జీవన కాలమ్
రాత్రి 8 గంటలకి ఫోన్ మోగింది, ఏదో చానల్ నుంచి. అవతలి గొంతు అడిగింది, ‘‘హీరో రంగనాథ్ గారి గురించి మీ స్పందన కావాలి’’ అని. నాకర్థంకాలేదు. ‘‘ఎందుకు?’’ అన్నాను. ‘‘సాయంకాలం ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.’’ షాక్ నుంచి తేరుకునేలోగా చానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఉన్నాను. అనౌన్సర్ చెబుతున్నది, ‘‘ఇప్పుడు గొల్లపూడి ....’’ నిశ్చేష్టుడనయ్యాను. ఏ విధంగా చూసినా ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హుందాగా, తృప్తిగా, గొప్పగా, గర్వంగా కనిపించే రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడంలో అర్థం లేదు. చానల్ ప్రసారంలోనే నిర్ఘాంతుడినై, నిర్విణ్ణుడినై ఆయన జ్ఞాపకాలు మెల్లమెల్లగా పోగు చేసుకున్నాను.
ఎంత నిండైన మనిషి! వ్యక్తిగా, పాత్రగా, మిత్రుడిగా- గొప్ప నమ్మకాన్నీ, పూర్తి జీవలక్షణాన్నీ ప్రతిబింబించే మనిషి. అయిదు నెలల కిందట ఈటీవీ 20 ఏళ్ల పండుగలో ఇద్దరం కనీసం రెండున్నర గంటలు పక్క పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. నన్నెప్పుడూ ‘గురువుగారూ’ అని సంబోధించేవారు. ‘ఆ మధ్య బాగా లావెక్కారు’ అంటే, ‘ఇరవై పౌన్లు తగ్గాను గురువుగారూ!’ అన్నారు తృప్తిగా. గొంతులో, మాటలో, చెప్పిన విషయాల్లో ఎక్కడా నిస్త్రాణ, నిర్వేదం కనిపించలేదు. నిజానికి ఇవన్నీ ఉండగల జీవితం అతనిది. 46వ ఏట 40 ఏళ్ల జీవిత భాగస్వామినికి వెన్నుపూస విరిగితే, 14 ఏళ్లు తాను వెన్నుపూసగా నిలిచి, మూత్రపురీషాలు తీసి సేవ చేసిన మహావ్యక్తి. ‘భర్త’ పాత్రకి జీవితకాలంలో నిండైన సమాధానం రంగనాథ్. ఎప్పుడు కలసినా ఆ విషయం కదపకుండా జాగ్రత్త పడేవాడిని. కారణం- ఒక దుఃఖ భాండాన్ని ఒలకపోస్తానో, ఒక వ్యక్తి గాంభీర్యాన్ని చెదరగొడతానో అని భయం.
ఆరేళ్ల కిందట ఆవిడ వెళ్లిపోతే- హఠాత్తుగా అతని జీవితం ఖాళీ అయిపోయింది. జీవితంలో ఒంటరి. 66 ఏళ్ల జీవితంలో 60 పాత్రల హీరో, 340 పాత్రల ప్రజాభిమానం ఒక పక్క ఉండగా, 14 ఏళ్లుగా ధరించిన భార్యకి ‘తల్లి’అయిన పాత్రను మించింది ఆయన జీవితంలో మరొకటిలేదు. ప్రపంచంలో అన్ని రుగ్మతల్లోనూ భయంకరమై నది - ఒంటరితనం. ఒక ఇంట్లో - కేవలం ఒంటరిగా - తనని హీరోని చేసిన తరం మాయ మయిపోగా - కేరెక్టర్ పాత్రలు అక్కరలేని ఈనాటి తరం సినీ ధోరణిలో- వృత్తిలోనూ ఒంటరి అయిపోయాడు రంగనాథ్. అది ఇంకా భయంకరమైన ఒంటరితనం. దాన్ని దగ్గరకు రానివ్వకూడదు. 62 సంవత్సరాల కిందట ఒక తమిళ మిత్రుడు నాతో అనేవాడు. ‘‘మారుతీ రావ్! ఈ జీవితంలో మానవుడు ఒంటరి. అదొక్కటే మనం అలవాటు పడాల్సిన రోగం’’ అని. గొప్ప కవితలు రాసి, లక్షలాది ప్రేక్షకులకు సంపూర్ణమైన పాత్రల గుబాళింపుని పంచిన రంగనాథ్ ‘ఒంటరితనానికి’ లొంగిపోయాడు. అంతకన్న కారణం కనిపించదు.
