భారత్ వర్సెస్ పాకిస్తాన్ (PC: ACC X)
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. కాగా పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్.. అండర్- 19 క్రికెట్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన క్రికెటర్‌గానూ చరిత్రకెక్కాడు.
కోటీశ్వరుడు అయ్యాడు.. దిష్టి తగిలింది
ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్‌తో జరిగిన అనధికారిక టెస్టులో 58 బంతుల్లోనే వైభవ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పదమూడేళ్ల లెఫ్టాండర్‌ను రాజస్తాన్ రాయల్స్ ఊహించని ధరకు సొంతం చేసుకుంది. ఈ బిహారీ అబ్బాయిని ఏకంగా రూ. 1.10 కోట్లకు కొనుక్కుంది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులోనే అమ్ముడుపోయిన క్రికెటర్‌గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. అయితే, కొంతమంది మాత్రం ఈ లెఫ్టాండర్ బ్యాటర్ వయసు పదమూడు కాదు.. పదిహేను అంటూ ఆరోపణలు చేయగా.. వైభవ్ తండ్రి సంజీవ్ వాటిని కొట్టిపారేశాడు.
తమకు ఏ భయమూ లేదని.. కావాలంటే బీసీసీఐ ఏజ్ టెస్టుకు వైభవ్‌ను మరోసారి పంపించడానికి సిద్దమని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు. వైభవ్ సైతం తన గురించి అసత్యాలు ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్.. ‘‘పదమూడేళ్లకే ఇతడు ఏం చేశాడో చూడండి’’ అంటూ వైభవ్ నైపుణ్యాలను కొనియాడింది.
తీవ్రమైన ఒత్తిడిలో
ఓవైపు ఓవర్‌నైట్ స్టార్‌గా మారడటం.. మరోవైపు వయసు గురించి ఆరోపణలు.. ఇలాంటి పరిస్థితుల నడుమ అండర్-19 ఆసియా కప్ బరిలో దిగాడు వైభవ్ సూర్యవంశీ. గ్రూప్-‘ఎ’లో ఉన్న భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో శనివారం చిరకాల ప్రత్యర్థిని ఢీకొట్టింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఫలితంగా బౌలింగ్‌కు దిగిన యువ భారత్‌కు పాక్ ఓపెనర్లు కొరకరాని కొయ్యగా మారారు. ఉస్మాన్ ఖాన్ 60 పరుగులు సాధించగా.. షాజైబ్ ఖాన్ ఏకంగా 159 పరుగులతో భారీ శతకం నమోదు చేశాడు. నాలుగో స్థానంలో మహ్మద్ రియాజుల్లా వచ్చిన 27 పరుగులు చేయగా.. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు.
అయితే, ఓపెనర్ల విజృంభణ వల్ల పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 281 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ మూడు వికెట్లు కూల్చగా.. ఆయుశ్ మాత్రే రెండు, యుధాజిత్ గుహ, కిరన్ చోర్మలే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
Samarth takes his 3️⃣rd wicket! 💥
Shahzaib Khan departs after scoring 159
Watch #INDvPAK at the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV! pic.twitter.com/m3dZn8YskL— Sony LIV (@SonyLIV) November 30, 2024
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒకే ఒక్క పరుగు చేశాడు. అలీ రజా బౌలింగ్‌లో సాద్ బేగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
మరోవైపు వన్‌డౌన్ బ్యాటర్ ఆండ్రీ సిద్దార్థ్ కూడా 15 పరుగులే చేశాడు. మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించాడు. నిఖిల్ కుమార్ హాఫ్ సెంచరీ(67) చేయగా.. మిగతా వారిలో కిరణ్(20), వికెట్ కీపర్ హర్వన్ష్ సింగ్(26), మొహ్మద్ ఇనాన్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో 238 పరుగులకే పరిమితమైన యువ భారత్ పాక్ చేతిలో 44 పరుగుల తేడాతో ఓడిపోయింది.
చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ఆశలపై నీళ్లు!
Comments
Please login to add a commentAdd a comment