
ఎన్నో చెవులు-కొన్నే పువ్వులు
చిత్తూరులో 1963లో ఆంధ్రప్రభ ఉద్యోగం నుంచి ఆకాశవాణి ఉద్యోగానికి హైదరాబాదు వెళ్తున్నప్పుడు ఈ దేశపు రెండో లోక్ సభ స్పీకరు అనంత శయనం అయ్యంగార్ అల్లుడు, నాకు అత్యంత ఆత్మీయులు కె.రామస్వామి అయ్యంగార్ ఒకే హితవు చెప్పారు. ‘‘మారుతీరావ్! ఎప్పుడూ నీ భార్యని నీ పక్కన ఉంచుకో. ఈ సమాజంలో ఏ కీడు జరిగినా నీకు గౌరవం, మర్యాద, స్థాయి పెరగాలంటే అది ముఖ్య సూత్రం’’ అని హితవు చెప్పారు. చిత్తూరులో ఉండగానే నాకు పెళ్లయింది. అప్పుడు చిత్తూరు కలెక్టరు బి.కె.రావుగారు. తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు సరిగ్గా అదే సలహాని ఆయనకి అనంతశయనం అయ్యంగార్ చెప్పారని రావుగారు చెప్పారు. జీవన ప్రయాణంలో భార్య, ధైర్యాన్నీ, హుందాతనాన్నీ, చేయూతనీ-ముఖ్యంగా పెద్దరికాన్నీ ఇస్తుంది.
మన పురాణాల్లో మన్మదుడు శివుడిమీద పూలబాణం వేసినప్పడు కోపగించుకున్న శివుడు అతడిని భస్మం చేశాడు. నాకంత పరిజ్ఞానం లేదు కాని మల్లాది రామకృష్ణశాస్త్రి గారి భక్తుడినయిన నేను ఆయన రాసిన అపూర్వమైన యక్షగానంలో ‘ఈసుని దాసుగా సేతువా, అపసర అపచారము కాదా’ అన్న మాటల్ని మరిచిపోలేను. ఏతావాతా, ఆయన భార్య రతీదేవి ప్రార్థన మేరకు మన్మధుడు చావు తప్పి కన్నులొట్టపోయి బయట పడ్డాడు. కనుక ఏ విధంగా చూసినా భార్యల వల్ల భర్తలకు మేలు జరుగుతుందన్నది నిర్వివాదాంశం.
అయితే ఇవన్నీ ఒక యెత్తు. పాకిస్థాన్ క్రికెట్ ఆటగాడు యాసిర్ షాకి-భార్య కారణంగా-జరిగిన మేలు అపూర్వం. అతను మత్తు పదార్థాలను తీసుకున్న అభియోగం మీద పడింది. ఆటనుంచి బర్తరఫ్ అయాడు. మంచి స్పిన్నర్ మీద ఇలాంటి ఆరోపణలు రావడం చాలామందిని బాధపెట్టింది. కాని యాసిర్ షా బాధపడలేదు. కారణం-ఎక్కడ ఈ పొరపాటు జరిగిందో ఆయనకు కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ, ఆయనకి భార్య ఉపయోగపడింది. విచారణ జరిపినవారికి ఆయన నిజాన్ని వివరించాడు. ‘‘అయ్యా, నేను మత్తుగా కనిపించిన మాట నిజమే. కాని అందుకు కారణం నా భార్యకి రక్తపు పోటు ఉంది. ఆమె మాత్రలు వేసుకుంటుంది. నేను పొరపాటున ఆ మాత్రలు వేసేసుకున్నాను. కనుక నాకు లేని రక్తపు పోటు ఎక్కువయింది. మత్తులో ఊగిపోతున్న నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు’’ అని వక్కాణించాడు. ఇప్పుడు పాకిస్థాన్ ఐసీసీని ఒప్పించగలిగింది.
దశాబ్దాలుగా తమ అబద్ధాలతో ప్రపంచాన్ని ఒప్పించబోతున్న పాకిస్థాన్‌కి ఈ చిన్న సాకుతో ఐసీసీ అధికారుల్ని ఒప్పించడం కష్టంకాదు. ఇలాంటి విషయాలు చెప్పడంలో పాకిస్థాన్‌వారు ఉదారులు. మిలటరీ స్థావరాలకు దగ్గరగా సంవత్సరాల తరబడి నివసించి పిల్లల్ని కంటున్న ఒసామా బిన్ లాడెన్ వారి దేశంలో లేడని బల్ల గుద్దారు. పాకిస్థాన్‌లో స్పష్టంగా మూడు అడ్రసులు ఉండి, వారి గొప్ప ఆటగాడు జావీద్ మియందాద్‌తో వియ్యం అందుకున్నా దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడని మనసా వాచా వారు వక్కాణిస్తున్నారు. పది తప్పులు ఒక ఒప్పు అయినట్టుగా లేని రక్తపు పోటుకి రక్తపు పోటు ఉన్న భార్య మాత్రలు వేస్తే మత్తు పదార్థాలు సేవించినంత మత్తు వస్తుందని వారు నమ్మించగలిగారు. తత్ఫలితంగా యాసిర్ షా కేవలం మూడునెలలు మాత్రమే ఆటనుంచి బహిష్కృతుడయ్యాడు.
ఈ శుభతరుణంలో నాకు మహమ్మద్ అజారుద్దీన్ జ్ఞాపకం వస్తున్నాడు. అంత గొప్ప ఆటగాడు-పాకిస్థాన్‌లో ఉండి ఉంటే, పొరపాటున ఆయన భార్య సంగీతా బిజిలానీ రక్తపు పోటు మాత్రలను ఆయన మింగి ఉంటే-తత్కారణంగా ఆయన మనస్సు కకావికలమయి-క్రికెట్‌లో జూదం ఆడాలనే చాపల్యం కలిగి ఉంటే-ఉదారులయిన పాకిస్థాన్ అధికారులు ఆయన్ని క్షమించి ఉంటే, మూడు నెలలే ఆయన్ని ఆటనుంచి బర్తరఫ్ చేసివుంటే-ఒక గొప్ప ఆటని జీవితమంతా చూసే అవకాశం క్రికెట్ అభిమానులకు కలిసివచ్చేది.
ప్రస్తుత తరానికి నా హితవు ఒకటుంది. రామస్వామి అయ్యంగార్, అనంత శయనం అయ్యంగార్‌ల హితవు మరిచిపోకండి. ఎన్నడూ భార్యల ప్రాధాన్యాన్ని శంకించకండి. ముఖ్యంగా వారికి రక్తపు పోటు ఉంటే అది మీ అదృష్టంగా భావించండి. వీలయినంత వరకు భార్యల అనారోగ్యానికి సంబంధించిన మందులను మీ పక్కనే ఉంచుకోండి. మీరు పదివేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడినా, ప్రజల ఆస్తుల్ని అన్యాయంగా దోచుకున్నా, వ్యాపారంలో తప్పుడు లెక్కల్ని సూచించినా- మీ మీ భార్యల రక్తపు పోటు మాత్రలు మీకు శ్రీరామరక్ష కాగలవని గుర్తుంచుకోండి. ఉన్న ఒకే చిక్కల్లా-పాకిస్థాన్‌లోలాగా భారతదేశంలో చెవిలో పువ్వులున్నవారెవరూలేరు. కారణం ఉన్న పువ్వులన్నీ పాకిస్థాన్ పెద్దల చెవులకే చాలడం లేదు.
- గొల్లపూడి మారుతీరావు