‘ఆలయ శిఖరం’లో రంగనాథ్ నా పెద్దకొడుకు. ‘మెరుపుదాడి’లో నేనూ, రంగనాథ్, సుమన్, జయమాలిని, గిరిబాబు సినీమా అంతా గుర్రాల మీదే గడిపాం. ఆ ముఠాకి పెద్ద దిక్కు పాత్ర. నేను రచన చేసిన ‘అమెరికా అమ్మాయి’లో అచ్చమైన పాత్ర చేశాడు. నటుడిగా పాత్రకు నిండుతనాన్నీ, ఒక డిగ్నిటీనీ, పరిపూర్ణతనీ ఇచ్చే నటుడు రంగనాథ్. గుండె నిండా గాలిని పూరించి మనస్ఫూర్తిగా మాట్లాడే గొంతు. అంతకు మించి రంగనాథ్ మంచి కవి. బండరాయి-దేవుని విగ్రహంగా, చాకిబండగా మారే కవిత ఎంతబాగా రాశాడో! అంతబాగానూ చదివేవాడు.
ఇన్నిటికీ మించి సినీ రంగానికి రాకముందు నా నాటికలని ప్రదర్శించిన నటుడు. నేను నటుడినయ్యాక ఇద్దరం కలసి నటించిన మొదటి చిత్రం ‘ఆలయ శిఖరం’. 1983, డిసెంబర్ 31 అర్థరాత్రి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం రోడ్ల మీద నా పెద్ద కొడుకు రంగనాథ్‌నీ, అతని భార్యనీ (సినీపాత్ర) సైకిల్ రిక్షా మీద నేను లాగుతుండగా కొత్త సంవత్సరం తోసుకువచ్చింది. నా సినీ జీవితంలో నేను చేసిన గొప్ప సీనుల్లో తేలికగా అదొకటి. కృతఘు్నడైన కొడుకుకి తన తండ్రి రిక్షా లాగుతున్నాడని తెలుసు. ప్రేక్షకులకీ తెలుసు. డబ్బున్న పెళ్లానికి తెలీదు. గొప్ప సీన్ తీశాడు కోడి రామకృష్ణ. సీన్ అయిపోగానే రిక్షా దిగి నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు రంగనాథ్.
అనర్థాలు చాలాసార్లు జరుగుతాయి. కానీ భరించలేని దుఃఖాన్ని ఆపోశన పట్టడం ఎరిగిన కవి, భరించలేని విషాదాన్ని అవలీలగా నటించడం ఎరిగిన నటుడు- అన్నిటినీ దాటి- ఒంటరితనానికి లొంగిపోవడం- దాన్ని డెస్టినీ (విధి) అని గోడ మీద రాసి, గుర్తు పెట్టి వెళ్లిపోవడం- జీవితంలో గొప్ప విపర్యం.
రంగనాథ్ మృతి- అన్నిటినీ త్యజించిన మహాపురుషుడు అడుసు తొక్కడం లాంటిది. నన్ను తెలుగు భాష అప్పుడప్పుడు మోసం చేస్తుంది. అప్పుడు ఇంగ్లిష్‌ని ఆశ్రయిస్తాను. His death is an enigma.