదు. కారణం-ఎక్కడ ఈ పొరపాటు జరిగిందో ఆయనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ, ఆయనకి భార్య ఉపయోగపడింది. విచారణ జరిపినవారికి ఆయన నిజాన్ని వివరించాడు. ‘‘అయ్యా, నేను మత్తుగా కనిపించిన మాట నిజమే. కాని అందుకు కారణం నా భార్యకి రక్తపు పోటు ఉంది. ఆమె మాత్రలు వేసుకుంటుంది. నేను పొరపాటున ఆ మాత్రలు వేసేసుకున్నాను. కనుక నాకు లేని రక్తపు పోటు ఎక్కువయింది. మత్తులో ఊగిపోతున్న నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు’’ అని వక్కాణించాడు. ఇప్పుడు పాకిస్థాన్ ఐసీసీని ఒప్పించగలిగింది. దశాబ్దాలుగా తమ అబద్ధాలతో ప్రపంచాన్ని ఒప్పించబోతున్న పాకిస్థాన్‌కి ఈ చిన్న సాకుతో ఐసీసీ అధికారుల్ని ఒప్పించడం కష్టంకాదు. ఇలాంటి విషయాలు చెప్పడంలో పాకిస్థాన్‌వారు ఉదారులు. మిలటరీ స్థావరాలకు దగ్గరగా సంవత్సరాల తరబడి నివసించి పిల్లల్ని కంటున్న ఒసామా బిన్ లాడెన్ వారి దేశంలో లేడని బల్ల గుద్దారు. పాకిస్థాన్‌లో స్పష్టంగా మూడు అడ్రసులు ఉండి, వారి గొప్ప ఆటగాడు జావీద్ మియందాద్తో వియ్యం అందుకున్నా దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని మనసా వాచా వారు వక్కాణిస్తున్నారు. పది తప్పులు ఒక ఒప్పు అయినట్టుగా లేని రక్తపు పోటుకి రక్తపు పోటు ఉన్న భార్య మాత్రలు వేస్తే మత్తు పదార్థాలు సేవించినంత మత్తు వస్తుందని వారు నమ్మించగలిగారు. తత్ఫలితంగా యాసిర్ షా కేవలం మూడునెలలు మాత్రమే ఆటనుంచి బహిష్కృతుడయ్యాడు. ఈ శుభతరుణంలో నాకు మహమ్మద్ అజారుద్దీన్ జ్ఞాపకం వస్తున్నాడు. అంత గొప్ప ఆటగాడు-పాకిస్థాన్‌లో ఉండి ఉంటే, పొరపాటున ఆయన భార్య సంగీతా బిజిలానీ రక్తపు పోటు మాత్రలను ఆయన మింగి ఉంటే-తత్కారణంగా ఆయన మనస్సు కకావికలమయి-క్రికెట్లో జూదం ఆడాలనే చాపల్యం కలిగి ఉంటే-ఉదారులయిన పాకిస్థాన్ అధికారులు ఆయన్ని క్షమించి ఉంటే, మూడు నెలలే ఆయన్ని ఆటనుంచి బర్తరఫ్ చేసివుంటే-ఒక గొప్ప ఆటని జీవితమంతా చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు కలిసివచ్చేది. ప్రస్తుత తరానికి నా హితవు ఒకటుంది. రామస్వామి అయ్యంగార్, అనంత శయనం అయ్యంగార్ల హితవు మరిచిపోకండి. ఎన్నడూ భార్యల ప్రాధాన్యాన్ని శంకించకండి. ముఖ్యంగా వారికి రక్తపు పోటు ఉంటే అది మీ అదృష్టంగా భావించండి. వీలయినంత వరకు భార్యల అనారోగ్యానికి సంబంధించిన మందులను మీ పక్కనే ఉంచుకోండి. మీరు పదివేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినా, ప్రజల ఆస్తుల్ని అన్యాయంగా దోచుకున్నా, వ్యాపారంలో తప్పుడు లెక్కల్ని సూచించినా- మీ మీ భార్యల రక్తపు పోటు మాత్రలు మీకు శ్రీరామరక్ష కాగలవని గుర్తుంచుకోండి. ఉన్న ఒకే చిక్కల్లా-పాకిస్థాన్లోలాగా భారతదేశంలో చెవిలో పువ్వులున్నవారెవరూలేరు. కారణం ఉన్న పువ్వులన్నీ పాకిస్థాన్ పెద్దల చెవులకే చాలడం లేదు. - గొల్లపూడి మారుతీరావు -
