
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్‌కు శుభారంభం లభించింది. లీగ్ దశలో తమ తొలి మ్యాచ్‌లో భారత్‌తో తలపడ్డ పాక్.. 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుబాయ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసింది.
షాజైబ్ ఖాన్ భారీ శతకం
ఓపెనర్లలో ఉస్మాన్ ఖాన్‌హాఫ్ సెంచరీ(60)తో మెరవగా.. షాజైబ్ ఖాన్ భారీ శతకం బాదాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, పది సిక్సర్ల సాయంతో 159 పరుగులు సాధించాడు.
ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన మహ్మద్ రియాజుల్లా 27 రన్స్ చేయగా.. మిగిలిన వాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. అయితే, ఓపెనర్లు వేసిన బలమైన పునాది కారణంగా పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 281 పరుగులు స్కోరు చేసింది.
భారత బౌలర్లలో పేసర్లు సమర్థ్ నాగరాజ్ మూడు, యుధాజిత్ గుహ ఒక వికెట్ పడగొట్టగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆయుశ్ మాత్రే రెండు, కిరణ్ చోర్మలే ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. అయితే, లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆదిలోనే భారీ షాకులు తగిలాయి.
ఆదిలోనే ఎదురుదెబ్బ
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక్క పరుగుకే వెనుదిరగగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ 15 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 పరుగులుతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ మొహ్మద్ 16 పరుగులకు నిష్క్రమించాడు. ఇక 82 పరుగులకే జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్ కుమార్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.
Nikhil Kumar brings up a crucial half-century, adding vital runs for India! 💪🏏
Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/X7DCbJLNxq— Sony LIV (@SonyLIV) November 30, 2024
నిఖిల్ వీరోచిత అర్ధ శతకం
ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన నిఖిల్ 77 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 67 రన్స్ చేశాడు. అయితే, నవీద్ అహ్మద్ ఖాన్ బౌలింగ్‌లో నిఖిల్ స్టంపౌట్ కావడంతో యువ భారత్ విజయానికి దూరమైంది. మిగతా వాళ్లలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26) కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా.. ఆఖర్లో మొహ్మద్ ఇనాన్ పోరాటపటిమ కనబరిచాడు.
చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా
చేతిలో ఒకే ఒక వికెట్ ఉన్న సమయంలోనూ చావోరేవో తేల్చుకోవాలన్నట్లుగా బ్యాట్ ఝులిపించాడు. ఈ టెయిలెండర్ 22 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండటం విశేషం.
అయితే, దురదృష్టవశాత్తూ యుధాజిత్ గుహ(12*)తో సమన్వయలోపం కారణంగా ఇనాన్ రనౌట్ అయ్యాడు. దీంతో భారత ఇన్నింగ్స్‌కు తెరపడింది. 47.1 ఓవర్లలో 237 పరుగులకు అమాన్ సేన ఆలౌట్ అయింది.
ఫలితంగా పాకిస్తాన్ 44 పరుగుల తేడాతో గెలుపొంది ఈ వన్డే టోర్నీని విజయంతో ఆరంభించింది. ఇక పాక్ బౌలర్లలో అలీ రజా మూడు వికెట్లు తీయగా.. అబ్దుల్ సుభాన్, ఫాహమ్ ఉల్ హఖ్ రెండేసి వికెట్లు కూల్చారు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
తదుపరి జపాన్‌తో
ఇదిలా ఉంటే.. భారత్ తమ రెండో మ్యాచ్‌లో జపాన్‌తో డిసెంబరు 2న తలపడనుంది. మరోవైపు.. అదే రోజు పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మ్యాచ్ ఆడుతుంది.
చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. అతడిపై వేటు వేయండి: ఆసీస్ మాజీ క్రికెటర్