కొత్త వేదం | New Veda: Gollapudi maruthi rao to talk about Jamadagni movie | Sakshi
Sakshi News home page

కొత్త వేదం

Published Thu, Jul 9 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:08 AM

ఎడమ నల్లదుస్తుల్లో కనిపిస్తున్న స్త్రీ జహీర్ సోదరి, కుడి పక్కన భార్య, కుమార్తె ముందు వరసలోని బాలిక ప్రార్థన, బాలుడు ఆయుష్

ఆయుష్, ప్రార్థన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నారు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందువులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. చాలా సంవత్సరాల కిందట భారతీరాజా దర్శకత్వంలో ‘జమదగ్ని’ అనే చిత్రంలో నటించాను. ఆ సందర్భంలో ఆయన తీసిన ఒక సినీమాని నాకు ప్రత్యేకంగా ప్రదర్శనని ఏర్పాటు చేశారు. చిత్రం పేరు ‘వేదం పుదిదు’ (వేదం కొత్తది). స్థూలంగా కథ ఇది. ఊరి పెద్ద తక్కువ కులస్తుడు. అతని కారణంగా ఓ బ్రాహ్మణుడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అతని కొడుకు 9 ఏళ్ల పసివాడు. ఊరి పెద్ద, భార్య ఆ కుర్రాడిని చేరదీసి సాకారు. అతన్ని బ్రాహ్మణుడిగానే పెంచారు. విద్యాబుద్ధులకి గురువుల దగ్గరికి తీసుకెళ్లారు. గురువు గారి వీధి అరుగు మీద కుర్రాడు వేదం చెప్పుకుంటూంటే దూరాన చెట్టుకింద గొంతికిలా కూర్చుని ఉండేవాడు ఊరి పెద్ద. ఊరి పెద్ద అంటే అందరికీ సింహస్వప్నం.
 
 కాని కుర్రాడికి తన అజ్ఞానం కారణంగా, కులం కారణంగా నష్టం కలగకుండా అప్రమత్తంగా పెంచే పెద్ద దిక్కు. కుర్రాడు వేదపండితుడయ్యాడు. తనని పెంచిన దంపతుల మీద ఆత్మీయతని పెంచుకున్నాడు. ఊరి పెద్ద కన్నుమూశాడు. కుర్రాడు శాస్త్రోక్తంగా తండ్రికి చేసినట్టు అంత్యక్రియలు జరిపాడు. విద్య సంస్కారాన్ని నేర్పింది. బాంధవ్యం రుణం తీర్చుకుంది. ఇది కొత్త వేదం అన్నా రు రచయిత, దర్శకుడు భారతీరాజా.  ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక - బెంగాలులో మతకల్లోలం పెచ్చురేగింది. మహాత్ముడు నిరాహారదీక్ష చేస్తున్నాడు. ఒక హిందువు వచ్చి ‘‘నేను ఓ ముస్లిం కుర్రా డిని తల గోడకి కొట్టి చంపాను బాపూ’’ అని నిస్సహా యంగా చెప్పుకున్నాడు. బాపూజీ అతన్ని చూసి ‘‘దానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఓ చిన్న కుర్రాడిని చేరదీసి పెంచు. అయితే అతను ముస్లిం కుర్రాడయి ఉండాలి. అతన్ని ముస్లింగానే పెంచాలి’’ అన్నాడు. మానవత్వానికి మతం లేదు. కులం లేదు. వివక్ష లేదు.
 
