శరదశ్శతమ్‌ | Gollapudi Maruthi Rao Jeevana Kalam On Memories | Sakshi
Sakshi News home page

శరదశ్శతమ్‌

Published Thu, Oct 31 2019 1:06 AM | Last Updated on Thu, Oct 31 2019 1:06 AM

Gollapudi Maruthi Rao Jeevana Kalam On Memories - Sakshi

కొన్ని రోజుల్లో చచ్చి పోతున్నావని డాక్టర్లు తేల్చారు. నిన్ను చూడా లని ఉందిరా అని సమా చారం పంపాడు కాళీ, దాసుకి. దాసుది సామర్ల కోటలో సగ్గుబియ్యం హోల్‌సేల్‌ వ్యాపారం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వ్యాపారం దాసు వారసత్వంగా పుచ్చుకున్నాడు. పై చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం సంపా దించుకున్నాడు. ఇద్దరూ కలిసి దశాబ్దాలు గడి చింది. అందుకే ఈ సమాచారం దాసుకి ఆశ్చ ర్యాన్ని కలిగించింది. అయినా కానీ పనికట్టుకుని చిన్ననాటి స్నేహితుడిని చూడటానికి బయలు దేరాడు దాసు. కాళీ 77, దాసు 75. కాళీకి ఇన్నేళ్లలో ఉన్న జుత్తు ఊడిపోయింది. దాసుకి వారసత్వంగా తల్లిదండ్రుల పొట్ట వచ్చింది.

చిన్ననాటి స్నేహితులు కలుసుకుని కావలించుకుని, గెంతులేసి పొంగిపోయారు. విచిత్రం, స్నేహితుడిని బాధిస్తానని దాసు కాళీ జబ్బు గురించి అడగలేదు. రాకరాక వచ్చిన స్నేహితుడిని ఇబ్బంది పెడతానని కాళీ చెప్పలేదు. బయటికి ఇద్దరూ ఆనందంగా, డాబుగా, అన్నిటినీ మించి తృప్తిగా ఉన్నారు. ఆమాటా, ఈమాటా మాట్లాడుతూ చిన్నతనంలో తమ అక్కలు ఆడే ‘ఆడ ఆటలు’ ఆడారు. చెమ్మాచెక్కా ఆడినందుకే పగలబడి నవ్వుకున్నారు. చింతపిక్కలతో ఆడవాళ్లు ఆడే తొక్కుడుబిళ్ల ఆట ఆడారు. 
వెనక వరండాలో 75 సంవత్సరాల బొజ్జ దాసు, కాళీ 77 సంవత్సరాల జబ్బు శరీరం గెంతు లాట చూసి ఇంటిల్లిపాదీ ముక్కుమీద వేలేసు కున్నారు. ఆ రాత్రి డాక్టరు కాళీకి రెండు మాత్రలు తక్కువ చేశాడు. రానురానూ మిత్రులిద్దరూ పసిపిల్లలయి పోయారు. కాళీ చిన్నతనంలో బొమ్మలు వేసే వాడు. ఒకరోజు రెండు అట్టలమీద పులి ముఖాలు వేశాడు. ఇది మిత్రులు ఇద్దరూ శ్రీరామనవమి సంబరాల్లో రోజూ ఆడే ఆట. ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అయినా ఇద్దరూ బొమ్మలు పెట్టుకుని పులిగెంతులు గెంతారు. ఇదే ఆట. ఇంటిల్లిపాదీ నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో దాసు బొజ్జకి డాక్టరు ఇంజక్షన్‌ ఇచ్చాడు.

ఇద్దరూ ఇంటర్మీడియట్‌ చేసే రోజుల్లో కాకినాడలో అద్దెకి ఉండేవారు. ఇద్దరూ భయం కరమైన గొంతు కలవారు. ‘పాతాళభైరవి’ చూసి వచ్చి– పాటల పుస్తకం కొని పాటలన్నీ భయం కరంగా పాడారు. ఇంటివారు మొత్తుకుంటే మరింత విజృంభించారు. ఇప్పుడా ఇల్లు లేదు. ఇంటాయన లేడు. 65 సంవత్సరాల కిందటిమాట. 75 సంవత్సరాల దాసు విజృంభించాడు. 77 సంవత్సరాల కాళీ అందుకున్నాడు. ఇప్పుడు తమ ఇంట్లో కాదనే వారెవరు? వాళ్ల గొంతుల్ని, అల్లరిని బాలక్రిష్ట త్వాన్ని భరించారు. భరిస్తున్నారని తెలిసి ఇద్దరు మిత్రులూ రెచ్చిపోయారు.

దాసు వెళ్తానంటే కాళీ, దాసు బొజ్జమీద దరువువేశాడు. చిన్నతనం ఆటలు, ఆ చవకబారు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. స్కూలుకి వస్తే, రైలు పట్టాలు దాటుతున్న చంటిబాబు చావు తలుచు కుని ఇద్దరూ ఏడ్చారు. అతని ‘మాజిక్‌’ విన్యా సాలు ఒక రోజంతా చెప్పుకున్నారు. ఏతావాతా 15 రోజుల్లో ఉద్యోగి కాళీ, వ్యాపారి దాసూ మారిపోయారు. 65 సంవ త్సరాలు వెనక్కిపోయారు. మనస్సుల ముసు గులు మళ్లీ అతుక్కున్నాయి. వాస్తవం అటకెక్కింది.

‘ఏమిటి తాత ధోరణి’ కాళీ మనుమడు డాక్టరు దగ్గర ఆశ్చర్యపడ్డాడు. డాక్టరు కంగారు పడటానికి బదులు నవ్వాడు. ‘ఎప్పుడు వస్తారు’ అని సామర్లకోట నించి ఫోన్‌ చేసిన దాసు మేనల్లుడికి– దాసు చేతుల్లో ఫోన్‌ లాక్కుని సమాధానం చెప్పాడు కాళీ ‘ మీ మామ ఇప్పుడు రాడురా’ అని. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.18 రోజులు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులూ వర్తమానాన్ని మర్చిపోయారు. జీవితాన్ని తిరగేసి మళ్లీ గడపటం ప్రారంభిం చారు. 25 రోజులు అయింది. దాసు లేచేసరికి కాళీ సూర్యో దయం చూస్తూ కనిపించాడు. ‘ఏంట్రా ఆలోచిస్తున్నావు?’ అన్నాడు దాసు. కాళీ ధైర్యంగా ఇటుతిరిగి ‘నేను చావనురా– నువ్వు సామర్లకోట పో’ అన్నాడు కాళీ. జ్ఞాపకాలు బంగారు తాకిడీలు, ఆలోచనలు ఆత్మబంధువులు. (నన్ను మళ్లీ ‘జీవనకాలమ్‌’ రాయమని పోరి రాయించిన మా తమ్ముడు శివకి అంకితం)

గొల్లపూడి మారుతీరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement