Gollapudi Maruthi rao
-
మా నాన్న ముందే గొల్లపూడి నా చెంప పగలగొట్టాడు: నటి
బాలనటిగా కెరీర్ ఆరంభించిన పూర్ణిమ సింగర్ అవుదామనుకుంది. కానీ కాలం, ఆమెలోని నటనా చాతుర్యం ఆమెను నటిని చేసింది. 'శ్రీవారికి ప్రేమలేఖ', 'ముద్దమందారం', 'నాలుగు స్తంభాలాట', 'పుత్తడిబొమ్మ', 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' వంటి సినిమాలతో హీరోయిన్గా అలరించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు సైతం పోషించి తెలుగువారి మనసుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న పూర్ణిమ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'నా పేరు మలయాళంలో సుధ, తెలుగులో పూర్ణిమ. నేను సింగర్ అవుదామనుకున్నా, కానీ నటినయ్యా. హీరోయిన్గా చేస్తున్నప్పుడే కృష్ణగారికి చెల్లెలిగా కూడా చేశా. సావిత్రిగారితో కూడా నటించాను. ఆమె చనిపోయే ముందు రోజుల్లో.. పాన్ తింటూ ఇలా యాక్ట్ చేయాలి, అలా చేయాలని సూచనలిచ్చేవారు. ఇక నేను సినిమా ఆర్టిస్ట్ అని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఆరు సంబంధాలు వచ్చినదారినే వెళ్లిపోయాయి. నాకింక లైఫ్‌లో పెళ్లవదు, కుమారిగానే మిగిలిపోతాననుకున్నా. కానీ 1998లో నాకు పెళ్లైంది. నాలుగు స్తంభాలాట సినిమా సమయంలో వైజాగ్ అందాలు చూసివద్దామని నేను, నరేశ్ బైక్‌పై వెళ్లి వస్తుండగా చున్నీ టైర్లో చుట్టుకోవడంతో కింద పడిపోయా, గాయాలయ్యాయి. నన్ను అలా చూసి నరేశ్ కంట్లో నీళ్లు తిరిగాయి. 'మనిషికో చరిత్ర' సినిమా సెట్స్‌లో గొల్లపూడి మారుతీరావు నన్ను సీరియస్‌గా కొట్టేశారు. అక్కడే ఉన్న మా నాన్న మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? అని మారుతీరావును నిలదీశాడు. అందుకాయన నాకు కూతుర్లు లేరమ్మా, అందుకే కొట్టేశాను అని చెప్పడంతో ఊరుకున్నాడు' అని చెప్పుకొచ్చింది పూర్ణిమ. -
కాలంలో కరిగిన ప్రేమకథ
బస్సు జుజుమురా దగ్గర ఆగినప్పుడు ఆ అమ్మాయిని చూశాను. నవంబర్ చలి దుర్మార్గుడి పగలాగ పట్టుకుని వదలకుండా ఉంది. శంభల్‌పూర్ నుంచీ భువనేశ్వర్ ప్రయాణం. ‘‘ఈ రాత్రి వద్దు భాయ్. రెఢాకోల్ అడవిలో చలి తట్టుకోలేవు’’ అన్నాడు సాహు. ‘‘రేపు ఉదయం భువనేశ్వర్‌లో పని ఉందం’’టూ బస్సు ఎక్కేశాను. ముతక శంభల్‌పూర్ చీరలో చుట్టిన రబ్బరు బొమ్మలాగా ఉంది ఆమె. ఒరియా అమ్మాయేమో అనుకున్నాను. నన్ను తికమక పెట్టింది ఒకటే– ఆమె సిగలో కెంపులాంటి గులాబీ పువ్వు. ఇక్కడ అమ్మాయిలు పువ్వులు పెట్టుకోరు. శరీరంలో కనిపించని ఏ అందాన్నయినా భర్తీ చేయగలిగిన అందమైన కళ్లు. నా ముందు సీట్లో కూర్చుంది. పక్కన ఎవరూ లేరు. ముసలి పండా కారా కిళ్లీ చారలో చొంగ కలిసి వంటి మీదకి కారుతుండగా చలిని జయించి నిద్రపోతున్నాడు. ఆంధ్రదేశంలో చలికాలానికి ఉపయోగించే ఏ దుప్పటీ ఈ చలికి ఆగడం లేదు. ఉన్నట్టుండి బస్సు కుదుపుతో ఆగింది. ఒరియా భాష ఒక్కసారి నిద్రలేచింది. అతి త్వరగా మాట్లాడుతారు. మాటల్లో కంచు గొంతు వెదికి తెచ్చుకుంటారు. డ్రైవరు ఏదో చెబుతున్నాడు. కొన్ని నిద్రముఖాల్లో కోపం తెలుస్తోంది. ప్రయాణికులంతా దిగారు. నా ముందున్న అమ్మాయి ఊదారంగు శాలువా వదిలించి దగ్గరగా లాక్కుని లేచింది. నేనూ లేచాను. ‘‘జుజుమురా’’ అన్న నల్లటి అక్షరాలు బస్సు లైట్ల వెలుగులో కనిపిస్తున్నాయి. చిన్న గ్రామం. డ్రైవరు ఏం చెపుతున్నాడో తెలుసుకోవాలనిపించింది. ఒక రాయిమీద కూర్చుంది అమ్మాయి. ఇంగ్లిష్ అర్థమవుతుందేమో, అడిగాను. ‘‘డ్రైవరు ఏం చెపుతున్నాడో చెప్పగలరా?’’ ‘‘ఇంజిన్ చెడిందట. క్షణంలో బాగు చేస్తానంటున్నాడు’’ తెలుగులో వచ్చింది సమాధానం. ‘‘నాకు తెలుగు ఎలా వచ్చునా అని ఆశ్చర్యపోతున్నారా?’’ ‘‘అది ఒకటి. నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని.’’ ‘‘పాన్ వేసుకుంటే ఇక్కడ వాళ్లు గంటల కొద్దీ బుగ్గన ఉంచుకుంటారు. మీరేమో కిటికీ దగ్గర కూర్చున్నారు. అయిదు నిమిషాల్లో పూర్తి చేసేస్తున్నారు.’’ ‘‘కానీ నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారో చెప్పలేదు’’ ‘‘మీ చేతుల్లో తెలుగు ఉత్తరం ఉంది. మీరు కట్టుకున్న పంచె పొందూరు ఖద్దరు.’’ క్షణం నిర్ఘాంతపోయాను. ‘‘మీరేం చేస్తారు?’’ అంది. ‘‘టెక్స్టైల్ మిల్ ఏజెంటుని. ప్రతి సీజన్లోనూ వచ్చి ధర్మవరం చీరలకు ఆర్డర్స్ తీసుకుంటాను. తిరిగి వెళ్లి సరుకు పంపే ఏర్పాటు చేస్తాను. అమ్మకంలో రెండు పర్సెంట్ కమీషన్ ఇస్తారు. అందులో ఒక పర్సెంట్ జర్దాకిళ్లీలు నమిలి ఒరిస్సాకే చెల్లించి వెళ్లిపోతాను.’’ గలగలమని నవ్వింది. నిద్రపోతున్న జుజుమురాలో కాస్త చైతన్యం వచ్చినట్టనిపించింది. ‘‘ఎలా ఉంది ఒరిస్సా మీకు?’’ ‘‘ఇక్కడికి వస్తూ పోతూండడం 14 నెలల అలవాటు. దిగులుగా, తీరుబాటుగా, ఒంటరిగా, భయంగా ఉంది. తెలుగు భాష వినిపిస్తే ఆప్తబంధువుని చూసినట్టు ఫీలవుతాను.’’ ‘‘అయితే మీకో ఆప్తబంధువు దొరికినట్టే.’’ ఆమె చొరవకి ఆశ్చర్యం కలిగినా, ఆనందంగానే ఉంది. ప్రయాణికులంతా మా వేపు దొంగ చూపులు చూసి నవ్వుకున్నారు. ‘‘మీ పేరు?’’ ‘‘మీరా’’ బస్సు రిపేరు అయిందని అరుస్తున్నాడు కండక్టరు. లేచి చీరె సవరించుకుంది. నేను లేవడానికి చెయ్యి అందించింది. జారిపోయిన నా కండువాని తనే భుజం మీద వేసింది. బస్సులో ఇదివరకే కూర్చున్న సీటులోకి కునుకుతున్నాను. నా పక్కన కూర్చున్న పండా ఏదో అన్నాడు. మీరా నవ్వుతోంది. ‘‘ఆయనేమంటున్నాడో తెలుసా? మీరిద్దరూ భార్యాభర్తలు కదా, రెండు సీట్లెందుకు? మీరు నా పక్కన కూర్చుంటే, ఆయన పడుకుంటాడట.’’ నా ముఖం ఎరుపెక్కింది. ‘‘మనం భార్యాభర్తలం కానక్కరలేదు కానీ నా పక్కన కూర్చోండి. పాపం, పడుకుంటాడు’’ అంది. నా భార్య అయ్యే అర్హతలు మీరాకి లేవా? జీవితం పట్ల ఆమెకున్నపాటి కలలు కూడా నాకు లేవు. ‘‘ఊరు పేరు తెలీని అమ్మాయి నా భార్య అంటాడా ఈ ఫూల్’’ అని కోపం వచ్చింది మీకు. అవునా?’’ ‘‘మీకెలా తెలుసు?’’ ‘‘నేను బీఏ సైకాలజీ స్టూడెంటుని.’’ ఆ అమ్మాయి అంత చదువుకున్నదని ఊహించలేదు. మనలో లేని గుణాన్ని ఇంకొకరిలో చూడడాన్ని ఆకర్షణ అంటారనుకుంటాను. మీరా నన్ను ఆకర్షించింది. క్రమంగా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనకి మనస్సు ఒదిగిపోయింది. ‘‘నేను పూరీ వెడుతున్నాను. ఈ పండా ఆశీర్వాదం ఫలించాలని జగన్నాథుడికి చెప్పుకుంటాను’’ అన్నాను. నాకు తెలుగు ఎలా వచ్చునా అని ఆశ్చర్యపోతున్నారా?’’ ‘‘అది ఒకటి. నేను తెలుగువాడినని ఎలా అర్థం చేసుకున్నారా అని.’’ ఇప్పుడామె ముఖంలో ఆశ్చర్యం. ‘‘అమ్మ లేదు. నాన్న లేడు. పెళ్లి నా జీవితంలో కలకాలం నిలవడానికి చేసే స్నేహం లాంటిది. మీరు మంచి స్నేహితులు కాగలరని ఈ చిన్న వ్యవధిలోనే అనిపించింది.’’ అంత పెద్ద కళ్లలో కదిలిన నీటితెరని ఆ మసక వెలుగు దాచలేకపోయింది. ఆమె చెయ్యి నా చేతిని బలంగా పట్టుకుంది. నేను వణుకుతున్నానని అప్పుడర్థమయింది– నేను తీసుకున్న నిర్ణయానికి గానీ చలికి గానీ. ‘‘అదేమిటి వణుకుతున్నారు? ఈ శాలువా కప్పుకోండి.’’ ఇప్పుడు ఆమె శరీరం నాకు తగులుతోంది. సన్నటి నడుం వెచ్చగా నా కుడిచేతికి ఆనుకుంది. ఎంతసేపు గడిచిందో తెలియలేదు. ‘‘రెఢాఖోల్ వచ్చాం. కాస్త టీ తాగరూ?’’ చుట్టూ చూశాను. బస్సంతా ఖాళీ. ఆమె ఒళ్లో తలపెట్టుకున్నానని అర్థమై, సిగ్గుపడిపోయాను. ఇద్దరం దిగాం. ‘‘భర్త అపస్మారంలో ఉపయోగపడడానికి భార్యకి ఎంత అదృష్టం.’’ ‘‘ప్రతి స్త్రీ పుట్టుక నుంచీ వైవాహిక జీవితానికి సిద్ధపడుతుందనుకుంటాను. భార్య పాత్రని ఎంత సులువుగా స్వీకరిస్తున్నారు మీరు?’’ చిన్న కుర్రాడు రొట్టెలు చేస్తున్నాడు. కాల్చడానికి పెనం ఏమీ లేదు. నేలకి సమంగా ఒక కుండని పాతేశారు. మూడు రొట్టెలు కొన్నాను. పప్పు సెగలు కక్కుతోంది. ఆకలి చల్లార్చుకుని బస్సు ఎక్కాం. భయంకరమైన రోడ్డు. విడాకులు ఇచ్చుకుందామని నిశ్చయం చేసుకున్న భార్యాభర్తల్ని బస్సులో కూర్చోపెడితే ఆ రోడ్డు వాళ్లని అనుగుల్ చేరే లోపల ఏకం చేస్తుంది. ప్రతి పది నిమిషాలకీ నా చేతుల్లో ఉంటోంది మీరా. బస్సులో దీపాలన్నీ ఆర్పేశారు. మా పెళ్లి, తర్వాతి జీవితాన్ని గురించి 30 మైళ్లు చర్చించుకున్నాం. నేను కంపెనీ తరపున బరంపురంలో ఉండిపోయేట్టు ఏర్పాటు చేసుకుంటాను. నా క్యాంపులన్నీ ఇద్దరం కలిసే తిరుగుతాం. ముగ్గురు పిల్లలు. ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. ఇద్దరమ్మాయిలు, అబ్బాయి అయినా ఫరవాలేదు. ముగ్గురూ అమ్మాయిలే పుడితే? అనుగుల్ వచ్చేసింది. దూరంగా ఉన్న టీ దుకాణం వేపుకి మళ్లించింది మీరా. ‘‘ఇష్, ఇటు’’ అంది. నా భుజం మీద పడిన ఆమె వేళ్లు వణుకుతున్నాయి. ‘‘ముద్దు పెట్టుకోరూ!’’ అంది. దిమ్మర పోయాను. నా చేతులు స్వాధీనం తప్పాయి. మంచులాంటి గాలి మా మధ్య వేడెక్కింది. కాసేపటికి ఆమె ఏడుస్తోందని తెలుసుకున్నాను. ఊపిరి సలపని ఆనందానికి పరాకాష్ట దుఃఖమేమో! డ్రైవరు మా కోసమే హారను మోగిస్తున్నాడు. అనుగుల్ వచ్చిన డ్రైవరు గుర్రు తీస్తున్నాడు. కొత్త డ్రైవరు నడుపుతున్నాడు. అతి సులువుగా నా కౌగిట్లో ఒదిగిపోయిన ఈ మీరా నా జీవితంలో వహించనున్న పాత్రకి అర్హురాలేనా? ఢెంకనాల్ దాటి కుంఠలీ. ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. ‘‘నేను కటకంలో దిగాలి’’ అంది. కటకం దగ్గరవుతుందనగానే ఆమె కంఠంలో దిగులు. ‘‘వస్తే రానీ నాతో భువనేశ్వర్ వస్తున్నావు నువ్వు’’. అదే మొదటిసారి నువ్వు అనడం– ఆశ్చర్యపోయింది. ‘‘నిన్ను దిగనివ్వను.’’ నా వేపు జాలిగా చూసింది. ‘‘నా మీద అప్పుడే అంత హక్కును పెంచుకున్నారా?’’ అంది. ‘‘రాత్రంతా ఆలోచనల్తో రెచ్చగొట్టి ఇప్పుడు హఠాత్తుగా మాయమవుతావా?’’ మీరా మాట్లాడలేదు. దిగే ప్రయాణికులంతా హడావుడిలో పడ్డారు. ‘‘ఇక్కడ అరగంట పైగా ఆగుతుంది. అలా నడుద్దాం పదండి’’ అంది. ‘‘నాకూ మిమ్మల్ని వదిలి పోవాలని లేదు. చిన్నతనంలో చెట్టపట్టాలేసుకు నడిచే భార్యాభర్తల్ని చూస్తూ ఇలాగా నా రోజులూ గడవాలనుకునేదాన్ని. ఇద్దరం భవిష్యత్తును గురించి కలలు కన్నాం. నా జీవితానికి ఈ ఒక్క రాత్రి చాలు’’. ‘‘కానీ మీరా! ఈ ఒక్క రాత్రి ఏం ఖర్మ. మన మధ్య ఇలాంటి ఎన్నో రాత్రులు ఉంటాయి. జీవితమంతా నేను నీతో ఉంటాను.’’ ‘‘ఉండే మనస్సు మీకుంది. కానీ ఉంచుకునే అదృష్టం నాకు లేదు. నాకు లంగ్ కేన్సర్.’’ మున్సిపాలిటీ దీపాలు గుప్పుమని ఆరిపోయాయి. నా గొంతు పెగలలేదు. ‘‘కానీ మీరా! మీరా! ఇది ఘోరం.’’ ‘‘నేనిక్కడే ఆగిపోతాను. నీ ఆపరేషను అయ్యేవరకు ఉంటాను.’’ ‘‘వద్దు. వీల్లేదు. మీరు వెళ్లాలి. ఇప్పుడే, ఈ బస్సులోనే.’’ ఇద్దరం కళ్లనీళ్లు కారుస్తూనే ఉన్నాం. డ్రైవరు హారన్ మోగిస్తున్నాడు. ∙∙ ఈసారి భువనేశ్వర్ వచ్చినప్పుడు కటకంలో ఆగి మీరా చెప్పినట్టే వాకబు చేశాను. డిసెంబర్లో మేం అనుకున్నట్టు పెళ్లయితే జరగలేదు కానీ క్రిస్ట్మస్ రెండు రోజులుందనగా మీరా కన్ను మూసింది. శంభల్‌పూర్ బస్సులో ప్రయాణం చేస్తూ జుజుమురా వచ్చినప్పుడు ఒక్కసారి గుర్తు చెయ్యమని కండక్టరుతో చెప్పాను. కళ్లిప్పేసరికి బస్సు ఇంకా నడుస్తోంది. కండక్టర్ని అడిగాను. జుజుమురా వెళ్లిపోయిందన్నాడు. ఒక అపూర్వమైన అనుభవాన్ని మీరా రూపంలో ప్రసాదించి నా దారి నుంచి సవినయంగా తప్పుకుంది జుజుమురా. గొల్లపూడి మారుతీరావు ‘జుజుమురా’కు సంక్షిప్త రూపం ఇది. కాలదోషం పట్టనిదే మంచికథ అయితే గనక ఈ కథ ఆ ప్రమాణానికి నిలబడదు. ఇలాంటి ఎన్నో ప్రేమకథలు మనం వినివుండటమే దానికి కారణం. ఒక విషయం మళ్లీ మళ్లీ వాడకంలోకి రావడం వల్ల దాని గొప్పతనం కోల్పోతుంది. ఈ కథ కూడా అదే కోవలోనిది. కానీ గుర్తుంచుకోవాల్సింది, అలాంటి ఎన్నో ప్రేమకథలు సినిమాలుగా రాకముందు 1971లో రాసిందిది. ఆ కారణం వల్లే ఇది ఆ కాలపు ఎందరో పాఠకుల్ని ఆకర్షించింది. సినిమా నటుడు, సినిమా, నాటక, రేడియో రచయిత, పాత్రికేయుడు, కాలమిస్టు, టీవీ ప్రయోక్త అయిన గొల్లపూడి చివరివరకూ ‘జీవన కాలమ్’ రాస్తూనే వున్నారు. అమ్మ కడుపు చల్లగా ఆయన ఆత్మకథ. సాయంకాలమైంది ఆయన నవల. గొల్లపూడి మారుతిరావు 14 ఏప్రిల్ 1939 12 డిసెంబర్ 2019 -
నిలువెత్తు తెలుగుదనం గొల్లపూడి సోంతం: ఎస్పీ బాలు
-
గొల్లపూడికి కన్నీటి వీడ్కోలు
సాక్షి, చెన్నై: ప్రఖ్యాత నటుడు, రచయిత, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు ఆదివారం చెన్నైలో అశ్రునయనాల మధ్య ముగిశాయి. ఉదయం పలువురు సినీప్రముఖులు, బంధువులు గొల్లపూడి పార్థివదేహానికి నివాళులర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత దగ్గుబాటి సురేశ్, దక్షిణ భారత సినీ వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్, సినీ ప్రముఖులు మారుతీరావు భౌతికకాయానికి నివాళులర్పించారు. ఉదయం 10 గంటలకు గొల్లపూడి భౌతికకాయానికి కుటుంబ సభ్యులు శాస్త్రీయంగా అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. 11.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై టీ నగర్ కన్నమ్మపేటలోని శ్మశాన వాటికలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుమారుడు రామకృష్ణ తలకొరివి పెట్టారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
గొల్లపూడికి చిరంజీవి, సుహాసిని నివాళి
-
గొల్లపూడికి చిరంజీవి నివాళి
సాక్షి, చెన్నై: ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు భౌతికకాయాన్ని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. ప్రముఖుల, అభిమానులు సందర్శనార్థం గొల్లపూడి పార్థీవదేహాన్ని టీనగర్‌లోని ఆయన నివాసంలో ఉంచనున్నారు. గొల్లపూడి అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు కన్నమ్మపేట దహనవాటికలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అదేరోజు ఉదయం టీనగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుందని వారు చెప్పారు. చిరంజీవి, సుహాసిని నివాళి గొల్లపూడి మారుతీరావు భౌతికకాయానికి హీరో చిరంజీవి నివాళులర్పించారు. చెన్నై టీనగర్‌లోని శారదాంబల్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన చిరంజీవి.. గొల్లపూడి పార్థీవదేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవితో పటు సినీనటి సుహాసిని సహా పలువురు ప్రముఖులు గొల్లపూడికి నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి మారుతీరావు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చదవండి: గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు సాహితీ శిఖరం.. కళల కెరటం.. -
ఒక జీవనది అదృశ్యమైంది
‘గొల్లపూడి మారుతీరావు గొప్ప నాటక రచయిత మాత్రమే కాదు, చాలా మంచి నటుడు కూడా. సినిమాల్లో వేస్తే ముఖ్య పాత్రలో బాగా రాణించగ లడు’ అంటూ 1970లో ప్రముఖ పత్రికా సంపాద కులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గొల్లపూడిని అంచనా వేశారు. తర్వాత అక్షరాలా అంతే జరి గింది. పదేళ్ల తర్వాత ముఖానికి రంగు పూసుకుని వెండితెరకెక్కారు. గద్దముక్కు, తీక్షణమైన చూపులు, సన్నగా పొడుగ్గా కింగ్ సైజు సిగరెట్ లాంటి విగ్రహం, చేతులు వూపేస్తూ వాదనలో పస లేకపోయినా అవతలివాళ్లని తగ్గేట్టు చేసే వాగ్ధాటి గొల్లపూడికి ముద్రవేసి నటుడిగా నిలబెట్టాయి. తొలి సినిమా ‘ఇంట్లో రామయ్య...’ చిత్రంతోనే అన్ని వయసుల వారిని ఆకట్టుకున్నారు. వంద సినిమాల తర్వాత అబ్బాల్సిన ‘ఈజ్’ మొదటి దెబ్బకే వంటబట్టింది. ఇక తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసింది లేదు. మారుతీరావుది పరిపూర్ణ జీవితం. పద్నాలుగే ళ్లప్పుడే మించిన ప్రతిభని ప్రదర్శిస్తూ ‘ఆశాజీవి’ కథ రాశారు. ఇంకో రెండేళ్లకి తొలి నాటకం అనంతం, ఇంకో రెండేళ్లకి మరో మంచి పెద్ద కథ గొల్లపూడిని రచయితగా నిలబెట్టాయి. విశాఖ పట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చది వారు. ఆ పట్టాని, దాష్టీకమైన వాక్కుని పట్టుకుని విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగం సంపాదిం చారు. అక్కడ మహానుభావుల మధ్యలో ఉండి కలానికి పదను పెట్టుకున్నారు. సరిగ్గా వృత్తి నాటక రంగం వెనకబడి సినిమాకు అన్ని కళలూ, శక్తి యుక్తులూ దాసోహం అంటున్న తరుణంలో నాటి కలు, నాటకాలు రాసేవారు ఒట్టిపోయారు. ఈ మహా శూన్యంలో గొల్లపూడి ప్రవేశించి పుంఖాను పుంఖాలుగా నాటక రచనలు చేసి తెలుగు అమె చ్యూర్ థియేటర్‌కి కొత్త చిగుళ్లు తొడిగారు. ‘అనంతం’ కొన్ని వందల ప్రదర్శనలకు నోచు కుంది. ‘బియాండ్ ది హొరైజన్’ ఆధారంగా తీర్చిది ద్దిన ‘రాగగాగిణి’ మాతృక వలే ఖ్యాతి పొందింది. కొత్త కొత్త నాటకాలు చదవడం, తనదైన శైలిలోకి దించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన రచనలకు బారసాలలు చేసి పేర్లు పెట్టడంలో గొల్ల పూడిది విలక్షణమైన దారి. పిడికెడు ఆకాశం, వెన్నెల కాటేసింది, రెండురెళ్లు ఆరు, మళ్లీ రైలు తప్పిపోయింది, కరుణించని దేవతలు, రోమన్ హాలిడే, కళ్లు, సత్యంగారి ఇల్లెక్కడ, చీకట్లో చీలి కలు, ఎర్రసీత ఇవన్నీ కొత్తగా ఆకర్షణీయంగా ఉంటాయ్. ఆఖరికి ఆయన స్వీయ చరిత్రకి ‘అమ్మ కడుపు చల్లగా...’ అని నామకరణం చేసు కున్నారు. విజయనగరం నేల మహత్యం, గాలి నైజం మారు తీరావుకి పుట్టుకతోనే (1939) అంటింది. హమేషా కొత్తపూలు విరిసే విశాఖ ప్రభాతం ఆయనపై పూర్తిగా పడింది. తెలుగు కథని జాగృతం చేసిన చా.సో., కా.రా., రావి శాస్త్రి, భరాగో ఇంకా మరెం దరో గొల్లపూడి రెక్క విచ్చే టప్పుడు ఉత్సాహంగా రాస్తున్నారు. విజయవాడ ఆకాశవాణి అప్పట్లో సరస్వతీ నిలయం. శంకర మంచి సత్యం, ఉషశ్రీ, జీవీ కృష్ణారావ్, బుచ్చి బాబు లాంటి విశిష్టులు తమ ప్రజ్ఞా పాటవాలతో వెలుగుతున్నారు. ఈ వనంలో తనూ ఒక మల్లె పొదలా ఎదిగి గుబా ళించారు గొల్లపూడి. పరిమళాలు గాలివాటున చెన్నపట్నందాకా వెళ్లాయి. అన్నపూర్ణ సంస్థ ‘చక్ర భ్రమణం’ ఆధా రంగా తీస్తున్న ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమాకి మాటల రచయితగా మారుతీరావుకి పిలుపు వచ్చింది. ఆయనకు సహజంగా ఉన్న మాటకారితనం సిని మాల్లో బాగా పనిచేసింది. 80 సినిమాలకు కథలు, మాటలు ఇచ్చారు. నటుడిగా 200 పైగా చిత్రాల్లో కనిపించి మెప్పించారు. నటుడు, రచయిత, వ్యాఖ్యాత, వ్యాసకర్త, విశ్లేషకుడు– అన్నిటా రాణిం చారు. నటుడుగా విలనీ, కామెడీ ఇంకా అనేక షేడ్స్ చూపించారు. ‘వందేళ్ల తెలుగు కథకి వందనాలు’ పేరిట కె. రామచంద్రమూర్తి పూనికతో గొల్లపూడి రూపొందించిన టీవీ కార్యక్రమం ఆయన మాత్రమే చేయగలడు. 14వ ఏట నించి సృజనాత్మకంగా ఆయన జీవితం సాగింది. అన్నీ ఒక ఎల్తైతే పాతి కేళ్లపాటు అవిచ్ఛిన్నంగా నడిచిన ఆయన ‘జీవన కాలమ్’ మరో ఎత్తు. బ్రాడ్వే నాటకాలను స్వయంగా వెళ్లి, చూసి వచ్చి ఆయన అందించిన విపుల సమీ క్షలు మనకి విజ్ఞానదాయకాలు. గొల్లపూడికి అక్షర నివాళి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వరంగల్ అల్లుడు.. గొల్లపూడి
సాక్షి, హన్మకొండ : కవి, నాటక, నవలా రచయిత, నటుడు, జర్నలిస్టు ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి మారుతీరావు ఇక లేరన్న విషయం తెలిసి ఓరుగల్లు సాహితీవేత్తలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయనకు వరంగల్‌లో ఎనలేని అనుబంధం ఉండడం.. పలు కార్యక్రమాలకు హాజరైన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతిరావు అత్తగారి ఊరు వరంగల్ కావడం విశేషం. ఇక్కడ విద్యాశాఖాధికారిగా పనిచేసిన శ్రీపాద రామకిషన్రావు కుమార్తె సుందరిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈవిధంగా మారుతీరావు వరంగల్ అల్లుడయ్యాడు. అలాగే కాళోజీ నారాయణరావు, కాళోజీ రామేశ్వరరావుతో గొల్లపూడి మారుతీరావుకు అనుబంధం ఉండేది. 1966లో తిలక్, అద్దెపల్లి రాంమోహన్‌రావు, ఆవత్స సోమసుందర్, కుందుర్తితో కలిసి మిత్రమండలి సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లాకు చెందిన సహృదయ సాహితీ సంస్థ ఏటా ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంగా అందించే సాహితీపురస్కారానికి గొల్లపూడి మారుతీరావు రాసిన ‘సాయంకాలం అయింది’ నవలను ఎంపికైంది. ఈ మేరకు 2001లో జరిగిన పురస్కార ప్రదానంలో గొల్లపూడి పాల్గొని చేసిన ఆత్మీయ ప్రసంగం అందరికీ గుర్తుండి పోతుంది. ఆదేవిధంగా 21 జనవరి 2012న హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో జరిగిన గిరిజా మనోహర్‌బాబు షష్టిపూర్తి అభినందనసభలోనూ ఆయన పాల్గొన్నారు. కాగా, గొల్లపూడి గురువారం కన్నుమూసినట్లు తెలియడంతో ఓరుగల్లు సాహితీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తరచూ ఫోన్లో మాట్లాడేవాళ్లం.. గొల్లపూడి మారుతిరావు ఇకలేరని తెలిసి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మారుతీరావు భార్య సుందరి ఆర్ట్స్ కళాశాలలో తమతో పాటు కలిసి చదువుకున్నారని.. ఆయన తనకు మంచి మిత్రుడని తెలిపారు. తరుచూ ఫోన్లో మాట్లాడుకునేవారమని, తన కథలు, నవలలు చదివి అభిప్రాయాలు చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి మాట్లాడుతూ గొల్లపూడి మారుతీరావు వందేళ్ల తెలుగు కథ కార్యక్రమంలో భాగంగా కాళోజీ కథను చదవడానికి తనను పిలిచారని చెప్పారు. ప్రముఖ సాహితీవేత్త గిరిజామనోహర్‌బాబు మాట్లాడుతూ పదేళ్లుగా గొల్లపూడితో తనకు అనుబంధం ఉందని.. 2008లో తాను తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కన్నీటిపర్యంతమయ్యారని గుర్తు చేశారు. 2012లో తన షష్టిపూర్తి అభినందన సభ నిర్వహించినప్పుడు హాజరయ్యారని చెప్పారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన గొల్లపూడి 80 ఏళ్ల ఉత్సవంలో పాల్గొనాల్సిందిగా ఫోన్ చేసి ఆహ్వానించారని తెలిపారు. అలాగే, సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్వీఎన్.చారి, వనం లక్ష్మీకాంతారావు, శేషాచారి, డాక్టర్ కేఎల్వీ.ప్రసాద్, కుందావజ్జుల కృష్ణమూర్తి, లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాస్‌రావు, డాక్టర్ వి.వీరాచారి, డాక్టర్ కందాళ శోభారాణి తదితరులు కూడా ప్రగాఢ సంతాపం తెలిపారు. -
గొల్లపూడి లేని లోటు తీర్చలేనిది
సాక్షి, విజయవాడ: ప్రముఖ నటుడు, సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్డీసీ) చైర్మన్ టిఎస్ విజయ్ చందర్ సంతాపం తెలిపారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిది అని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ, సాహిత్య, నాటక రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న గొల్లపూడి గొప్ప వ్యక్తిత్వం గల మనిషని ఆయనను కొనియాడారు. విజయనరంలో జన్మించి, విశాఖపట్నంలో వృత్తిని ప్రారంభించి కళామతల్లి సేవలో పునీతులైన గొల్లపూడి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. ఆయన మొదటిసారిగా స్క్రీన్‌ప్లే అందించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రంతో తొలి నంది పురస్కారాన్ని గెలుచుకున్నారని వెల్లడించారు. తన సినీ జీవితంలో ఆరు నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. దాదాపు 80 చిత్రాలకు రచయితగా, 290 చిత్రాలకు నటుడిగా గొల్లపూడి సాగించిన ప్రస్థానం స్ఫూర్తిదాయకమని విజయ్ చందర్ తెలిపారు. -
నట మారుతం
-
సాహితీ శిఖరం.. కళల కెరటం..
పెదవాల్తేరు/మద్దిలపాలెం(విశాఖతూర్పు): అవధుల్లేని మహా ప్రవాహం ఆయన జీవన పయనం. అనంతమైన మహా సముద్రం ఆయన అనుభవ సారం. అనేక అధ్యాయాల.. అసంఖ్యాక ప్రకరణాల ఉద్గ్రంథం ఆయన ప్రతిభాసామర్థ్యం. సామాన్య కుటుంబాన జన్మించి.. అక్షర సేద్యంలో రాణించి.. ఆపై అనేక రంగాల్లో అసమాన నైపుణ్యం చూపించి.. తుదిశ్వాస వరకు సృజనాత్మకతనే శ్వాసించి.. తెలుగు సాహితీ కళారంగాల్లో అనితర సాధ్యమైన స్థానం సంపాదించి దూరతీరాలకు తరలిపోయిన గొల్లపూడి మారుతీరావు అచ్చంగా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ. చిన్ననాట ఇక్కడ ఓనమాలు దిద్దినా.. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తు నీడలో విద్యాభ్యాసం చేస్తూనే రంగస్థలంపై సృజన కిరణాలు ప్రసరింపజేసినా.. నాటక రంగంలో మహనీయులతో కలసి నైపుణ్యానికి సానపెట్టుకుని తళుకులీనినా.. తర్వాత జీవన సంధ్యాకాలంలో విశాఖను శాశ్వత నివాసంగా చేసుకున్నా.. ఆయన జీవితంలో వైశాఖి కీలకపాత్ర పోషించింది. ఎక్కడికి వెళ్లినా మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడే హాయిగా ఉంటుందన్న భావన కలిగించింది. విశాఖ నుంచి అనివార్యంగా తరలివెళ్లిన తర్వాత చెన్నపట్నంలో ఆయన తుదిశ్వాస వీడినా.. ఆయన దివ్యాత్మ విశాఖ ఒడిలోకే చేరి ఉంటుంది. విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావు కుటుంబసభ్యులతో విశాఖలో దాదాపుగా 15 సంవత్సరాలపాటు నివసించారు. ఆయన పిఠాపురం కాలనీ జనశిక్షణ సంస్థాన్ రోడ్డులోని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్‌లోనివసించారు. ఏడాది క్రితమే ఈ ఫ్లాట్ విక్రయించేసి చెన్నై వెళ్లిపోయారు. ఏయూలో పాఠ్యపుస్తకం గొల్లపూడి రచనలను భారతదేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా ప్రాచుర్యంలో వున్నాయి. తెలుగు నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలను ఆంధ్రాయూనివర్శిటీ లో గల థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా వుంది. గొల్లపూడి రచనలపై ఎంతోమంది విద్యార్థులు పరిశోధనలు చేసి ఎంఫిల్, డాక్టరేట్లు పొందారు. ప్రముఖ సినిమా నటుడు వంకాయల సత్యనారాయణ కుమార్తె లావణ్య గొల్లపూడి రచనలపై పరిశోధనలు చేసి ఏయూ నుంచి డాక్టరేట్ పొందారు. మానసిక పాఠశాలలో... పెదవాల్తేరులో గల హిడెన్‌స్ప్రౌట్స్ పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొనేవారని పాఠశాల వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. తరచూ పాఠశాల నిర్వాహకులతో సమావేశమయి మానసిక దివ్యాంగుల యోగక్షేమాలు విచారించేవారు. ఎన్నో స్మృతులు ఆయన విశాఖలో జరిగిన పలుసాంస్కృతిక కార్యక్రమాలలో విశిష్ట అతిథిగా పాల్గొనేవారు. పిఠాపురం కాలనీ కళాభారతి, ప్రేమసమాజం తదితర వేదికలపై జరిగిన సినిమా సంగీత విభావరి, ఇతర కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన వన్‌టౌన్‌లోని కురుపాం మార్కెట్ , టౌన్‌హాలు, హిందూ రీడింగ్‌రూమ్ లతో గొల్లపూడికి ఎంతో అనుబంధం వుంది. నాటకరంగంలో వున్నపుడు ఆయన ఇక్కడ సహచరులతో సంతోషంగా గడిపేవారని, నగర వీధుల్లో తిరిగేవారని రచయిత, వ్యాఖ్యాత భీశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. ఓనమాలు ఇక్కడే.. ఆయన సీబీఎం పాఠశాలలోను, ఏవిఎన్ కళాశాలలోను, ఆంధ్రాయూనివరి్సటీలోను విద్యాభ్యాసం చేశారు. గొల్లపూడి విద్యార్థి దశలో వుండగానే శ్రీవాత్సవ రచించిన స్నానాలగది నాటకానికి కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించారు. ఈ నాటకంతోపాటుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోను నటించారు. కాగా, మనస్తత్వాలు నాటకాన్ని కొత్తఢిల్లీలో జరిగిన ఐదో అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో భాగంగా ప్రదర్శించడం విశేషం. గొల్లపూడి రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డు పొందింది. చైనా ఆక్రమణపై తెలుగులో మొదటి నాటకం రచించి చిత్తూరు, మదనపల్లి , నగరి ప్రాంతాలలో ప్రదర్శించి వచ్చిన రూ.50వేల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. అమ్మ చెప్పిన పురాణాలే తొలి పాఠాలు మారుతీరావు పూర్తి పేరు వెంకట సూర్య మారుతి లక్ష్మీ నారాయణ. అమ్మ అన్నపూర్ణమ్మ చదవే పూరాణాలు వింటూ, వాటి సారాన్ని ఔపోసన పడుతూ.. ఆపై కొత్త ఆలోచనలు పేర్చుకుంటూ పెరిగారు. విన్న పురణాల గాథలను నాన్న సుబ్బారావుగారి షార్ట్‌హేండ్ పుస్తకాలపై రాసేవారు. ఇలా భాషపై పట్టుసాధించారు. తాను చూసిన తాజ్‌మహల్ వంటి అద్భుత కట్టడాల గురించి అనుభూతులను ఆవిష్కరించారు. యవ్వనంలోకి అడుగుపెట్టక ముందే “రేనాడు ‘అనే వీక్లీలో ఆయన తొలి నవల ‘ఆశాజీవి’ అచ్చయింది. మహాకవి శ్రీశ్రీ కొన్నాళ్లు కంపోజింగ్ సెక్షన్లో పనిచేయడంతో కొత్త రచయితలకు అలాంటి స్థానిక పత్రికపై మక్కువ ఉండేదని.. తమ రచనలు వాటిలో ముద్రితమైతే చూడాలనే ఆరాటం ఉండేదని తర్వాత ఆయన చెప్పేవారు. పర్యావరణ ప్రేమికుడు.. సీతంపేట: గొల్లపూడి మారుతీరావు సినీనటుడు, జర్నలిస్టు మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికుడు. పర్యావరణ మార్గదర్శి నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పర్యావరణ పరిస్థితులను గురించి అవలీలగా మాట్లాడేవారు. పర్యావరణ మార్గదర్శి సభ్యులతో ఎప్పుడు కలిసినా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణతాపం పెరిగిపోతోందని.. మంచు కొండలు కరిగిపోతున్నాయని, వాయుకాలుష్యం పెరుగుతోందని చెప్పారు. ఆహార పదార్థాల్లో విషతుల్య రసాయనాలు చేరుతున్నాయని వివరించేవారు. ఆయన మృతి పర్యావరణ మార్గదర్శి సభ్యులకు దిగ్భ్రాంతి కలిగించింది. – ఎస్.విజయ్‌కుమార్, అధ్యక్షుడు, పర్యావరణ మార్గదర్శి వైశాఖి నడిచే విజ్ఞాన సర్వస్వం గొల్లపూడి నడిచే విజ్ఞాన సర్వస్వం. బహుముఖ ప్రజ్ఞానిధి. రచన, పత్రిక, నాటకం, సినిమా ఈ నాలుగు రంగాలలో ఆంధ్ర రాష్ట్రంలో సాధికారికంగా మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి గొల్లపూడి. సినిమా రంగంలో ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందే, సాహిత్య రంగంలో ఏ విషయం మీద అయినా చాలా వేగంగా అద్భుతంగా రచనలు చేయగలిగే నిష్ణాతుడు. వందేళ్ల కధకు వందనాలని టీవీలో ప్రోగ్రామ్ చేశారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ నుంచి ఇప్పటి మా తరం వరకు మాబోటి వారితో.. మొత్తం మీద నాలుగు తరాల వారితో గొల్లపూడికి అనుబంధం ఉంది. – డి.వి.సూర్యారావు, రచయిత గొల్లపూడికి గీతం డాక్టరేట్ ఆరిలోవ(విశాఖతూర్పు): సినీ నటుడు గొల్లపూడి మారుతిరావుకు గీతం వర్సిటీతో మెరుగైన సంబంధాలు ఉండేవి. ఆయన నటన శైలి, రచనలను గీతం డీమ్డ్ వర్సిటీ గుర్తించింది. ఇందులో భాగంగా 2017లో గీతం 8వ స్నాతకోత్సవం సందర్భంగా డాక్టరేట్ ప్రకటించింది. అప్పటి స్నాతకోత్సవంలో గీతం చాన్సలర్ కోనేరు రామకృష్ణారావు గొల్లపూడి మారుతీరావుకు డాక్టరేట్‌ను అందజేసి గౌరవించారు. నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్నేహశీలి మహారాణిపేట(విశాఖ దక్షిణం): తెలుగు సాహిత్యంలో సాటిలేని సంతకం గొల్లపూడి మారుతీరావుది. నాటక, సినీ రంగాల్లో ఆయనది అందె వేసిన చెయ్యి. ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, వర్తమాన అంశాలను స్పృశిస్తూ వాస్తవాలను ఎలుగెత్తి చెప్పేవి. వివిధ పత్రికల్లో ప్రచురితమైన రచనలు పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. వీటన్నిటికీ మించి మంచి స్నేహశీలి. ఎప్పడు తన మాటలతో ఎదుటివాడి నోటికి తాళం వేసేటట్టు.. ఛలోక్తులు విసురుతూ మాటాడేవారు. మాటకారితనంతో మురిపించేవారు. అందరిని నవ్విసూ్త,నవ్వుతూ ఉండేవారు. ఆయన మృతి సాహితీరంగానికి తీరని లోటు. నేను మంచి మిత్రుడిని కోల్పోయాను. -వంగపండు ప్రసాదరావు, కళాకారుడు -
‘గొల్లపూడి’ ఇకలేరు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి అమరావతి, హైదరాబాద్ : ప్రముఖ రచయిత, సినీనటుడు గొల్లపూడి మారుతీరావు (81) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉ.11.15 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య శివగామి సుందరి, కుమారులు సుబ్బారావు, రామకృష్ణ ఉన్నారు. ఒక కుమారుడు శ్రీనివాస్ గతంలోనే ప్రమాదానికి గురై మరణించారు. సాహిత్యాభిలాషిగా, రచయితగా అన్ని రంగాలకు చెందిన అంశాలపై విశ్లేషకునిగా, విప్లవాత్మకమైన విమర్శకునిగా పేరొందిన గొల్లపూడి.. తెలుగు భాషాభిమానులకు, సినీ ప్రేమికులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేని వ్యక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నైలో జరిగే తెలుగు సంఘాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపూడి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గత నెల 5న చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. అయితే, మళ్లీ అస్వస్థతకు గురై ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య కారణాలవల్ల శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్ 14న అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (పూర్వపు మద్రాసు ప్రావిన్స్) విజయ నగరంలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలోనే పూర్తిచేశారు. ఈ కారణంతోనే ఆయన చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటూనే నెలలో కొన్నిరోజులు విశాఖలో గడుపుతూ సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేవారు. 15న చెన్నైలో అంత్యక్రియలు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఈనెల 15న చెన్నైలో జరపనున్నట్లు ఆయన చిన్న కుమారుడు రామకృష్ణ తెలిపారు. తండ్రి భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి స్వగృహానికి తీసుకొచ్చి ఆదివారం ఉదయం వరకు బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. జర్మనీలో ఉంటున్న కుమారుడు సుబ్బారావు పెద్ద కుమార్తె, అమెరికాలో చదువుకుంటున్న మూడో కుమార్తె.. మారుతీరావు రెండో కుమారుడు రామకృష్ణ కుమారుడు శ్రీనివాస్ జర్మనీ నుంచి రావాల్సి ఉన్నందున అంత్యక్రియలను ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రముఖుల దిగ్బ్రాంతి.. గొల్లపూడి మారుతీరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయ భావాలు కలిగిన మానవతావాది, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇక లేరనే వార్త తీవ్రమైన బాధ కలిగించిందని వెంకయ్య అన్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశానిర్దేశం చేశాయని కేసీఆర్ కొనియాడారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి.. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని వైఎస్ జగన్ అన్నారు. గొల్లపూడి మరణంపై సంతాపం వ్యక్తం చేసినవారిలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
గొల్లపూడి గుడ్‌బై
గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్ధిజీవులకు ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే నాగభూషణం లాంటి విలన్ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల, సినీ రచయితగా అనేక పాత్రలు పోషించిన ఆయన వేదిక దిగేశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి విద్యార్థిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగంలోకి దూకేశారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. నాటక రచయితగా కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు. రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. అరెకపూడి కౌసల్యా దేవి రాసిన చక్రభ్రమణం నవల ఆధారంగా తెరకెక్కిన డాక్టర్ చక్రవర్తి సినిమాకు స్క్రీన్ ప్లే రచయి తగా గొల్లపూడిని ఆహ్వానించారు దుక్కిపాటి. ఆ స్క్రీన్ ప్లే రచనకు నంది పురస్కారం అందుకున్నారు. ఆ తర్వాత విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మగౌరవం స్క్రిప్ట్‌కు మరోసారి నంది గొల్లపూడిని వరించింది. అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశారు గొల్లపూడి. ఎస్.డి. లాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన అనేక సూపర్ హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. అన్నదమ్ముల అనుబంధం లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు డైలాగ్స్ రాసి తన కలానికి మాస్ పల్స్ కూడా తెల్సుననిపించారు మారుతీరావు. కోడి రామకృష్ణ దర్శకుడుగా అరంగేట్రం చేయడానికి ముందుగా అనుకున్న కథ తరంగిణి. అయితే చిత్ర కథానాయకుడు చిరంజీవి అని నిర్మాత కన్ఫర్మ్ చేయడంతో కథ మారి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయ్యింది. అందులో ఓ పాలిష్డ్ విలన్ రోల్ ఉంటుంది. దాన్ని ఎవరితో చేయించినా పండదనిపించింది కోడి రామకృష్ణకు. ఫైనల్‌గా మీరే చేసేయండని గొల్లపూడిని బల వంత పెట్టేశారు. ఆయనా సరే అనేశారు. అలా నటుడుగా తెర ముందుకు వచ్చి సక్సెస్ కొట్టారు. ఆ తర్వాత అనేక పాత్రలు గొల్లపూడిని వెతుక్కుంటూ వచ్చాయి. అలా వచ్చిన వాటిలో అద్భుతంగా పేలినవి అనేకం ఉన్నాయి. అభిలాషలో ఉత్తరాంధ్ర మాండలికంలో ఓ శాడిస్ట్ విలన్ రోల్ చేశారు గొల్లపూడి. బామ్మర్ది అనే ఊతపదంతో ప్రవేశించే ఆ పాత్ర అభిలాష సెకండాఫ్‌ను నిల బెట్టింది. అలా సినిమా సక్సెస్‌కు ఊతంగా నిల్చిన అనేక పాత్రలకు గొల్లపూడి ప్రాణం పోశారు. సుమారు 87 చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సమకూర్చిన గొల్లపూడి నటుడుగా 230 చిత్రాలు చేశారు. క్యారెక్టర్ రోల్స్‌తో పాటు హాస్యనటుడిగానూ మెప్పించారు. ముఖ్యంగా గుంటనక్క తరహా విలనిజం చేయాలంటే.. గొల్లపూడిదే అగ్రతాంబూలం. గొల్లపూడి నటనలో ఓ నిండుదనం ఉంటుంది. డైలాగ్ మీద పట్టు ఉంటుంది. అద్భుతమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఫైటింగులు చేసే విలనీ కాదు... జస్ట్ అలా కూల్‌గా మాట్లాడుతూ అపారమైన దుర్మార్గం గుప్పించే పాత్రలు పోషించాలంటే చాలా టాలెంట్ కావాలి. అధికారం కావాలి. నాగభూషణం చేయగలిగేవాడు. పాత్రకు న్యాయం చేయడానికి ఒక్కోసారి స్వతంత్రించేవారు కూడా. గొల్లపూడిలో మళ్లీ ఆ స్థాయి నటుడు కనిపిస్తాడు. చిరంజీవి ఛాలెంజ్ మూవీలో స్మిత భర్త పాత్రలో గొల్లపూడి ఆ తరహా విలనీ అద్భుతంగా పండించారు. విస్తృతమైన తన అనుభవాల సారాన్ని అమ్మ కడుపు చల్లగా పేరుతో ప్రచురించారు గొల్లపూడి. ఆయన బాగా ఔట్ స్పోకెన్. ఎటువంటి దాపరికాలూ ఉండవు. తన మనసులో అనిపించింది రాసేస్తారు. అందుకే ఆయన అంత విస్తృతంగా రాసేస్తారు. ఇంటర్ నెట్లో కూడా అంత విస్తారంగా రాసిన రచయితలు అరుదు. అదీ మారుతీయం. వయసు పెరిగిన తర్వాత అడపాదడపా గౌరవప్రదమైన పాత్రల్లో కనిపిస్తూ... అచ్చతెనుగు నుడికారాన్ని వినిపిస్తూ... కనిపించిన నటుడు గొల్లపూడి. ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన గొల్ల పూడి కలం ఆయన కన్నుమూసే వరకు అలసట చెందక సాహితీ వ్యవసాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు స్మృతిగా మిగిలిపోయింది. భరద్వాజ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు -
వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్
సాక్షి, హైదరాబాద్: నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా వారం రోజుల్లో సింగిల్ విండో విధానంలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సినిమా షూటింగ్‌ల అనుమతుల కోసం వివిధ శాఖల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తుందని, దీంతో ఎంతో సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో చలనచిత్ర రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. షూటింగ్‌ల నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని కొన్ని శాఖలు అందజేశాయని, మరికొన్ని శాఖలు ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఆయా శాఖల సమాచారం కూడా సేకరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో సుమారు 600 థియేటర్లు ఉన్నాయని, వీటిలో ఎఫ్డీసీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని వీలైనంత త్వరగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో మినీ థియేటర్ల నిర్మాణానికి కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హోంశాఖ ఇన్చార్జి ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎఫ్డీసీ సీఐవో కిషోర్‌బాబు,పలువురు నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రచయిత, వ్యాఖ్యాత గా కూడా గొల్లపూడి రాణించారని గుర్తు చేశారు. సుమారు 250 కి పైగా చిత్రాలలో నటించిన ఆయన ఆ నంది అవార్డులు అందుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎంతో గుర్తింపు పొందారు. ఆయన మృతి తో చిత్ర పరిశ్రమ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
గొల్లపూడి మృతిపై మెగాస్టార్ చిరంజీవి స్పందన
-
గొల్లపూడి మారుతీరావు చెన్నైలో అంత్యక్రియలు
-
గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. గొల్లపూడి మారుతిరావుతో తనకున్నది గురుశిష్య సంబంధమని ఆయన అన్నారు. 'ఆ మధ్య తన కుమారుడు పేరున నిర్వహించే గొల్లపూడి శ్రీనివాస్ అవార్డ్ ఫంక్షన్‌కి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను ఆయన్ని కలిసే అవకాశం దొరకలేదు. ఆరోగ్యంగా ఉండేవారు. ఇంతలో ఇలా అవుతుందని ఊహించలేదు. ఆయనకి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. గురు శిష్యుల్లాంటి సంబంధం. నేను 1979లో ‘ఐలవ్యూ’ అనే సినిమా చేసినప్పుడు, ఆ సినిమా ప్రొడ్యూసర్ భావన్నారాయణగారు నాకు గొల్లపూడి మారుతిరావుగారిని పరిచయం చేశారు. అప్పటికే గొల్లపూడి మారుతిరావుగారు చాలా పెద్ద రచయిత, నాటక రచయిత, జర్నలిస్టుగా కూడా పనిచేశారు. సాహిత్య పరంగా కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి, విద్యాధికుడు. ఆయన దగ్గర డైలాగ్స్ నేర్చుకో అని నన్ను పంపించారు. ఆ రకంగా గొల్లపూడి మారుతిరావుగారు డైలాగులు ఎలా పలకాలో క్లాస్‌లు తీసుకున్నారు. ఈ విధంగా ఆయన నాకు గురువనే చెప్పగలను. ఆ సరదా పరిచయం మాకు స్నేహంగా మారింది. ఖాళీ ఉన్నప్పుడల్లా నేను టీ.నగర్లో వాళ్ళింటికి వెళ్తుండేవాడిని. ఆయన నాతో ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చెప్పేవారు. తన గతం గురించి, గొప్ప గొప్ప కవులు, రచయితల గురించి చెప్తుంటే చాలా ఆసక్తికరంగా వింటుండేవాడిని. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత నాకు కూడా సాహిత్యం పట్ల, గొప్ప రచయితల గురించి తెలుసుకునే అవకాశం ఆయన ద్వారానే కలిగింది. 1982లో కోడి రామకృష్ణగారు నాతో ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ కథలో ఈ పాత్రని గొల్లపూడి మారుతిరావుగారు వేస్తే బాగుంటుందని అనగానే నాకు కూడా అది మంచి చాయిస్ అనిపించింది. ఒకరకమైన శాడిజం భర్త, కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయి అద్బుతంగా నటించి అందరి మన్ననలు పొందారు. ఆ విధంగా నా సహ నటుడుగా ఆయన చేయడం అనేది మంచి అనుభూతి నాకు. ఆ తర్వాత నుంచి ‘ఆలయ శిఖరం‘ , ‘అభిలాష’, ’ఛాలెంజ్‘ లాంటి వరుసగా ఎన్నో సినిమాలు ఇద్దరం కలిసి నటించారు. మేం ఎప్పుడు కలుసుకున్నా గతాన్ని గుర్తు చేసుకుంటూ చాల ా ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహిత్యవేత్త, గొప్ప నటుడు, నాటక రచయిత అయిన గొల్లపూడి మారుతిరావుగారు దూరమవ్వడం అన్నది చాలా బాధాకరం. వారి కుటుంబానికే కాదు, యావత్తు సినీ ప్రపంచానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అని చిరంజీవి అన్నారు. -
ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు
సాక్షి, చెన్నై : ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో జరుగుతాయని ఆయన రెండో కుమారుడు రామకృష్ణ తెలిపారు. కాగా గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల నుంచి వచ్చే వరకూ గొల్లపూడి భౌతికకాయాన్ని ఆస్పత్రిలోనే ఉంచనున్నారు. శనివారం మధ్యాహ్నం ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని గొల్లపూడి నివాసానికి తరలించి ఆదివారం మధ్యాహ్నం వరకూ అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మారుతీరావుకు ముగ్గురు మగ సంతానం సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. అయితే గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ 1992లో ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి, ఉత్తమ నూతన సినిమా దర్శకునికి రూ. 1.5 లక్షలు నగదు బహుమతి అందిస్తున్నారు. కాగా గొల్లపూడి మారుతీరావు రచయితగా, నటుడుగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా, విలేఖరిగా తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగా, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి చిత్రరంగ ప్రవేశం చేశారు. చదవండి: సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత కుమారుని మరణం కుంగదీసింది -
గొల్లపూడి మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొల్లపూడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. వినూత్నమైన డైలాగ్ డెలివరీతోపాటు, రచనల్లో, నాటకాల్లో తనదైన శైలితో ఆయన అందరిని ఆకట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో గర్వించదగిన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. కాగా, గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గొల్లపూడి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. రచయితగా, నటుడుగా, సంపాదకుడిగా, వ్యాఖ్యతగా గొల్లపూడి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. చదవండి : సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత -
నటుడు గొల్లపూడి కన్నుమూత
-
సీనియర్ నటుడు గొల్లపూడి కన్నుమూత
చెన్నై : ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. మారుతీరావు 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య- వీధిలో క్రిష్ణయ్య సినిమాతో ఆయన నటుడిగా పరిచయం అయ్యారు. దాదాపు 250 సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు నాటకాలు, నవలలు, కథలు రాసేవారు. డాక్టర్ చక్రవర్తి సినిమాతో రచయితగా సినిమాలోకానికి పరిచయం అయ్యారు. వినూత్న విలనిజానికి ఆయన పెట్టింది పేరు. రచయితగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా ఇలా అన్ని కోణాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. -
నామాల గుండు
ఆమధ్య అక్కర్లేని ఆపరేషన్‌కి అవసరంలేని టెస్టులు చేయించమన్నారు డాక్టర్లు. అందులో ఎక్స్‌రే, గుండె చప్పుళ్ల ప్రణాళిక(డీసీఎం) ఉన్నాయి. వీటన్నింటికీ చికాకు పడుతూవుండగానే డాక్టరు రావడం ఆలస్యం అవడం వలన నన్ను గుండె చప్పుళ్ల టేబుల్ ఎక్కించారు. ఈలోగా వచ్చారు డాక్టరు. మలయాళీ.. సరసమైన మనిషి. వెంటనే పరీక్ష ప్రారంభించాడు. ఎక్కడా తను ఊహించిన శబ్దాలు వినిపించకపోవడంతో మారు మారు వెతుకుతున్నాడు. ఏమిటండీ వెతుకుతున్నారు? అన్నాను. మీ గుండెకాయలో గుండెకి సంబంధించిన చప్పుళ్లేవీ వినిపించడం లేదు అన్నారు. ఆశ్చర్యం!! నేను నవ్వుకున్నాను. మొదటినించీ ఏ శబ్దాలు వింటున్నారో చెప్పండి? ఇది డాక్టరుకు సమాధానం: పదహారు, పదిహేడేళ్లనాటి సంఘటన–ఆ వయసులో కుర్రాళ్లం వేదికలెక్కి నాటకాలు ఆడాలన్న తాపత్రయం. కానీ ఇవి ఏమిటి? మరికాస్త వయసులోనే యువకులకు నాటక పాఠాలు చెప్పే పరిస్థితి. అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను. అది ఒక వెర్రిగోల. కొంతదూరం వెతికాడు. డాక్టరు చక్రవర్తి సైన్ బోర్డు మా అబ్బాయిని ఎత్తుకుని గేటు దగ్గర రోజూ మేము. మా పేర్లు చూసుకునేవాళ్లం. నవ్వి ఇది 53 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన సినిమా కథ. పసివారి ఒంటరితనం నాకు తెలియదు. ఉన్నట్టుండి ఇంట్లోరామయ్యన్నారు. స్టార్ అన్నారు. డజన్లకొద్దీ సినిమాలు మీద పడ్డాయి. అది పలుకుబారిన దశ. హఠాత్తుగా డాక్టరు ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను. ఏమిటి ఈ నిశ్శబ్దం అన్నాడు డాక్టరు. 80 సంవత్సరాలపైన నన్ను పెంచి పెద్ద చేసిన పెద్ద దిక్కు నాన్నగారు వెళ్లిపోయారు. గతం స్వగతం చెప్పుకునే విషాదకరమైన క్షణాలు ఇంకా సందిగ్ధం నడుస్తూనే వుంది. మళ్లీ ఏమిటి ఇది? నాకు 40 ఏళ్ల జీవితాన్నివ్వవలసిన కొడుకు శవం ముందుంది. ఇంకా వెతుకుతున్నారు. 30 ఏళ్లు మీరిన భార్య వృద్ధురాలైంది. మరికాస్త దూరం ప్రయాణం. ఇంకా నిశ్శబ్దమే. జీవితం పరుగులు పెడు తోంది. ఉన్నట్టుండి శబ్దాలు ఆగిపోయాయి. తడబడుతున్న గొంతుతో అన్నాను. నా ప్రాణం మా అమ్మ ఇప్పుడే వెళ్లిపోయింది–నా ఒడిలో తలపెట్టుకుని. వెళ్లిపోతున్న మా అమ్మ ఆఖరి ఊపిరిని నా ఊపిరి తరిమి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గొంతు గాద్గదికమైంది. మళ్లీ నా నవ్వే తోసుకొచ్చింది. యాభై తొమ్మిది ఏళ్ల కిందట చదువుకుని సాహితీప్రపంచంలో అంతో ఇంతో సాధించిన నన్ను ఆంధ్రాయూనివర్సిటీ విస్మరించగా 39 ఏళ్లకిందట స్థాపించిన గీతమ్ కాలేజ్ డాక్టరేట్ ఇచ్చింది. జీవితం పల్టీలు కొడుతోంది. కళ్లకి కాటరాక్టు, చేతికి కర్ర వచ్చింది. చేతిరాత వంకర్లు తిరిగింది. వయసు పలకరిస్తోంది. ఈ దశలో జీవనకాలమ్ కుంటినడక నడుస్తోంది. నా కళ్లు గతంలో ఉన్నాయి. ఎదురుగా వున్న గుండె చప్పుళ్ల ధోరణి నిశ్శబ్దంగా వుంది. ఏమిటీ కథల సమూహానికి పేరు? అన్నాడు సరదా అయిన డాక్టరు. ఈ ప్రణాళికకి ఒక పేరుంది. అది నాకు తెలుసు. ఏమిటది? నేను. గొల్లపూడి మారుతీరావు -
శరదశ్శతమ్
కొన్ని రోజుల్లో చచ్చి పోతున్నావని డాక్టర్లు తేల్చారు. నిన్ను చూడా లని ఉందిరా అని సమా చారం పంపాడు కాళీ, దాసుకి. దాసుది సామర్ల కోటలో సగ్గుబియ్యం హోల్‌సేల్ వ్యాపారం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వ్యాపారం దాసు వారసత్వంగా పుచ్చుకున్నాడు. పై చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం సంపా దించుకున్నాడు. ఇద్దరూ కలిసి దశాబ్దాలు గడి చింది. అందుకే ఈ సమాచారం దాసుకి ఆశ్చ ర్యాన్ని కలిగించింది. అయినా కానీ పనికట్టుకుని చిన్ననాటి స్నేహితుడిని చూడటానికి బయలు దేరాడు దాసు. కాళీ 77, దాసు 75. కాళీకి ఇన్నేళ్లలో ఉన్న జుత్తు ఊడిపోయింది. దాసుకి వారసత్వంగా తల్లిదండ్రుల పొట్ట వచ్చింది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని కావలించుకుని, గెంతులేసి పొంగిపోయారు. విచిత్రం, స్నేహితుడిని బాధిస్తానని దాసు కాళీ జబ్బు గురించి అడగలేదు. రాకరాక వచ్చిన స్నేహితుడిని ఇబ్బంది పెడతానని కాళీ చెప్పలేదు. బయటికి ఇద్దరూ ఆనందంగా, డాబుగా, అన్నిటినీ మించి తృప్తిగా ఉన్నారు. ఆమాటా, ఈమాటా మాట్లాడుతూ చిన్నతనంలో తమ అక్కలు ఆడే ‘ఆడ ఆటలు’ ఆడారు. చెమ్మాచెక్కా ఆడినందుకే పగలబడి నవ్వుకున్నారు. చింతపిక్కలతో ఆడవాళ్లు ఆడే తొక్కుడుబిళ్ల ఆట ఆడారు. వెనక వరండాలో 75 సంవత్సరాల బొజ్జ దాసు, కాళీ 77 సంవత్సరాల జబ్బు శరీరం గెంతు లాట చూసి ఇంటిల్లిపాదీ ముక్కుమీద వేలేసు కున్నారు. ఆ రాత్రి డాక్టరు కాళీకి రెండు మాత్రలు తక్కువ చేశాడు. రానురానూ మిత్రులిద్దరూ పసిపిల్లలయి పోయారు. కాళీ చిన్నతనంలో బొమ్మలు వేసే వాడు. ఒకరోజు రెండు అట్టలమీద పులి ముఖాలు వేశాడు. ఇది మిత్రులు ఇద్దరూ శ్రీరామనవమి సంబరాల్లో రోజూ ఆడే ఆట. ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అయినా ఇద్దరూ బొమ్మలు పెట్టుకుని పులిగెంతులు గెంతారు. ఇదే ఆట. ఇంటిల్లిపాదీ నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో దాసు బొజ్జకి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో కాకినాడలో అద్దెకి ఉండేవారు. ఇద్దరూ భయం కరమైన గొంతు కలవారు. ‘పాతాళభైరవి’ చూసి వచ్చి– పాటల పుస్తకం కొని పాటలన్నీ భయం కరంగా పాడారు. ఇంటివారు మొత్తుకుంటే మరింత విజృంభించారు. ఇప్పుడా ఇల్లు లేదు. ఇంటాయన లేడు. 65 సంవత్సరాల కిందటిమాట. 75 సంవత్సరాల దాసు విజృంభించాడు. 77 సంవత్సరాల కాళీ అందుకున్నాడు. ఇప్పుడు తమ ఇంట్లో కాదనే వారెవరు? వాళ్ల గొంతుల్ని, అల్లరిని బాలక్రిష్ట త్వాన్ని భరించారు. భరిస్తున్నారని తెలిసి ఇద్దరు మిత్రులూ రెచ్చిపోయారు. దాసు వెళ్తానంటే కాళీ, దాసు బొజ్జమీద దరువువేశాడు. చిన్నతనం ఆటలు, ఆ చవకబారు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. స్కూలుకి వస్తే, రైలు పట్టాలు దాటుతున్న చంటిబాబు చావు తలుచు కుని ఇద్దరూ ఏడ్చారు. అతని ‘మాజిక్’ విన్యా సాలు ఒక రోజంతా చెప్పుకున్నారు. ఏతావాతా 15 రోజుల్లో ఉద్యోగి కాళీ, వ్యాపారి దాసూ మారిపోయారు. 65 సంవ త్సరాలు వెనక్కిపోయారు. మనస్సుల ముసు గులు మళ్లీ అతుక్కున్నాయి. వాస్తవం అటకెక్కింది. ‘ఏమిటి తాత ధోరణి’ కాళీ మనుమడు డాక్టరు దగ్గర ఆశ్చర్యపడ్డాడు. డాక్టరు కంగారు పడటానికి బదులు నవ్వాడు. ‘ఎప్పుడు వస్తారు’ అని సామర్లకోట నించి ఫోన్ చేసిన దాసు మేనల్లుడికి– దాసు చేతుల్లో ఫోన్ లాక్కుని సమాధానం చెప్పాడు కాళీ ‘ మీ మామ ఇప్పుడు రాడురా’ అని. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.18 రోజులు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులూ వర్తమానాన్ని మర్చిపోయారు. జీవితాన్ని తిరగేసి మళ్లీ గడపటం ప్రారంభిం చారు. 25 రోజులు అయింది. దాసు లేచేసరికి కాళీ సూర్యో దయం చూస్తూ కనిపించాడు. ‘ఏంట్రా ఆలోచిస్తున్నావు?’ అన్నాడు దాసు. కాళీ ధైర్యంగా ఇటుతిరిగి ‘నేను చావనురా– నువ్వు సామర్లకోట పో’ అన్నాడు కాళీ. జ్ఞాపకాలు బంగారు తాకిడీలు, ఆలోచనలు ఆత్మబంధువులు. (నన్ను మళ్లీ ‘జీవనకాలమ్’ రాయమని పోరి రాయించిన మా తమ్ముడు శివకి అంకితం) గొల్లపూడి మారుతీరావు -
చట్టం చలివేంద్రం
కశ్మీర్ సన్నివేశం టీవీలో చూసినప్పుడల్లా ఆశ్చర్యం గానూ, ఎబ్బెట్టుగా ఉండేది. తమ మూతులు కనిపించకుండా గుడ్డలు కట్టుకున్న పాతిక ముప్ఫై మంది యువకులు, పిల్లలు బహిరంగంగా రోడ్లమీద ఎదురుతిరిగి పోలీసులను కొట్టడం, వాళ్లు చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉన్నా నిస్సహాయంగా ఆ రాళ్లను ఎదుర్కోవడం, దురదృష్టవశాత్తు వారిలో కొందరు గాయపడటం, ఒకరిద్దరు చనిపోవడం.. ఇది విడ్డూరంగా ఉండేది. కారణాలు ఏవైనా క్షణంలో పోలీసులు ఆ యువకులను తరిమికొట్టవచ్చు. ఒక పోలీసు గాయపడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, ఒక యువకుడు గాయపడితే, పసివాడు గాయపడితే సరే సరి. నాయకులు రెచ్చిపోతారు. పసివారిని ప్రభుత్వం చంపేస్తోందని విరుచుకుపడతారు. ఇది విచిత్రమైన పరిస్థితి. ఇలా సాగాల్సిందేనా? అని అప్పుడప్పుడూ ఆవేశం కూడా వచ్చేది. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కాకపోతే ఈ వర్షంలో ఈ మధ్య ఒక లారీ డ్రైవర్ చనిపోయినట్టు వార్త కనిపించింది. ఏమిటీ రాజకీయ యుద్ధం. కారణం ఎవరు? ఇప్పుడు పూర్తిగా తేలిపోయింది. ఆ కుర్రాళ్లందరూ పాకిస్తాన్ భక్తులు కారు. రోజుకూలీ సంపాదించుకునే కూలీలు. రాళ్లు విసిరినందుకు ప్రతిరోజూ డబ్బు ముడుతుందట. ఎవరిస్తారు? ఇండియా వ్యతిరేకులు ఇస్తారు. వాళ్లని సంవత్సరాల తరబడి వచ్చిన ప్రభుత్వాలన్నీ ఆర్థికంగా మేపుతున్నాయి. సకల సౌభాగ్యాలూ ఇస్తున్నాయి. పోలీసులకు తుపాకీ పేల్చడం సులువు. కుర్రాళ్లు గాయపడటం గ్యారంటీ. పిల్లలకి ఏమైనా అయితే కశ్మీర్ వ్యతిరేక నాయకులు విజృంభిస్తారు. వీళ్లకు ఎవరో ఎలాగో డబ్బు చేరుస్తారు. రాళ్ల సంపాదన వారి సొత్తు. ఈమధ్య ఉన్నట్టుండి రాళ్ల వర్షం ఆగిపోయింది. కారణం మధ్యవర్తులుగా కశ్మీర్ వ్యతిరేక వాదులంతా జైళ్లలో ఉన్నారు. వారికి చేరవలసిన కశ్మీర్ పైకం చేరడం లేదు. రాళ్లు విరివిగా ఉన్నాయి. విసిరేవారు తగ్గిపోయారు.ఇది ఒకే వాక్యం–ప్రచ్ఛన్నయుద్ధం. తెలిసి తెలిసి ఈ యుద్ధాన్ని గమనిస్తున్న నాయకులు కూడా నిర్బంధంలో ఉన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా ఈమధ్య తన స్వాతంత్య్రం గురించి వాపోయారు. పదిసార్లు ఈ దేశం నాది, ఈ జీవితం వివాదరహితంగా సాగాలని పదిసార్లు చెప్పి చెప్పి, ఒక్కసారి మాత్రమే రాళ్లేసే పిల్లల గురించి, దౌర్జన్యకారుల గురించి మాట్లాడతారు. అప్పుడు ఆయన పెదాలు ఆవేశంగా బిగుసుకుంటాయి. ఆర్టికల్ 370 గురించి మాట్లాడటం నా ఉద్దేశం కాదు. గవర్నమెంటు చర్యలను విమర్శించేవారు నిర్బంధంలో ఉన్నారు. ఇదొక విచిత్రమైన రాజకీయ పోరాటం. ఇందులో ముఖ్యమైన పాత్ర పత్రికలదే. ఇంకొన్ని నిశ్శబ్ద పాత్రల గురించి నిన్ననే దేశ సంరక్షణాధికారి అజిత్ దోవల్ చెప్పారు. వాటిలో ఒకటి న్యాయస్థానం. జరుగుతున్నది అరాచకమని తెలిసినా, చేసిన వ్యక్తి తప్పనిసరిగా చేశారన్నా–దౌర్జన్యకారుల పట్ల–తమ మెత్తని విచక్షణ ద్వారా పరోక్షంగా రక్షణ కల్పిస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎవరైనా దౌర్జన్యకారుల ఆచూకీ తెలిపారా? తెలిపి న్యాయస్థానం ముందో, లేకుంటే దౌర్జన్యకారులముందో నిలవగలిగారా? వీరంతా పరోక్షంగా అన్యాయాన్ని, అరాచకాన్ని సమర్థిస్తున్నట్లు జాతీయ రక్షణ సలహాదారు నిన్న కుండబద్దలు కొట్టారు. పిల్లల్ని శిక్షించడం సాధ్యం కాదు. దౌర్జన్యకారులు ఒకింతకుకానీ లొంగరు. చచ్చిపోయినవారు సాక్ష్యం చెప్పరు. దోవల్‌గానీ, నేనుగానీ 370 గురించి మాట్లాడింది లేదు. రాజకీయమయమైన ప్రారబ్ధానికి ‘పత్రిక’లు ఆజ్యం పోయరాదన్న ఆయన వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను. గొల్లపూడి మారుతీరావు -
ప్రచారంలో పదనిసలు
ఈమధ్య రాజకీయ నాయకులు తమ ప్రచారంలో ఓ ప్రమాదకరమైన విషయంలో కాలుమోపుతున్నారని నాకనిపిస్తుంది . అసదుద్దీన్ ఒవైసీగారు నరేంద్రమోదీ మీద కాలు దువ్వుతూ ఒకానొక సభలో ‘‘గో మాంసంతో చేసిన బిరియానీ సేవించి తమరు నిద్రపోయారు ? ’’ అని విమర్శించాడు. ఇందులో ప్రత్యేకమైన ఎత్తుపొడుపు– గోవుల్ని ఆరాధించే పార్టీనాయకులు అలాంటి బిర్యానీని తినడం. వీరే 2018 తెలంగాణా ఎన్నికలలో ‘‘నేను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుని ఒక ప్యాకెట్ ‘కళ్యాణి’ బిర్యానీ అడుగుతా’’ అన్నారు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఉత్తరప్రదేశ్ మొరా దాబాద్ ఎన్నికల సభలో ‘‘ఇంతకాలం కాంగ్రెస్ దౌర్జన్యకారుల చేత బిర్యానీని తినిపించింది’’అని ఎద్దేవా చేశారు. కాంగ్రెసు కార్యదర్మి ప్రియాంకా గాంధీ ‘‘మోదీగారు పాకిస్తాన్ బిర్యానీని సేవించడానికి పాకిస్తాన్ వెళ్లారు’’ అని వెక్కిరించారు. తెలుగులో ఓ సామెత∙ఉంది. ప్రత్యర్థిని దెబ్బతీస్తున్నప్పుడు ఒకమాట చెప్తారు. ‘‘ఏమైనా చెయ్యండి కానీ అతని కడుపు మీద కొట్టకండి’’ అని. కారణం ఉపాధికి మూల స్థానం– కడుపు. దానికి సంబంధించినది దేన్ని కదిపినా మనిషి కదులుతాడు అయినా ఈమధ్య రాజకీయ నాయకులు ‘కడుపు’ మీద కొడుతున్నారు. అది చాలా ప్రమాదకరమైన చర్య అని ముందుగా అందరినీ హెచ్చరిస్తున్నాను. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రుచి ఉంటుంది. దానిని ఎత్తి చూపి ఆ ప్రాంతాలవారిని వెక్కిరించడం కద్దు. దక్షిణాదివారిని ‘ఇడ్లీ సాంబారు వాలా’ అంటారు. ఒకప్పుడు ఇది తమిళుల సొత్తు ఇప్పుడు ఇడ్లీ విశ్వరూపం దాల్చింది. వాషింగ్టన్ , దుబాయ్, మలేషియా– ఎక్కడయినా ఇడ్లీ దర్శనమిస్తుంది. తెలుగువారికి – దోశ, పెసరట్టు. నేను విజయవాడలో పనిచేసే రోజుల్లో రాత్రంతా రచన చేసి ఏ తెల్లవారు జామునో కడుపు తేలిక కాగా ఏలూరు రోడ్డుకి వచ్చేవాడిని. ఆ సెంటర్లో ‘మాతా కేఫ్’ ఉండేది. మాలాంటి వాళ్ల కోసం వేడి వేడి ఇడ్లీలు చేసేవాడు. ఓపట్టు ఎక్కువ పట్టాలంటే మినప దోసె. వీటిని తినడానికే ఓ రాత్రి వరకూ రచన సాగించేవారం. కాలిఫోర్నియాలో సాగర్ అనే తెలుగు మిత్రులు ఒక ఆంధ్రా హోటల్ తెరిచారు. పేరు? ‘‘దోసె ప్యాలెస్’’. అక్కడి దోసెలు తినడానికి 60–70 మైళ్ల దూరం నుంచి తెలుగువారు రావడం నాకు తెలుసు. మరి కేరళవారికి? పుట్టు కడలె చాలా అభిమాన వంటకం. సంవత్సరాల కిందట ప్రముఖ దర్శకులు భీమ్‌సింగ్ గారి సతీమణి సుకుమారి ఇంట్లో తిన్న జ్ఞాపకం ఇప్పటికీ చెదిరిపోదు. ఇక కర్ణాటకలో– ఆ మాటకు వస్తే మన రాయలసీమ పొలిమేరల నుంచి ‘రాగి ముద్ద’ చాలా ఫేమస్. నిజాం ప్రాంతంలో, కొన్ని ఉత్తరాది ప్రాంతాలలో చాలా పాపులర్ వంటకం– బిర్యానీ. నాకో దురభిప్రాయం ఉండేది. ఇది బొత్తిగా ఉత్తర భారతీయుల ‘రుచి’ అని. నేను పొరపాటు బడ్డానని ఈ మధ్యనే గ్రహించాను. ఇవాళ ఎక్కడ చూసినా చెన్నైలో బిర్యానీ విశ్వరూపం కనిపిస్తోంది. బిర్యానీ హోటళ్ల వివరాల కోసం కంప్యూటర్ తెరిచాను. నాకు శోష వచ్చినంత పనైంది. ఒక్క చెన్నైలోనే దాదాపు 249 హోటళ్లున్నాయి. అదీ రకరకాల బిర్యానీ రుచులతో. మచ్చుకి కొన్ని మాత్రం – ఆసీష్ బిర్యానీ, తాళపుకట్టె బిర్యానీ, మలబార్ బిర్యానీ, అబ్దుల్లా బిర్యానీ, అంబాళ్ బిర్యానీ, తంగమ్ బిర్యానీ, స్టార్ చికెన్ బిర్యానీ, ముఘల్ బిర్యానీ, కరీం బిర్యానీ, ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ, బిలాల్ బిర్యానీ, చార్మినార్ బిర్యానీ, పారామౌంట్ బిర్యానీ, ది రాయల్స్ బిర్యానీ, సేలం ఆర్ఆర్ బిర్యానీ, తారిఖ్ బిర్యానీ, నయీం బిర్యానీ, సంజయ్ బిర్యానీ– ఇక్కడ ఆగుతాను. మొఘలుల కాలంలో ఇండియాకు దిగుమతి అయిన ఈ వంటకం – పేరు, రుచి మార్చుకుని ఇప్పుడు అంతటా దర్శనమిస్తోంది. అవధ్, హైదరాబాద్, పంజాబీ, కలకత్తా, దిండిగల్లు ఇలా మీ యిష్టం. విజయ్ మరూర్ అనే వంటగాడు– లక్షలాది మందికి అనుదినమూ ఆనందాన్నీ, ఉపాధినీ ఇచ్చే ఈ ‘గొప్ప’ దినుసుని రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయడం అన్యాయమని వాపోయారు. మనూ విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ సల్మా ఫరూఖీగారు తమ రాజకీయ వెక్కిరింతలకు నిక్షేపంలాంటి, కడుపుల్ని నింపే వంటకాన్ని వీధిన పెట్టడం దుర్మార్గం అన్నారు. ఏమయినా ఈ రాజకీయ నాయకులందరూ పప్పులో కాలేశారని నాకనిపిస్తుంది. పొరపాటు. ఈ మాట అన్నదెవరో పప్పుని దుర్వినియోగం చేశాడనీ, అతనికి బొత్తిగా పప్పు రుచి తెలియదని నా ఉద్దేశం. ఇప్పుడు – ఈ కామెంట్‌ను తిరగరాస్తున్నాను. ఈ రాజకీయ నాయకులందరూ నిర్ధారణగా ‘బిర్యానీ’లో కాలేశారు. వారందరికీ అర్థంకాని విషయం ఏమిటంటే మన దేశంలో బిర్యానీ రుచి కొత్త రాష్ట్రాలకూ, ప్రాంతాలకూ పాకుతోంది. రోజురోజుకీ దేశ ప్రజలు బిర్యానీ రుచిని మరిగి విర్రవీగిపోతున్నారు. కనుక బిర్యానీని అడ్డం పెట్టుకుని ఎద్దేవా చేసే నాయకులు వారికి తెలియకుండానే కొన్ని లక్షల ఓట్లు నష్టపోతున్నారని నాకనిపిస్తోంది. -గొల్లపూడి మారుతీరావు -
బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి
సాక్షి, విశాఖపట్నం/పాతపోస్టాఫీసు (విశాఖ దక్షిణ): రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జర్నలిజం, నాటకం, నవల, టీవీ, సినిమా, అన్నిటికీ మించి రేడియో ఇన్ని ప్లాట్‌పారాల మీద రాణించడం గొప్ప విషయమని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కొనియాడారు. మారుతీరావు 80 జన్మదినం సందర్భంగా విశాఖలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘గొల్లపూడి.. అశీతిపర్వం’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘వందేళ్ల కథకు వందనం’పై ఆయన మాట్లాడారు. మారుతీరావు అనేక రంగాల్లో రాణిస్తూ, నిష్ణాతులతో కలిసి పనిచేశారన్నారు. గొప్పవారితో పనిచేసిన అనుభవం, ప్రావీణ్యం ఆయనను చాలా ఉన్నత స్థాయికి చేర్చాయన్నారు. అమెరికా, లండన్ వంటి దేశాల నుంచేగాక ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారూ ఆయన వద్దకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకున్నారన్నారు. గొల్లపూడి గొప్ప మేధావి అని, ఆయన ప్రతిమాట సందర్భోచితంగా ఉంటుందని పేర్కొన్నారు. కథా సాహిత్యంలో తనకు చిన్న స్థానం కల్పించినందుకు గొల్లపూడికి రుణపడి ఉంటానని చెప్పారుగొల్లపూడి రచనలు సమాజానికి అవసరంగొల్లపూడి మారుతీరావు రచనలు నేటి సమాజానికి చాలా అవసరమని విశాఖ రసజ్ఞ వేదిక అధ్యక్షుడు డాక్టర్ గండికోట రఘురామారావు అన్నారు. గొల్లపూడి 80వ జన్మదిన వేడుకలను నిర్వహించడం సంస్థ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఉదయం జరిగిన సాహితీ గోష్టిని డాక్టర్ బి.వి.సూర్యారావు నిర్వహించగా.. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి హాజరై గొల్లపూడి సంపాదకత్వంలో వెలువడిన వందేళ్ల కథకు వందనాలు గురించి మాట్లాడారు. గొల్లపూడి కంటే ముందు ఆయన రచనలు తనకు పరిచయమయ్యాయని చెప్పారు. జర్నలిజమే తమను ఇన్నేళ్ల పాటు కలిపి ఉంచిందన్నారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు మాట్లాడుతూ గొల్లపూడి తెరంగేట్రం ముందు, తర్వాత జరిగిన సినిమారంగ విశేషాలను వివరించారు. టీవీలు లేని కాలంలో గొల్లపూడి రేడియో నాటికలు వినడానికి లక్షలాది మంది శ్రోతలు ఆదివారం, గురువారం ఎదురు చూసేవారని గుర్తు చేశారు. యండమూరి వీరేంద్రనాథ్ వంటి పలువురు రచయితలుగా మారడానికి గొల్లపూడి మారుతీరావే స్ఫూర్తి అని తెలిపారు. డాక్టర్ పేరి రవికుమార్ మాట్లాడుతూ స్వాతి వీక్లీలో సీరియల్‌గా వచ్చిన ‘రుణం’నవల ఎందుకు ప్రజాదరణ పొందిందో వివరించారు. సినీ రచయిత డాక్టర్ వెన్నెలకంటి.. గొల్లపూడి జీవనకాలమ్ గురించి మాట్లాడారు. 40 ఏళ్లుగా ఈ కాలమ్ వారం వారం చదువుతున్న తెలుగు పాఠకుల్ని మళ్లీవారం కోసం ఎదురు చూసేలా రాయడం గొల్లపూడికే దక్కిందన్నారు. ప్రముఖ రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు మాట్లాడుతూ గొల్లపూడిలా బతకడం ఒక కళ, ఒక అదృష్టం, డబ్బుతో కొలవలేని ఐశ్వర్యమని కొనియాడారు. బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ చలం తెలుగు మ్యూజింగ్స్ తరువాత గొల్లపూడి ఆంగ్ల మ్యూజింగ్స్‌కు ప్రాచుర్యం ఎందుకొచ్చిందో వివరించారు. మధ్యాహ్నం సభలో చివరిగా మాట్లాడిన డాక్టర్ గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి గొల్లపూడి ఆత్మకథ అమ్మకడుపు చల్లగా ఎంత గొప్ప రచనకాకపోతే 9వ ప్రచురణకు నోచుకుంటుందని వివరించారు. ఈ సభా కార్యక్రమానికి ముందు శ్రీరామనవమి సందర్భంగా హిడెన్ స్ప్రౌట్స్ సంస్థకు చెందిన ప్రత్యేక అవసరాల పిల్లలు దశావతారాలు నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. నా బర్త్‌డేని చిరస్మరణీయం చేశారు.. తనకు జరిగిన సన్మానం అనంతరం గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ తన 80వ పుట్టిన రోజును విశాఖ రసజ్ఞ వేదిక చిరస్మరణీయం చేసిందన్నారు. కొద్దిరోజులుగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న తనకు ఏప్రిల్ 14 అంటేనే భయంగా ఉండేదని, ఆ రోజు తాను విశాఖ వెళ్తానోలేదో ఆందోళన చెందేవాడినని చెప్పారు. ‘ఒక దశలో ఆ రోజు తలచుకుంటే పానిక్ అయ్యే వాడిని. నిద్రపట్టేది కాదు.. ఆరోజు హాజరు కాగలనా? అని అనిపించేది. నిన్న మధ్యాహ్నం వరకు అపోలోలోనే ఉన్నాను. రెండు రోజులపాటు ఆరోగ్యం బాగు పడాలని కాకుండా 14కి విశాఖ వెళ్లేలా చూడండని వైద్యులను కోరేవాడిని. ఇప్పుడు ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించినందుకు ఆనందంగాను, గర్వంగాను ఉంది’అని వివరించారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్ మరణం తనను కలచివేసిందని చెప్పారు. సినిమాల్లో తన భార్యగా ఎక్కువసార్లు నటించిన అన్నపూర్ణ ఎలా ఏడవొచ్చో గ్లిజరిన్ రాసుకోవడం ద్వారా చెప్పేదన్నారు. 80 ఏళ్లలో 67 సంవత్సరాలు రాస్తున్నానని, కొన్ని గొప్పగా రాశానని తెలిపారు. ‘సాయంకాలమైంది’ సాయంత్రం ప్రారంభమైన ‘సాయంకాలమైంది’సభను డాక్టర్ పేరాల బాలమురళీకృష్ణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కె.సత్యనారాయణ.. గొల్లపూడి..అశీతి పర్వం (జన్మదిన ప్రత్యేక సంచిక)ను ఆవిష్కరించారు. తన రచనలతో కరుడుగట్టిన ఖైదీల మనసులను మార్చగలిగిన మారుతీరావు జన్మదిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందన్నారు. ప్రత్యేక సంచిక తొలి ప్రతిని మావూరి వెంకటరమణ స్వీకరించారు. గౌరవ అతిథులు డాక్టర్ ఎస్.వి.ఆదినారాయణ రేడియో నాటిక మొదటి భాగాన్ని, డాక్టర్ ఎస్.విజయకుమార్ రేడియో నాటిక రెండో భాగాన్ని ఆవిష్కరించగా.. తొలి ప్రతులను వి.హర్షవర్థన్ స్వీకరించారు. డాక్టర్ ఆదినారాయణ గొల్లపూడిని ప్రశంసించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య గొల్లపూడి మారుతీరావును అతిథులు ఘనంగా సత్కరించారు. అనంతరం గొల్లపూడి రచించిన సాయంకాలమైంది నవలపై డాక్టర్ ప్రయాగ సుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగం సాహితీ ప్రియులను ఆకట్టుకుంది. గొల్లపూడి సినిమాలపై రాంభట్ల నృసింహశర్మ తనదైన హాస్య ధోరణిలో మాట్లాడారు. ప్రముఖ రచయిత, నటుడు రావి కొండలరావు.. గొల్లపూడితో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. తామిద్దరూ నటించిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్ర వేసిన గొల్లపూడి నటనను వివరించారు. సభ ముగిసిన అనంతరం గొల్లపూడి రచించిన ‘కళ్లు’నాటికను బాదంగీర్ సాయి ఆధ్వర్యంలో మాతృశ్రీ కళానికేతన్ వారు వి.సంగమేశ్వరరావు దర్శకత్వంలో ప్రదర్శించారు. జీవీఆర్ఎం గోపాల్ వందన సమర్పణలో విచ్చేసిన సాహితీ ప్రియులకు, నాటక ప్రియులకు, గొల్లపూడి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
‘దాటుడు’ గుర్రాలు
జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలలో మన అభిప్రాయాలు మారుతాయి. ఈ మధ్య రిటైరయిపోయిన ఓ ‘పాత’ రాజకీయ నాయకుడిని కలిశాను. ఆయన తొలి రోజుల్లో గాంధీగారి ఉద్యమంలో పాల్గొని, ఖద్దరు కట్టి, కొన్నాళ్లు సబర్మతి ఆశ్రమంలో ఉండి వచ్చినవాడు. ‘‘ఇప్పుడేం చేస్తున్నారు?’’ అన్నాను. ‘‘ఏమీ లేదండీ. అబ్బాయి షాపులో కూర్చుంటున్నాను’’ అన్నాడు. ‘‘మరి మీరు మొన్నటి దాకా పని చేసిన గాంధీగారి సాహచర్యం?’’ ‘‘ఆ పోకడ నాకు నచ్చలేదండీ’’ అంటూ ఆ విషయం మీద చర్చించడానికి విముఖత చాపాడు. గట్టిగా వత్తిడి చేస్తే అప్పుడు చెప్పాడు. గాంధీగారి జాతీయ భావాలకు ఒక దశలో ఊగిన మాట నిజమే. కానీ ఆయన దరిమిలాను ‘స్వాతంత్య్ర’ ఉద్యమాన్ని ‘మతం’తో కలపడం ఈయనకి నచ్చలేదు. ఒక పార్టీ విశ్వాసాల మీద నిజమైన ‘కమిట్ మెంట్’ ఉన్న ఓ వ్యక్తి స్పందన ఇది. న్యాయం. కానీ తమ వ్యక్తిగత ప్రయోజనాలకు పదేపదే పాత పార్టీని అటకెక్కించేసి కొత్త పార్టీలో దూకే ‘అవకాశవాదులు’ కోకొల్లలు. వీరి దర్శన భాగ్యం ప్రతి రోజూ కలిగే అపూర్వమైన దినాలివి. మరి పార్టీ సిద్ధాంతాలు? విశ్వాసాలు? నాన్సెన్స్! ఎవడిక్కావాలి? పదవులో, డబ్బో.. లేక రెండూనో సంపాదించుకునే అవకాశం కావాలి. అందుకు తన వృత్తి లాయకీ కావాలి. అవును. ఇది ‘సేవ’ కాదు. ‘వృత్తి’. గట్టిగా మాట్లాడితే వ్యాపారం.ఉన్నట్టుండి మన రాష్ట్రంలో కాంగ్రెసు మూలబడ్డాక.. పార్టీలో ఉన్నవారూ, పదవుల్లో ఉన్నవారూ ఎలా చొక్కాలు మార్చారో ప్రజలకు తెలుసు. వీరిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ పాత చొక్కాల ‘కంపు’ గుర్తుకొస్తుంది. ఇప్పుడు? ఉన్నట్టుండి జయప్రద పార్టీ మార్చారు. తనకి టిక్కెట్టు ఇవ్వలేదని శతృఘ్న సిన్హా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మూలమూలల్లో ఉన్న సినీ తారల్ని ఏరి మరీ పార్టీ టిక్కెట్లు యిస్తున్నారు.. వీరిలో మిగిలిన ఏ మాత్రం ‘పాపులారిటీ’ గుజ్జునయినా రాబట్టుకోడానికి. ఉత్తరప్రదేశ్‌లో శ్యాం వరణ్ గుప్తా ఎస్.పి. నుంచి బీజేపీకి మారారు. చత్తీస్‌గఢ్‌లో గిరిరాజ్ సింగ్ బీజేపీలో చేరారు. రాకేష్ జీ సచిన్ కాంగ్రెసులోకి మారారు. అలాగే ఎస్.పి. హరీష్ ద్వివేదీ బీజేపీకి వచ్చారు. రెయిస్ జహాన్ బీఎస్పీ నుంచి కాంగ్రెసుకి దూకారు. బీఎస్పీ నుంచి ముకుల్ ఉపాధ్యాయ బీజేపీకి వచ్చారు. ఈ ‘దూకుడు’ ఎంత అర్జంటుగా, హాస్యాస్పదంగా ఉన్నదంటే ఆంధ్రాలో టీడీపీ నామా నాగేశ్వరరావుగారు టీఆర్ఎస్లోకి దూకారు. తీరా మరునాడు ఎన్నికల మీటింగులో దూకిన పార్టీ సింబ ల్కి బహిరంగంగా మారిపోయారు. ఇది కేవలం నమూనా ఉదాహరణలు. వీటికి కోట్ల పెట్టుబడి ఉంటుందని, అదవా చేరిన పార్టీ టిక్కెట్లు దక్కే అవకాశం ఉంటుందని పెద్దలు చెబుతారు. ఇలాంటి దుర్గంధ వాతావరణంలో కూడా కాస్త ‘ఆక్సిజన్’ని వ్యాపింపజేసే వ్యక్తులుంటారు. 40 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న సుష్మా స్వరాజ్, ఉమా భారతి పోటీ నుంచి స్వచ్ఛందంగా శలవు తీసుకున్నారు. ఈ దేశంలో బీజేపీలో 75 సంవత్సరాలు పైబడిన వారిని పోటీలో నిలపరాదని నిర్ణయిం చింది. అందుకు ఆ పెద్దలు అంగీకరించారు. ఈసారి పోటీలో ఎల్.కె.అద్వానీ, కల్ రాజ్ మిశ్రా, ఎమ్.ఎమ్.జోషీ, శాంతకుమార్, బి.సి.ఖండూరీ పోటీ చెయ్యడం లేదు. ఒకాయన చేయాలనుకున్నారు–మురళీ మనోహర్ జోషీ, ఎంత పెద్దవాడు! పోటీలో నిలిస్తే ఓటర్ హారతినిచ్చి ఆహ్వానిస్తాడు కదా? ఆ విషయం తెలిసిన పార్టీ గడుసుగా ఒక సీటుని గెలుచుకోవచ్చు కదా? కానీ పార్టీ ఆయన పోటీ చెయ్యడం లేదని చెప్పింది. ఆయన ఆ విషయాన్ని చెప్పి మానుకున్నారు. ఇదేమిటి? న్యాయంగా ఇప్పటి లెక్కల ప్రకారం ఈయన మరో పార్టీ తలుపు తట్టాలికదా? వీరంతా అన్నారు కదా –తమ పార్టీ ముందు కాలంలో పెద్దల అనుభవాన్ని ఎలా వినియోగించుకోవాలో నిర్ణయించుకుంటుందని. ఈ మధ్యలో ఎక్కడ చూశాం ఇలాంటి పెద్దరికాన్ని! ఇలాంటి ఉదాత్తత రాజకీయాల్లో ఎక్కడిది? ఆ మధ్య కర్ణాటకలో ఒక సీనియర్ నాయకులు అనంత్ కుమార్ కన్నుమూశారు. న్యాయంగా వారు కన్నుమూసిన విషాదానికి వారి సతీమణిని ఆ స్థానంలో నిలిపి వోటర్ సానుభూతిని పార్టీ రాబట్టుకోవడం సబబు. కానీ పార్టీ తేజస్వీ సూర్య అనే యువకుడిని ఎంపిక చేసింది. న్యాయంగా అనంత్ కుమార్ భార్య తేజస్విని ఎదురు తిరగాలి కదా? అర్జంటుగా మరొక పార్టీలో చేరాలి కదా? పార్టీ పెద్దల్ని దుయ్యపట్టాలి కదా? కానీ ఆవిడ అపూర్వమయిన సంయమనంతో ‘‘నాకు పార్టీ శ్రేయస్సు ముఖ్యం. సమాజ శ్రేయస్సు ముఖ్యం. ఏం చేయాలో, ఎలా చేయాలో పెద్దలు నిర్ణయిస్తారు’’ అన్నారు. ఈ మురుగు నీటి చెలమలకు దగ్గరగా.. యింకా మంచినీటి సెలలున్నాయని నిరూపించే ఓ పార్టీకి పెద్దరికాన్నీ, ఉద్ధతినీ, గాంభీర్యాన్నీ, Objectivityనీ సంతరించే యిలాంటి కొందరు నిజమైన ‘కార్యకర్తల’ ఉనికి దేశానికీ, ప్రజలకీ–ఈ సమాజానికీ కాస్త ‘ఊపిరి’ని ఇవ్వగలదని నాలాంటివారి ఆశ. గొల్లపూడి మారుతీరావు -
సింహావలోకనం
మార్గదర్శకమైన మార్గాన్ని కనిపెట్టే వైతాళికు నికి తను నమ్మిన నిజాల మీద నిర్దుష్టమైన విశ్వాసం ఉండాలి. మూర్ఖమైన పట్టు దల ఉండాలి. ఓ గుడ్డి లక్ష్యం ఉండాలి. ఓ రకమైన పెళుసుదనం ఉండాలి. ఇన్ని లేకపోతే ఏదో ఒక సంద ర్భంలో తన విశ్వాసం సడలుతుంది. సడలిందా? అతను పోయే అధఃపాతాళానికి మరెవ్వరూ పోలేరు. అలాంటి మార్గాన్ని ఎంచుకుని తన జీవితకాలంలో అఖండ విజయాన్ని సాధించిన అద్భుత పరిశోధ కుడు స్టీవ్‌జాబ్స్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పరప తిని సాధించిన ఐఫోన్ ప్రారంభదశకి ఆద్యుడు. ఈ దశలోనే ఇలాంటి మరొక మూర్ఖపు పట్టు దలతో విజయాన్ని సాధించిన ఇద్దరి పేర్లు ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను ‘వద్దు బాబోయ్!’ అంటున్నా వినిపించుకోకుండా 5 పాటలూ, 42 సీన్లూ ఉన్న ఓ సినీమాలో టైటిల్ రోల్ వేయించి నాకు 39 సంవత్సరాల, 300 సినీమాల కెరీర్‌ని ఇచ్చిన వ్యక్తి నిర్మాత రాఘవ. చాలా సందర్భాలలో నా కారణంగా రాఘవగారు భయంకరమైన ఫెయి ల్యూర్ చవి చూస్తారని భయపడి ఆయనతో అనేవా డిని. ఆయన కేవలం నవ్వి ఊరుకునేవారు. మరొక వ్యక్తి– ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త ఎస్. భావనారాయణగారు. ఊహించని ఉష్ణోగ్ర తల్లో లోహాల్ని కరిగించే మూసలు– ఆ ఉష్ణోగ్రతను తట్టుకునే ఏ మిశ్రమ లోహంతో తయారుకావాలి? సంవత్సరాల తరబడి తపస్సు చేసి– ఫలితాన్ని కనుగొని ఆ వ్యాపారానికి ‘కింగ్’గా నిలవడం నాకు తెలుసు. ఆ రోజుల్లోనే చిరంజీవి హీరోగా ఆయనకి నేను ‘ఐ లవ్ యూ’ రాశాను. ఆయనది విపరీతమైన instinct తొలి రోజుల్లోని ఒక చిత్రాన్ని చూసి ‘మారుతీరావుగారూ! ఈ కుర్రాడు చిదక్కొట్టేస్తాడు– అలా చూస్తూండండి’ అన్నారు. అలా చెప్పిన మరొక కన్నడ హీరో ‘ఒందానొందు కాలదల్లి’ చూశాక శంక రనాగ్ని. ఇద్దరూ దరిమిలాను అక్షరాలా ఆ పని చేశారు. తర్వాత రెండు చిత్రాలు తీసి, ఫెయిలయి ‘లాభం లేదు మారుతీరావుగారూ! నా ‘గురి’ తప్పింది. ఇంక సినీమాలు తీయను’ అని సన్య సించారు. ఏతావాతా స్టీవ్‌జాబ్స్ తన పరిధిలోకి వచ్చి తనని ప్రభావితం చేసేవారిపట్ల అతి క్రూరుడు. తను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అని నమ్మి, ప్రపం చాన్ని నమ్మించిన వ్యాపారి. తన ధోరణి సాగకపోతే పసివాడిలాగా ఏడ్చేవాడు. ఆ ఏడుపు నిస్సహాయత కాదు. తన అహంకారానికి ఆటవిడుపు. స్టీవ్ జాబ్స్‌కి భారతీయ తత్వ సిద్ధాంతమన్నా, సంస్కృతి అన్నా మక్కువ. భారతదేశం వచ్చి ఎన్నో దేవాలయాలు, సంస్థలను చూశాడు. ఆయన నమ్మ కాల పునాదుల్లో కనీసం రెండయినా భారతీయ ఆలో చనా వ్యవస్థ ఇటుకలు ఉన్నాయేమో! స్టీవ్‌జాబ్స్ ఏ కాలేజీకి వెళ్లలేదు. వెళ్లిన ఒక్క కాలేజీ చదువుని అర్ధంతరంగా వదిలి వచ్చేశాడు. తన మామగారి కారు గరాజ్లో పరిశోధనలు ప్రారం భించి మొట్టమొదటి ‘మెకంతోష్’కి రూపకల్పన చేశాడు. వ్యాపార రంగం దిగ్భ్రాంతమయింది. తర్వాత అతని జీవితం చరిత్ర. చివరికి కేన్సర్‌తో కన్నుమూశాడు. మరణ శయ్యమీద స్టీవ్ జాబ్స్ చెప్పిన మాటలు ఏ శ్రీశ్రీ రవిశంకరో, ఏ సద్గురు జగ్గీ వాసుదేవో చెప్పిన సూక్తులలాగ వినిపిస్తాయి. ‘అవసానం కొందరికి అవలోకన. కొందరికి కేవలం యాతన. చాలామందికి నా జీవితం పెద్ద విజయానికి నిదర్శనం. కానీ అందులో చాలా కొద్ది ఆనందమే ఉంది. ఐశ్వర్యం నాకు వ్యసనం. జీవిత మంతా నన్ను ఏమార్చిన మాఫియా. ఇప్పుడు ఆఖరి క్షణాలలో మృత్యువు సమక్షంలో ఈ ఐశ్వర్యం అర్థం లేనిదని అర్థమయింది. నీ కారుని నడపటానికి ఓ మనిషిని జీతానికి కుదుర్చుకోవచ్చు. కానీ– నీ అనారోగ్యాన్ని పంచుకోడానికి నువ్వు ఎప్పుడూ ఒంటరివి’. మిత్రుడు, ప్రముఖ హాస్య రచయిత డాక్టర్ తంబు కేన్సర్‌తో వెళ్లిపోయాడు. చివరి రోజుల్లో ఆయన ఆత్మీయ మిత్రుడు కళ్లనీళ్లు పెట్టుకుంటూ ‘చెప్పరా, నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను’ అన్నాడు రుద్ధ కంఠంతో. ‘అయితే నా మూత్రాన్ని నా తరఫున నువ్వు పొయ్యి’ అన్నాడట తంబు అనే డాక్టర్. ఎంత భయంకరమైన నిస్సహాయత. మళ్లీ స్టీవ్‌జాబ్స్: ‘నీ తెలివితేటలు పెరిగి, విజ్ఞత పుంజుకున్నకొద్దీ నీకొకటి అర్థమవుతుంది. 30 రూపాయల వాచీ, 30 వేల రూపాయల వాచీ అదే కాలాన్ని సూచిస్తుంది. వాచీ కాలం విలువని పెంచదు. అర్థంలేని నీ ‘వానిటీ’కి రంగులు దిద్దు తుంది. చివరికి నీ జీవితంలో ఆరుగురే ఉత్తమమైన వైద్యులున్నారు: సూర్యరశ్మి, విశ్రాంతి, వ్యాయామం, ఆహారం, ఆత్మవిశ్వాసం, స్నేహితులు. దేవుడిచ్చిన మనుషుల్ని కాపాడుకో. ఒకరోజు వాళ్ల అవసరం నీకుంటుంది. ‘తొందరగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లు. ఎక్కువ దూరం వెళ్లాలనుకుంటే నలుగురైదుగురుతో నడువు. ఎందుకు? ఆలోచించని జీవన ప్రయాణం ఏమారుస్తుంది. ‘ఆలోచన’ అడుగుల్ని అంచనా వేయిస్తుంది’. ఈ మాట ‘నడక’ గురించి కాదు. ‘జీవన ప్రయాణం’ గురించి. వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు -
ఉల్కలు– ఉరుములు
ప్రజాభిమానాన్ని చూరగొనడానికి సుదీర్ఘ పరిశ్రమ, ప్రతిభ, కొండొకచో చిన్న అదృష్టం కలిసి రావాలంటారు. అయితే ఇవేవీ అక్కరలేని అడ్డుతోవ ఒకటుంది. నిర్భయ దుర్ఘటన, బాబ్రీ మసీద్ కూల్చివేత, అణు పరీక్ష ఇలాంటివి. అయితే కొన్ని ప్రచారాలు ఎప్పుడు, ఎందుకు వస్తాయో తెలియదు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆశ్చర్యమూ, షాకూ కలుగుతుంది. ఈ మధ్య సినీరంగంలో ఈ అడ్డుతోవల సంఘటనలు, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇవి అనూహ్యం, ఆశ్చర్యకరం, ఇంకా చెప్పాలంటే విచిత్రం, విలక్షణం. ఈ మధ్య ఒమార్ లులు అనే దర్శకుడు ‘‘ఒరు ఆధార్ లవ్’’ అనే మలయాళ సినిమాను నిర్మించాడు. ఇది పామర భాషలో ‘విరగదీసే’ చిత్రం కాదు. అయితే అందులో ప్రియా వారియర్ అనే కొత్త అమ్మాయి నటించింది. ఒకానొక సీన్లో ఆ పిల్ల సరదాగా దూరపు క్లాసు బెంచీలో కూర్చున్న కుర్రాడిని చూసి కన్నుకొట్టింది. కుర్రాడు నవ్వాడు. రెండు వేళ్లు బిగించి రివాల్వర్లాగా కాల్చింది. కుర్రాడు గాయపడినట్టు తలవొంచాడు. అంతే, మిన్నువిరిగి మీద పడింది. ఇదేం కొత్త విన్యాసం కాదు. కానీ ఈమె కన్నుకొట్టడాన్ని దేశం ఉర్రూతలూగి అందుకుంది. ప్రచార సాధనాలన్నీ ఒళ్లు విరుచుకుని ఈ దృశ్యాన్ని ప్రచారం చేశాయి. దేశం పిచ్చెక్కిపోయింది. ఈ పాపులారిటీ ఎంతవరకూ పోయిందంటే – దేశంలోని ఇస్లాం వర్గాలు అలా ఓ ఆడపిల్ల బరితెగించడం సంప్రదాయ విరుద్ధమని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి! ఎక్కడ చిన్న మలయాళ సినిమా? ఎక్కడ ఊసుపోని సంఘటన. సుప్రీంకోర్టు ఆశ్చర్య పోయింది. చివరకు ‘‘పోవయ్యా. ఇదేదో చిన్నపిల్లల ఆట’’ అని కేసుని కొట్టి వేసింది. కొన్నేళ్ల కిందట– కొందరు కుర్రాళ్లు కలిసి ఓ సినిమా తీశారు. ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఇందులో హీరో. సినిమా పెద్ద ఊడబొడిచింది కాదు. కానీ ఆడుతూ పాడుతూ కుర్రాళ్లందరూ కలిసి – అనురుద్ రవి శంకర్ అనే కుర్రాడి ‘‘కొలవరి డీ’’ అనే పాటను రికార్డు చేశారు. అంతే, ఆ పాట కార్చిచ్చులాగా– భాషలకతీతంగా దేశంలో గంగవెర్రులెత్తించింది. ఎంత వెర్రి! బహుశా ఈ ‘కొలవరి’ నిర్మాతలే ఆశ్చర్యపోయి ఉంటారు. ఈమధ్య మా పెద్దబ్బాయి నన్ను లాక్కెళ్లి ధియేటర్లో కూర్చోపెట్టాడు. సినిమా పేరు ‘‘96’’. 1996లో కొందరు ఓ కాలేజీలో కలిసి చదువుకున్నారు. ఇందులో ఆడా మగా–రకరకాల మనస్తత్వాల పిల్లలు. ఓ పదేళ్ల తర్వాత ఈ గుంపు మళ్లీ కలుసుకోవాలనుకున్నారు. కలుసుకోవడమే సినిమా. ఇందులో ఓ అమ్మాయిపట్ల మక్కువ ఉన్నా మనసిప్పలేని మొహమాటస్తుడు హీరో. ఆ పిల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుని, ఓ కూతుర్ని కని సింగపూర్‌లో భర్తతో కాపురం చేస్తోంది. అందరూ కలిశారు. ఇందులో ఓ అమ్మాయి గర్భవతి. నలుగురూ రకరకాలుగా జీవితాల్లో సెటిల్ అయినవారు. ఈ సింగపూర్ అమ్మాయి వచ్చింది. మొహమాటస్తుడయిన కుర్రాడూ వచ్చాడు. తెల్లవారితే మళ్లీ అందరూ విడిపోతారు. ఈ కుర్రాడికీ, ఆ అమ్మాయికీ ఇప్పుడు తమతమ మనస్సులు తెలిశాయి. నిజానికి రాత్రంతా ఏకాంతంగా గడిపారు. కబుర్లు చెప్పుకున్నారు. కలిసి జీవించలేక పోయిన అసంతృప్తి ఇద్దరిలో–ప్రేక్షకులకీ తెలుస్తోంది. అదొక nostalgic pain. అయితే ఏకాంతంలో కూడా వారిద్దరూ సభ్యతను పాటించారు. తమ తమ దూరాల్ని ఎరిగి ప్రవర్తించారు. ఒక్కసారయినా ఏకాంతంలో తొందరపడతారా? అయినా ఒకరినొకరు కనీసం ముట్టుకోలేదు. తెల్లవారింది. ఆమెకు వీడ్కోలు చెప్పాడు హీరో. ఇద్దరి మనస్సుల్లోనూ – వాస్తవం కాని ‘కల’ అలాగే ఉండి పోయింది! ఇంతే కథ. ఇదిపెద్ద పెద్ద చిత్రాల్ని తలదన్నేసింది. హీరో కర్మాగారంలో ‘కళాసీ’లాగ ఉంటాడు. అమ్మాయి ఒప్పులకుప్ప. స్టార్. హీరో ఈసినిమాతో పెద్ద స్టార్ అయిపోయాడు. మొన్న ఒక సభలో ప్రేక్షకులు గింగుర్లెత్తి –‘మీరెలాగూ సినీమాలో ఒకరి నొకరు ఆలింగనం చేసుకోలేదు. ఇప్పుడు మా కళ్ల ముందు చేసుకోం ‘‘అని కేకలేశారు! ఆ దృశ్యానికి ప్రేక్షకుల గగ్గోలు! ప్రజా సందోహంలో ‘పాపులారిటీ’కి అర్థాలు మారిపోయాయి. అయితే – చాప్లిన్ పాపులారిటీకి కన్నుకొట్టిన కుర్రదాని పాపులారిటీకి, కొలవరికీ ‘కొల బద్దలు’ మారాయి. ఉరకలెత్తించే ఉత్తేజాలు కనిపించని ఆధునిక జీవితంలో ఈ చిన్న చిన్న ‘మెరు పుల్ని’ జనసందోహం ఏరుకుంటోందా? లక్షలాది ప్రజల సమష్టి ఆనందానికి ఇది విచిత్రమయిన కుదింపా? సినిమా హృదయాల్ని కదిలించే ఆనందానికి విడాకులిచ్చి– ఇప్పుడిప్పుడు పాపులారిటీకి నరాల్ని నమ్ముకుంటోంది. - గొల్లపూడి మారుతీరావు -
కోడి–సినీమా జీవనాడి
కోడి రామకృష్ణతో నా జ్ఞాపకాలు బహుశా అనితర సాధ్యమైనవి. కోడి నా దగ్గరికి వచ్చేనాటికి (1981) హైస్కూలు ఎగ్గొట్టి వచ్చిన కుర్రాడిలాగ ఉండేవాడు (ఫొటో). ‘ఇతనా కొత్త దర్శకుడు!’ అని మనసు కాస్సేపు శంకించిన మాట వాస్తవం. చాలా మొహ మాటస్తుడు. ఎప్పుడూ ఎవరినీ నొప్పించని మన స్తత్వం. అలాంటి ఆలోచన వస్తే తనే అక్కడి నుంచి తొలగిపోతాడు. ఆ రోజుల్లో నాకు బోలెడంత తీరిక. కొన్ని నెలలపాటు పొద్దున్నే వచ్చి రాత్రి నేను అమృతం సేవించి భోజనం చేసేదాకా కూర్చునేవాడు. ఏం చేసేవాడు? ఏదో చేసేవాడు– పిల్లలతో కబుర్లు చెప్తూనో, మరేదో. నా పనిపాటల్లో నవ్వుతూ పాలు పంచుకునేవాడు. నాకు కడప బదిలీ అయితే ఎన్నోసార్లు నాతో వచ్చాడు. నేను రేడియోలో ఆఫీసర్ని. ప్రతీ ఆదివారం చెన్నైలో బొంబాయి మైలు ఎక్కి సెకెండు క్లాసు కంపార్టుమెంటులో ఇద్దరం గుమ్మందగ్గర బయటికి కాళ్లు జాపుకు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నాతో అప్పుడప్పుడు కథా చర్చ. జరపకపోతే అడిగేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టని ఒక్క కారణంగానే– సరదాగా– అలవోకగా– ఆడుతూ పాడుతూ రెండు కథలు రెడీ చేశాం. కథ ఎవరివో ఒప్పించాలని కాదు. మేం ఒప్పుకోవాలని. (ఆ రెండు కథలూ చరిత్ర. రెండో కథ– ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిస్తే– ‘తరంగిణి’ తేలికగా సంవత్సరం నడిచింది) రెండో కథ, మొదటి కథ కావడానికి కారణం– ‘తరంగిణి’ చేయడానికి దర్శకుడి వెన్ను ముదరాలని భావించాం కనుక. రామకృష్ణ మెదడు పాదరసం. అతని గురువు గారి దగ్గర పుణికి పుచ్చుకున్న గొప్ప లక్షణం– నటుడికి ప్రత్యేకతనివ్వగల పాత్రీకరణ పుష్టి. ఇది చాలామంది దర్శకులకి లేదు. ప్రయత్నించినా రాదు. ఇందులో నిష్ణాతుల పేర్లు రెండు చాలు– సత్యజిత్ రే, మణిరత్నం. మొదటి చిత్రం రిలీజు నాటికే అతను స్టార్ డైరెక్టర్. నేను స్టార్‌ని. మరెందరో కొత్త నటు లకి– టైలర్ కృష్ణ, అశోక్ కుమార్ లాంటి వారికి ప్రాణం పోశాడు. కొత్త ఆలోచన వస్తే చుట్టూ అమోఘంగా అల్లు కునే అందమైన సాలెగూడు అతని మెదడు. కెమెరా ముందు నటుడి దమ్ముని గుర్తుపడితే– రామకృష్ణ గోమతేశ్వరుడయిపోతాడు. పూచిక పుల్లని పవిత్ర మైన దర్బని చేస్తాడు. కాగా, వ్యక్తిగా రామకృష్ణ బ్రతక నేర్చినవాడు. చాలామందికి తెలియదు. అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. లేకపోతే అతని ప్రతిభకీ, తొలి నాళ్లలో అతనికి వచ్చిన అవకాశాలకీ ఆకాశంలో ఉండవలసినవాడు. తన పరిధిలో ‘తను’ ముఖ్యం. దానిని సంపాదించుకోడు. ఆ ‘పరిధి’ని తన హక్కుగా చేసుకుంటాడు. అదీ అతని Creative Volcano. అతను దర్శకుడిగా స్థిరపడటానికి బేషరతుగా నా వాటాని పుంజుకుంటూనే నేను నటుడిగా స్థిరపడ టానికి అతని వాటాని బంగారు పళ్లెంలో పెట్టి సమ ర్పిస్తాను. తన చుట్టూ ఎప్పుడూ ముసురుకునే నా కొడుకుల్లో శ్రీనివాస్‌ని దర్శకత్వ విభాగంలోకి లాగి నవాడు కోడి. మొదటి రోజుల్లో ‘వాసూ గారూ’ అనే వాడు ఆ కుర్రాడిని. నేను కోప్పడితే పద్ధతి మార్చు కున్నాడు. అతని శిష్యుడు గురువుగారికంటే పాతికేళ్లు ముందే వెళ్లిపోయాడు. అందమైన ఆలోచనకి వెండితెరమీద రేంజ్‌ని ఇవ్వగల పనివాడు. నేను రాసిన డైలాగుల్ని నాకంటే బాగా అలంకరించుకున్న దర్శకుడు. కానీ ప్రతిభని ఏనాడూ తలకెత్తుకోడు. నేనూ, మా ఆవిడన్నా భక్తి. ‘ఇంట్లో రామయ్య...’కి 30 పైగా సెన్సార్ కట్స్ వస్తే జ్వరంతో తేనాంపేటలో చిన్న గదిలో దుప్పటి కప్పుకు పడుకున్న అతన్ని నేనూ మా ఆవిడా వెళ్లి లేపి ధైర్యం చెప్పాం. ఏం సినీమా అది! అప్పటికి పది సినీమాలు తీసినంతగా దర్శకుడిలో ‘పదును’ సంధించిన ఇట్ఛ్చ్టజీఠ్ఛి Vౌ ఛ్చిnౌ అది. అందులో లేచిన పెద్ద లావా సెల– ‘దటీజ్ సుబ్బారావ్!’ రాత్రిళ్లు షూటింగులూ, అకాల భోజనాలతో ఆరోగ్యాన్ని ఎక్కువగా దుబారా చేసుకున్నవాడు. మరికొంతకాలం ఉంటే తెలుగు చలన చిత్ర రంగంలో సమగ్రమైన దర్శకత్వ ప్రతిభకి, తనదైన బాణీకి విలాసంగా నిలిచేవాడు. చిన్నవాడు. అతనికి నేను నివాళి అర్పించేరోజు వస్తుందని అనుకోలేదు. పదికాలాలపాటు ఉండవల సినవాడు. పదికాలాలు నిలిచే మౌలిక కృషికి తోట మాలి. మృత్యువుకి ఓ దుర్మార్గం ఉంది. మన్నికయిన ప్రతిభకి అర్ధంతరంగా ముగింపురాసి చేతులు దులు పుకుంటుంది. మృత్యువుకి లొంగకపోతే రామకృష్ణ తెలుగు సినీమాకి కొండంత ఉపకారం చేయగల దక్షత, దమ్ము ఉన్నవాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
ఓ సినీమాలాంటి కథ
ఇలాంటి కథని రాస్తే చాలామంది నవ్వుతారు. అలాంటి కథలు రాసి ఒప్పించిన ఇద్దరు మహాను భావులు నాకు గుర్తొస్తారు –థామస్ హార్డీ (ది మేయర్ ఆఫ్ కాస్టర్ బ్రిడ్జ్), ఆంటన్ చెఖోవ్. అయినా ఇది విచిత్రమైన, అనూహ్యమైన కథ. నిజానికి కన్నూరు ప్రాంతంలో జరిగిన ఈ కథని వాళ్ల మేనకోడలు శాంతా కావుంబాయి నవలని రాసింది. అది 1946 ప్రాంతం. బ్రిటిష్ పాలనలో కేరళలో కన్నూరు ప్రాంతంలో భూస్వాముల ఆగడా లను వ్యతిరేకిస్తూ ముమ్మరంగా తిరుగుబాటు జరు గుతున్న సామాజిక–రాజకీయ నేపథ్య విప్లవాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ కథని అతని మేనకోడలు శ్రీమతి శాంత నవలని రాసింది. ఆ తిరుగుబాటు నేపథ్యంలో జరిగిన ఓ ఉపకథ ఇది. నారాయణన్ పెద్ద విప్లకారుడేం కాదు. కనీసం తన తండ్రిలాగా శాశ్వతమైన కీర్తిని ఆర్జించిన అమ రవీరుడూ కాదు. ఇ.కె. నారాయణన్ నంబియార్ 30 ఏళ్ల వాడు. తండ్రితో పాటు ఈ తిరుగుబాటు ఉద్య మంలోకి దూకాడు ఆవేశంగా. అప్పుడే అతనికి పెళ్ల యింది. భార్య శారద దూరపుబంధువుల అమ్మాయి. అప్పటికి భార్య శారద 13 ఏళ్ల పిల్ల. నిజానికి వాళ్లి ద్దరూ ఆనాటికి నోరిప్పి కబుర్లు చెప్పుకోలేదు– చెప్పుకోవడం తెలీదు కనుక. పెళ్లయిన కొన్ని నెలలకే ఇద్దరూ విడిపోయారు. అక్కడి రైతులు బ్రిటిష్ యాజమాన్యం, భూకామందులను ఎదిరిస్తూ జరిగే ఈ తిరుగుబాటులో చేతులు కలిపారు. డిసెంబర్ 29న నంబియార్ తన తండ్రి రామన్ నంబియార్‌తో కలిసి తాలియన్కి వెళ్లాడు. దూరపు కొండల సమీ పంలో ఉన్న కారాకట్టిడం నాయనార్ అనే భూస్వామి మీద తిరుగుబాటుకి బయలుదేరిన వందలాది మందితో వీరూ ఉన్నారు. భూస్వామి ఆగడాలను తుదముట్టించి, అతని ఆట కట్టించాలని వారి ప్లాను. కానీ వీళ్ల ప్రయత్నం కార్యరూపం దాల్చే లోగా బ్రిటి ష్వారి మలబార్ స్పెషల్ పోలీసు బలగం వీరిని చుట్టుముట్టింది. ఆ తిరుగుబాటుదారుల గుంపుమీద బుల్లెట్ల వర్షం కురిపించింది. అయిదుగురు అక్కడిక క్కడే చనిపోయారు. ఎందరో గాయపడ్డారు. నంబి యార్ తండ్రితో తప్పించుకుని అజ్ఞాతంలోకి మాయ మయ్యాడు.కానీ, పోలీసులు అతని ఇంటిమీద దాడిచేసి, స్త్రీలను హింసించి వారి ఉనికి కూపీ లాగారు. శారద అభం శుభం తెలియని పిల్ల కనుక ఆమెని వదిలి పెట్టారు. ఈ సంఘటన తర్వాత కుటుంబం ఆమెని పుట్టింటికి పంపించేసింది. రెండు నెలలు పోలీసు ఆ కుటుంబాన్ని రాసి రంపానబెట్టి, ఈ యజమానుల ఆచూకీ పట్టుకుని ఇద్దరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సంవత్సరాలు గడిచాక ఈ ఖైదీలను అధికారులు కన్నూరు సెంట్రల్ జైలు నుంచి వియ్యూరు అటు తర్వాత సేలం జైళ్లకు బదిలీ చేశారు.1950 ఫిబ్రవరి 11న రామా నంబియార్ జైల్లోనే జరిగిన కాల్పుల్లో తుపాకీ గుండుకి మరణించాడు. కొడుకు 16 సార్లు ఈ కాల్పులకు గురి అయ్యాడు. అయినా బతికాడు. చచ్చిపోయాడని అంతా నిర్ధారిం చుకున్నారు. కానీ శారదకేమో అతను బతికే ఉంటా డని ఓ నమ్మకం. సంవత్సరాలు తిరిగిపోతున్నాయి. బంధువులు ఆమెకి బలవంతంగా మరో పెళ్లి చేశారు. మరో ఎనిమిదేళ్లకు నారాయణన్ని విడుదల చేశారు. ఎక్కడా పెళ్లాం ఆచూకీ లేదు. అతనూ మరో పెళ్లి చేసుకున్నాడు. అయితే శారద ఎక్కడో ఒకచోట బతికే ఉన్నదని అతని ఊహ. సంవత్సరాల తర్వాత శారదకు కొడుకు పుట్టాడు. పేరు భగవాన్ పరాస్సినిక్కడవు. ఈ కుర్రాడు తన తల్లి ఎప్పుడో తన చిన్నతనంలో జరి గిన సంఘటనల గురించి తల్చుకోవడం విన్నాడు. ఈ మేనకోడలు– అంటే నవలా రచయిత్రి శాంత ఈ కుర్రాడిని కలిసింది. నారాయణన్ గురించి చెప్పింది. వాళ్లిద్దరినీ ఒకసారి కలపాలని భగవాన్ అనుకు న్నాడు. (‘లవకుశ’లాగ ఉన్నదా) ఎన్నాళ్ల తర్వాత? 72 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు నారాయణన్ తొంభయ్యో పడిలో ఉన్నాడు. శారద దాదాపు డెబ్బ య్యోపడి. భగవాన్ ఇంట్లో వారిద్దరూ కలిశారు. తమ స్వాధీనంలో లేని కారణాలకి వారిద్దరూ జీవి తాల్లో దూరమయ్యారు. వైవాహిక జీవితాలూ అలాగే సాగాయి. అతని నిస్సహాయత ఆమెకి తెలుసు. ఆమె గురించి అతను జైల్లో అప్పుడప్పుడూ తలచుకుని ఆమెకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాడేమో తెలీదు. అయితే ఒకరిమీద ఒకరికి దురభిప్రాయాలు లేవు. ఇద్దరూ జీవితం చేతుల్లో పావులు. వారి సమా గమం మొన్న డిసెంబర్ 26న. 72 సంవత్సరాల తర్వాత దూరమైన ఇద్దరు– ఆనాటి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారు? ఇప్పటి ఆమె కొడుకుకి నారాయణన్ ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటాడు? మేనకోడలు శాంత ఇప్పుడు మరో కొత్త నవలని రాయాలేమో?! గొల్లపూడి మారుతీరావు -
ఓ అజ్ఞాత విజ్ఞాని
చెన్నైలో లజ్ సెంటర్ నుంచి ఎల్డామ్స్ రోడ్డు వేవు నడుస్తున్నప్పుడు దారిలో చాలా ప్రసిద్ధ్దమైన అడ్రసులు. ఇంగ్లీషువారికాలంలోనే కోర్టుల్లో వారినే తన ఆంగ్లభాషా వైశిష్ట్యంతో అబ్బుర పరిచిన రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి హాలు తగుల్తుంది. అది దాటగానే అమృతాంజనం ఆఫీసు, పక్కన ఆంధ్రదేశ చరిత్రలో భాగమయిన శ్రీభాగ్ ఒడంబడిక జరిగిన శ్రీ భాగ్ బంగళా, తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి పార్కు. అయితే అటు వెళ్లేటప్పుడు ఇవేవీ గుర్తుకురావు. శాస్త్రిహాలుకి ముందుగా రోడ్డు పక్క రోడ్డుమీదే గుట్టగా పోసిన కొన్ని లక్షల పాతపుస్తకాల దుకాణం కనిపిస్తుంది. దీనికి గది, తాళాలు, పుస్తకాలకి రక్షణా ఏమీలేదు. ఆరుబయట– రోడ్డుమీదే పరిచిన దుకాణం. ఎండా, వానా, తుఫాన్, గాలి దుమారం ఏది వచ్చినా తట్టుకుంటూ గత అయిదు దశాబ్దాలుగా నడుస్తున్న సెకండ్ హ్యాండ్ దుకాణం. పుస్తకాలమీద పెద్ద టార్పాలిన్ కప్పి ఉంటుంది. ఆ గుట్ట ముందు – తపస్సు చేస్తున్నట్టు ఓ ముసలాయన కూర్చుంటాడు. అతని పేరు ఆళ్వార్. వొంటిమీద షర్టు లేదు. ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ భక్తుడు. అందుకని తర్వాతి రోజుల్లో ఆయనలాగ గెడ్డం పెంచాలి. నగరంలో వేలాది మేధావులకు, విద్యార్థులకు, రచయితలకు ఆ గుట్ట ఆటపట్టు. ఎప్పుడూ ఆ గుట్ట చుట్టూ ఖరీదయిన దుస్తులు వేసుకున్న వారూ, మే«ధావులూ పుస్తకాలు తిరగేస్తూ కనిపిస్తారు. రోజర్స్ థెసారెస్ , పాపిలియాన్, షేక్సి ్పయర్ సమగ్ర రచన సర్వస్వం, థామస్ హార్డీ రచనలు –ఇలా వేటి గురించయినా చెప్పగలడు. ఇంకా వైద్యం, ఇంజనీరింగ్, అకౌంటెన్సీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – ఈ విభాగాలలో ఎన్నో అరుదయిన పుస్తకాలు దొరుకు తాయి .ముద్రణలో లేని పుస్తకమా? ఇదొక్కటే అడ్రసు. కస్టమర్లు తప్పిపోయిన పాతమిత్రుడిని కలిసినట్టు పుస్తకాలను కరుచుకువెళ్లడం అక్కడ తరచుగా కనిపించే దృశ్యం. విశేషమేమిటంటే ఐయ్యేయస్ çపరీక్షలకి వెళ్ళే గ్రాడ్యుయేట్లు మధుర, తిరుచ్చి వంటి సుదూరమయిన ప్రాంతాలనుంచి అరుదయిన పుస్తకాలకి ఇక్కడికి వస్తారు. ఈ 50 సంవత్సరాలలో ఆ పుస్తకాల గుట్టకి తరచు వచ్చే కొందరు మహానుభావుల పేర్లు – సుప్రసిద్ధులైన భారతీ దాసన్ ఆయన కస్టమర్. పుళమై పిత్తన్, ముత్తులింగం వంటి కవులు వతనుగా వచ్చే వారు. ఫిలిం ఇండస్ట్రీ నుంచీ సెంథిల్, గౌండర్ మణి, ఎస్. వి. శేఖర్, చో రామస్వామి ఆయన సోదరుడు అంబి తరచు వచ్చేవారు. హీరో జయశంకర్ ఇక్కడ కూర్చుని టీ తాగి వెళ్లేవాడు కొన్ని రోజులు –ఇతను మైసూరు మహారాజా సామరాజ వొడయార్కీ, అప్పటి ముఖ్యమంత్రులు రామస్వామి రెడ్డియార్, అన్నాదురైకి పుస్తకాలు ఇచ్చి వచ్చేవాడు. ఇతని అసలు పేరు ఆర్. కె. నమ్మాళ్వార్. కాని అందరికీ అతను ఆళ్వార్. ఆళ్వార్ షాపు లజ్ దగ్గర పెద్ద బండగుర్తు. ఎప్పుడో 60 ఏళ్ల కిందట కడుపు పట్టుకుని విల్లుపురం దగ్గర వానియం పాలయం నుంచి చెన్నైలో దిగాడు ఆళ్వారు. 1950లో ఇక్కడ ఈ దుకాణానికి ప్రారంభోత్సవం చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి –‘‘ఇక్కడ వ్యాపారం చేసుకోవయ్యా’’ అని అనుమతి ఇచ్చారు. ఆ మాట ఇనుపకవచంలాగా సంవత్సరాల తరబడి పోలీసుల బారిన పడకుండా కాపాడింది. రోడ్డుపక్క ఈ పుస్తకాల గుట్ట పోలీçసులకి కన్నెర్రే, ఈ మధ్య ఎవరో పోలీసులమంటూ వచ్చి కొన్ని వేల పుస్తకాలే పట్టుకుపోయారు. మళ్ళీ తిరిగి ఇస్తే ఒట్టు. ఈ పుస్తకాల వ్యాపారానికి ముందు ఆళ్వార్ నెప్ట్యూన్ స్టూడియోలో లైట్ బోయ్‌గా పనిచేశాడు. కొన్ని సినిమాల్లో నటించాడు – మనోహర, స్వర్గవాసల్, తిలివిషం మొదలైనవి. మరి ఈ లక్షల పుస్తకాలు ఆళ్వార్కి ఎలా చేరుతా యి? కనీసం 10 మంది ఇంటింటికీ తిరిగి పుస్తకాలను కొని తీసుకు వస్తారు. రమణన్ అనే అతను 17 ఏళ్లుగా ఈ పని చేస్తున్నాడు. అతనికిప్పుడు 73 సంవత్సరాలు. ధనరాజ్ అనే కుర్రాడు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నాడు. ఇతని వ్యక్తిగత జీవితం ఇంకా ఆçసక్తికరం. వెనుక ఇంట్లో పని చేసే పనిమనిషి– ‘మేరీ’ని ఆళ్వార్ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమా? అని మేరీని అడిగితే సిగ్గుపడింది. విచిత్రమేమిటంటే ఈ మతాతీత వివాహం పెద్దలు చేసినది! మేరీకి ఎప్పుడు పెళ్లయిందో గుర్తు లేదు. ఆ మాటకు వస్తే తన వయస్సు ఎంతో తెలీదు! వాళ్లకి నలుగురమ్మాయిలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారు. ‘‘నేను విజ్ఞానాన్ని పంచుతానని అందరూ అంటారు. ఆ మాట ప్రభుత్వం అనుకుని నా వ్యాపారం సాగనిస్తే మేలు’’ అంటాడు ఆళ్వార్. ఈ మధ్య చాలాసార్లు అటువేపు వెళ్లాను. ఇప్పుడక్కడ పుస్తకాల గుట్టలేదు. ఆళ్వార్ లేడు. ఏమయింది? వారం రోజుల కిందట – తన 95వ యేట – ఆళ్వార్ కన్నుమూశాడు. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
హనుమంత్ ఖాన్ సాహెబ్
ఆ మధ్య యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడని వాక్రుచ్చారు. ఈ దేశంలో కులాల మధ్య తారతమ్యాలను ఆ విధంగా నిర్మూలించే ప్రయ త్నం వారు చేశారు. వారి మంత్రి మండలిలోని లక్ష్మీనారాయణ చౌదరిగారు శాసనసభలో హను మంతుడు జాట్ అని సెలవి చ్చారు. వారి దూరదృష్టి అనన్యసామాన్యం. ఈ విధంగా రాజస్తాన్‌లో ఒక వర్గం నిస్పృహను, నినాదాలను ఆయన ఒక్క వేటుతో నేలమట్టం చేసేశారు. ఈ లోగా మరొక బీజేపీ నాయకుడు బుక్కాల్ నవాబ్ గారు మరొక అపూర్వమైన సృష్టి రహస్యానికి తెర లేవ దీశారు. హనుమంతుడు ముస్లిం అని బల్లగుద్దారు. ఇది చరిత్రను తిరగరాసే, సమాజహితానికి తెరలేపే అపూర్వ మైన పరిశీలన. ఈ లెక్కన కిష్కింధలో వానర సైన్య మంతా ముస్లింలేనా– సుగ్రీవ్ అహమ్మద్, వాలి అహమ్మ ద్‌ల మధ్య వైషమ్యానికి కేవలం తారా బేగం మాత్రమే కాక మతపరమైన కారణాలేమైనా ఉన్నాయా అన్న విష యాలను వివరిస్తూ మరో వాల్మీకి ఖాన్ కనీసం కిష్కింధ కాండనుంచీ రామాయణాన్ని తిరిగి రాయాలని నాకని పిస్తుంది. నన్నడిగితే ఈ బుక్కాల్ నవాబు గారిని హిందు వులు పూలదండలు వేసి దేశమంతా ఊరేగించాలి. హను మంత్ ఖాన్ సాహెబ్ ముస్లిం కనుక, వారికి తన స్వామి శ్రీరాముని పట్ల అపారమైన భక్తి కనుక– ఈ దేశంలో తర తరాలుగా మురిగిపోతున్న అయోధ్య రామ మందిర సమస్య తేలికగా పరిష్కారం కాగలదు. అది ఈ లెక్కన ముస్లింలకూ ప్రార్థనా స్థలం కనుక. నా దగ్గర ఒక మహా అపురూపమైన నాణెం ఉంది. అది 210 సంవత్సరాల కిందటిది. మన దేశానికి స్వాతం త్య్రం రావడానికి 139 సంవత్సరాల ముందుది. ఆనాటికీ ఈ దేశంలో దేశ స్వాతంత్య్రానికి ఆలోచనలే లేవు. ముస్లింలకు వేరే దేశం, ప్రతిపత్తి అన్న ఆలోచనలే లేవు. నిజానికి బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని పాలించడం లేదు. ఏమిటి ఈ నాణెం ప్రత్యేకత? ఈ దేశంలో 565 జమీందారీలు, రాజపాలిత సంస్థానాలూ ఉండగా మన దేశానికి కేవలం వ్యాపారానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వెలువరించిన నాణెమిది. అర్దణా నాణెం. అంటే రూపాయిలో 32వ వంతు. ఈ నాణెం మీద హను మంతుడు సంజీవ పర్వతాన్ని తీసుకువెళ్తున్న దృశ్యాన్ని ముద్రించారు. ఇది అపూర్వమైన విషయం (210 సంవ త్సరాల కిందటిమాట అని మరిచిపోవద్దు) ఇంకా నయం హనుమంతుడు లంక్‌షైర్‌లోనో, బర్మింగ్‌హామ్‌లోనో పుట్టిన హనుమంత్ హెన్రీ అనో, వయస్సొచ్చాక ఎగిరి కిష్కింధ చేరాడనో అనలేదు. అయినా నిమ్మకాయలమ్ము కునే వ్యాపారికి యజమాని విశ్వాసాలను పరిరక్షించే ప్రయత్నం ఎందుకు? సమాధానం– అది వారి సంస్కృతి కనుక. ఆ సంస్కృతిలోంచే బ్రౌన్, కాటన్, మెకంజీ వంటి మహనీయులు వచ్చారు. ప్రజల సొమ్మును తినే నీచ వ్యాపారుల సంస్కృతి మనది. ఉదాహరణకి– విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. ఏదీ? మతాతీత దేశమైన ఈ దేశంలో దమ్ముంటే ఇలాంటి నాణేన్ని విడుదల చేయమనండి. వేలంకన్ని చర్చి బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. జుమ్మా మసీదు బొమ్మతో నాణేన్ని ముద్రించమనండి. మతాతీత వ్యవస్థ అంటే మతాన్ని అటకెక్కించాల్సిన పనిలేదు. మనకి మతం అడ్డువస్తుంది. మతం సామరస్యానికి పట్టుగొ మ్మగా నిలవాల్సిందిపోయి– పక్కవాడి మతాన్ని దుయ్య పట్టేదిగా తయారయింది. కాగా, ఒక వర్గానికి జరిపే ఉపకారం, క్రమంగా షరతై, ఓట్లయి, హక్కై– మైనారిటీల పేరిట పునాదుల్ని పెంచుకున్నాయి. ఇవాళ మనది స్వాతంత్య్ర దేశం. ఎంతో పురోగతిని సాధించిన దేశం. కానీ మతాల మధ్య అంతరాలను ఆ కారణానికే పరిష్క రించుకునే పెద్ద మనస్సు లేని దేశం. ఈ నేపథ్యంలో మన బుక్కాల్ నవాబుగారి ప్రతి పాదన అమోఘం. అన్నట్టు సత్యపాల్ చౌదరి అనే కేంద్ర మంత్రి హనుంతుడు ఒక ‘ఆర్యుడు’ అన్నారు. నంద కిషోర్ అనే రాష్ట్ర గిరిజన సంస్థ అధ్యక్షులు హనుమంతుడు ఒక గిరిజనుడన్నారు. కాంగ్రెస్ శాసనసభ్యులు దీపక్ సింగ్ గారు మొదట హనుమంతుడు ఎవరో ప్రభుత్వం తేల్చవ లసిన అవసరం ఉన్నదని సభా హక్కుల తీర్మానాన్ని లేవదీశారు. ఏతావాతా మనకి అర్థం అవుతున్న విషయం ఏమి టంటే– ఈ దేశంలో మత విశ్వాసాల ఉద్దీపనకిగానీ, తమ వర్గానికో, మతానికో ప్రాతినిధ్యం వహించే ముఖ్య లక్ష్యా నికిగానీ రామాయణంలో ‘హనుమంతుడి’ పాత్ర ఒక్కటే పెట్టుబడి కావటం– అదిన్నీ 210 సంవత్సరాలకు పైగా నిరూపణ అవుతున్నందుకు హిందువులు గర్వపడవచ్చు. ఈ ప్రతిపాదనలు చేసినవారు కేవలం పార్టీ సభ్యులు కారు. శాసనసభల్లో ప్రతినిధులు. సమాజానికి సేవ చెయ్యడానికి ప్రజల మద్దతుని కూడగట్టుకున్న రాజకీయ నాయకుల ‘వెర్రితలల’ విశృంఖలత్వానికి ఇది శిఖరాగ్రం. వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు -
హిందూమతం–హిందుత్వం
తాటిచెట్టుకీ తాతపిలకకీ ముడివేసినట్టు– ఈ దేశంలో ప్రతీవ్యక్తీ హిందూమతాన్నీ, హిందుత్వాన్నీ కలిపి రాజకీయ ప్రయోజనానికి వాడటం రోజూ పేపరు తెరిస్తే కనిపించే అసంబద్ధత. రెండింటికీ ఆకాశానికీ భూమికీ ఉన్నంత దూరం ఉంది. అయితే దగ్గర బంధుత్వమూ ఉంది. స్థూలంగా చెప్పాలంటే హిందుత్వం సిమెంట్. హిందూమతం కట్టడం. కట్టడం దేవాలయమా? పాఠశాలా? మరొకటా మరొకటా– మనిష్టం. దేవాలయాన్ని సిమెంట్ అనం. ‘ఆ పెద్ద సిమెంట్ ఉన్నదే!’ అని పాఠశాలని చూపించం. సిమెంట్‌తో రూపుదిద్దుకున్నాక ‘అది పాఠశాల’. దానికి వేరే రూపు, ప్రయోజనం, ప్రత్యేకత, అస్తికత సమకూరింది. హిందుత్వం ఒక జాతి ప్రాథమిక విశ్వాసాలకు ప్రతీక. ఒక ‘ప్రత్యేకమైన’ ఆలోచనా వ్యవస్థకి రూపు. రామాయణం మతం, రాముడు మతానికి ప్రతీక. కానీ ‘సత్యం’, ధర్మం, పర స్త్రీని కన్నెత్తి చూడని నిష్ఠ– హిందుత్వం. భాగవతం మతం. శ్రీకృష్ణుడు మతానికి ప్రతీక. కానీ– చిలిపితనంతో జీవితాన్ని ప్రారంభించినా చివరలో జాతికి ఆచార్యత్వాన్ని సాధించడం హిందుత్వం. సావిత్రి సత్యవంతుల కథ మతం. కానీ ఓ స్త్రీ మూర్తి అచంచలమైన ఆత్మవిశ్వాసం హిందుత్వం. అందుకే అరవిందులకు మరో స్థాయిలో ‘సావిత్రి’ లొంగింది. అంటే– ఓ జాతి నమ్మిన విలువ– ఆ జాతికి ప్రతీక. ఆ విలువకు ఆయా కాలాలలో ఆయా ప్రవక్తలు– ఆయా కాలాలకు అనుగుణంగా ఇచ్చిన ‘రూపు’ మతం. వేంకటేశ్వరుడు మతం. కానీ వేంకటేశ్వరత్వం హిందుత్వం. మత సామరస్యానికి రామానుజులు అనే ప్రవక్త ‘తీర్చిన’ రూపు మతం. కారుణ్యం ఓ జాతి ప్రాథమిక విలువ. దానికి జీసస్ ప్రవక్త ఇచ్చిన అపూర్వమయిన ‘రూపు’ క్రైస్తవం. సర్వమానవ సౌభ్రాతృత్వం విలువ. దానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన ‘రూపు’ ఇస్లాం. ప్రాథమిక విలువల విస్తృతి ఆ జాతి‘త్వం’ని వికసింపజేస్తుంది. ఆ గుణం Plasticity ప్రపంచంలో అధికంగా ఉన్నది ‘హిందుత్వం’. అందుకనే శతాబ్దాలుగా ఎన్ని మతాలకయినా– అంటే ప్రాథమిక విలువలు పెట్టుబడులుగా, ఆయా ప్రవక్తలు రూపు దిద్దిన అపూర్వ ‘మతా’లకు స్వాగతం పలకగలిగింది. క్రైస్తవం కారుణ్యమా? ‘రండి. మాకు బుద్ధుడు ఉన్నాడు’. ఇస్లాం సర్వమానవ సౌభ్రాతృత్వమా? ‘రండి. మాకు ప్రహ్లాదుడున్నాడు’. అవన్నీ ఒక జాతిని ప్రభావితం చేసిన ఆయా ప్రవక్తలు తీర్చిన మహాద్భుత మేరుశృంగాలు. రామాయణంలో రాముడి పాత్రీకరణలో అభిప్రాయభేదం ఉన్నదా? ఉండవచ్చు. కానీ అది ‘హిందుత్వా’నికి అంటదు. ఏనాడయినా మనం తాజ్‌మహల్ సౌందర్యానికి మురిసిపోయాం. కానీ ‘అందులో వాడిన చెక్క సున్నం ఎంత బాగుందో!’ అనుకున్నామా? సత్యమును ఆచరించుము– హిందుత్వం. రాముడు సత్యమునే ఆచరించెను– మతం. Hindutva is a way of life. Religion is a way of choice. కాలగతి, మానవ స్వభావాల వికసనం, కొండొకచో పతనం, ఆనాటి సమాజ హితం, ఆ సమాజానికి మార్గదర్శకం కాగలిగిన ఓ ‘ప్రవక్త’ అపూర్వ సిద్ధాంత నిర్దేశన– మతం. దానికి కవులు, రచయితలు, ప్రవచనకారులు– సమాజ చైతన్యానికిగాను రూపుదిద్దిన ‘చిలవలు–పలవలు’ – మతం. మరొక్కసారి– రామమందిర పునర్నిర్మాణం హిందుత్వానికి పెట్టుబడి కాదు. రాముడిలోని ‘రామత్వం’ మాత్రమే హిందుత్వం. Hindutva is a definition. Religion is a denami- nation. గోడ కట్టడంలో ‘గోడ’ స్థాయిలో ఆర్కిటెక్టు అవసరం లేదు. కానీ ఆ గోడ పెట్టుబడిగా నిలిచే కట్టడానికి ఆర్కిటెక్టు అవసరం. కాలగతిలో మన జీవన విధానాన్ని వైభవోపేతం చేసిన ఎందరో ఆర్కిటెక్టులు. శంకరాచార్య, రామానుజాచార్య, మహమ్మద్, జీసస్, మహావీర్, గురునానక్, వీరు ఈ ‘త్వం’కి కాలానుగుణంగా, సమాజానుగుణంగా అద్భుతమైన శిల్పాలను నిర్మించిన కారణజన్ములు. మరొక్కసారి– రామాయణం మతం. రామత్వం హిందుత్వం. దీనికి వాల్మీకి దిద్దిన రూపు రామాయణం. మరికొన్ని వందలమంది దిద్దిన రూపు మతం. రామారావులూ, రామనాథాలు, రామ్సింగులూ, రామశాస్త్రులూ, రామ్ యాదవ్‌లూ– అందరూ ఈ మతాన్ని నెత్తిన పెట్టుకున్నవారు. విలువ శాశ్వతం. అది హిందుత్వం. విలువకు ఆ జాతి దిద్దుకున్న ‘రూపం’ మతం. కొండొకచో మతానికి కాలదోషం పట్టవచ్చు. రూపం మారవచ్చు. అన్వయం మారవచ్చు. కానీ ‘త్వం’ మారదు. ఒక్కమాటలో చెప్పాలంటే సూర్యరశ్మి హిందుత్వం. ఆ రశ్మిలో వికసించిన పుష్పం మతం. గొల్లపూడి మారుతీరావు -
కన్నీటి విలువెంత?
ఇవాళ పేపరు తెరవగానే ఒక ఫొటో నా దృష్టిని నిలిపేసింది. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ గ్రామంలో పాకిస్తాన్ దుండగులతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి సహచరుడు సోమవారం చెక్ అష్ముజీ అనే గ్రామంలో ఉంటున్న 75 సంవత్సరాలు పైబడిన ఆ మిత్రుడి తండ్రి దగ్గరికి వచ్చాడు. తన కళ్లముందే కన్నుమూసిన మిత్రుడి మరణాన్ని గురించి చెప్పాడు. దుఃఖంతో నీరుకారిపోయిన ఆ వృద్ధుడిని పొదివి పట్టుకున్న చిత్రమది. ఇది మానవత్వానికి ఆవలి గట్టు. దేశానికి సేవ చేస్తూ ప్రాణాలర్పించిన ‘నిశ్శబ్ద’ దేశభక్తుడు కొడుకు. ఆ వృద్ధుడి శరీరంలో ప్రతీ అణువూ కించిత్తు ‘గర్వం’తో పులకించి ఉంటుంది. ఈ కథని చాలామంది విని ఉండవచ్చు. కానీ మరోసారి వింటే తప్పులేదు. యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతున్న ఇద్దరు మిత్రులు– రాముడు, రంగడు. రంగడు గాయపడ్డాడు. శత్రు స్థావరంలో ఉండిపోయాడు. రాముడు సాహసం చేసి ముందుకు వెళ్లి ప్రాణాలతో ఉన్న రంగడిని వెనక్కు తెచ్చాడు. తెస్తూండగా తాను గాయపడ్డాడు. రంగడి చేతుల్లో ప్రాణాలు వదులుతూ ‘తన మరణాన్ని స్వయంగా తన తల్లిదండ్రులకు తెలియజెయ్యమ’ని కోరి కన్నుమూశాడు. రంగడికి భయంకరమైన దుఃఖమది. తనని రక్షించి తన మిత్రుడు కన్నుమూశాడు. అతని ఇంటికి వెళ్లడానికి ధైర్యం చాలలేదు. కొన్నాళ్లకి సాహసం చేశాడు– మిత్రుడికిచ్చిన మాట కోసం. తల్లిదండ్రులు వృద్ధులు. ముట్టుకుంటే కూలి పోయేటట్టు ఉన్నారు. ఇతడిని హార్దికంగా ఆహ్వానించారు. తల్లి ఆప్యాయంగా వండిపెట్టింది. వారి ఆదరణ చూసి నోరిప్పి కొడుకు మరణాన్ని తెలియజేయలేకపోయాడు. ఒక రోజు కాదు– పది రోజులు. చివరికి నిస్సహాయంగా తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డాడు. ముసలివాళ్లు గుమ్మందాకా వచ్చారు. తన మిత్రుడికిచ్చిన మాట! చెప్పలేక చెప్పలేక వారి కొడుకు మరణాన్ని వెల్లడించాడు. తల్లిదండ్రులు ఓ క్షణం నిశ్శబ్దమయిపోయారు. తల్లి ఈ రంగడి బుగ్గలు నిమిరి ‘మాకు తెలుసు బాబూ. సమాచారం అందింది. కానీ ఈ పది రోజులూ ఆ విషయం గురించి కదిపి నిన్ను బాధపెడతామని ఎత్తలేదు’ అన్నది. ఈ మధ్య రాజీవ్‌గాంధీ హత్యకు కారణమయినవారిని విడుదల చేయాలని.. ‘మానవీయమైన’ ఉదాత్తతని చూపే కొందరు మహానుభావులు వాపోతున్నారు. మంచిదే. కానీ తాము చేయని నేరానికి ఆయనతోపాటు ప్రాణాలు పోగొట్టుకున్న 15 మంది అజ్ఞాత వ్యక్తుల దయనీయమైన కథనాలు వీరికి తెలియవేమో. రెండు నమూనాలు. 1991 మే 21. ధర్మన్ అతని పేరు. కాంచీపురంలో స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్. ఆయన పిల్లలు ఆ రాత్రి రెడ్ హిల్స్‌లో ఓ బంధువు ఇంట్లో సరదాగా వేసవి శెలవులు గడుపుతున్నారు. ఒక పోలీసు అర్ధరాత్రి వచ్చి– ఓ మారణకాండలో మీ నాన్న చనిపోయాడని చెప్పారు. అప్పుడు కొడుకు ఎనిమిదో క్లాసు చదువుతున్నాడు. చెల్లెలికి పదేళ్లు. మరో తమ్ముడికి 5. భార్యకి 23 ఏళ్లు. ఈ కొడుకు రాజశేఖరన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ట్యాక్సీ నడుపుకుంటున్నాడు. మరొక్క కథ. ఆమె పేరు సంతానీ బేగం. కాంగ్రెస్ మహిళా కార్యకర్త. ఈవిడ మారణహోమంలో చచ్చిపోయింది. అప్పుడు ఈవిడ కొడుకు రెండో క్లాసు చదువుతున్నాడు. తండ్రి చిన్నప్పుడే పోయాడు. వీళ్లన్నయ్య ఈ సభకి వెళ్లొద్దన్నాడు. ‘మా నాయకుడు. వెళ్లకపోతే ఎలా?’ అని తల్లి వెళ్లింది. కుర్రాడు అబ్బాస్ మాటలు: ‘మా అమ్మ పోయాక మేం వీధిన పడ్డాం. సంవత్సరాల తర్వాత నేను రాజీవ్‌గాంధీ కుటుంబానికి ఉత్తరం రాశాను. ఏమీకాలేదు’. ఇప్పుడు ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడు? సెల్ఫోన్ల సామాన్లు అమ్ముకుంటున్నాడు. ఇలాంటివి ఇంకా 13 కథలున్నాయి. రాజకీయాల్లోకి రావడం మనస్కరించని 46 ఏళ్ల కుర్రాడిని–రాజీవ్‌గాంధీని– ఆనాడు నెహ్రూ కుటుం బం అయిన కారణానికి ప్రధానిని చేశారు. ఫలితం– ఒక అనర్థం. తర్వాత వారి సతీమణి అయిన కారణానికి ఒకావిడని అందలం ఎక్కించారు. ఆవిడ 58 వేల కోట్ల కుంభకోణాలతో, ఓటరు అసహ్యించుకోగా బయటికి నడిచారు. ఇప్పుడు బొత్తిగా బొడ్డూడని ఓ కుర్రాడు– కేవలం నెహ్రూ కుటుంబం అయిన కారణానికి ఆ పార్టీని వెలగబెడుతున్నాడు. జమ్మూకశ్మీర్‌లో 75 ఏళ్ల వృద్ధుడి గర్భశోకం, ఆనాటి 12 ఏళ్ల కుర్రాడు పితృశోకం ఈ దేశపు వైభవానికి అజ్ఞాతమైన పెట్టుబడులు. కన్నీటిలో గాంభీర్యం ప్రపంచాన్ని జయిస్తుంది. వ్యక్తుల్ని వ్యవస్థలుగా మలిచి ఆకాశాన్ని నిలుపుతుంది. ఉదాత్తతకి దుఃఖం అనుపానం. వీరి స్థానం పత్రికల్లో మారుమూల కావచ్చు. కానీ ఏభై అంతస్థుల భవనంలో పునాదిలోని సిమెంట్ రాయికీ తనదైన పాత్ర ఉంది. గొల్లపూడి మారుతీరావు -
పేరు జబ్బు
తెలుగునాట తరచుగా విని పించే మాట ఒకటుంది: ‘ఆ పనిని నేను సాధించలేక పోతే నా పేరు మార్చు కుంటాను’ అని. ఇది నిజంగా పేరున్నవాడికి చెల్లే మాట. పేరు మార్చుకో వడం నామోషీ, చిన్నతనం. ఓటమి. పరువు తక్కువ– అని నానుడి. మరొక్కరే ‘పేరు’తో కసరత్తు చేయగలరు– రాజకీయ నాయకులు. ‘మమ్మల్ని పదవిలో నిల పండి. పేరు మార్చకపోతే...’ ఇది రాజకీయం. వాళ్ల పేర్లు ఎలాగూ వచ్చే ఎన్నికలదాకా నిలవవు కనుక. ఇప్పుడు పదవిలో ఉన్న ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి ఒకాయన ఎడాపెడా పేర్లు మార్చే స్తున్నారు. ఆయన చెప్పే కారణం– అలనాడు మొగ లాయీ పాలకులు, ముస్లిం పాలకులు వాళ్లకి లాయకీ అయిన పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం మనకి ఇష్టమయిన పేర్లు పెట్టుకుంటున్నాం– అని. మొదట గురుగాం మీద పడ్డారు. అది ‘గురుగ్రామం’ అయింది. ఇంతకీ ఈ గురువు ఎవరు? ద్రోణాచా ర్యులట! 62 సంవత్సరాల కిందట ‘వారణాశి’ అయినా ఇంకా ‘బెనారస్’ అనేవారూ, ‘కాశీ’ అనే వారూ ఉన్నారు. అలనాడు మేడమ్ మాయావతిగారు వారి హయాంలో కాన్షీరామ్ నగర్. మహామాయా నగర్ వెలిశాయి. మొగల్సరాయ్ని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ నగర్ చేశారు. ఇప్పుడు వరసపెట్టి ఆగ్రాని ‘ఆగ్రా వన్’గా, ముజాఫర్ నగర్‌ని ‘లక్ష్మీనగర్’గా, సిమ్లాని ‘శ్యామల’గా, అహమ్మదాబాద్‌ని ‘కర్ణావతి’గా, ఔరం గాబాద్ని ‘శంభాజీ నగర్’గా మార్చేస్తున్నారు. ఈ లెక్కన ఫైజాబాద్ ‘అయోధ్య’ అవుతుందట. బిజ్నోర్ మహాత్మా విదుర్ నగర్ అవుతుందట. ఈ మధ్య పేపర్లలో ఈ పేర్ల మార్పు గురించి కోకొల్లలుగా వ్యాసాలు వచ్చాయి. ఇలాంటి మార్పులు ఈ దేశం మీద ‘హిందూమతం’ పులమడమేనని చాలామంది వాపోయారు. దానికి వారందరూ వారి వారి కార ణాలు చెప్పారు. వారి మతాతీత దృక్పథానికి జోహార్లు. అయితే నాకు అర్థం కాని విషయం ఒకటుంది. గత 60 సంవత్సరాల పైచిలుకు– మన అభిమాన కాంగ్రెస్ పార్టీ పదవిలో ఉండగా కేవలం 450 సంస్థలకు మాత్రమే మన ‘అభిమాన’ కుటుంబం– నెహ్రూ కుటుంబం– వారి పేర్లను పెట్టారు. ఇందులో 12 కేంద్ర, రాష్ట్ర పథకాలు, 28 క్రీడా టోర్నమెంట్లు, 19 స్టేడియంలూ, 5 ఎయిర్‌పోర్టులూ, పోర్టులూ, 98 విద్యా సంస్థలు, 51 అవార్డులూ, 15 ఫెలోషిప్‌లూ, 15 జంతు పరిరక్షణ శాలలూ, 39 ఆసుపత్రులూ, వైద్య సంస్థలూ, పరిశోధనా సంస్థలూ, 37 ఇతర రకాల సంస్థలూ, విశ్వవిద్యాలయాలలో పరిశోధనా పీఠాలూ, ఉత్సవాలూ, 74 రోడ్లూ, భవంతులూ ఉన్నాయి. మన అదృష్టం బాగుండి కొద్దిలో తప్పిపోయిం దిగానీ అచిర కాలంలో మనకి ‘మౌరీన్ నగర్’ ‘మౌరీన్ శిశు సంక్షేమ కేంద్రం’ వెలిసేది. ఏమంటారు? మౌరీన్ ఎవరా? తమరికి కారాగార శిక్ష విధించాలి. మేడమ్ మౌరీన్ సోనియా గాంధీగారికి స్వయానా వియ్యపు రాలు. రాబర్ట్ వాద్రాకి జన్మ నిచ్చిన తల్లి. ప్రియతమ ప్రియాంకా గాంధీ అత్తగారు. మరి నాటి నుంచి మేధావులు, రాజకీయ విశ్లేష కులూ నోరెత్తలేదేం? నెహ్రూ కుటుంబం మీద భక్తా Perhaps they have the sycophancy of giv- ing in to the vageries of one family to the collective ethos of one political thinking. ఈ దేశంలో చెలరేగిన విమర్శల్లో పాక్షికమైన ‘అస హిష్ణుత’ ‘ఆత్మవంచన’ 'Intellectual hypocra- cy' స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో ‘తైతక్కలు’ ఇంకా హాస్యా స్పదం. బోగ్ రోడ్‌కి పద్మభూషణ్ బి.ఎన్.రెడ్డిగారి పేరు పెట్టారు. భేష్! ఆ మధ్య రోడ్ల పేర్లలో కులాల ప్రసక్తి రాకూడదని ఓ ద్రవిడ నాయకుడు భావిం చినట్టుంది. కనుక ‘డాక్టర్ బి.ఎన్.రెడ్డి వీధి’ కేవలం ‘డాక్టర్ బీఎన్ వీధి’ అయింది. ఈ కత్తిరింపులో తలలేదని ఎవరో ముక్కుమీద వేలేసుకుని ఉంటారు. కనుక ‘బీఎన్ వీధి’ ఏకంగా ‘నరసింహన్ వీధి’ అయింది. ఎవరీ నరసింహన్. ఇది ఎవరిని గౌరవిం చడానికి. ఈ లెక్కన ‘మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ’ పేరు కేవలం ‘కరమ్‌చంద్’ అయి కూచుం టుంది కదా? మరి ఇప్పుడే అన్నాశాలై పక్కనే ‘ముత్తు రామలింగ తేవర్ నగర్’ ఉన్నదే. ‘తేవర్’ వర్గం నోరు పెద్దదా? టీనగర్లో వ్యాసారావు స్ట్రీట్ ఉండేది. అది న్యాయంగా ‘వ్యాసా స్ట్రీట్’ కావాలి కదా? కానీ ‘వ్యాసార్ స్ట్రీట్’ అయింది. ‘వ్యాసార్’ ఎవరు? అజ్ఞానానికి పరాకాష్ట. బోర్డుమీద ‘వియా సార్ స్ట్రీట్’ అని రాశారు. మరో టర్మ్ ఉంటే రాయ పేట ‘ఎడ్డిపాడి పేట’ అయితే ఆశ్చర్యం లేదు... ఏమి ఈ సంకరం? మహానుభావుల స్మరణకి కావలసింది ఊరి పేర్లుకావు. నిశ్శబ్దంగా వెలుగునిచ్చే ఆల్వా ఎడిసన్, లూయీ పాశ్చర్, భారతీయ సంస్కృతికి ప్రాణం పోసిన ఆదిశంకరులు, కరుణకి శాశ్వతత్వాన్ని కల్పిం చిన జీసస్ వీరి పేర వీధులు, సందులూ, గొందులూ అక్కరలేదు. మహానుభావుల చిరంజీవత్వానికి లౌకి కమయిన గుర్తులు ఆయా పార్టీల ‘ప్రాథమిక’ స్థాయిని తెలుపుతాయి. మహానుభావుడు జీవించేది సైనుబోర్డుల్లో కాదు. జాతి జీవన సరళిని ఉద్బుద్ధం చేయడంలో. -గొల్లపూడి మారుతీరావు -
‘నేను కూడా..’ ఉద్యమం
సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాథ మికం. సాధారణంగా పాశ వికం. సెక్స్ ప్రాథమిక శక్తి. మళ్లీ పాశవికం. కొలం బియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మార్గరెట్ మీడ్ అనే ఆవిడ దక్షిణాఫ్రికాలో ఆటవిక నీగ్రో జాతుల లైంగిక ఆచారాల గురించి ఒక పుస్తకం రాసింది. అతి ప్రాథమికమైన, అనూహ్యమైన పద్ధతులవి. నా వాక్యాలకు కూడా లొంగవు. మన వివాహ వ్యవస్థ ప్రాథమిక వికారానికి సంస్కారపు టంకం. వెంకయ్యకి సీతమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఆ ఘట్టానికి బంధువులెందుకు? ఊరి పెద్ద లెందుకు? వాళ్లిద్దరి ఊరేగింపు ఎందుకు? అది ఆనాటి సంప్రదాయ పరిపక్వతకి నిదర్శనం. ఓ అబ్బాయీ అమ్మాయీ భార్యాభర్తలయితే చాలదు. వారి కట్టుబాటు సమాజానికి తెలియాలి. సీతమ్మ ఎక్కడ తారసపడినా ఆవిడ ఫలానా వెంకయ్య భార్య అనే గౌరవానికి నోచుకోవాలి. సమాజానికంతటికీ తెలియాలి. ఫలానా ఇంటి కోడలని తెలియాలి. ఇవన్నీ– ప్రాథమిక ‘పాశవిక’ ప్రవృత్తికి సమాజం ఏర్పరచిన ఎల్లలు. ఆనాటి సంప్రదాయం– వివా హం పేరిట సమాజానికి నిర్దేశించిన, మహిళ రక్షణకి ఉద్దేశించిన కట్టుబాటు. ఇప్పటి పెళ్లిళ్లకి సాక్ష్యాలు అక్కర్లేదు. ఊరేగిం పులు లేవు. అవసరం లేదు. ‘హేతువు’ సంస్కా రాన్ని అటకెక్కించిన కాలమిది. ఇప్పుడిప్పుడు– ఏకాంతంగానో, ఒంటరిగానో, పెళ్లిళ్లు అక్కర లేకుం డానో కలిసి బతికే ‘లాజిక్’ చోటు చేసుకుంది. న్యాయంగా ఇది సంస్కారానికి ఆవలి గట్టు కావాలి. కాలేదు. కాగా, దశాబ్దాలుగా స్త్రీ పురుషాధిక్యతకో, అతని ప్రాథమిక శక్తి పైత్యానికో గురి అవుతోంది. నేడు మహిళ ఆకాశానికి ఎగురుతోంది. దేశాల్ని పాలి స్తోంది. బ్యాంకుల్ని నిర్వహిస్తోంది. ఇదొక పార్శ్వం. భర్తకి ఇంత వండిపెట్టి, బిడ్డల్ని స్కూళ్లకి సాగనంపి, తానూ ఉద్యోగానికి బయలుదేరుతోంది. అయితే స్త్రీ ఉద్యోగం చేసే పరిస్థితులు, దగ్గరితనం, చొరవ, ఏకాంతం, సహజీవనం, వెసులుబాటు– ఇవన్నీ పురుషులచేత వెర్రితలలు వేయిస్తున్నాయి. అకాలీ ఉద్యమంలో దౌర్జన్యకారుల ఆట కట్టించి చరిత్రని సృష్టించిన ‘సింహస్వప్నం’ కేపీఎస్ గిల్ 1988లో ఒకానొక పార్టీలో మద్యాన్ని సేవించి– చెలియలికట్టని దాటాడు. ఐఏఎస్ ఆఫీసర్ రూపన్ దేవల్ బజాజ్ పిర్రమీద కొట్టాడు. 18 సంవత్సరాలు కేసు నడిచింది. గిల్ నేరస్తుడని సుప్రీంకోర్టు సమర్థిం చింది. రాజకీయ రంగంలో అవినీతిని ఎండగట్టిన ‘తెహల్కా’ పత్రిక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్ 2013లో తన సహోద్యోగి మీద చొరవ చేశాడు. దేశం ఆ దృశ్యాన్ని చూసింది. కేసు నడుస్తోంది. ఇప్పుడిప్పుడు మహిళ ధైర్యంగా గొంతు విప్పు తోంది. మొట్టమొదట హాలీవుడ్ ప్రముఖుడు హార్వీ ఐన్‌స్టీన్ శృంగార లీలలు వీధికెక్కాయి. మహిళల వెన్నులో ధైర్యం వచ్చింది. తమకు జరిగిన అప ఖ్యాతిని బయటపెట్టడానికి జంకనక్కర లేదని గ్రహించారు. ఎందరో పెద్దల గోత్రాలు రోడ్డున పడు తున్నాయి. ప్రఖ్యాత గాయని చిన్మయి– పద్మశ్రీ వైర ముత్తు చాపల్యాన్ని బట్టబయలు చేసింది. మహా నటుడు నానా పటేకర్ తనుశ్రీ దత్తా అనే నటీమ ణితో లైంగికమైన చొరవ తీసుకున్నారట. ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనని ముద్దు పెట్టుకున్నా డని ఒక నటీమణి చెప్పింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎమ్జే అక్బర్‌గారి లీలలు ప్రియా రమణి అనే మహిళ బయట పెట్టింది. నిర్మాత సాజిద్ ఖాన్ వేధింపులు బయటపడ్డాయి. ఆయన తను దర్శ కత్వం వహిస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా నుంచి తొలగాడు. నేరస్తుల్ని శిక్షిస్తే తప్ప నేను నటించన న్నారు హీరో అక్షయ్ కుమార్. సమాజంలో అపఖ్యాతికో, కుటుంబంలో కల్లో లానికో, ఉపాధి చెడిపోయే ప్రమాదానికో– అవమా నాన్ని భరించి, కన్నీరు దాచుకుని నోరు కట్టుకున్న మహిళలు ఇప్పుడిప్పుడు నోరు విప్పుతున్నారు. ఏమైనా సమాజ సంస్కారాన్ని అటకెక్కించి, మారిన వ్యవస్థలో ‘వ్యక్తి సంస్కారాన్ని’ నమ్ముకోవలసిన రోజులొచ్చాయి. ఉద్యోగ కార్యాలయాలలో స్థిరమైన సామీప్యం, సహచర్యం, తప్పనిసరైన ఏకాంతం, సమాజంలో నిలదొక్కుకున్న ‘మగ పుంగవుల’ పర పతి కొంత సాహసాన్ని ఇస్తుంది. అయితే ఈ కథల్లో నిజమైన అవినీతి పాలెంత? కొందరి ‘అక్కసు’ మాత్రమే ఉన్నదా? వీధినపడ్డ మహానుభావులు– ‘వీర నిజాయితీ’ పరులుగా బోర విరుచుకోవడం ఎంత నిజం? ప్రతీ కథకీ 18 ఏళ్ల కోర్టు కేసులు కావాలా? ఇదీ తేలాల్సిన విషయం. ఈనాడు సీతమ్మకి పెళ్లి ఊరేగింపు లేకపో వచ్చు. కానీ వ్యక్తి అవినీతిని ‘ఊరేగించే’ మాధ్యమం మరింత పదునైంది. ఆ ఊరేగింపు విజ్ఞప్తి. ఈ ఊరే గింపు హెచ్చరిక. ఆనాటి సంప్రదాయం ఊతం. నియతి. ఈనాడు– మారిన వ్యవస్థలో అది చాలదు. ‘పరపతి’ అనే ముసుగును ఛేదించే ‘మాధ్యమం’ అనే ఆయుధం, దాని గొంతును గుర్తించి, కొరడా ఝళిపించే వ్యవస్థ కావాలి. నేటి ‘‘నేను కూడా...’’ ఉద్యమం కాదు. ఉప్పెన. గొల్లపూడి మారుతీరావు -
కింగ్ మేకర్
తన వ్యక్తిత్వంతో– చిత్తశు ద్ధితో, నిరంతర కృషితో, నిజాయితీతో– ఎన్ని సోపా నాలను అధిగమించవ చ్చునో–తను జీవించి నిరూ పించిన యోధుడు చలన చిత్ర నిర్మాత కె. రాఘవ. ఆయన ఎక్కడ పుట్టాడో తెలీదు. ఎక్కడ పెరిగాడో అంతగా తెలీదు. తమిళుడు. చిన్నతనం నుంచీ సినీరంగంలోనే ఉంటూ బీఆర్ పంతులు, మీర్జాపురం రాజాగారి కంపెనీలలో ఆఫీసు బోయ్, ప్రొడక్షన్ మేనేజరు, అటెండర్, ఎక్స్ట్రా స్టంటు విభాగంలో పనులు చేసి– కాలు పెట్టిన ప్రతీచోటా తనదైన ప్రత్యేకతను నిలుపుకుని– నిర్మాత అయి– తెలుగు చలన చిత్ర రంగంలో ఎవరూ చెయ్యలేని, చెయ్యని సాహసాలను అధిగమించిన కార్యదక్షుడు రాఘవ. నాకు ఆయన 1968 నుంచీ తెలుసు. అప్పుడు విజయవాడ రేడియోలో పని చేస్తున్నాను. ‘జగత్ కిలాడీలు’ రిలీజుకి వచ్చి వెల్కం హోటల్లో ఉన్నారు ఆయన, ఆయన పార్టనర్ ఏకామ్రే శ్వరరావుగారు. జగత్ కిలాడీలు పెద్ద హిట్. అది ఇంగ్లిష్ నవల Crimson Circle స్ఫూర్తి. మధ్య మధ్య ఆయన్ని చూస్తున్నా– నా అవ తారాలు మారి సినిమా రచన చేయడం ఆయనకి తెలుసు. 1981లో నాకాలూ చెయ్యీ విరిగి రాయ పేట ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఓ సినిమా రచనకు ఏకామ్రేశ్వరరావుగారి ద్వారా కబురు పంపారు. పారి తోషికం ఎంత? 4 వేలు! ఆరునెలలు మంచానికి పరి మితమైన స్థితి. ఒప్పుకున్నాను. అప్పుడే కోడి రామ కృష్ణ పరిచయం. రాఘవ బొత్తిగా చదువుకోలేదు. కానీ ఏ చదువూ ఇవ్వని అరుదైన instinct ఆయన సొత్తు. ఒక ఇతివృత్తం మంచి చెడ్డలను బేరీజు వేసు కోవడం ఒక ఎత్తు అయితే ఒక కళాకారుడు, దర్శకుని ప్రతిభను– ఏ నేపథ్యం లేకుండా గుర్తుపట్టి– వారికి కూడా చాలని విశ్వాసాన్ని వారిపట్ల పెంచుకునే వేది కను కల్పించడం ఆయన చరిత్ర. బాగా చదువుకుని, మాధ్యమాన్ని ఆకళించుకున్న మాలాంటి వారినే నిర్ఘాంతపోయేటట్టు చెయ్యగల ఆత్మవిశ్వాసం ఆయన పెట్టుబడి. సినిమా షూటింగు మధ్యలో నేను జారిపోతున్నా– రాఘవ నవ్వి ‘మీరు సినిమా రంగంలో నలుగురిని కొట్టేస్తారు మారుతీరావు గారూ’ అనేవారు. నాకు సిగ్గుగా ఉండేది. లేకపోతే 42 సంవత్సరాల వయస్సున్న నన్ను, ఏనాడూ కెమెరా ముందు నిలబడని నన్ను, పొరపా టునయినా నటన గురించి ఆలోచించని నన్ను– ఓ సినిమా టైటిల్ పాత్రకి– 5 పాటలూ, దాదాపు 40 సీన్లూ ఉన్న పాత్రకి ఎంపిక చేసి, పట్టుబట్టి నాచేత వేయించడం రాఘవగారికే చెల్లును. అది ఆయన నిర్దుష్టమైన conviction, ఒక మూర్ఖపు పట్టుదలకీ నిదర్శనం. పైగా దర్శకుడు కోడికి అది మొదటి చిత్రం. అయితే అప్పటికే ‘తాత–మనుమడు’ అనే హిట్ ద్వారా దాసరిని పరిచయం చేసిన ఘనత ఆయనది. గేయ రచయిత రాజశ్రీని ఒక చిత్రం ద్వారా దర్శకుని చేసిన గుండె ధైర్యం ఆయనది. రావుగోపాలరావు, మాధవి వంటి నటీనటులను తెరకు పరిచయం చేసిన ‘దమ్ము’ ఆయనది. చాలా ఇబ్బందిగా, సగం మనస్సుతోనే పాలకొల్లు చేరాను. తన నిర్దుష్టమైన నిర్ణయంతో– నా రచనా వ్యాసం గాన్ని అటకెక్కించి, 38 సంవత్సరాల, 300 చిత్రాల నట జీవితానికి ఆరోజు నాందీ పలికారు. హ్యాట్సాఫ్. ఆయన తన నిర్ణయాలను ఏ మాత్రమూ సడ లించేవారు కాదు. ఓ గొప్ప ఉదాహరణ. నేను నటిం చిన ‘ఇంట్లో రామయ్య...’కి చాలా కట్స్ ఇచ్చారు సెన్సారువారు. కొన్ని మళ్లీ షూటింగు చేశాం. ఒక షాట్ పది పన్నెండుసార్లు రిహార్సల్స్ చేయిస్తున్నాడు కోడి. విసుక్కున్నాను. దగ్గరికి వచ్చి చెవిలో చెప్పాడు: ‘మన దగ్గర 20 అడుగుల నెగిటివే ఉంది గురు వుగారూ’ అని. 500 రోజులు పోయిన ఆ చిత్రంలో ఇప్పటికీ ఒక షాట్ అలికినట్టు (ఫాగ్‌తో) ఉంటుంది. రెండో చిత్రం ‘తరంగిణి’ విజయవంతమై–ఒక సంవ త్సరం నడిచింది. జీవితంలో– ముఖ్యంగా సినీ రంగంలో విజ యాన్ని వెంటపడి పట్టుకోవాలనే చాలామంది యావ. కానీ ఓ కొత్త దర్శకునికిచ్చే అవకాశానికి– 42 ఏళ్ల నటుడిని జతచేసి– భారతదేశంలో అన్ని భాష లలో ‘ఇంట్లో రామయ్య– వీధిలో కృష్ణయ్య’ చిత్రాన్ని ఆమోద యోగ్యం చేసిన ఘనుడు రాఘవ. ఆనాడు నా ‘సందేహాలను’ ఖాతరు చెయ్యక, విముఖత నుంచి నన్ను బయటికి లాగి మరో రంగానికి రాఘవ మళ్లించకపోతే– నా జీవితం వేరుగా ఉండేది. ఆ మాటకి వస్తే చాలామంది జీవితాలు మరోలా ఉండేవి. ఆనాడు రాఘవ లేకపోతే ఇప్పటి నా జీవితం ఇలా ఉండేది కాదు. మంచి నిర్మాత విజయవంతమైన సినిమా తీస్తాడు. అభిరుచిగల నిర్మాత పదికాలాలపాటు నిలిచే చిత్రాన్ని నిర్మిస్తాడు. దమ్ము ఉన్న నిర్మాత మాధ్యమానికి కొత్త పుంతల్ని వేసి– కొత్తదనానికి ఊపిరి పోస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ ఎందరో నిర్మాతలను దాటి వచ్చింది. కానీ ఎందరి జీవితా లనో మలుపు తిప్పగల ‘కొత్త’దనాన్ని పరిశ్రమకు పంచిన అరుదైన నిర్మాత రాఘవ. గొల్లపూడి మారుతీరావు -
ముప్పై ఏళ్ల వెలుగు
గొల్లపూడి మారుతీరావు రచించిన కథ ఆధారంగా ఎం.వి. రఘు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కళ్లు’. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరివెన్నెల’ చిత్రానికి ఎం.వి.రఘు ఛాయాగ్రాహకుడిగా, సీతారామశాస్త్రి గీతరచయితగా పనిచేశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రితో ఎం. వి. రఘు స్నేహం పల్లవించి, సౌరభాలు వెదజల్లింది. ‘కళ్లు’ నాటకాన్ని చిత్రంగా మలచాలనుకున్న ఆలోచన మనసులో మెదలగానే, ఆ చిత్రంలో పాటలను సీతారామశాస్త్రి చేత రాయించాలనుకున్నారు రఘు. ఆగస్టు 12కు ‘కళ్లు’ సినిమా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్రంలో సీతారామశాస్త్రి రచించి, గానం చేసిన ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో’ పాటకు సంబంధించిన అంశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు చిత్ర దర్శకుడు ఎం.వి. రఘు. ఒక కన్ను ఎస్.డి. బర్మన్ ‘‘కాలేజీలో చదువుకునే రోజుల్లో హిందీ చలన చిత్ర సంగీత దర్శకుడు ఎస్. డి.బర్మన్ పాటలు వింటుండేవాడిని. ఆయన చేసిన పాటలలో ఆయనే స్వయంగా పాడిన పాటలలో ఏదో ఒక అనుభూతి కలిగేది నాకు. ఇటువంటి పాటలను ఫిలసాఫికల్‌గా, మనసు పెట్టి వినాలి, అనుభూతి చెందాలి. అదే అనుభవం సీతారామశాస్త్రి అప్పుడప్పుడు వాడుకలో ఉన్న పల్లెపదాలను బల్ల మీద డప్పులా వాయిస్తూ పాడుతున్నప్పుడు కలిగేది. ఆయన పాట పాడే విధానంలో వినిపించిన వేదాంతం, నా మనసులో చిత్తరువులా నిలిచిపోయింది. ఇంకో కన్ను సీతారామశాస్త్రి ‘కళ్లు’ చిత్రం తీయాలనుకున్నప్పుడు, అటువంటి పాటను రాయించి, పాడించాలని మనసులో అనుకున్నాను. ఈ చిత్రానికి ఎస్.పి. బాలు సంగీతం సమకూర్చారు. ఈ పాటను సీతారామశాస్త్రితో పాడించాలనుకుంటున్న నా ఆలోచనను బాలుతో చెప్పగానే, తన మనసులో మాట కూడా అదేనని ఆయన అనడంతో ఆ పాటను సీతారామశాస్త్రితో పాడించాం. ఈ పాట ఉద్దేశం.. ‘కళ్లు వచ్చిన తరవాత కళ్లతో కాకుండా మనసుతో చూడండి’ అని ఒక వేదాంతం చెప్పడం. ‘తెల్లారింది లెగండోయ్ కొక్కొరోకో.. మంచాలింక దిగండోయ్ కొక్కొరోకో.. ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట సెట్టు ఇడిచింది.. మూసుకున్న రెప్పలిడిసి సూపులెగరనీయండి..’ అంటూ సాగుతుంది ఈ పాట. కళ్ల నిండా జ్ఞాపకాల తడి ఈ చిత్రం షూటింగ్ 1988 జనవరి ఎనిమిదో తేదీన విశాఖపట్టణంలో పూర్తయింది. యూనిట్లో అందరినీ వెనక్కి పంపడానికి చేతిలో ఒక్క పైసా లేదు. మేం దిగిన హోటల్ యజమానితో అప్పటికే స్నేహం ఏర్పడింది. ఆయన దగ్గరకు వెళ్లి, ‘మా దగ్గర ఉన్న ఈ సామాను మీ దగ్గర ఉంచుకుని, పది వేలు ఇవ్వండి’ అని అడిగి తీసుకుని, అందరినీ రైలు ఎక్కించాను. నాటి సంఘటన నేటికీ నా మనసులో ఇంకా తడి జ్ఞాపకంగానే ఉంది. నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ఆ రోజున అత్తారింటికి కూతురిని పంపిస్తున్న తండ్రిలా నేను ఏడుస్తుంటే, తండ్రిని విడిచి వెళ్తున్న పిల్లల్లా వారంతా బాధపడ్డారు. కంటికి కనిపించిన పాట అందరూ వెళ్లాక... నేను, నా కెమెరా, సత్యానంద్, నా కో–డైరెక్టర్‌గా పనిచేసిన ఇవివి సత్యనారాయణ మిగిలాం. మేమంతా ఒక వ్యానులో బయలుదేరి, దారిలో చిన్న కుక్కపిల్ల, గట్ల వెంట ఆడపిల్లలు, గోతులలో లీకైన కుళాయిలు... ఇలా దైనందిన జీవితాన్ని ప్రతిబింబించేలా కనపడినవన్నీ నా కెమెరాతో బంధించాను. దారిలో పనిచేస్తున్న కార్మికులను చూడగానే ‘చెమట బొట్టు సమురుగా సూరీణ్ని ఎలిగిద్దాం / వెలుగు చెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం’ అనే వాక్యానికి తగిన సన్నివేశం కనిపించిందని సంతోషపడ్డాను. ఆ వాక్యాలకు అనుకూలంగా అక్కడ పనిచేస్తున్న పనివారూ, ఆ సంధ్య ఎరుపు.. నూనె చారలాగ వచ్చింది. కంటిని నడిపించిన పాట మద్రాసులో ఉండే అనిల్ మల్నాడ్తో ఎడిటింగ్ చేయించేవరకు అసలు సినిమాలో ఏ సన్నివేశాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. సినిమా పూర్తయ్యాక థియేటర్లలో విడుదలైంది. సినిమాకు పెద్దగా ప్రేక్షక ఆదరణ రాలేదు. అదేం చిత్రమో కాని, ఈ పాట ప్రారంభం కాగానే, ఆపరేటర్ సహా బయట ఉన్నవారంతా లోపలకు వచ్చేవారు. థియేటర్ ఫుల్ అయిపోయేది. పాట అయిపోగానే క్లాప్స్ కొట్టి వెళ్లిపోయేవారు. ఇంతకాలం తర్వాత ఇటీవల ఈ పాటను యూ ట్యూబ్‌లో పెట్టాలనిపించింది. అలా పెట్టిన వారానికే ఐదు లక్షల హిట్స్ దాటాయి. ఈ చిత్రం విడుదలయిన 30 సంవత్సరాల తరవాత మళ్లీ ఈ చిత్రం గురించి మాట్లాడుతున్నారు. ఈ చిత్రంలో నటించిన చిదంబరం ‘కళ్లు చిదంబరం’గా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితుడయ్యాడు. (‘కళ్లు’ చిత్రంలోని ఓ దృశ్యం) – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఎకాఎకీ - ముఖాముఖీ
నాకెప్పుడూ మన ఎన్నికలలో తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. ఆయా నాయకులు– ప్రత్యర్థులు– వేర్వేరు వేదికలమీద ఒకరినొకరిని విమర్శించుకుంటారుగానీ– చక్కగా అమెరికాలోలాగ– హిల్లరీ క్లింటన్, ట్రంప్ దొరగారిని– ఒకే వేదిక ఎక్కించి– ప్రపంచమంతా చోద్యం చూస్తుండగా భవిష్యత్తులో ఆ దేశాన్ని పాలించే నాయకుని ఘనతను గ్రహిం చడం ఎంత ముచ్చటగా ఉంటుంది? అది ఈ మధ్య కర్ణాటకలో కొంతలో కొంత ప్రారంభమయిందని నాకనిపిస్తుంది. ఆ మధ్య ఒక సభలో ప్రధాని మోదీ ఓ మాట అన్నారు: 15 నిమిషాలు చేతిలో ఏ కాగితం లేకుండా రాహుల్ గాంధీ కర్ణాటక, ముఖ్యంగా విశ్వేశ్వరయ్య గొప్పతనాన్ని గురించి చెప్పగలరా? అంటూ. ఇది చాలా కత్తిలాంటి సవాలు. మరి మన రాహుల్ తక్కువ తినలేదు. ‘‘ఏదీ? కేవలం 5 నిమిషాలు– తాము ఈ ఎన్నికలలో నిలిపిన అభ్యర్థులు– ముఖ్యంగా యడ్యూరప్పమీద అవినీతి, క్రిమినల్ కేసులను సమర్థించమనండి. అలాగే టికెట్లు పొందిన జనార్ధనరెడ్డి హితులు 8 మంది ఘనతని ఉటంకించమనండి’’– అని రాహుల్ సవాలు విసిరారు. అయితే ఇది మరో వేదికమీద– బాగా ఆలోచించాక చెప్పిన మాటలు. కానీ వీటిని వెంట వెంటనే చెప్పగలిగితే ఎంత బాగుంటుందని నాకు ముచ్చట. ఈ విధంగా రెండు గొప్ప సవాళ్లు– రెండు విభిన్నమయిన వేదికలమీద వృథా అయిపోయాయని నా బాధ. ఇదేగానీ అమెరికాలో లాగా ఇద్దరు ప్రత్యర్థులనూ ఒకే వేదిక మీద నిలిపి– ఒకరినొకరు ప్రశ్నిం చుకుంటే– కథ ఎంత రమ్యంగా ఉంటుంది? ఏతా వాతా అలాంటి పోటీ జరిగితే రాహుల్ తేలికగా పది మార్కులు ఎక్కువ కొట్టేస్తారు. చక్కటి ముఖ వర్చస్సు, గీసిన గెడ్డం, సొట్టలుపడే బుగ్గలు– ఇవన్నీ ప్రత్యేకమైన ఆకర్షణలు. మాసిన గెడ్డం, తెల్లటి జుత్తు, ఖరీదైన వాచీ– ఇలాంటివి మోదీ ఆకర్షణ. బొత్తిగా ముసిలి రూపు. నాకేమో– చూడగానే మొదటి రౌండు విజయం రాహల్ది. ఈ తర్వాత విన్యాసాలలో రాహుల్ కొన్ని ప్రయత్నాలు చెయ్యాలి. అవసరమయితే– అటు మోదీ వెనుక యడ్యూరప్ప, మన రాహుల్ వెనుక సిద్ధరామయ్య ఉండవచ్చు. ఉదా‘‘కి కర్ణాటకలో ఓడిపోతే కాంగ్రెస్ ‘పంజాబు, పుదుచ్చేరీ, పరివార్’ పార్టీగా మిగిలిపోతుందని ఒక విసురు మోదీ విసిరారు. వెంటనే సిద్ధరామయ్య ‘అయ్యా, మాది సరే. రేపు మీరు రాష్ట్రంలో గెలవకపోతే మొదట ఇంగ్లిష్‌లో చెప్తాను. ‘ప్రిజన్, ప్రైస్ రైజ్, పకోడా’ పార్టీగా మిగిలి పోతుంది అని వాక్రుచ్చారు. నాకేమో ‘పకోడా’ కంటే ‘పరోటా’, ‘పాలకోవా’, ‘పరవాన్నం’ వంటివి వాడవచ్చుననిపించింది. ఇంకా ఇలాంటివి మరిన్ని. ఉన్నట్టుండి రాహుల్ ఒక దొంగ ప్రశ్న అడగొచ్చు: ‘‘ఒడయార్ మేనత్త ముక్కు నత్తు బరువు ఎంత? మీకు 4 నిమిషాలు టైము’’ అనవచ్చు. తప్పనిసరిగా మోదీ తెల్లమొహం వేస్తారు. అప్పుడు రాహుల్ చిరునవ్వు నవ్వి ‘అసలు ఒడయార్కి మేనత్తే లేదని’ ఉటంకించవచ్చు. తద్వారా 3,479 జనానా ఓట్లు కాంగ్రెస్‌కి పడిపోతాయి. తరువాత కొన్ని జీకే ప్రశ్నలు అడగవచ్చు. ‘తమిళనాడు సరి హద్దు దాటగానే– అంటే హోసూరు దాటగానే– వచ్చే మొదటి గ్రామం పేరేమిటి?’ అని రాహుల్ అడిగారనుకోండి. మోదీ తక్కువ తిన్నారా? ‘తుంకూర్లోకి ప్రవేశించగానే కుడివేపు కనిపించే మొదటి సైన్ బోర్డు ఏమిటి?’ అని అడగవచ్చు. ఇక లెక్కలవేపు వెళ్తే– గాలి జనార్ధనరెడ్డిని మనస్సులో పెట్టుకుని ‘35 వేల కోట్లలోంచి– ప్రస్తుతం ఎన్నికలకి 1,800 కోట్లు తీసేయగా ఎంత మిగులును?’ అని అడగవచ్చు. ‘ఖత్రోచీ ఇటలీ చేర్చిన సొమ్ములో 50 మిలియన్ల కోట్లకు ఎన్ని యూరోలు?’ అని మోదీ ప్రశ్నించవచ్చు. 2011లో గోవా కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు సోనియా ఎన్నికల ఉపన్యాసాలు చేస్తూ ‘అక్కడి మహాదయీ నది నీరు అచ్చంగా వారిదేనని హామీ ఇచ్చారు. ఇప్పుడు గోవా చెయ్యి జారిపోయింది కనుక మహాదయీ నది ప్రసక్తి లేదు’ అంటూ దీన్ని కాంగ్రెస్ ‘అట్కానా, భట్కానా, లట్కానా’ అన్నారు. ఇలాంటి మాటలు మన రాహుల్‌కి దొరక్కపోవచ్చు, అయితే వారు అప్పుడప్పుడూ వారి మాతృభాష అయిన ‘ఇటలీ’ని వాడే అవకాశాన్ని కల్పించుకోవచ్చు. ఏమైనా మోదీ, రాహుల్ సవాల్ చేసినందుకే సగం ఆనందిస్తూ– అలాంటి అమెరికా పోటీల రోజులు మనకీ త్వరలో వస్తాయని ఆశిద్దాం. గొల్లపూడి మారుతీరావు -
ఏమిటి ఈయన ప్రత్యేకత?
