Sweet Memories
-
నైంటీస్ జమానా దుకాణం..! ఆ తరం మధుర జ్ఞాపకాలు..
ముయ్యేళ్ల కిందట– అంటే..నైంటీస్ జమానాలో ఇప్పుడున్నస్మార్ట్ఫోన్లు లేవు, ఆన్లైన్ గేమ్స్ లేవు. అప్పటి పిల్లలకు గోలీలు, బొంగరాలువంటి ఆరుబయటి ఆటలే కాలక్షేపం. అప్పట్లో పిజ్జాలు, బర్గర్లు లేవు. నారింజ మిఠాయిలు, అంకెలు, అక్షరాల ఆకారంలో ఉండే బిస్కట్లు వంటివే పిల్లల జిహ్వచాపల్యాన్ని తీర్చే చిరుతిళ్లు. అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులైపోయారు. పిల్లలకు తల్లిదండ్రులైపోయారు. తమ పిల్లలకు తమచిన్ననాటి కాలక్షేపాలను, చిరుతిళ్లను పరిచయం చేయాలని ఉన్నా, బజారులో అవేవీ ఇప్పుడు అందుబాటులో లేవు. ఆ లోటును తీర్చడానికే చెన్నైలోని తెలుగు సంతతికి చెందిన ఆర్.జయంతన్ చెన్నై క్రోంపేటలో ‘నైంటీస్ మిఠాయి కడై’ పేరుతో ఆనాటి జ్ఞాపకాలను కొలువుతీర్చి దుకాణం ఏర్పాటు చేశారు. ఇందులోని వస్తువులను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను ఇప్పటి తరానికి కూడా అందుబాటులోకి తెచ్చేఉద్దేశంతో జయంతన్ ప్రారంభించిన ఈ దుకాణం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి కడత్తూరు గ్రామానికి చెందిన తెలుగు కుటుంబానికి చెందిన యువకుడు ఆర్.జయంతన్ చెన్నైలోని ఓ కళాశాలలో ఎంటెక్ పూర్తి చేశారు. ఎంబీఏ పట్టభద్రురాలైన తన భార్య విద్య ఇచ్చిన సలహాతో విలక్షణంగా ఏదైనా చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. అందుకే ఉద్యోగం చూసుకునే బదులు వ్యాపార రంగంలోకిఅడుగుపెట్టి, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి గుర్తు చేసేలా చెన్నై క్రోంపేటలో దుకాణం ఏర్పాటు చేశాడు. ఎనభై, తొంభై దశకాల్లో విస్తృతంగా వాడుకలో ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు, పెన్నులు, పుస్తకాలు, బ్యాగ్‌లు, బిస్కట్లు, చాక్లెట్లు వంటివి సేకరించి, తన దుకాణంలో కొలువుదీర్చారు. అలాగే ఆన్‌లైన్‌లోనూ వీటి అమ్మకాలను సాగించేందుకు'www.90smittaikadai.com' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ దుకాణంలోకి అడుగుపెడితే చాలు, నైంటీస్ నాటివారు తమ బాల్యజ్ఞాపకాల్లో తేలిపోతారు.వారి కళ్లలో ఆనందాన్ని చూస్తున్నా: ఆర్.జయంతన్మా దుకాణానికి వచ్చే నైంటీస్ తరంవారు తమ పిల్లలకు ఇక్కడి వస్తువులను ఒక్కొక్కటే చూపిస్తూ, వాటిని తాము ఎలా ఉపయోగించేవారో, ఎలా ఆటలాడే వారో వివరిస్తుంటే ఎనలేని ఆనందం కలుగుతోంది. ఇక్కడికొచ్చే కస్టమర్ల కళ్లలో బాల్య స్మృతుల ఆనందాన్ని చూస్తున్నా. అప్పట్లో ఇలాంటివి కొనేందుకు డబ్బులు లేకున్నా, చూసి ఆనందంతో గంతులేసే వాళ్లం. ఇప్పుడుచేతిలో డబ్బులు ఉన్నా, ఈ వస్తువులు దొరకడం అరుదైపోయింది. అందుకే ఈ అరుదైన వస్తువులను వెతికి, ప్రత్యేకంగా తయారు చేయించి మరీ మా దుకాణంలో విక్రయాలకు పెట్టాం. ఈ వస్తువులను నైంటీస్ తరంవారు తమ పిల్లలకు కొనివ్వడమే కాకుండా, నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుండటం సంతోషం కలిగిస్తోంది. ఇవి మరింత విస్తృతం కావాలన్న కాంక్షతోనే ఆన్‌లైన్‌లోనూ విక్రయాలను ప్రారంభించా. ఇందులో లాభాపేక్ష కన్నా, ఆనాటి జ్ఞాపకాలను నేటి తరానికి చేరవేయాలనేదే మా లక్ష్యం. దేశంలో ఏ మూలకైనా సరే ఈ వస్తువులను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చిన్నప్పుడు నేను ఆడుకున్న వస్తువులు సైతం ఇక్కడ ఎన్నో ఉన్నాయి. కొందరు కస్టమర్లు తమకు కావాల్సిన కొన్ని వస్తువులను సూచిస్తుంటారు. వారి ఆర్డర్‌కు తగినట్లుగా, వాటిని కొంత సమయం పట్టినా సరే సేకరించి లేదా తయారు చేయించి కొరియర్ ద్వారాపంపిస్తున్నాం. కనుమరుగైన వస్తువులు కూడా ఈ నైంటీస్ జమానా దుకాణంలో కనుమరుగైపోయిన పాతకాలం వస్తువులను కూడా కొలువుదీర్చారు. గ్రామఫోన్, కిరోసిన్ లాంతరు వంటి వస్తువులతో పాటు ఆనాటి గేమ్ కిట్స్, బొంగరాలు, కర్రా బిళ్ల, గోలీలు, నారింజ మిఠాయి, ఐస్ట్యూబ్, పాపిన్స్, ఫాంటమ్ స్వీట్ సిగరెట్లు, బొంబాయి మిఠాయి, టిట్ బిట్స్, అక్షరాలు, అంకెలతో కూడిన బిస్కట్లు, కిస్మీ బార్, చాక్లెట్లు, ట్రంప్ కార్డులు, కొయ్య బొమ్మలు, ఫ్రిజ్ మేగ్నెట్లు, రెండు నిబ్బుల ఫౌంటెన్ పెన్నులు, కాప్సూ్యల్పెన్నులు, కొయ్య పెన్నులు, హీరో పెన్నులు, కామ్లిన్ పెన్నులు, ఇన్విజిబుల్ పెన్నులు, ఇంక్ ఇరేజర్లు వంటి వస్తువులు, బొమ్మ కార్లు, బొమ్మ బైకులు, సైకిల్ హారన్లు, విసనకర్రలు, మౌతార్గాన్ వంటి సంగీత పరికరాలు, ఆనాటి సినిమా పాటల పుస్తకాలు వంటి ఎన్నోవస్తువులు ఈ దుకాణంలో ఐదు రూపాయలు మొదలుకొని పదిహేనువందల రూపాయలవరకు వివిధ ధరల్లో అందుబాటులోఉంటాయి. అస్మతీన్ మైదిన్, బ్యూరో ఇన్చార్జ్, చెన్నై (చదవండి: డ్యూటీకి.. టిక్.. టిక్..కానీ బాడీ క్లాక్ బీట్ వినండి ప్లీజ్..!) -
అది మరచిపోలేని జ్ఞాపకం.. తెలుగు యంగ్ హీరోయిన్ కామెంట్స్
‘‘నేను ఎప్పట్నుంచో స్కై డైవింగ్ చేయాలనుకుంటున్నాను. అది 2023లో నెరవేరింది. దుబాయ్‌లో అక్క(శివాని, నేను రెండు వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశాం. 2023 అనే కాదు.. నా జీవి తంలోనే నేను మరచిపోలేని జ్ఞాపకంగా ఈ స్కై డైవింగ్ అడ్వెంచరస్‌ను గుర్తు పెట్టుకుంటాను’’ అని హీరోయిన్ శివాత్మిక అన్నారు. 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతున్న శివాత్మిక రాజశేఖర్ పంచుకున్న విశేషాలు... ► మీ జీవితంలో 2023 ఎలా గడిచింది? చెప్పాలంటే... 2023 నాకు గొప్పగా గడిచింది. చాలా విధాలుగా కలిసొచ్చింది. నా కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి ప్రాజెక్ట్స్‌లో భాగమయ్యాననే భావన కలిగింది. ఎప్పట్నుంచో నేను చేయాలనుకుంటున్న పనులు ఈ ఏడాది జరిగాయి. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరచుకోవడం కోసం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నాను. కుటుంబం పరంగా కూడా బాగా గడిచింది. దేవుడి దయవల్ల, అదృష్టంగా 2023 నా జీవితంలో సంతోషంగా ముగిసింది. ► ఈ ఏడాది మీ జీవితంలో జరిగిన చెడు ఘటనలు ఏవైనా ఉన్నాయా? మంచి జరిగినట్లే... ప్రతి ఏడాది చెడు కూడా ఉంటుంది. అయితే కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టబోయే ఈ తరుణంలో వాటిని నేను గుర్తుతెచ్చుకోవాలనుకోవడం లేదు. ► కొత్త ఏడాది కోసం మీరు తీసుకున్న కొత్త నిర్ణయాలు ఏంటి? నా మనసును ఎక్కువగా ఫాలో అవుతూ వర్క్స్ చేస్తాను. ప్రతి అంశం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించేలా జీవిస్తాను. ఇలా గత ఏడాదిలో ప్రయత్నించి సంతోషంగా జీవనం సాగించాను. ఈ ఏడాది కూడా ఇదే ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ► 2024 మీ జీవితంలో ఎలా ఉండాలనుకుంటున్నారు? పెద్దగా అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదు. ఫ్లోను బట్టి ముందుకెళ్తాను. అయితే అన్నీ మంచి, గొప్ప అంశాలే జరగాలని కోరుకుంటున్నాను. సంతోషంగా, హాయిగా, ఆరోగ్యకరంగా గడవాలని ఆశిస్తున్నాను. ► కొత్త ఏడాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? కొత్త ఏడాది ఎప్పటిలానే అమ్మానాన్న(జీవిత, రాజశేఖర్), అక్క శివానీలతో హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను కలుస్తాను. -
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆ బంగ్లాతో ఎన్నో జ్ఞాపకాలు
న్యూఢిల్లీ: ఎంపీగా అనర్హత వేటు పడ్డ నేపథ్యంలో అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. నెల రోజుల్లోపు దాన్ని ఖాళీ చేయాలన్న లోక్‌సభ సచివాలయం నోటీసుపై ఆయన మంగళవారం స్పందించారు. ‘‘12, తుగ్లక్ లేన్‌లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలంటూ మీరు పంపిన లేఖకు ధన్యవాదాలు. నాలుగుసార్లు ఎంపీగా ఆ బంగ్లాలో చాలా ఏళ్లు గడిపాను. నాకక్కడ ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. నా హక్కులకు భంగం కలగని రీతిలో వ్యవహరిస్తా’’ అంటూ నోటీసుకు బదులిచ్చారు. సదరు బంగ్లాలో రాహుల్ 2005 నుంచీ ఉంటున్నారు. దాన్ని ఖాళీ చేయాలన్న తాఖీదులపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ సర్కారు తాలూకు ‘బెదిరించి, భయపెట్టి, అవమానించే’ వైఖరికి ఇది పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు. రాహుల్‌ను బలహీనపరిచేందుకు మున్ముందు కూడా ఎంత చేయాలో అంతా చేస్తారని అభిప్రాయపడ్డారు. ‘‘రాహుల్కంటూ సొంతిల్లు లేదు. అధికారిక బంగ్లా వీడాక తన తల్లి సోనియాతో 10, జన్‌పథ్ నివాసంలో ఉంటారు. లేదంటే నా ఇంటిని ఖాళీ చేసి ఆయనకిస్తా’’ అని ఖర్గే చెప్పుకొచ్చారు. ‘‘ఎన్నికల ఫలితాలు వచ్చిన ఆర్నెల్ల తర్వాత గానీ నాకు అధికారిక బంగ్లా కేటాయించలేదు. ఇలాంటివి బీజేపీకి అలవాటే’’ అని విమర్శించారు. -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
ఉత్తరమా.. ఏది నీ చిరునామా?
సాక్షి, ఖమ్మం : పోస్ట్..అంటూ పోస్ట్‌మన్ పిలుపు వినిపిస్తే చాలు..ఎంతో సంతోషంగా ఇంట్లో నుంచి ఎదురేగి ఉత్తరం అందుకునేవారు దశాబ్దాల కిందట. పోస్టుకార్డు, ఇన్లాండ్ లెటర్లలోని ఆత్మీయ, అనుంబంధాలు, యోగ, క్షేమాల అక్షర రూపాలను తనివితీరా చదివి ఆనందించడం ఆ రోజుల్లోని మధురానుభూతి. ఆధునిక పరిజ్ఞానంతో అందివచ్చిన స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్లు, ఈ మెయిళ్ల నేటి కాలంలో ఉత్తర, ప్రత్యుత్తరాలు ఆగిపోయి తోకలేని పిట్ట తుర్రుమంది. కేవలం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలు, ఉద్యోగ పిలుపులు, ఇతర సమాచారం కోసం ఈ సేవలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఆంగ్లేయుల పాలనలో 1879 జూలై1న పోస్టుకార్డు ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. నాడు బంధువులకు, మిత్రులకు ఉత్తరాల ద్వారానే సమాచార మార్పిడి జరిగేది. ఇంకా అభిప్రాయాల సేకరణ, సాహితీ విశ్లేషణ, కలం స్నేహం, ఆకాశవాణి, దూరదర్శన్‌లకు ఉత్తరాలు రాయడం, అక్కడి నుంచి జాబులు అందుకోవడం ఓ అరుదైన జ్ఞాపకమే మరి. జూలై 1న పోస్టు కార్డు దినోత్సవం సందర్భంగా నాటి ఉత్తరంతో అనుబంధాన్ని పలువురు ఇదిగో ఇలా పంచుకున్నారు. ఉత్తరం కోసం ఎదురుచూసేవాడిని నాకు ఉద్యోగం రాక ముందు స్నేహితులకు, బంధువులకు లెటర్లు రాసేది. ఉత్తరం తీసుకుని పోస్టుమన్ ఎప్పుడు వస్తాడా..అని ఎదురూచూస్తుండేది. అంతటి ఆదరణ కలిగిన పోస్టు కార్డులు నేడు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. – సంకటాల శ్రీనివాసరావు, పెద్దమ్మ తల్లి దేవస్థానం ఈఓ, పాల్వంచ పరీక్ష పాసయ్యానని లెటర్ వచ్చింది.. 1990లో ఏపీ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్ సర్వీస్ కోచింగ్‌కు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించినట్లు పోస్టుకార్డు ద్వారా సమాచారం వచ్చింది. అది నేటికీ మరిచిపోలేను. మా చుట్టాలు యోగక్షేమాలు రాసి పంపేవారు. - డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్, పాల్వంచ మూడు రోజుల్లో చేరేది.. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉత్తరం రాస్తే..అది మూడు రోజుల్లో వారికి చేరేది. వాళ్లు రాసి పంపినా అన్నే రోజులు పట్టేది. మేం వారి ఉత్తరం కోసం ఎంతో ఆత్రుతగా నిరీక్షించి చూసేవాళ్లం. - భాస్కర్‌రావు, రిటైర్డ్ వీఆర్వో, పాల్వంచ పోస్టుకార్డులు అమ్ముడు పోవట్లేదు.. గతంలో మాదిరిగా పోస్టు కార్డులు ఈ రోజుల్లో అమ్మకాలు జరగట్లేదు. పాఠశాలలు, కళాశాల యాజమాన్యాలు మాత్రమే అప్పుడప్పుడు కొనుగోలు చేస్తున్నాయి. నేటితరం వారు తీసుకోవట్లేదు. - కిరణ్‌కుమార్, పాల్వంచ ఇన్చార్జ్ పోస్టుమాస్టర్ కలం స్నేహం గుర్తుకొస్తోంది.. ఆ రోజుల్లో ఉత్తరం రాయడం ద్వారానే చాలామంది స్నేహితులు పరిచయమయ్యారు. ఇప్పటికీ కొంతమందితో ఆ స్నేహం కొనసాగుతోంది. నాటి ఉత్తరాలు అనేకం నా వద్ద ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. అభిప్రాయాలను పంచుకునేందుకు ఉత్తరాన్ని మించిన వేదిక మరొకటి ఉండదు. - బత్తుల వీరయ్య, టీఆర్ఎస్ నాయకుడు, నాయకులగూడెం -
శరదశ్శతమ్
కొన్ని రోజుల్లో చచ్చి పోతున్నావని డాక్టర్లు తేల్చారు. నిన్ను చూడా లని ఉందిరా అని సమా చారం పంపాడు కాళీ, దాసుకి. దాసుది సామర్ల కోటలో సగ్గుబియ్యం హోల్‌సేల్ వ్యాపారం. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తండ్రి వ్యాపారం దాసు వారసత్వంగా పుచ్చుకున్నాడు. పై చదువులు చదివి రైల్వేలో ఉద్యోగం సంపా దించుకున్నాడు. ఇద్దరూ కలిసి దశాబ్దాలు గడి చింది. అందుకే ఈ సమాచారం దాసుకి ఆశ్చ ర్యాన్ని కలిగించింది. అయినా కానీ పనికట్టుకుని చిన్ననాటి స్నేహితుడిని చూడటానికి బయలు దేరాడు దాసు. కాళీ 77, దాసు 75. కాళీకి ఇన్నేళ్లలో ఉన్న జుత్తు ఊడిపోయింది. దాసుకి వారసత్వంగా తల్లిదండ్రుల పొట్ట వచ్చింది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుని కావలించుకుని, గెంతులేసి పొంగిపోయారు. విచిత్రం, స్నేహితుడిని బాధిస్తానని దాసు కాళీ జబ్బు గురించి అడగలేదు. రాకరాక వచ్చిన స్నేహితుడిని ఇబ్బంది పెడతానని కాళీ చెప్పలేదు. బయటికి ఇద్దరూ ఆనందంగా, డాబుగా, అన్నిటినీ మించి తృప్తిగా ఉన్నారు. ఆమాటా, ఈమాటా మాట్లాడుతూ చిన్నతనంలో తమ అక్కలు ఆడే ‘ఆడ ఆటలు’ ఆడారు. చెమ్మాచెక్కా ఆడినందుకే పగలబడి నవ్వుకున్నారు. చింతపిక్కలతో ఆడవాళ్లు ఆడే తొక్కుడుబిళ్ల ఆట ఆడారు. వెనక వరండాలో 75 సంవత్సరాల బొజ్జ దాసు, కాళీ 77 సంవత్సరాల జబ్బు శరీరం గెంతు లాట చూసి ఇంటిల్లిపాదీ ముక్కుమీద వేలేసు కున్నారు. ఆ రాత్రి డాక్టరు కాళీకి రెండు మాత్రలు తక్కువ చేశాడు. రానురానూ మిత్రులిద్దరూ పసిపిల్లలయి పోయారు. కాళీ చిన్నతనంలో బొమ్మలు వేసే వాడు. ఒకరోజు రెండు అట్టలమీద పులి ముఖాలు వేశాడు. ఇది మిత్రులు ఇద్దరూ శ్రీరామనవమి సంబరాల్లో రోజూ ఆడే ఆట. ఎప్పుడు? 25 సంవత్సరాల కిందట. అయినా ఇద్దరూ బొమ్మలు పెట్టుకుని పులిగెంతులు గెంతారు. ఇదే ఆట. ఇంటిల్లిపాదీ నిర్ఘాంత పోయారు. ఆ రోజుల్లో దాసు బొజ్జకి డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. ఇద్దరూ ఇంటర్మీడియట్ చేసే రోజుల్లో కాకినాడలో అద్దెకి ఉండేవారు. ఇద్దరూ భయం కరమైన గొంతు కలవారు. ‘పాతాళభైరవి’ చూసి వచ్చి– పాటల పుస్తకం కొని పాటలన్నీ భయం కరంగా పాడారు. ఇంటివారు మొత్తుకుంటే మరింత విజృంభించారు. ఇప్పుడా ఇల్లు లేదు. ఇంటాయన లేడు. 65 సంవత్సరాల కిందటిమాట. 75 సంవత్సరాల దాసు విజృంభించాడు. 77 సంవత్సరాల కాళీ అందుకున్నాడు. ఇప్పుడు తమ ఇంట్లో కాదనే వారెవరు? వాళ్ల గొంతుల్ని, అల్లరిని బాలక్రిష్ట త్వాన్ని భరించారు. భరిస్తున్నారని తెలిసి ఇద్దరు మిత్రులూ రెచ్చిపోయారు. దాసు వెళ్తానంటే కాళీ, దాసు బొజ్జమీద దరువువేశాడు. చిన్నతనం ఆటలు, ఆ చవకబారు ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. స్కూలుకి వస్తే, రైలు పట్టాలు దాటుతున్న చంటిబాబు చావు తలుచు కుని ఇద్దరూ ఏడ్చారు. అతని ‘మాజిక్’ విన్యా సాలు ఒక రోజంతా చెప్పుకున్నారు. ఏతావాతా 15 రోజుల్లో ఉద్యోగి కాళీ, వ్యాపారి దాసూ మారిపోయారు. 65 సంవ త్సరాలు వెనక్కిపోయారు. మనస్సుల ముసు గులు మళ్లీ అతుక్కున్నాయి. వాస్తవం అటకెక్కింది. ‘ఏమిటి తాత ధోరణి’ కాళీ మనుమడు డాక్టరు దగ్గర ఆశ్చర్యపడ్డాడు. డాక్టరు కంగారు పడటానికి బదులు నవ్వాడు. ‘ఎప్పుడు వస్తారు’ అని సామర్లకోట నించి ఫోన్ చేసిన దాసు మేనల్లుడికి– దాసు చేతుల్లో ఫోన్ లాక్కుని సమాధానం చెప్పాడు కాళీ ‘ మీ మామ ఇప్పుడు రాడురా’ అని. ఇద్దరూ పగలబడి నవ్వుకున్నారు.18 రోజులు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులూ వర్తమానాన్ని మర్చిపోయారు. జీవితాన్ని తిరగేసి మళ్లీ గడపటం ప్రారంభిం చారు. 25 రోజులు అయింది. దాసు లేచేసరికి కాళీ సూర్యో దయం చూస్తూ కనిపించాడు. ‘ఏంట్రా ఆలోచిస్తున్నావు?’ అన్నాడు దాసు. కాళీ ధైర్యంగా ఇటుతిరిగి ‘నేను చావనురా– నువ్వు సామర్లకోట పో’ అన్నాడు కాళీ. జ్ఞాపకాలు బంగారు తాకిడీలు, ఆలోచనలు ఆత్మబంధువులు. (నన్ను మళ్లీ ‘జీవనకాలమ్’ రాయమని పోరి రాయించిన మా తమ్ముడు శివకి అంకితం) గొల్లపూడి మారుతీరావు -
అమ్మ ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి
చిన్నప్పుడు జరిగిన సంఘటనలు పెద్దయ్యాక గుర్తు చేసుకుంటుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. సమంత కూడా తన బాల్యానికి సంబంధించిన చిన్ని చిన్ని జ్ఞాపకాలను అప్పుడప్పుడూ నెమరు వేసుకుంటుంటారు. కొన్ని విషయాలను బయటకు కూడా చెబుతుంటారు. ‘‘ప్రతి బుధవారం, శనివారం, ఆదివారం మా అమ్మగారు నన్ను చర్చ్‌కు లాక్కొని వెళ్లేవారు. చిన్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుండేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తన ప్రార్థనలే నన్ను కాపాడుతున్నాయి అనిపిస్తుంది’’ అని సమంత పేర్కొన్నారు. అంతే.. చిన్నప్పుడు పెద్దవాళ్లు చెప్పినవన్నీ చిరాకుగానే అనిపిస్తాయి. పెద్దయ్యాక ఆ మాటలకు విలువ తెలుస్తుంది. ఇది కాకుండా సమంత మరో స్వీట్ మెమరీని కూడా పంచుకున్నారు. ‘‘ఒకసారి పరీక్షలప్పుడు నేను విపరీతమైన అనారోగ్యానికి గురయ్యాను. మా అమ్మగారు నాతో పాటు స్కూల్‌కి వచ్చి నా పక్కనే కూర్చుని పరీక్ష రాయించారు. యాక్చువల్లీ నాకు రాసే ఓపిక కూడా లేదు. కానీ, పక్కనే అమ్మ ఉందనే బలం నాతో రాయించింది. మై మామ్ ఈజ్ ట్రూలీ అమేజింగ్’’ అని చెప్పుకొచ్చారు సమంత. ప్రస్తుతం సమంత ‘మహానటి, రంగస్థలం’ సినిమాలు చేస్తున్నారు. తమిళంలో నటించిన ‘ఇరుంబుదురై’ తెలుగులో ‘అభిమన్యుడు’గా జనవరి 26న విడుదల కానుంది. -
అందరం పదహరే!
కొత్త సంబరం పైలా పచ్చీసు దూకుడుకు ఇంకా టైముంది గానీ, ప్రస్తుత సహస్రాబ్ది పడుచు పదహారులో పడుతోంది. పదహారు ప్రాయం అంటే నవ యవ్వన వనాన్ని తొలకరి పలకరించే పడుచుప్రాయం. పదహారు ప్రాయంలో ఇటు బాల్యచాపల్యాలూ ఉంటాయి, అటు యవ్వనోద్రేకాలూ ఉంటాయి. పదహారు ప్రాయంలో పడుతున్న ఇరవై ఒకటో శతాబ్ది... ఇక బాల్యావస్థను అధిగమిస్తున్నట్లే లెక్క! ఆకు రాలు కాలం వెళ్లిపోతూ యవ్వన వనానికి వసంతం విచ్చేస్తున్నట్లే లెక్క! పదహారేళ్ల ప్రాయం అంటే కలలు కనే ప్రాయం. కలల సాకారానికి ప్రయత్నాలు సాగించే ప్రాయం. లోకం పోకడకు ఎదురీదే తెగువ మొలకెత్తే ప్రాయం. భవిష్యత్తు మీద అందమైన ఆశలు రేకెత్తే ప్రాయం. పదహారేళ్ల ప్రాయం అంటే ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే ప్రాయం. ఆకర్షణల వలయంలో పరిభ్రమించే ప్రాయం. కష్టాలను, కన్నీళ్లను తేలికగా తుడిచిపెట్టేసే టేకిటీజీ ప్రాయం. సంతోషాలను, సంబరాలను పదిమందికీ పంచిపెట్టే సందడి ప్రాయం. పదహారేళ్ల వయసులో ఊహలు నింగిలో విహరిస్తుంటాయి. నిశిరాత్రి వేళ అక్కడ మెరిసే చుక్కల్లా మెరుస్తుంటాయి. ఆ వయసులో ఉన్న వాళ్ల కళ్లలో కనిపించేది ఆ మెరుపే! పడుచు పదహారులో కొత్త కొత్త ఆశలు చిగురిస్తూ ఉంటాయి. అందుకే ఆ వయసులోని వాళ్లంతా నడిచొచ్చే వసంతాల్లా ఉల్లాసంగా ఉంటారు. పచ్చిక మీదుగా వీచే నులివెచ్చని పైరగాలిలా తాజా తాజాగా ఉంటారు. నిన్నకు సెలవిచ్చేసి, నేటిలో జీవిస్తూ, రేపటివైపు సుస్పష్టంగా చూపు సారించే శక్తి పదహారేళ్ల కుర్రకారుకు మాత్రమే ఉంటుంది. జీవితంలోని చేదును చెరిపేసి, బతుకు తీపిని ఆస్వాదించే సత్తా కూడా వాళ్లకు మాత్రమే ఉంటుంది. అందుకే స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నవాళ్లు ముందుతరం దూతలు. ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది కుర్రకారులో పడుతోంది. ఉరకలెత్తే ఉత్సాహమే ఊపిరిగా ముందుకు సాగబోతోంది. ఆకు రాలు లోకంలోకి ఆశలు మోసుకొస్తూ ఆమని రుతు రాగాన్ని ఆలపించబోతోంది. ఇదిగిదిగో! ఈ సహస్రాబ్ది పసితనాన్ని వీడి పడుచుప్రాయంలోకి అడుగిడుతోంది. ఊహల ఉత్తేజంతో రెక్కలు విచ్చుకుని వినువీధిలో విహంగంలా విహరించబోతోంది. ఇదివరకు శరవేగానికే జనం అబ్బురపడేవాళ్లు. వేగమే వేదంగా మొదలైన ఈ సహస్రాబ్ది, పదహారు ప్రాయంలో మనోవేగాన్ని అధిగమిస్తుందేమో చూడాలి. ఈ సహస్రాబ్ది వేకువలో పుట్టిన వాళ్లందరూ స్వీట్ సిక్స్టీన్లోకి అడుగుపెట్టే తరుణం ఇది. స్వీట్ థాట్స్ తెచ్చిపెట్టే ఉల్లాసోత్సాహాలన్నీ వాళ్ల సొంతం. మాజీ యువకులందరూ స్వీట్ మెమొరీస్‌ను నెమరు వేసుకునే తరుణం కూడా ఇది. గతానుభవాలతో పోగు చేసుకున్న పరిణతితో కూడిన నిండుతనం వాళ్ల సొంతం. ఆశయాలకు అనుభవం తోడై, ఈ సహస్రాబ్ది ఆశించిన లక్ష్యాలను చేరుకుంటుందనే ఆశిద్దాం. అడుగులు తడబడే పసిప్రాయంలో తప్పటడుగులు సహజమే! పడుచు ప్రాయం వాటిని దిద్దుకుంటుందనే ఆశిద్దాం. పట్టుదల పెంపొందే పదహారు వయసులో భావి లక్ష్యాలను నిర్దేశించుకుంటుందనే ఆకాంక్షిద్దాం. సహస్రాబ్ది అడుగిడుతున్న పడుచు పదహారును మనసారా స్వాగతిద్దాం. - పన్యాల జగన్నాథ దాస్ -
నిన్నటి ఊసులు రేపటి ఆశలు
కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ రోజుతో 2014కు శుభం కార్డు పడుతోంది. సరికొత్త ఆశలు మోసులెత్తగా, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న వేళ... ఒక్కసారి గడచిన ఏడాది కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే... సినిమా రీలు గిర్రున తిరిగినట్లు ఎన్నెన్నో జ్ఞాపకాలు. వెళ్ళిపోతున్న 2014లో తాము చూసిన మార్పులు, రానున్న 2015కు వచ్చే చేర్పుల గురించి ఆయా విభాగాల్లోని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు... అనుభూతులు... ఎవరికైనా వర్తించే సూక్తి ఇది! - వెంకటేశ్, హీరో 2014లో ‘దృశ్యం’ నాకొక స్వీట్ మెమరీ. సరైన సమయంలో వచ్చిన విజయం అది. ఈ విజయం ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయగల నమ్మకాన్ని నాలో నింపింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ మరో విషయం - యంగ్‌స్టర్స్ చాలామంది కూడా ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం. ఇక సక్సెస్ రేట్ అంటారా! జయాపజయాలు ప్రతి ఏడాదీ ఉండేవే! ఆ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. చక్కని ప్లానింగ్, హార్డ్‌వర్క్‌తో సిన్సియర్‌గా ముందుకెళ్తే విజయం తథ్యం. ఒక సీనియర్ కథానాయకునిగా నా అభిప్రాయమిది! మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడం, ప్రయోగాలు చేయడం... వీటి గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒక వయసు వచ్చాక, రకరకాల పాత్రలు చేసి అనుభవం పొందాక ఇక రొటీన్‌గా వెళ్లడం కరెక్ట్ కాదు. నాకే కాదు, ఎవరికైనా వర్తించే సూక్తి ఇది. అందుకే... వెరైటీ పాత్రలనే ఎన్నుకుంటున్నా. రానున్న 2015లో ‘గోపాల గోపాల’తో రాబోతున్నా. అది కూడా రొటీన్ ఫార్ములా సినిమా కాదు. కథ, కథనం, పాత్రలు కొత్తగా ఉంటాయి. అంతా ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నారు - సుద్దాల అశోక్‌తేజ, గీత రచయిత 2014లో ‘లింగ’, ‘ఐ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పాటలు రాశాను. రచయితగా ఆత్మసంతృప్తినిచ్చిన పాటలైతే ఏమీ రాయలేదు కానీ, సంతృప్తినిచ్చిన పాట మాత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నేను రాసిన ‘నీలిరంగు చీరలోనా...’ పాటే. ఇంకా దాసరిగారి ‘ఎర్రబస్సు’లో కూడా పాట రాశాను. పరిశ్రమ మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది అంత బ్రహ్మండంగా అయితే లేదు. తక్కువగా కూడా ఏమీ అనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు విడుదలై సరిగ్గా ఆడకపోవడం మాత్రం బాధ కలిగించింది. బాధాకరమైన మరో విషయం ఏంటంటే... గొప్ప సాహిత్యం అందించాలని మాకుంటుంది. కానీ... ఆ అవకాశం మాత్రం లభించడం లేదు. ఆత్రేయగారు ఓ మాట అనేవారు. ‘ముందు నీకు నచ్చింది చేయ్. అది వాళ్లకు నచ్చకపోతే... వాళ్లకు నచ్చిట్టు చేయ్’ అని. ఇప్పుడు గీత రచయితలంతా ఫాలో అవుతోంది ఆ సూత్రాన్నే. ఈ ఏడాది ఉన్నంతలో మా గీత రచయితలంతా మంచి సాహిత్యాన్నే అందించారు. కాంట్రవర్సీ అంటేనే కథానాయికా..? - స్వాతి, హీరోయిన్ 2014 సాదాసీదాగా సాగిపోయింది. అయితే కొత్త హీరోయిన్లు కొంతమంది ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆనందం అనిపించింది. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన రాశీఖన్నా నాకు బాగా నచ్చింది. ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన హీరోయిన్లంతా గ్లామర్‌కే పరిమితమైపోయారనే విమర్శను నేను అంగీకరించను. ఎందుకంటే గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో వాళ్లకు తెలీదు. నేను కథానాయికగా కెరీర్ ప్రారంభించాక, మొదట్లో అభినయ ప్రధానమైన పాత్రలకే మొగ్గు చూపాను. కానీ కెరీర్ దీర్ఘకాలం కొనసాగాలంటే, గ్లామర్‌గా కనిపించక తప్పదు. అందుకే, ‘స్వామి రా రా’ నుంచి నా అభిమతాన్ని మార్చుకొని కాస్త గ్లామర్‌గా కనిపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు తెలుస్తోంది గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో! ఈ ఏడాది అభినయపరంగా చెప్పాల్సి వస్తే -‘మనం’ సినిమాలో సమంత, శ్రీయల గురించి చెప్పాలి. సమంతది నిజంగా చాలా విచిత్రమైన పాత్ర. అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. ఇక శ్రీయ అయితే... ఆ సినిమాలో వెంకటగిరి చీర కట్టుకొని ఎంత అందంగా కనిపించారో! అలాగే.. ‘గీతాంజలి’ సినిమాలో అంజలి పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఆ దర్శకుడు తీయనున్న తదుపరి చిత్రంలో నేనే కథానాయికను. అయితే, అందరూ అది ‘గీతాంజలి’కి సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ, అదొక కొత్త కథ. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల గురించి చెప్పే ముందు.. నాపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్. నాకు పెళ్లి ఖాయమైందనీ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయబోతున్నాననీ ఓ రూమర్ నాకెంత తలనొప్పి తెప్పించిందో మాటల్లో చెప్పలేను. ఆ టైమ్‌లో నేను ఫారిన్లో ఉన్నా. ఒకటే ఫోన్లు. ‘పెళ్లి కొడుకు కూడా ఎవడో మీరే చెప్పేయండి... ఓ పని అయిపోతుంది’ అని మీడియా వారితో ఘాటుగా స్పందించా. అలాగే... కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తే... వాటికి వేరే రంగు పులిమి మాట్లాడటం నన్ను కాస్త బాధించింది. ఇక శ్వేతాబసు ఉదాంతం గురించి చెప్పేదేముంది. తన విషయంలో అందరూ ఓవర్‌గానే రియాక్టయ్యారు. చివరకు కాంట్రవర్సీ అంటేనే కథానాయిక అన్నట్లు తయారైంది సొసైటీ. దర్శకులే బాధ్యులు! - బోయపాటి శ్రీను, దర్శకుడు ఈ ఏడాది తొలినాళ్లలో బలహీనమైన బాక్సాఫీస్‌కి కొత్త ఊపిరులూదిన చిత్రం నా ‘లెజెండ్’. ఇది నేను గర్వంగా చెప్పుకునే అంశం. అయితే ఈ ఏడాది అత్యధికంగా చిత్రాలు విడుదలైనా, విజయాలు మాత్రం అరకొరగానే ఉండడం నన్ను బాధించింది. సినిమా సమష్టికృషి అయినా, జయాపజయాలకు బాధ్యులు కచ్చితంగా దర్శకులే. దర్శకుని సృజన పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ ఏడాది విడుదలైన ‘మనం’, ‘రన్ రాజా రన్’ సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. బాలయ్య వందో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాను నేను డెరైక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నా దగ్గరైతే కథ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బాలయ్య స్టేటస్‌కు తగ్గ కథను తయారు చేసి, మళ్లీ ఆయనకు ఘన విజయాన్ని అందిస్తా. ఆ సత్తా నాలో ఉంది. పరిశ్రమ పరిస్థితి బాగా లేదు! - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), నిర్మాత ఈ ఏడాది ఆర్టిస్టుల పరిస్థితి హ్యాపీ... టెక్నీషియన్ల పరిస్థితీ హ్యాపీ. కానీ నిర్మాతల పరిస్థితే దారుణంగా తయారైంది. దానికి కారణం నిర్మాతల పొరపాట్లే. ఇక్కడ నిర్మాతకు నిర్మాతే శత్రువు. ఈ కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం. ముందు నిర్మాతల్లో మార్పు రావాలి. మార్పు రాకపోతే... ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నా విషయానికొస్తే 2014 సూపర్‌హిట్ ఇయర్. ఈ ఏడాది ప్రారంభంలో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించాను. ముగింపులో వచ్చిన ‘ముకుంద’ విజయపథంలో దూసుకుపోతోంది. బాధ్యత పెంచిన విజయాలు - అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. నా మ్యూజిక్ డెరైక్షన్‌లో వచ్చిన ‘మనం, హార్ట్ ఎటాక్, ఒక లైలాకోసం, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలు సంగీతపరంగా సంచలనం సృష్టించాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో మ్యూజిక్ డెరైక్టర్‌కి కలిసి రావడం మొదట్నుంచీ జరుగుతోందే. ఈ ఏడాది నాకు కలిసొచ్చింది. దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నా. ఇక బయటి సినిమాల్లో నాకు నచ్చిన ఆల్బమ్ ‘వన్’. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఏడాది అత్యంత బాధాకరమైన విషయం చక్రిగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం. మంచి సంగీత దర్శకుడు. అలాగే గొప్ప వ్యక్తి కూడా. అలాంటాయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. పరాజయాలకు కారణం అదే! - మార్తాండ్ కె.వెంకటేశ్, ఎడిటర్ 2014లో ఎడిటింగ్‌లో వచ్చిన పెద్ద మార్పు ఒక్కటే. సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కి మారడం. ఫిల్మ్ ఉన్నప్పుడు... భయం, భక్తి ఉండేది. కానీ... డిజిటల్‌గా మారాక ఆ గౌరవం తగ్గిందనే చెప్పాలి. దర్శకునికి ఒక వెర్షనూ, నిర్మాతకు ఒక వెర్షనూ, హీరోకి ఒక వెర్షనూ చేసి చూపిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివే. కాస్త ఇబ్బందికరమైన విషయం అదే. ఇక ఈ ఏడాది సక్సెస్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం కూడా ఓ విధంగా డిజిటలే అనాలి. ఎందుకంటే... ఫిల్మ్ ఉన్నప్పుడు అనుభవం, అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న సరైన టెక్నీషియన్స్ పనిచేసేవారు. కానీ డిజిటల్ వచ్చాక ఎవరికి వారే ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలకు పనిచేసిన తర్వాత డెరైక్టర్లయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ అనుభవం లేకుండానే డెరైక్టర్లైపోతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు సినిమాల విషయంలో పదిమంది కంట్రిబ్యూషన్ ఉండేది. సినిమా బాగా రాకపోతే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతల ముందు కరాఖండిగా చెప్పేసేవాళ్లం. వెంటనే దానికి తగ్గ మార్పులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు సినిమాలో లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, మన దగ్గరకు రావడం మానేస్తున్నారు. ఇది ఒక రకంగా అనారోగ్యకరమైన వాతావరణమే. ఓవరాల్‌గా డిజిటల్ కారణంగా ఎక్కువ సినిమాలు ఎలా వస్తున్నాయో, అలాగే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నా విషయానికొస్తే ‘దృశ్యం, ఉయ్యాల జంపాల’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశాననే సంతృప్తి ఉంది. ప్లానింగ్‌తో వెళ్తే విజయాలే! - రామ్‌ప్రసాద్, కెమెరామేన్ ఈ ఏడాది తెలుగు సినిమా చిత్రీకరణ రీల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కి మారింది. కెమెరా విభాగంలో కొత్తగా చెప్పుకోవాల్సిన మార్పు అదే. నా వరకూ నేను పనిచేసిన ‘ఎవడు’, ‘లెజెండ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కెమెరామేన్‌గా నేను పూర్తి ఆనందంతో ఉన్నాను. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సక్సెస్‌రేట్ తక్కువగా ఉంది. సరైన ప్లాన్‌తో పకడ్బందీగా ముందుకెళ్తే ఈ అపజయాలను కొంతైనా అధిగమించొచ్చు. ఎందుకంటే... ఈ ఏడాది అపజయాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ల సంఖ్య కూడా ఎక్కువే. సరైన ప్లానింగ్ లేకషూటింగ్ డేస్ ఎక్కువై, అనవసరపు ఖర్చు పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా నాకిష్టమైన సినిమాలంటే.. ‘లెజెండ్’, ‘ఎవడు’ సినిమాల పేర్లే చెబుతాను. ఎందుకంటే విమర్శ అయినా, పొగడ్త అయినా... నాకు నేనే చేసుకుంటాను తప్ప మరొకరికి ఆ అవకాశం ఇవ్వను. నిజానికి మన కంటే హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో ఫొటోగ్రఫీ బాగుంటోంది. ఆ సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాధ కల్గుతుంటుంది. నేనెందుకు అంత గొప్పగా చేయలేకపోతున్నాను అని. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాను. - బుర్రా నరసింహ -
