
‘బొత్తిగా చంటోడు’
జీవన కాలమ్
ఆయన 10, జన్‌పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యం తరం లేదు. బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మరో పాతికేళ్లు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు.
ఇన్నాళ్లకి కాంగ్రెస్ పెద్దమ్మ షీలా దీక్షిత్ ఓ గొప్ప నిజాన్ని ఒప్పుకున్నారు– రాహుల్ గాంధీ ఇంకా ‘పెద్దమనిషి’ కాలేదని, అందుకు కొంచెం టైం కావాలని. ఈ దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదిం చడంలో – మహానుభావు లతో ప్రపంచ ప్రఖ్యాతిని సాధించిన ఒకనాటి కాంగ్రెసు, ఆ రోజుల్లోనే ‘‘నాకు రాజకీయాలలోకి రావడం ఇష్టంలేదు’’ అని పత్రికల ముందు ఒప్పు కున్న రాజీవ్ గాంధీగారి చేతుల్లోకి వచ్చింది. రాజీవ్ గాంధీ భార్య అయిన ఒక్క కారణానికే సోనియా గాంధీ పదవిలోకి వచ్చారు. ఆవిడ నిర్వాకం ఏమిటో– 35 కుంభకోణాల ద్వారా ఈ దేశం చూసింది. చూస్తోంది. అటు తర్వాత వారి సుపు త్రుడు రాహుల్ గాంధీ. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థంకాదు. న్యాయంగా కాంగ్రెసు వారికీ అర్థం కాకూడదు. కాని వారు కాంగ్రెసు వారు కదా! రాహుల్‌గారు ‘సీజర్ పెళ్లాం’ లాంటివారు.
ఇప్పుడు మొదటిసారి పెద్దమ్మ షీలా దీక్షిత్ నోరిప్పారు. ‘‘రాహుల్ వయసు అతను పరిణతిని సంపాదించడా నికి చాలదు. ఆయన పాపం, ఇప్పుడిప్పుడే విష యాలు తెలుసుకుంటున్నాడు. తన మనసులోని విష యాలు స్పష్టంగా చెప్తున్నాడు. ఇప్పుడిప్పుడే తరం మారుతోంది. కొంచెం టైమివ్వండి!’’ అని బల్లగు ద్దారు. మాటలు రాని కుర్రాడు జీవితంలో మొదటి సారి నోరిప్పి ‘‘అ..మ్మ, అ..మ్మ’’ అన్నప్పుడు పడే సంతోషం లాంటిది మూర్తీభవించిన మాతృమూర్తి అయిన షీలా దీక్షిత్ గారి గొంతులో ధ్వనించింది. ఆయన 10, జన్‌పథ్ రోడ్డులో కూర్చుని ‘అక్షరాలు’ వల్లిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఇంట్లో బోలెడంత టైము తీసుకునే హక్కు వారికుంది. మనకేం కష్టం? మరో పాతిక సంవత్సరాలు తీసుకోమనండి. కాకపోతే వారిప్పుడు కాంగ్రెసు పార్టీ ఉపాధ్యక్షులు.
ప్రస్తుతం రాహుల్ గారిలో లోకజ్ఞానం ఉండ వలసినంతగా లేదు కనుక–షీలా దీక్షిత్ వంటి సీని యర్ నాయకులు తొడపాశం పెట్టో, చెవి నులిమో– ‘రాజకీయాలలో కొన్ని విలువలున్నాయి కుర్రవాడా! నువ్వు దేశాన్ని పాలించాలో లేదో రేపు ఓటరు చెప్తాడు. ఈలోగా నీ మాటలు సబబుగా ఉన్నాయో లేదో నువ్వు చూసుకోవాలి’ అంటూ మొదటి పాఠం చెప్పాలి. అక్కరలేని రంగంలోకి–రాజకీయ రంగం లోకి వచ్చిన ఇద్దరు ‘గాంధీ’ ప్రముఖుల ధర్మమా అని ఇప్పటికే దేశం నానా గడ్డీ కరుస్తోంది. ప్రస్తుతం దేశం మరో గాంధీని భరించగలదా అన్నది ధర్మ సందేహం.