సంగీత, సాహితీ దిగ్గజాల వాణి
కొత్త పుస్తకం ఇన్ని పత్రికలు, టీవీ చానళ్ళు లేని రోజుల్లో నిరక్షరాస్యులకు సైతం విజ్ఞానానికీ, వినోదానికీ రేడియోనే ఏకైక సాధనం. స్వతంత్ర భారతావని తొలినాళ్ళకు చెందిన తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రముఖులందరికీ ఆకాశవాణి కేంద్రమే చలువ పందిరి. ఆ కార్యక్రమాలన్నీ కొన్ని తరాలను ప్రభావితం చేసినవే. అయిదు దశాబ్దాలుగా రేడియోతో అనుబంధమున్న అనంత పద్మనాభరావు అక్షర రూపమిచ్చిన ‘అలనాటి ఆకాశవాణి’ కబుర్ల నుంచి కొన్ని జ్ఞాపకాలు... తెలుగు ప్రసారాలు ప్రారంభమై 76 సంవత్సరాలైంది. ఆకాశవాణి మదరాసు కేంద్రం 1938 జూన్ 1న మొదలైంది. అవిభక్త మదరాసు రాష్ట్ర రాజధాని నగరం చెన్నపట్టణం. అందువల్ల తెలుగు ప్రసారాలు అక్కడి నుండి జరిగేవి. ఎగ్మూర్‌లోని మార్షల్ రోడ్లో ఈస్ట్నూక్స్ మేడపై డాబా గదుల్లో రేడియో స్టేషన్ పెట్టడానికి వడ్రంగి పనులు, తాపీ పనులు చేసి స్టూడియో నిర్మాణం చేసి ఆస్బెస్టాస్ షీట్లు అమర్చారు. అది చూసిన వ్యక్తి డా॥బాలాంత్రపు రజనీకాంతరావు మనకు సజీవ సాక్షి. అప్పట్లో విద్యార్థి అయిన ఆయన తర్వాత అదే కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరడం చరిత్రలో భాగం. జూన్ 1న మదరాసు కేంద్రం నుండి ప్రసారమైన తొలి తెలుగు రేడియో నాటకం అనార్కలి. మొగలాయి వాతావరణం సృష్టించడానికి (శ్రవ్యమే అయినా) ఆ డాబా మీద గుండ్రని దిండ్లు, హుక్కాగొట్టాలను పెట్టుకొని దేవులపల్లి కృష్ణశాస్త్రి సలీంగా నటించారు. నలుగురు రచయితల నాటకాల ఆధారంగా ఆచంట జానకీరామ్ రేడియో స్క్రిప్టు ఏర్చికూర్చారు. మదరాసు కేంద్రం ప్రారంభించిన సరిగ్గా 10 సంవత్సరాలకు 1948 డిసెంబర్1న విజయవాడ స్టేషన్ ప్రారంభించారు. ప్రసారాలు అప్పట్లో సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు మొదలయ్యేవి. విజయవాడ కేంద్ర విశిష్టత పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు వంటివారు పనిచేయడం. ‘రజని’ డెరైక్టర్‌గా పనిచేసిన 1971-76 మధ్యకాలం స్వర్ణయుగం. అప్పుడు విజయవాడ కేంద్రంలో ఎందరో సంగీత మూర్తులు. అక్కడ పనిచేసిన మల్లిక్ ‘అదిగో అల్లదివో..’, ‘తందనాన అహి..’ అనే అన్నమయ్య కీర్తనలకు స్వరరచన చేశారని చాలామందికి తెలియదు. భద్రాద్రి రామయ్య కల్యాణం తెలుగునాట ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేసే ప్రత్యక్ష వ్యాఖ్యాన కార్యక్రమాలలో భద్రాచలం నుండి శ్రీరామనవమినాడు ప్రసారమయ్యే సీతారామచంద్ర కల్యాణం ప్రధానం. 1970 దశకంలో ఈ వ్యాఖ్యానాల కోసం శ్రోతలు ఉవ్విళ్లూరేవారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ పండితుడు రైలు దిగి రిక్షా వ్యక్తిని తమ ఇంటికి రమ్మని పిలిచారు. అతడు ఆ పండితుణ్ణి రిక్షా ఎక్కించుకొని మాటలు కలుపుతూ ఇరవై నిమిషాల్లో వారి ఇంటి వద్ద దించాడు. ఆ వ్యక్తి పది రూపాయలు తీసి రిక్షావాడి చేతుల్లో పెట్టారు. ‘వద్దు స్వామీ! భద్రాచల సీతారాముల్ని మా కళ్ల ముందు కనిపించేలా మీరు మాటలు చెప్పారు. డబ్బులు ఉంచండి స్వామీ!’ అని వెళ్లిపోయాడు. ఆ పండితుడెవరో కాదు - జమ్మలమడక మాధవరామశర్మ. కడప జ్ఞాపకాలు కడపలో కవి సమ్మేళనానికి ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, దాశరథి, పురిపండా, పుట్టపర్తి వంటి ప్రసిద్ధుల్ని ఆహ్వానించాం. ఎమర్జెన్సీ రోజులు. అందుకని ముందుగానే కవుల కవితల్ని చిత్రిక పట్టాము. ప్రభుత్వ వ్యతిరేక పదజాలాన్ని జల్లెడపట్టాం. శ్రీశ్రీ కవితలల్లలేదు. ‘‘ఇదుగో! అదుగో!’’ అంటూ హోటల్ గదిలోనే కాలక్షేపం చేస్తూ ఊరించారు. మాస్ అపీల్ కోసం సభలో శ్రీశ్రీని చివరి కవిగా వుంచాం. 10 నిమిషాల ముందు వారి వెనుకగా నుంచొని ‘‘కవిత!’’ అన్నాను మంద్ర స్వరంలో. ‘చెప్తాగా!’ అంటూ దాటవేశారు శ్రీశ్రీ. చివరిగా లేచి,‘మనదేమో నంబర్ వన్ డెమోక్రసీ/ఇదంతా హిపోక్రసీ’ అంటూ తూటాలు పేల్చారు. సభ చప్పట్లతో మారుమ్రోగింది. అలనాటి ఆకాశవాణి డా. ఆర్. అనంతపద్మనాభరావు, ప్రతులకు: రచయిత, బి 408, సాయికృపా రెసిడెన్సీ, మోతీనగర్, హైదరాబాద్. ఫోన్: 040-23831112 పేజీలు: 200, వెల: రూ. 180. -
వై కిరికిరి...టెల్ మీ కిరికిరి
-
ఆకాశవాణి: '9ఏళ్లు వ్యవసాయమే దండగన్నావ్'
-
'కాంగ్రెస్ అంటే పడనట్టు డ్రామాలు వేస్తావ్'
-
ఆకాశవాణి: 'చీకట్లో చిదంబరాన్ని కలుస్తావ్'
-
ఆకాశవాణి: విభజించమని ఢిల్లీకి ఉత్తరం రాస్తావ్...
-
ఆకాశవాణి: పేదవాడు ఇల్లు అడిగితే తరిమి తరిమి కొట్టిస్తావ్
-
ఆకాశవాణి: ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటావ్...
-
ఆకాశవాణి: రైతు బతుకు నీకు అంత సీపయిపోయిందా
-
ఆకాశవాణి: ఎకరం 50 వేలకే 830 ఎకరాలు ఇస్తావ్.
-
ఆకాశవాణి: రాష్ట్రం అగ్నిగుండంలా రగులుతుంటే....
-
ఆకాశవాణి: నోటితో స..మై..క్య... అని పలవవ్...
-
మీరిప్పుడు వేధింపుల కథ వింటారు..
*ఆకాశవాణిలో కొందరు పర్మినెంట్ ఉద్యోగుల దౌష్ట్యం *కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం *పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసిన మహిళలు *నోరెత్తితే ఉద్యోగం ఊడినట్లే *పట్టించుకోని ఉన్నతాధికారులు విజయవాడ : నిత్యం జనావళికి వార్తలనందించే ఆకాశవాణి కేంద్రం తాజాగా అదే ఓ వార్తయింది. ఆ విషయాన్ని అది నేరుగా శ్రోతలకు చెప్పకపోయినా ఆనోటా, ఈనోటా పాకి పెద్ద చర్చే జరుగుతోంది. గొప్ప ప్రసారంతోనో, పెద్ద అవార్డు అందుకునో కాదు.. కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్న మహిళలను వేధించడం ద్వారా కేంద్రం అభాసుపాలవుతోంది. ఆకాశవాణి కేంద్రంలో పర్మినెంట్ ఉద్యోగులు అడుగడుగునా కాంట్రాక్టు సిబ్బందిపై పెత్తనం చలాయిస్తూ వారిని వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 90 మంది కాంట్రాక్టు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలే. వేధిం పులు భరించలేక.. ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నామని కొందరు ఉద్యోగినులు వాపోతున్నారు. గతంలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే అక్కడున్న పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వరుస ఫిర్యాదులు.. పర్మినెంట్ న్యూస్‌రీడర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఒక మహిళా క్యాజువల్ అనౌన్సర్ ఇటీవల సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో కేసుపెట్టిన విషయం విదితమే. అప్పట్లో ఆ న్యూస్‌రీడర్‌ను ఆకాశవాణి ఉన్నతాధికారులు తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఎఫ్ఎం జాకీ సైతం ఓ అధికారిపై ఉమెన్ సెల్‌తోపాటు ఢిల్లీలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నర కిందట కొత్తగా నియమితులైన ఇద్దరు పర్మినెంట్ సిబ్బందిపై పురుష క్యాజువల్ అనౌన్సర్ ఏకంగా భౌతిక దాడికి దిగారు. వారు తన మాట వినడం లేదనే సాకుతోనే ఆయన ఈ దురాగతానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో చివరికి వారిద్దరు సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆంక్షల చట్రంలో.. పర్మినెంట్ ఉద్యోగుల వేధింపులపై ప్రశ్నిస్తే.. ఇక వారికి ఆకాశవాణిలో అడుగుపెట్టే అవకాశమే ఇవ్వడం లేదని కాంట్రాక్టు సిబ్బంది చెబుతున్నారు. న్యూస్రీడర్పై కేసు పెట్టిన మహిళా అనౌన్సర్, ఇటీవల మరో అధికారిపై ఫిర్యాదు చేసిన ఎఫ్ఎం జాకీకి సైతం కాంట్రాక్టు డ్యూటీలు వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు పేర్కొన్నారు. సవాలక్ష ఆంక్షలు పెడుతూ కాంట్రాక్టు సిబ్బంది బానిసలుగా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా అనౌన్సర్లు తమ ముందు సెల్ మాట్లాడకూడదని, అటూఇటూ తిరగకూడదని, ఖాళీగా ఉన్న పర్మినెంట్ ఉద్యోగుల కుర్చీల్లో కూర్చోకూడదంటూ షరతులు విధిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని కాంట్రాక్టు సిబ్బంది వాపోతున్నారు. ఈ గొడవ ముదురుపాకాన పడి మరింత రచ్చ కాకముందే ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఆకాశవాణి అధికారులను అడిగితే.. ఎవరికి వారు తమ విభాగాలకు సంబంధం లేదంటూ బదులివ్వడం కొసమెరుపు.