మనకు ‘గుడ్’మింటన్
అంతర్జాతీయ వేదికపై ఈ ఏడాది భారత్‌కు ఎక్కువ విజయాలు అందించిన క్రీడాంశం ఏది అని అడిగితే ‘బ్యాడ్మింటన్’ అని ఠక్కున సమాధానం వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మనోళ్లు విజయఢంకా మోగించారు. సీనియర్ విభాగంలో సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్, కశ్యప్ మొదలుకొని... జూనియర్స్‌లో రుత్విక శివాని వరకు పలు అంతర్జాతీయ టోర్నీల్లో భారతీయ ‘రాకెట్’ దూసుకుపోయింది. చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆధ్వర్యంలో భారత బ్యాడ్మింటన్ ఎన్నో మధురమైన విజయాలను సొంతం చేసుకొని ఈ ఏడాదిని ‘గుడ్మింటన్’గా మలుచుకుంది. తీపి జ్ఞాపకాలు మిగిల్చిన భారత బ్యాడ్మింటన్ ⇒ ఉబెర్ కప్‌లో తొలిసారి పతకం ⇒ ఒకే సూపర్ సిరీస్ టోర్నీలో రెండు టైటిల్స్ ⇒ రెండో ‘ప్రపంచ’ పతకంతో సింధు చరిత్ర ⇒ కామన్వెల్త్ గేమ్స్‌లో కశ్యప్ మెరుపులు ⇒ కోచ్‌గా తిరుగులేని గోపీచంద్ సాక్షి క్రీడావిభాగం: గతేడాది ఒక్క టైటిల్ నెగ్గలేకపోయిన సైనా నెహ్వాల్ ఈ ఏడాది మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. జనవరిలో ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి శుభారంభం చేసిన సైనా జూన్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నవంబరులో చైనా ఓపెన్ ప్రీమియర్ టైటిల్‌ను దక్కించుకొని పూర్వ వైభవాన్ని సాధించింది. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొంది లీగ్ దశలో అజేయంగా నిలిచి సెమీఫైనల్ దశలో నిష్ర్కమించింది. అంతేకాకుండా ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్లో, ఆసియా క్రీడల్లో భారత జట్లకు కాంస్య పతకాలు దక్కడంలోనూ సైనా కీలకపాత్ర పోషించింది. సైనా నీడను దాటి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న పీవీ సింధుకు కూడా ఈ ఏడాది తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. 19 ఏళ్ల ఈ హైదరాబాద్ అమ్మాయి ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ నుంచి గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండోసారి ఈ మెగా ఈవెంట్లో సింధు కాంస్య పతకాన్ని నెగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియా క్రీడల్లో, ఉబెర్ కప్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు నెగ్గడంతోపాటు... చివర్లో మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకుంది. పలుమార్లు చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించిన సింధు వచ్చే ఏడాది తన ఖాతాలో లోటుగా ఉన్న ‘సూపర్ సిరీస్’ టైటిల్‌ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ‘కొడితే జాక్‌పాట్ కొట్టాలి’... దీనిని యువతార కిడాంబి శ్రీకాంత్ నిజం చేసి చూపించాడు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో శ్రీకాంత్ విజేతగా అవతరించి నివ్వెరపరిచాడు. ఈ టోర్నీ ఫైనల్లో బ్యాడ్మింటన్ దిగ్గజం లిన్ డాన్‌ను అతని సొంతగడ్డపైనే ఓడించి శ్రీకాంత్ పెను సంచలనం సృష్టించాడు. అదే జోరులో సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్’కు అర్హత పొందిన తొలి భారతీయ క్రీడాకారుడిగా కొత్త చరిత్రను లిఖించాడు. కీలక తరుణంలో తడబడే అలవాటును అధిగమించిన భారత అగ్రశ్రేణి ప్లేయర్ పారుపల్లి కశ్యప్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 1982లో సయ్యద్ మోదీ తర్వాత ఈ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో పసిడి పతకం నెగ్గిన ప్లేయర్‌గా కశ్యప్ గుర్తింపు పొందాడు. ఇవే క్రీడల్లో గురుసాయిదత్ కాంస్య పతకాన్ని సాధించాడు. వీరితోపాటు అంతర్జాతీయ వేదికపై అజయ్ జయరామ్, హెచ్ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా మంచి విజయాలు సాధించారు. జయరామ్ ‘డచ్ ఓపెన్ గ్రాండ్పి’ టైటిల్ నెగ్గగా... ప్రణయ్ ‘ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్’ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఫజార్ ఓపెన్‌లో, ఆస్ట్రియన్ ఓపెన్‌లో సౌరభ్ వర్మ విజేతగా నిలిచాడు. చివర్లో టాటా ఓపెన్‌లో రుత్విక శివాని మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గి సైనా, సింధు వారసుల రేసులో నేనున్నానంటూ తెరపైకి దూసుకొచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ నుంచి టాప్-100లో 10 మంది క్రీడాకారులు ఉండటం భారత బ్యాడ్మింటన్ అభివృద్ధికి సూచికలా నిలుస్తోంది. చీఫ్ కోచ్‌గా పుల్లెల గోపీచంద్ తనదైన ముద్ర వేశారు. ఉబెర్ కప్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో, సూపర్ సిరీస్ టోర్నీలలో భారత క్రీడాకారుల విజయాల్లో తనవంతు పాత్రను పోషించారు. -
జ్ఞాపకాల పందిరి.. విషాద లోగిలి
పెళ్లి పుస్తకంలో ఓ పేజీ రక్తసిక్తమైంది. వధూవరులు.. బంధుమిత్రుల రాకతో మధురజ్ఞాపకాలు మిగిల్చాల్సిన తిరుగుపెళ్లి విషాదం నింపింది. ఓ గంట గడిస్తే.. సంబరం అంబరాన్నంటాల్సిన ఆ ఇల్లు శోకసంద్రమైంది. ఆనందాలకు స్వాగతం పలుకుదామని ఒళ్లంతా కళ్లుచేసుకున్న మామిడి తోరణం ముడుచుకుపోయింది. ఆ జంట జీవితంలో సరికొత్త రాగం ఆలపించాల్సిన పాట మూగబోయింది. పెళ్లి ముచ్చట్లతో సాగుతున్న ఆ ప్రయాణాన్ని మృత్యువు అడ్డగించింది. మలుపులో మాటేసి పంజా విసిరింది. వందేళ్ల జీవితానికి సాక్ష్యంగా నిలవాల్సిన రోజు.. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. మహానంది: కర్నాలు-ప్రకాశం జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో పాత రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం అర్ధరాత్రి పెళ్లి బృందం లారీ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 42 మంది క్షతగాత్రులు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన శిరీషకు గిద్దలూరు పట్టణంలోని చట్రెడ్డిపల్లెకు చెందిన నరసయ్యతో ఈనెల 18న వివాహమైంది. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తిరుగుపెళ్లి నిమిత్తం వధూవరులతో పాటు బంధుమిత్రులు సుమారు 50 మంది లారీలో బయలుదేరారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నల్లమలలోని పాత రైల్వే బ్రిడ్జి వద్దనున్న మలుపులో అదుపుతప్పిన లారీ కొండను ఢీకొంది. ఘటనలో చట్రెడ్డిపల్లెకు చెందిన తిరుపాలు(55), ప్రభాకర్(33), ఏసోబు(39), బోయలకుంట్లకు చెందిన ఉడుముల జయమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందగా.. చట్రెడ్డిపల్లెకు చెందిన గడ్డం వెంకటయ్య(34), మొలక కృష్ణ(20)లు గిద్దలూరులోని వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 31 మందికి తీవ్ర గాయాలు కాగా.. కర్నూలు, నంద్యాల, ఒంగోలు, నరసరావుపేట, గిద్దలూరులో చికిత్సనందిస్తున్నారు. వీరిలోనూ ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో పెళ్లికూతురు స్వగ్రామం గోపవరంలో విషాదం అలుముకుంది. -
ఈ అయిదు పాత్రలూ అదుర్స్!