జీవన కాలమ్ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీ కాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు. నేను ఆలిండియా రేడి యోలో చేరే నాటికి నాకు 23 సంవత్సరాలు. రజనీగారికి 43. నా ముందు మహాను భావులైన ఆఫీసర్లు– బాలాంత్రపు రజనీకాంతరావు, యండమూరి సత్యనారాయ ణరావు, దాశరథి, బుచ్చి బాబు– ఇలా. ఇక పండిత ప్రకాండుల బృందం ఆ తరానికే మకుటాయమానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, ముని మాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, డాక్టర్ జీవీ కృష్ణారావు – ఈ జాబితా అపూర్వం. వీరందరూ తేలికగా మాకంటే 30–35 సంవత్సరాలు పెద్దవారు. ఓ తరాన్ని జాగృతం చేసిన అద్భుతమైన ప్రక్రియలకు ఆద్యులు. భారతదేశంలోని అన్ని ప్రక్రియలకు తగిన ప్రాధా న్యం కల్పించాలనే దురాశతో– ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వృద్ధులందరినీ రేడియోలోకి ఆహ్వానిం చారు పెద్దలు. వీరెవరికీ మాధ్యమంమీద ఒడుపుగానీ, అవగాహనగానీ, తర్ఫీదుగానీ లేనివారు. రిటైరై పెన్షన్ పుచ్చుకుంటున్న బాపతు మహానుబావులు. ఆ మాట కొస్తే మాకే ఇంకా తర్ఫీదు లేదు. ఉద్యోగంలో చేరిన ఒక్కొక్క బ్యాచ్‌ని ఢిల్లీ పంపుతున్నారు. ఇదొక రకమైన అవ్యవస్థ. అయితే ‘అసమర్థత’ తెలుస్తోంది. మార్గం తెలియడం లేదు. ఈ దశలో మాకంటే కేవలం 12 సంవత్సరాల ముందు –ఒక కార్యశూరుడు– మాధ్యమం అదృష్టవ శాత్తూ దక్షిణాది ప్రసార మాధ్యమంలో అడుగు పెట్టారు. ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంత రావు. ఆ రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్ అంటే తెలు గువారి పుట్ట. 1941లో చేరిన రజనీకాంతరావుగారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అటు పార్లమెంటులో నెహ్రూ ఈ దేశ స్వాతంత్య్రాన్ని గురించి ఉపన్యాసం ఇస్తూంటే ఇక్కడ– మద్రాసులో కేవలం 26 ఏళ్ల యువ కుడు 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున ఎలుగెత్తి ‘మ్రోయింపు జయభేరి’ అని నగారా మ్రోయించారు. ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ‘మాదీ స్వతం త్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారి మైకుల ముందు ఉరిమింది. ఆ రోజు కమాండర్–ఇన్‌చీఫ్ రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్లో లేనిదెవరు? కొత్తగా పెళ్లయిన బుచ్చిబాబు తన భార్యతో సహా స్డుడియోలో ఉన్నారు. అదొక ఆవేశం. మరో 40 ఏళ్ల తర్వాత టంగు టూరి సూర్యకుమారిని ఇంగ్లండు కెంట్‌లో ఒక పార్టీలో ఈ విషయం చెప్పి పులకించాను. రేడియో స్టేషన్ అంటే– ఆ రోజుల్లో దాదాపు సగం సంగీతం. ఏం సంగీతం? మరిచిపోవద్దు. మద్రా సులో సంగీతం అంటే వర్ణం, కీర్తన, జావళి వగైరా. మామూలు పాటలంటే సినీమా తైతక్కలు. కానీ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంత రావు. దీన్ని ఇంకా చాలా రేడియో కేంద్రాలు ఇప్పటికీ పట్టుకోలేదంటే తమరు నన్ను క్షమించాలి– బాణీ. ‘ఊపరె ఊపరె ఉయ్యాల... చిన్నారి పొన్నారి ఉయ్యాల’ వంటి రజని పాటలు (ఎస్. వరలక్ష్మిగారు పాడారు) నాకు బహిఃప్రాణం. మరో 35 సంవత్సరాల తర్వాత– జీవితం నాకు అవకాశమిచ్చి వరలక్ష్మమ్మ గారూ (నాకంటే 12 ఏళ్లు పెద్ద) నేనూ భార్యాభర్తలుగా నటించినప్పుడు ఆమెకి ఈ పాటని ఆమె చెవిలో గుర్తు చేసి పాడించుకుని పులకించాను. అలాగే పాకాల సావిత్రీదేవి, శాంతకుమారి, టంగుటూరి సూర్యకుమారి, ఏ.పీ. కోమల– ఇలా ఎందరో. వీరంతా నేను రేడియోలో చేరడానికి పెట్టు బడులు. ఆయనతో ‘బావొచ్చాడు’ ‘అతిథిశాల’ వంటి ఎన్నో సంగీత రూపకాలలో తలదూర్చిన అనుభవం ఉంది. ఇక నా కథకు వస్తాను. రజనీకాంతరావుగారు అప్పుడే స్టేషన్ డైరెక్టర్‌గా వచ్చారు. నాకు పిడుగు లాంటి వార్త. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ ఇచ్చి నన్ను శంబల్పూరు (ఒరిస్సా) బదిలీ చేశారని. ముమ్మ రంగా సినీ రచన సాగుతున్న సమయం. రజనీగారి గదిలోకి నా రాజీనామా కాగితంతో వెళ్లాను. రజనీ గారు తీరి కగా నా రాజీనామా పత్రం చదివారు. చదివి అడ్డంగా చించేశారు. ‘తప్పనిసరిగా వెళ్లండి. ఉద్యోగం మానేయవద్దు. అవసరమైతే ముందు ముందు చూద్దు రుగానీ’ అన్నారు. బయటికి నడిచాను. ఆ తర్వాత మరో 12 సంవత్సరాలు పనిచేసి– మరో ప్రొమోషన్ కడపలో అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరునై, అనుకోకుండా నటుడినై రాజీనామా చేశాను. ఇప్పటికీ– ఆయన ఏ 40 ఏళ్ల కిందటో– ఇంకా వెనుకనో– రచించి, బాణీ కూర్చి, పాడించిన (బాల మురళీకృష్ణ, శ్రీరంగం గోపాలరత్నం) ‘మన ప్రేమ’ పాట ఒక్కటీ కేవలం 70 సంవత్సరాలు రేడియో నడ కనీ, వయ్యారాన్ని రజనీ రచనా పాటవాన్నీ, రేడియో తనాన్నీ తెలియజేస్తూ జెండా ఊపుతున్నట్టుంటుంది. రజనీకాంతరావు గారు రేడియో సంగీతానికి ఒక శయ్యను రూపుదిద్దారు. రేడియోకి ఒక రజనీ చాలడు. ప్రతీ కేంద్రానికీ కావాలి. ఈ మాధ్యమానికి కావాలి. ఇప్పటికీ కావాలి. - గొల్లపూడి మారుతీరావు -
భజరంగీ భాయీజాన్ చూసి కంటతడి పెట్టుకున్నా..
జీవన కాలమ్ మహా పురుషుల పాద రేణువులతో పవిత్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– సల్మాన్‌ఖాన్ వంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టు లతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవిత్రత’ను కోల్పోదు. ఈ దేశం అట్టు ఉడికినట్టు ఉడికిపోయింది. కొందరు గుండెలు బాదుకున్నారు. గుండె ధైర్యం చాలని కొందరు చచ్చిపోయారు. ప్రతీ ఊరులోనూ హాహా కారాలు చేశారు. కొన్ని వేల మంది ఆయన ఇంటి చుట్టూ, మరి కొన్ని వేలమంది జోద్ పూర్ జైలు గోడల్ని పట్టుకుని రోదిస్తూ ఆ మహానటుడి దీన వదనాన్ని దర్శించడానికి గుంజాటన పడ్డారు. కారణం– సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక రాత్రి జైల్లో గడపాలి– 20 సంవత్సరాల కిందట నల్లజింకని చంపి నందుకు.. నన్ను క్షమించాలి. నేనెప్పుడూ నా అంతట నేనుగా సల్మాన్ ఖాన్ చిత్రాన్ని చూడలేదు– ఒకసారి మా అబ్బాయి ఒత్తిడి మీద ‘భజరంగీ భాయీజాన్’ చిత్రాన్ని చూసి కంటతడి పెట్టుకున్నాను. అయితే ఆయన కంట తడిని పెట్టించే నటుడు కాదని తర్వాత తెలిసింది. జోద్పూర్ జైలు ఆవరణలోకి ఈ నటుడు నడిచి రావడాన్ని మా అబ్బాయి చూపించాడు– టీవీలో, సల్మాన్ ఖాన్ గారి నడకను తమరు ఈ పాటికే గ్రహించి ఉండాలి. పెదాలు బిగించి, రెండు భుజ బాహువుల్లోంచీ రెండు ఈత చెట్లను నిలిపేంత ఠీవిగా నడిచి వచ్చారు. తెల్లారితే రాహుల్, మోదీ లతో మొహం మొత్తే పత్రికలు, చానల్స్ జో«ద్‌పూర్ జైలు ఆవరణ ఆఫీసు గదిలో వారు కాళ్లు దాదాపు జైలర్ మీదికి జాపి కూర్చున్న ఫొటోని ప్రచురిస్తూ– ‘ఈ ఫొటో మొదటిసారి వేస్తున్నది మేమే’ అని గర్వంగా చెప్పుకున్నారు. మరి 20 ఏళ్ల క్రితం ఈ సుంద రాంగుడు నలుగురు అందమైన అమ్మాయిల్ని తోడు తీసుకుని అడవికి వెళ్లి, అరుదైన అడవి జంతువు నల్ల జింకను చంపిన వైనం ఈ దేశం మరచిపోయింది. న్యాయస్థానాలు వెనక్కి నెట్టాయి. మరి ఇంత చిన్న నేరానికి శిక్ష విధించడానికి 20 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఏ పత్రికా తమ పత్రికల్లో రాయలేదు. ఒకే ఒక్క కారణం కనిపిస్తుంది. డబ్బు, పరపతి, న్యాయ స్థానాలకి సినిమా రంగం మీద ఉన్న భయం (ప్రియం కాదు– గమనించాలి). మన దేశంలో జైలుకెళ్లిన మహానుభావుల్ని ఒకసారి స్మరించుకుని తరిద్దాం. లాలూప్రసాద్ యాదవ్ (వెంటనే వీరినే ఎందుకు స్మరించాలి?). ఒక రిపోర్టు ప్రకారం, వీరి హయాంలో ఒక్క 8 సంవత్సరాలలో మాత్రమే 32 వేల మందిని ఎత్తుకు పోయి, వారిలో చాలామంది డబ్బు చెల్లించాక హత్యలు జరిపించారట. వీరు కాక ఈ మహానుభావుల జాబితాల్లో ఆసా రామ్ బాపూ, గురు మీత్ సింగ్ రామ్ రహీం ఉన్నారు, వారి ఉంపుడుకత్తె హనీ ప్రీత్ కౌర్ ఉంది. మధుకోడా ఉన్నారు. శిబూ సొరేన్, పండిత్ సుఖ్రామ్ ఉన్నారు, ఓం ప్రకాశ్ చౌతాలా, ఎ. రాజా, కనిమొళి ఉంది. వీళ్ల జైలు జీవితం మాటేమోకానీ, ఈ రాత్రి సల్మాన్ ఖాన్ సుఖంగా ఉండటానికి నాలుగు బొంత లిస్తారట. జైలరుగారి అనుంగు పుత్రుడు అవసరమ యితే వాళ్ల నాన్న తల పగులగొట్టి రెండు పరుపులు, నాలుగు దుప్పట్లూ సల్మాన్ గదికి తరలించి, రాత్రంతా ఆయనకి సేవ చేసి, తను చచ్చిపోయేదాకా ఆ అనుభూ తిని పెళ్లాం పిల్లలతో చెప్పుకుని గర్వపడతాడని నా నమ్మకం. మన దేశంలో బొత్తిగా పనికిరాని, అరెస్టైన కొందరు నేరస్థులను కూడా తలచుకోవడం న్యాయం. జయ ప్రకాశ్ నారాయణ్, క్లుప్తత కోసం కొన్ని పేర్లు– సర్దార్ వల్లభాయి పటేల్, రాజాజీ, పట్టాభి సీతా రామయ్య, మౌలానా అజాద్, లాల్ బహదూర్ శాస్త్రి. వీరందరూ అజరామరమైన కీర్తి శేషులు. మరో మాట లేదు. కావా లనే నెహ్రూ గురించి వ్రాయడం లేదు. కారణం ఆయన ఆ వైభవాన్నీ అనుభవించారు. అంత గొప్పగానూ నిష్క్రమించారు. మరో మూడు పేర్లే రాసి ఈ కాలమ్ ముగిస్తాను. మహాత్మా గాంధీ 2,500 సంవత్సరాల దక్షిణాయతన పీఠాధిపతి జయేంద్ర సరస్వతీ మహా స్వామి, వినోభా భావే. మహాత్ముడు సగం జీవి తాన్ని జైళ్లో గడిపాడు. తుండు గుడ్డ, పంచె ఆయన ఆభర ణాలు. జయేంద్ర సరస్వతి మహాస్వామి 61 రోజులు జైల్లో ఉన్నారు. శిరస్సుపైన ఉన్న దివ్య వస్త్రమే (‘శాటి’) వారు ఉప యోగించుకున్నవి. మరొక మహా పురుషుడు వినోభా భావే. మహాత్ముడు నిరాహార దీక్షలలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య మూలాలను పెకలించి, ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టి మార్టిన్ లూథర్ కింగ్, బాద్షా గాంధీ, నెల్సన్ మండేలా వంటి వారికి గురువై– ఎన్నో దేశాల స్వాతంత్య్రానికి కారణమ య్యాడు. మరొక మహాస్వామి ఈ జాతి ఆధ్యాత్మిక సంప దను సుసంపన్నం చేశారు. మరొకాయన వినోభా భావే. ఆయన శరీరంలో భాగాలు మందులకు ఎదురు తిరిగితే– ‘ఈ శరీరం ఇక చాలునంటోంది’ అని స్వచ్ఛం దంగా మృత్యువుని ఆశ్రయించిన అపర బీష్ములు. ఇలాంటి మహా పురుషుల పాద రేణువులతో పవి త్రమైన ఈ దేశంలో జైళ్ల వైభవం– ఇలాంటి సినీ నటుల 650 కోట్ల పెట్టుబడుల వ్యాపార కాంట్రాక్టులతో, అభిమానుల వీర స్పందనలతో ఏనాడూ తన ‘పవి త్రత’ను కోల్పోదు. గొల్లపూడి మారుతీరావు -
అబద్ధం చెప్పడం
జీవన కాలమ్ అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. మనం చేసే పనుల్లోకెల్లా అబద్ధం చెప్పడం చాలా కష్టతరమైన పని. అబద్ధానికి ముందు కావలసినంత పరి శ్రమ కావాలి. ఫలానా అబద్ధం వల్ల కథ అడ్డం తిరిగితే తప్పిం చుకునే దారులో, సమర్థిం చుకునే మార్గాలో అప్పటికప్పుడు కరతలామలకంగా సిద్ధంగా ఉండాలి. అబద్ధం చెప్పడంలో సూపర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ప్రముఖ నటుడు, నా అనుంగు మిత్రుడు, మహానటుడు కె. వేంకటేశ్వరరావుకి ఇస్తాను. ‘‘ఏరా! మొన్న నాకోసం లీలా మహల్ జంక్షన్ దగ్గర కలుస్తాను అన్నావు? రాలేదేం?’’ అన్నామనుకోండి. రాలేకపోవడానికి వెయ్యి కారణాలు చెప్పవచ్చు. కానీ చెప్పడు. ‘లీలా మహల్ జంక్షన్ దగ్గర ఏ వేపు నిలబడ్డావు?’ ‘సోడా కొట్టు దగ్గర’ అంటే ‘అదీ.. నేను లేడీస్ గేటు దగ్గర ఒక్క అరగంట పైగా నిలబడి వెళ్లిపోయా’ నంటాడు. వాడిని ఏడిపించాలని ‘అవునవును. ఈ చారల చొక్కాతో ఓ మనిషిని చూశాను. నువ్వనుకోలేదు’ అన్నామనుకోండి. తను అబద్ధం ఆడి దొరికిపోనందుకు సిగ్గుపడాలి కదా? పడడు. ‘మరి నన్ను పలుకరించలేదేం’ అని ఎదుటి ప్రశ్న వేస్తాడు. రెండు అబద్ధాల మధ్య నిజం ఎక్కడో చచ్చిపోయి, నిజాన్ని పెట్టుబడిగా పెట్టిన మన ఆవేశం నీరు కారిపోతుంది. అబద్ధానికి చాలా ఒరిజినాలిటీ కావాలి. గొప్ప సమయస్ఫూర్తి కావాలి. తను చెప్తున్నది అబద్ధమని ఎదుటివాడికి అర్థమవుతుందని తెలిసినా ‘సిగ్గులేని తనం’ కావాలి. ఒక్క ఉదాహరణ. ‘నిన్న పొద్దుట ఎక్కడరా? ఎంత వెతికినా దొరకలేదు?’ ‘ఎక్కడ బ్రదర్ ఏకామ్రేశ్వరరావుగారు చంపేశారు’ ‘ఎవరు? ఉపముఖ్యమంత్రిగారే! ఏమిటి విశేషాలు?’ ‘వచ్చే కేబినెట్లో విద్యామంత్రిని ఎవరిని పెట్టాలని నా సలహా కోసం కబురు పంపించాడు’.. ‘అదేమిట్రా? ఆయన మొన్న టంగుటూరు ఫ్లై ఓవర్ దగ్గర యాక్సిడెంట్లో పోయారు కదా? వెంటనే సమాధానం వస్తుంది. ‘అదే నీతో చిక్కు. నేను చెప్పేది 1997 మంత్రి గురించి...’ ‘ఆయనెప్పుడూ మంత్రి కాలేదు కదా?’ ‘అందుకే రాజకీయాలు తెలీని వారితో మాట్లాడటం కష్టం. ఆయనే విద్యామంత్రని కనీసం 20 రోజులు మా సర్కిల్సులో అనుకునేవాళ్లం. అతను మీ అందరికీ ఏకామ్రేశ్వరరావు. మాకు మాత్రం విద్యేశ్వరరావు’. అబద్ధానికి విశాలం ఎక్కువ. ధైర్యం ఎక్కువ. అబద్ధం చెప్పేవాడిని ప్రత్యేకంగా గమనించండి. ఎప్పుడూ చేతిలో పది కిలోల బంగారమున్నట్టు ప్రకాశిస్తూ ఉంటాడు. కుచేలుడిలాగా మూలుగుతూ, నడుం వంగి బొత్తిగా కుంచించుకుపోయి ఉండడు. నిజం నీరసమయినది. అది వన్ వే ట్రాఫిక్. నిజాయితీపరుడిని నిద్రలో లేపినా ఒక్కటే చెప్పగలడు– దిక్కుమాలిన నిజం. అబద్ధం అక్షయపాత్ర. సత్య హరి శ్చంద్రుడిలాంటి వెర్రిబాగులవారు ఈ దేశంలో బొత్తిగా కనిపించరు. నా జీవితంలో అబద్ధం బాధపెట్టినట్టు, తలుచుకున్నప్పుడల్లా, డబ్బు కంటే సులువుగా మోసపోయినందుకూ ఇప్పటికీ విలవిలలాడతాను. రేడియోలో పనిచేస్తున్న రోజులు. సినీమా ధర్మమాంటూ కొన్ని వేలు అదనంగా దాచుకున్నాను. ఎందుకు? వెస్పా కొనుక్కోవాలని. మా ఆఫీసుకి ఓ తమిళ ఆఫీసరులాంటి వ్యక్తి వచ్చేవాడు. ఎప్పుడూ పెద్ద కబుర్లు చెప్పేవాడు. అతని వెస్పా పచ్చగా నిగనిగలాడుతూ కనిపించేది. అది నా కల. తెలిసి ‘ఓస్! అదెంతపని ఆరు నెలలు తిరగకుండా– చవకలో కొనిపిస్తాను’ అన్నాడు. అతని మాటలు, చెప్పే ధోరణీ అరచేతిలో వైకుంఠాన్ని చూపుతున్నట్టుగా ఉండేవి. ఒకసారి కన్సైన్మెంట్ వచ్చింది. దాన్ని చూపించడానికీ నాకిష్టపడలేదు. ‘చూడగానే నవనవలాడే అమ్మాయిని మీకు అప్పజెప్తాను’ అన్నాడు. ఎట్టకేలకు మరో కన్సైన్మెంట్ వచ్చింది. తనే ఎగిరి గంతేశాడు. మా ఆవిడకీ నాకూ కరచరణాలు ఆడలేదు.. అన్నీ గోడౌన్‌లోకి వచ్చాక మిమ్మల్నిద్దరినీ తీసికెళ్తానన్నాడు. ఒక మధ్యాహ్నం ఉన్నట్టుండి ఫోన్ చేశాడు. ‘ఈసారి రెండు రకాల ఆకుపచ్చలు కలిపాడు సార్! బాడీ చిలక పచ్చ. హాండిల్బార్లో చిన్న రంగు కలిపాడు’ అన్నాడు. ఫోన్లో వెనుక వెస్పాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ‘చూడ్డానికి వచ్చేదా?’ అన్నాను. నవ్వాడు. ‘వద్దు సార్ రాతకోతలన్నీ పూర్తి చేయించేశాను. రేప్పొద్దుట మీ ఇంటి ముందుం టుంది. సంతకాలు అక్కడే. నేను రాలేను. ఓ మనిషిని పంపుతున్నాను. నుదుటిమీద కాల్చిన మచ్చ. పేరు రామానుజం. అతనికి 4,220 ఇవ్వండి. రూపాయి ఎక్కువ వద్దు. వెంటనే పంపండి. ఎవరీ రామానుజం? ఆలోచన కూడా రాలేదు. అరగంటలో రామానుజం రావడం, డబ్బు ఇవ్వడం జరిగిపోయింది. ఆ రాత్రి మా ఇద్దరికీ నిద్దుర లేదు. ఆ ఉదయమే కాదు. ఆరు నెలలైనా వెస్పా ఛాయ లేదు కదా.. ఈ ఆర్ముగం అయిపు లేదు. అసలు ఎవరు ఈ రామానుజం? ఏం కంపెనీలో ఉద్యోగి? డబ్బు పుచ్చుకున్నది ఎవరు? రుజువేమిటి? ఆకర్షణని అద్భుతంగా మలచిన గొప్ప సంఘటన ఇది. తర్వాత 4,220 రూపాయలు చూడలేదు. ఆకుపచ్చ వెస్పా చూడలేదు. అబద్ధం అద్భుతమైన ఆభరణం. అది రాణించినట్టు నిజం రాణించదు. ప్రతీ రోజూ ఎన్ని అద్భుతాలు మన మధ్య రాణిస్తున్నాయో పేపరు తెరిస్తే చాలు. అబద్ధం నీడ. నిజం గొడుగు. అబద్ధం అలంకరణ. నిజం నిస్తేజమైన వాస్తవం. అబద్ధం కల. నిజం నిద్ర. - గొల్లపూడి మారుతీరావు -
పేదరికం మీద సవాలు
జీవన కాలమ్ పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క– మహావృక్షమై నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. భూమిని చీల్చుకుని వెలుగుని చూపుతుంది. సద్గురువులు శివానంద మూర్తిగారు ‘‘పేదరికం అంటే విదేశాలలో కేవలం దరిద్రం అన్నారు. కానీ ఒక్క భారతదేశంలో పేదరికం సంపద, వైభవం. ఒకే ఒక్క ఉదాహరణ: భగవాన్ రమణ మహర్షి. కౌపీనం కేవలం పశువుకీ మనిషి సంస్కారానికీ చెలియలికట్ట. అదే, అంతే కౌపీనం ఆవశ్యకత’’. మన దేశంలో కోట్ల ప్రజాధనాన్ని దోచుకుని చట్టం వలలోంచి జారిపోయినవారు– లలిత్‌మోదీలు, విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు, నేహుల్ చోక్సీ– మరెందరో ఉన్నారు. తెల్లారి లేస్తే ఈ పనులు చేసే మంత్రులు, వారి తనయులు, రిజిస్ట్రార్లు, ఇంజనీర్లు, దేవుని ఆస్తులు పరిరక్షించాల్సిన అతి ‘నీచ’ అధికారులు– వీరిని సాధించలేదని సాధించే మేధావులూ, పార్టీలూ ఉన్నాయి. ఈ సంస్కృతిలో ఏనుగు తలల దేవుళ్లు, గుర్రపు తలల దేవుళ్లు, సింహపు తలల దేవుళ్లు, సగం మగా సగం ఆడా దేవుళ్లూ చాలామంది ఉన్నారు. వీటిని నెత్తిన పెట్టుకుని కిసుక్కున నవ్వుకునే తెలివైన మేధావులూ ఉన్నారు. అది వారి అదృష్టం. వారివల్ల ఈ జాతికి నష్టం లేదు. అలనాడూ ఈ ప్రబుద్ధులు ఉన్నారు. ‘నేనే దేవుణ్ణి’ అన్న నేటి తరం నాయకుల ప్రాక్సీలు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వారి మెజారిటీ పెరిగింది. పెరిగినప్పుడల్లా ‘నేనున్నాన’ని దేవుడు వస్తాడని కథ. ఇది పుక్కిట పురాణం కావచ్చు. మనమూ కాస్సేపు నవ్వుకుందాం. కాలడి (కేరళ)లో ఓ చిన్న కుర్రాడు శంకరుడు. పుట్టుకతోనే ‘విద్య’ని దర్శించుకున్న– మన చీభాషలో ‘ప్రాడిజీ’. శాస్త్రాల ప్రకారం– ప్రజ్ఞ కలవానికి మూడవ యేటనే ఉపనయనం చేయవచ్చు. తండ్రి చేయాలని సంకల్పించారు. కానీ కాలం చేశాడు. ఐదవయేట గురువు విద్యారణ్యులు గాయత్రిని ఉపదేశించారు. ఏడవ యేట ఉంఛవృత్తికి బయలుదేరాడు. ఓ ఇంటిముందు నిలిచాడు జోలెతో. ఆ పేదరాలికి తినడానికి తిండిలేని స్థితి. కానీ ఏదో వటువుకి ఇవ్వాలనే తపన. ఇల్లంతా వెదికింది. ఓ మూల సగం కుళ్లిన ఉసిరికాయ దొరికింది. కంటతడితోనే, సిగ్గుగానే, నిస్సహాయంగా శంకరుని జోలెలోనే ఉంచింది. ఇక్కడ ఇద్దరు పేదలు. పేదరికాన్ని స్వచ్ఛందంగా వరించిన ప్రతిభామూర్తి. అటుపక్క నిస్సహాయమైన పేదరాలు. ఇదీ భారతీయ ‘పేదరికానికి’ బంగారు ఉదాహరణ. అటు పేదరాలు నిస్సహాయతతో చలించిపోయింది. ఇటు ఓ ‘ప్రజ్ఞా బిందువు’ ప్రజ్ఞాసింధువైపోయాడు. ఏడేళ్ల వటువు నోటివెంట ఆర్ద్రత అమృతమైంది. ‘కనకధారా స్తోత్రం’ వర్షించింది. ‘‘అమ్మా, ఈ తల్లి ఎన్ని జన్మల్లోనో ఎన్నో పాపాలు చేసి ఉండవచ్చు. కానీ ఈ జన్మలో ‘ఇవ్వాలన్న’ ఒక్క సంస్కారాన్ని మిగుల్చుకున్నందుకు ఆమెని కరుణించు’’ అన్లేదు శంకరులు. కోరికలే లేని మహా పురుషుడాయన. కేవలం ఈ మాటలే అన్నారు: ‘‘బంగారువంటి నీ కరచరణాలతో, పద్మాలవంటి నీ నేత్ర ద్వయంతో కరుణించు తల్లీ. నా హృదయమంతా పేదరికంతో భయకంపిత మౌతోంది. నీ సమక్షంలో నేను శరణాగతిని కోరుకుంటున్నాను. ప్రతి దినం నన్ను దాటి నీ కరుణా కటాక్షాలను ప్రసరించు’’. ఈ ఏడేళ్ల మహా పురుషుడు తనని కాదు– తనని దాటి అనునిత్య పేదరికాన్ని అనుభవించే కోటానుకోట్ల దీనులని కరుణించ మంటున్నారు. వెనువెంటనే మరొక తల్లి ఆర్ద్రమై కనకధారను వర్షించింది. నాకు తెలుసు– కొందరు మిత్రులు కిసుక్కుమంటున్నారు. ఈ జాతి కొన్ని యుగాలుగా వారినీ ఉద్ధరిస్తోంది. పరమ స్త్రీ లోలుడు అజామీలుడిని తరింపజేసింది. పరమ జారుడు నిగమ శర్మ తరిం చాడు. ఇలాంటి కథలెన్నో ఉన్నాయి. ఏ చిన్న సత్కార్యమైనా ఒక జీవితకాలపు పాపానికి ప్రాయశ్చిత్తం కాగలదని– దారి తప్పిన వారిని చేరదీసి అక్కున చేర్చుకునే అరుదైన సంస్కృతీ వైభవమిది. ఈ దేశంలో భక్తికి కాదు పెద్ద పీట. తపస్సుకి కాదు. గెడ్డాలకి కాదు. రుద్రాక్షలకి కాదు. విభూతికి కాదు. మీరు క్షమిస్తే వేంకటేశ్వర స్వామికి కాదు. బాబాకి కాదు. మాతకి కాదు. పీతకి కాదు. సంస్కారానికి పెద్ద పీట. ఇష్టం లేకపోతే గుడికి వెళ్లకు. గోపురాలు కట్టించకు. భజనలు చేయకు. బంగారు పాదుకలు వేంకటేశ్వరస్వామికిచ్చి ఇంగ్లండులో మాయమవకు. పక్కవాడికి నిలవున్న ఉసిరికాయని ఇవ్వాలన్న మనసుని పెంచుకో. కళ్లు లేని గుడ్డివాడిని రోడ్డు దాటించు. పక్కవాడి రూపాయి దోచుకోవాలనే ఆలోచన కలుపుమొక్క–మహా వృక్షమయి నిన్ను కబళించేస్తుంది. మామిడిచెట్టు మొండి మొక్క. కానీ దోసెడు నీరు ముందు వేరును తడుపుతుంది. కొన్నాళ్లకి భూమిని చీల్చుకుని వెలుగుని నీకు చూపుతుంది. పెరిగి నువ్వు బతికినన్నాళ్లూ నిన్ను పోషిస్తుంది. తరతరాలూ నీ వారసులకి పెద్ద దిక్కవుతుంది. ‘మా తాత చేసిన పుణ్యం’ అని నువ్వు చచ్చిపోయినా నీ మంచితనానికి సదా ‘చెమ్మ’ని ఇస్తూనే ఉంటుంది. ‘వీడెవడయ్యా దేవుడు!’ అని ఇప్పుడే అతడిని అటకెక్కించెయ్. చెడిపోయిన ఉసిరికాయని ఇచ్చే మనస్సుని పెంచుకో. అమ్మ వచ్చి నీ తలుపు తడుతుంది. - గొల్లపూడి మారుతీరావు -
మృత్యువు
జీవన కాలమ్ కారుణ్య మరణాన్ని అంగీకరించడం ద్వారా మనం నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి, ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. 1981 ప్రాంతంలో హాలీవుడ్లో ఓ విభిన్నమయిన చిత్రం వచ్చింది. ‘హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే?’ గొప్ప చిత్రం. ఆలోచింపజేసే చిత్రం. ఓ గొప్ప పెయింటరు లారీ యాక్సిడెంటులో దెబ్బతింటాడు. మెడ దగ్గర్నుంచి కాలి వరకు స్పర్శ పోయింది. ఇది భయంకరమైన శాపం. మెదడు ఆలోచించగల అన్ని ఆలోచనలూ స్పష్టంగా చేయగల అమూల్యమైన సాధనం య«థాతథంగా పోయింది. కాలిమీద వాలిన ఈగని తోలుకునే ఆస్కారం లేదు. మనిషి సంపూర్ణంగా జీవించడానికి ఏది గుర్తు? మంచి బతుక్కి ఆలోచనా మంచి ఆచరణా? అతను కేవలం ఒక అప్రయోజనమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకి స్వచ్ఛందంగా చచ్చిపోయే హక్కుని ప్రసాదించాలని న్యాయవాదుల బృందం ముందు వాదిస్తాడు. చివరికి వారు అతని కోరికని అంగీకరించక తప్పలేదు. డాక్టరు నిస్సహాయంగా అతని ప్రాణాన్ని నిలిపే ద్రావకాన్ని ఆపేస్తూ ‘‘మూడు నిమిషాలలో నీ కోరిక తీరుతుంది. ఈ లోగా నీ మనసు మార్చుకుంటే నేను సహకరించగలను’’ అంటాడు. సజావుగా జీవించలేని వ్యక్తి తన నిస్సహాయతను సహేతుకంగా నిరూపించి చచ్చిపోయే హక్కు ఉన్నదని రుజువుచేసి, మృత్యువుని ఆహ్వానించే కథ ఇది. ఇది ఎథునీసియా (కారుణ్య మరణం). దీనిని ఎవరు అంగీకరించాలి? న్యాయస్థానం. మృత్యువు వ్యక్తికున్న పవిత్రమైన హక్కు. మనం ప్రతీ రోజూ హత్యలూ, మారణహోమాలూ వింటుం టాం కానీ, నీతిపరంగా, న్యాయపరంగా మరొకరి ప్రాణం తీసే హక్కు, ధైర్యం ఎవరికుంది? కొన్ని వందల దేశాలు, కొన్ని వందలసార్లు ఈ ‘పవిత్రమైన’ చెలియకట్టను దాటే ధైర్యం చేయలేక మ«థనపడి మ«థ నపడి ఆ పనిని మానుకున్నాయి. ఒక రోగి, సంవత్సరాలుగా మంచం పట్టాడు. బాగుపడే ఆస్కారం ఏ మాత్రం లేదని వైద్య రంగం చెయ్యి ఎత్తేసింది. అతని ప్రాణాన్ని నిలపాలంటే ఆ కుటుంబానికి ఖర్చు. వారికి రోగి బాగుపడడన్న ముగింపు తెలుసు. ఇప్పుడతనికి చచ్చిపోయే హక్కు ఉందా? న్యాయస్థానం ‘మృత్యువు’కి అంగీకరిస్తుం దా? నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థ వణికిపోయింది. తను ఇవ్వలేని ప్రాణాన్ని ఏ కారణంగానయినా తుంచేసే హక్కు తనకేం ఉన్నది? 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రోగి ఊపిరి సజావుగా పీల్చగలిగితే? మానవతా విలువలు అతి క్రూరమైనవి. ‘రేపు’ మానవతా విలువలకి అందని అమూల్యమైనది. మనమెవరం మనిషి ప్రాణాన్ని హఠాత్తుగా తుంచెయ్యడానికి? నువ్వు ప్రాణాన్ని పోయగలవా? మరో క్షణం పొడిగించగలవా? ఒక్క క్షణం ఆపగలవా? నైతిక, మానవీయ, చట్టపరమైన పరిధుల్లో ఎన్నో సంవత్సరాలు న్యాయమూర్తులు ఈ ఆలోచనకే వణికిపోయారు. నిజంగా ‘స్వచ్ఛంద మరణం’ ఇచ్చే అర్హతలున్న ఎన్నో కేసులు చూసి. అర్థం చేసుకునే న్యాయమూర్తులు మూగగా ఉండిపోయారు. పాసివ్ ఎథునీసియా అంటే స్థూలంగా వైద్య సహాయానికి లొంగక, లొంగదని నిర్ధారణ అయ్యాక, ఎన్నాళ్లయినా రోగి పరిస్థితి ఇంతేనని తేల్చిన వారు తెలిసి తెలిసీ హుందాగా మరణాన్ని ఆహ్వానించడం. మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని, వాస్తవాన్ని ఎరిగి, నైతిక బాధ్యతని వహించి న్యాయస్థానం అట్లాంటి వ్యక్తులు క్రమంగా ప్రాణాన్ని కోల్పోవడానికి అనుమతిని ఇస్తుంది. ఏ విధంగానూ జీవించే అవకాశం లేని రోగిని నానాటికీ పురోగమిస్తున్న వైద్య విధానాల దృష్ట్యా జీవితాన్ని ఒక విధంగా ఆ రోగి హుందాగా మరణించే అవకాశాన్ని దోచుకోవడం అవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా రోగికి వైద్యం చేసే డాక్టర్లు రోగి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, రోగం స్థితి ఇన్నిటిని నిర్ణయించి– ముఖ్యంగా రోగి ఇష్టాయిష్టాలను ఎరిగి అప్పుడు రికమెండు చేస్తుంది. ఈ చర్యని చట్టాన్ని చెయ్యడంలో ఎక్కడ ‘మరణయాతన’ చచ్చిపోయే వ్యక్తి డిగ్నిటీని దోచుకొంటోందో వివరించింది. ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు. పాసివ్ ఇథునీసియాని అంగీకరించడం ద్వారా మనం మన చేతులోలేని, నిస్సహాయమైన, నిస్సందేహంగా పరిష్కారాన్ని– నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. అంతే. అదీ వణుకుతూనే. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి భగవంతునికి– పోనీ ఆయన లేకపోతే ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి సవినయంగా క్షమాపణని చెప్పుకుంటున్నాం. ఈ వ్యక్తికి బకుకుతాడన్న ఆశలేదు. చచ్చిపోతాడన్న రూఢి లేదు. ఎంతకాలం బతుకుతాడో, ఎలా బతుకుతాడో, అసలు బతుకుతాడో బతకడో చెప్పే మార్గం లేదు– వైద్యం చేతులెత్తేసింది కనుక. తరాలు, దశాబ్దాల తరబడి మేధావులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయనిపుణులు చర్చించి తనకి శక్తి లేని, సృష్టించడానికి శక్తి చాలని– ఆ నిస్సహాయుడికి బతికే క్రూరత్వం కంటే కన్నుమూసిన సౌలభ్యం ఒక ‘విముక్తి’ అనే భావనకి వచ్చారు. అదీ పాసివ్ ఇథునీసియా (కారుణ్య మరణం). - గొల్లపూడి మారుతీరావు -
ఎవరి వెర్రి వారికి..
జీవన కాలమ్ ఎన్నికైన రాజకీయ పార్టీలే తప్పుడు ప్రతిష్ట కోసం అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా–అంబేడ్కర్‌కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా? నాకు తెలిసి– ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాజ కీయ పార్టీ, నాయకులు ‘రంగు’ గురించి మాట్లాడిన సందర్భం తెలీదు. ఎవరైనా తోవ తప్పినప్పుడు మనకో నానుడి ఉంది: ‘ఇన్నాళ్లకి అతని అసలు రంగు బయట పడింది’ అనడం. ఇప్పుడు అక్షరాలా మన రాజకీయ నాయకుల రంగు బజారు కెక్కింది. అహంకారం, అధికారం, తప్పుడు ప్రాథ మ్యాలు తమ తమ అసలు రంగుల్ని భూతద్దంలో చూపు తున్నాయి. మా ఆవిడకి ఓ అలవాటు ఉంది. ఏదైనా ఆమెకి నచ్చనిది జరిగిందనుకోండి: ఆవిడ సమీక్ష ఆ నచ్చక పోవడం మీద ఉండదు. ‘మొన్న మీరు ఎర్రట్ట పుస్తకం ఒళ్లో పెట్టుకుని గంటలకొద్దీ చదివారు కదా? అందుకూ కడుపునొప్పి’ అంటుంది. దీనికి ఒక వివరణ ఉంది. జరిగే ప్రతీ అనర్థానికీ తనకి ‘నచ్చని’ అంశాన్ని జొర బెట్టడం ఆవిడ ప్రత్యేకత. ఇది సరిగ్గా ప్రస్తుత రాజకీయ వర్గాలకు వర్తిస్తుంది. కాంగ్రెస్ హయాంలో– దాదాపు 65 సంవత్సరాలలో ఏనాడూ– కాంగ్రెస్ చేసిన ఏ అన ర్థాన్నీ.. వారి పార్టీ– చిహ్నం కాంగ్రెస్ జెండాలోని కాషా యం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్ని ఎత్తిచూపుతూ మన మేధావులు, పాత్రికేయ మిత్రులు తప్పుపట్టలేదు. మరి ఇవాళ మంత్రిగారు తుమ్మారనుకోండి. అందులో ‘కాషాయ’ ఛాయలు కనిపిస్తాయి. రంగు పదవిలోకి వచ్చి నాలుగేళ్లయింది. కర్ణాటకలో బస్సు యాక్సిడెంట్ జరిగితే ‘ఫలానా చోట జరిగింది’ అంటారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగితే ‘యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో ఇప్పటికి 165వ యాక్సిడెంట్’ అంటారు. ఇప్పుడు ‘రంగు’ విజృంభించింది. పశ్చిమ బెంగాల్ దీదీ మమతా బెనర్జీ రెచ్చిపోయి రాష్ట్రంలో ఉన్న ప్రతీ స్కూలుకీ తెలుపు, నీలిరంగు పులమాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ఖర్చు కేవలం రూ. 500 కోట్లు. ‘ఇంత కంటే ఆ రూ. 500 కోట్లతో పిల్లల చదువులకు ఉపయోగపడే ఏ ప్రణాళికనయినా పూనుకోరాదా? అని కలర్ బ్లైండ్నెస్ ఉన్న ఒకాయన అన్నారు. అయ్యా! ఇది ముఖ్యమంత్రిగారి దూరదృష్టికి ఉదాహరణ కాదు. కాషాయం మీద వారికున్న ఏహ్యతని ప్రదర్శించుకునే అవకాశం. దానికి ఇంత ఖర్చా అని మరొక ప్రశ్న. దాని దేముంది. తమరు కోపంతో చెప్పుతో కొట్టారు. మరొ కాయన కోపంతో రత్నాల హారంతో కొట్టారు. దీదీకి వివేకానంద అంటే విముఖత ఉన్నదనీ, తత్కారణంగానే ప్రపంచ ప్రఖ్యాతిని గడించి ఎందరికో విద్యా దానం చేస్తున్న రామకృష్ణ మిషన్ రంగును కూడా మారుస్తున్నారని కొందరి విమర్శ. ఈ రంగు మార్పిడిని రామకృష్ణ మిషన్ సంస్థ వ్యతిరేకించింది. ఇప్పుడు దీదీకి నాదొక సలహా ‘అమ్మా! తమరు రామకృష్ణ మిషన్ సంస్థల రంగు మార్చకుండా ఏకంగా స్వామి వివేకా నంద ‘రంగు’నే మారిస్తే తమ అంతర్జాతీయ కీర్తి ద్విగు ణీకృతమౌతుంది. ఒక ఆర్డినెన్స్ ద్వారా స్వామి కాషాయ బట్టల రంగుని ఊదారంగుగా మార్చండి. వారి తల పాగాకు తెల్లరంగు వేయించండి. అప్పుడు చచ్చినట్టు రామకృష్ణ మిషన్ తన రంగుని మార్చుకుంటుంది. లేదా రాష్ట్రంలో ఏకంగా కాషాయ రంగుని బహిష్కరించండి’. అలాగే కేరళ ప్రభుత్వం వారిచే నెహ్రూకి ఎర్ర రంగు దుస్తుల్ని నిర్దేశించండి. రాష్ట్రంలో గవర్నమెంటు కార్యాలయాలన్నింటికీ ఎర్ర రంగును పూయించమ నండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా దేశం రంగులు మార్చుకుంటూ ఉంటుంది.ఈ మధ్యలో ఒకాయన అంబేడ్కర్ రంగు నీలి రంగుగా వక్కాణించారు. ఆ లెక్కన దేశ పిత గాంధీకి నీలిరంగు ధోవతి, గులాబీ రంగు చేతికర్రనూ నిర్దేశిం చవచ్చు. ఈ దేశంలో కళ్లముందు కనిపించే రంగు అప్పటి పాలక వ్యవస్థ అసలు రంగుని ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన చిక్కల్లా బీజేపీ నాయకుల ‘రంగు’ ఆరెస్సెస్, విశ్వ హిందూ పరిషత్ రంగూ కాషా యం కావడం. మోదీ పదవిలోకి వచ్చిన కారణానికి ఈ దేశంలో ప్రతి టీ కొట్టువాడికీ కొత్త ప్రాధాన్యం వచ్చి నట్టు– బీజేపీ ఛాయలు తమ మాతృసంస్థల రంగు అయిన కారణానికి ‘కాషాయం’ కషాయంలాగ తయా రైంది. మోదీ పదవిలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో సమూలమైన మార్పులు చేసినట్టు– కరెన్సీ రద్దులాగ రాత్రికి రాత్రి గవర్నమెంటు రంగుని మార్చేస్తే అందరికీ శ్రేయస్కరంగా ఉంటుంది. చక్కగా కాకి నలుపు రంగుని వాడమనండి. లేదా పచ్చరంగుని వాడ మనండి. ఎవరు బాబూ! తమరు ఏదో అంటున్నట్టున్నారు? ‘ఏమిటి ఈ అర్థంలేని ప్రేలాపన అనా? బాబూ! ఈ దేశంలో గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, మేధా వులైన పాత్రికేయులు ప్రణాళికలను వదిలి ‘రంగు’ బాధలు పడుతుండగా, ఎన్నికైన గొప్ప రాజకీయ పార్టీలే నేల విడిచి తప్పుడు ప్రతిష్ట కోసం అర్థంలేని, అనవసరమైన ‘రంగుల వల’లో తమ ప్రత్యేకతల్ని చాటుతుండగా– అంబేడ్కర్‌కీ, వివేకానందకీ రంగులు నిర్ణయించే నా దేశంలో ఈ మాత్రం ‘వెకిలితనా’నికి నాకు హక్కు లేదా? తమరు చిత్తగించండి. వ్యాసకర్త గొల్లపూడి మారుతీరావు సినీ విశ్లేషకులు, నటులు -
అతిలోకసుందరి అంతర్ధానం
జీవన కాలమ్ ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢ నటిగా సజావయిన పరిణామాన్ని దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –శ్రీదేవి. సినిమాల్లో పాత్ర ఇమేజ్‌ని మార్చుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు అసాధ్యం కూడా. ‘షోలే’ సినిమాలో గబ్బర్ సింగ్ పాత్రను ధరించి కొన్ని సంవత్సరాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన గొప్ప నటుడు అంజాద్ ఖాన్ తన జీవితకాలంలో ఆ ఇమేజ్‌నుంచి బయటపడలేకపోయాడు. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి పాత్ర ద్వారా దేశస్థాయిలో ప్రాముఖ్యాన్ని సాధించిన జె.వి. సోమయాజులు గారు ఇక మరే పాత్రలోను వేరేగా రాణించలేకపోయారు. కృష్ణగారి ‘అల్లూరి సీతారామ రాజు’ని చూశాక చక్రపాణి గారు.‘ఇంక ఓ సంవత్సరం పాటు నీ చిత్రాలన్నీ ప్లాఫ్ అవుతాయి’ అన్నారట. తర్వాత 20 సినిమాలు వరసగా లేచి పోయాయని కృష్టగారే మాకు చెప్పేవారు. ఇది శ్రుతి మించిన గొప్ప ప్రాచుర్యానికి పట్టే అనర్ధం. పాత్ర ఇమేజ్ ఏనాడు తలకు మించిపోరాదు. నాకూ అలాంటి గతి పట్టేదే. ‘ఇంట్లో రామయ్య–వీధిలో కృష్ణయ్య’ 500 రోజులు నడిచి సుబ్బారావు పాత్ర దుమ్ము దులిపింది. అదే ప్రమాదం. శ్రీదేవి బాలనటిగా ముద్దుగా , అమాయకంగా, అయినా చిలిపిగా ఊలుపిల్లిలాగ ఉండేది. ఆమె మీద ఆమె నటన మీద నిర్మాతల ‘విశ్వాసం’ ఎంతటిదంటే ‘బడిపంతులు’లో ఆమె మీద పూర్తి పాటనే తీశారు. ఏ పాత్రలోనయినా ఆమె పసితనం ఆమె నటనకి పెద్ద ఇన్సులేషన్. తీరా ప్రౌఢ వయస్సు వచ్చాక ఆమె కేరీర్ ఏమిటీ? సెక్స్, చిన్న వగలు, మురిపించే యవ్వనం– ఇవన్నీ హీరోయిన్ల పెట్టుబడి. హఠాత్తుగా ఈ మూసలోకి శ్రీదేవి రాగలదా? ఆ సంధి కాలంలో ఆమె మొదటిసారిగా హీరోయిన్గా చేసిన సినిమాని నేను రాశాను. శక్తి సామంత ‘అనురాగ్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. మౌసమీ చటర్జీ హీరోయిన్. ఆమెకి అది మొదటి సినిమా. ఆ పాత్రని తెలుగులో శ్రీదేవి చేసింది. సినిమా పేరు ‘అనురాగాలు’. మిత్రుడు పి.యస్.రామిరెడ్డి దర్శకుడు. శ్రీదేవి తన శరీరంలో, వయస్సులో పరిణామాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేసింది. ఆమె ప్రతిభ. కథలో పాత్ర ఆమెని కాపాడాయి. అయినా చిత్రం బాగా పోలేదు. పాత ఇమేజ్‌ని ఆమె మరిపించగలదా? నిన్నటి పసిపిల్ల నేటి ప్రౌఢ అని ఒప్పించగలదా? విచిత్రం! ఒప్పించింది. ఎబ్బెట్టుతనం లేని ఠీవయిన సౌందర్యం శ్రీదేవిది. నాటకాన్ని పండించడంలో ఏ గొప్ప నటుడితోనయినా దీటుగా నిలబడగల టైమింగ్. బాలనటి నుంచి ప్రౌఢనటిగా సజావయిన పరిణామాన్ని భారత దేశంలో చూపించిన ఒకే ఒక్క తార –నాకు తెలిసి –శ్రీదేవి. అలాంటి పని మరొక్కరే– అంతే ప్రొఫెషనల్‌గా చేశారు. ‘కళత్తూర్ కన్నమ్మ’తో కెరీర్ ప్రారంభించి ‘ విశ్వరూపం’ దాకా తనదైన జీనియస్‌ని చూపిన నటుడు కమల్‌హాసన్. మరి వీరిద్దరూ ఒకే సినిమాలో కలిస్తే? ఆ వైభవాన్ని చరితార్ధం చేసిన సందర్భం బాలూ మహేంద్ర ‘‘మూండ్రాం పిరై’’. అపూర్వం. అద్భుతం. నేను మిత్రులు కమల్‌తో ఒకసారి అన్నాను: ‘‘మీరు ఆ సినిమాలో చూపిన వైదుష్యం ఏ సినిమాలో ఏ పాత్రలోనయినా అవలీలగా చూపగలరు. ఇది హీరో ప్రాధాన్య ప్రపంచం కనుక. కాని హీరోయిన్‌కి అంత రేంజ్ ఉన్న పాత్ర దొరకదు. ఆమె నటన నభూతో నభవిష్యతి. నేనయితే మీకు జాతీయ ఉత్తమ నటుడి బహుమతి ఇవ్వను. ఆమెకి జాతీయ బహుమతి – రెండు సార్లు ఇస్తానని.’’ మేమిద్దరం తక్కువ సినిమాల్లో కలిసి నటించాం. కాని మంచి జ్ఞాపకం– ‘త్రిశూలం’లో నా కూతురు. ఎదురెదురుగా నిలిచి counter shot చేస్తున్నప్పుడు – ‘మీరు బాగున్నారా?’ అనే వాక్యాన్ని పదిమంది నటీమణులు పది రకాలుగా చెప్తారు. ఆమె తప్పనిసరిగా పదకొండో రకంగా చెబుతుంది. ఇంతకంటే రాతలో ఈ విషయాన్ని నిరూపించలేను. ‘త్రిశూలం’లో ఒక సీను గొప్పది. ఈ సీనుని కోరి రాఘవేంద్రరావు నాచేత రాయించారు. రాధిక మా యింట్లో పనిమనిషి. అవసరానికి డబ్బుకోసం వస్తుంది. ధాన్యం గోదాంకి రమ్మన్నాడు హిట్లర్ రాఘవయ్య. తను వచ్చాడు. ఆమెను పట్టుకోబోగా తప్పించుకుని గోదాంలోకి పారిపోయింది. ఇచ్చకాలు చెప్పి పైకి రమ్మని చెయ్యి జాచాడు. ఆడపిల్ల చెయ్యి అందింది. లాగాడు. తన ముందుకు కూతురు శ్రీదేవి వచ్చింది. బిక్కచచ్చిపోయాడు. అప్పుడు డైలాగు– శ్రీదేవిది–:‘‘ఏం నాన్నా! నేనూ యాదీ (రాధిక) చిన్నప్పట్నుంచి నీ కళ్ల ముందే పెరిగాం. యాదిలో నువ్వు కేవలం ఆడదాన్ని చూడగలిగితే నేనూ ఆడదాన్నే కద నాన్నా?’’ ఆ డైలాగు అనితరసాధ్యంగా చెప్పింది శ్రీదేవి. రాఘవేంద్రరావు, విన్సెంట్వంటి మంత్రగాళ్లుండగా ఎవరయినా అలవోకగా ‘ అతిలోక సుందరి’ పాత్రని చెయ్యగలరు. కాని ‘మూండ్రా పిరై’ శ్రీదేవి ఒక్కరే చెయ్యగలరు. ఇక డాన్స్ టైమింగ్. పరాకాష్ట ‘మిష్టర్ ఇండియాలో’ ‘హవా హవాయీ’ పాట. దయచేసి ఈ దృష్టితో మరొ కసారి చూడండి. మంచి వంకాయకూర అతిథిగా తినడం వేరు. వంటవాడుగా తినడం వేరు. ఒక్కసారి వంటవాడు కాండి. శ్రీదేవి ఈ తరం ప్రతిభకు పరాకాష్ట. "last word. she is the ultimate complete artist'' గొల్లపూడి మారుతిరావు -
ఆనందానికి ఆవలి గట్టు
ఆనందం ఒక దృక్పథం. అది సంస్కృతి, సంస్కారమూ, స్వభా వమూ కలిసి ప్రసాదించే వారసత్వం. చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. మా ఇంట్లో ఓ వంట మనిషి పని చేస్తోంది. 50 సంవత్సరాలు. లోగడ ప్రముఖ సంగీత దర్శకులు కేవీ మహదేవన్ ఇంట్లో పని చేసేది. ఆమె భర్తకి అనారోగ్యం. పని చెయ్యలేడు. ఇద్దరు ఆడపిల్లలు. మా ఇంటి దగ్గర్నుంచి లోకల్ ట్రైన్లో నాలుగు స్టేషన్లు ప్రయాణం చేసి, పార్కు స్టేషన్ నుంచి 14 స్టేషన్లు దాటి ఇల్లు చేరుతుంది. ఇది గత 14 సంవత్సరాలుగా ఆమె దైనందిన జీవితం. ఎప్పుడైనా అడుగుతాను ‘ఇంత శ్రమ ఇబ్బంది కాదా?’ అని. ఆమె సమాధానం ‘అనుకుంటే ఎలాగ సార్! ఇల్లు గడవాలి. పిల్లల్ని పెంచాలి’. ఆమె జీవితం ఆనందంగానే ఉంది. కారణం. ఆమె తన జీవిత లక్ష్యాన్ని తన పరి స్థితులకు కుదించుకుంది. 25 ఏళ్ల అమ్మాయి. పుట్టు గుడ్డి. పేరు వినూ. చిన్నప్పటినుంచీ జీవితంలో ఏనాటికయినా సివిల్ సర్వీసు చెయ్యాలని కలలుగన్నది. ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటి అంధురాలిగా ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసరుగా సెలెక్టయింది. గుడ్డి, మూగ, చెముడు ఉన్న ఒక మహాద్భుతం– హెలెన్ కెల్లర్ని ఆమె ఉదహరించింది. ‘జీవితంలో నేను అన్నీ చేయలేకపోవచ్చు. కానీ కొన్నయినా చెయ్య గలను’. వీరందరూ జీవితాన్ని మెడబట్టుకు లొంగదీసి విజయాన్ని పరమావధిగా చేసుకుని ఆనం దంగా ఉన్న జీవులు. వీరి జీవన రహస్యం స్వధర్మాన్ని గర్వంగా, చిత్తశుద్ధితో నిర్వహించడం. ఈ దేశంలో చాలామందికి ‘స్వధర్మం’ అంటే బూతు మాట. ఇందులో మతం ఉందా? దేవుడు ఉన్నాడా? బీజేపీ ఉందా? ఆర్.ఎస్.ఎస్. ఉందా? ‘స్వధర్మం’ అంటే నీ విధిని నీ ఆశయం మేరకి, శ్రద్ధగా నిర్వహించడం. అదీ– అదే– అంతే– ఆనందానికి దగ్గర తోవ. అమెరికాలో యేల్ విశ్వవిద్యాలయంలో ఆనందంగా జీవించడానికి కొత్త కోర్సుని ప్రారంభించారు. దాదాపు అన్ని డిపార్టుమెంటుల విద్యార్థులూ అటువేపు దూకారు. ప్రస్తుతం 1,182 మంది మేధావులయిన విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఈ కోర్సు ఏం నేర్పుతుంది?మనిషి సంతోషంగా ఉండటం ఎలాగో నేర్పుతుంది. మనకి నవ్వొస్తుంది– ‘ఇది ఒకరు నేర్పాల్సిన విషయమా?’ అని. హైందవ జీవన విధానంలోనే ఈ ‘అర’ ఉంది. మన ఖర్మ. మనం మనకి అక్కరలేని వేలంటైన్ డేలను దిగుమతి చేసుకుంటున్నాం. జనవరి 1న బారుల్లో తాగి తందనాలాడడాన్ని గొప్ప వినోదంగా నెత్తిన వేసు కుంటున్నాం. తల్లిదండ్రుల్ని అనాధ శరణాలయాలకి అప్పగించి మరిచిపోవడాన్ని అలవాటు చేసుకుంటున్నాం. మనం ఉగాదులు మరిచిపోయాం. సంక్రాంతి సంబరా లంటే చాలామందికి తెలీదు. మా తరంలో ఏ కుర్రాడూ ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వినలేదు. గురువుని సాక్షాత్తూ దేవుడన్నాం. ఇప్పుడు ఓ కుర్రాడు తనని అది లించిన కారణానికి టీచర్నే కాల్చి చంపాడు. ఆత్మహత్యలు చేసుకునే అమ్మాయిలూ, చదువుకొని అటకెక్కించి రాజ కీయాలలో రొమ్ము విరుచుకునే ప్రబుద్ధులూ. ఇవి విదేశీ యుల దరిద్రాలు. మనం కనీవినీ ఎరుగని అరాచకాలు. మనలో ఇప్పటికీ సత్య నాదెళ్లలూ, పుట్టుగుడ్డి వినూలు ఉన్నారు. సరైన దృక్పథాన్ని ఏర్పరచుకుంటే మనకి యేల్ విశ్వవిద్యాలయం కోర్సులు అక్కరలేదు. ప్రపంచంలో ఏ సంస్కృతీ ‘సర్వేజనా స్సుఖినోభవంతు’ అనలేదు. ఓ మామూలు నేలబారు మనిషి ఆ మాట అని ఏం సాధిస్తాడు? బాబూ! అతను జనులందరినీ ఉద్ధరించలేకపోవచ్చు. కానీ అందరూ సుఖంగా ఉండాలన్న పాజిటివ్ ఆలోచన మొదట అతన్ని సుఖంగా ఉంచుతుంది. ఈ ఆశంస సమాజానికి కానక్కరలేదు. అది తన సంకల్పాన్ని ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచే Subjective తావీజు. భగవద్గీతని మనం తప్ప చాలా దేశాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నాయి. అది దేవుడి పుస్తకం కాదు. ఆ రోజుల్లో దేవుడి రేపరు చుట్టి మన ‘జీవన విధానాన్ని’ సూచించే వాచకం. ఇందులో సూచించినవన్నీ చేయగలవాడు మహాత్ముడు. ఏ ఒక్కటయినా చేయగలిగినవాడు నిత్య సంతోషి. ఏమిటా పనులు? అందరిపట్లా స్నేహ భావన, మిత్రత్వం, కరుణ, దేనిమీదా మమకారం లేకపోవడం, అహం కారాన్ని విడిచిపెట్టడం, సుఖాన్నీ, దుఃఖాన్నీ ఒకేలాగ చూడటం, ఓర్పు, సంతుష్టి కలవాడు (ఉదా: మా వంట మనిషి), దృఢ నిశ్చయం కలవాడు (వినూ అనే పుట్టు గుడ్డి)– ఇది నమూనా జాబితా (భగ. 12 అ.శ్లో. 13–14). ఇందులో మతమూ, శ్రీకృష్ణుడూ, హిందుత్వం లేదు. యేల్ విశ్వవిద్యాలయం కోర్సు వారి దురదృష్టం. కనీసం వారు పోగొట్టుకున్నదేమిటో సంపాదించుకోవాలని తంటాలు పడుతున్నారు. వాళ్లు వదులుకోలేక ఇబ్బంది పడుతున్న వికా రాల్ని దిగుమతి చేసుకుని మన విలువైన ఆస్తుల్ని చంపుకుంటున్నాం. ఆనందం ఒక దృక్పథం. Happiness is an attitude ఒక మానసిక స్థితి. అది బయటినుంచి రాదు. సంస్కృతి, సంస్కారమూ, స్వభావమూ కలిసి ప్రసాదించే వారసత్వం. అది చదువుకుంటే వచ్చేది కాదు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన, పవిత్రమైన నేలలో కన్ను విప్పే పుష్పం. అదీ ఆనందం. - గొల్లపూడి మారుతీరావు -
ఒక అద్భుత చరిత్ర
వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడితనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడుతోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. ఉన్నట్టుండి రాత్రి 11 గంట లకి తుళ్లిపడి లేచాడు. ఇక నిద్ర పట్టలేదు. మర్నాడు సాయంకాలం ఫైనల్ మ్యాచ్. ఇది తన జీవితంలో 30వ పోటీ. ఏం జరుగుతుంది? ఇదీ ఫెదరర్ మనస్సుని ఆవరించుకున్న ఆలోచన. గెలిస్తే చరిత్ర. ఓడి పోతే? అది మరొక రకమైన చరిత్ర. అయినా మనసు ఓటమిని అంగీకరించడం లేదు. ఇప్పటికే పోటీ నుంచి నాదల్, జకోవిచ్, ఆండీ ముర్రే (అందరూ ముప్పయ్యో పడిలోనున్న ఆటగాళ్లు) వైదొలిగారు. ఫెదరర్ వారసుడనిపించదగ్గ అలెగ్జాండర్ జ్వరేవ్ (20 ఏళ్లవాడు) ఓడిపోయినప్పుడు ఫెదరర్ ఓ మాట అన్నాడు. ‘‘ప్రపంచ కప్పుమీదే దృష్టి పెట్టుకోవడం ఆటలో ఏకాగ్రతని బలి తీసుకుంటుంది’’ అని. ఇప్పుడు తను అదే చేస్తున్నాడా? ఒకరికి హితవు చెప్పడం సులువు. మర్నాటి సాయంకాలం ఒక జీవిత కాలం దూరంగా ఉన్నట్టనిపించింది. ఉదయం అయితే లేచినప్పటినుంచీ ఆటకి సిద్ధమయ్యే వ్యాపకం ఉంటుంది. ఇప్పుడు రోజంతా ఏం చేయాలి? ఎప్పుడో తెల్లవారుఝామున 3 గంటలకి చిన్న కునుకు పట్టింది. ఇలాంటి సందర్భాలు ఫెదరర్ జీవితంలో ఎన్నో ఉన్నాయి. కానీ ఇది మరీ ప్రముఖమైనది. కారణం ఇరవయ్యో చాంపియన్షిప్పే ప్రపంచ చరిత్ర. ఫెదరర్ వయస్సు 36 సంవత్సరాల 173 రోజులు. ఇప్పుడు ఎదురు నిలిచిన ప్రత్యర్థి చిలిచ్ వయస్సు 29. 2003 నుంచి 2008 మధ్య ఫెదరర్ 13 చాంపియన్షిప్పులు గెలుచుకున్నాడు. తర్వాతి ఏడేళ్లలో కేవలం నాలుగే, వయసు లుప్తమవుతున్న శక్తిని గుర్తుచేస్తోంది. 2004 నుంచీ తనతో పోటీ చేసినవారు దాదాపు అందరూ రిటైరయిపోయారు. ఇప్పుడు గెలిస్తే ఫెదరర్ ఒక తరానికి మకుటంలేని మహారాజవుతాడు. ఈ విచికిత్సని 16 గంటలు భరించాడు. ఆ సాయంకాలం టెన్నిస్ కోర్టులో జరిగిన ఆట మహాకావ్యం. గెలవాలన్న ముందుతరంతో ఓటమిని ఎదిరించే పాత తరం పోటీ పడుతోంది. కానీ వయసు శరీరానిది కాదు. ఆ స్థాయిలో ఆలోచనది. నాలుగో సెట్లో ఫెదరర్ బ్యాక్ హ్యాండ్ వాలీలు కేవలం చిత్ర కారుడి ఆయిల్ పెయింటింగ్‌లు. గెలిచిన క్షణంలో ప్రతీ చాంపియన్ కన్నీటి పర్యంతం అవుతాడు. కానీ ఫెదరర్ ‘ప్రతీ’ చాంపియన్ కాడు. ఈ తరంలో 20వ సారి చాంపియన్ షిప్ గెలుచు కున్న ఒకే ఒక పురుష క్రీడాకారుడు. 36 సంవత్సరాల వయసున్న ఆటగాళ్లలో రెండవవాడు. 1972లో ఆస్ట్రే లియా ఓపెన్ గెలుచుకున్న కెన్ రోజ్వాల్కి 36 సంవ త్సరాల 93 రోజులు. మా అబ్బాయి నన్ను వెక్కిరించాడు. ‘ఎందుకీ కాలమ్?’ అని. తెలుగుదేశంలో ఎంతమందికి టెన్నిస్ ఆట మీద ఆసక్తి ఉంటుంది? అంటాడు. 2004 నుంచీ– అంటే తన 23వ ఏటినుంచీ ప్రపంచంలో జయించడాన్ని వ్యసనం చేసుకున్న ఆటగాడు ఫెదరర్. అడ్డమయిన కారణాలకీ బస్సులు తగలెట్టి, స్కూళ్లలో టీచర్లనే కాల్చి చంపే కుర్రకారుకి, మొహాలకి ముసుగులు వేసుకుని సైనికులను కాల్చే యువతరం పెచ్చు రేగుతున్న తరానికి ఫెదరర్ ఏ మాత్రమయినా స్ఫూర్తిని ఇవ్వగలి గితే– ఒక వ్యక్తిలో చిత్తశుద్ధి, ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఏ స్థాయిలో మనిషిని నిలపగలవో ఎవరయినా గుర్తించగ లిగితే, ఫెదరర్ ఎవరో, అతను ఆడే ఆట గొప్పతనం ఏమిటో తెలియకపోయినా ఫరవాలేదు. గొప్పతనానికి చిరునామా లేదు. తెంపరితనానికి ఉంది. ఆచరణ ఆవ గింజ, ఆదర్శం ఆకాశం. ప్రపంచకప్పు 20వ సారి పట్టుకుని ఆవేశంతో ఏడ్చాడు ఫెదరర్. ‘నేనే నమ్మలేకపోతున్నాను. బొత్తిగా ఇది కాశీమజిలీ కథ’ అన్నాడు. చూస్తున్న లక్షలాది ప్రజా నీకమూ, ఆ మాటకి వస్తే ప్రపంచమంతా అదే అను కున్నారు. ‘ఇది అపూర్వకమైన కాశీమజిలీ కథ’. వయసు మీద పడుతున్న చాంపియన్‌లో ‘వాడి తనం’ మందగించింది. కానీ వేడితనం ఇంకా తిరగబడు తోంది. పోటీల పద్ధతులు మారి, చేతిలో రాకెట్లు మారి, కాలం మారినా మనసులో ఉద్ధతి మారలేదు. గెలవా లన్న ‘నిప్పు’ రగులుతూనే ఉంది. అంతే. ఆ క్షణంలో కాలం ఘనీభవించింది. తన ఆలోచనల్లోంచి వయసుని అతి క్రూరంగా గెంటేశాడు. ప్రీతీ రామమూర్తి అనే పాత్రికేయురాలు తన్మయ త్వంతో కేవలం కవిత్వాన్ని చెప్పింది. ‘‘ఇవాళ ప్రేక్షకుల ముందు ఫెదరర్ ప్రదర్శన లక్ష సందర్భాలలో ఒకటి కావచ్చు. కానీ It represents a sense of life. ఈ విజ యం అతనికి అవసరం లేకపోవచ్చు. కానీ ఇందులో అమలిన తన్మయత్వం ఉంది. తొందరపాటు లేదు. ఓ స్థితప్రజ్ఞుడి విన్యాసం ఉంది. ఫెదరర్ తనని తాను నిలదొక్కుకుని కాలాన్ని మెడబట్టుకుని లొంగదీసుకుని తనతో కూచిపూడి నృత్యం చేయించే విలాసం ఉంది’’. రెండు వాక్యాలయినా ఇంగ్లీషులో చెప్పాలని నా కక్కుర్తి. It is no longer a cliched religious experien ce... Of late, it appears that Federer has managed to take control, grabbing TIME by its shoulder and making it dance a slow waltz with him. - గొల్లపూడి మారుతీరావు -
రచ్చకెక్కిన ‘రచ్చబండ’
జీవన కాలమ్ చీఫ్ జస్టిస్ స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించలేదని అనుకున్నప్పటికీ... దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజారు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. బీచిలో ఓ అమ్మాయి ఎప్పుడూ కనిపిస్తూంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్యం చక్కగా పెళ్లి చేసుకుని భర్తకి వండిపెడుతూ సుఖంగా గడపాలని. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయింది. లక్షణంగా తాళిబొట్టుతో, పసుపుతాడుతో, భర్తతో కనిపించింది. ఆమె కల సాకా రమౌతున్నందుకు ఆనందం కలిగింది. కొన్ని నెలలు గడిచాయి. భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు ప్రారంభమయ్యాయి. భర్తమీద కారాలూ, మిరియాలూ నూరింది. నేను ఆమె పాత కలని గుర్తు చేసి, కాస్త సంయమనాన్ని పాటించమని హితవు చెప్ప బోయాను. భర్త అనుచిత ప్రవర్తనను ఏకరువుపెట్టి– హితవు చెప్పిన నామీదే కోపం తెచ్చుకుని వెళ్లి పోయింది. దరిమిలాను భార్యాభర్తల మధ్య ‘వార’ పెరి గింది. ఇప్పుడు పోలీసు డిపా ర్టుమెంటులో పనిచేస్తున్న ఆమె తండ్రి అల్లుడిని రెండు రోజులు జైల్లో పెట్టించాడు. ముందు ముందు సామరస్యం కుదిరే అవకాశాన్ని ఆ విధంగా శాశ్వ తంగా మూసేశాడు. ఆమె కలలు గన్న వ్యవస్థ– ఆమె తండ్రి సహాయంతో పూర్తిగా కూలి పోయింది. కాళ్లు కడిగి కన్యా దానం చేసిన మామ తన అల్లు డిని జైలుకి పంపితే ఆ అల్లుడు ఇక ఏ విధంగానూ జైలు శిక్షని మరిచిపోయి– ఆమెని జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకోను. వ్యవస్థను గౌరవించే గాంభీర్యం, పెద్ద రికాన్ని పెద్దలే వదులుకున్నప్పుడు– ఆ వ్యవస్థ ‘పెద్ద రికానికి’ మాలిన్యం అంటుతుంది. ఈ కథకీ మొన్న నలుగురు మేధావులయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు– పత్రికల ముందుకు రావడానికీ పోలికలున్నాయని నాకనిపిస్తుంది. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా అత్యున్నత న్యాయ వ్యవస్థగా నిలిచిన ప్రధాన న్యాయస్థానంలోని ‘అభి ప్రాయ భేదాలు’ ఒక్కసారి ప్రజల మధ్యకి రావడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దేశంలో న్యాయాధిపతులే అరిగించుకోలేకపోతున్నారు. ‘‘సుప్రీంకోర్టు పరిపాలనా సరళిని ఏ విధంగా పత్రికా సమావేశం సంస్కరిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ చేసి– సుప్రీంకోర్టు నిర్వహణ సరిౖయెనదో కాదో ప్రజలు నిర్ణయించాలని ఈ సమావేశం ఉద్దేశమా?’’ అని జస్టిస్ శోధీ అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ‘‘ఈ నలుగురి పెద్దల ఉద్దేశం ఏమిటి? ప్రజల్ని ఈ అవ్య వస్థలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పాలనా? సవరణ జరపాలనా? సలహాలివ్వాలనా? ప్రధాన న్యాయ మూర్తిని బోనులో నిలబెట్టాలనా?’’ సోలీ సొరాబ్జీ, కె.టి.ఎస్. తులసి, జస్టిస్ ముకుల్ ముద్గల్ వంటివారు షాక్ అవడమే కాకుండా చాలా బాధపడ్డారు. ఒక ప్రముఖ పత్రిక– ఈ పత్రికా సమావేశం భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలోని అత్యంత ప్రముఖమైన కేసులన్నీ యాదృ చ్ఛికంగానో, కాకతాళీయంగానో జూనియర్ బెంచిలకే వెళ్లాయని ఇదే పత్రిక పతాక శీర్షికలో మరునాడు పూర్తి వివరాలతో పేర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో తమ విధులను నిర్వహిస్తున్న ఈ గౌరవ న్యాయమూర్తులకు పత్రికలకు తెలిసేపాటి నిజానిజాలు తెలియవా? తెలిస్తే రచ్చకెక్కడానికి ఇప్పు డెందుకు ముహూర్తం పెట్టినట్టు? ఇందులో వృత్తిప రమైన, రాజకీయ పరమైన కోణాలేమైనా ఉన్నాయా? ఒకానొక రాజకీయ నాయకుడు ఒకానొక న్యాయ మూర్తి తలుపు తట్టడం వెనుక ఈ ఛాయలు తెలు స్తున్నాయా? ఇవీ ప్రశ్నలు. లేని తీగెని లాగి ఓ గొప్ప వ్యవస్థని ‘డొంక’గా రూప కల్పన చేసిన దయనీయమైన పరిస్థితిగా దీనిని భావించాలా? అని మేధావి వర్గాలు బుగ్గలు నొక్కుకుంటు న్నాయి. అయితే– ప్రధాన న్యాయ మూర్తి స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించనప్పుడు, జరుగుతు న్నది సబబు కాదని మేధావులైన న్యాయమూర్తులు భావిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా చేయ లేకపోయినా దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, నిర్ణయాలకు భేషరతుగా తలవొంచే, మార్గదర్శకత్వా నికి ఎదురుచూసే– ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజా రు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. ఇలా రచ్చకెక్కడంవల్ల దేశంలో అడ్డమైనవారూ (వారిలో నేనూ ఉన్నాను)– రాజకీయ పార్టీలు సరేసరి – నోరు పారేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవు తుందని సంతోష్ హెగ్డే అన్నారు. ప్రతీ దిన పత్రికలోనూ సంపాదకునికి లేఖలు కోకొల్లలు. ఈ సంక్షోభాన్ని ఎవరి అవసరాలకు వారు అన్వయించు కుంటున్నారు. సంయమనం, మేధస్సు, విచక్షణ, అపూర్వమైన గాంభీర్యమూ చూపే వ్యవస్థ– అలక, కించిత్తు అస హనమూ, కోపమూ– చూపనక్కరలేని, చూపినా ఉప యోగం లేని, చూపకూడని స్థితిలో రచ్చకెక్కడం– తొందరపాటుతో ఒకటి రెండు మెట్లు దిగి వచ్చిందని, ఆ మేరకు ‘వ్యవస్థ’ పరపతి– దిగజారిందని భావిం చడంలో ఆశ్చర్యం లేదు. -గొల్లపూడి మారుతీరావు -
‘ఇచ్చాపురపు’ జ్ఞాపకాలు
జీవన కాలమ్ ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపా యలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావుగారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. ఒక వయసు దాటాక మనిషి చిరాయువుగా ఉండటానికి కారణం శరీర ఆరోగ్యం కాదు. మానసిక ఆరోగ్యం. దానిని పుష్కలంగా పెంచుకుని జీవి తాన్ని కళగా జీవించిన అరు దైన మిత్రులు ఇచ్చాపురపు జగన్నాథరావు. కొందరు ఉన్న చోట ఉత్తుంగ తరంగంలాగ లేచి పడుతూంటారు. మరికొందరు ప్రశాంతమైన సరో వరంలాగ హాయిగా, గర్వంగా, తృప్తిగా, హుందాగా జీవిస్తారు. అలా ఆఖరి క్షణం వరకూ జీవించిన గొప్ప కళాత్మకమైన దృష్టి, దృక్పథమూ కలవారు జగన్నాథ రావు. ఆయన నోటి వెంట ఏనాడూ ‘నెగటివ్’ ఆలోచన రావడం ఎరుగను. జీవించడంలో నిర్దిష్టమైన స్పష్టత, ఆలోచనలో అతి నిలకడైన దృక్పథమూ కల ఆఫీసరు రావుగారు. ‘ఆఫీసరు’ని ముందు నిలపడానికి కారణం శషబిషలు లేని ఆలోచనా సరళి. ఒకసారి నాతో అన్నారు: ‘‘మారుతీరావుగారూ! మనం పోయాక మన పిల్లలు పది రోజులు బాధపడతారు. మన మీద ప్రేమ ఉంటే పది నెలలు బాధపడతారు. ఎల్లకాలం బాధ పడాలని మనం కోరుకోకూడదు. అది వారికే మంచిది కాదు. జీవితం సాగాలి. అలా సాగుతూనే ఉండాలి’’. నాకు అతి తరచుగా జోకులు, అందమైన, ఆలోచ నాత్మకమైన కథలు కంప్యూటర్లో పంపే వ్యక్తి రావు గారు. ఎప్పుడూ ‘హాస్యం’ వాటి ప్రధాన అంశం. సరిగ్గా ఆయన వెళ్లిపోవడానికి మూడు రోజుల కిందట జోక్ పంపారు. మొదటి వాక్యం చెప్పాలి: ‘‘నువ్వు రోజూ వ్యాయామం చెయ్యడంవల్ల లాభం– ఆరోగ్యంగా వెళ్లి పోవడానికి దగ్గర తోవ’’. తెల్లబట్టలు వేసుకుని, సూర్యోదయాన్ని చూస్తూ, వేడి కాఫీ తాగుతున్నంత హాయిగా ఉంటాయి ఆయన రచనలు. దేశ అభ్యుదయం, విప్లవం, తిరుగుబాటు– ఇలాంటి మాటలు తెలుగులో ఉన్నాయని కూడా ఆయ నకి తెలీదేమో. దాదాపు 28 సంవత్సరాల కిందట ఆయన చెన్నైలో కస్టమ్స్ కలెక్టరు. ఆయన చేత చాలా నాటికలు రాయించిన తృప్తి నాది. ఓసారి కథ రాయమని ఫోన్ చేశాను. ‘ఈ ఉద్యోగ రద్దీలో ఇతివృత్తం మనసులో లేదండీ’ అన్నారు. ‘మీ ముందు టేబిలు మీద ఏమేం ఉన్నాయి?’ అని అడిగాను. ఫైళ్లు, టెలిఫోన్, పిన్ కుషన్– ఇలా చెప్పారు. ‘గుండుసూది’ మీద కథ రాయ మన్నాను. ఆ కథ చాలా గొప్పది. ఏళ్ల తర్వాత విహారి ఆ కథని మెచ్చుకున్నారట. చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈమెయిల్ పంపారు. ఆఖరి వాక్యాలివి. I recall your inspiration which resulted in a story which was bigger than me. If someone raves about a story a quarter of a century later, there must be something in it. Ego? No. I feel humbled.కృతజ్ఞత చాలా అరుదైన లక్షణం. స్వామిభక్తి, కృతజ్ఞతని– సగం మనిషి, సగం జంతువు ద్వారా మనకి నేర్పాడు వాల్మీకి– రామాయణంలో. (క్షమించాలి. నేను హనుమంతుడనే పాత్ర గురించి మాట్లాడుతున్నాను. పురాణాన్ని కించపరచడం లేదు. తీరా నా పేరూ అదే!) ఒక్క సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచు రించిన ‘సురభి’ మాస పత్రికలో నా ఒత్తిడి మేరకి ‘తగిన మందు’ అనే కథ రాశారు. తర్వాత ఏదైనా రాశారేమో నాకు తెలీదు. నా అభిమాన రచన వారి నవలిక ‘గులా బిముళ్లు’. దాన్ని ‘చేదు నిజం’ అనే పేరిట గంట నాట కంగా రేడియోలో ప్రసారం చేశాను. ఏదైనా సభల్లో మాట్లాడే విషయం కుదరనప్పుడు ఆ కథని అనర్గళంగా చెప్పి, ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసి, కొసమెరుపుగా ‘ఇది ఇచ్చాపురపు జగన్నాథరావుగారి రచన’ అని చెప్పడం రివాజు. ఆయనలో గర్వంగా రాణించే ‘తృప్తి’ గొప్ప లక్షణం. ‘ఈ పని చేస్తే మీకు కోటి రూపాయలు వస్తుంది రావుగారూ!’ అంటే ‘వద్దు మారుతీరావు గారూ. సుఖంగా ఉన్నాను. మనకి రెండు సిగరెట్లూ, పగలు ఒక భోజనం, రాత్రి ఒక ఫలహారం చాలు’ అంటారు. రావుగారు ఆయన షరతుల మీదే హాయిగా జీవిం చారు. ఆయన షరతులమీదే రచనలు చేశారు. 13వ తేదీ సాయంకాలం ఏడున్నరకి ఓ మంచి జోక్‌ని మా అంద రికీ పంపడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నారు. 7.45కి తల వెనక్కు వేలాడిపోయింది. గుండెపోటు. తన షరతుల మీదే నిష్క్రమించారు. రావుగారు నిగర్వి. కానీ జీవించడంలో తన పరిధుల్ని ఎరిగి, ఆ చట్రం మధ్య అందమైన ముగ్గులాగ జీవితాన్ని పరుచుకుని ప్రశాం తంగా జీవించిన వ్యక్తి. ఆగస్టు 8న ఆ దంపతులని చూడటానికి వెళ్లాను. వృద్ధాప్యం ముసురుకున్న జీవితాల్ని డిగ్నిఫైడ్‌గా అలం కరించుకోవడం చూశాను. బయలుదేరుతూంటే దంప తులు గుమ్మందాకా వచ్చారు. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి నట్టు– ‘మీ ఇద్దరి ఫొటో తీసుకుంటాను’ అన్నాను. ఇద్దరూ ఏక కంఠంతో అన్నారు. ‘ఈమాటు వచ్చిన ప్పుడు తీసుకుందాం’ అని. మరో అవకాశం లేదని ఆనాడు తెలియదు. ఆనాడు తీసుకోని ఫొటో ఒక జీవితకాలం ఆలశ్యం అయి పోయింది. వ్యాసకర్త ప్రముఖ సినీ రచయత గొల్లపూడి మారుతీరావు -
పద్మావతి
దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులు పడుతుంటే ఆనందించటం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, నెచ్చెలి, భర్త– ఇలా ఎన్నో విధాలుగా మనం సినిమాల్లో పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఇటీవల ‘పద్మావతి’ చిత్రం మీద చెలరేగిన వివాదం విచిత్రమైనది, విభిన్నమైనది, విలక్షణమైనది, వికారమైనది. పాపం, దర్శక నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీగారు 1540లో–అంటే దాదాపు 500 సంవత్సరాల కిందట సూఫీ కవి మాలిక్ మహ్మద్ జయసీ అనే ఆయన రాసిన ఒక పద్యాన్ని ఆధారం చేసుకుని క«థని అల్లుకున్నానని ఇల్లెక్కి కేకలు వేస్తున్నాడు. అయితే పాత్రలు చరిత్రకు సంబంధించినవి. కథనం– కల్పితం. మన సినీమాల్లో ఇలాంటి కల్పితాలు కోకొల్లలు. మాయాబజారు, గయోపాఖ్యానం, కృష్ణార్జున యుద్ధం, రామాంజనేయ యుద్ధం, నారద నారది– ఇలాగ. అయితే ‘పద్మావతి’ పాత్ర గౌరవాన్ని మంటగలిపితే రాజపుత్రుల గౌరవ మర్యాదలు మంట గలుస్తాయని కర్ణీసేన అనే ఒక ప్రైవేటు రాజపుత్ర సేన కత్తిగట్టింది. అల్లావుద్దిన్ ఖిల్జీ అనే ఢిల్లీ చక్రవర్తి – మహర్వాల్ రతన్ సింగ్ అనే రాజుగారి భార్య గొప్ప అందగత్తె అని విని ఆమెను చూడాలని పట్టుబట్టాడు. పరాయి పురు షుని ముందు నిలవడం రాజపుత్ర స్త్రీలకు నిషిద్ధం. కాని బలవంతుడయిన ఖిల్జీ కోరికకు ఎదురు చెప్పలేక రతన్ సింగ్ ఒక మార్గాంతరాన్ని ఆశ్రయించారు. అంతఃపు రంలో ఆమె ముఖాన్ని ఒక అద్దంలో ఖిల్జీ చూసేటట్టు చేశారని కథ. చిత్తూరు దుర్గంలో ఈ కథకు బాసటగా ఏర్పాటు చేసిన అద్దాలను 50 ఏళ్ల కిందట ఉద్యమకా రులు బద్దలుకొట్టారు. ఇప్పుడు–అంటే జనవరి 2017లో ‘పద్మావతి’ సెట్టుని కర్ణీ సేన ధ్వంసం చేసి, దర్శకుడు భన్సాలీని చావగొట్టింది. ఆ పాత్రలో నటించిన దీపిక పదుకునే ముక్కునే కోసేస్తా మని హెచ్చరిక చేసింది. ఒకాయన సంజయ్‌లీలా భన్సాలీ తలని తెస్తే 10 కోట్లు ఇస్తానని ప్రకటించారు. రాజ పుత్రుల పరువు మర్యాదలు మంటగలవడం ఇష్టంలేని ఒకాయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన శవాన్ని ఈ సేన నెత్తిన పెట్టుకుని ఊరేగించింది. తీరా సుప్రీంకోర్టుకి ఈ చిత్రాన్ని బహిష్కరించ మని అర్జీ పెట్టగా–చిత్రం మంచి చెడ్డల్ని సెన్సారు వారు నిర్ణయిస్తారని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ లోగా చిత్రాన్ని లండన్‌లో ప్రదర్శనకి లండన్ సెన్సారు వారికి దరఖాస్తు చెయ్యగా ‘మాదేశంలో య«థాతథంగా ప్రద ర్శించడానికి ఎట్టి అభ్యంతరము లేద’ని ఇంగ్లండ్ సెన్సారు వారు సర్టిఫికెట్ ఇచ్చారు. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు తమ తమ రాష్ట్రాలలో ఈ చిత్ర ప్రదర్శనను బహిష్కరించాయి. ఇంతకీ అసలు విషయం– ఈ కర్ణీ సేన కానీ, ఈ ప్రభుత్వ నాయకులు కానీ ఈ చిత్రాన్ని చూడలేదు. ప్రభుత్వాల భయమల్లా తమ రాష్ట్రంలో ఈ చిత్రం కారణంగా అల్లర్లు జరగకూడదని. సబబైన న్యాయానికి నిలబడవల్సిన ప్రభుత్వాలు చేయవలసిన పని ఇది కాదు కదా. ఇందులో చిత్ర నిర్మాణ స్వాతంత్య్రం, ‘బాజీరావు మస్తానీ’ వంటి ముందు చిత్రాలలో భన్సాలీ వేసిన కుప్పి గంతులు గురించి పత్రికలలో పుంఖానుపుంఖా లుగా కథనాలు వస్తున్నాయి. ఎల్కే అద్వానీ, రాజ్ జబ్బర్, అనురాగ్ ఠాకూర్లతో ఏర్పడిన 30 మంది సభ్యుల పార్లమెంటరీ బృందంతో ‘‘అయ్యా, నా ఉద్దేశం ఎవరి మనస్సునీ నొప్పించడం కాదు’’ అని భన్సాలీ గారు మొరపెట్టుకున్నారట. ఏమైనా కర్ణీ సేన ముక్కులు కోసి, పీకలు కోసే పనికి పూనుకుంది కానీ మనం అలాంటి పనులు చెయ్యం. మనం మన సినీమాల్లో బ్రాహ్మణులు వేదం వర సల్లో అడ్డమైన మాటలు మాట్లాడుతూ, పేడ తింటుంటే కడుపారా నవ్వుకున్నాం కానీ ఏమైనా అభ్యంతరం చెప్పగలిగామా? యముడూ, చిత్రగుప్తుడూ నడిరోడ్డు మీద ఐస్ క్రీం తింటూ మనల్ని కడుపారా నవ్విస్తూ ఉంటే చీమ కుట్టినట్టయినా బాధపడ్డామా? దేవుడిని మనలో ఒకడిగా చేసుకుని ఆయనా మనలాంటి ఇబ్బందులో, ఇక్కట్లో పడుతూంటే ఆనం దించడం మనకి అలవాటు. దేవుడు మనకి సఖుడు, సేవకుడు, నెచ్చెలి, ప్రియుడు, భర్త– ఎన్నో విధాలుగా మనం పురాణాలను మన స్థాయికి లాక్కొచ్చాం. ఏసు ప్రభువుని, అల్లానీ ఎప్పుడైనా చిత్రాల్లో, నాటకాల్లో చూశామా? చూపడం జరిగిందా? ఏమైనా చిత్రాన్ని చూడకుండా తిరగబడటం, ఎదురు తిరగడం ఈ దేశంలో కొత్త కాదు. ప్రకాష్ ఝా ‘అరక్షణ్’ (2011) వెనుకబడినవారి ఆత్మగౌరవాన్ని, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందనుకొని– చిత్రాన్ని చూడకుండానే ఎదురు తిరిగారు. ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, పంజాబ్ ప్రభుత్వాలు బహిష్కరించాయి. తీరా వారిని చిత్రం సమర్థించిందని చిత్రాన్ని చూశాక అర్థమయింది. కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ (2013)లో ముస్లింలను ‘దౌర్జన్యకారులు’గా చిత్రంలో చూపుతున్నా రని భావించి తమిళనాడులో ముస్లింలు వ్యతిరేకించారు. ఎవరూ చిత్రాన్ని చూడలేదు. తీరా ముస్లిం మతస్థుడు దౌర్జన్యకారులను వ్యతిరేకించడం కథ అని చూశాక తెలిసింది. ఏతావాతా, చిత్రాన్ని చూడకుండా వీధిన పడే సంప్రదాయాన్ని కర్ణీ సేన నిలబెడుతున్నదని మనం గర్వపడవచ్చు. - గొల్లపూడి మారుతీరావు -
బురదలోంచి వెలుగులోకి
ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపాదించు కున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. మొదట దావూద్ ఇబ్రహీం గురించి. ఆయనది పెద్ద సామ్రాజ్యం. చాలా దేశాలలో ఆయ నకి పాలెస్లు ఉన్నాయి. ప్రతీ పాలెస్ పేరూ ‘వైట్ హౌస్’. ముగ్గురు ఆడపిల్లలు పుట్టాక పాకిస్తాన్లో మోయిన్ పాలెస్ నిర్మించారు. దాని చుట్టూ అనునిత్యం పహారా కాసే తుపాకీ వీరులు. ఆ పాలెస్ గదుల్లో స్వరోస్కి క్రిస్టల్ చాండ లీర్స్, ఒక చిన్న జలపాతం, ఎప్పుడు పడితే అప్పుడు ఉష్ణోగ్రతని నిర్ణయించగల స్విమ్మింగ్ పూల్, ఒక టెన్నిస్ కోర్టు, ఒక బిలియర్డ్స్ కోర్టు, ఉదయం జాగింగ్ చెయ్యడానికి ప్రత్యేకమైన ట్రాక్ ఉన్నాయి. ఆయన స్పెషల్ అతిథులు మోయిన్ పాలెస్‌లోనే ఉంటారు. మరికాస్త మామూలు అతిథులు పక్కనే ఉన్న బంగ ళాలో ఉంటారు. ఆయనది ఒక మహా చక్రవర్తి జీవితం. ఆయన సూట్లు లండన్ ‘సెవైల్ రో’లో తయారవుతాయి. ఆయనకి ఖరీద యిన గడియారాలు సేకరించడం సరదా. ఆయనెప్పుడూ పాటక్ ఫిలిప్ రిస్టువాచీలనే వాడుతాడు. ఆ వాచీలు అరుదైన వజ్రాలతో పొదగబడినవి– ఖరీదు లక్షల్లో ఉంటుంది. నల్ల కళ్లద్దాలు మాసె రాటీ బ్రాండువి. ఆయన వజ్రాలు పొదిగిన పెన్ను తోనే సంతకాలు చేస్తాడు. ఆ పెన్ను ఖరీదు కనీసం ఐదు లక్షలు. ఆయనకి చాలా కార్లు న్నాయి. కానీ బాంబులు పడినా చెక్కుచెదరని నల్లటి మెర్సిడిస్లోనే ప్రయాణం చేస్తారు. ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన రక్షణను చూసే పాకిస్తాన్ రేంజర్ల కట్టుదిట్టాలు– బహుశా పాకిస్తాన్ అధ్యక్షుడి రక్షణ కవచాన్ని కూడా వెక్కిరిస్తున్నట్టుంటాయి. అయితే ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇవ్వ లేనిది ఒకటుంది. కంటి నిండా నిద్ర. నిద్ర దావూద్‌కి దూరం. పగలు ఏ కాస్తో నిద్రపోయి, రాత్రి వేళల్లో తన ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఎందరో మంత్రులు, బ్యూరోక్రాట్లు, మహానుభావులు ఆయన్తో ఇంట ర్వ్యూకి తహతహలాడుతుంటారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయన వెయిటింగ్ గదిలో అల్లా డుతుంటారు ఆయన దర్శనానికి. ఇదీ దావూద్ ఇబ్రహీం అనే హంతకుడి జీవన శైలి. డి–కంపెనీ అధినేత, కుట్రదారుడు, హవాలా చక్రవర్తి– ఇవన్నీ ఆయన బయట ప్రపంచం ఆయనకి పెట్టిన పేర్లు. ప్రపంచంలో ఉన్న పదిమంది గొప్ప నేరస్తుల జాబితాలో ఆయనది మూడవ స్థానం. ఆయన్ని పట్టుకున్నవారికి అమెరికా 250 లక్షల బహు మతిని ప్రకటించింది. ఆయనకి నాకూ చిన్న బంధుత్వం ఉంది. భారత దేశాన్ని తన అందంతో ఉర్రూతలూగించిన మందాకిని (‘రామ్ తెరీ గంగా మైలీ’ తార) ఆయన గర్లఫ్రెండ్. ‘భార్గవ రాముడు’ చిత్రంలో నా గర్ల్‌ఫ్రెండుగా నటించి క్లైమాక్స్‌లో నన్ను హత్య చేసింది. దావూద్ ఇబ్రహీం ఒక నిజాయితీపరుడైన పోలీసు కానిస్టేబుల్ కొడుకు. మొదటినుంచీ నేర ప్రపంచంతో సంబంధాలున్న దావూద్ ఒకానొక దొమ్మీలో తన సోదరుడిని ఒక ముఠా దారుణంగా హత్య చేయగా– వాళ్లని వెంటాడి ఒంటి చేతిమీద వారిని అంతే దారుణంగా హత్య చేసి– నేర ప్రపం చంలో వ్యక్తుల నరాల్లో వణుకు పుట్టించి– రాత్రికి రాత్రి ‘డాన్’గా అవతరించాడు. ఇది ‘దోంగ్రీ టు దుబాయ్’ పుస్తకంలో హుస్సేన్ జైదీ కథనం. ప్రతీ క్షణం హత్య, నేరం, పగ, తిరుగుబాటు, లొంగుబాటు, రివాల్వర్లు, తుపాకులు, దొమ్మీలతో సతమతమయ్యే జీవితం అతనిది. నిద్రకి అవకాశం లేని, ఆస్కారమూ లేని– అశ్విన్ నాయక్, ఛోటా షకీల్, అబూ సలీం, ఛోటా రాజన్, అరుణ్ గావ్లీ వంటి పేర్లతో ప్రతిధ్వనించే పాలెస్ జీవితం అతనిది. ఈయనకి ఒక్క గానొక్క కొడుకు– మోయిన్ నవాజ్ డి. కాస్కర్. వయస్సు 31. ఇంత గొప్ప, అనూహ్యమైన నేర సామ్రా జ్యానికి అతనొక్కడే వారసుడు. వైభవానికి ఆఖరి మెట్టుగా నిలిచిన ఈ పాలెస్లో అతని జీవితం గడిచి ఉంటుంది. హత్యలూ, గూడుపుఠా ణీలు, గూండాలు, అవధుల్లేని ధనం, అధికారం మధ్య అతని జీవితం గడిచి ఉంటుంది. కానీ ఇదేమిటి! మోయిన్ నవాజ్‌కి తండ్రి జీవితం పట్ల ఏవగింపు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా తండ్రి వైభవానికి దూరమయ్యాడు. అల్లా పిలుపుని గ్రహించి– ఒక మసీదులో మౌల్వీగా, మత గురువుగా మారిపోయాడు. తండ్రి వైభవానికి దూరమై– పవిత్ర ఖురాన్లో 6236 సూక్తులనూ కంఠస్థం చేసి మత గురువుగా మారిపోయాడు. తండ్రి నిర్మించిన పాలెస్‌కి దూరంగా ఒక మసీదు పక్కన చిన్న ఇంట్లో ఉంటు న్నాడట. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక దావూద్ ఇబ్ర హీం చాలా మనస్తాపానికి గురి అవుతున్నట్టు వార్త. ఆశ్చర్యం లేదు. అంతులేని సంపదా, అనూహ్య మైన ‘అవినీతి’ జీవనం ఏదో ఒకనాటికి వెగటు పుట్టిస్తుంది. ముఖం మొత్తుతుంది. It is a natural metamorphosis of the progeny from evil to righteousness ఐశ్వర్యంలో కేవలం మత్తు ఉంది. కానీ ఆముష్మిక జీవనంలో అంతులేని తృప్తి ఉంది. తండ్రిది దోచుకున్న వైభవం. కొడుకుది తనకు తానుగా సంపా దించుకున్న ఆధ్యాత్మిక సంపద. రెంటికీ పొంతనలేదు. ప్రయత్నించినా దొరకదు. - గొల్లపూడి మారుతీరావు -
సౌందర్యం సంస్కారం
ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. ‘మీరు జీవితంలో సాధించి నదేమిటి?’ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. ‘రచన ద్వారా నా గొంతు పదిమందికి వినిపిం చడం’అంటాను. ఒక జీవితకాలం కృషికి, పడిన శ్రమకి ఇది చాలా గొప్ప బహుమతి. ‘నన్ను కొడితే వెయ్యిమందిని కొట్టినట్టు’ అనేవారు అల్లు రామలింగయ్య. అది ఆయన సంపాదించుకున్న పరపతి. నేను చెప్తే వెయ్యి మంది వింటారు. కొన్ని వందలమంది స్పందిస్తారు. అది అక్షరం ఇచ్చిన శక్తి. మరి మేరీ కోం మాట్లాడితే? సచిన్ తెందూల్కర్ మాట్లాడితే? నరేంద్ర మోదీ మాట్లాడితే? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే? మొన్న చైనాలో సాన్యా పట్టణంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో– 118 దేశాలు పాల్గొన్న పోటీలో 17 సంవత్సరాల తర్వాత భారతదేశపు అమ్మాయి మానుషీ ఛిల్లర్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇంతకు ముందు ప్రియాంకా చోప్రా, యుక్తా ముఖీ, డయానా హేడెన్, ఐశ్వర్యారాయ్, రీటా ఫారియాలకు ఈ కిరీటం దక్కింది. ఈ అందాల పోటీలకు కొందరు మహిళలే అడ్డం పడుతున్నారు. అంగ సౌష్టవాన్ని బజారున పెట్టి ‘నా గొప్పతనం చూడండి’ అని బోర విరుచుకోవడం భారతీయ సంస్కారం కాదని వీరి వాదన. చాలామట్టుకు వాళ్లు రైటే కాని దీనిలో చిన్న పాఠాంతరం ఉంది. ఇది కేవలం శరీరాన్ని విరుచుకుని విరగబడే పోటీ మాత్రమే కాదు. ఒక దేశపు సౌందర్యరాశి– ఆ దేశపు సంస్కారానికి ఎంతగా అద్దం పడుతున్నది? అన్నది ఈ పోటీలో మరొక ముఖ్యమైన ఘట్టం. ఈ సౌందర్యరాశి వర్చస్సులో చాలామందిని జయించాక–మానసిక సౌందర్యానికి కూడా పరీక్ష పెడతారు. ‘ప్రపంచంలోకెల్లా ఏది ఎక్కువ జీతాన్ని పొందగలిగే వృత్తి, ఎందుకు?’ ఇదీ పరీక్షకులు అడిగిన ప్రశ్న. అనుమానం లేదు. లౌకిక జీవనంలో తలమునకలయిన పాశ్చాత్యుల ఆలోచనా సరళికి ఈ ప్రశ్న అద్దం పడుతుంది. దీనికి మానుషీ ఛిల్లర్ సమాధానాన్ని మరో స్థాయికి తీసుకుపోయి నిలిపింది. ‘గొప్ప గౌరవం దక్కాల్సిన వ్యక్తి అమ్మ. అది కేవలం ఉద్యోగం కాదు– ప్రేమా, గౌరవాలతో, ఆత్మీయతతో ఆ స్థానాన్ని గుర్తించాలి’ అంది. ఇది భారతీయ స్త్రీత్వానికి పట్టాభిషేకం. ఛిల్లర్ సౌందర్యానికి పోటీలో కిరీటం పెట్టారు. ఆమె మాతృత్వానికి కిరీటం పెట్టింది. ‘ఈ దేశంలో ప్రతీ వ్యక్తికి నా సమాధానంతో బంధుత్వం ఉంటుంది’ అంది ఛిల్లర్ గర్వంగా. అవునమ్మా అవును. అమ్మ వైభవాన్ని విస్మరించిన మూర్ఖుడు ఇంకా ఈ దేశంలో పుట్టి ఉండడు. అమ్మని ఆదిశంకరులు స్తుతిస్తూ, ‘త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితుం కవీంద్రా’ అంటూ, ‘అమ్మా! నువ్వు సౌందర్యానికి ఆవలిగట్టువి’ అంటారు. 1987లో ఇలాంటి పోటీలో పాల్గొన్న జెస్సినా న్యూటన్ (పెరూ) ‘మా దేశంలో మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రతిఘటనగా ఈ కిరీటాన్ని ఆయుధంగా చేసుకుని నా గొంతు వినిపించాలని నా ఉద్దేశం’ అంది వేదననీ క్రోధాన్నీ ఉదాసీనతనీ సమీకరిస్తూ. అంతే. కిరీటం ఆమె తల మీద వాలింది. ఏతావాతా, మానుషీ ఛిల్లర్ ‘అందంతో ఆదర్శం’ ప్రాజెక్టుకి కృషి చేస్తూ – హరియాణాలో మెడిసిన్ చదువుకుంటున్న ఈ అమ్మాయి–స్త్రీల రుతుస్రావ సమయంలో ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించడానికి 20 గ్రామాలలో పర్యటించి , 5000 మంది మహిళలకు ఉపకారం చేసింది. 20 ఏళ్ల ఛిల్లర్ చేపట్టని క్రీడ లేదు. సంప్రదాయ నృత్యం నేర్చుకుంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తరిఫీదు పొందింది. పారా గ్లైడింగ్, బంగీ జంప్, స్నార్కలింగ్, స్కూబా డైవింగ్ చేస్తుంది. తండ్రి సైంటిస్ట్. తల్లి న్యూరోకెమిస్ట్. ప్రపంచమంతా అబ్బురంగా చూసే స్థానంలో నిలిచి ఆమె గొంతుని వినే ‘శక్తి’ని ఛిల్లర్ సంపాదించుకుంది. ఇవీ ఆమె మాటలు, ‘నువ్వు కలలు కనడం మరిచిపోతే జీవించడాన్ని నష్టపోతావు. నీ కలలకి రెక్కలు తొడిగి, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకుంటే ఈ జీవితం జీవన యోగ్యం అవుతుంది.’ ఇంతవరకూ ఎన్నో దేశాల అందమయిన శరీరాలు ఈ కిరీటాన్ని వరించాయి. మానసికమయిన ఉదాత్తత, మన దేశపు విలువలను ఎత్తి చూపే సంస్కారానికి ఇప్పుడు కిరీటం దక్కింది. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. దీనికి చిన్న గ్రహణం. మన రాజకీయ నాయకులు ఎటువంటి విజయాన్నయినా భ్రష్టు పట్టించగలరు. ఛిల్లర్ విజయాన్ని అభినందించడానికి బదులు కాంగ్రెస్ నాయకులు శశి థరూర్గారు ఛిల్లర్ పేరుని రాజకీయ రొంపిలోకి లాగి ‘బీజేపీ నోట్ల రద్దు ఎంత పెద్ద పొరపాటు! మనదేశపు ‘చిల్లర’కు కూడా మిస్ వరల్డ్ కిరీటం దక్కింది’ అని చమత్కరించారు. ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. - గొల్లపూడి మారుతీరావు -
చిత్రం! భళారే విచిత్రం!!
పశు ప్రవృత్తితో కూడిన సెక్స్‌కి జాతి పరిణతితో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతాబ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది. మనకి సెక్స్ చాలా పవిత్ర మైనది –ఇప్పుడు కాకపో యినా– కనీసం ముందు తరం వరకు. మనకి సెక్స్ వంశోద్ధరణకి, బీజోత్పత్తికి, బలమైన వారసత్వానికీ ముడి. అందుకనే పెళ్లిలోనే గర్భదానానికి ముహూర్తం పెట్టారు – పెద్దలు. చక్కటి ముహూర్తంలో, చక్కని మనస్తిమితంతో, జీవితంలో మొదటిసారిగా సెక్స్‌కి ఉపక్రమించే భార్యాభర్తలు– ఆరోగ్యకరమైన, పాజిటివ్ దృక్పథంతో బిడ్డని ఈ జాతికి అందిస్తారని వారి ఆలోచన. ఇప్పుడివన్నీ బూతు మాటలు. మన సంస్కృతిలో వివాహాన్ని ‘రేప్’తో ముడిపెట్టారని ఆ రోజుల్లోనే దుయ్యబట్టారు చలం. విదేశీయులకి ఇంత గొడవలేదు. వారికి సెక్స్ ఓ ఆట విడుపు. విసుగుదల నుంచి అప్పటికి విముక్తి, నరాల ఆకలి, ఆకర్షణ, బలహీనత, ఆయుధం, అవ కాశం, అవసరం– ఏదయినా. సెక్స్‌తో ఎంగిలి పడినందుకు అక్కడెవరూ జుత్తు పీక్కోరు. పక్కవాడి జుత్తు పీకరు. ఏతావాతా మనకి జరిగిన నష్టం ఏమిటి? ఓ 50 సంవత్సరాల ‘తెలుగు సినీమా’ కథ అటకెక్కిపో యింది. ఇప్పుడు ఇద్దరు ప్రేమికులు, రెండు పెళ్లిళ్లు, మగాడితో పెళ్లి, పెళ్లి కాకుండా కాపురాలు వంటి కొత్త కథలు వచ్చాయి. వీటికి విదేశీ వాసన ఉందా? మన జీవితాలకే విదేశీ ‘కంపు’ పట్టేసింది. కథలకి ఏమొచ్చింది? కెవిన్ స్పేసీ చాలా చక్కని హాలీవుడ్ నటుడు. అందగాడు. ఆయన నాలుగు కోట్ల డాలర్ల సినీమా ‘ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్’లో నటించాడు. సినీమా పూర్తయిపోయింది. ఇందులో 800 మంది నటులు, రచయితలు, కళాకారులు, నిపుణులు పనిచేశారు. డిసెంబర్ 22న రిలీజు తేదీని కూడా ప్రకటించారు. ఇప్పుడు ఉన్నట్టుండి కనీసం ఓ డజనుమంది మగా ళ్లతో ఈ నటుడి లీలలు బయటపడ్డాయి. 2016లో తన 18 ఏళ్ల కొడుకుతో ఈ స్పేసీ సెక్స్ నడిపారని ఓ బోస్టన్ టెలివిజన్ జర్నలిస్టు కథ బయటపెట్టింది. 9 కోట్ల సినీమాకి ఇది పెద్ద దెబ్బ కదా? మరి ఏంచేయాలి? రిడ్లీ స్కాట్ అనే ప్రఖ్యాత దర్శకుడు–నిర్మాణం పూర్త యిన ఈ చిత్రంలోంచి స్పేసీ సీన్లన్నీ తీసేయడానికి సిద్ధపడ్డాడు. ఈ పాత్రని లోగడ చరిత్రని సృష్టించిన ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ హీరో క్రిస్టొఫర్ ప్లమ్మర్ని పెట్టి మళ్లీ షూటింగు చేస్తారు. అపకీర్తి నుంచి సినీమాని కాపాడి ఇంతవరకెన్నడూ జరగని పని చేసి–దాన్ని చరిత్రగా మార్చడం ఒక్క హాలీవుడ్‌కే చెల్లును. అయితే ఇలాంటి చరిత్రలు హాలీవుడ్‌కి కొత్త కాదు. రొమాన్ పొలాన్స్కీ అనే పోలెండు దర్శకుడిని నేను బెంగళూరు చిత్రోత్సవంలో చూశాను. చాలా అందగాడు. కొన్ని సినీమాల్లో నటించాడు. ఆయన పత్రికా సమావేశంలో నేనున్నాను. ‘‘మా దేశపు ఫిలిం టెక్నిక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఆయన్ని ఎవరో అడిగారు. సమాధానంగా ఆయన ఎవరో కార్యకర్తని పిలిచి ‘‘వెనుక వెలుగుతున్న స్పాట్‌ని ఆపుతారా? నా జుత్తు కాలుతోంది’’ అన్నారు. అప్పటికే విదేశాల్లో back light ధోరణి వెనుకపడుతోంది. 1978లో ఈ అందగాడు 13 ఏళ్ల అమ్మాయితో – ఒక పార్టీలో స్విమ్మింగ్ ఫూల్ పక్కన రొమాన్స్ జరిపి– పట్టుబడకుండా, చట్టాన్ని తప్పించుకుని స్విట్జర్లాండు పారిపోయాడు. తరువాత చాలా ఏళ్లకి ‘ది పియానిస్ట్’ (2002) అనే అద్భుతమైన చిత్రానికి ఆయనకి ఆస్కార్ బహుమతి వచ్చింది. అయితే చట్టానికి భయపడి ఈయన అమెరికా రాలేదు. అంతకు ఆరేళ్ల ముందు ఈయన ఓ 15 సంవత్సరాల జర్మన్ తార రెనేట్ లాంగ ర్ని రేప్ చేశాడట. ఈవిడ ఈ మధ్యనే బయట పెట్టింది. ఇంతకాలం ఎందుకు ఆగింది? ఈ మధ్యనే మరొక మహిళ – తన తల్లిదండ్రులు పోయినందున –ఇక ఇబ్బంది లేదనుకొని తనపై జరిగిన అత్యాచా రాన్ని బయటపెట్టింది కనుక. మరో నలుగురు కన్నె వయసు పిల్లలపై ఈ దర్శకుడు అత్యాచారం జరి పాడట. 1978లో ఈయన జరిపిన అమెరికా నేరానికి 2009లో స్విట్జర్లాండు అధికారులు ఈయన్ని అరెస్టు చేశారు. అయితే ఇప్పుడీయన వయస్సు 84. బొత్తిగా ముసలివాడయిపోయాడని ప్రాసిక్యూషన్ తమ అభియోగాన్ని ఉపసంహరించుకుంది. సరే. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ రుచి కరమైన లీలల్ని ఈ మధ్య విరివిగా చదువుకుంటున్నాం. డీ లా హురితా అనే తారని ఈయన 2010 లో రెండుసార్లు రేప్ చేశాడట. ఇలా హాలీవుడ్లో కేవలం 80 మంది మాత్రమే ఈయన సెక్స్ విన్యాసాల గురించి బయటపెట్టారు. సెక్స్ ప్రాథమికంగా పశు ప్రవృత్తి. ఆ క్షణంలో పశువుకీ, మనిషికీ పెద్ద వ్యత్యాసం లేదు. దానికి జాతి పరిణతితో, సంప్రదాయ వైభవంతో, సంస్కారంతో అద్భుతమైన విలువల్ని మన పెద్దలు సంతరించి పెట్టారు. పరాయి స్త్రీని ‘అమ్మా’ అనడానికి కొన్ని శతా బ్దాల మానసిక విప్లవాన్ని ఈ జాతి కొనసాగించింది. మొన్నటిదాకా కొనసాగిస్తోంది. అక్కడ–మేధస్సు ఆకా శంలో విహరిస్తున్నా–సంస్కారాన్ని అధఃపాతాళంలో మరిచిపోయిన ముగ్గురు చిత్ర ప్రముఖుల కథలివి. - గొల్లపూడి మారుతీరావు -
‘కిచిడీ’ రాజకీయాలు
కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగువాడిగా గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. నాకు రాజకీయాలలో అపా రమైన అనుభవం ఉంది. 2019 ఎన్నికలకు ముందు గానే బీజేపీ, కాంగ్రెస్, హిందూ, ముస్లిం, సిక్కులు, కశ్మీర్–భారతదేశం– ఇలా రకరకాల వర్గాల మధ్య భయంకరమైన రాజకీయ సంక్షోభం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయని బల్లగుద్ది చెప్పగలను. దీనికి ఒకే ఒక కారణం– కిచిడీ. అదిగో, తమరి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. కానీ ఇది నవ్వి మరిచిపోయే విషయం కాదనీ, ముందు ముందు ముదిరి కొంపలు ముంచ గలదని నిరూపించడానికే ఈ కాలమ్. ముందుగా కిచిడీ తయారీకి మా వంటావిడ చెప్పిన విధి విధానమిది: మొదట– బంగాళాదుంప, క్యారెట్, ఆకుపచ్చ బఠాణీలు, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి, వేరే చిప్పలో ఉల్లిపాయ, పచ్చిమిరప కాయ, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర తరిగి పెట్టుకోండి. ఈ ముక్కల్ని జీలకర్ర, జీడిపప్పు, వేరుశనగ పప్పుతో కలిపి– నూనె, నెయ్యి – ఇదీ రహస్యం – రెండింటితో కలిపి వేయించాలి. ఇప్పుడు కుక్కర్లో బియ్యం, పెసరపప్పు, ఈ వేగిన ముక్కల్ని వేయాలి. ఒకటికి రెండు న్నర గ్లాసుల నీళ్లు పోసి ఉప్పు, చిటికెడు పసుపు వేసి– స్టౌ వెలి గించాలి. రెండు విజిల్స్ వచ్చాక ఆపి, తయారైన పదార్థం మీద అరచెంచా నెయ్యి చిలకరించి– ప్లేట్లో ఉంచుకుని తినాలి. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో చలామణికి వచ్చిన ‘జాతీయ కిచిడీ’ జన్మ రహస్యం. ఒక్క విషయం మరిచిపోకూడదు. ఇది భారతదేశపు ‘జాతీయ కిచిడీ’ కాదు. ప్రపంచ ఆహార జాబితాలో భారతదేశానికి ప్రాధాన్యం వహించే వంటకంగా దీనిని ఎంపిక చేశారు. నవంబర్ 4న ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార దినోత్సవంలో దేశ ప్రఖ్యాత వంటగాడు సంజీవ్ కపూర్ కిచిడీని తయారు చేశారు. 7 అడుగుల విస్తీర్ణం గల వెయ్యి లీటర్ల నీరు పట్టే గుండిగలో 918 కేజీల కిచిడీని తయారుచేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. దీనిని 60 వేలమంది అనాధ పిల్లలకు పెట్టారు. వీరు కాక ఈ ఉత్సవాలకు వచ్చిన అతిథులకి, మన దేశంలో ఉన్న వివిధ విదేశీ కార్యాలయాలకు పంపారు. అయితే ఇది జాతీయ వంటకం కాదు. ఆహార ప్రొసెసింగ్ శాఖ మంత్రి హర్శిమ్రాట్ కౌర్ బాదల్ మాటల్లో ‘‘ఈ కిచిడీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వా’’నికి ప్రతీకగా నిలుస్తుందని ఈ వంటకాన్ని ఈ ఉత్సవంలో చేర్చామని పేర్కొన్నారు. వెంటనే జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒంటికాలుమీద లేచారు. ‘‘ఈ కిచిడీ తినడం చూసినప్పుడల్లా మనం లేచి నిలబడాలా? ప్రతీ సినీమా చూడటానికి ముందు కిచిడీ తినడం విధాయకమా? దీనిని నచ్చకపోవడం జాతీయ వ్యతిరేక చర్య అవుతుందా?’’ ఇవీ వారి మాటలు. వారి మనసులో ఇంకా జాతీయ గీతం ప్రతిధ్వనిస్తోంది. వందేమాతరానికీ, కిచిడీకీ తేడా వారి మనస్సుదాకా రాలేదు. వారి చెవుల్లో ‘కిచిడీ’ అంటే ‘వందే...’ అని ప్రతిధ్వనిస్తోంది. వారు అర్జంటుగా చెవి, ముక్కు, నాలుక నిపుణుడిని సంప్రదించాలి. ఇక కిరణ్ మన్రాల్ అనే రచయిత ‘‘నేను తీవ్రంగా దీనిని ప్రతిఘటిస్తున్నాను. బొత్తిగా జబ్బు చేశాక పత్యం పెట్టే వంటకాన్ని జాతీయ వంటకం అంటారేమిటి?’’ అని కోపం తెచ్చుకున్నారు. ఆ వరు సలోనే వారు ‘పులావ్’ని గుర్తు చేశారు. మరొకరు ఒక పాయింట్ లేవదీశారు: ‘‘అసలు యునెస్కో దీనిని జాతీయ వంటకంగా అనుమతించిందా?’’ అన్నారు. రన్వీర్ బ్రార్ అనే దేశ ప్రఖ్యాత వంటగాడు: ‘‘కిచిడీ అంటే నాకు ఇష్టమే. కానీ జాతీయ వంటకంగా ఆ ఒక్క వంట కాన్నే ఎంపిక చేయడం అన్యాయం. మన దేçశంలో ఎన్నో ప్రాంతాలున్నాయి. ఎన్నో రుచులున్నాయి. ఎన్నో వంటకా లున్నాయి. ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి విందుకి ఒక్క కిచిడీతో చావ మంటే ఎలాగ?’’ అని వాపోయాడు. తమరు ఈ స్పందనలో రాజ కీయ దుమారాన్ని గుర్తుపట్టాలి. ఇందులో సిక్కులు, ముస్లింలు, కశ్మీరీలు, పులావ్లూ, యునెస్కోలూ– ఇన్ని చోటు చేసుకున్నాయని గ్రహించాలి. ముందు ముందు తమిళనాడు ఎడపాడి పళని స్వామి ‘కారపు పొంగల్’ని ప్రతిపాదిస్తారు. కర్ణాటక సిద్దరామయ్య– కాంగ్రెస్ కనుక – తప్పనిసరిగా ‘బిసి బెళ బాత్’ని ప్రతిపాదిస్తారు. మహారాష్ట్ర నుంచి రాజ్థాకరేగారు ‘పాఠోళీ’ అంటారు. పంజాబీ మిత్రులు– ‘సార్సోంకా సాగ్’ అనవచ్చు. బెంగాలీ సోదరులు ‘చిత్తర్ మశ్చేర్ ముయితా’ అనవచ్చు. గుజరాతీ సోదరులు డొక్లా అని కానీ తెప్లా అని కానీ అనవచ్చు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్టీ, డోక్లాం తలనొప్పు లతోపాటు ‘కిచిడీ’ సమస్య పెంచుకోవడం– రాజకీయ మేధావుల లక్షణం కాదు. ఏతావాతా– కిచిడీని అందలం ఎక్కిస్తే నా డిమాండ్ ఒకటుంది– తెలుగు వాడిగా అలనాడు – అంటే 129 సంవత్సరాల కిందటి నుంచీ – అంటే గురజాడ కాలం నుంచీ అనాదిగా వస్తున్న నికార్సయిన తెలుగు వంటకం– నాకు అత్యంత ప్రియమైనది– దిబ్బరొట్టె. - గొల్లపూడి మారుతీరావు -
‘పై’ – పైపై కథ కాదు
జీవన కాలమ్ సత్యాల నిరూపణకు ఇంగ్లిష్‌లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష. ప్రస్తుతం బొంబాయి ఐఐ టీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కె.రామసుబ్రమణ్యన్ ఈ కథ చెప్పారు. లెక్కల్లో ‘పై’ అన్నది వృత్తం చుట్టుకొలతని నిర్ణ యించే సాధన. దీని అవ సరం ఏమిటి? యజ్ఞకుం డాల్ని తయారు చేయడానికి. వేలాది సంవత్సరాల కిందట ప్రతీ ఇంటిలో మూడు కుండాలు ఉండేవట. ఒకటి పూర్తి వర్తులం, రెండోది అర్ధ చంద్రాకారం, మూడోది చతురస్త్రం. ఇలా ఎందుకు? ఆ గొడవలోకి మనం వెళ్లొద్దు. ఈ మూడూ ఒకే కొలతలతో ఉండాలని నియమం. ఈ కొలతల్ని నిర్ణయించేది– పై. ఈ పేరు మనది కాదు. కానీ ఇంగ్లిష్ పేరు చెప్తే కానీ మనకి అర్థం కాదు గనుక ప్రస్తుతానికి ‘పై’ అనే చెప్పుకుందాం. ఈ కుండాలలో అగ్నిని త్రేతాగ్ని అనేవారు– ఇంకా స్పష్టంగా చెప్పాలంటే– ఆహవనీయ, దక్షిణ, గార్హపత్య. వీటి వివరణ శుల్బ సూత్రాలలో– 800 బీసీలో వివరించారు. తర్వాతి కాలంలో ఆర్యభట్ట ఒక శ్లోకంలో దీన్ని వివరించాడు. ఆ శ్లోకాన్ని ఈ శాస్త్రజ్ఞుడు వివరించాడు. ఇది 17వ శతాబ్దంలో గ్రిగరీ–లీవినిజ్ పేరిట చెల్లుతోంది. కానీ దీనిని మాధవ అనే ఒక గణాంకవేత్త 14వ శతాబ్ది లోనే ఒక శ్లోకంలో వివరించాడు. అంటే న్యాయంగా ఈ సూత్రం ‘మాధవ’ పేరుతో చెల్లుబాటు కావాలి. ఈ 'పై'ని transcendental number అన్నారు. అన్నట్టు– చాలా వేల సంవ త్సరాలపాటు చాలా దేశాలు ఆరు నుంచి, మరేవో అంకెలనుంచీ తమ గణాంకాలను లెక్కపెట్టుకునే వారు. గణితంలో ‘సున్నా’ని కనిపెట్టిన ఘనత భారతదేశానిది. ఈశావాశ్య ఉపనిషత్తు ‘‘పూర్ణమద పూర్ణమిదం...’’ అంటోంది– కొన్ని వేల సంవత్సరాల కిందటి మాట ఇది. ఇటీవలి కథ ఒకటి చెప్పాలని ఉంది. ఇది కూడా 61 సంవత్సరాల నాటిది. పశ్చిమ గోదావరిలోని ఒక గ్రామంలో 1896లో ఒకాయన పుట్టాడు. ఆయన పేరు భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు. నరసాపురం టేలర్ హైస్కూలులో చదువుకున్నాడు. వీరి నాన్నగారికి వేదాలు, తద్విజ్ఞానం అంటే ఇష్టం. 20వ యేట రాజు గారికి పెళ్లయింది. దరిమిలాను గౌతమ బుద్ధుడి ప్రభావంతో సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయా లకు వెళ్లిపోయాడు. 10 ఏళ్లు ఉన్నాడు. వేద శాస్త్రాలు, యోగ శాస్త్రాన్ని అక్కడ నేర్చుకున్నారు. అప్పుడు జర్మనీ వెళ్లి భౌతిక శాస్త్రాన్ని అభ్యసించారు. మనలాగ ఎస్సెల్సీ, ఇంటర్మీడియెట్లు చదవలేదు. ప్రాగ్ విశ్వ విద్యాలయంలో ఎక్స్‌రే భౌతిక శాస్త్రం మీద పరి శోధనలు చేశారు. తర్వాత స్వామి జ్ఞానానందగా మారి 1927లో జర్మనీ వెళ్లి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలలో లోతైన శాస్త్రీయ విజ్ఞానం డ్రెస్డన్ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డెంబర్‌ని ఆకర్షించింది. ఈయ నని ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ఆకర్షించింది. డ్రెస్డన్ విశ్వవిద్యాలయంలో యోగా మీద 150 ప్రసంగాలు చేశారు. కథని కుదిస్తే– 1936 ప్రాంతంలో అణు శాస్త్రం మీదా, బీటా రేడియేషన్ మీదా పరిశోధన చేసి డిగ్రీ పుచ్చుకున్నారు. 1947లో భారతదేశంలో నేషనల్ ఫిజికల్ లేబరేటరీలో సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరుగా పనిచేశారు. 1954లో గాయపడి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసు పత్రిలో చేరారు. ఆయన్ని చూడడానికి వచ్చిన అప్పటి ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ వీఎస్ కృష్ణ గారు వారిని విశ్వవిద్యాలయానికి ఆహ్వానించారు. నేనప్పుడు ఆనర్స్ చదువుకుంటున్నాను. తెల్లని పైజామా, కాషాయ రంగు లాల్చీతో ఉన్న స్వామీజీని ప్రత్యేకంగా అణు శాస్త్ర విభాగాన్ని (న్యూక్లియర్ ఫిజిక్స్) ప్రారంభించడానికి ఆహ్వానించడం మా అందరికీ ఆశ్చర్యకరం, చర్చనీ యాంశం. ఇప్పటి న్యూక్లియర్ ఫిజిక్స్ భవనాన్ని– (షష్టిపూర్తి మహల్ దాటాక) నిర్మించడం మా అందరికీ తెలుసు. 1965 వరకు స్వామీజీ ఉన్నారు. ఆ భవనానికి ‘స్వామి జ్ఞానానంద లేబరేటరీస్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్’ అని పేరు పెట్టారు. విద్యార్థుల కోసం ఆయన చేసిన ప్రసంగాలు విన్న 84 ఏళ్ల ప్రొఫెసర్ పెమ్మరాజు సీతారామారా వుగారి జ్ఞాపకాలు: ఇంగ్లిష్ కాస్త తడుముకుంటూ మాట్లాడేవారట. కానీ అణు శాస్త్రాన్నీ, సౌరశక్తినీ సమ న్వయిస్తూ వారు చేసే ప్రసంగాలు– అపూర్వం, అని తరసాధ్యం. ఆయన విజ్ఞానం కాలేజీల్లో నేర్చు కున్నది కాదు. అబ్బినది. ఒకనాటి ఆర్ష సంప్రదాయపు వైభవానికి ఈనాటి ఆధునిక శాస్త్ర పరిశోధనలకూ దగ్గర తోవ ఉందని– హిమాలయాలలో సర్వసంగ పరిత్యాగం చేసి బతికిన ఒక స్వామీజీ– విశ్వవిద్యాలయంలో అణుశాస్త్రాన్ని బోధించి నిరూపించారు. కొన్ని వేల సంవత్సరాల నాటి మనవారి పరిశో ధనలు– 17వ శతాబ్దంలో విదేశీయులకు పట్టుబడిన ‘పై’ గణితం, సౌర శక్తికీ, అణు శాస్త్రానికీ సశాస్త్రీయ మైన దగ్గర తోవని స్వానుభవంతో నిర్దేశించిన ఒక స్వామీజీ కథ ఇది. అందుకే ఈ సత్యాల నిరూపణకు ఇంగ్లిష్‌లో మంచి మాట ఉంది. అది ‘సెర్చి’ కాదట. ‘రీసెర్చి’. కానీ మనవాళ్లకి మొదటి ‘సెర్చే’ విడ్డూరం. రెండో సెర్చికి వ్యవధి చాలదు. అదృష్టవంతులకి అజ్ఞానం శ్రీరామరక్ష. గొల్లపూడి మారుతీరావు వ్యాసకర్త, ప్రముఖ సినీ నటుడు -
తెలివి మీరిన నేరాలు
జీవన కాలమ్ చదువు మాత్రమే మనిషిని మార్చదు. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. మొన్న విశాఖపట్నం బీచి దగ్గర మా కారు ఆగింది– రోజూలాగే. పార్కింగులో పది మోటారు సైకిళ్లు ఉన్నాయి. రామకృష్ణా బీచిలో రోడ్డుకి ఎడమపక్క కార్లు, కుడిపక్క మోటారు సైకిళ్లు ఆపాలని రూలు. కాని కొన్ని డజన్ల మోటారు సైకిళ్లు ఎడమపక్కనే ఆపుతారు. కారణం – పక్కనే కూర్చునే వసతి. మా డ్రైవరు ఒకాయన్ని మోటారు సైకిలు కాస్త వెనక్కి పెట్టమన్నాడు. ఆ మోటారు సైకిలు ఓనరు ఇతని మీద విరుచుకుపడ్డాడు. ‘నా బండి తీయమనడానికి నువ్వెవడివి? ఇక్కడ కార్లే ఆపాలని రాసి ఉందా? ఇది నీ బాబు గాడి సొమ్మా? నా బండీ పెడితే ఆపేవాడెవడు? ఇక్కడే పెడతాను. నీ దిక్కున్నవాడితో చెప్పుకో–పో. నేను తియ్యను‘ ఇలా అరుపులతో సాగింది. ఇంతలో ఎవరో ఆ కేకలు వేసే మనిషికి పలానా కారు గొల్లపూడిదని చెప్పారు. అతని తడబాటు వర్ణనాతీతం. ఇతణ్ని ఆపే శక్తి పోలీసు వ్యవస్థకి లేదు. కారణాలు మన దేశంలో చెప్పనక్కరలేదు. లేదన్న అవగాహన ఇతను బోర విరుచుకోవడానికి దన్ను. ఈ కాలమ్ కొందరయినా పోలీసు అధికారులు చదువుతారని ఆశి స్తాను. ఇది చదువుకున్న నేలబారు మనిషి – తన ఆ క్రమశిక్షణకు తాను సమకూర్చుకున్న లాజిక్. అతను చదువు రానివాడు కాదు. స్పష్టంగా తెలుస్తోంది. కాని చదువువల్ల రావలసిన సంస్కారం రానివాడు. ఇలాంటి చదువుల వెర్రితలలు మనదేశంలో కోకొల్లలుగా ప్రస్తు తం చూస్తున్నాం. ఈ చదువుకున్న మూర్ఖుడి మూర్ఖత్వానికి రెండు చికిత్సలు. దమ్మున్న అధికారం. చదువుకు సరైన తోవని మప్పే వ్యవస్థ. నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక పరిశీలనకు జువెనైల్ జస్టిస్ బోర్డు (పరిపక్వతకు రాని వయసున్న నేరస్థుల నేరాలను పరిశీలించే సంస్థ) తరఫు న్యాయవాది అబ్దుల్ రఖీబ్ అనే ఆయన ప్రొఫెసర్ సంపత్ కుమార్ పర్యవేక్షణలో.. విశాఖపట్నంలో చట్టానికి అడ్డం పడే ఈ జువెనైల్ నేరస్థుల కథనాలను– 100 నమూనాలను రెండేళ్లు పరిశీలించి పరిశోధన చేశారు. తేలిన నిజాలు విచిత్రం. ఇక్కడ జరిగే నేరాలు– చదువులేక, రోడ్డుమీద పడిన అలగా జనం చేసేవి కావు! నేరస్థులలో 40 శాతం ఇంటర్మీడియెట్ చదువుకున్నవారు. పదిశాతం పట్టభద్రులు! ఇంకా 67 శాతం కింది మధ్యతరగతినుంచి వచ్చినవారు. వీరిలో మళ్లీ గంజాయి రవాణా, అమ్మాయిల వేట, మానభంగాలు, గొలుసుల దొంగతనాలు, మా బీచి మిత్రుడిలాగ చట్టాన్ని ఎదిరించి రొమ్ము విరుచుకునే కేసులు– 58 శాతం. వీరిలో వెనుకబడిన కుటుంబాల నుంచి 56 శాతం, జూనియర్ కాలేజీల్లో చదువుకునేవారు– 30 శాతం ఉన్నారు. ఇది చాలా విచిత్రమైన నిజాలను ఆవిష్కరించే పరిశోధన. ఇదేమిటి? చదువు వీరిని మార్చలేదేం? బాబూ, చదువు మాత్రమే మనిషిని మార్చదు. గమనించాలి. కాగా తరతరాలు అణిగిమణిగి ఉన్న వ్యక్తి కోపాన్నో, భయాన్నో రెచ్చగొట్టడానికి ఆ చదువు కేవలం పనిముట్టు అవుతుంది. చిల్లర దొంగతనాలు చేసి బతికే తండ్రి కొడుకు– అదృష్టవశాత్తూ చదువుకోగలిగితే– ఆ దొంగతనాల్ని మరింత పకడ్బందీగా, దొరక్కుండా, మెరుగైన స్థాయిలో ఎలా చేయాలో– ఆ వృత్తికి మెరుగుపెడతాడు. వెనుకబడినవాడు– తన వెనుకబడినతనానికి తరతరాలు కారణమైన వాడిమీద కత్తికడతాడు. ఆ కత్తిని పదునుపెట్టడం చదువు నేర్పుతుంది. చదువు దానికి మన్నికయిన కారణాన్ని జత చేస్తుంది. వ్యవస్థ తప్పిదం వ్యక్తిది కాదన్న అవగాహన చదువుది కాదు. సంస్కారానిది. సంస్కారం పుష్పం. పురుగులు పట్టిన, కుళ్లిన గెత్తంలోంచే కళ్లు విప్పి, విత్తనమనే ప్రత్యేక అస్థిత్వాన్ని ఒడిసి పట్టుకుని– వికసించి పుష్పమవుతుంది. చదువు– ఏతావాతా– ప్రజ్ఞనిస్తుంది. ఉపజ్ఞని ఇవ్వదు. చట్టాన్ని ఎలా ఎదిరించాలో నేర్పగలదు. ఎందుకు ఎదిరిం చాలో ఒప్పించగలదు. మప్పగలదు. దానికి ఒరిపిడి– సంస్కారం. నిజానికి దీనికీ, చదువుకీ– న్యాయంగా సంబంధం ఉండనక్కరలేదు. కానీ ఉంటుంది. చదువుతో వచ్చే ‘వికసనం’ ఆ వాతావరణం ఇస్తుంది. సాంగత్యం ఇస్తుంది. ఆదిశంకరులు సజ్జన సాంగత్యానికి– జీవన్ముక్తిదాకా మజిలీలు ఉన్నాయని సూచించడంలో అర్థం ఇదే. చదువును సజావైన మార్గంలో నిలిపేది– సాంగత్యం. వాతావరణం. తెల్లవారిలేస్తే– మన డబ్బుని తినేసే ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇంట్లో 50 కోట్ల ఆస్తి బట్టబయలు, కొల్లగొట్టిన డబ్బుతో పట్టుబడిన ఎమ్మార్వోల కథనాలు, రిజిస్ట్రార్ ఆఫీసులో లక్షల లంచాలు, చట్టాన్ని ఎదిరించి చెల్లుబడి చేసుకున్న డబ్బున్న నాయకుడి విర్రవీగుడు– ఇవన్నీ పైన చెప్పిన 62 శాతం చదువుకున్న కుర్రాడి మెదడులో పెట్టుబడులు. కుళ్లు చూపే వ్యవస్థలో తన ఒక్కడి సత్ప్రవర్తన జవాబుదారీ కాదన్న ‘నిరసన’ని అతని చదువు నేర్పుతోంది. ఇదీ చదువుకున్న 90 శాతం కుర్ర నేరస్థుల కథ. గొల్లపూడి మారుతీరావు -
పేరులోననే యున్నది
జీవన కాలమ్ ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించుకోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. ఈ మధ్య రైల్వే మంత్రి సురేష్ ప్రభుగారికి ఓ చక్కటి ఆలోచన వచ్చింది. మన దేశంలో రైల్వే ప్రజ లందరికీ మత ప్రమేయం లేకుండా వినియోగపడే ప్రయాణ సాధనం కనుక, విభిన్నమైన సాంస్కృతిక చైతన్యాలను ప్రతిఫలించే దిగా ఉంటే బాగుంటుందని భావించారు. అందు వల్ల ఏం చేయాలి? ఆయా రైళ్లకి వివిధ భాషలలో ప్రముఖ రచయితల రచనల పేర్లను పెడితే– ఆ రైళ్లను తల్చుకున్నప్పుడల్లా ఆయా సంస్కృతుల వైభవం మనసులో కదులుతుందని వారు అభిప్రా యపడ్డారు. ఈ మధ్య రోజుకో రైలు ప్రమాదం జరిగాక– వారు రైల్వే శాఖను వదులుకోవాలని నిర్ణ యించుకున్నాక ఈ ఆలోచన వచ్చిందో లేక ముందే వచ్చిందో మనకు తెలీదు. ఏమైనా సురేష్ ప్రభు గారికి ఆయా భాషల రచనల అవగాహన తక్కువని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మొన్నటి దురంతో ఎక్స్‌ప్రెస్‌కి ప్రముఖ రచన ‘స్మశానవా టిక’ పేరు ఉంచి– ‘స్మశాన వాటిక ఎక్స్‌ప్రెస్’ అన్నారను కోండి– ఆ పేరు సార్థకమయి పోయినట్టే లెక్క. అలాగే తెలుగు వారంతా గర్వించే ‘చివరకు మిగిలేది’ నవల పేరు అటు మొన్న యాక్సి డెంటైన కాలిఫియాత్ ఎక్స్ ప్రెస్‌కు– ‘చివరకు మిగిలేది ఎక్స్‌ప్రెస్’ అని ఉంచితే సార్థ కమయ్యేది. మన తెలుగు వారు గర్వించే మరో గొప్ప రచన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’. అటు మొన్నటి ఉత్కల్ ఎక్స్ప్రె స్ని ‘మహాప్రస్థానం ఎక్స్‌ప్రెస్’ అని ఉంటే? గత 5 ఏళ్లలో 586 రైలు యాక్సిడెంట్లు జరిగాయ న్నారు. ఎన్ని రైళ్లకు ఏయే కళాఖండాల పేర్లు పెట్టి మనం సమర్థించగలం? పలానా ఎక్స్‌ప్రెస్‌ని ‘అరి కాళ్లకింద మంటల ఎక్స్‌ప్రెస్’ అందామా? ‘కర్రా చెప్పులు ఎక్స్‌ప్రెస్’ అందామా? గోదావరి ఎక్స్ ప్రెస్‌ని ‘అయ్యో పాపం ఎక్స్‌ప్రెస్’ అందామా? కళాఖండాల పేర్లు ముట్టుకుంటే గొడవల్లో పడ తామని నాకనిపిస్తుంది. ఏమైనా ఇన్నాళ్లకి ఇలాంటి ఆలోచన చేసే మంత్రిగారు రావడం మన అదృష్టం. ఈ దేశంలో జంతు ప్రదర్శన శాలలకు, విమానా శ్రయాలకి, ట్రస్టులకి, అడ్డమైన పథకాలకీ ఇంది రాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీని ఎవడు అడిగాడు? మన రోజులు బాగుండి కాంగ్రెస్ పదవిలో లేదు కనుక మనం బతికి పోయాం కానీ ఈ పాటికి ‘రాహుల్ గాంధీ’ సంస్థలు పాతికా, ప్రియాంకా గాంధీ సంస్థలు మరో 30 వెలిసి ఉండేవి. మళ్లీ మాట్లాడితే ‘మౌరీన్ వాద్రా’ పేరుతో మనకు డజను సంస్థలు వచ్చేవి. ఎవరీ మౌరీన్? మన ప్రియాంకాగారి అత్తగారు. మన దేశంలో స్వామి భక్తి పట్టిన, మేధావులు 70 సంవ త్సరాలుగా మన నెత్తిన పెట్టిన దరిద్రమిది. ఇప్పుడు కొన్ని వైభవాలు చూద్దాం. మన హైద రాబాద్ విమానాశ్రయం– రాజీవ్‌గాంధీ విమానా శ్రయం. చెన్నై విమానాశ్రయం– కామరాజ్ విమానా శ్రయం. కానీ ఇటలీలో ఒక విమానాశ్రయం పేరు గెలీలియో విమానాశ్రయం. గెలీలియో అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుని పేరుని అజరామరం చేసుకున్న చిన్న దేశమది. మరొక విమానాశ్రయం ‘మైకెలాం జిలో విమానాశ్రయం’. మైకెలాంజిలో గొప్ప శిల్పకా రుడని గుర్తు చెయ్యనక్కరలేదు. మరొకటి ‘లియో నార్డో డివించీ ఎయిర్పోర్ట్. తను సృష్టించిన పాత్రను చిరంజీవిని చేసిన ఓ మహా రచయిత ఆర్ధర్ కోనన్ డాయిల్. ఆయన సృష్టించిన పాత్ర షెర్లాక్ హోమ్స్. లండన్ బేకర్ స్ట్రీట్‌లో ఇల్లు ఆ పాత్రది. ఇప్పటికీ బేకర్ స్ట్రీట్‌లో రైలు ఆగగానే గోడనిండా గొప్పగా షెర్లాక్ హోమ్స్ బొమ్మ కనిపిస్తుంది. విజ య నగరం స్టేషన్లో 125 సంవ త్సరాల చరిత్ర ఉన్న మహా కళాఖండాన్ని సృష్టించిన గుర జాడ ‘గిరీశం’ కనిపిస్తాడా? మన రాజకీయ నాయకుల్ని అడగండి. ‘ఎవరు బాబూ ఈ గిరీశం?’ అంటారు. ఏతావాతా, నేను సురే ష్‌ప్రభు గారిని అభినందిస్తు న్నాను. మన నెత్తిన ‘రాబర్ట్ వాద్రా విశ్వవిద్యాలయం’, ‘మిరయా విశ్వవిద్యాలయం’ (అన్నట్టు మీకీ పేరు తెలియదు కదూ? గత మూడేళ్లు ‘10 జనపథ్’ మేడమ్ ఈ దేశాన్ని పాలించి ఉంటే ఈపాటికి తమరు ఈ పేరుని గాయత్రిలాగా జపం చేసేవారు. ఇది ప్రియాంకా కూతురు పేరు) అనే ఆలోచనా పరిధి నుంచి బయటికి వచ్చి ఆలో చించే మంత్రులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ నాదొక విన్నపం. ఆయా మహా రచయి తల రచనలు కాక– వారి పేర్లనే చిరస్మరణీయం చేయండి. చక్కగా దురంతో ఎక్స్‌ప్రెస్‌ని ‘శ్రీశ్రీ ఎక్స్ ప్రెస్’ అనండి లేదా ‘గోపీచంద్ ఎక్స్‌ప్రెస్’ అనండి. పాలక కుటుంబాల అడుగులకు మడుగులొత్తే సంస్కృతి నుంచి బయటపడాలన్న ఆలోచన ఈ దేశానికి మంచి శకునం. ఈ జాతిని సుసంపన్నం చేసిన చారిత్రక పురుషుల్ని ప్రతిదినం స్మరించు కోవడం జాతి సంస్కారానికి బంగారు మలామా చేయడం. చరిత్రను పునర్నిర్మించుకోవడం అంటే ఇదే. గొల్లపూడి మారుతీరావు -
రాబందు రెక్కల చప్పుడు
జీవన కాలమ్ కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. పాపం, దేవుడు నిస్సహాయుడు. అడ్డమయిన వాళ్లకీ కొంగు బంగారమవుతాడు. అయితే, హేతువాదులు కొంగుల్ని మరిచిపోయి బంగారాన్ని తప్పు పడతారు. నిజమైన విశ్వాసం నికార్సయిన సౌందర్యం. పబ్బం గడవడానికి పెట్టుబడిగా ఉపయోగించే విశ్వాసం– భయంకరమైన వికృతం. అందువల్లనే విశ్వాసం పెట్టుబడిగా ఉన్న, ప్రతీదీ వీధిన పడుతోంది. ఇలాంటి విశ్వాసానికి వికటమైన రూపం– డేరా సచ్చా సౌదా గుర్మిత్ రామ్ రహీమ్. చానళ్ల పేర్లు అనవసరం. ఒకాయన పెద్ద బొట్టుతో, దుశ్శాలువాతో టీవీ తెర అంతా ఆక్రమించి కూచుంటాడు. విశ్వాసాన్ని నమ్ముకున్న ఒక తల్లి ‘రెంట చింతల’నుంచి అడుగుతుంది– మా రెండో అబ్బాయికి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలి బాబూ– అని. ఈయన చెప్తాడు– ‘‘ప్రతీ బుధవారం మర్రి ఆకు నెత్తిన పెట్టుకుని, దాని మీద చింతగింజని ఉంచి స్నానం చెయ్యమనండి. ఆరువారాలు చేశాక– కావిరంగు పంచె కట్టుకుని మీ ఊళ్లో ఉన్న మర్రి చెట్టు మొదట్లో ఆ చింతగింజని పాతిపెట్టమనండి. ఆరో రోజుకి ఉద్యోగం రాకపోతే నాదగ్గరికి రండి 1,500 రూపాయల తావీజు కడతాను’’అంటాడు. ఇది విన్నాక–దిక్కుమాలిన జ్యోతిషం మీదా, దేవుడిమీదా నమ్మకం మంటగలవకుండా ఎందుకుంటుంది? విశాఖపట్నం బీచిలో తెన్నేటి పార్కు ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక జ్యోతిష్కులు ఉంటారు. తోక తెగిన చిలక బోనుల నిస్సహాయంగా బయటికి వస్తుం ది. దానికి రెండే అలవాట్లు– బొత్తిలో కార్డు లాగితే బియ్యం గింజలు వస్తాయి. లాగుతుంది. ఆ కార్డు ఈ ‘మనిషి’ భవిష్యత్తు. ‘‘నీ కూతురి పెళ్లి ఈ సెప్టెంబరులో అవుతుంది’’ అంటాడు చిలకయ్య. అది అయిదు రూపాయల సంతోషం– పల్లెటూరి మనిషికి ఇక్కడ పెట్టుబడి ఏమిటి?– విశ్వాసం. మనిషి ఆశకి ఊతం కావాలి. దాన్ని ఎదుటి వ్యక్తి కలిగిస్తున్నాడన్న నమ్మకం రావాలి. అందుకూ చెల్లింపు. దానికి చిలక స్థాయి చాలు రైతుకి. దేవుడిని చంకన ఎత్తుకుని తాను దేవుడి ప్రతినిధినంటూ– వెనుకబడిన వర్గాల తరఫున ముందుపడిన ‘రాబందు’ జిగ జిగా మెరిసే కళ్లజోళ్లతో, అమెరికా మార్కు బనీన్లతో, అందంగా దువ్విన గెడ్డంతో, స్ఫురద్రూపంతో, పాప్ పాటలతో, సినిమా నిర్మాణ సంరంభంతో, మెర్సిడిస్ కార్ల హంగులతో, కోట్లమంది విశ్వాసం పెట్టుబడితో విర్రవీగితే ఏమవుతుంది? డేరా సచ్చా సౌదా అవుతుంది. కోట్లమంది ఓట్లను దండుకునే రాజకీయ పార్టీల కక్కుర్తికి ఆధారమౌతుంది. ఈ మధ్యలో ‘దేవుడు’ అటకెక్కిపోతాడు. ఇప్పుడు చిలక స్థానంలో రాబందు ఉంది. ఇక ‘రాబందు’కి కొదవేముంది? విశ్వాసాన్ని ఆధారం చేసుకున్న ఎందరు బాబా లు? విశ్వాసానికి కొలబద్ధలు లేవు. ప్రజల ఎగబాటే వారి శక్తి. హర్యానా సత్యలోక్ ఆశ్రమాధిపతి రామ్‌పాల్ బాబా లీలలు, స్వాధీన్ భారత్ సుభాష్ సేన రామ్ వృక్ష యాదవ్, బెంగళూరులో ధ్యాన్ పీఠానికి చెందిన నిత్యానంద లీలలు, ఇంకా ఒక కొలిక్కిరాని ఆశారామ్ లీలలు, సనాతన్ ధన్ హుగ్లీ బాలక్ బ్రహ్మచారి– ఇలా ఎందరు? తనని నమ్మ వచ్చిన ఇద్దరు మహిళల్ని మానభంగం చేసి, గర్వంగా 15 సంవత్సరాలు కేసు నడిపి, తన చుట్టూ ఉన్న ‘దన్ను’ కారణంగా తనకేమీ జరగదని గర్వంగా రొమ్ము విరిచి, మొన్నటి తీర్పుకి 300 కార్లతో విహారంగా వచ్చిన ‘గ్లామరు’బాబా 20 ఏళ్లు జైలుశిక్ష పడ్డాక కోర్టులో ‘‘నన్ను క్షమించండి మొర్రో’’అని నిస్సహాయంగా కూలబడి ఏడవడం ఎందుకు? ఇంతకాలం లక్షల మందిని నమ్మించి, చంకన ఎత్తుకున్న దేవుడు ఏమయ్యాడు? మతాన్ని, దేవుడిని ఎరచూపి– కింద మధ్యతరగతి ప్రజానీకం ‘విశ్వాసా’లను సమీకరించి వ్యవస్థల్ని ఏర్పరచుకున్న ఇలాంటి బాబాలు– ఇంకా మతంలోనూ, సంప్రదాయంలోనూ తమ మాలాలు ఉన్న ‘నిస్సహాయమైన’ వ్యవస్థకి పట్టే చీడపురుగులు. పాపం, తెన్నేటి పార్కుకి ఎదురుగా పేవ్మెంట్ మీద చిలక అతి చిన్న నమూనా. ప్రాథమికమైన విశ్వాసం అతని కొంగుబంగారం. ఉపాధి మాత్రమే అతని లక్ష్యం. కాని ఈదేశంలో దేవుడు, మతాన్ని పొగరుగా వ్యాపారం చెయ్యగల–దుర్మార్గమయిన స్వార్థానికి విశ్వరూపం గుర్మీత్ రామ్ రహీమ్. పంజాబు కట్టలు తెంచుకునే ఆవేశానికీ, పరిమితి లేని విశ్వాసానికి ప్రతీక. తాము నమ్మిన విలువలకి ప్రాణం ఇచ్చే స్వభావం ఆ జాతిది. ఇక్కడే జైన బౌద్ధ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, సిక్కు మతాలు విస్తరించాయి, వేళ్లు నిలదొక్కుకున్నాయి. అయితే మధ్య మధ్య కుళ్లు చూపిన ఓ భయంకరమైన ‘వేరు’ కథ ఈ గుర్మీత్ రామ్ రహీమ్‌ది. మరో 20 ఏళ్లు– వెర్రి తలలు వేయించిన విశ్వాసానికి గమ్యాన్ని ఈ ‘రాబందు’ గుర్తు చేస్తూనే ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు -
మామా అల్లుళ్ల సవాల్
♦ జీవన కాలమ్ కాలం మారుతోంది. ట్రంప్ వంటి నాయకుల నుంచి ‘హెచ్1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది. మామ చక్కటి కూతుర్ని కన్నాడు. అల్లారుముద్దుగా 21 ఏళ్లు పెంచాడు. మొట్టమొదటిసారిగా పై ఇంటివాడిని అల్లుడిగా తెచ్చుకుని పిల్లని అతని చేతుల్లో ఉంచాడు. అక్కడితో ఊరుకోకుండా కూతురు కాపురాన్ని మేడమీదే పెట్టించి కింద కాపురం ఉన్నాడు. క్రమంగా అల్లుడిగారి ధోరణి మామగారికి నచ్చలేదు. ఆ దశలో నచ్చవలసింది తన కూతురికీ, అతని చుట్టూ ఉన్న మనుషులకీ కానీ తనకి కాదని మరచిపోయాడు మామ. ఎంతైనా కన్న కడుపు. కూతుర్ని ఎలా చూసుకోవాలో, అలా ఎందుకు చూసుకోకూడదో అల్లుడి చెవిలో ఇల్లు కట్టుకుని పోరడం ప్రారంభించాడు. అల్లుడు యోగ్యుడు. మామగారిమీద అమితమైన గౌరవం ఉన్నవాడు. పరోక్షమైన ఈ స్వారీని తట్టుకోలేక ఓ రోజు అల్లుడు లేచి చక్కాపోయాడు. స్థూలంగా ఇదీ ఇన్ఫోసిస్ కథ. నారాయణ మూర్తిగారు సజ్జనుడు. మహామేధావి. పదిమందిని కలుపుకునే స్వభావం కలవాడు. 1981లో ఇన్ఫోసిస్ని పూనాలో ప్రారంభించి, బెంగళూరులో నిలదొక్కుకుని 21 సంవత్సరాల ఆధిపత్యంలో దేశంలోకల్లా గొప్ప స్థాయిలో నిలిపి, గద్దెదిగి మరో పదేళ్లు చైర్మన్‌గా వ్యవహరించి, మొదటిసారి ప్రారంభకులను దాటి పైవాడిని తెచ్చి ఆధిపత్యం ఇచ్చారు. ఇచ్చారన్నమాటేగానీ, మరీ బాధ్యతా రహితంగా ఖర్చులు పెంచడం, ఉద్యోగం మానిపిం చిన రాజీవ్ బన్సల్‌కు 23.02 కోట్లను ముట్టజెప్పడం, ప్రైవేటు విమానాల్లో తిరగడం వంటివి మామగారికి నచ్చడం లేదు. నచ్చడం లేదని చెప్పే హక్కు లేని స్థితి నారాయణ మూర్తి గారిది. కారణం ఆయన కంపెనీలో కేవలం 3.44 శాతం వాటాదారుడు. కానయితే ఆయన నారాయణమూర్తి. ఇది బోర్డు మెంబర్లకు మింగుడుపడని ఇబ్బంది. వంటగదిలో జరిగే ప్రతీ వంటా– కింద కాపురం ఉంటున్న మామగారికి నచ్చ చెప్పాలి. తినేది అల్లుడు. అతను యోగ్యుడు. ఈ పితలాటకం నుంచి– నారాయణ మూర్తి మీద పూర్తిగా గౌరవం ఉన్న అల్లుడు ఏం చెయ్యాలి? ఓ మంచి రోజు చూసుకుని మూటా ముల్లె సర్దుకుని వాళ్ల ఊరెళ్లిపోయాడు. ఇదీ స్థూలంగా ఇన్ఫోసిస్ కథ. ఈ కథలో నీతి కాపురానికి పంపాక– కూతురుమీద ప్రేమ ఉండవచ్చు కానీ ‘అధికారాలు’ చెల్లవు. తీరా కల్పించుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఈ దేశంలో టాటా గ్రూపు తర్వాత అంత పెద్ద సంస్థ ఇన్ఫోసిస్. 2 లక్షల సిబ్బందితో 122 దేశాలతో సత్సంబంధాలు గల గొప్ప పేరున్న సంస్థ. నారాయణ మూర్తి దక్షతలో, నిజాయితీలో, నీతిలో పేరున్న మనిషి. కానీ పెళ్లయిన కూతురిమీద చెల్లనంత వ్యామోహం పెంచుకున్న మామగారు. అదీ చిక్కు. దాదాపు ఇలాంటి గొడవే ఆ మధ్య టాటా సంస్థలో జరిగింది. తమ కుటుంబానికి చేరువగా ఉన్న మనిషికి సైరస్ మిస్త్రీకి– కుటుంబంలోని ఆఖరి పెద్ద రతన్ టాటా ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ కూతురు కాపురం మాట అలా ఉండగా ఇల్లు చెడిపోతోందని గ్రహించి అడ్డం పడ్డారు. ఇది చాలా ఇబ్బం దికరమైన పరిస్థితి. రతన్ టాటా పెద్దరికాన్ని ఎరి గిన వారికి ఇది విడ్డూరంగా కనిపించినా, ఆక్షేపణీ యం అనిపించలేదు. కాగా సైరస్ అల్లుడు కాదు. వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పెంపుడు కొడుకు. శృతి మించితే పెంపకాన్ని వదులుకునే హక్కు పెద్దాయనకి ఉంది. ఈ మధ్య ఇలాంటిదే మరో గొడవ. ఈ దేశం క్రికెట్ సంస్థ పాలనను సరిచేయడానికి ముగ్గురు పెద్దల్ని సుప్రీం కోర్టు నియమించింది. తగని ఖర్చులు పెడుతూ, కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులు– సీకే ఖన్నా, అమితాబ్ చౌదరీ, అనిరుధ్ చౌదరీలను తక్షణం బర్తరఫ్ చెయ్యాలని వీరు కోరారు.గమనించాలి. ఈ మూడూ మూడు రకాలైన వేర్వేరు కథలు. పిల్లనిచ్చిన మామగారు అల్లుడుగారు చేస్తున్న అనవసరమైన ఖర్చులు గురించి వాపోయారు– మొదటి కథలో. అసలు వారసుడి వ్యవహారమే బొత్తిగా నచ్చలేదు రెండో కథలో. తీరా మూడో కథ అల్లుళ్ల కథ కాదు. సుప్రీం కోర్టు మామని కాదు– కొత్త ‘మొగుళ్ల’ని తీసుకొచ్చి నిలిపింది. కనుక వారి డిమాండ్‌కి ప్రత్యామ్నాయం లేదు. ఏతావాతా ఇన్ఫోసిస్ దేశంలో పేరూ, ప్రతిష్టా ఉన్న సంస్థ. నారాయణ మూర్తి పేరూ, ప్రతిష్టని ఆర్జించిన వ్యక్తి. అయితే– తను పదవిలోకి వచ్చిన మూడేళ్లలో విశాల్ సిక్కా అనే యోగ్యుడైన మేధావి– ఇంతకాలం డాలరు–రూపాయిల వ్యత్యాసంతో లాభాలను సంపాదించుకునే సంస్థగానే మిగిలిపోకుండా దశ నుంచి cost-based నుంచి Innovation-based స్థాయికి పెరగనివ్వాలని ప్రయత్నించాడు. దీనిని మామలు గ్రహించాలి. కాలం మారుతోంది. వ్యాపారం రూపురేఖలు మారుతున్నాయి. ట్రంప్ వంటి నాయకుల నుంచి ‘హెచ్1–బి’ వీసాల కరువునుంచి వాణిజ్యాన్ని కాపాడవలసిన అగత్యం ఈ తరానికి ఎంతయినా ఉంది. అందుకు విశాల్ సిక్కాల అవసరం ఎంతయినా ఉంది. గొల్లపూడి మారుతీరావు -
చాపకింద నీరు
విశ్లేషణ జీవన కాలమ్ మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. ఇది మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. మన చాపకిందకి నీరు వస్తేగాని మనం చెమ్మని గుర్తుపట్టం. ఈ దేశం మీద పరాయిదేశం దండయాత్ర చేసినా దక్షిణాదివారికి అది కేవలం వార్తే. కశ్మీర్ పొలిమేరల్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతూంటే– తమ జీవితాల్ని ప్రశాంతంగా గడిపే ఎన్నో సరిహద్దు కుటుంబాలను సైనిక దళాలు అప్పటికప్పుడు కదుపుతూంటాయి. పాక్ కాల్పులు మనకి వార్త. వారికి ప్రాణ సంకటం. అలాగే డోక్లాంలో చైనా దళాల మోహరింపు మనకు కేవలం వార్త. సరిహద్దు పల్లెలకు జీవన్మరణ సమస్య. యుద్ధం పంజాబ్‌లో ఎన్నో కుటుంబాలను పునాదులతో కదుపుతుంది. యుద్ధం కారణంగా సరిహద్దులో పుట్టిన తెలివైన కుర్రాడు చదువుకోలేక కేవలం కారు మెకానిక్ కావచ్చు. కాని అమలాపురంలో, త్రివేండ్రంలో యుద్ధం కేవలం పేపరు చెప్పిన సంఘటన. నా చిన్నతనంలో ఇప్పటి విశాఖపట్నం పోర్టు ఉన్న చోట రెండు ఫర్లాంగుల దూరంలో సముద్రపు నీరు ఉండేది. ఇప్పుడు రోడ్డుదాకా వచ్చేసింది. ఇటీవల రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం దాదాపు రోడ్డుని కొట్టేసింది. ఎందుకని? ఏమో. అది మన చాపకాదు. మరో ముపై్ఫ ఏళ్లకు ఇప్పటి జలాంతర్గామి మునిగిపోవచ్చు. కొత్తగా పెడుతున్న విమానం నీటిలోకి పోవచ్చు. ఈ విషయం ఏ కలెక్టరూ చెప్పలేడు. కొన్ని లక్షల సంవత్సరాల కింద దక్షిణ ధ్రువం నుంచి విడిపోయిన గోండ్వానా భూమి ఖండాలయింది. దేశ పటాలను చూస్తే పశ్చిమ భారతం సరిగ్గా తూర్పు ఆఫ్రికా తీరానికి అతుక్కుపోతుంది. కొన్ని లక్షల సంవత్సరాలలో రెండు వేర్వేరు సంస్కృతులు ఆయా దేశాలలో నిలదొక్కుకున్నాయి. ఇప్పటికీ తూర్పు ఆఫ్రికా దేశాలలో గోపాలురు ఉన్నారు. వారి అష్ట భార్యలున్నారు. నేను చూశాను. అందరూ కలసి ఒకచోటే జీవిస్తారు. వారు నల్లనివారు. పద్మనయనమ్ములవారు. సింహబలురు. ఆఫ్రికాలో సింహాలు ఒక్క ఈ గోపాలురను చూస్తేనే పారిపోతాయి! ఏమయినా ఇది ఆంత్రోపాలజిస్టులు తేల్చవలసిన కథ. ఇప్పుడీ కథకు పెట్టుబడి– ఇటీవల అంటార్కిటిక్ ధ్రువంలో మంచు గడ్డ నుంచి 12 ట్రిలియన్ టన్నుల ముక్క విడిపోయి భూమి వేపు ప్రయాణం చేస్తోంది అని చదివాం. ఇది బొత్తిగా పొరుగువాడి చాప. ట్రిలియన్ అంటే? ఒకటి తరువాత 12 సున్నాలు. ఇలా చెప్పినా మన మనస్సుల్లో ఒక దృశ్యం రాదు. దాదాపు మన హర్యానా రాష్ట్రం కన్నా పెద్దది– కది లింది. ఇప్పుడేమవుతుంది? ఈ గ్రహం మీద మూడు వంతులు నీరు. ఒక వంతే నేల. నీరు కొన్ని కోట్ల మైళ్ల మేరకు అంటార్కిటిక్ ప్రాంతంలో ఘనీభవించి ఉండ డం వల్ల– మన దేశాలను అంటిపెట్టుకుని ఉన్న సముద్ర మట్టాలు ఇలా స్థిరంగా ఉన్నాయి. మరి రామకృష్ణా బీచ్ దగ్గర సముద్రం వెర్రితలలు వేయడానికీ, ఈ హరియాణా పరిమాణంలో మంచు తెగిపడడానికీ సంబంధం ఉందా? ఉంది బాబూ ఉంది. భూమి ఉపరితలం నానాటికీ వేడెక్కి– మంచు కరిగి– ఈ గ్రహం మీద మిగిలిన ఆ కాస్త భూమినీ ఆక్రమించుకుం టోంది. నేను ఆ మధ్య నార్వేలో ‘‘అరోరా బోరియాలిస్’ అనే ప్రకృతి వైభవాన్ని చూడడానికి వెళ్లాను. ట్రోమ్సో అనే ఊరు భూమికి కొన. అక్కడికి 2,500 మైళ్ల వరకూ సముద్రమూ, మంచూ ఉంది. అంటే ‘‘కరగని’ మంచు ఈ భూమిని ఎంత కాపాడుతోందో ఊహించవచ్చు. మరి ఈ నీరు తిరగబడితే? కరిగితే? అదిన్నీ– ఓ హరియాణా అంత మంచు ముక్క విరిగి భూమిని ఆక్రమించుకుంటే? ఇంత పెద్ద విషయాన్ని పామర జనానికి–అంటే మీకూ నాకూ అర్థమయ్యేటట్టు చెప్పడానికి తంటాలు పడుతున్నాను. మొన్న పారిస్ పర్యావరణ సమావేశంనుంచి ట్రంపు దొరగారు– ఈ పర్యావరణ కాలుష్యానికి మా ప్రమేయం లేదు అని సెలవు తీసుకున్నారు కానీ– రేపు తడిసే చాపల్లో వారి చాప పెద్దది. వాతావరణ నిపుణుల మాటల్ని వీలయినంత చిన్న పదాలలో చెప్పడానికి ప్రయత్నిస్తాను: మానవాళి ప్రకృతిపై చేస్తున్న జులుంకి ప్రకృతి చాలా క్రూరంగా సమాధానం చెప్పబోతోంది. దానికి సూచనే ఈ మంచు శకలం విడివడటం. మానవుడు చేస్తున్న అనర్థాన్ని సామూహిక చర్య ద్వారా సవరించవలసిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. పర్యావరణం వేడెక్కడం ఒక నమూనా అనర్థం. ఈ అనర్థానికి పెద్ద వాటా అమెరికాది. కళ్లుమూసుకుని ‘‘నన్ను ముట్టుకోకు’’ అని పెదవి విరిస్తే మన చేతల్తో మనమే మన వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇందులో తిలాపాపం తలా ఒక్కరిదీ ఉంది. రాబోయే దశాబ్దాలలో ఉత్తర హిందూదేశం, దక్షిణ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని 1.5 బిలియన్ల ప్రజలు భరించలేని వడగాడ్పులకు లోనవుతారని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. అప్పుడు జనాభా 70 శాతం పెరుగుతుంది. కనీసం రెండు శాతం ఈ వేడికి ఆహుతయిపోతారు. అయితే మన అదృష్టం – మనం అప్పటికి ఉండం. కాకపోతే– మనం మన పిల్లల సంక్షేమాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిష్క్రమిస్తాం. అంటార్కిటిక్ ప్రాంతంలో ఈ మంచు శకలం విరిగిపడడం– మానవుడు తెలిసి తెలిసి– తనకు తానే తవ్వుకుంటున్న భయంకరమైన గొయ్యి. సర్వనాశనానికి సూచన. ‘‘ప్రళయం’’ వస్తుందని మన పురాణాలు చెప్తున్నాయంటారు. గొల్లపూడి మారుతీరావు -
ఖాండవ దహనం
విశ్లేషణ కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. చాలా సంవత్సరాల కిందట చెన్నై హైకోర్టులో ఒక కేసు నడిచింది. కేసు ఓడిపోతే గవర్నమెంటుకి మేం 30 లక్షలు కట్టాలి. చేతిలో అంత సొమ్ము లేదు. కేసు త్వరగా పరి ష్కారం అయిపోయే సూచనలు కనిపించాయి. నేను కంగారు పడడాన్ని మా న్యాయవాది గ్రహించాడు. కారణం చెప్పాను. ‘‘మరేం ఫర్వాలేదు సార్. కేసుని ఎంతకాలం వాయిదా వేయాలో చెప్పండి’’అన్నాడు. నేను తెల్లబోయాను. ‘‘అదెలా సాధ్యం?’’ అన్నాను. నవ్వాడు న్యాయవాది. ‘‘ఈ దేశంలో కావలసినన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. కేసు ఆరు నెలలు వాయిదా పడాలా? రెండేళ్లు వాయిదా పడాలా? లేక శాశ్వతంగా నిలిచిపోవాలా? ప్రతి పనికీ రేట్లున్నాయి’’ అన్నాడు. ‘‘ఎలా?’’ అని తెల్లబోయాను. ‘‘రెండు నెలలు వాయిదా పడాలంటే – కరెక్టుగా డిపార్టుమెంటులో మీ కేసు ఫైలు మాయమయిపోతుంది. మళ్లీ కావలసినప్పుడు కనిపిస్తుంది. మంచి ధర చెల్లిస్తే శాశ్వతంగానూ మాయమయిపోగలదు’’ అన్నాడు. మరో సరదా అయిన కథ. అలనాటి మద్రాసులో 1985 వరకు రచయితలకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు ఆటపట్టయిన ఒక మార్కెట్ ఉండేది– ఇప్పటి సెంట్రల్ స్టేషన్‌ని ఆనుకుని. దాని పేరు మూర్ మార్కెట్. అక్కడ పుస్తకాల షాపుల్లో – ఆరోజుల్లో దొరకని పుస్తకం లేదు. ఆ షాపుల వాళ్లు తమిళులు. అయినా సంవత్సరాల తరబడి – అనుభవం వల్ల– చాలా విజ్ఞతనార్జించినవారు. వారికి ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’ తెలుసు. ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుసు. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుసు. ఆరుద్రని తెలుసు. డి. ఆంజనేయులు గారిని తెలుసు. బులుసు వెంకట రమణయ్య గారిని తెలుసు. వీరందరికీ ఆ మార్కెట్ విజ్ఞాన భాండాగారం. అలాగే సైన్స్, ఖగోళ ఇతర విభాగాల ప్రముఖులూ అక్కడ ప్రతిదినం కనిపించేవారు. అదొక విజ్ఞాన కూడలి. దరిమిలాను సెంట్రల్ స్టేషన్లో రద్దీ పెరిగి, దాని విస్తృతి చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ మూర్ మార్కెట్‌ని తొలగించాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. మేధావులు హాహాకారాలు చేశారు. సంపాదకుని లేఖలు రాశారు. మేయర్‌కి హెచ్చరికలు చేశారు. గవర్నమెంటుకి వారి కిటుకులు వారికి ఉన్నాయి. అప్పటికి కిమ్మనకుండా నోరు మూసుకుంది. 1985 మే 30వ తేదీ అర్థరాత్రి – నగరం నిద్రిస్తున్నప్పుడు మూర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోట్ల విలువయిన పుస్తకాలు, షాపులు నేలమట్టమయ్యాయి. అందరూ నిశ్చేష్టులయ్యారు. తెల్లవారే సరికి మూర్ మార్కెట్ లేదు. ఆ మధ్య హుద్‌హుద్ జల ప్రళయం పెట్టుబడిగా ఎంత మంది రెవెన్యూ అధికారులు ఎన్ని ఫైళ్లను నీటిపాలు చేశారో, తత్కారణంగా ఎంతమంది భూబకాసురులకు కలసి వచ్చిందో ఇప్పుడిప్పుడే కథలు బయటికి వస్తున్నాయి. చాలామంది రెవెన్యూ అధికారుల గోత్రాలు రోజూ పత్రికల్లో వెల్లివిరుస్తున్నాయి. ఎంతోమంది తాసీల్దారుల లీలలు చదువుకుంటున్నాం. దేశంలో ఒక పక్క నితీశ్ కుమార్‌గారి హఠాత్ మానసిక పరివర్తన, నవాజ్ షరీఫ్ సాహెబ్‌గారి హఠాత్ పదవీ చ్యుతి వంటి ‘రుచి’కరమయిన వార్తలు చదువుకుంటున్న నేపథ్యంలో – వార్తాపత్రికల్లో ఆరవ పేజీలో అంగుళం మేర ఒక వార్త ప్రచురితమయింది. చాలామంది చూసి ఉండరు. చూసినా పట్టించుకుని ఉండరు. అది– ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని లోక్‌నాయక్ భవన్లో ఘోర అగ్నిప్రమాదం. 26 అగ్ని మాపక దళాలు ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించాయి. అంటే ఆ అగ్నిప్రమాదం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఈ అగ్నిప్రమాదంలో విశేషం? ఆ లోక్‌నాయక్ భవన్లో మన సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ విభాగం (అంటే రాబడి పన్ను నిఘా విభాగం), రాబడి పన్ను విభాగం ఉన్నాయి. ఇవన్నీ ఈ దేశపు అవినీతి నిరోధానికి కీలక విభాగాలు. ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ముఖ్యమయిన ఫైళ్లు నాశనమయిపోయాయి?ఎన్ని దొంగ లెక్కల ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి? ఎంతమందికి ఈ ‘ప్రమాదం’ ప్రమోదాన్ని ఇవ్వగలదు? మనకు తెలియదు. ఏ పెద్ద మనుషులు ఈ చక్కని ప్రమాదాన్ని ఎంత ఖర్చుతో నిర్వహించారు? మనదాకా రాదు. పోనీ, నిజంగా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగిందనుకుందాం! రేపు–అతి నిజాయితీపరుడయిన ఏ ఖేమ్కా గారో పెద్ద కుర్చీలో కూర్చుని ‘‘ఫలానా మాల్యాగారి ఫైలు పట్రావయ్యా!’’ అంటే, గుమాస్తా చిరునవ్వు నవ్వి, ‘‘అది ఆ మధ్య జూలైలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది సార్!’’ అని సెలవివ్వగలడు. ఇచ్చినందుకు ఆయన ఇంటికి ఆ రాత్రి ఓ పెద్ద పార్సిలు మాల్యా గారి శుభాకాంక్షలతో చేరగలదు. ఇది కేవలం నమూనా ఊహ. కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. అందుకనే హిట్లర్ కనిపించినంతగా శిబి చక్రవర్తి వదాన్యత కనిపించదు. గొల్లపూడి మారుతీరావు -
జైలు వైభవం
విశ్లేషణ ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. జైళ్లు మనకు దేవాలయాలు. మన దేవుడు జైల్లో పుట్టాడు. ఆనాటి మహానుభావులంతా జైళ్లలో ఉన్నారు. ఒక్క పూనా యెరవాడ జైలులోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాశ్చంద్ర బోస్, సావర్కర్ ప్రభృతులు ఉన్నారు. ఇప్పుడూ ఆ వైభవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఓం ప్రకాశ్చౌతాలా గారు, పండిత్ సుఖ్రాంగారు జైల్లో ఉన్నారు. మొన్నటిదాకా లాలూగారు, అంతకు ముందు కనిమొళిగారు, ఏ. రాజా గారు ఉండి వచ్చారు. అది నిజంగా శిక్షా? లేక విశ్రాంతా? లేక భోగమా? మనకి తెలీదు. అదే ఆయా పెద్దమనుషులకు పెట్టుబడి. అవినీతి ఆఫీసర్లకు రాబడి. ఇలాంటి సౌకర్యాలు లోగడ అనుభవించినవారున్నారు. జెస్సికా లాల్‌ని కాల్చి చంపిన మనూశర్మకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని వారు చుట్టపు చూపుగానే జైలుకి వెళ్లి, మిగతా సమయాల్లో బయటే ఉన్నారు. వారి తల్లికి ఆరోగ్యం బాగాలేదనే మిషతో బయటికి వచ్చారు. కాని వారి తల్లిగారు చండీగఢ్‌లో మహిళా క్రికెట్ జట్టుతో గడుపుతూండగా, మనూశర్మగారు ఢిల్లీలో నైట్‌క్లబ్బుల్లో గడుపుతూ, పోలీసు కమిషనర్‌గారి కొడుకుతో తగాదా పెట్టుకున్న సంగతి వెలుగులోకొచ్చింది. అనుమతి ఇచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌గారి మీద విమర్శలు వచ్చాయి. జైలు శిక్ష పడగానే ఎటువంటివారికయినా హఠాత్తుగా గుండె నొప్పి వస్తుంది. లేదా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలంటారు. అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో, చలువ గదుల్లో, ఇద్దరు ముగ్గురు అందమయిన నర్సులు సేవలు చేస్తూండగా వారు సేదదీర్చుకుంటారు. ఇందుకు గొప్ప ఉదాహరణ– నితీశ్ కటారాను చంపిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిన వీరిద్దరూ ఇలాంటి సుఖాల్నే అనుభవించారు. వికాస్ యాదవ్ 98 సార్లు మాత్రమే విడిది చేశారు. విశాల్ యాదవ్ గారి అనారోగ్యం ఇంకా బలమైనది. వారు కేవలం 105 సార్లు మాత్రమే విడిది చేశారు. నిక్షేపం లాంటి కొడుకుని పోగొట్టుకున్న నీలం కటారా ఈసారి కోర్టుని–శిక్ష వేయాలని కాదు, వేసిన శిక్షని అమలు జరపాలని ఆశ్రయించారు. ఆ తల్లి ఆర్తిని గ్రహించిన సుప్రీం కోర్టు ఈసారి మన ఖరీదయిన ‘రోగులకు’ 30 ఏళ్లుగా శిక్షను పెంచింది. ఇవన్నీ మన జైలు ఆఫీసర్ల అవినీతిని ఆకాశంలో నిలిపే కథలు. ప్రస్తుతం జైళ్లలో ఇలాంటి వైభవం కొనసాగుతోందనడానికి నిదర్శనం శశికళగారు రాజభోగాలతో కర్ణాటక జైల్లో ఉండడం. అందుకు వారు కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని మనకు తెలిసింది. వారు నలుగురిలాగా సాదాసీదా ఖైదీ. అయినా ఆవిడకి 5 వరస గదుల వసతిని జైలు పెద్దలు కల్పించారు. మధ్య గదిలో ఉంటూ మిగతా గదుల్లో ఆమె సరంజామా పెట్టుకుంటారు. ప్రత్యేకమైన వంటలు అమెకి చేయిస్తారు. హాయిగా నైటీలు వేసుకుంటారు. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు సిల్కు దుస్తులు– చుడీ దార్లు వేస్తారు. టేపుల దుకాణం నడుపుకునే ఆవిడకు ఇంత డబ్బు ఎక్కడిది? జయలలిత డబ్బు ఆవిడ ఖాతాలోకి ఎంత చేరింది? పదవుల కోసం కొట్టుకుంటున్న ప్రస్తుత పార్టీ నాయకులకు ఇది పిడకల వేట. ఏతావాతా–ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. ఎన్నోసారి? గత 17 సంవత్సరాలలో 26వ సారి. అంటే ప్రతీ ఏడెనిమిది నెలలకి ఒక్కో ట్రాన్స్ ఫర్ జరిగింది. లోగడ ఇలాంటి అడ్డదిడ్డమయిన ‘నీతి’ని పట్టుకు వేలాడినందుకు ఒకానొక ఐయ్యేయస్ ఆఫీసరు–ఖేమ్కాగారిని కాంగ్రెసు నాయకత్వమే బదిలీలు చేసి చేతులు కడుక్కుంది. ఎన్నిసార్లు? 27 సంవత్సరాలలో 47 సార్లు. ఆ మధ్య దుర్గా నాగ్‌పాల్ అనే సరికొత్త ఐయ్యేయస్‌కి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ ప్రభుత్వం అధికారం ‘రుచి’ని చూపి నోరు మూయించిన కథ మనం చదువుకున్నాం. ఈ దిక్కుమాలిన నీతిపరులు మరీ శ్రుతి మించితే? ఏం జరుగుతుందో లోగడ ధనంజయ్ మహాపాత్రా గారి ద్వారా అవినీతిపరులు నిరూపించారు. చివరిగా డి. రూప అన్నమాట: ‘అవినీతి జరిగినప్పుడు–నోరు విప్పకపోతే–ఆ అవినీతికి పరోక్షంగా మనం మద్దతు ఇచ్చినట్టే.’ వ్యవస్థని ఎదిరించడానికి దమ్ము కావాలి. చిత్తశుద్ధి కావాలి. అకళంకమైన శీల సంపద కావాలి. అడ్డదారిన డబ్బో, పదవో దక్కించుకోవాలనే దేబ రింపు గల అవకాశవాదులకు ఇవన్నీ గగన కుసుమాలు. ఖేమ్కాలు, రూపలు, ధనంజయ్లూ అరుదుగా కనిపిస్తారు. దుర్గా నాగ్‌పాల్‌లు తొలిరోజుల్లోనే మూగపోతారు. ప్రతీ తరానికీ మహాత్ముడు పుట్టడు. నీతి నిప్పు. పాటించిన వారికి అది వెలుగు. తేజస్సునిస్తుంది. పాటించని వారిని కాలుస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
నిశ్శబ్ద పథికుడు
జీవన కాలమ్ ‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. కొందరు జీవితం నుంచి నిశ్శ బ్దంగా శెలవు తీసుకుంటారు. కొందరు దాశరథి మాటల్లో ‘నిశ్శబ్దం ఎరుగనట్టి నిమ్నగ’ లాగ ఝంకారం చేస్తూ నిష్క్రమిస్తారు. కొందరు విస్తృతమైన పరిధులకు చేతులు సాచి, తమదైన పోరాటాన్ని జరిపి నిశ్శ బ్దంగా వెళ్లిపోతారు. అలాంటి సాహితీ బంధువు పి. సూర్యప్రకాశరావు. అలా చెప్తే చాలామందికి తెలీదు. నవభారత్ ప్రకాశరావుగారు. ఈనాటికీ వైభవోపేతంగా విజయవాడలో సాగే పుస్తక ప్రదర్శనోత్సవాలను ప్రారంభించిన వారిలో ప్రకాశరావుగారు ఒకరు. యుద్ధనపూడి సులోచనారాణి, కొమ్మూరి వేణుగోపాలరావు, మాదిరెడ్డి సులోచన రచనల్ని పాపులర్ చేసిన ఘనత ప్రకాశరావుగారిది. పుస్తక ప్రచురణలో చక్కని సంప్రదాయాన్ని నిలిపిన ప్రచురణకర్త. మొదట్లో ప్రకాశరావుగారు నవోదయా నిర్వహించేవారు. నేను యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే (1959) నా మొట్టమొదటి పుస్తకం– ‘అనంతం’ నాటికని అచ్చువేసిన ప్రచురణకర్త ప్రకాశరావుగారు. ఆ ఆనందం వర్ణనాతీతం. అప్పటికి ప్రకాశరావుగారితో కేవలం ఉత్తరాల పరిచయమే. తర్వాత మా సాన్నిహిత్యం విచిత్రమైనది. నన్ను మొట్టమొదటి నవలకు పురికొల్పింది ఆయనే. ఆ నవల ‘చీకటిలో చీలికలు’. ఆనర్స్ అవుతూనే ఢిల్లీ వెళ్లి– విజయవాడలో ఆంధ్రప్రభ ఉద్యోగానికి నార్ల, కపిల కాశీపతి వంటి వారి ఉత్తరాల్ని పట్టుకుని విజయవాడలో పూర్ణానంద సత్రంలో రసన సమాఖ్యలో దిగాను. అప్పటికి వారికి ‘రాగరాగిణి’ రాశాను. వచ్చిన రోజు సాయంకాలమే నా జేబులో ఉన్న 15 రూపాయలు ఎవరో కొట్టేశారు. ప్రకాశరావుగారికి చెప్పాను. గల్లాపెట్టె తెరిచి 13 రూపాయలిచ్చి శాంతి కేఫ్‌లో నెలవారీ భోజనం టికెట్ల పుస్తకం తెప్పించారు. జైహింద్ రోడ్డులో ఆయనకి తెలిసిన ఓ టైర్ల దుకాణం వెనుక గదిని ఏర్పాటు చేశారు. 8 రూపాయలకి మడత కుర్చీ కొన్నారు. అది నాతో పెళ్లయి, పిల్లలు పుట్టేదాకా ఉంది. ఎప్పుడు డబ్బు అయిపోయినా స్వయంగా నవోదయా గల్లాపెట్టె తెరిచి 5 రూపాయలు తీసుకునేవాడిని. రోజూ షాపు మూశాక– ఆ రోజు నేను రాసిన ‘చీకటిలో చీలికలు’ నవల భాగాలు విని ఇంటికి వెళ్లేవారు. మరో ఆరు నెలలకి ఆంధ్రప్రభలో ఉద్యోగం వచ్చింది. మరో నెలలో చిత్తూరు బదిలీ. అప్పటికి నవోదయా నుంచి బయటికి వచ్చి నవభారత్ బుక్ హౌస్‌ని ప్రారంభించారు. 56 సంవత్సరాల కిందట– హన్మకొండలో ఓ తెల్లవారుఝామున మూడున్నరకి జరిగిన నా పెళ్లికి నా మిత్రులు ఇద్దరే హాజరయ్యారు– నవభారత్ ప్రకాశ రావు, నవోదయా రామమోహనరావు. అప్పటికి ప్రచురితమయిన నా రచనల్ని వెల్వెట్ బైండు చేయించి మా ఆవిడకి బహూకరించారు. ఓసారి రాత్రి 11 గంటలకి హైదరాబాదులో తలుపుతట్టి– సరాసరి మద్రాసు తీసుకుపోయి– దర్శకుడు చాణక్యముందు కూర్చోపెట్టారు–కొత్త సినీమా చర్చలకి. ఆయన ఆలోచనలు విప్పి చెప్పగలిగింది ఒక్క నాకే. నేను ఆయన మౌత్ పీస్‌ని. నవభారత్ మూవీస్ పేరిట అక్కినేనితో తీసిన ‘రైతు కుటుంబం’ సినీమాకి నేను కథ, మాటల రచయితని. తాతినేని దర్శకుడు. పూర్ణచంద్రరావు, మేనేజరు (పీఏపీ) సుబ్బారావుగారు పార్ట్నర్స్. మంచి హిట్. ఆయన వామపక్ష భావాలున్న మనిషి. వాటిని ప్రతిఫలించే ‘ముగ్గురమ్మాయిలు’ చిత్రాన్ని ప్రత్యగాత్మతో ప్రారంభించారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మగారిచేత విజయవాడలో కూర్చుని సంభాషణలు రాయించారు. శర్మగారికి ఆ పనిలో అనుభవం లేదు. స్క్రిప్ట్ తిరగరాయాల్సిన పరిస్థితి. నేను రోజుకి 18 గంటలు పనిచేసే రోజులు. నా ఉద్యోగం, కథా చర్చలు– అన్నీ ముగించుకుని ఏ రాత్రి పదికో వచ్చేవాడిని. అప్పుడు ఆ సీన్ల రచన. ఓ మిత్రుడి కోసం భయంకరమైన ఒత్తిడి పడిన రోజులవి. తీరా సినీమాలో నా పేరు వేస్తానన్నారు. నేను సుతరామూ ఒప్పుకోలేదు. అది పద్ధతి కాదన్నాను. నెలల తర్వాత తమ్ముడు బోసుకిచ్చి నాకు నవరత్నాల ఉంగరం పంపారు. ఆ ఉంగరం నా చేతికి 45 సంవత్సరాల నుంచీ ఉంది– ఇప్పటికీ. ఏడు సంవత్సరాల కిందట అనారోగ్యంతో మంచం పట్టారు. తరచూ వెళ్లి చూసేవాడిని. ఆఖరుసారి వెళ్లింది– జనవరి 2. మాటలో బొత్తిగా సమన్వయం పోయింది. విచిత్రంగా ‘మీరొచ్చాకే ఈ మాత్రం మాట్లాడారు’ అన్నారు ఆయన భార్య. నిన్న వారమ్మాయి ఫోన్. కొన్నాళ్ల కిందట మంచం మీద నుంచి లేవబోయి కిందపడ్డారు. తుంటి ఎముక విరిగింది. అది ముగింపుకి నాంది. ‘విజయం’ అనేది ఎవరిని వరిస్తుందో తెలియదు. తను నమ్మిన ఆదర్శాలకు రూపకల్పన చేసే మాధ్యమంలో విజయం కలిసి వస్తే ప్రకాశరావుగారు చాలామంది చెయ్యడానికి సాహసించని చిత్రాలు తీయగలిగేవారు. ఆయన అపజయాన్ని అంగీకరించని యోధుడు. అరుదైన మిత్రుడు. - గొల్లపూడి మారుతీరావు -
అవినీతీ! నీవెక్కడ?
♦ జీవన కాలమ్ సమాధానాలు చాలామందికి తెలుసు. అవినీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతిబింబం. ఒకానొక అధికార సంస్థ 20 రాష్ట్రాలలో జరిపిన సర్వేలో దేశంలో అవినీతి నిలదొక్కుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కి రెండవ స్థానం లభించింది. మొదటి స్థానం కర్ణాటకకి దక్కింది. అలనాడు రాజగోపాలాచారి సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఒకమాటన్నారు. ‘‘అవినీతిలో తమిళ ఇంజనీర్లకీ, తెలుగు ఇంజనీర్లకీ తేడా ఉంది. తమిళ ఇంజనీర్లు పనిచేసి లాభాలలో వాటాల్ని తింటారు. తెలుగు ఇంజనీర్లు కంకరనే తినేస్తారు’’అని. ఆయన అత్యంత కుశాగ్రబుద్ధి కలవారు. డిపార్టుమెంటు పేరు, పని చెప్పకుండా ఒక తెలుగు ఉదాహరణ. ఒక రిటైరయిన యూనివర్సిటీ ప్రొఫెసరు గారు– ఆయన వయసు 84 సంవత్సరా లు–ఒకానొక డిపార్టుమెంటులో పనికావలసి ఉంది. రెండ్రోజులలో కొడుకు అమెరికా వెళ్లిపోతున్నాడు. ఈలోగా జరగాలి. స్వయంగా ఫలానా ఆఫీసుకి వెళ్లారు– తన హోదాకీ, వయసుకీ మర్యాద దక్కుతుందనే దురభిప్రాయంతో. అతి సాదా ఉద్యోగి ముందు కూర్చున్నారు. అరగంట సేపు ఆ ఉద్యోగి కాగితాలు సవరించుకుంటూ కూర్చున్నారు– ఈయన్ని గమనించక. ఎట్టకేలకు ఆయన కరుణా వీక్షణం ప్రసరించింది. పని చెప్పారు. సదరు ఉద్యోగి టేబిలు మీద ఉన్న కాగితాలను పరామర్శించారు. ‘మీ కాగితం ఇక్కడ లేదండి’అన్నారు. ‘మర్కెడ ఉంటుంది?’ ‘అదిగో, ఆ నల్లచొక్కా ఆయన టేబిలు మీద’ నల్లచొక్కా కూడా ఇలాగే పనిలో మునిగిపోయాడు. తీరా వీరి కథ విని ఆయన కాగితాలు కూడా కదపలేదు. ‘నా దగ్గర ఏ కాగితమూ ఉండదండి’అని తేల్చారు. ‘మర్కెడ ఉంటుంది?’ ‘అదిగో, ఆ ఎర్రచొక్కా దగ్గర’ అక్కడా మరో 40 నిమిషాలు గడిచాక ఇదే పరిస్థితి. ఈలోగా దూరం నుంచి చూస్తున్న మరో ఉద్యోగి వచ్చాడు. పక్కకి పిలిచాడు. ‘‘అయ్యా, గంటన్నర నుంచి చూస్తున్నాను. తమరు పెద్దవారు. ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతోంది. నేనో ఉపాయం చెబుతాను. రెండువేలు ఇవ్వండి. రేపు మీ ఇంటికి కాగితాన్ని నేను తెచ్చి ఇస్తాను’’ అన్నాడు. ఈయన డబ్బిచ్చాడు. కాగితం ఇంటికి ఫలానా ఎర్రచొక్కా దగ్గర్నుంచి వచ్చింది. ఉండబట్టలేక వెళ్లిపోతున్న ‘నిజాయితీ’పరుడైన ‘అవినీతి’పరుడిని ఈ వెర్రి ప్రొఫెసరు అడిగారు, ‘‘ఈ డబ్బులో తమకూ వాటా ఉందా బాబూ!’’అని. చదువుకున్న వెర్రిబాగుల వాడిని చూసి ఆయన నవ్వాడు. ‘‘తమరు పెద్దవారు. అలాంటివి అడక్కూడదు’’ అనేసి వెళ్లిపోయాడు. ఇదీ కథ. అవినీతిలో మన తర్వాతి స్థానంలో ఉంది తమిళనాడు. తమిళ ఉద్యోగి ‘అవినీతి’లో అతి నిజాయితీపరుడు. మీరు డబ్బు ఇచ్చేదాకా మీ మొహం చూడడు. తీరా ఇచ్చాక– అంత నిజాయితీపరుడైన సేవకుడు మరొకడు ఉండడు. ‘‘తమరు ఇంటికి వెళ్లండి యజమానీ (‘యజమానీ’అన్నమాటను గుర్తించాలి). నేనెందుకు ఉన్నాను యజమానీ! నా ప్రాణం పోయినా తెల్లవారేసరికి మీ కాగితం మీ చేతుల్లో ఉంటుంది’’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతాడు. తమిళ ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ఒక అవకాశం. తెలుగు ‘అవినీతిపరుడి’కి ‘లంచం’ ఒక హక్కు. ‘‘డబ్బు ఇచ్చాను కదండీ!’’అన్నారనుకోండి– ‘‘ఇస్తే? నీ కాగితం నీ దగ్గరికి నడిచి వస్తుందా? నీలాంటి వాళ్లు బోలెడుమంది ఉన్నారు. ముష్టి మూడువందలు ఇచ్చాడట. వెళ్లు. మధ్యాహ్నం కనబడు’’– ఇదీ తెలుగు నమూనా. ‘‘యజమానీ! నీకు సేవ చేయడానికి కాక నేనెందుకు ఉన్నాను, యజమానీ!’’ ఇది తమిళ నమూనా. సమాధానాలు చాలామందికి తెలుసు. అవి నీతికి పెట్టుబడి అవసరం మాత్రమే కాదు, చెల్లుబాటు అవుతుందన్న ధైర్యం. అవినీతి వ్యవస్థ బలహీనతకి నిదర్శనం. నాయకత్వ శీలానికి ప్రతి బింబం. మరొక అడుగు ముందుకు వేస్తే – పాలకవర్గం చేతులకి గాజులు తళతళా మెరుస్తున్నప్పుడు – సర్వే సర్వత్రా– చెప్పులు గాలిలోకి లేస్తాయి. చివరిగా– ఒక కొసమెరుపు. విశాఖపట్నం కళాభారతిలో నెలకి 20 రోజులు మంత్రులు, గవర్నర్లు, నాయకులు వచ్చే సభలు జరుగుతాయి. నగరంలో ప్రముఖమయిన ఆడిటోరియం అది. ప్రతీ సోమవారం కొన్ని వందలమంది ఆ వీధిని కమ్మేస్తారు. కారణం– సంత. ప్రతి అంగుళం రోడ్ల మీద వ్యాపారాలు పరుచుకుంటాయి. కార్లు, మనుషులు నడిచే దిక్కులేదు. రాత్రి 10 వరకూ భయంకరమైన గోల, ముమ్మరం. ఇదేమిటి? నగరంలో, ఇంత ప్రముఖమయిన వీధిలో సంతా? అధికారులకి తెలియదా? కార్పొరేషన్ అధికారులు గుర్తించలేదా? పోలీసులు గమనించలేదా? నేను ఎందరికో చెప్పాను. ఉత్తరాలు రాశాను. ఫలితం సున్నా. దక్షిణ భారతంలో స్వచ్ఛ నగరంగా, తలమానికంగా నిలిచిన విశాఖ పట్నానికి కళాభారతి ‘సంత’ మినహాయింపేమో! అవినీతి పెట్టుబడి. అధికారులకి రాయితీ. అధికారానికి తాయిలం. మన అదృష్టం– అవినీతిలో మనది రెండో స్థానం. అంటే– ‘అవినీతి’ అభివృద్ధికి ఇంకా మరో మెట్టు ఎక్కే ఆస్కారముంది! (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు ) -
సినారె జ్ఞాపకాలు
సినారె గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం–సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. దాదాపు 47 సంవత్సరాల కిందటి మాట. మద్రాసు టి.నగర్లో సుధారా హోటల్లో సినారెది 12వ నెంబర్ గది. నాది పదకొండు. రోజంతా నేను కథా చర్చలు, సంభాషణల రచనా చూసుకుని గదికి చేరేవాడిని. ఆయనది పాటల పరిశ్రమ. నా గది తలుపు చప్పుడు కాగానే వచ్చేవారు. ఇద్దరం ఆనాటి కార్యకలాపాలను పంచుకుంటూ రాత్రి పన్నెండున్నర దాకా కాలక్షేపం చేసేవాళ్లం. ఆ రోజుల్లోనే –నేను రేడియోకు శలవు పెట్టి సినీ పరిశ్రమలో అడుగుపెట్టాలని రెచ్చగొట్టే మిత్రులలో సినారె ఒకరు–ఆయనా అటు విద్యారంగంలో ఉంటూ అలాంటి పని చేస్తున్నారు కనుక. కరీంనగర్ రోజుల్లో –అంటే ఆయన చిన్నతనంలో మా మామగారు ఆయనకి ఇంగ్లిష్ గ్రామరు నేర్పేవారు. మా ఆవిడని ’గురుపుత్రి’ అనే పిలిచేవారు ఎప్పుడు కలిసినా. చిన్నతనంలో మా రెండో అబ్బాయి రామకృష్ణ (మా మామగారి పేరు) ఆయనకి నమస్కారం పెట్టేవాడు కాడు– మా ఆవిడ ఎంత చెప్పినా. ఆయన నవ్వి: ఎందుకు పెడతాడు? నా గురువు కదా? అనేవారాయన. ఒకసారి కరీంనగర్ కాలేజీలో సాంస్కృతిక సభకి నాకూ ఆయనకీ ఆహ్వానం వచ్చింది. మూడు కారణాలకి అది నాకు ముచ్చట. మా ఆవిడ చదువుకున్న ఊరు. విశ్వనాథ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కాలేజీ. మా మామగారూ అక్కడ హైస్కూలు హెడ్ మాస్టరుగా చేశారు. ఇద్దరం వెళ్లాం. రాత్రి పదిగంటలకి భోజనం చేసి ఇద్దరం కారులో కూర్చున్నాం. డ్రైవరు ఈడిగిలపడుతూ కారు నడుపుతున్నాడు. కారణం అడిగాం. అది ఎన్నికల టైము. చెన్నారెడ్డిగారూ, వందేమాతరం రామచంద్రరావుగారూ పోటీ చేస్తున్న ఆ నియోజక వర్గంలో గత నాలుగు రోజులుగా నిద్ర లేకుండా కారు నడుపుతున్నాడట. మేమిద్దరం గతుక్కుమన్నాం. అక్కడి నుంచి హైదరాబాద్‌కి నాలుగు గంటల ప్రయాణం. డ్రైవర్ నిద్రని ఆపేదెలా? ఇద్దరం పాటలూ, పద్యాలూ లంకించుకు న్నాం. నోటికి వచ్చిన పాటలు, పద్యాలు–కేకల స్థాయి లో. హైదరాబాద్ 2 గంటలకు చేరాం. ఇద్దరం అలసటతో కూలిపోయాం. అదొక మరుపురాని సంఘటన. మా ఇద్దరి జీవితాలు ఆసాంతమూ పడుగు పేకల్లా సాగాయి. నేను రాసిన ఎన్నో చిత్రాలకు ఆయన పాటలు రాశారు. నేను నటుడినయ్యాక ఆయన రాసిన ఎన్నో పాటల్ని నటించాను. నా రెండో రోజు షూటింగులోనే ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’లో ‘స్వామి శరణం అయ్యప్పా’ పాట! నేను ఎప్పుడూ అనేవాడిని. ‘నేను పది సీన్లలో చెప్పిన విషయాన్ని మీరు పదిమాటల్లో లేపుకుపోతారు’ అని. అది పాటకి ఉన్న ఒడుపు. కర్నాటకలో హంపీ దగ్గర కమలాపురం గెస్టు హౌస్‌లో ఉంటూ పుండరీకాక్షయ్య గారి ‘మావారి మంచి తనం’ సినీమాకి ఆయన పాటలూ, నేను మాటలూ పూర్తి చేశాం. రోజూ ఉదయమే సినారె నిద్రలేపేవారు. అలాగే మారిషస్ ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లినప్పుడు. మా ఉదయపు నడకల్లో ఎన్నో పాటలు రూపుదిద్దుకోవడం నాకు తెలుసు. హేరంబ చిత్ర మందిర్ ‘మాంగల్యానికి మరోముడి’ పాటల కంపోజింగు. విశ్వనాథ్, సినారె నేనూ కూర్చున్నాం. ఉన్నట్టుండి సినారె అన్నారు: ‘వచ్చేసిం దయ్యా పల్లవి’ అని. ఇదీ ఆయన చెప్పిన పల్లవి: గొల్లపూడి చిన్నవాడి అల్లరి నవ్వు పట్టపగలు విరబూసే పున్నమి పువ్వు జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు! ఆయన జ్ఞానపీఠ పురస్కారానికి అభినందన సభ మద్రాసు సవేరాలో. దేవులపల్లి, ఇచ్చాపురపు జగన్నాధరావు ప్రభృతులంతా ఉన్నారు. నేను వక్తని. 1988లో రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కార సభకి నేను ప్రధాన వక్తని. నా షష్టిపూర్తికి వచ్చిన నలుగురు ఆత్మీయులు– సినారె, అక్కినేని, గుమ్మడి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. అదొక మధురానుభూతి. ఆయన చేతుల మీదుగా వంగూరి ఫౌండేషన్ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నాను. ఇలా రాస్తూ పోతే పెద్ద జాబితా. ఆయన ముందునుంచీ నా రచనలకు అభిమాని. 1969లో ఎమెస్కోవారు ప్రచురించిన నా ‘పిడికెడు ఆకాశం’ నవల చదివి ఉత్తరం రాశారు. ‘నవల పోను పోను గంభీరంగా ఉంది. గమకం ఆద్యంతమూ ఉందనుకోండి. ముగింపు అద్భుతం. వస్తువును స్వీకరించడంలో మీకున్న దమ్ము రుజువయింది’. ఆయన గొప్ప వక్త. అనితర సాధ్యంగా సభా నిర్వహణ చేసేవారు. ఆయన ప్రసంగం కవితాపఠనంలాగ సాగేది. చివరి రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది. కాని ప్రతి సాయంకాలం– సాహితీ ప్రసంగాల రుచిని వదులుకోలేకపోయేవారు. ఇద్దరు మనుషులు, ఒక తలగడ, క్లుప్తంగా రెండు మాటలూ– ఒక మహావక్త గతాన్ని తలుచుకుని మనస్సులో కలతగా ఉండేది. అయితే ఆ కాస్త participation ఏ ఆయనకు ఆటవిడుపు. వయస్సు, ఆరోగ్యం ఎదురుతిరుగుతున్నా– కవితలు మానలేదు. ఎప్పడూ ఏవో పత్రికల్లో కనిపిస్తూండేవి. అది సినారె ‘ప్రాణవాయువు’గా అస్మదాదులం గుర్తుపట్టేవాళ్లం. సినారె ఒక ప్రభంజనం. ఈ తరం సంతకం. - గొల్లపూడి మారుతీరావు -
చెవిలో పువ్వులు
రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం– హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక. వెనకటికి–ఎవడో తాడిచెట్టు మీద కనిపించాడట– సీజన్ కాని సీజన్ లో. ‘ఏమయ్యా! ఇప్పుడు తాటిచెట్టు ఎందుకు ఎక్కావయ్యా?’ అని దారిన పోయేవాడు అడిగాడట.‘‘దూడ గడ్డికి గురువుగారూ!’’అన్నాడట ఈయన. మనదేశంలో బోలెడన్ని తాడిచెట్లు– దూడగడ్డికోసం వాటిని నిరంతరం ఎక్కే హార్వర్డ్ చదువుల మంత్రులు బోలెడంత మంది ఉన్నారు. మాయావతిగారికి ఏ అన్యాయం జరిగినా– ఆమె సమాధానం ఒకటుంది– అది ప్రతిపక్షాలు తన మీద జరిపిన కుట్ర– అని. కేజ్రీవాల్ బాత్రూంలో కాలుజారి పడినా– అతనికో ఒడుపు ఉంది. నరేంద్ర మోదీగారు ప్రతిపక్ష నాయకులను వారి బాత్రూంలలోనయినా క్షేమంగా ఉండనీయడంలేదని. ఇవి ప్రతి పక్షాల ఆలోచనా సరళికి నమూనాలు. ఆయన పార్టీలోనే ఆయన ఎంపిక చేయగా శాసనసభ్యుడయి, మంత్రి కూడా అయిన కపిల్ మిశ్రా ఏవో రాజకీయ కారణాలకి కేజ్రీవాల్ మీద కాలుదువ్వుతున్నారు. ఎన్నో రకరకాల అవినీతుల చిట్టా విప్పారు. కేజ్రీవాల్ వాటికేమీ సమాధానం చెప్పకపోగా బీజేపీ కపిల్ మిశ్రాతో ఈ కుట్ర జరుపుతోందన్నారు. ఇంతకన్నా సరదా అయిన విషయం. ఒకప్పటి ఆర్థికమంత్రి చిదంబరంగారి అబ్బాయి కార్తీ చిదంబరం– తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని కోట్ల వ్యాపారం చేసినట్టు నేర పరిశోధక శాఖ రుజువులతో సహా చిట్టా విప్పింది. హార్వర్డ్‌లో చదువుకుని, ఈ దేశానికే ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరంగారు ఏమన్నారు? తను పత్రికలలో పాలకవర్గం మీద రాసే వ్యాసాలకు భయపడి, తనని రాయకుండా చేయడానికి పాలకవర్గం తన మీద కుట్ర సాధిస్తోందన్నారు. ఇది ఓ గొప్ప మేధావి మాత్రమే గ్రహించగల రాజకీయ కుట్ర. కార్తీ చిదంబరం అవినీతికీ–అందుకు కావలసిన సాక్ష్యాధారాలు దొరకడానికీ–చిదంబరంగారి పత్రికా వ్యాసాలకీ ఏం సంబంధం? గత 13 సంవత్సరాలుగా సోనియాగాంధీ వియ్యపురాలికి– అనగా రాబర్ట్ వాద్రా తల్లిగారి రక్షణకు ప్రభుత్వం ఖర్చు చేసిన కోట్ల ధనానికీ, ప్రస్తుత పాలకులకూ ఏమిటి సంబంధం? ఉంది బాబూ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పదవిలో ఉంటే సోనియా గాంధీ వియ్యపురాలి మీద ఈగ వాలనిచ్చేవారా? మళ్లీ మాట్లాడితే ఆమె పక్కింటివారికి కూడా రక్షణ కల్పించేవారు. కారణం– వారి ఇంటి గోడలు పొట్టిగా ఉన్నాయి కనుక. పాక్ దౌర్జన్యకారులు పక్కింటి ద్వారా వీరి ఇంట్లో జొరబడి వియ్యపురాలిని ఎత్తుకుపోతే దేశానికి ఎంత ప్రమాదం? కనుక ఇందులో బీజేపీ కుట్ర బోలెడంత ఉంది. ఇంతకీ ఓటరు చెవుల్లో పెట్టడానికి నాయకుల దగ్గర బోలెడన్ని పువ్వులున్నాయి కాని–దురదృష్టవశాత్తు చెవులు ఖాళీ లేవు. అవినీతికి సాక్ష్యాలు గట్టిగా దొరికినప్పుడు తప్పించుకునే దారులు అన్నీ మూతపడతాయి. అప్పుడు ఇలాంటి అడ్డదారులు అవసరమౌతాయి. ఓటరుకి నిజంగా అర్థమౌతోందనీ, అయితే అతను నోరు విప్పడానికి ఎన్నికల దాకా అవకాశం రాదనీ ఈ నాయకులు గమనించరు. తీరా మాడు పగిలేటట్టు ఓటరు ఛీకొట్టాక అపజయానికి దొంగ కారణాలు వెతుకుతారు. ఒకనాడు ప్రతిపక్షాల మాడు పగులగొట్టి బేషరతుగా ఆమ్ ఆద్మీ పార్టీని ఓటరు అందలం ఎక్కించినప్పుడు ఓటింగ్ మెషీన్లు బాగా పనిచేశాయి. ఇప్పుడు తమ పార్టీని తిరస్కరించినప్పుడు మిషన్లలో తేడాలొచ్చాయి. ఇదివరకు ఓటరు తన చెవుల్ని తడువుకుంటూ పువ్వుల్ని లెక్కపెట్టేవాడు. కానీ ఇప్పుడిప్పుడే వ్యవస్థ కళ్లు తెరిచింది. రోజు రోజుకీ ఆయా సిద్ధాంతాల ముసుగులు కప్పుకుని ‘పత్రికా స్వేచ్ఛ’ అని ఊదరగొట్టే ‘కొంగు’ పత్రికల చాకచక్యాన్నీ, జరిగే ప్రతిదానికి మతం, కులం రంగు పూసే కుహనా మేధావుల భాషణల్నీ దాటి కులాలు, మతాలకు అతీతంగా తన శ్రేయస్సుని కాపాడే నాయకత్వానికి ఓటరు బేషరతుగా నిర్దుష్టంగా పట్టం కడుతున్నాడు. నిన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలుపుకి అర్థం కేవలం ఆ పార్టీ పరపతి మాత్రమే కాదు. ఇన్నాళ్లూ నాయకులు నమ్మించిన ‘సంకుచిత’ పరిధుల్ని దాటి తన మంచిచెడ్డల్ని ఆయా నాయకుల ‘మూస’లకి దూరంగా, భిన్నంగా, గంభీరంగా ఓటరు నిలవగలుగుతున్నాడనడానికి నిదర్శనం. ఆత్మవంచన చేసుకునే ప్రతిపక్షాల కుట్రల సాకు వెనుక – ఓటింగు మిషన్ల లోపం వెనుక – దాగొనే నాయకులకి ఈ హెచ్చరిక మనస్సుల్లోనయినా అంది ఉండాలి. వెన్నెముకల్లో చలి పుట్టించే ఉంటుంది. రేపు బీజేపీ తోక జాడించినా ఆ సమాధానం చెప్పగలడు. ఆ సంగతి ఆ పార్టీ పెద్దలకి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇంతవరకూ ఎన్నికల్లో గెలిచాక ఆయా పార్టీలు తమ ఇళ్లు చక్కబెట్టుకున్నాయి. ఇప్పుడు అది కుదరదని తెలిసొచ్చే రోజులొచ్చాయి. రాబోయేకాలంలో దూడగడ్డికి తాడిచెట్లని వెతకాల్సిన పనిలేదు. కారణం–హార్వర్డ్ మేధావుల కొడుకుల కాలం చెల్లింది. ఎందుకంటే చెవులకీ, పువ్వులకీ గల సంబంధం రాను రాను తగ్గబోతోంది కనుక. - గొల్లపూడి మారుతీరావు -
జ్ఞాన భాండాగారాలు
జీవన కాలమ్ ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరవకండి. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందని తను వెళ్లి నిరూపించిన సీని యర్ నాయకులు ఓంప్రకాష్ చౌతాలా. ఆయన ఉపాధ్యాయుల నియామకం విషయంలో పెద్ద కుంభకోణాన్ని జరిపి, జైలుకి వెళ్లి బుద్ధిగా చదువుకుని తన 82వ ఏట ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యారు. వారు తీహార్ జైల్లో గత నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఈ దేశ చరిత్రలో మార్గదర్శకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఈ వార్తను ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ వంటి వారు శ్రద్ధగా గమనించాలి. వారు గడ్డి కుంభకోణంలో ఆ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయాన్ని ఆయన వృధా చేసుకున్నారని చౌతాలాని చూస్తే అర్థమౌతుంది. ఆ సమయంలో కనీసం రెండో ఫారం చదివినా రేపు ప్రభుత్వం ఫైళ్లు చదువుకోడానికి ఉపయోగపడేది. అలాగే లల్లూ ఇద్దరు కొడుకులు–తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ బిహార్‌లో మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకాయన ఉప ముఖ్యమంత్రి. అర్హతలు ఏమిటీ అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. క్లాసయినా పాసయే సదవకాశాన్ని కల్పించాలి. ‘మిష’ అంటారా? తమ తండ్రిగారి లాగ ఏదో గడ్డి తిని ఆ సరాసరి ముఖ్యమంత్రి పదవికి వచ్చే అవకాశముంది. కనుక వారిని వెంటనే జైలుకి పంపి రెండో తరగతికయినా తర్ఫీదు ఇప్పిస్తారని మనం ఆశించవచ్చు. ఈ దేశంలో జైళ్లకు ఎంతో అపకీర్తి ఉంది. అలనాడు తిలక్ మహాశయులు జైల్లో ఉంటూ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. రాజాజీ పిల్లలకు అర్థమయ్యే సరళమైన ఇంగ్లీషులో రామాయణ, భారతాలను వ్రాశారు. నెహ్రూగారు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాశారు. ఇవన్నీ ఆ పెద్దల వికారాలుగా మనం సరిపెట్టుకోవచ్చు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడయినా ఇంటర్ పరీక్ష పాసయ్యేవారా? వారికి చిన్నతనంలో చదువు సరిగ్గా సాగలేదు. తర్వాత సాగించాలనుకుంటే తండ్రి దేవీలాల్‌తో పాటు రాజకీయాలలో ఉండడంవల్ల చదువుకునే అవకాశం రాలేదని ప్రస్తుత హర్యానా ప్రతిపక్ష నేత–అభయ్ సింగ్ చౌతాలా తన తాత గురించి చెప్పారు. ఈ మధ్య ఒక నానుడి ఏర్పడింది. ‘నువ్వేం చదువుకోలేదా? మరేం పర్వాలేదు. సరాసరి పార్లమెంటుకి వెళ్లే అర్హతలున్నట్టే. లేదూ? చదువుకోవాలని ఉందా? నిక్షేపంగా జైలుకి వెళ్లు’. ఈ దేశంలో ఏ అర్హతా అక్కరలేని వ్యాపకం ఒక్కటే–రాజకీయ రంగం. చదువుకుంటే గుమస్తావి అవుతావు. చదువు లేకపోతే మంత్రివి అవొచ్చు. రేపట్నుంచి జస్టిస్ కర్ణన్ వంటివారు జైల్లో ఉంటారు. మన జైళ్లలో ఉన్న కొందరు మహనీయులైన నాయకుల పేర్లు– జయలలిత, కనిమొళి, శశికళ, సురేష్ కల్మాడీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పప్పు యాదవ్, ఎ. రాజా, యడ్యూరప్ప, అమర్ సింగ్, పండిత సుఖ్రాం, మధుకోడా. అయితే వీరంతా జైళ్లను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. తను హత్యకు గురవడానికి చాలాకాలం ముందు చెర్లపల్లి జైలు నుంచి – జూలకంటి శ్రీనివాస్ అనే మొద్దు శీను నా నవల ‘సాయంకాలమైంది’ చదివి నాలుగు పేజీల ఉత్తరం రాశాడు. ఆ నవల చదివి ఉత్తరం రాసిన మరొకాయన ఉన్నారు. ఈ దేశపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు. ఆ రెండు ఉత్తరాలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే మొద్దు శీను ఉత్తరం కొట్టొచ్చినట్టు గుర్తుకు వస్తూంటుంది. కారణం– అతడు జైల్లో లేకపోతే కలలో కూడా నవల చదివి ఉండడు. ఏకాంతం అంతర్ముఖుడిని చేస్తుంది. ఆ నిశ్శబ్దం– తనకు లేనిదీ, తను కోల్పోయినదీ–గుర్తుకు తెస్తుంది. తీరిక, నిస్సహాయమైన ఏకాంతం–దాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది. అందుకు కనీసం – ఒక నేరమైనా చేయాలి. జైలుకి వెళ్లే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు – కనీసం ఇంటర్మీడియెట్ చదువయినా అబ్బుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు రాష్ట్రానికయినా ముఖ్యమంత్రులయిపోతారు. లేదా జైలుకి వెళ్లే తండ్రులుంటే పార్లమెంటు సభ్యులయినా అయిపోతారు. ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. ఈ సంస్కృతికి ఉన్న మన్నిక అది. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. కనుక నాయకులకిదే పిలుపు. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. సత్వరంగా ఏ ఉపాధ్యాయుల కొంపలో ముంచండి. లేదా గడ్డి తినండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరిచిపోకండి. గొల్లపూడి మారుతీరావు -
సంసారం ఒక చదరంగం...
నాటి సినిమా ప్రతి సంసారంలో సుఖాలు అనే తెల్లగడులు, కష్టాలు అనే నల్లగడులు ఉంటాయి. రాజు అనే కుటుంబ పెద్ద అయిన తండ్రి, మంత్రి అనే సలహాలిచ్చే తల్లి, ఏనుగులు అనే కొడుకులు, గుర్రాలు అనే కోడళ్లు, ఇంకా కూతుళ్లు అల్లుళ్లు మనమలు మనమరాండ్రు అనే బంట్లు... వీళ్లంతా ఒక్కోసారి తెల్లపావులుగా మరోసారి నల్లపావులుగా ఈ కష్టసుఖాలు తెచ్చే ఆనందాలను, అవరోధాలను చాకచక్యంగా పరిగ్రహిస్తూ ఆటను రక్తి కట్టించాల్సి ఉంటుంది. ఎక్కడ తప్పటడుగు పడినా ఎక్కడ తప్పుడు ఎత్తు వేసినా అసలుకే ఎసరు వస్తుంది. ప్రపంచంలో ఎందరో గ్రాండ్ మాస్టర్లు ఉండొచ్చు. కాని ఈ సంసారం అనే చదరంగాన్ని ఈ దేశంలో అనునిత్యం ఆచి తూచి ఆడే సగటు తల్లిదండ్రులను మించి గ్రాండ్ మాస్టర్లు ఉండరు. అలాంటి ఒక తల్లిదండ్రుల కథే ‘సంసారం ఒక చదరంగం’. పెద్దకొడుకు కోరే లెక్కా జమ.... విశాఖలోని అప్పల నరసయ్య (గొల్లపూడి మారుతీరావు) ఒక సగటు ఉద్యోగి. ఇతనికి ముగ్గురు కొడుకులు. ప్రకాష్ (శరత్‌బాబు), రాఘవ (రాజేంద్రప్రసాద్), కాళిదాసు (హాజా షరీఫ్). వీళ్ళు కాకుండా ఒక కూతురు (కల్పన). ఇంట్లో తల్లి గోదావరి (అన్నపూర్ణ), కోడలు ఉమ (సుహాసిని) ఈ కుటుంబానికి రెండు కళ్లై సంసారాన్ని సమన్వయంతో నడుపుకుంటూ వస్తుంటారు. పెద్ద కొడుకు ప్రకాష్ జీతం నెలకు 1725 రూపాయలు. అతను తన జీతంలో నుంచి 800 రూపాయలు ఇంటి ఖర్చులకు ఇస్తుంటాడు. రెండో కొడుకు రాఘవ జీతం 550. అతను తన జీతం నుంచి నాలుగొందల రూపాయలు ఇస్తుంటాడు. పెద్దాయన నరసయ్య తన జీతం ఈ డబ్బుతో కలిసి ఇంటి బడ్జెట్‌ను మేనేజ్ చేస్తుంటాడు. కాని పెద్ద కొడుకు ప్రకాష్‌కు ఇది ఇబ్బందిగా ఉంటుంది. చీటికి మాటికి తననే డబ్బు అడుగుతున్నారని ఇంటి బడ్జెట్లో ఎక్కువ వాటా తనే వేయాల్సి వస్తోందని అతని ఇబ్బంది. మనిషి పిసినారి. ఆటో మీద రెండు రూపాయలు ఇవ్వడం కూడా ఇష్టపడనివాడు చెల్లెలి పెళ్లి చూపులకు మిఠాయి ఖర్చులు ఇమ్మంటే ఇవ్వగలడా? కాని అయిష్టంతోనే ఆ పనులన్నీ చేయాల్సి వస్తుంటుంది. మూడో కొడుకు కాళిదాసు చిన్న పిల్లవాడు. పదో క్లాసు మీద దండయాత్రలు చేసేవాడు కాబట్టి వాడి ప్రమేయం ఏమీ లేదు. పైకి అంతా సజావుగా ఉన్న ఇల్లు నివురు గప్పిన నిప్పులా ఉంది. అగ్గి రాజుకునేలా ఉంది. రాజును నేలకూల్చే సందర్భం ఏదో వెయిట్ చేస్తూ ఉంది. చివరకు అది రానే వచ్చింది. మాటల తుఫాను... పెద్ద కోడలు ఉమ పురిటికని పుట్టింటికి వెళ్లింది. పెద్ద కొడుక్కి ఇది మంచి అవకాశంగా అనిపించింది. ఆ నెలలో ఇంటి ఖర్చులకు కేవలం నాలుగు వందలే ఇస్తాడు. ‘ఇదేంట్రా’ అని తల్లి ఆశ్చర్యపోతుంది. ‘ఇన్ని రోజులు ఇద్దరం ఉన్నాం. ఎనిమిది వందలు ఇచ్చాం. ఇప్పుడు ఉమ పుట్టింటికి వెళ్లింది. నేను ఒక్కణ్ణే. కనుక నాలుగు వందలు ఇస్తున్నాను’ అంటాడు పెద్దకొడుకు. తండ్రి ఇది విని వ్యంగ్యంగా చురకలు వేస్తాడు. పెద్ద కొడుక్కి రోషం ముంచుకు వస్తుంది. ‘రేపు నాకు బిడ్డ పుడుతుంది. నా సంసారాన్ని కూడా నేను చూసుకోవాలి. ఈ దుబారా ఖర్చు నేను పెట్టలేను’ అంటాడు. ‘కన్న తల్లిదండ్రులను తోడబుట్టినవాళ్లను చూసుకోవడం దుబారా అవుతుందా?’ అని తండ్రి ప్రశ్నిస్తాడు. ‘అంత రోషపడేవాళ్లు నా దగ్గర 18 వేలు తీసుకుంటే తప్ప కూతురు పెళ్లి చేయలేకపోయారే. అప్పుడేమైంది రోషం’ అంటాడు కొడుకు. ‘లెక్కా పత్రాలు చూస్తున్నావా? నీ చదువుకు పెట్టిన ఖర్చు నీ ఉద్యోగం కోసం పెట్టిన ఖర్చు నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేయడానికి చేసిన ఖర్చు నీకు యాక్సిడెంట్ అయితే నా రక్తం ఇచ్చి నిన్ను కాపాడుకున్న ఖర్చు... ఇవన్నీ కూడా లెక్క చూడాలా’ అని తండ్రి అంటాడు. ‘అవును. చూడాల్సిందే. మీరు చూసిన దానికి చేసిన దానికి సరిపోయింది. మర్యాదగా చెల్లెలి పెళ్లి కోసం నా దగ్గర తీసుకున్న పద్దెనిమిది వేలు కక్కండి’ అంటాడు కొడుకు. ఒక తండ్రి మీద అంతకు మించి అసహ్యమైన ఎత్తు ఉండదు. ఆ తండ్రి లోలోపల కూలిపోతాడు. కునారిల్లిపోతాడు. ఆత్మాభిమానం పొడుచుకుని వచ్చి ‘నీ డబ్బులు నీ అణాపైసలతో ముఖాన కొడతాను. అందాక ఈ ఇంట్లో నుంచి బయటకు పోరా కుక్కా’ అంటాడు. ఘోరం జరిగిపోతుంది. నిండుగా ఉండే ఇల్లు రెండు ముక్కలవుతుంది. ఇంటి మధ్యన ఒక పెద్ద గీత గీయబడుతుంది. అటువైపు కొడుకు కోడలు. ఇటువైపు మిగిలిన కుటుంబ సభ్యులు. అటువాళ్లు ఇటు రావడానికి కాని ఇటువాళ్లు అటు వెళ్లడానికి వీల్లేదు. ఒకరికి మరొకరు చచ్చినవాళ్లతోనే సమానం. ఆ సంసారం రిపేరు చేయలేని విధంగా అల్లరిపాలైంది. దీనికి విరుగుడు ఏమిటి? కోడలి అవస్థ కూతురి పొగరు... ఈ కథలోనే ఇంకో రెండు ఉపకథలున్నాయి. ఇంటి కూతురికి కాస్తంత పొగరు. ఎవరినీ లెక్క చేయదు. అన్యమతస్తుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. పోయినామె పోయినట్టుగా ఉండగా అక్కడ మొగుణ్ణి, మామగారిని అలక్ష్యం చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఇంటి నుంచి వచ్చేసి పుట్టింట్లో తిష్ట వేస్తుంది. రెండో కొడుకు రాఘవ చేసుకున్న అమ్మాయి (ముచ్చర్ల అరుణ)ది ఇంకో కష్టం. కొత్త కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమెకు ప్రైవసీ లేదు. మూడో కొడుకు కాళిదాసు చదువు భారం ఆమె నెత్తిన పడుతుంది. ఆ పిల్లవాడు అర్ధరాత్రి వరకూ ఆమెనే అంటి పెట్టుకుని ఉంటే భర్తతో గడిపే సమయం చిక్కక అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లి అక్కడ తండ్రి చేత చివాట్లు తిని తిరిగి అత్తింటికి చేరి అసంతృప్తితో రగిలిపోతూ ఉంటుంది. ఈ ఉపకథలు కూడా ఇంటి మధ్య గీతకు కారణమయ్యి ఆ సంసారాన్ని బజారున పడేశాయి. కోడలమ్మ... చిలకమ్మ... ఇప్పుడు ఈ ఇంటిని కాపాడగలిగింది ఇద్దరే ఇద్దరు. ఒకరు పుట్టింటి నుంచి తిరిగి వచ్చిన కోడలు ఉమ. ఇంకొకామె ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పని మనిషిగా ఉన్న చిలకమ్మ (షావుకారు జానకి). పండండి బిడ్డను ఎత్తుకొని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ఇంటికి వచ్చిన ఉమ ఇంటి నడిమధ్యన గీసిన గీతను చూసి హతాశురాలవుతుంది. ఇంట్లో ఉన్న పరిస్థితులకు అవాక్కవుతుంది. పరిస్థితులు చక్కదిద్దడానికి నడుం బిగిస్తుంది. ఈలోపు పిసినారి ప్రకాష్‌కు ఒక్కొక్క సంగతే తెలిసి వస్తాయి. తాను ఇచ్చే ఎనిమిది వందలు ఇంటి ఖర్చులో ఏ మూలకూ సరిపోవనీ ఆ డబ్బు కంటే ఎక్కువ డబ్బు ఇన్నాళ్లు ఒక్క తన సంసారానికే ఖర్చయ్యిందని తెలిసొస్తుంది. లాండ్రీ బిల్లు, వెచ్చాల బిల్లు, ఒకవేళ తాను ఉంటున్న పోర్షన్‌కు అద్దె కట్టాల్సి వస్తే చాలా ఖర్చు తన నెత్తిన పడుతుందని గ్రహిస్తాడు. ఉమ్మడి సంసారం వల్లే తాను సౌకర్యంగా ఉన్నానని విడి కాపురం పెడితే అన్నీ ఖర్చులే అని తెలిసి లోలోన గింజుకుంటాడు. తండ్రిని క్షమాపణ కోరే పరిస్థితికి వస్తాడు. చిలకమ్మ, ఉమ కలిసి కూతురి మామగారితో నాటకం ఆడి కూతురి కళ్లు తెరిపించి ఆమెను అత్తగారింటికి పంపుతారు. భార్యను తీసుకొని విహారానికి వెళ్లమని మరిది రాఘవకు సలహా ఇచ్చి వాళ్లకు ప్రైవసీ కల్పించి ఆ మేరకు ఆ కాపురాన్ని చక్కదిద్దుతుంది ఉమ. కథ క్లయిమాక్స్‌కి వచ్చింది. చర్చ రేపిన సినిమా... 1987లో వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమా సమాజంలో ఒకస్థాయి చర్చను రేపగలిగింది. ఉమ్మడి కుటుంబాల ఉనికి ప్రశ్నార్థకమవుతున్న ఆ తరుణంలో పెళ్లయిన కొడుకుల విడికాపురాల జోరు పెరుగుతున్న ఆ రోజుల్లో ఈ సినిమా ఒక తరుణోపాయాన్ని సూచించగలిగింది. ‘విడిగా వెళ్లినా పర్వాలేదు కలిసి ఉండటమే ముఖ్యం’ అని చెప్పగలిగింది. సినిమా అంతా ఒకెత్తయితే క్లయిమాక్స్ ఒక్కటీ ఒకెత్తు. ఇందులో కోడలి నిర్ణయం ప్రేక్షకులకు నచ్చపోయినా ఆ ‘ఎత్తు’ విఫలమైనా సినిమా కుదేలయ్యేది. కాని ప్రేక్షకులు ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. ఆదరించారు. అందుకే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా ప్రభావంతో కలిసిన ఉమ్మడి కుటుంబాలున్నాయి. ఆరోగ్యకరంగా విడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. తమను తాము తరచి చూసుకొని చక్కదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి. ఒక సినిమా ప్రేక్షకుల మీద ప్రభావం చూపగలదు అనడానికి ‘సంసారం ఒక చదరంగం’ ఒక మంచి ఉదాహరణ. మానవ జీవితానికి ‘కుటుంబమే’ ఆయువుపట్టు. ఆ కుటుంబం మెరుగ్గా ఉండటానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు మనిషి. అలాంటి ఒక ఆలోచన సినిమా ద్వారా అందుకోవడమే ఇక్కడి విశేషం. ఇవాళ పెళ్లికి ముందే ‘మా అబ్బాయికి వేరే ఇల్లు చూశాను. పెళ్లయిన వెంటే విడి కాపురం పెట్టిస్తాను’ అనే తండ్రులు ఎందరో ఉండటం మనం చూస్తున్నాం. పెళ్ళిళ్లయ్యాక విడిపోవడానికి మన సమాజం మానసికంగా సిద్ధమైంది. విడిపోయినా కలిసి ఉండటం నేర్చుకుంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పాపులర్‌గా చెప్పి అందుకు కావలసిన భూమికకు మొదటి మెట్టుగా నిలిచిన మంచి సినిమా శక్తివంతమైన సినిమా ‘సంసారం ఒక చదరంగం’. కోడలి నిర్ణయం... కలతలు సమసిపోయాయి. కొడుకు క్షమాపణ అడిగాడు. తండ్రి క్షమించాడు. ముక్కలైన సంసారం ఒక్కటైంది. గీత చెరిపి అందరూ కలిసిపోయే సమయం వచ్చింది. కాని హటాత్తుగా పెద్ద కోడలు ఉమ దీనిని వ్యతిరేకిస్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. ‘ఏం?’ అని అడుగుతారు. ‘మళ్లీ గొడవలు జరగవని గ్యారంటీ ఏమిటి?’ అని ప్రశ్నిస్తుంది. ‘ఇలా విడిపోవడం వల్ల ఎంత క్షోభ పడ్డామో అందరికీ తెలిసొచ్చిందిగా... మళ్లీ అలాంటి క్షోభ ఎదురైతే తట్టుకునే శక్తి మనకు ఉందా’ అని అడుగుతుంది. ‘వద్దు... కలిసి ఉండి రోజూ కొట్టుకుని చావడం కన్నా... విడిపోయి కలిసి ఉందాం. మేము వేరు కాపురం పెడతాం. అలాగని విడిపోం. ప్రతి ఆదివారం వచ్చి కలిసి వెళతాం. మీరు వచ్చిపోతూ ఉండండి. కాస్త ఎడంగా ఉంటేనే అభిమానాలు సజీవంగా ఉంటాయి. అలా సంతోషంగా ఉందాం’ అని నిర్ణయం చెబుతుంది. కథ ముగుస్తుంది. ఒకరి ఇళ్లకు ఒకరు వచ్చిపోతూ సంతోషంగా ఉంటారు. – కె -
ఓ ‘సన్యాసి’ పాలన
జీవన కాలమ్ నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్‌సెట్‌ని ధ్వంసం చేశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కర లేదని–ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే? ఈ మధ్యకాలంలో దేశీ యులనే కాక, న్యూయార్క్ టైమ్స్ వంటి విదేశీ మాధ్యమాలను కూడా నివ్వెరపోయేటట్టు చేసిన పరిణామం– ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఒక ‘సన్యాసి’ని నియమించడం. అలనాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ని భారతీయ జనతాపార్టీ కొల్లగొట్టడం కేవలం ఒక ‘వేవ్’లో జరిగిపోయిన ‘చిలక్కొట్టుడు’ అని రాజకీయ మేధావులు చాలామంది పెదవి విరిచారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో 324 సీట్లు గెలిచి, జార్ఖండ్‌లో ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్‌ని బీజేపీ తుడిచిపెట్టిన తర్వాత–మేధావులు వినాయకుడి బొడ్డులో వేలు పెట్టినట్టు–ఉలిక్కి పడి–ఆ విజయాన్ని అటకెక్కించి పంజాబ్, మణిపూర్ మాటేమిటని కళ్లెగరేశారు. అంతవరకూ బాగుంది. కానీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నియామకం– అందరినీ దిగ్భ్రాంతుల్ని చేసింది. ఎందరికో ఈ నియామకం కొరుకుడు పడలేదు. ఏమయింది ఈ ప్రభుత్వానికి? బీజేపీ అధిష్టానానికి మతి పోయిందా? ‘గెలుపు’ అహంకారాన్ని రెచ్చగొట్టిందా? తామేం చేసినా చెల్లుతుందన్న ధీమాని ఇచ్చిందా? ఎవరేమన్నా– ‘మేం పసుపు జెండా ఎగరేసి తీరుతాం’ అన్న నిర్లక్ష్యానికి ఇది గుర్తా? ఇంతవరకూ అజ్ఞాతంగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు రంగప్రవేశం చేసి పంజా విప్పిందా? రాష్ట్రంలో 18 శాతం ముస్లింలను కలుపుకోవడానికి వందమందికి టికెట్లు ఇచ్చి ఒక నాయకురాలు బరిలోకి దిగగా, ఒక్కరికీ టికెట్టు ఇవ్వకుండా తమ గెలుపుకి– ఆయా వర్గాలకి సంబంధం లేదని దేశానికి సూచించాలని ప్రయత్నమా?–ఎన్నో ప్రశ్నలు. ఈ యోగికి నా అన్నవాళ్లు లేరు. సన్యాసి. అప్పుడెప్పుడో–2006లో–ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తనమీద కక్ష సాధిస్తోందని–పార్లమెంటులో అంతా నిర్ఘాంతపోయేలాగ కంటతడి పెట్టుకున్నారు. అర్థంలేని కారణాలకి పాతిక చెప్పుదెబ్బలు కొట్టి గర్వంగా చెప్పుకున్న పార్లమెంటు సభ్యులు రాజ్యమేలుతున్న నేపథ్యంలో ఈ ‘సన్యాసి’ పార్లమెంటులో కంటతడి పెట్టుకుంటాడేమిటి? అని కొందరు నవ్వుకున్నారు. కొందరు విస్తుపోయారు. తీరా షాక్ నుంచి తేరుకున్నాక– చాలామంది నాయకులు– ఆయా వర్గాలను బుజ్జగించడానికి చేసే ‘ఇచ్చకాల’ మీద ఈ ‘సన్యాసి’ ఇనుప పాదం మోపడాన్ని– మొదట మతానికీ, తర్వాత అధిష్టానం కుట్రకీ, తదుపరి మైనారిటీల అణచివేతకీ కారణమని కొందరు రాజకీయ మేధావులు పంజాలు విప్పారు. కాలేజీల ముందు రోమియోల విహారాలు, అనుమతిలేని కబేళాల తొలగింపు లాంటి పనులకు తప్పుడు అర్థాలు తీశారు. ఏమయినా–కాస్త లోతుకి వెళ్లి చూడగా ఈ చర్యలో అపూర్వమైన రాజకీయ దురంధరత కనిపిస్తుంది. ప్రతీక్షణం ‘మైనారిటీలు మా ప్రాణం’ అని ఊదరగొట్టే నాయకులు పదవిలోకి వచ్చిన తర్వాత తన బాబునీ, మామనీ, తండ్రినీ, తాతనీ పదవుల్లో నిలిపి– ముఖం తుడవడానికి ఒక మైనారిటీ చెంచాని చేరదీసి–పబ్బం గడుపుకున్న 70 ఏళ్ల చరిత్ర నేపథ్యంలో–100 మందికి టికెట్లిచ్చి–తన శిలా విగ్రహాల్ని పెట్టుకున్న నాయకురాలి ‘ఆత్మ వంచన’ని చూసిన ఈ ప్రజలు–తమ శ్రేయస్సుకి అనుక్షణం ఓ కాషాయ సన్యాసి పట్ల దృష్టిని నిలపడం విచిత్రమైన మలుపు. ఒకవేళ ఈ కాషాయ సన్యాసి వారికి నిజ మైన మేలు చేస్తే– పాలనలో సుపరిణామానికి నూటి కి నూట యాభై మార్కులు దక్కుతాయి. కాగా– ఒక ‘యోగి’, ఒక ‘సన్యాసి’ కట్టుకుపోయేదేమీ లేదు. అతనికి బలిసిన ఏనుగుల పార్కులక్కరలేదు. తన కుటుంబాల వారికి పదవుల పంపకం అక్కరలేదు. నాయకులు అందలాలు ఎక్కడానికి ఇంతకాలం మైనారిటీల మైండ్‌సెట్‌ని ధ్వంసం చేశారు. ఆయా సామాజిక వర్గాల సామరస్య సహజీవనం కాక ఆయా వర్గాలకి ‘హక్కు’ల రుచిని మప్పి–తీరా వాటిని కాలరాశారు. సర్వమత సహజీవనానికి మతం ప్రాతిపదిక కానక్కరలేదని– ఓ మతానికి చెందిన సన్యాసి నిరూపించగలిగితే? మైనారిటీలను దువ్వి పబ్బం గడుపుకునే ్టౌజ్ఛుnజీటఝకి అత్యంత సాహసంతో స్వస్తి చెప్పి– ఫలితాల మీదా, సజావైన పరిపాలన మీదా ‘గురి’ పెట్టగల నాయకత్వాన్ని ఇవ్వగల గుండె ధైర్యం ఉన్న వ్యవస్థ– ప్రారంభంలో పదిమందినీ ఒప్పించే ప్రయత్నం చెయ్యలేదు. మెప్పించే ప్రయత్నమూ చెయ్యలేదు. కాగా సాహసించి పదిమంది ‘షాక్’కీ సిద్ధపడింది. నిజాయితీ, గుండె ధైర్యం ఎప్పుడూ ఒప్పించాలని ప్రయత్నించదు. ఎందుకంటే అది ప్రదర్శన కాదు. ఇంతవరకూ మనం నాయకత్వం వేషాల్ని చూశాం. ఇచ్చకాల్ని చూశాం. ‘ఆకర్షణ’ల్ని చూశాం. తాయిలాల సంస్కృతిని చూశాం. ఇప్పుడు కేవలం సత్పాలన లక్ష్యంగా–మనల్ని ఒప్పించాల్సిన పని చెయ్యనక్కరలేని నాయకత్వం–ఒప్పుకునే పాలనని కాక–అవసరమైన పాలనని చెయ్యగల ‘దమ్ము’, ‘ఆత్మవిశ్వాసం’–ఇంకా చెప్పాలంటే–‘సవాలు’ ఈ ‘సన్యాసి’ పాలనకి గుర్తు–అని నాకనిపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు -
మరో గూండా కథ
జీవన కాలమ్ ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్‌ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకరమైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మన చొక్కాకు పట్టే చెదలాంటిది. ఇలాంటి నాయకమ్మన్యులు–శరీరంలో క్యాన్సర్ లాంటివారు. ఒక సంఘటన. 1990లో జరిగింది. ఒక మహిళ మాటల్లో చెప్తాను: రైల్వే సర్వీసు ప్రొబేషనర్స్గా లక్నో నుంచి ఢిల్లీ వెళ్లే రైలులో నేనూ, నా మిత్రురాలూ ఎక్కాం. ఇద్దరు పార్లమెంట్ సభ్యులూ, మరో 12 మంది వారి సహ చరులూ ఎక్కారు. వాళ్లకి రిజ ర్వేషన్లు లేవు. మా బెర్తులు ఖాళీ చేయించి, మా సామాన్ల మీద కూర్చుని, అసభ్యంగా మాటలూ, అల్లరీ ప్రారం భించారు. కోపం వచ్చినా భరిస్తూ నిస్సహాయంగా రాత్రంతా గడిపాం. మర్నాటి ఉదయం ఢిల్లీ చేరాం, బతుకు జీవుడా అనుకుంటూ. మా స్నేహితురాలు ఎంత భయపడిపోయిందంటే–తర్వాత మేం ట్రైనింగ్‌కి వెళ్లా ల్సిన అహమ్మదాబాద్ ప్రయాణం మానుకుని ఢిల్లీలో ఆగిపోయింది. నేను మాత్రం రైల్వే సర్వీసులో ఉన్న మరో సహచరురాలితో రైలెక్కాను. ఢిల్లీ నుంచి అహమ్మ దాబాద్కి ఒక రాత్రి ప్రయాణం. మా రిజర్వేషన్లు వెయి ట్లిస్ట్లో ఉన్నాయి. టికెట్ కలెక్టరు మమ్మల్ని మొదటి తరగతి కూపేలో కూర్చోపెట్టాడు–రైలంతా రద్దీగా ఉందంటూ. అక్కడ మళ్లీ ఇద్దరు రాజకీయ నాయకులున్నారు. ఒకాయన ఎంపీ. మరొకాయన కేవలం సహచరుడు. మళ్లీ మేం బెదిరిపోయాం. మరేం ఫరవాలేదని టీటీయీ ధైర్యం చెప్పారు. వాళ్లు మాకు చోటిచ్చి ఒక మూలకి ఒదిగి కూర్చున్నారు. భోజనం వచ్చింది. నలుగురికీ శాకాహార భోజనమే ఆర్డరిచ్చి– వారిలో చిన్నాయన డబ్బు చెల్లించాడు అంద రికీ. ఈలోగా టీటీయీ వచ్చి ట్రైన్లో బొత్తిగా ఖాళీలేద న్నాడు. ఇద్దరు లేచి నిలబడ్డారు, ‘మరేం ఫర్వాలే ద’ంటూ. రెండు బెర్తులకీ మధ్యన ఒక గుడ్డ పరుచుకుని నిద్రపోయారు. మర్నాటి ఉదయం అహమ్మదాబాద్ దగ్గరికి వస్తుండగా ‘పట్నంలో ఏమైనా సమస్య ఉంటే మా ఇంటికి నిస్సందేహంగా రావచ్చు’నని పెద్దాయన ఆహ్వానించారు. చిన్నతను సిగ్గుపడుతూ ‘నేనొక ద్రిమ్మ రిని. ఇబ్బంది ఉంటే వీరి ఆతిథ్యం పుచ్చుకోండి’ అన్నారు. అవసరం లేదంటూ థాంక్స్ చెప్పాం. రాజకీయ నాయకుల మీద నా దురభిప్రాయాన్ని పోగొట్టిన వీరి పేర్లు మరచిపోకూడదనుకున్నాను. అహమ్మదాబాద్ రాగానే ఇద్దరి పేర్లూ హడావుడిగా రాసుకున్నాను– శంకర్‌సింగ్ వాఘేలా, నరేంద్ర మోదీ. ఈ సంఘటనని వ్రాసిన వ్యక్తి–లీనా శర్మ. భార తీయ రైల్వే సమాచార సంస్థ జనరల్ మేనేజర్ అయ్యారు. ఆనాటి ఆమె సహచరురాలు–ఉత్పలపర్ణ హజారికా. రైల్వే బోర్డ్‌కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యారు. ఇక ఇప్పటి కథ. రవీంద్ర గైక్వాడ్ మహారాష్ట్ర శివసేన పార్లమెంట్ సభ్యులు. మామూలు టీచరు. ఢిల్లీ వెళ్లడానికి బిజినెస్ క్లాసు టిక్కెట్ ఉంది. మరచిపోవద్దు –అది ప్రజల సొమ్ముతో కొన్నదే. కానీ ఆనాటి విమానం బిజినెస్ క్లాసు లేని చిన్న విమానం. ఆయన ఎక్కారు–ఆ విమానంలో బిజినెస్ క్లాసు ఏర్పాటు లేదని తెలిసీ. విమానం ఆగాక గొళ్లెం పెట్టుకున్నాడు. ఎయిర్‌లైన్స్ ఆఫీసర్, 60 ఏళ్ల సుకుమార్ వచ్చి ఆయన్ని విమానం దిగమని కోరారు. ఆయన ఫలానా గైక్వాడ్‌ని తిట్టాడట. దురుసుగా ప్రవర్తించాడట. కోపంతో గైక్వాడ్ అనే ఎంపీ తన కాలి శాండల్ తీసి సుకుమార్‌ని 25సార్లు కొట్టాడు. కెమెరా ముందు గర్వంగా తను కొట్టిన విషయాన్ని వివరిస్తూ–‘‘నేను కొట్టింది చెప్పుతో కాదు, శాండల్‌తో’’ అంటూ పత్రికా విలేకరుల కథనాన్ని సవరించారు ఈ నాయకులు. మళ్లీ లెక్క తప్పుతుందేమోనని ‘25సార్లు కొట్టాను’ అని చెప్పారు. ప్రజలకు సేవ చేస్తానని వేదికలెక్కి హామీలిచ్చి ఎన్నికైన ఇలాంటి ‘గూండాలు’ విచక్షణా రహితంగా ఒక ప్రభుత్వోద్యోగిని బహిరంగంగా కొట్టి, గర్వపడడం– ఈ జాతికి పట్టిన చీడ. నిజంగా సుకుమార్ అనే ఆఫీసరు ఒక ఎంపీతో దురుసుగా మాట్లాడి, తిట్టి ఉంటే ఈయన ఫిర్యాదు చాలు అతన్ని ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయ డానికి. ఇద్దరు మహిళలను–23 సంవత్సరాల కిందట గౌరవించిన ఆనాటి అనామకులైన నాయకులు– ఇద్దరూ ముఖ్యమంత్రులయ్యారు. ఒకాయన ప్రధాని అయ్యారు. ఈ కుసంస్కారిని నెత్తిన పెట్టుకున్నది–గూండా సంస్కృ తికి ఆలవాలమైన పార్టీ. ఈ దేశానికి హఫీద్ సయీద్, మసూద్ అజర్‌ల కంటే ఇలాంటి గూండాల వల్ల జరిగే హాని భయంకర మైనది. దౌర్జన్యకారుల శత్రుత్వం–మనం తొడుక్కున్న చొక్కాకు పట్టే చెదలాంటిది. కానీ మన వ్యవస్థలో మనల్ని నాశనం చేసే ఇలాంటి నాయకమ్మన్యులు– శరీ రంలో క్యాన్సర్ లాంటివారు. ఇలాంటి గూండాలని జైలుకి పంపించడానికి, కోర్టులో బోను ఎక్కించడానికి ఈ దేశంలో ఉద్యమాలు జరగాలి. ‘నిర్భయ’ విషయంలో జరిగినంత ఉధృతంగా ప్రదర్శనలు జరగాలి. వ్యవస్థలో సంస్కార పతనం, సంక్షేమ పతనం కంటే అనర్థదాయకం. హానికరం. అరిష్టం. - గొల్లపూడి మారుతీరావు -
