ఓపెనర్లు వైభవ్- ఆయుశ్ (PC: ACC X)
అండర్-19 ఆసియా కప్-2024 టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. షార్జాలో బుధవారం నాటి మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను చిత్తుగా ఓడించి టాప్-4కు అర్హత సాధించింది.
కాగా దుబాయ్ వేదికగా వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్-‘ఎ’లో ఉంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడి ఓటమిపాలైన మహ్మద్ అమాన్ సేన.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.
137 పరుగులకే ఆలౌట్
ఈ క్రమంలో మూడో మ్యాచ్‌లో భాగంగా యూఏఈతో షార్జా క్రికెట్ స్టేడియంలో యువ భారత్ తలపడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలింది. కేవలం 137 పరుగులకే ఆలౌట్ అయింది.
రయాన్ ఖాన్ ఒక్కడు 35 పరుగులతో రాణించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేయడంతో 44 ఓవర్లలోనే యూఏఈ కథ ముగిసింది. భారత బౌలర్లలో యుధాజిత్ గుహ మూడు వికెట్లతో చెలరేగగా.. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. కేపీ కార్తికేయ, ఆయుశ్ మాత్రే ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్ పసికూనపై ప్రతాపం చూపింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టుకు భారీ విజయం అందించారు. ఆయుశ్ 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 67 పరుగులు చేయగా.. వైభవ్ 46 బంతుల్లోనే 76 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండటం విశేషం.
టీమిండియా ఓపెనర్ల ఊచకోత..
ఇలా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా విజృంభించడంతో భారత్ కేవలం 16.1 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. వైభవ్ కొట్టిన సిక్సర్‌తో విజయతీరాలకు చేరిన టీమిండియా(143).. పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టిన ఆయుశ్ మాత్రే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. కాగా అండర్-19 ఆసియా కప్‌లో డిసెంబరు 6న సెమీస్ మ్యాచ్‌లు జరుగనుండగా.. డిసెంబరు 8న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
చదవండి: రోహిత్ వచ్చాడు!.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు?.. కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఆన్సర్
Comments
Please login to add a commentAdd a comment