సందర్భం: ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి కొందరు ‘నవ్వించడానికే’ అన్నట్లు భూమ్మీద పుడతారు. ఆ కోవకు చెందిన నటుడే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ‘ఆనందో బ్రహ్మ’ అనే సూక్తిని చివరి శ్వాస వరకూ పాటించి... నవ్వుతూ, నవ్విస్తూ జీవితాన్ని సార్థకం చేసుకున్న నటుడాయన. దబాయించి మరీ దశాబ్దాల పాటు కామెడీని తెరపై బజాయించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన వదిలి వెళ్లిన అయిదు తీపి జ్ఞాపకాలు మీ కోసం... 1 స్వాతికిరణం (1992) కాకా హోటల్‌తో కుటుంబాన్ని పోషించుకునే కళాభిమానిగా ఈ చిత్రంలో కనిపిస్తారు ధర్మవరపు. బాలగంధర్వుణ్ణి కన్నతండ్రిగా అనుక్షణం ఆనందాన్ని పొందుతుంది ఆయన పాత్ర. సంగీత ప్రపంచంలో త్రివిక్రమునిగా ఎదిగిపోతున్న కొడుకుని చూసి పొంగిపోతాడు. ఈర్ష్యా ద్వేషాలనే కాలసర్పాల కాటుకి బలైపోయిన కొడుకుని చూసి కృంగిపోతాడు. ధర్మవరపు నటజీవితంలో చిరస్థాయిగా నిలిచిపోతే పాత్ర ఇది. 2 నువ్వు-నేను (2001) ఇందులో...ప్రిన్సిపాల్ పాత్ర పోషించిన ఎమ్మెస్ నారాయణ ప్రసంగాన్ని మక్కికి మక్కీగా ధర్మవరపు అనువదించడం ఎవ్వరూ మరిచిపోలేరు. ‘ది హోల్ కాలేజ్’.. అని ఎమ్మెస్ అంటే, ‘కాలేజీలో బొక్క పడింది’ అంటూ అనువాదం చేస్తాడాయన. పైగా హెయిర్స్టయిల్లో శోభన్‌బాబు రింగు ఒకటి. ఆ పాత్ర గుర్తొస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలు ఆనందంతో విచ్చుకుంటాయి. లెక్చరర్లను కామెడీగా చూపించే ట్రెండ్ ఈ సినిమాతో మరింత ఊపందుకుంది. ధర్మవరపును స్టార్‌ని చేసిన పాత్ర ఇది. 3 ఒక్కడు (2003) కథతో సంబంధం లేకపోయినా... ఒక్క సీన్లో అలా కనిపించి, ఏళ్ల తరబడి గుర్తిండిపోయేంత అభినయాన్ని పలికించడమంటే సాధారణమైన విషయం కాదు. ‘ఒక్కడు’లో ధర్మవరపు చేసిన ఫీట్ అదే. ఇందులో పాస్‌పోర్ట్ ఆఫీసర్‌గా కనిపిస్తారాయన. ‘9 8 4 8 0... 3 2 9 1 9...’ అంటూ... తనదైన శైలిలో... ఆన్లైన్లో ఉన్న తన ప్రేయసికి రొమాంటిగ్గా ఆయన నంబర్ చెప్పే తీరు ప్రేక్షకులకు అలా గుర్తుండిపోతుంది. 4 అమ్మ - నాన్న - ఓ తమిళమ్మాయి (2003) ‘ఏమిరా బాలరాజు.. ఏమిరా లాభం మీ వల్ల.. ఏమైనా పని చేసుకోరా బేవకూఫ్..’ ఈ డైలాగ్ వినగానే ‘అమ్మ నాన్న - ఓ తమిళమ్మాయి’ చిత్రంలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తొస్తారు. కాదంబరి కిరణ్‌కు బ్రెయిన్ వాష్ చేసే ఆ సన్నివేశం కామెడీ ప్రియులకు నిజంగా విందుభోజనమే. ఇందులో నాట్యాచార్యుడైన తమిళియన్ పాత్ర ఆయనది. ఈ సినిమాపై ఆయనపై ఎక్కువ సన్నివేశాలు లేకపోయినా... సినిమా ఆద్యంతం గుర్తుండిపోతుంది ధర్మవరపు పాత్ర. 5లీలామహల్ సెంటర్ (2004) థియేటర్లో ఏ సినిమా విడుదలైతే, ఆ గెటప్‌లో కనిపిస్తూ.... ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్‌కీ లేని మేనరిజంతో ఈ చిత్రంలో ధర్మవరపు రెచ్చిపోతారు. ‘మా బాబే కనుక సినిమా హీరో అయితే... ఈ పాటికి ఇండస్ట్రీ మొత్తం చేత ‘బాబూ బాబూ..’ అని పిలిపించుకునేవాణ్ణి...’ అంటూ ఇండస్ట్రీపై తనదైన శైలిలో సెటైర్ వేస్తారు. ‘లీలామహల్ సెంటర్’లో ఆయన పాత్ర చూసి నవ్వని వారుండటంటే అతి శయోక్తి కాదు. ధర్మవరపు పోషించిన పాత్రల్లో అదుర్స్ అనిపించినవి... ఇవి మచ్చుకు మాత్రమే. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. భౌతికంగా మాత్రమే ఈ రోజు ఆయన మన మధ్య లేరు. నటునిగా మాత్రం ఎప్పుడూ ధర్మవరపు మనతోనే ఉంటారు. పాత్రల రూపంలో తరచూ మనల్ని పలకరిస్తూనే ఉంటారు. పగలబడి నవ్విస్తూనే ఉంటారు. -
ఏమి తొందరొచ్చింది శోభమ్మా... వెళ్లిపోయావు?!
మరచిపోలేనంతగా మరదలిని ప్రేమించిన బావ అతను... బావను అపురూపంగా ఆరాధించిన మరదలు ఆమె... ఇంటికి చిన్నవాళ్లైనా, బాధ్యతల బరువుతో పిన్నవయసులోనే పెద్దరికాన్ని భుజాన వేసుకున్న భార్యాభర్తలు వారు... రాజకీయాల్లోనూ ఒకే మాటగా ఎదిగి, పార్టీలకతీతంగా ప్రజల్లో సంపాదించుకున్న ప్రేమమూర్తులు వారు... శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి దంపతులను రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు ‘కలకాలం హాయిగా కలిసున్నార’న్న కమ్మని కథకు కళ్లెదుటి సాక్ష్యం వారే అనిపించారు. కానీ, ... కాలానికి కన్ను కుట్టింది. ‘ఏ జన్మ లోనూ విడిపోము... మనము’ అని పెళ్లినాట ప్రమాణం చేసుకున్న... భూమా జంటను విధి విడదీసింది. నిన్నటి దాకా జనమే జగమై ఆప్యాయంగా పలకరించిన... ఆ చీరకట్టు చిరునవ్వు మోము ‘శోభమ్మ’ ఇవాళ కనిపించని తీరాలకు తరలిపోయింది. నమ్మశక్యం కాని ఈ నిజాన్ని సహిస్తూ, భరిస్తూ... అందరి వారైన ఆ దంపతులు ఏడాది క్రితం పంచుకున్న తమ అనురాగ క్షణాలను మరోసారి ప్రచురిస్తున్నాం. వారి అనుబంధానికి ఈ కథనాన్ని అంకితమిస్తున్నాం. ‘ఏవేవో పనుల కోసం వి.ఐ.పి లెటర్ ఇవ్వమని విజిటర్స్ వస్తూ ఉంటారు. వారు తెలివిగా మాకు తెలియకుండా ఇద్దరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుంటారు. ఆ లెటర్లు ఆఫీసర్ల దగ్గరకు వెళ్లాక, వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వచ్చి ‘ఎవరిది ఓకే చేయమంటారు’ అని ఫోన్ చేస్తే ‘ఆవిడిచ్చిన లెటర్‌కే ఓకే’ చేయండని చెబుతాను’ అని భూమా నాగిరెడ్డి అంటే- ‘ఆయన ఇచ్చిన లెటర్‌కే ఓకే చే యండని నేను చెబుతాను’ అన్నారు శోభా నాగిరెడ్డి. హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో రెండేళ్ళ క్రితం కలిసినప్పుడు ఈ దంపతులు చెప్పిన ఈ ఒక్క మాట చాలు - వారి దాంపత్యజీవితం ఎంత బలమైనదో చెప్పడానికి. నాగిరెడ్డి జన్మస్థలం కొత్తపల్లె, శోభారాణి పుట్టిన ఊరు ఆళ్లగడ్డ. నాగిరెడ్డి మేనత్తే శోభారెడ్డి తల్లి. ఆ విధంగా వీరి బంధానికి బంధుత్వం బలం చేకూర్చింది. నాగిరెడ్డి మాట్లాడుతూ ‘‘చెన్నైలో హోమియోపతి చదివాను. తమ్ముడి కొడుకునని నన్ను మా మేనత్త అచ్చం తల్లిలా ఆప్యాయంగా చూసేవారు. పాఠశాల స్థాయి నుంచీ సెలవులొస్తే చాలు వీరింటికే వెళ్లేవాడిని. అలా చిన్నప్పటి నుంచీ ఒకే ఇంట్లో ఉన్నట్టు పెరిగాం’’ అన్నారు. శోభ అందుకుంటూ, ‘‘మా పెద్దవాళ్లకు కూడా మా పెళ్లి చేయాలనే ఆలోచ న ఉండేది’’ అని నవ్వుతూ వివరించారు. ఫ్యాక్షన్ వెర్సెస్ ప్రేమ సినిమాల్లో చూపినట్టు ప్రేమికులకు తమ ప్రేమ సత్తా ఏంటో నిరూపించుకోవడానికి ఓ పెద్ద పరీక్ష ఎదురవుతూ ఉంటుంది. వీరి ప్రేమకూ ఓ పెద్ద పరీక్ష ఎదురైంది. అది ఫ్యాక్షన్. ‘‘మా రెండు కుటుంబాల బంధం బలపడటానికి నన్ను తన కోడలిని చేసుకోవాలని మామకు ఉండేది. అయితే ఫ్యాక్షన్ కారణంగానే మామ చనిపోవడంతో ఫ్యాక్షన్ అంటే ఏ మాత్రం నచ్చని మా నాన్న నన్ను వీరింటికి కోడలిగా పంపడానికి ఇష్టపడలేదు’’ అని ఆ రోజుల్ని శోభ గుర్తుచేసుకున్నారు. ఇంట్లో వేరే సంబంధాలు చూస్తుం డడంతో భయం పట్టుకున్న ఈ ప్రేమికులు 1986 మే 25న ఇంట్లో వాళ్లకు చెప్పకుండా కొంతమంది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చారు. ‘‘మా నాన్నగారు ఏమీ అనలేదు కానీ ఏడాది పాటు మాట్లాడలేదు’’ అన్నారు శోభ. శ్రీమతి మాటలకు బ్రేక్ వేస్తూ ‘‘ఇప్పుడు మాత్రం మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు’’ - నవ్వుతూ అన్నారు నాగిరెడ్డి. చిన్నతనంలోనే పెద్ద బాధ్యత ఫ్యాక్షన్ గొడవల్లో అన్నలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తర్వాత కుటుంబాన్నీ, వర్గాన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీద పడటం ఉక్కిరిబిక్కిరి చేసిందని ఉద్వేగంతో చెప్పారు నాగిరెడ్డి. ‘‘నేను, శోభ - ఇద్దరం కుటుంబానికి చిన్నవాళ్లమే. కానీ అనుకోకుండా పెద్దవాళ్లమై బాధ్యతలను మోయాల్సి వచ్చింది. కుటుంబంలో పూటకు యాభైకి తక్కువ కాకుండా కంచాలు లేచేవి. మా అన్నపిల్లలు మరీ పసివాళ్లు. వారినీ శోభే సాకింది. కార్యకర్తలు మా కోసం ప్రాణాలు అడ్డుపెట్టేవారు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా నేను వెనుకాడేవాణ్ణి కాదు. ఇంటి నుంచి బయటకు వెళ్లానంటే మళ్లీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే ఈ రోజుకు సేఫ్ అనుకునేవాళ్లం. అలాంటి విపత్కర స్థితిలోనూ శోభ బ్యాలెన్స్డ్గా ప్రవర్తించేది. బయట చికాకులెన్నో ఇంటికీ తేక తప్పేది కాదు నాకు. అన్నీ తట్టుకుంటూనే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకునేది. శోభను అర్ధాంగిగా చేసుకోవడం వల్లే, బాధ్యతలన్నీ సవ్యంగా పూర్తి చేయగలిగా’’ అంటూ శ్రీమతి తనకు దన్నుగా నిలిచిన తీరును వివరించారు నాగిరెడ్డి. ‘‘ముందు నుంచీ కుటుంబ పరిస్థితులు తెలియడం ఒక కారణమైతే, ఈయన నాకు అన్నింట్లో స్వేచ్ఛ, సపోర్ట్ ఇవ్వ డంతో ఇవన్నీ సాధ్యమయ్యాయి’’ అని శోభ చెప్పారు. రాజకీయాల్లో సగభాగం ఉమ్మడి కుటుంబ బాధ్యతను మోస్తూ రాజకీయాల్లోకి వచ్చిన శోభ, ‘‘రాజకీయాల్లోకి రావడం మొదట నాకు ఇష్టం లేదు. పిల్లలు, వారి చదువులు, పెళ్లిళ్లు... (ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. నాగిరెడ్డి అన్నల పిల్లలూ వీరితోనే కలిసి పెరిగారు) ఇలా బాధ్యతలు చాలా ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలు అంటే మాటలా? నేను రాలేనని చెప్పాను’’ అని అప్పటి సంగతులు వివరించారు. దానికి, నాగిరెడ్డి అందుకొని, ‘‘నేను ఎం.పీగా ఎన్నికైన తర్వాత ఎం.ఎల్.ఎ సీటు ఖాళీ అయింది. ‘ఆ స్థానంలో ఎవరిని పెట్టినా, డమ్మీగా నిలబెట్టారని ప్రజలనుకుంటారు. పార్టీ కోసం ఈ నిర్ణయం తప్పదు‘ అనడంతో కాదనలేక శోభ ఒప్పుకుంది. అప్పటికీ చాలామంది ఆమె డమ్మీ క్యాండిడేట్ అని అనుకున్నారు. కానీ బెస్ట్ క్యాండిడేట్ అని తర్వాత అందరికీ అర్థమయ్యేలా చేసింది’’ అన్నారు. ‘‘రాజకీయాల్లో తను ఫెయిర్’’ అని శ్రీమతికి కితాబిచ్చారు నాగిరెడ్డి. ఆ మాటలకు శోభారెడ్డి స్పందిస్తూ - ‘‘రాజకీయాల్లోకి రావడానికి ముందు ప్రజలతో మాట్లాడాలన్నా, మీటింగ్లన్నా చాలా ఇబ్బంది పడేదాన్ని. ఈయన బలవంతం మీద అవన్నీ నేర్చుకోగలిగా. ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక్కదాన్నే వెళ్లగలుగుతున్నా. నియోజకవర్గ ప్రజల అవసరాల కోసం పోరాడగలుగుతున్నా. ఏది జరిగినా నా వెనక ఈయన ఉన్నారు అనే ధైర్యమే నాకు భరోసా!’’ అన్నారు. ‘‘ఆయన కన్నా మంచి పేరు తెచ్చుకోవాలి’’ అనుకున్న శోభ తన ‘‘నియోజకవర్గం కోసం మొండిగా చేసే పనులు’’ నాగిరెడ్డికీ నచ్చాయి. ‘‘వచ్చిన ప్రతీ సినిమా చూస్తాం. వీలు దొరికితే విహారయాత్రలకు వెళ్లేవాళ్లం’’ అన్న ఈ దంపతులు - కుటుంబం, రాజకీయం... ఇలా ఎన్ని బాధ్యతలున్నా తమ ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో వ్యక్తిగతంగా మిస్ అయ్యామని ఎప్పుడూ అనిపించలేదన్నారు. కానీ, ఇవాళ శోభమ్మ లేని లోటు నాగిరెడ్డికీ, ఆయన కుటుంబానికీ ఉంటుంది. ‘‘రాజకీయాల్లో శోభ బిజీ అవడంతో ఆమె చేతి వంటను మిస్ అవుతున్నా’’ అన్న నాగిరెడ్డికి ఇవాళ ఆమె ప్రేమస్మృతులే కడుపు నింపాలి. జనానికి మంచి చేయాలని తపించిన శోభ లేకపోవడం ఆమె అభిమానించే - ఆమెను అభిమానించే సామాన్య ప్రజలందరికీ లోటే! కన్నవారికీ, కట్టుకున్నవాడికీ, కోట్లాది ప్రజలకూ తీరని దుఃఖం మిగిల్చి... ఏమి తొందరొచ్చిందమ్మా వెళ్లిపోయావు శోభమ్మా! -
ఆ మధుర క్షణాలను మరువలేను: రమ్య
గోపాలపురలోని తన తాత ఇంటిని సందర్శించిన రమ్య మండ్య, న్యూస్‌లైన్ : గోపాలపురలోని తాతగారి ఇంటిలో చిన్నప్పుడు గడిపిన క్షణాలను ఎన్నటికీ మరువలేనని, ఇక్కడి ప్రజల ఆప్యాయత తనను ముగ్ధురాలిని చేసిందని మండ్య లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రమ్య పేర్కొన్నారు. మండ్యలో గురువారం నిర్వహించిన రోడ్‌షోకు ముందు ఆమె గోపాలపురానికి వెళ్లి తాత జీఎస్ బోరేగౌడ ఇంటిని సందర్శించారు. బోరేగౌడ ఫొటోకు నమస్కారం చేసి బోరేగౌడ సోదరుడు జీఎస్.వెంకటేష్, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారు ఇచ్చిన అల్పాహారాన్ని స్వీకరించి చిన్నప్పుడు తాను గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టిన తర్వాత ఐదేళ్ల వరకు తరచూ గ్రామానికి వచ్చి వెళ్ళదానినని పేర్కొంది. తాత ఇచ్చిన చెరుకుగడలను తిని ఆ రుచిని ఆస్వాదించడం ఇప్పటికీ గుర్తుందని పేర్కొంది. ఇక్కడ తిరిగిన అన్ని స్థలాలు ఇప్పటికి గుర్తుకున్నాయన్నారు. తనకు ఇంతమంది బంధువులు, శ్రేయోభిలాషులున్నారని తెలియలేదని పేర్కొంది. వీరు చూపిన ప్రేమ, అప్యాయతను ఎన్నటికీ మరువలేనని పేర్కొంది. అనంతరం ఆమె బయల్దేరుతుండగా తరలివచ్చిన గ్రామస్తులు ఆమెతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తావని ఆశీర్వదించారు. రమ్య వారందరికీ చేతులు జోడించి నమస్కారం చేసి కార్యకర్తలతో కలిసి వెళ్లిపోయారు. -
ఉదయ్ కిరణ్ స్వీట్ మెమోరీస్
-
రెండు భాగాలుగా స్వీట్ మెమరీస్
ఎన్టీఆర్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చానని, రామానాయుణ్ణి ఆదర్శంగా తీసుకుని, సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టానని కేజీయస్ అర్జున్ అన్నారు. గత పదేళ్లుగా పలు చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ఆయన ఈ ఏడాది నిర్మాతగా మారుతున్నారు. అంజనీ ప్రొడక్షన్స్ పతాకంపై మూడు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం గోవర్ధన్ దర్శకత్వంలో ‘స్వీట్ మెమరీస్’ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసి, ఒకేసారి విడుదల చేయబోతున్నాం. సునీల్ అనే కొత్త దర్శకుడితో ఓ భారీ చిత్రం నిర్మించనున్నాను. ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో జగపతిబాబు, జేడీ చక్రవర్తి, అమలాపాల్ నటిస్తారు. ప్రియాంకచోప్రాతో ఓ హిందీ సినిమా ప్లాన్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
అంతటా సమ్క్రాంతే...!
కోటవురట్ల: సంక్రాంతి వస్తే....హరిదాసుల గజ్జెల సవ్వడి, గంగిరెద్దుల ఊరేగింపుతో డమరకనాదం, పిండి వంటల హడావిడి...జంగమయ్యలు, కొమ్మదాసరులు...పగటి వేషాలు...ఇదీ పెద్ద పండగ విశేషాలు... పూర్వం రోజుల్లో సంక్రాంతి పండుగ నెలరోజులు ఉందనగా హరిదాసులు ఇంటింటికి తిరిగేవారు. వినసొంపైన కీర్తనలు చెవిన పడగానే ఎంతో హాయిగా ఏదో తెలియని మధురానిభూతి కలిగేది. హరిదాసు రాని రోజు ఉండేదికాదు. హరిదాసు కీర్తనలు, గజ్జెల సప్పుడు అల్లంత దూరం నుంచి వినపడగానే ఇంట్లో మహిళలు బియ్యం, పప్పు దినుసులను పల్లెంలో సిద్ధం చేసేవారు. ఇపుడా సందడి ఏది? హరిదాసులు కనుమరుగవుతున్నారు. ఆ వృత్తి నుండి బయట పడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక గంగిరెద్దులను అందంగా అలంకరించి వాటికి కొన్ని అంశాలపై శిక్షణ ఇచ్చి విన్యాసాలు చేయించేవారు. నాలుగు రోడ్డుల కూడలిలో గంగిరెద్దులతో విన్యాసాలు చేయిస్తూ ఆకట్టుకునేవారు. అయ్యగారికి దండం పెట్టు..అమ్మగారికీ దండం పెట్టు...! అంటూ గంగిరెద్దులతో విన్యాసాలు చేయించేవారు. గుమిగూడిన జనంతో ఆ ప్రాంతం కరతాళ ద్వనులతో మార్మోగేది. ఆ తర్వాత ఇంటింటికి తిరిగి గుమ్మం ముందర సన్నాయి రాగంతో కుటుంబ సభ్యులను పొగడ్తలతో ముంచెత్తేవారు. అష్టైశ్వర్యాలు, పాడి సంపదతో వర్ధిల్లాలని దీవించేవారు. ఇదంతా ఒకనాటి మాట. ఆధునిక పోకడలతో పల్లెల్లోనూ సంక్రాంతి కళ తప్పింది. గ్రామీణ కళలకు ఆదరణ లేక సంప్రదాయ కళాకారులు కనుమరుగవుతున్నారు. ఇక పట్టణాల్లో కృత్రిమ సంబరాలతో సరిపుచ్చుకుంటున్నారు. పల్లె వాతావరణం నిండుతనాన్ని కోల్పోయింది. ఏదో వెలితితో సంక్రాంతి పండగ గడచిపోతోంది. -
తీపి జ్ఞాపకాలతో వెళ్లండి
=కేయూలో పెర్ఫార్మెన్స ఆర్ట్స్ విభాగం ఏర్పాటుకు యోచన =చిల్డ్రన్స్ ఫెస్టివల్ నిర్వహణకు కృషి =కేజీ నుంచి పీజీ వరకు క్యాంపస్‌లో ఉండాలి =యువజనోత్సవాల ముగింపుసభలో =కేయూ వీసీ ప్రొఫెసర్ వెంకటరత్నం కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీలో ఐదు రోజులుగా జరుగుతున్న కళారత్న-2013, 29వ సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యువజనోత్సవ పోటీలల్లో భాగస్వాములైన విద్యార్థులు స్వీట్ మెమొరీస్‌తో వెళ్లాలని కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. యువజనోత్సవాల్లో భాగంగా నాలుగు రోజులపాటు పోటీలు జరగ్గా ఐదోరోజు శుక్రవారం క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియంలో ముగింపు సభ, బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ వెంకటరత్నం మాట్లాడుతూ కాకతీయుల కళావారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నాటి పేరిణి నృత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. కేయూ ఆవిర్భవించి 37ఏళ్లు గడుస్తున్నా మ్యూజిక్, డ్యాన్స్‌కు సంబంధించిన కోర్సులు లేకపోవడంతో ఆ రంగాల్లో విద్యార్థులు వెనకబడుతున్నారన్నారు. త్వరలో క్యాంపస్‌లో పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. వీసీగా తాను ఈ రెండేళ్లలో పలుకొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. పీజీ మహిళా కళాశాల, మహిళా ఇంజినీరింగ్ కళాశాల, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి ప్రాంతాల్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అలాగే చిల్డ్రన్స్ ఫెస్టివల్స్ నిర్వహిం చాలనే యోచన ఉందన్నారు. క్యాంపస్‌లో కేజీ నుంచి పీజీ వరకు కోర్సులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. 25, 26,27 తేదీల్లో న్యాక్ బృందం యూనివర్సిటీ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో పర్యటించనుందని, మళ్లీ న్యాక్ ఏ-గ్రేడ్ తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. యువజనోత్సవాలను విజ యవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ వీసీ అక్బర్ అలీఖాన్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అకడమిక్ పరంగా కెరీర్‌ను అభివృద్ధి పరుచుకుంటూనే స్పోర్ట్స్, కల్చరల్, మ్యూజిక్, డ్యాన్స్ రంగాల్లోనూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. యువజనోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన యూనివర్సిటీ అధికారులును అభినందించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్( ఏఐయూ) అబ్జర్వర్ పారి పరమేశ్వరన్ మాట్లాడుతూ యువతకు సాధ్యం కానిది ఏమీలేదని, యువత పోరాటాల్లో భాగస్వాములై ‘తెలంగాణ’ ను కూడా సాధించుకున్నారన్నారు. డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు మాట్లాడుతూ ప్రపంచంలో ఏదేశం లో లేనివిధంగా భారతదేశంలో యువశక్తి ఉందని,దేశ భవిష్యత్తు వారిపైనే ఆధారపడి ఉందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సాయిలు మాట్లాడుతూ 21 రాష్ట్రాల నుంచి 800 మందికిపైగా విద్యార్థులు 25 ఈవెంట్లలో భాగస్వాములయ్యారన్నారు. వీరికి ఇబ్బందులు కలగకుండా 18కమిటీలతో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. సభలో కేయూ యువజనోత్సవాల కల్చరల్ కోఆర్డినేటర్ జి.దామోదర్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్లు కె. దామోదర్‌రావు, గోపీనాథ్కృష్ణ, గిరీశం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధికారాణి పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కిషన్ కొద్దిసేపు మాత్రమే ఉండి వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఉర్రూతలూగించిన నృత్య ప్రదర్శన ముగింపు సభ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గ్రూప్సాంగ్స్, గిరిజన, జానపద నృత్యాలతో ఆడిటోరియం దద్దరిల్లింది. కేరింతలు, చప్పట్లతో విద్యార్థులు ఉత్సాహంగా చిందేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, కల్చరల్ కోఆర్డినేటర్ ఉమేష్ ఓ హిందీ పాట పాడి విద్యార్థులను ఉర్రూతలూగించారు. కేయూకు బహుమతులు యువజనోత్సవాలలో హోస్ట్ యూనివర్సిటీగా ఉన్న కేయూ విద్యార్థులు వివిధ ఈవెంట్లలో భాగస్వామలు కాగా మూడింటిలో మాత్రమే బహుమతులు సాధిం చారు. క్లాసికల్ డ్యాన్స్‌లో ద్వితీయ బహుమతి, మిమిక్రీ, ఫోక్ ఆర్కెస్ట్రాలో తృతీయ బహుమతి అందుకున్నారు. రాష్ట్రసంత్ తుకదోజీ మహారాజ నాగపూర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర అండ్ ఇందిరా కళాసంగ్ విశ్వవిద్యాలయం ఖారీఘర్(చత్తీస్‌గఢ్) ఎక్కువ బహుమతులు సాధించి ఓవరాల్ చాంపియన్లుగా నిలిచాయి. రన్నరప్‌గా మహారాష్ట్రలోని సంత్గాడ్జి బాబా అమరావతి యూనివర్సిటీ విద్యార్థులు నిలిచారు. కేయూ వీసీ వెంకటరత్నం, తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు విజేతలకు బహుమతులు అందజేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హర్యానాలోని కురుక్షేత్రలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో విజేతలు పాల్గొంటారు.