షీలా దీక్షిత్ మాట వినీవినగానే బీజేపీ నాయ కులు అమిత్‌షా గారు స్పందించారు. ‘‘నేను నూటికి నూరుపాళ్లూ షీలా దీక్షిత్‌గారితో ఏకీభవిస్తాను. పాపం, రాహుల్ గారికి పరిణతి లేదు. అది సంపా దించడానికి వారికి చాలా టైం పడుతుంది. అలాంట ప్పుడు ఈ మహానుభావుడిని ఉత్తరప్రదేశ్ మీద రుద్ద డంలో అంతరార్థం ఏమిటో? దేశానికి తలమాని కంగా నిలవగల ఉత్తరప్రదేశ్ బొత్తిగా లోకజ్ఞానం లేని నాయకుల తర్ఫీదుకు ప్రయోగశాలా?’’ అన్నారు.
నేను బీజేపీ కార్యకర్తను కాను. కాని అవసరమై నప్పుడు–దేవేంద్ర ఫడ్నవిస్, ఆనందీబెన్ లాంటి వారు దక్షతతో పదవుల్లోకి వస్తూండగా (ఆనందీబెన్ తన వయసు కారణంగా స్వచ్ఛందంగా పదవీ విర మణ చేశారు) 70,80 ఏళ్ల వయస్సు దాటినా పద వుల్ని పట్టుకు వేలాడే ఎన్.డి. తివారీల్ని తయారు చేసిన పార్టీ కాంగ్రెసు. కాగా, గాంధీ కుటుంబం తప్ప మరో ప్రత్యామ్నాయం ఎరుగని–తాజా మూడు తరాల అవ్యవస్థకి తార్కాణం కాంగ్రెసు. ఏమయినా కాంగ్రెసు ‘చంటివాడు’ రాహుల్‌ని కాంగ్రెసు పెద్దమ్మ భుజానికి ఎత్తుకోవడం ఆమె వాత్సల్యానికి నిదర్శనం. అంతేకాక పార్టీ ‘బుకా యింపు’కీ నిదర్శనం.
చివరగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు– ఈ చంటివాడి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకోవడం సరదాగా ఉంటుంది: ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడు దేశం వదిలి వెళ్లినా మనకి బెంగగా ఉంటుంది. ఆయన వెంటనే తిరిగి రావాలని మనమంతా ఎదురు చూస్తాం. ఆయన గొంతు విప్పి మాట్లాడినప్పుడల్లా ప్రస్తుత పాలకులకు ప్రత్యామ్నా యమేమిటో ఆయన గుర్తు చేస్తున్నట్టుంటుంది’’ నా తృప్తికోసం చివరి వాక్యాన్ని ఇంగ్లిష్‌లో వ్రాయాలని తాపత్రయం. The people of this country can see the alternative that awaits this gov-ernment.
చివరగా పెద్దమ్మ షీలా దీక్షిత్ గారికి ఒక విన్నపం: ‘‘అమ్మా! రాహుల్ గాంధీగారి పట్ల మీ అభి ప్రాయంతో మాకు ఏ విధమయిన విభేదమూ లేదు. ఆయన పరిణతికి కావలసినంత టైం ఇవ్వాలన్న విషయంలోనూ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. కానీ వారి లోకజ్ఞానాన్ని పరీక్షించుకోవడానికి ఈ దేశాన్ని ‘బలిపశువు’ను చెయ్యవద్దని మా మనవి. ‘గాంధీ’ అయిన ఒక్క కారణానికే రెండు తరాల అవ్యవస్థను భరించిన కారణానికయినా తమరు ఈ దేశాన్ని రాహుల్ అనే చంటివాడికి ‘పాఠశాల’ను చెయ్య కుండా మమ్మల్ని కాపాడమని మా ప్రార్థన!’’
- గొల్లపూడి మారుతీరావు