నిలువుటద్దం
జీవన కాలమ్ చివరగా– జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ నాకు సందేశం పంపారు. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీయులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీయులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసుకోలేరా? పైవారం కాలమ్ (‘భూత’ ద్దం) చదివి చాలామంది స్పందించారు. ముఖ్యంగా మిత్రులు, అతి తరచుగా అమె రికా వెళ్లివచ్చే మిత్రులు– తన కొడుకూ, కూతురూ సంవత్స రాల తరబడి అక్కడ ఉన్న మిత్రులు– పేరు చెప్పినా పర వాలేదు– యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌గారు ఫోన్ చేశారు. ఆయన నిర్మొహమాటి. వాస్తవాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పే మనిషి. ‘ఈనాటి అమెరికా అనర్థంలో మనవారి వాటా కూడా ఉంది మారుతీరావుగారూ’ అన్నారు. భారతీయులు– అందునా తెలుగువారు ఎక్కడికి వెళ్లినా తమ పతాకాన్ని గర్వంగా ఎగురవేస్తారు. సామ ర్థ్యంలో, క్రమశిక్షణలో ఒక్కొక్కరూ అరడజను అమెరికన్ల పెట్టు. అలనాడు అమెరికాలో వైద్య రంగానికీ, ఇప్పు డిప్పుడు సాఫ్ట్వేర్ రంగానికి వారు చేస్తున్న సేవలు అనితర సాధ్యం. అపూర్వం. ఒక్క సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ పేరు ప్రపంచంలో మన సామర్థ్యాన్ని పతాక స్థాయిలో నిలిపారనడానికి ఉదాహరణలు. అయితే– తాము మాతృదేశానికి దూరంగా ఉంటూ నష్టపోయినదేదో ఎరిగిన వీరు– తమ సంపా దనతో, కృషితో అక్కడ నిలుపుకుంటున్నారు. అది అభిలషణీయమే. కాలిఫోర్నియాలో, చికాగోలో, పిట్స్ బర్గ్‌లో, హూస్టన్‌లో– ఇలా ప్రతీచోటా మన దేవాల యాలు వెలిశాయి. ఉత్సవాలు, సంబరాలు, కోకొల్లలు. ఏటేటా ఆటా, తానా, నాటా, పాటా– మీ ఇష్టం. తెలుగు తేజం వెల్లివిరుస్తుంది. ‘పాడుతా తీయగా’లు పల్లవి స్తాయి. క్లీవ్‌లాండ్‌లో ఏటేటా జరిగే కర్ణాటక సంగీ తోత్సవాలు చెన్నై సంగీత సభలకి తీసిపోవు. అమెరి కాలో బాలమురళీకృష్ణ, సంజయ్ సుబ్రహ్మణ్యం, టీఎం కృష్ణ, సుధా రఘునాథన్, కూచిపూడి పరపతి భారత దేశంలో స్థాయికి ఏ విధంగానూ తీసిపోదు. ఇక మరో పార్శ్వం. మనవారు కులాల పేరుతో కోర్టులకు ఎక్కి అమెరికా కోర్టుల్లో నవ్వులపాలయ్యారు. ఇంకా తెలుగు సినిమాల రిలీజుకి అమెరికాలో కార్లలో ర్యాలీలు, తమ కులం కాని హీరోల పోస్టర్లు చింపే అల్లర్లు– ఇవన్నీ మన దేశంలోని వెర్రితలలను అమెరి కాకి దిగుమతి చేసిన వికారాలు. ఈ మధ్య తాజాగా చేరిన మరో రగడ– తెలంగాణ, ఆంధ్ర సోదరుల మధ్య ప్రాంతీయ అసహనం. ఇవన్నీ కడుపునిండినవారి విన్యా సాలు. అందరూ ఉపాధి కోసం మరో దేశానికి వచ్చిన వారే. భారతీయుల సామర్థ్యానికీ, క్రమశిక్షణకీ వచ్చిన ప్రాచుర్యం ఈ ‘అరాచకం’ ముందు నిలవలేదు. నిల వదు. ఉపాధి కోసం తాపత్రయం తలవంచుతుంది. అవసరానికి మించిన ఆదాయం, కుల, ప్రాంత, మత దురభిమానం వీధిన పడేస్తుంది. ఈ పని చైనావారు కానీ, పాకిస్తాన్‌వారు కానీ, బంగ్లాదేశ్వారు, ఫ్రెంచ్‌వారు గానీ చేయలేదు. ఏతావాతా మన భారతీయ సోదరులు మరచి పోయినది ఏమిటంటే– మనమున్నది పరాయిదేశం. మన దేశంలో ఉన్న హక్కులు, వెసులుబాట్లు ఇక్కడ లేవు. ఉండవు. మనకి అంత రక్షణ లేదు. మనవాళ్ల కొందరి జేబుల్లోనయినా పౌరహక్కులున్నాయి. కానీ వారందరి జేబుల్లోనూ తుపాకులున్నాయని మరచి పో కూడదు. పైగా ఇక్కడ ఇప్పుడు చేస్తున్న పనులు భారత దేశంలోనూ నిషిద్ధాలు. మత సమైక్యత, ప్రాంతీయ సమైక్యత, కుల సమైక్యత వీటికి ఎల్లలు లేవు. మనకి పరాయి దేశంలో అన్యాయం జరిగినప్పుడు– భారతీ యులం. అంతా సవ్యంగా ఉన్నప్పుడు తమిళులం, ఫలానా కులం వారం, ఫలానా ప్రాంతం వారం. మన కోసం పొలాలు అమ్మి, పొట్టకట్టుకుని పనిచేసినవారు ఇంకా మనదేశంలో వృద్ధాశ్రమాలలో ఏకాకులుగా ఉన్నారు– అని మరచిపోతున్నాం. మనలాగే పరాయి దేశాల నుంచి వచ్చిన వారికి బాధ్యతారాహిత్యమైన ఈ విశృంఖలత్వం– వెగటుగా కనిపిస్తుంది. ఫలితం ఏమిటి? అక్కడివారిలో వీరి వికారాలపట్ల విసుగు. ఆత్మన్యూనతా భావం. మత్సరం. ఏతావాతా– అమెరికాలో ఉన్న భారతీయులు అమె రికా వారితో ఏకోన్ముఖం కాక, తమదైన సంస్కృతినీ, ఐడెంటిటీని తమ వెర్రితలలతోనూ పెంచుకోవాలని చూస్తున్నారు. గొంతులు చించుకుంటున్నారు. బహు శా– ఇదే ట్రంప్‌గారి ఆలోచనా ధోరణికీ, తత్కారణంగా రెచ్చిన దుష్ప్రభావానికీ పెట్టుబడి కావచ్చు. చివరగా– నాకు ఎవరో ఈ సందేశాన్ని పంపారు. ఇది జెరూసలేమ్ నుంచి జాన్ ముల్లర్ అనే ఆయన ప్రకటించినది. ‘‘తమ ఉనికిని అంగీకరించమని భారతీ యులు అమెరికాని ‘అడుక్కునే’ బదులు– మీ భారతీ యులు ఇండియాలో ఒక ‘అమెరికా’ను తయారు చేసు కోలేరా? ఇజ్రేల్ దేశస్థుడుగా నేను చాలాసార్లు ఇండియా వచ్చాను. ఇండియాలో ఉన్న అపూర్వమైన శక్తి సామర్థ్యా లను గమనించాను. నిజం చెప్పాలంటే మీ భారతీ యులు తమ స్వదేశం నుంచి పారిపోవడానికి ఉర్రూత లూగుతుంటారు. కారణం–అటువైపు జీవితం ‘పచ్చగా’ ‘గొప్పగా’ కనిపిస్తుంటుంది. భారతదేశాన్ని ఆకాశంలో నిలిపే కృషి నిజంగా భారతీయులు చేయగలి గితే ఈ శతాబ్దం భారతదేశానిది. భారతీయులు ఇప్ప టికైనా ఈ సవాలును తీసుకుంటారా?’’ - గొల్లపూడి మారుతీరావు -
అమెరికా.. భూతాల స్వర్గం
జీవన కాలమ్ ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతులపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసు కున్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం. వైష్ణవ స్వాముల ప్రవచనాలు జరిగినప్పుడు–ప్రత్యేకంగా కార్యకర్తలు అందరూ నామాలు పెట్టుకుని కనిపి స్తారు–పవిత్రంగా. అంతే కాదు. ప్రవచనానికి వచ్చేవా రందరికీ నామాలు పెడుతుం టారు. ఈ ప్రవచనానికి ముందూ ఆ తర్వాతా వీరు నామాలతో కనిపించరు. కానీ ఆ ప్రవచనాలు జరిగే నాలుగు రోజులూ వైష్ణవ భక్తులైపోతారు. ఎందుకని? ప్రవచనం చెప్పే స్వామి మార్గదర్శకత్వం అది. ఆ నాలుగు రోజులూ ‘వైష్ణవ తత్వం’ వారిలో విరా జిల్లుతుంది. ఇది ఓ ప్రముఖ వ్యక్తి సమాజం మీద చెయ్యగల ప్రభావం. ఆ నాలుగు రోజులూ ఆ స్వామి సమక్షం భూతద్దం. వారి సముఖంలో ఓ సదాచారం సుసంపన్నమవుతుంది. అప్పుడప్పుడు ఈ ప్రవచన కర్తలు–‘రేపు శ్రీరామ నవమి. భక్తులకు వడపప్పు ప్రసాదంగా ఇవ్వడానికి తలో పావుసేరు పెసరపప్పు తెమ్మంటార’నుకోండి. మర్నాడు తేలికగా 100 కిలోల పెసరపప్పు పోగవు తుంది. ఒక ప్రముఖుని సత్సంకల్పం భూతద్దం. ఆ సత్యార్యం వారి ఉద్దేశాన్ని సంపన్నం చేస్తుంది. సామూ హికమైన విశ్వాసానికీ, సామూహికమైన వితరణకీ ఓ పెద్దరికం పెట్టుబడి. మరో విధంగా చెప్పాలంటే– వ్యక్తి గత స్వభావాన్ని ఒక ‘ప్రముఖ వ్యక్తి’ భూతద్దంలో నిలు పుతాడు. ఆ వితరణ విశ్వరూపం దాలుస్తుంది. ముస్లింలలో ఎందరో మహానుభావులున్నారు. అద్భుతమైన గాయకులున్నారు. కవులున్నారు. కళాకారు లున్నారు, ప్రవక్తలున్నారు, సౌందర్యవంతులైన నటులు న్నారు, నటీమణులున్నారు. ఇది ఒక పార్శ్వం. కానీ కొందరినయినా తప్పుదారి పట్టించే ఛాందసులైన మత పెద్దలున్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదాన్ని రెచ్చ గొట్టే ఐసిస్ సంస్థ అధినేతక అల్ బాగ్దాదీ ఇరాక్‌లో చేయగలిగినంత విధ్వంసాన్ని సృష్టించి ఎట్టకేలకు చేతు లెత్తేసి ‘‘ఇరాక్‌లో మనం పతనమయ్యాం. ఘోర పరా జయం తప్పదు. పారిపోండి లేదా పేల్చుకుని చచ్చి పోండి’’ అని నిన్ననే పిలుపునిచ్చారు. వ్యవస్థని నడి పించే నాయకత్వంలో ఇలాంటి ‘నెగటివ్’ ధోరణి ఎంత భయంకరమో చెప్పడానికి ఇది నిదర్శనం. ఒక నాయకుని వాచాలత్వం, బాధ్యతారహితమైన ధోరణి, అకారణమైన అసహిష్ణుత, ఆలోచనారహిత మైన ఆవేశం ఎంతటి దుష్పరిణామాలకు దారితీయగ లదో గత 43 రోజులుగా అమెరికాలో మనం చూస్తు న్నాం. నాయకుడు మాట తూలితే–అంతగా ఆలోచించ లేని సామాన్యపౌరుడు–దాన్ని ‘ఊతం’ చేసుకుంటాడు. ‘‘నాకు నావాళ్లే ముఖ్యం. మిగతావాళ్ల సంగతి నాకనవసరం’’ అనడం బాగానే ఉంటుంది. అది తన దేశీయులపట్ల ‘అభిమానం’ అనిపించవచ్చు. కానీ నాయకుడు ఈ మాట అంటున్నప్పుడు–ఎక్కువమంది పార్శా్వన్ని చూస్తారని ట్రంప్ వంటివారు గుర్తించక పోవటం దురదృష్టమేకాదు–అనర్థదాయకం. ట్రంప్ గారు ‘‘నాకు నావాళ్లే ముఖ్యం’’ అన్నాడు. రెచ్చిన కొందరు ‘‘మాకు మిగతావాళ్లు ముఖ్యం కాదు’’ అని అనడం లేదు. అని ఊరుకోవడం లేదు. ‘‘వాళ్లని దుర్మార్గంగా ఎదిరించే పని చేస్తున్నారు. ఇది–ఆలోచనని సరిగ్గా నియంత్రించుకోలేని నాయకుడు–ఆలోచన ప్రమేయం లేని ఆవేశపరులకు ‘చురకత్తి’ని చేతికి ఇచ్చి నట్టు. గత వారం రోజుల్లో అతి దారుణంగా కాన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్‌ను ‘‘నా దేశాన్ని వదిలిపో’’ అంటూ ఒకరు కాల్చి చంపారు. దక్షిణ కెరొలినాలో హర్నీష్ పటేల్ అనే వ్యాపారిని కాల్చారు. తాజాగా వాషింగ్టన్ (కెంట్)లో దీప్‌రాయ్ అనే వ్యక్తిమీద మొహానికి గుడ్డ కట్టుకున్న అమెరికన్ కాల్చాడు. నిన్ననే సియాటిల్‌లో జస్మిత్ సింగ్‌ని కాల్చారు. ఏక్తాదేశాయ్ అనే అమ్మాయిని న్యూయార్క్ సమీపంలో ఒక అమెరికన్ ఆఫ్రికన్ అవమానించాడు–అందరిముందూ. ఇది విచక్షణ తెలి యని పెద్దల మాటకు– పెద్దరికం చాలని వ్యక్తులు పట్టిన ‘భూతద్దం’. చాలా ప్రమాదకరమైన భూతద్దం. కొత్త వారిని రానివ్వని చట్టాలు కొంతవరకూ బాధపెట్టేవే. కానీ ఉన్నవారిని దారుణంగా హత్యలు చేసే ఆలోచనా ధోరణికి అమెరికా అధ్యక్షుడు కారణం కావడం చాలా చాలా ప్రమాదకరమైన పరిణామం. భూతద్దానికి ఒక దుర్మార్గం ఉంది. దానికింద ఉంచిన ఏ వస్తువునయినా ప్రస్ఫుటంగా చూపిస్తుంది– అది మంచయినా, చెడయినా. బాధ్యతగల అధికారంలో ఉన్న పెద్దల మాట విచక్షణ లేని భూతద్దం లాంటిది. ట్రంప్ మాటల్లో ఆయన తన జాతిపట్ల అభిమానాన్నే చాటుకున్నాననుకున్నారు. కానీ కొందరు ఇతర జాతు లపట్ల తమ దురభిమానంగా దాన్ని తర్జుమా చేసుకు న్నారు. ప్రమాదకరంగా చాటుకున్నారు. ప్రాణాలు తీస్తు న్నారు. ఇందుకు భారతీయులే ‘ఎర’ కావడం ఇంకా దురదృష్టకరం. డల్లస్ నుంచి మా మిత్రుడు ఒక సందేశం పంపాడు: ‘‘ఇకముందు అమెరికాలో జీవనం ‘భూతల స్వర్గం’ కాదు. ‘భూతాల’ స్వర్గం అని. - గొల్లపూడి మారుతీరావు -
‘బొత్తిగా చంటోడు’
జీవన కాలమ్ ఆయన 10, జన్‌పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యం తరం లేదు. బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మరో పాతికేళ్లు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు. ఇన్నాళ్లకి కాంగ్రెస్ పెద్దమ్మ షీలా దీక్షిత్ ఓ గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు– రాహుల్ గాంధీ ఇంకా ‘పెద్దమనిషి’ కాలేదని, అందుకు కొంచెం టైం కావాలని. ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదిం చడంలో – మహానుభావు లతో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఒకనాటి కాంగ్రెసు, ఆ రోజుల్లోనే ‘‘నాకు రాజకీయాలలోకి రావడం ఇష్టంలేదు’’ అని పత్రికల ముందు ఒప్పు కున్న రాజీవ్ గాంధీగారి చేతుల్లోకి వచ్చింది. రాజీవ్ గాంధీ భార్య అయిన ఒక్క కారణానికే సోనియా గాంధీ పదవిలోకి వచ్చారు. ఆవిడ నిర్వాకం ఏమిటో– 35 కుంభకోణాల ద్వారా ఈ దేశం చూసింది. చూస్తోంది. అటు తర్వాత వారి సుపు త్రుడు రాహుల్ గాంధీ. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థంకాదు. న్యాయంగా కాంగ్రెసు వారికీ అర్థం కాకూడదు. కాని వారు కాంగ్రెసు వారు కదా! రాహుల్‌గారు ‘సీజర్ పెళ్లాం’ లాంటివారు. ఇప్పుడు మొదటిసారి పెద్దమ్మ షీలా దీక్షిత్ నోరిప్పారు. ‘‘రాహుల్ వయసు అతను పరిణతిని సంపాదించడా నికి చాలదు. ఆయన పాపం, ఇప్పుడిప్పుడే విష యాలు తెలుసుకుంటున్నాడు. తన మనసులోని విష యాలు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడిప్పుడే తరం మారుతోంది. కొంచెం టైమివ్వండి!’’ అని బల్లగు ద్దారు. మాటలు రాని కుర్రాడు జీవితంలో మొదటి సారి నోరిప్పి ‘‘అ..మ్మ, అ..మ్మ’’ అన్నప్పుడు పడే సంతోషం లాంటిది మూర్తీభవించిన మాతృమూర్తి అయిన షీలా దీక్షిత్ గారి గొంతులో ధ్వనించింది. ఆయన 10, జన్‌పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఇంట్లో బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మనకేం కష్టం? మరో పాతిక సంవత్సరాలు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు. ప్రస్తుతం రాహుల్ గారిలో లోకజ్ఞానం ఉండ వలసినంతగా లేదు కనుక–షీలా దీక్షిత్ వంటి సీని యర్ నాయకులు తొడపాశం పెట్టో, చెవి నులిమో– ‘రాజకీయాలలో కొన్ని విలువలున్నాయి కుర్రవాడా! నువ్వు దేశాన్ని పాలించాలో లేదో రేపు ఓటరు చెప్తాడు. ఈలోగా నీ మాటలు సబబుగా ఉన్నాయో లేదో నువ్వు చూసుకోవాలి’ అంటూ మొదటి పాఠం చెప్పాలి. అక్కరలేని రంగంలోకి–రాజకీయ రంగం లోకి వచ్చిన ఇద్దరు ‘గాంధీ’ ప్రముఖుల ధర్మమా అని ఇప్పటికే దేశం నానా గడ్డీ కరుస్తోంది. ప్రస్తుతం దేశం మరో గాంధీని భరించగలదా అన్నది ధర్మ సందేహం. షీలా దీక్షిత్ మాట వినీవినగానే బీజేపీ నాయ కులు అమిత్‌షా గారు స్పందించారు. ‘‘నేను నూటికి నూరుపాళ్లూ షీలా దీక్షిత్గారితో ఏకీభవిస్తాను. పాపం, రాహుల్ గారికి పరిణతి లేదు. అది సంపా దించడానికి వారికి చాలా టైం పడుతుంది. అలాంట ప్పుడు ఈ మహానుభావుడిని ఉత్తరప్రదేశ్ మీద రుద్ద డంలో అంతరార్థం ఏమిటో? దేశానికి తలమాని కంగా నిలవగల ఉత్తరప్రదేశ్ బొత్తిగా లోకజ్ఞానం లేని నాయకుల తర్ఫీదుకు ప్రయోగశాలా?’’ అన్నారు. నేను బీజేపీ కార్యకర్తను కాను. కాని అవసరమై నప్పుడు–దేవేంద్ర ఫడ్నవిస్, ఆనందీబెన్ లాంటి వారు దక్షతతో పదవుల్లోకి వస్తూండగా (ఆనందీబెన్ తన వయసు కారణంగా స్వచ్ఛందంగా పదవీ విర మణ చేశారు) 70,80 ఏళ్ల వయస్సు దాటినా పద వుల్ని పట్టుకు వేలాడే ఎన్.డి. తివారీల్ని తయారు చేసిన పార్టీ కాంగ్రెసు. కాగా, గాంధీ కుటుంబం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎరుగని–తాజా మూడు తరాల అవ్యవస్థకి తార్కాణం కాంగ్రెసు. ఏమయినా కాంగ్రెసు ‘చంటివాడు’ రాహుల్‌ని కాంగ్రెసు పెద్దమ్మ భుజానికి ఎత్తుకోవడం ఆమె వాత్సల్యానికి నిదర్శనం. అంతేకాక పార్టీ ‘బుకా యింపు’కీ నిదర్శనం. చివరగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు– ఈ చంటివాడి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం సరదాగా ఉంటుంది: ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడు దేశం వదిలి వెళ్లినా మనకి బెంగగా ఉంటుంది. ఆయన వెంటనే తిరిగి రావాలని మనమంతా ఎదురు చూస్తాం. ఆయన గొంతు విప్పి మాట్లాడినప్పుడల్లా ప్రస్తుత పాలకులకు ప్రత్యామ్నా యమేమిటో ఆయన గుర్తు చేస్తున్నట్టుంటుంది’’ నా తృప్తికోసం చివరి వాక్యాన్ని ఇంగ్లిష్‌లో వ్రాయాలని తాపత్రయం. The people of this country can see the alternative that awaits this gov-ernment. చివరగా పెద్దమ్మ షీలా దీక్షిత్ గారికి ఒక విన్నపం: ‘‘అమ్మా! రాహుల్ గాంధీగారి పట్ల మీ అభి ప్రాయంతో మాకు ఏ విధమయిన విభేదమూ లేదు. ఆయన పరిణతికి కావలసినంత టైం ఇవ్వాలన్న విషయంలోనూ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ వారి లోకజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఈ దేశాన్ని ‘బలిపశువు’ను చెయ్యవద్దని మా మనవి. ‘గాంధీ’ అయిన ఒక్క కారణానికే రెండు తరాల అవ్యవస్థను భరించిన కారణానికయినా తమరు ఈ దేశాన్ని రాహుల్ అనే చంటివాడికి ‘పాఠశాల’ను చెయ్య కుండా మమ్మల్ని కాపాడమని మా ప్రార్థన!’’ - గొల్లపూడి మారుతీరావు -
నేరమూ - శిక్ష
జీవన కాలమ్ ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగనుంది కనుక, కర్ణాటక ప్రభుత్వం అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని కడితే బాగుంటుంది. బెంగళూరు పారప్పన్న అగ్రహారం జైలులో శశి కళకు అన్యాయం జరుగు తోందని నా గట్టి నమ్మకం. అలవాటుగా రెండోసారి అదే నేరానికి అదే జైలుకి వెళ్తున్న వ్యక్తిగా శశికళ కొన్ని సౌకర్యాలను కోర డం అనౌచిత్యం కాదు. లోగడ అక్కడ ఉన్నప్పుడు తన ‘అక్క’ జయలలితతో సమానంగా కొన్ని సౌకర్యాలను అనుభవించారు. కాగా కిందటిసారి ఆవిడ ఒక నేరస్తురాలికి సహాయకు రాలు. ఇవాళ ఒక మెజారిటీ పార్టీ ఎన్నుకున్న నాయ కురాలు. నిన్ననే ఆమె పార్టీ పదవిని చేపట్టింది. చక్కెర జబ్బు ఉన్నది కనుక–ఇంటినుంచి భోజనం, 24 గంటలూ వేడినీళ్లు, ‘బిస్లెరీ’ తాగే నీరు, పరి చర్యకు ఓ పనిమనిషిని కోరుకున్నారు. ముందు ముందు ఆ పార్టీ–ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి తమ నాయకురాలికి అలాంటి సౌకర్యాలను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఆమెది అవినీతి పాలన అని డీఎంకే వాపోయింది. ఒకవేళ వారు ప్రశ్నించాలనుకుంటే రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. ఏ విధంగా చూసినా ఆమె ప్రస్తుత నిర్ణయాలు చట్ట విరుద్ధం కాదు. మెజారిటీ పార్టీ నాయకురాలు, తనకిష్టమయిన నాయకుడిని– పార్టీని ఒప్పించే నిర్ణయించారు. ఆ పని కేంద్రంలో అల నాడు సోనియాగాంధీ కూడా చేశారు. ఇది సబబా అంటారా? రాజ్యాంగంమీద ప్రమాణం చేసిన ఏ మహానుభావులు ఆ ఆలోచనన యినా మనసులోకి రానిస్తున్నారు? ఇలాంటి పరిస్థి తిలో లాలూ గారు వంటింట్లోంచి తన భార్యని తీసు కొచ్చి కుర్చీలో కూర్చోపెట్టారు–తన్నుకు చావండని. మన అదృష్టం– ఈవిడ తోటపని చేసే మాలీని, అట్ల పిండి రుబ్బే ‘తమిళరసి’ని గద్దెమీద కూర్చోపెట్ట లేదు. తేలికగా నాలుగు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఉంటున్న నాయకుడిని తన స్థానంలో నిలి పారు. జయలలితకు పన్నీర్‌సెల్వం ఎంతో, శశికళకు పళనిస్వామి అంత. ఇకముందు మనదేశంలో పరిపాలన జైళ్లనుంచీ, వంటిళ్లనుంచీ జరగబోతోంది కనుక, కర్ణాటక ప్రభు త్వం సత్వరమే అగ్రహారం జైలులో తమిళనాడు సీఎం తరచూ తమ నాయకురాలిని కలుసుకోడానికి ఒక ఆఫీసుని నిర్మింపజేయాలని నా ఉద్దేశం. అలాగే శశికళకి ముందు ముందు–పాండీ బజారు మెదువడ, అడయార్ ఊతప్పం, దిండివనం రసం వండిపెట్టే చిన్న వంటగదిని జైలులో ఏర్పాటు చేయాలని, చేస్తారని నా నమ్మకం. రోజుకి 50 రూపా యల కూలీ సంపాదించే పని– 30 సంవత్సరాలలో 3వేల కోట్లు సంపాదించిన ‘యోగ్యురాలి’ చేత చేయించడం హాస్యాస్పదం. 30 ఏళ్లపాటు ఒక నాయకురాలి విశ్వాసాన్ని సంపాదించుకుని కోట్ల ఆస్తితోపాటు, రాష్ట్ర సీఎం కాగలిగిన ఒక వీడియో టేపుల వ్యాపారిని జైలు దుర్వినియోగం చేసుకుంటోందని నాకనిపిస్తోంది. న్యాయస్థానం న్యాయాన్ని ఎత్తి నిలుపుతుంది. చట్టం గుడ్డిగా శిక్షను అమలు జరుపుతుంది. ఈ రెంటికీ మధ్య– మారుతున్న పరిస్థితులూ, రాజకీయ వ్యవస్థని తమ వినియోగానికి మలచుకుంటున్న నాయకులూ– వీటన్నిటి దృష్ట్యా– శాసనసభలో చొక్కాలు చింపుకుని, మైకులు విరగ్గొట్టిన తెలివైన ప్రజా ప్రతినిధుల మనస్సుల్లో ‘గూండా’ మనస్త త్వాన్ని మేలుకొలిపి–అపశృతి ప్రస్తుతం రాజ్యమేలు తోంది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోంది. ప్రజాస్వామ్యానికి ఇంత కంటే మరో మార్గాంతరం లేదా అని–ఒక రబ్రీ దేవి, పది కోట్ల జరిమానాతో పదేళ్ల బహి ష్కరణను అనుభవిస్తూనే ఒక రాష్ట్ర పరిపాలనను తన గుప్పిట్లో పెట్టుకున్న నేరస్థు రాలు–ఈ వ్యవస్థను ప్రశ్ని స్తోంది. జయలలిత ఇవాళ బతి కుంటే పన్నీర్ సెల్వం మరొ కసారి పదవిలో కూర్చునే వారు. బిహారులో ఏ చదువు రాని ఇద్దరు లాలూ ప్రసాద్ కొడుకులు– ఆయన కొడుకుల యిన కారణానికే ప్రస్తుతం రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఒక పత్రికలో ఒక పాఠకుడు వెల్లడించిన అభి ప్రాయాలివి: 18 సంవత్సరాల కిందట కేవలం పదవి కారణంగా 86 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్విని యోగం చేసిన ఒక నాయకురాలు–కోర్టు తీర్పు ఆలస్యం అయిన కారణానికి ఈ రెండు దశాబ్దాలూ సమాజాన్ని నడిపించే స్థానంలో నిలిచి, కేవలం ‘మృత్యువు’ కారణంగా తీర్పును తప్పించుకున్న విలక్షణమైన స్థితికి ఎవరు కారణం? ఈ 18 సంవత్సరాలూ ఆమెతో కలిసి ఉంటూ– ఆమె కార్యక్రమాలలో జోక్యం ఉందన్న ఒక్క కారణానికే ‘చిన్నమ్మ’ అవతారం ఎత్తిన మరొక నేరస్తురాలు పరిపాలనను తన చేతుల్లోకి తీసుకోగలగడానికి బాధ్యత ఎవరిది? ఇది బొత్తిగా లోకజ్ఞానం లేని పాఠకుడి మదన. ఏమైనా చేసిన నేరాలకు 20 సంవత్సరాల వ్యవధిని అతి సుళువుగా ఈ వ్యవస్థ ఇవ్వగలదనే ‘దమ్ము’ నేరస్తుడి మొండి ధైర్యానికీ, వ్యవస్థ బలహీనతకీ నిదర్శనం–అని ఈ అమాయకుడైన పాఠకుడు గింజు కున్నాడు. ఆయన్ని మనం తేలికగా క్షమించవచ్చు. - గొల్లపూడి మారుతీరావు -
ట్రంపయ్య విన్యాసాలు
జీవన కాలమ్ మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు. రాజకీయ నాయకుడు రెండు రెళ్లు తప్పనిసరిగా ఆరు అవుతుందని ప్రజల్ని మర్యాదగా నమ్మించాలని చూస్తాడు. రెండు రెళ్లు మూడంటే ‘ఇది ప్రతి పక్షాలు నామీద చేస్తున్న కుట్ర’ అంటాడు. రెండు రెళ్లు నాలుగు అంటే ‘నేను ముందే చెప్పాను కదా?’ అంటాడు. కోపం రాజకీయ నాయకుని శత్రువు. చిరునవ్వు పనిముట్టు. లౌక్యం ఆయుధం. ఒబామా నిఖార్సయిన రాజకీయ నాయకుడు. పాకిస్తాన్ ఎన్నిసార్లు ఎన్నిరకాలైన దౌర్జన్యాలు చేసినా అమెరికా వారిని సిద్ధాంతపరంగా హెచ్చరిస్తూనే ఉంది. మరొకపక్క బిలియన్ల ఆర్థిక సహాయం చేస్తూనే వచ్చింది. ‘మొదట మీ పెరట్లో దౌర్జన్యాన్ని అరికట్టండి’ అన్న హిల్లరీ క్లింటన్ మాటని మనం చాలాకాలం నెత్తిమీద పెట్టుకుని ఊరేగాం. ఊరేగుతా మని అమెరికాకి తెలుసు. దౌర్జన్యాలు చేస్తున్న పాకి స్తాన్కి తెలుసు. ఇది చిన్న ఉదాహరణ. మరి ట్రంప్ గర్జించగానే ‘హఫీద్ సయీద్’ని పాకిస్తాన్ నిర్బం ధంలో ఎందుకుంచింది? వారికర్థమయ్యే ‘భాష’ ట్రంప్ దొర మాట్లాడాడు కనుక. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ నాయకుడు కాదు. వ్యాపారి. వ్యాపారికి ఈ రాజకీయపరమైన శషభి షలు లేవు. వ్యాపారికి నిక్కచ్చితనం లాయకీ. 2011 మే 1వ తేదీన ఒబామా పాత్రికేయులకి వార్షిక విందుని ఇచ్చాడు. అంతకుముందు ట్రంప్‌గారు ఒబామా పుట్టిన తేదీని, స్థలాన్నీ ప్రశ్నించారు. ఈ విందుకి ట్రంప్‌నీ ఆహ్వానించారు. ఆ విందులో ఒబామా ట్రంప్‌ని అతిథులందరిముందూ చెడా మడా కడిగేశారు. ‘డొనాల్డ్ నా పుట్టుక తేదీని ప్రశ్నిం చారు. ఇప్పుడు ఏకంగా నేను పుట్టిన వీడియోనే చూపించబోతున్నాను’ అంటూ వాల్ట్ డిస్నీ ‘‘ది లైన్ కింగ్’’ కార్టూన్ వేసి చూపించాడు. అతిథులు నవ్వు లతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆ రోజున తన 70వ ఏట మొదటిసారిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చెయ్యాలని ట్రంప్ నిర్ణయించుకున్నాడని వార్త. మొదటినుంచీ ఎవరూ ట్రంప్‌ని సీరియస్‌గా తీసు కోలేదు. అందరికీ అతను ఓడిపోతాడనే దృఢమైన నమ్మకం ఉండేది. పాపులర్ ఓటు హిల్లరీ క్లింటన్కే దక్కింది. కానీ అమెరికా ఓటరు ట్రంప్‌ని అధ్యక్షు డిగా ఎన్నుకున్నాడు. అది మరచిపోకూడదు. మరొక్కసారి– ట్రంప్‌కి రాజకీయమైన ‘సన్నాయి నొక్కులు’ తెలీవు. పదవిలో కూర్చోగానే ఎనిమిదేళ్లలో ఒబామా చేసిన సంస్కరణలన్నీ– సమూలంగా అటకెక్కించే ప్రయత్నం చేశాడు– ఆయన మీద ‘గుర్రు’ ఉంది కనుక. ఉందన్న విష యాన్ని ముందునుంచీ చెప్తూనే ఉన్నారు. చెప్పిందే చేశారు. పెదవడ్లపూడి రైతు స్థానిక రచ్చబండ దగ్గర కూర్చుని భావించే ధోరణిలోనే ట్రంప్‌గారు బల్లగుద్ది కొన్ని నిజాలని వక్కాణించారు. అవి నిజాలని మనం మరిచిపోకూడదు. ఇన్నేళ్లలో ఐక్యరాజ్యసమితికి అమె రికా బిలియన్లు ఖర్చు చేసింది. ఆ సంస్థ ఏం ఒరగ బెట్టింది? ఇరాక్æ యుద్ధం, ఇరాన్ వ్యవహారం, పాకి స్తాన్ దౌర్జన్యం–వేటికి పరిష్కారమో, స్పందనో ఆయా దేశాలు వినేటట్టు చూపగలిగిందా? మరెం దుకూ ఈ దిక్కుమాలిన సంస్థ? పాకిస్తాన్ ఒకపక్క దౌర్జన్యం జరుపుతుండగా బిలియన్ల సహాయం ఎందుకు చెయ్యాలి? ఇటుపక్క అమెరికన్ యువతకి ఉద్యోగాలు లేక అల్లాడుతుండగా విదేశాల నుంచి ఆయా నిపుణుల్ని ఎందుకు రానివ్వాలి? ఒక్క క్షణం ట్రంప్ చర్య వల్ల మనవారు అమెరికా వెళ్లగల అవకాశాలు తగ్గిపోతాయన్న విషయాన్ని పక్కన పెడితే– ఆ దేశం ఎన్నుకున్న– ఆ దేశానికి జరగవల సిన ఉపకారం గురించి కుండబద్దలు కొట్టి చెప్తున్న మాటలివి. ఈ వ్యాపారి ‘బుకాయింపు’ చూడండి. మెక్సికో నుంచి అక్రమంగా అమెరికాలోకి కాందిశీ కులు వస్తున్నారు. అందువల్ల నష్టం అమెరికాకి. కనుక వారు రాకుండా ఒక గోడ కట్టాలి. ఎవరు కట్టాలి? నష్టం ఎవరికి జరుగుతోందో వారు కట్టు కోవాలి. కానీ ఈ ‘వ్యాపారి’ ఆ గోడకి అయ్యే ఖర్చు మెక్సికో భరించాలన్నారు. అలాగే హింసని ప్రోత్సహిస్తున్న ఏడు దేశాల నుంచి ఆయా పౌరులు రావడాన్ని నిషేధించారు. ఆ చట్టాన్ని అమెరికా ప్రధాన న్యాయస్థానం కొట్టి పారే సింది. ట్రంప్ మళ్లీ చట్టాన్ని చేస్తానంటున్నారు. చేసినా ఆశ్చర్యం లేదు. ఆయన వ్యాపారి. తెగేవరకూ లాగడు. తెగేలాగ లాగుతాడు. మంచికో చెడుకో, ఒబామా మీద కసితోనో, పదవిమీద వ్యామోహంతోనో ఆయన ప్రపంచంలో కల్లా అతి బలమైన పదవిలో కూర్చున్నారు. ఇది ప్రతాపరుద్రుడి సింహాసనం మీద రజకుడి పాత్ర కాదు. నాలుగు దశాబ్దాలు–వ్యాపార కీలకాలు ఎరి గిన వ్యాపారి చేతిలోకి వచ్చిన ప్రపంచంలోకల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం పగ్గాలు. అప్పుడేమవుతుంది? ప్రస్తుతం ‘అమెరికా’ అవుతుంది. పరిపాలన రోడ్డుమీద పడదు. కానీ– రాజకీయాలలో అలవాటైన ‘సన్నాయి నొక్కులతో’కాక– చాలా సందర్భా లలో కుండబద్దలుకొట్టే ‘పాలన’ సాగుతుంది. ఆ ‘సాగుడు’ అప్పుడే ప్రారంభమైంది. - గొల్లపూడి మారుతీరావు -
ఓటమి వైభవం
జీవన కాలమ్ ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శించిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్కీ, తర్వాత ఫెడరర్కీ జేజేలు పలికింది. కవి కవిత్వం చెప్తాడు. కాని వాల్మీకి ఋషి. శ్రీరాముడు అలవోకగా, క్రీడ లాగా బాణాలు సంధిస్తే శత్రువులు పిట్టల్లాగ కూలిపోయేవారని రాస్తే కవి కనుక, చెప్పింది శ్రీరాముడి గురించి కనుక అలా వ్రాసి ఉంటాడనిపించేది. లేకపోతే అయన క్రీడ లాగా బాణాలు వేయడమేమిటి? శత్రువులు పిట్టల్లాగ కూలిపోవడమేమిటి? కాని ఒక క్రీడాకారుడిని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. అయన పేరు రోజర్ ఫెడరర్. వింబుల్డన్ రోజుల్లో రోలెక్స్ వాచీ కోసం వచ్చే ప్రకటన నాకు చాలా ఇష్టం. అతి లాఘవంగా, హుందాగా, ఒక కళలాగ తను కదులుతూ, ముఖంలో ఏమాత్రం ఆవేశం లేకుండా బంతిని కొట్టే ఫెడరర్ నైపుణ్యం, తన ప్రతిభ మీద తనకు గల అధికారాన్ని ప్రతీ అవయవంలోనూ ప్రతిఫలించగా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం వాల్మీకిని గుర్తు చేస్తుంది నాకు. ఆ వ్యాపార ప్రకటన రోలెక్స్కి ఫెడరర్ చేస్తున్నట్టుకాక, ఫెడరర్ జీనియస్‌కి రోలెక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాగా ఫెడరర్ ఒక మాట అన్నాడు, ‘నేను నాడాల్కి నంబరు వన్ ఫ్యాన్‌ని’’ అని. ఇద్దరూ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గొప్ప ఆటగాళ్లు. కాగా నాడాల్ ఆట ఒక ప్రభంజనం. ఒక హుద్ హుద్. ఫెడరర్ ఆట కళ. ఒక విన్యాసం. రెండూ ప్రత్యర్థిని మట్టికరిపించే ఆటలే. ఫెడరర్, నాడాల్ ఇంతవరకూ 35 సార్లు ఆడగా నాడాల్ ఫెడరర్ మీద 23 సార్లు గెలిచాడు. కాని ఇటీవలి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెడరర్ నాడాల్ల ఆట అద్భుతం. రూఢిగా జయించగల నాడాల్ని అయిదు సెట్లలో ఫెడరర్ జయించడం కాదు, నాడాల్ ఓటమిని అంగీకరించక తప్పనట్టు చేసిన పోరాటం అపూర్వం. అయితే ఆ అద్భుతం అక్కడితో ముగియలేదు. నాడాల్ అన్నాడు, ‘‘ఇలాంటి సందర్భాలలో నేను చాలాసార్లు ఫెడరర్ని ఓడించాను. కాని ఇవాళ నన్ను జయించడానికి ఆతను చేసిన కృషి స్పష్టంగా తెలుస్తోంది. ఇవాళ నాకంటే బాగా ఆడాడు. ఈసారికి కప్పుని ఆయన దగ్గర ఉంచుకోనిస్తాను. నేను మళ్లీ వస్తాను’’ అన్నాడు. ఫెడరర్ అన్నాడు, ‘‘ఓటమి, విజయాలను పక్కన పెట్టి ఇద్దరినీ సరిసమానంగా తూకం వేస్తే ఇవాళ ఈ కప్పుని మేం ఇద్దరం పంచుకోవాలి’’ అంటూ నాడాల్ వైపు తిరిగి ‘‘ఆటమానకు రాఫా, ప్లీజ్. టెన్నిస్ ఆటకి నీ అవసరం చాలా ఉంది’’ అంటూ ‘‘‘రాఫా ప్రతిసారీ నాఆటని మెరుగు దిద్దుతున్నాడు’’ అన్నాడు. ఓటమికి ఉదాత్తత కావాలి. విజయానికి వినయం కావాలి. ఆ రెంటినీ పుష్కలంగా ప్రదర్శిం చిన టెన్నిస్ దిగ్గజాలు వారిద్దరూ. ప్రపంచమంతా ఏకమయి ముందు నాడాల్కీ, తర్వాత ఫెడరర్కీ జేజేలు పలికింది. ఎన్నో కారణాలకి ఈ ఫైనల్స్ ఒక చరిత్ర. ఈ ఆటగాళ్లిద్దరినీ దాటి టెన్నిస్ అప్పుడే చాలా దూరం ప్రయాణం చేసింది. ఆండీ ముర్రే, డోకోవిచ్ ఇప్పుడు బరిలో ఉన్న యోధులు. కాగా ఫెడరర్ ఆరు నెలల కింద ఆటలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడు. అతని వయస్సు 35. నాడాల్ వయస్సు 30. గాయం, ఆట నుంచి విశ్రాంతి కారణంగా ఫెడరర్ ‘‘అలసిన’ యోధుడు కింద లెక్క. కాని నిన్నటి ఆట బరిలో వయస్సుని జయించి ఇద్దరు ఆటగాళ్లు ఏడేళ్ల కిందటి వారి ఆటని గుర్తు చేశారు. ప్రతిభకీ, జీనియస్కీ వయస్సు లేదని మరోసారి నిరూపించారు. ఆటలో ఆఖరి బంతితో విజయాన్ని సాధించిన ఫెడరర్ గురించి ఒక పాత్రికేయుడు కేవలం కవిత్వమే రాశాడు, ‘‘ఆనందమూ, ఆవేశమూ కట్టలు తెంచుకోగా ఆర్టూ, హార్టూ ఊదారంగు బూట్లమీదికి జారిన ఫెడరర్ 18వ గ్రాండ్ స్లామ్ విజయాన్ని పొదివి పట్టుకుని అయిదేళ్ల పసిబిడ్డలాగ భోరుమన్నాడు.’’ ఇది ఇంగ్లిష్ వాక్యానికి భయంకరమైన అనువాదం. క్షమించాలి. శ్రీరాముడు అవలీలగా, క్రీడగా బాణాలు వర్షించడం నాకిప్పుడు అర్థమవుతోంది. అపూర్వమ యిన ప్రతిభ, సామర్ధ్యం పట్ల చెరిగిపోని అత్మ విశ్వాసం, పట్టుదల, తన కళ పట్ల ఆరాధనాభావం ఉన్న ప్రతిభావంతుడు చెలరేగితే విరుచుకుపడే ఉప్పెన అయినా అవుతాడు, విప్పారే కలువపువ్వ యినా అవుతాడు. ఇందుకు నిదర్శనం మొన్న మెల్బోర్న్ రాడ్ లీవర్ స్టేడియంలో అవిష్కృతమైన మహా దృశ్య కావ్యం. - గొల్లపూడి మారుతీరావు -
అనువుగాని చోట్లు
జీవన కాలమ్ ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడారట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించుకోలేదట. నాకు బాగా గుర్తు. ఎన్.టి. రామారావు నటించిన పుండరీకాక్షయ్యగారి చిత్రం ‘ఆరాధన’ రజతోత్సవ సభ హైదరాబాద్‌లో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ఉత్సవానికి లోపలికి వెళుతుండగా గేటు దగ్గర ఎవరో నన్ను ఆపేశారు. నా వెనుకనే వస్తున్న ప్రముఖ నాట్యాచార్యులు వెంపటి చిన్న సత్యంగారు ముందుకు దూకారు. ‘‘ఆయన ఈ చిత్ర రచయిత బాబూ!’’ అని వివరించారు. అప్పటికి నేను నటుడిని కాదు. నా రచయిత పరపతి థియేటర్ గేటు కీపర్ దాకా ప్రయాణం చెయ్యలేదు. 1975 ఏప్రిల్‌లో హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రారంభించారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. మండలి వెంకట కృష్ణారావు విద్యామంత్రి. స్టేజీ మీద టంగుటూరి సూర్యకుమారి ‘మా తెలుగుతల్లికి’ గీతం పాడు తోంది. మాసిన బట్టలతో ఒకాయన గేటు దగ్గరికి వచ్చాడు. గేటు కీపర్లు ఆయన్ని ఆపారు. ‘ఆ పాట రాసింది నేనే’ అన్నాడాయన. అయినా వారు వద ల్లేదు. ఈలోగా ఎవరో ఆయన్ని గుర్తుపట్టి అధికారు లకి చెప్పారు. కార్యకర్తలు పరుగున వచ్చి ఆయన్ని సాదరంగా లోపలికి తీసుకెళ్లారు. ఆయన శంకరం బాడి సుందరాచారి. మర్నాడు విశ్వనాథ సత్యనారా యణ అధ్యక్షత వహించిన కవి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. మనకి సామెతలు ఊరికే రాలేదు– ‘వెండి పళ్లానికైనా గోడ చేర్పు కావాలి’. ప్రతీ గొప్ప తనానికీ ‘అనువుగాని చోటు’ ఒకటుంటుంది–అని. దీనిని సోదాహరణంగా నిరూపించిన విచిత్ర మైన, కానీ అపురూపమైన ప్రయోగం జరిగింది. 2007లో వాషింగ్టన్ లెఫెంట్ ప్లాజా మెట్రో స్టేషన్లో ప్రపంచ ప్రఖ్యాత వయొలినిస్ట్, గ్రామీ అవార్డు గ్రహీత జోషువా బెల్ బేస్‌బాల్ ఆటగాడి టోపీ పెట్టుకుని–వీధిలో తిరిగే వాద్యగాడిలాగా కూర్చుని వయొలిన్ వాయించాడట. ఆయన వయొలిన్ ఖరీదు 30 లక్షల డాలర్లు. ప్రపంచ ప్రఖ్యాత మెండల్సన్, బాఖ్ సంగీతాన్ని వాయించాడు. అది నూరు సంవత్స రాలుగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన అపురూపమైన సంగీతం. అయితే ఆనాడు యూనియన్ స్టేషన్లో 1,070 మంది ఆయన సంగీతాన్ని పట్టించుకోకుండా హడావుడిగా తమ తమ గమ్యాలకి పరుగులు తీశారు. కేవలం 27 మంది ఒక్కక్షణం ఆగి ముందుకు తరలి పోయారు. ఆయన బాఖ్ వాయిస్తూ ఉంటే హాలులో ఒక గుండుసూది కిందపడినా శబ్దం మారుమోగుతుందట. ఈ కథ విని అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నవ్వుతూ అన్నాడట: ‘‘నాకు తెలిస్తే నేను అక్క డికి వచ్చేవాడిని’’ అని. బెల్ నవ్వి–నిజంగా ఆయన వచ్చి ఉంటే మరో కారణానికి–అంటే అమెరికా మాజీ అధ్యక్షుడిని మెట్రో రైలు స్టేషన్లో చూస్తున్నందుకు తెల్లబోయినవారు–అప్పుడు నా సంగీతాన్ని పట్టించు కునేవారు కాదు–అన్నాడట. ఈ కథని విన్న చాలా మంది నవ్వుతూ తమ ట్వీటర్లలో చమత్కరించారట. ‘‘ఇది ఏసుప్రభువుని మరచిపోయిన క్రిస్టమస్ లాంటిది’’ అని. ఈ ప్రయోగాన్ని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక నిర్వహించింది. దీన్ని చిన్నపిల్లలకు నీతికథగా వ్రాస్తే ఆ పుస్తకానికి పులిట్జర్ బహుమతి లభించింది. ఆయన ప్రముఖ నటీమణి మెరిల్ స్ట్రీప్‌తో ‘సీసేమ్ స్ట్రీట్’లో నటించారు. అధ్యక్షుడు ఒబామా, బ్రిటన్ మహారాణి సమక్షంలో జోషువా బెల్ ప్రత్యేక ప్రదర్శ నలిచ్చారు. ఆ మధ్య పుణేలో ప్రసిద్ధ గాయకుడు సోనూ నిగమ్ తుప్పతల, పిల్లిగెడ్డం పెట్టుకుని వీధిలో ఒక చెట్టు కింద హార్మోనియం పట్టుకుని పాటలు పాడా రట. ఒక్కడు కూడా ఆయన సంగీతాన్ని పట్టించు కోలేదట. ప్రపంచంలో ప్రతి గొప్ప కళకీ చక్కని ఫ్రేమ్ కావాలి. ఆలంబన కావాలి. ఫోకస్ కావాలి. చిన్న ఉపో ద్ఘాతం కావాలి. మన తెలుగు సినిమాల్లో యముడూ, చిత్రగుప్తుడూ కిరీటం, గదతో మన రోడ్ల మీదకు వచ్చి ‘నేను యముండ’ అంటే, ‘మనది ఏ నాటక కంపెనీ బాబూ!’ అని పలకరించడం చూశాం. ఆలయంలో అడుగు పెట్టిన క్షణం నుంచీ మంచి గంధం పరిమళం, గర్భగుడిలో మోగే గంటల రవళి, కర్పూర హారతి, అష్టోత్తర నామావళి–ఇవన్నీ ఒక పవిత్రమైన ఆలోచనా సరళిని ఒక ‘మూడ్’ని ్చఝbజ్చీ nఛ్ఛిని కల్పిస్తాయి. ఊరేగింపుకి స్వామి ఊరికేరాడు. ముందు మేళతాళాలు వస్తాయి. వెనుక భక్త బృందం నడుస్తుంది. తర్వాత ఏనుగులు నడుస్తాయి. తర్వాత పల్లకీ కనిపిస్తుంది–అప్పుడూ స్వామి దర్శనం. ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు జోషువా బెల్ని రద్దీగా ఉన్న యూనియన్ స్టేషన్లో కూర్చోబెట్టిన ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రిక ప్రయోగం ఓ గొప్ప సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రతీక. ఈ వాస్తవం విపర్యాయా నికీ–అంటే ‘అనువుగాని చోట’ ఎంత గొప్ప కళయినా వీగిపోతుందనడానికీ ఈ ప్రయోగం తార్కాణం. గొల్లపూడి మారుతీరావు -
ఓ ‘‘చౌకీదారు’’ కథ
జీవన కాలమ్ నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం. కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్ లేలాండ్ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య. ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు. ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్ భాయ్–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్నగర్లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్ నగర్లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు. మోదీ అన్నయ్య–సోంభాయ్ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు. మోదీ అన్నయ్య అమృతాభాయ్(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్ గీతామందిర్ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్.ఎస్.ఎస్. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి. నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్! (వ్యాసకర్త : గొల్లపూడి మారుతీరావు )