ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో శుభారంభం అందుకున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పెర్త్ టెస్టు మాదిరే అడిలైడ్‌లోనూ విజయఢంకా మోగించాలని భావిస్తోంది. అయితే, అక్కడ జరిగేది డే అండ్ నైట్ మ్యాచ్ కావడంతో మరింత ముమ్మరంగా ప్రాక్టీస్ చేసేందుకు సిద్ధమైంది.
కానీ వర్షం కారణంగా టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు చల్లినట్లయింది. కాగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో బుమ్రా సేన ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. ఏకంగా 295 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.
ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో
ఈ క్రమంలో డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరుగనుంది. పింక్ బాల్‌తో నిర్వహించే ఈ మ్యాచ్‌కు ముందు.. అన్ని రకాలుగా సిద్ధమయ్యేందుకు భారత్.. ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో రెండు రోజుల(శని, ఆది) పాటు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ మ్యాచ్ ద్వారా గులాబీ బంతితో సాధన చేసేందుకు టీమిండియాకు తగిన సమయం దొరుకుతుందని భావించగా.. వరణుడు తొలిరోజు ఆటకు ఆటంకం కలిగించాడు. కాన్‌బెర్రా వేదికగా.. భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలుకావాల్సిన మ్యాచ్‌కు వర్షం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి.
మొదలుకాకుండానే ముగిసిపోయింది
ఉదయం నుంచే భారీ వాన కురుస్తుండటంతో మనుకా ఓవల్ మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దీంతో టాస్ ఆలస్యం కాగా.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. తొలిరోజు ఆట మొదలుకాకుండానే ముగిసిపోయింది.
కాగా అడిలైడ్‌లో టీమిండియాకు గతంతో అత్యంత చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. అక్కడ నాలుగేళ్ల క్రితం జరిగిన పింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. తద్వారా టెస్టుల్లో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది.
గత అనుభవం నుంచి పాఠం నేర్చుకుని ఈసారి పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్‌తో టీమిండియా ప్రాక్టీస్ చేయాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తూ తొలిరోజు ఆట ఇలా వర్షార్పణం అయింది. ఆట రద్దు కావడంతో క్రికెటర్లు స్టేడియాన్ని వీడి హోటల్‌కు చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే జట్టుతో చేరాడు. అతడితో పాటు శుబ్‌మన్ గిల్ సైతం ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.
ఇండియా వర్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ జట్లు
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్
జాక్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), శామ్ హార్పర్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, జాక్ క్లేటన్, ఆలివర్ డేవిస్, జేడెన్ గుడ్‌విన్, చార్లీ ఆండర్సన్, సామ్ కాన్‌స్టాస్, స్కాట్ బోలాండ్, లాయిడ్ పోప్, హనో జాకబ్స్, మహ్లీ బియర్డ్మన్, ఐడెన్ ఓ కానర్, జెమ్ ర్యాన్.
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్.
Comments
Please login to add a commentAdd a comment