బాలనటిగా కెరీర్ ఆరంభించిన పూర్ణిమ సింగర్ అవుదామనుకుంది. కానీ కాలం, ఆమెలోని నటనా చాతుర్యం ఆమెను నటిని చేసింది. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'పుత్తడిబొమ్మ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' వంటి సినిమాలతో హీరోయిన్‌గా అలరించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు సైతం పోషించి తెలుగువారి మనసుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూర్ణిమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
'నా పేరు మలయాళంలో సుధ, తెలుగులో పూర్ణిమ. నేను సింగర్ అవుదామనుకున్నా, కానీ నటినయ్యా. హీరోయిన్‌గా చేస్తున్నప్పుడే కృష్ణగారికి చెల్లెలిగా కూడా చేశా. సావిత్రిగారితో కూడా నటించాను. ఆమె చనిపోయే ముందు రోజుల్లో.. పాన్ తింటూ ఇలా యాక్ట్ చేయాలి, అలా చేయాలని సూచనలిచ్చేవారు. ఇక నేను సినిమా ఆర్టిస్ట్ అని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆరు సంబంధాలు వచ్చినదారినే వెళ్లిపోయాయి. నాకింక లైఫ్‌లో పెళ్లవదు, కుమారిగానే మిగిలిపోతాననుకున్నా. కానీ 1998లో నాకు పెళ్లైంది.
నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో వైజాగ్ అందాలు చూసివద్దామని నేను, నరేశ్ బైక్‌పై వెళ్లి వస్తుండగా చున్నీ టైర్‌లో చుట్టుకోవడంతో కింద పడిపోయా, గాయాలయ్యాయి. నన్ను అలా చూసి నరేశ్ కంట్లో నీళ్లు తిరిగాయి. 'మనిషికో చరిత్ర' సినిమా సెట్స్‌లో గొల్లపూడి మారుతీరావు నన్ను సీరియస్‌గా కొట్టేశారు. అక్కడే ఉన్న మా నాన్న మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? అని మారుతీరావును నిలదీశాడు. అందుకాయన నాకు కూతుర్లు లేరమ్మా, అందుకే కొట్టేశాను అని చెప్పడంతో ఊరుకున్నాడు' అని చెప్పుకొచ్చింది పూర్ణిమ.
Comments
Please login to add a commentAdd a comment