విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు
నేనేమన్నా రాక్షసుడినా అన్నారు
– కౌసల్య
‘‘నా కెరీర్‌లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్‌లో జోకులు వేస్తే షూటింగ్‌లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా.
నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్‌లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు.
చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు.
ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు.
మా కోసం వంట చేశాడు
– కేజే ఏసుదాస్
‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్‌కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్.
పెద్ద లోయలో పడినట్లనిపించింది
– పి. సుశీల
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు.
ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు.
ఆయన నాకు తండ్రిలాంటివారు
– ఉష
‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు.
నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష.
ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే
– ఏఆర్ రెహమాన్
‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు.
‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం.
నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్.
Comments
Please login to add a commentAdd a comment