 ఇప్పుడు ఇటీవలి కథ. మహ్మద్ షానవాజ్ జహీర్, ప్రవీణ్ దయాళ్ - ఇద్దరూ పైలట్లు. కలసి పనిచేస్తారు. ఆత్మీయ మిత్రులయ్యారు. ప్రవీణ్ ఒక ఎయిర్ హోస్టెస్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు - ఆయుష్, ప్రార్థన, 2012లో ఆమె కన్నుమూసింది. ఇతనూ అనారోగ్యంలో పడ్డాడు. ‘‘నాకేమయినా అయితే నా పిల్లల్ని చూసుకోండి’’ అని ప్రవీణ్ మిత్రుడు జహీర్ దగ్గర మాట తీసుకున్నాడు. తర్వాత ఆ సంవత్సరమే అతనూ కన్నుమూశాడు. జహీర్ వెంటనే చొరవ తీసు కోని కారణాన పిల్లల్ని కారు డ్రైవర్ సాకుతున్నాడు. తన ఉద్యోగం రద్దీలో మిత్రుడికిచ్చిన మాటని మరిచిపోయా డు జహీర్. ఒక రోజు పిల్లలిద్దరూ అతనికి ఫోన్ చేశారు, కంటతడి పెట్టుకుంటూ. జహీర్ గతుక్కుమన్నాడు. వెం టనే రంగంలోకి దూకాడు. ప్రవీణ్ పోయాక ఇండియన్ పైలట్ల అసోసియేషన్ ఒక కోటి రూపాయలు సమీకరిం చి - పిల్లల పేరిట బ్యాంకులో వేసింది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులూ, పిల్లల బాధ్యతా తనకి అప్పగించాలని కోర్టుని ఆశ్రయించాడు.
 
 అయితే ఈ అనుమతికి కొన్ని పరిధులున్నాయి. తను ముస్లిం. పిల్లలు హిందువులు. భారత దేశ చరి త్రలో ఇంతవరకూ మతాంతర ఒప్పందానికి ఏ కోర్టూ అనుమతిని ఇవ్వలేదు. అయినా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నజ్మీ వజీరీ (గమనించాలి- ఇతను ముస్లిం) ఈ పిల్లల పోషణా భారాన్ని జహీర్‌కి అప్పగించారు. ఆయన తీర్పులో మాటలు: ‘‘వివిధ సాహిత్యాలలో కవులూ, రచ యితలూ మానవ సంబంధాలు మతాతీతమైనవని పేర్కొన్నారు.
 
 మానవ శ్రేయస్సుకి మూలసూత్రం పసి జీవితా లను కాపాడడమే’’. నీదా ఫజ్లీ, జావేద్ అఖ్తర్ మాటల్ని ఉదహరిస్తూ ‘‘అనాథపిల్లలను సంరక్షించి, సాకడం అపూర్వమైన మానవధర్మాలలో ఒకటి’’ అన్నారు. పక్కింటి వ్యక్తి అరుణ్ సాయనీకి ఆ పిల్లలిద్దర్నీ జహీర్ హిందూ సాంప్రదాయ రీతుల్లో పెంచుతున్నట్టు పర్య వేక్షించే పనిని అప్పగించారు న్యాయమూర్తి. యోగేష్ జోగియా అనే న్యాయవాది ఈ కేసుని ఉచితంగా నిర్వ హించారు. భారతదేశంలో మతాతీతమైన గొప్ప తీర్పు గా దీనిని అభివర్ణించారు.
 
ఆయుష్, ప్రార్ధన ఇప్పుడు జహీర్ ఆలనలో ఉన్నా రు. ‘‘వాళ్ల మతానికి నేను అడ్డురాను. వాళ్లు హిందు వులుగానే పెరుగుతారు. దేవాలయానికి వెళతారు’’ అన్నారు జహీర్. ఆయుష్ పబ్లిక్ స్కూలులో చదువు తున్నాడు. పెద్దయాక ఏమవుతాడు? పైలట్‌ని అవుతా నన్నాడు. ప్రార్ధన డిజైనర్ అవుతానంది. కాలం మారుతోంది. మానవ సంబంధాలకు ఉదా త్తమయిన విలువలు జత అవుతున్నాయి. ‘కొత్త వేదం’ కొత్తగా, గొప్పగా నిలదొక్కుకుంటోంది. ఆనాడు మహాత్ముడు చెప్పింది నీతి. ఈనాడు జహీ ర్ పాటించింది. నియతి. వెరసి - మానవ సమాజానికి కరదీపిక కాగలిగిన - నిఖార్సయిన మానవత్వం.
 - గొల్లపూడి మారుతీరావు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement