ఆమధ్య అక్కర్లేని ఆపరేషన్‌కి అవసరంలేని టెస్టులు చేయించమన్నారు డాక్టర్లు. అందులో ఎక్స్‌రే, గుండె చప్పుళ్ల ప్రణాళిక(డీసీఎం) ఉన్నాయి. వీటన్నింటికీ చికాకు పడుతూవుండగానే డాక్టరు రావడం ఆలస్యం అవడం వలన నన్ను గుండె చప్పుళ్ల టేబుల్ ఎక్కించారు. ఈలోగా వచ్చారు డాక్టరు. మలయాళీ.. సరసమైన మనిషి. వెంటనే పరీక్ష ప్రారంభించాడు. ఎక్కడా తను ఊహించిన శబ్దాలు వినిపించకపోవడంతో మారు మారు వెతుకుతున్నాడు.
ఏమిటండీ వెతుకుతున్నారు? అన్నాను. మీ గుండెకాయలో గుండెకి సంబంధించిన చప్పుళ్లేవీ వినిపించడం లేదు అన్నారు. ఆశ్చర్యం!! నేను నవ్వుకున్నాను. మొదటినించీ ఏ శబ్దాలు వింటున్నారో చెప్పండి?
ఇది డాక్టరుకు సమాధానం: పదహారు, పదిహేడేళ్లనాటి సంఘటన–ఆ వయసులో కుర్రాళ్లం వేదికలెక్కి నాటకాలు ఆడాలన్న తాపత్రయం. కానీ ఇవి ఏమిటి? మరికాస్త వయసులోనే యువకులకు నాటక పాఠాలు చెప్పే పరిస్థితి. అప్పటికి నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను. అది ఒక వెర్రిగోల. కొంతదూరం వెతికాడు. డాక్టరు చక్రవర్తి సైన్ బోర్డు మా అబ్బాయిని ఎత్తుకుని గేటు దగ్గర రోజూ మేము. మా పేర్లు చూసుకునేవాళ్లం. నవ్వి ఇది 53 సంవత్సరాల క్రిందట ప్రారంభమైన సినిమా కథ. పసివారి ఒంటరితనం నాకు తెలియదు. ఉన్నట్టుండి ఇంట్లోరామయ్యన్నారు. స్టార్ అన్నారు. డజన్లకొద్దీ సినిమాలు మీద పడ్డాయి. అది పలుకుబారిన దశ. హఠాత్తుగా డాక్టరు ఆగిపోయాడు. నేనూ ఆగిపోయాను.
ఏమిటి ఈ నిశ్శబ్దం అన్నాడు డాక్టరు. 80 సంవత్సరాలపైన నన్ను పెంచి పెద్ద చేసిన పెద్ద దిక్కు నాన్నగారు వెళ్లిపోయారు. గతం స్వగతం చెప్పుకునే విషాదకరమైన క్షణాలు ఇంకా సందిగ్ధం నడుస్తూనే వుంది. మళ్లీ ఏమిటి ఇది?
నాకు 40 ఏళ్ల జీవితాన్నివ్వవలసిన కొడుకు శవం ముందుంది. ఇంకా వెతుకుతున్నారు. 30 ఏళ్లు మీరిన భార్య వృద్ధురాలైంది. మరికాస్త దూరం ప్రయాణం. ఇంకా నిశ్శబ్దమే. జీవితం పరుగులు పెడు తోంది. ఉన్నట్టుండి శబ్దాలు ఆగిపోయాయి. తడబడుతున్న గొంతుతో అన్నాను. నా ప్రాణం మా అమ్మ ఇప్పుడే వెళ్లిపోయింది–నా ఒడిలో తలపెట్టుకుని. వెళ్లిపోతున్న మా అమ్మ ఆఖరి ఊపిరిని నా ఊపిరి తరిమి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గొంతు గాద్గదికమైంది.
మళ్లీ నా నవ్వే తోసుకొచ్చింది. యాభై తొమ్మిది ఏళ్ల కిందట చదువుకుని సాహితీప్రపంచంలో అంతో ఇంతో సాధించిన నన్ను ఆంధ్రాయూనివర్సిటీ విస్మరించగా 39 ఏళ్లకిందట స్థాపించిన గీతమ్ కాలేజ్ డాక్టరేట్ ఇచ్చింది. జీవితం పల్టీలు కొడుతోంది. కళ్లకి కాటరాక్టు, చేతికి కర్ర వచ్చింది. చేతిరాత వంకర్లు తిరిగింది. వయసు పలకరిస్తోంది. ఈ దశలో జీవనకాలమ్ కుంటినడక నడుస్తోంది. నా కళ్లు గతంలో ఉన్నాయి. ఎదురుగా వున్న గుండె చప్పుళ్ల ధోరణి నిశ్శబ్దంగా వుంది.
ఏమిటీ కథల సమూహానికి పేరు? అన్నాడు సరదా అయిన డాక్టరు. ఈ ప్రణాళికకి ఒక పేరుంది. అది నాకు తెలుసు.
ఏమిటది?
నేను.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment