టీమిండియాతో రెండో టెస్టు నేపథ్యంలో ఆస్ట్రేలియా తుదిజట్టు గురించి మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పింక్ బాల్ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్‌ను ఆడించవద్దని క్రికెట్ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేశాడు. అతడిని జట్టు నుంచి తప్పించాల్సిన సమయం వచ్చిందంటూ ఘాటు విమర్శలు చేశాడు.
కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఆసీస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. సమిష్టి కృషితో ఆసీస్‌ను సొంతగడ్డపై చిత్తు చేసింది.
రెండుసార్లూ విఫలం
ఇక ఈ మ్యాచ్‌లో మార్నస్ లబుషేన్ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 52 బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులే చేశాడు. భారత పేసర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.
ఇక రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన లబుషేన్ ఐదు బంతుల్లో మూడు పరుగులకే వెనుదిరిగాడు. ఈసారి మరో పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అతడికి వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.
ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడిన లబుషేన్ 245 పరుగులే చేశాడు. ఇందులో మూడు అర్ధ శతకాలు ఉండగా.. ఎనిమిది సింగిల్ డిజిట్ స్కోర్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ స్పందిస్తూ.. ‘‘బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలతో డీలా పడిన మార్నస్ లబుషేన్‌ను కచ్చితంగా జట్టు నుంచి తప్పించాల్సిందే. అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టులో అతడి స్థానంలో వేరొకరిని ఆడించాలి.
అతడిపై వేటు వేయండి
లేదంటే.. పెర్త్ టెస్టు మాదిరి ఇక్కడా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అతడు షెఫీల్డ్ షీల్డ్, క్లబ్ క్రికెట్‌లో తిరిగి ఆడాల్సిన సమయం వచ్చింది. జాతీయ జట్టుకు ఆడినపుడు ఉండేంత ఒత్తిడి అక్కడ ఉండదు.
కాస్త స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. అది అతడికే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ది నైట్లీకి రాసిన కాలమ్‌లో మిచెల్ జాన్సన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి అడిలైడ్‌లో రెండో టెస్టు(పింక్ బాల్) మొదలుకానుంది.
చదవండి: మొదలుకాకుండానే ముగిసిపోయింది.. టీమిండియా ‘పింక్ బాల్’ టెస్టు సన్నాహకాలపై నీళ్లు!
Comments
Please login to add a commentAdd a comment