ఇక రాహుల్‌కి సెలవు | Gollapudi Maruthi Rao write article on Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఇక రాహుల్‌కి సెలవు

Published Wed, Feb 25 2015 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

ఇక రాహుల్‌కి సెలవు

ఇక రాహుల్‌కి సెలవు

కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయాలని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను.
 
 ఈ మధ్య ఢిల్లీలోను, అంత కు ముందు ఎన్నికలు జరిగిన అన్ని రాష్ట్రాలలో సోదికి లేకుండా పో యిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఎట్టకే లకు ఒక గొప్ప నిర్ణ యాన్ని తీసుకున్నా రు. అసలు పార్టీకి ఈ గతి ఎందుకు పట్టింది అనే విషయం మీద వారు దీర్ఘాలోచన జరిపి, ఏం చేస్తే మళ్లీ పార్టీ పునరుద్ధరింపబడుతుందో కొన్ని వారాల పాటు ఏకాంతంగా ఆలోచించి ఒక సమగ్రమైన పథకాన్ని రూపొందించుకోద లుచుకున్నారు. వేసవికాలంలో ఢిల్లీలో ఎండలు మండిస్తాయి కనుక, వారు ఏ స్విట్జర్లాండ్‌కో, ఇటలీకో వెళ్లి ఈ ఆలోచనలు చేస్తారు. అందుకు వారు కాంగ్రెస్ అధ్యక్షురాలు - అంటే వాళ్ల అమ్మ దగ్గర కొన్ని వారాలు సెలవు కోరారు.
 
 అయితే ఈ సెలవు వెనుక గొప్ప ఉద్దేశం ఉంది. రేపు బ్యాంకాక్‌లో వారు స్వేచ్ఛా విహారం చేస్తూండగా ఎవరైనా పాత్రికేయుడు తారసపడి ‘ఏం సార్! ఢిల్లీలో మీ పార్టీ తుడిచి పెట్టుకుపోవడానికి కారణాలేమిటి?’ అని ప్రశ్నిస్తే రాహుల్ గారు ‘క్షమించండి! నేను ప్రస్తుతం లీవులో ఉన్నాను’ అని ధైర్యంగా చెప్పగలరు- వారి లీవ్ లెటర్ మీద వారి అమ్మ అంగీకార ముద్ర ఉంది కనుక. నేను 56 సంవత్సరాలుగా పాత్రికేయుడిగా ఉన్నాను. నాకు తెలిసి ఓ పార్టీ నాయకుడు ఆ పార్టీ పూర్తిగా నేల మట్టమయిపోయిన తర్వాత ఇలా సెలవు తీసుకోవడం ప్రపంచ చరిత్రలో ఎన్నడూ వినలేదు.
 
 ఢిల్లీలో పళ్లూడినప్పటి నుంచీ ఇదే విషయాన్ని తల చుకుంటూ - ఉదయం పళ్లు తోముకుంటున్నప్పుడో (పళ్లూడిన విషయం అప్పుడే కదా గుర్తుకొచ్చేది!), డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తున్నప్పుడో అమ్మ గారికి విషయం చెప్పి ఉంటారు. ఇదీ తల్లీకొడుకుల దేశ భక్తికి నిదర్శనం.
 
ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో మహాత్మాగాంధీ ఆరు నెలలు ఆరోగ్య కారణాలకి సెలవు తీసుకోలేదు. వారి ముత్తాతగారు, తాతగారు, నాయనమ్మగారూ ఇలా సెలవు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే వారికి ‘సమాజ సేవ’ పార్ట్ టైం ఉద్యోగం కాదు కనుక. ఇప్పుడ యితే మన నాయకులకు రాజకీయాలు కోట్లు పెట్టుబడి పెట్టే వ్యాపారమయిపోయిందికాని, ఆ తరం నాయ కులు రాజకీయాలని ఉద్యోగాలుగా చేసుకోలేదు.
 
నిజానికి ఈ మధ్య ఏడెనిమిది నెలలుగా రాహుల్ గారు అనధికారికంగా సెలవుల్లోనే ఉన్నారు. మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్, కశ్మీర్, ఢిల్లీ ఎన్నికలలో వారు గెస్టు పాత్రనే ధరించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌కి ఇచ్చిన వీడ్కోలు సభకి గైర్హాజరయ్యారు. ఆఖరికి 130 సంవత్సరాల కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవానికి పార్టీ ఉపాధ్యక్షులు కనిపించలేదు. భూసేకరణ చట్టాన్ని బలంగా ఎదుర్కొంటానని సభలో జబ్బలు చరుచుకున్న రాహుల్‌గారు పార్లమెంట్ సమావేశానికే రాక  సెలవులో తెలియని దేశానికి నిష్ర్కమించారు. ఇది అమేథి ఓటర్లు తమ నాయకుడిని చూసి గర్వపడే సందర్భం.
 
తమ పార్టీని ఓటరు ఎందుకు గద్దెదించాడో తెలు సుకోవడానికి రాహుల్ హిమాలయాలకు వెళ్లనక్కర లేదు. స్విట్జర్లాండ్ వసతిగృహాల్లో తపస్సు చేయనక్కర లేదు. బోధివృక్షం కింద సమాధిలో కూర్చోన క్కరలేదు. చాందినీ చౌక్‌లో చెనా బఠోరా అమ్ముకునే సాదాసీదా మనిషితో ఒక్కసారి మాట్లాడితే మొహం వాచేలా చెప్పగలడు. అమ లాపురంలో, అనకాపల్లిలో, ఆమదాలవలస లో, చిత్తూరులో, చీపురుపల్లిలో వారికి రోడ్డు మీద తారసపడ్డ మొదటి వ్యక్తి పూసగుచ్చినట్టు సమాధానం చెప్పగలడు. వారు అడగాల్సింది ఒకే ఒక్క ప్రశ్న. ‘ఎందుకు బాబూ మమ్మల్ని గద్దె దించారు?’ అని. భారతదేశంలో వారికి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో కనిపించిన ఏ మని షైనా చెప్పగలడు. లేదా ఈ ఒక్క ప్రశ్నని పత్రి కల్లో ప్రకటిస్తే కొన్ని కోట్ల సమాధానాలు అందుతాయి.
 
నాది మరొక చిన్న ప్రతిపాదన. దేశంలో జరిగిన రాజకీయ పరిణామాలకి కారణాలను వెదకడానికి, కనీసం ఆరేళ్ల సెలవుని వారి అమ్మ మంజూరు చేయా లని, వారు ఈ ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకుని- మంచి ప్రణాళికలని ఇటలీలో రూపుదిద్ది మళ్లీ ఇండియా వచ్చి ఉద్యోగంలో చేరాలని మనవి చేస్తున్నాను. రాహుల్‌గాంధీగారి సెలవు ఈ దేశానికి శుభసూచకం. కొందరు తాము ఉన్నచోట ఆనందాన్ని కలిగిస్తారు. కొందరు తాము లేని చోట ఆనందాన్ని కలిగిస్తారు. ఆ రెండో కేటగిరీకి చెందిన నేటితరం మహానాయకులు రాహుల్‌గాంధీగారు.
 
44 ఏళ్ల యువకుడు-అయిదోతరం నాయకత్వానికి - కాళ్లు చల్లబడగా- ప్రజా సంక్షేమం అనే ఉద్యోగానికి కొన్ని వారాల సెలవు తీసుకోవడం ఈ తరం రాజకీయ రంగంలో పెద్ద జోక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement