KJ Yesudas
-
"కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం!"
కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో టీఎం కృష్ణగా పేరు తెచ్చుకున్న తోడూరు మాడభూషి కృష్ణ చుట్టూ వివాదాలు ఎగసిపడుతున్నాయి. సంగీతంలో 'నోబెల్ ప్రైజ్' స్థాయిలో అభివర్ణించే మద్రాస్ మ్యూజిక్ అకాడమీవారి 'సంగీత కళానిధి' పురస్కారం-2024 టీఎం కృష్ణకు ప్రదానం చేయబోతున్నామని ఈ నెల 18వ తేదీన అకాడమీ ప్రకటించింది. అప్పటి నుంచి సంప్రదాయ సంగీత వాదుల నుంచి నిరసనల గళం పెద్దఎత్తున వినపడుతోంది. ఇది ప్రస్తుతం సంగీత ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీఎం కృష్ణను సమర్థిస్తూ కూడా కొన్ని వర్గాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు మద్దతు పలికేవారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వున్నారు. ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాలను బలపరిచేవారు, సనాతన సంప్రదాయం పట్ల గౌరవంలేనివారు, నాస్తికులు అందులో వున్నారు. టీఎం కృష్ణకు సంగీత కళానిధి పురస్కార ప్రకటనను నిరసిస్తూ, గతంలో ఈ పురస్కారాన్ని తీసుకున్న కొందరు వెనక్కు ఇచ్చేస్తున్నారు. చాలామంది కళాకారులు ఇక నుంచి మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో పాడబోమని, సంగీత కచేరీలు చేయబోమని తమ నిరసనను చాటుకుంటున్నారు. ఒక ప్రఖ్యాత ఇంగ్లీష్ పత్రిక అధినేతలలో ఒకరైన ఎన్.మురళి ప్రస్తుతం మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి అధ్యక్షులుగా వున్నారు. టీఎం కృష్ణను ఈ పురస్కారానికి ఎంపిక చేయడంలో మురళి పాత్ర ప్రధానంగా వున్నదని సంగీత సమాజంలో గట్టిగా వినపడుతోంది. ఈ వివాదం ఇంతటితో ముగిసేట్టు లేదు. రకరకాల రూపం తీసుకుంటోంది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ చరిత్రలో ఇంతటి వివాదం గతంలో ఎన్నడూ చెలరేగలేదు. టీఎం కృష్ణకు ఒక వర్గం మీడియా మద్దతు, సహకారం కూడా బాగా వున్నాయని అనుకుంటున్నారు. ఈయన ప్రస్థానాన్ని గమనిస్తే.. మొదటి నుంచీ వివాదాస్పద వ్యక్తిగానే ప్రచారం వుంది. వేదికలపైన పాడేటప్పుడే కాక, వివిధ సందర్భాల్లోనూ ఆయన చేసే విన్యాసాలు, హావభావాలపై చాలా విమర్శలు వచ్చాయి. అట్లే, ఆయనను మెచ్చుకొనే బృందాలు కూడా వున్నాయి. సంప్రదాయవాదులు ఎవ్వరూ ఇతని తీరును ఇష్టపడరు. ఈ క్రమంలో రేపు డిసెంబర్ లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికలో జరగబోయే ప్రతిష్ఠాత్మకమైన వేడుకలకు చాలామంది దూరంగా జరుగుతారని అనిపిస్తోంది. ప్రసిద్ధ జంట కళాకారిణులు రంజని - గాయత్రి పెద్ద ప్రకటన కూడా చేశారు. హరికథా విద్వాంసులు దుష్యంతి శ్రీథర్, విశాఖ హరి వంటీఎందరో నిరసన స్వరాన్నే అందుకున్నారు. తెలుగునాట కూడా అవే ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. 1976లో తమిళనాడులో బ్రాహ్మణ కుటుంబంలో, శాస్త్రీయ సంగీత కుటుంబంలో జన్మించిన కృష్ణ మొదటి నుంచీ కొత్త గొంతును వినిపిస్తున్నారు. బ్రాహ్మణత్వంపైన, కర్ణాటక సంగీత ప్రపంచంలో బ్రాహ్మణుల పెత్తనం పెరిగిపోతోందంటూ కృష్ణ నినదిస్తున్నారు. సమాజంలో, సంగీత సమాజంలో ఎన్నో సంస్కరణలు రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని మాట్లాడుతున్నారు. తాను గురుశిష్య పరంపరలోనే సంగీతం నేర్చుకున్నప్పటికీ దాని పైన తన దృక్పథం వేరని చెబుతున్నారు. చెంబై విద్యనాథ భాగవతార్ - కె జె ఏసుదాసు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు - అన్నవరపు రామస్వామి వంటివారి గురుశిష్య బంధాలు ఆయనకు ఏ విధంగా అర్ధమవుతున్నాయో? అనే ప్రశ్నలు వస్తున్నాయి. త్యాగయ్య మొదలు మహా వాగ్గేయకారులందరిపైనా ఆయన వివిధ సమయాల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. ఎం.ఎస్ సుబ్బలక్ష్మి దేవదాసి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ బ్రాహ్మణత్వంతోనే ప్రవర్తించారని, అదే పద్ధతిని అనుసరించి పాడుతూ పెద్దపేరు తెచ్చుకున్నారని, ఆ కీర్తి కోసమే ఆమె ఆలా చేశారని గతంలో కృష్ణ చేసిన విమర్శలు పెద్ద దుమారం రేపాయి. బ్రాహ్మణత్వాన్ని పులుముకోకపోతే ఈ శాస్త్రీయ సంగీత రంగంలో ఇమడలేరని, రాణించలేరని, అందుకే సుబ్బలక్ష్మికి కూడా అలా ఉండక తప్పలేదని కృష్ణ బాధామయ కవి హృదయం. కులాన్ని బద్దలు కొట్టాలని, కళలు, సంగీతం అందరికీ అందాలని, అది జరగడంలేదని వాదిస్తూ, సముద్ర తీరాలలో, మత్స్యకార వాడల్లో, వివిధ సమాజాల్లో కచేరీలు, సంగీత ఉత్సవాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. పర్యావరణ విధ్వంసంపైన, బీజేపీ ప్రభుత్వ విధానాలపైన, వివిధ ఉద్యమ వేదికల ద్వారా తన వ్యతిరేకతను చాటుకుంటూ వస్తున్నారు. కర్ణాటక సంగీతాన్ని గ్రామీణ ప్రాంతాలకు, వెనుకబడిన వర్గాల దగ్గరకు తీసుకెళ్లాలంటూ చేసిన ప్రదర్శనలు మీడియాను కూడ బాగా ఆకర్షించాయి. ఈ నేపథ్యంతో 2016లో ప్రతిష్ఠాత్మక 'రామన్ మెగసెసే అవార్డు' కూడా అందుకున్నారు. తమిళ భాషను, యాసను ప్రచారం చేసే క్రమంలో కృష్ణ తెలుగును చిన్నచూపు చూస్తూ వస్తున్నారు. త్యాగయ్య కీర్తనలు ఈనాటికి పనికిరావని, ఆ సాహిత్యం మూఢమైనదనే భావనలను కూడా ప్రచారం చేశారు. మహా వాగ్గేయకారులు రచించిన కీర్తనలను సాహిత్యానికి, భావానికి, భాషకు సంబంధం లేకుండా నడ్డివిరచి పాడుతూ మహనీయులను హేళన చేస్తున్నాడని, తెలుగు భాషను అవమానపరుస్తున్నాడనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇతను కేవలం సంగీత విద్వాంసుడుగానే కాక, ఉద్యమకారుడుగానూ ప్రచారంలోకి వచ్చాడు. ఈ.వి రామస్వామి పెరియార్ భావాలను అనుసరిస్తూ, గీతాలను సృష్టిస్తూ, గానం చేస్తూ, ప్రచారం చేస్తూ వున్నారు. ఇస్లాం, క్రిస్టియన్ పాటలు కూడా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో స్వరపరచి ఎందుకు పాడకూడదు? అన్నది అతి వాదన. బ్రాహ్మణులు, దైవం, హిందూమతం, కాంగ్రెస్, మహాత్మాగాంధీని పెరియార్ వ్యతిరేకించారు. కృష్ణ కూడా ఇంచుమించు అవే భావనలలో వున్నారు. బీజేపీ, సంఘ్ పరివార్పైన కూడా అనేకసార్లు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈయన ప్రస్తుత పురస్కారం ఎంపిక విధానాన్ని, అర్హతను గమనిస్తే, ఇతని కంటే గొప్పవాళ్ళు, జ్ఞాన, వయో వృద్ధులు ఎందరో వున్నారు. వాళ్లందరినీ కాదంటూ ఈయనకు ఈ పురస్కారం ఇవ్వాల్సినంత శక్తి సామర్ధ్యాలు, అనుభవం ఆయనకు లేవన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. సంప్రదాయ వ్యతిరేకత ముసుగులో, సంస్కరణ మాటున సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా అవమానిస్తున్నాడని సంప్రదాయవాదులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు భాషను ముక్కలు ముక్కలుగా నరికివేస్తున్నాడని తెలుగు భాషాప్రియులెందరో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం పట్ల, వాగ్గేయకార మహనీయుల పట్ల, తెలుగు భాష పట్ల గౌరవం లేనప్పుడు అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాడని అనేకులు మండిపడుతున్నారు. సంగీత కళానిధి పురస్కారం సంగతి అటుంచగా, ఇంతటి విపరీత ధోరణులతో ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూస్తూ ఊరుకోబోమనే మాటలు సనాతన సమాజాల నుంచి వినపడుతున్నాయి. ఈ పురస్కార ప్రకటనను మ్యూజిక్ అకాడమీ విరమించుకుంటుందని చెప్పలేం. ఈ ధోరణులతో నడుస్తున్న కృష్ణ శాస్త్రీయ రాగాలను ఎంచుకోకుండా, తాను కొత్త కొత్త రాగాలను పుట్టించుకొని అందులో పాడుకొమ్మని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సనాతన భారతంలో "కృష్ణ కృష్ణ - ఇదేమి ఘోరం " అని సంప్రదాయ ప్రేమికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికే అనేకమంది అతనిపై న్యాయస్థానాలలో కేసులు కూడా పెడుతున్నారు. ఏమవుతుందో చూద్దాం. - రచయిత, మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
K J Yesudas: స్వరంతో మాయ చేసి ఓలలాడించిన గాన గంధర్వుడు
ఓ పాట విని దేవుడే భక్తి భావంలో మునిగిపోతే.. ఓ పాట విని సకల లోకాలు తన్మయత్వంలో మునిగిపోతే.. ఒకే పాట విని ప్రపంచమంతా మత్తుమందు చల్లినట్లు మైమరచిపోతే.. అది కచ్చితంగా యేసుదాసు పాటే. దక్షిణాదినీ ఉత్తరాదినీ తన స్వరంతో మాయ చేసి ఓలలాడించిన గాన గంధర్వుడు ఏసుదాసు. మనుషులను తన పాటలతో మైమరపించడానికి దేవుడే ఏసుదాసు రూపంలో దివి నుండి భువికి దిగి వచ్చి ఉండచ్చని సంగీతజ్ఞుల అనుమానం. వెన్నెలను తేనెలో ముంచి దానిపై పూల రెక్కలను అద్దినట్లు ఏసుదాసు పాడిన పాటలన్నీ గంధర్వ లోకపు అద్భుతాలే. ఆయన పాటలను ఒక్క ముక్కలో చెప్పాలంటే అవి స్వరరాగ గంగా ప్రవాహం వంటివి. సంగీత ప్రపంచంలో తిరుగులేని గాయకునిగా విరాజిల్లుతున్న ఈ గంధర్వ గాయకుడి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.. ► ఏసుదాసు అనగానే ఎవ్వరికైనా గుర్తుకొచ్చేది అయ్యప్పే. ఏసుదాసు పాటతోనే అయ్యప్ప ఎక్కువ పాపులర్ అయ్యాడంటే అతిశయోక్తి కాదు. అయ్యప్పకూ ఏసుదాసుకూ మధ్య భగవంతునికీ భక్తునికీ మధ్య ఉండే అవినాభావ సంబంధమే ఉంది. ఎంతగా అంటే నిత్యం శబరి మల అయ్యప్ప దేవాలయంలో ఏసుదాసు లాలి పాట పాడిన తర్వాతనే దేవుడు చల్లగా మత్తుగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాతనే దేవాలయం తలుపులు మూసుకుంటాయి. ► కేవలం సంగీతాభిమానులను తన పాటలతో ఆనందింపజేయడానికే ఏసుదాసు భూమ్మీదకు వచ్చి ఉండాలి. పాట తప్పిదే మరో అజెండా లేదు. ఆ పాట కూడా అమృతంలో ముంచి తీసినట్లు తియ్య తియ్యగా వెన్నలతో కలిపినట్లు చల్ల చల్లగా ఉంటుంది. ► మలయాళ సీమలోని కొచ్చిలో పుట్టారు ఏసుదాస్. అగస్టీన్ జోసెఫ్, ఎలిజబెత్ జోసెఫ్ దంపతుల ఏడుగురు సంతానంలో నెంబరు టూ మన జేసుదాస్. ► నాన్న కర్నాటక సంగీతంలో దిట్ట. రంగస్థల కళాకారుడు కూడా.నాన్నను చూసి చిన్నప్పుడే సంగీతంపై మనసు పారేసుకున్నాడు ఏసుదాసు. తండ్రికి మంచి స్నేహితుడైన కుంజన్ వేల్ భాగవతార్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ► ఏసుదాస్ లోని టాలెంట్ ను చూసి గురువులే ఆశ్చర్యపోయేవారట. 1961లో ఏసుదాస్ కెరీర్ లోని మొదటి పాపులర్ సాంగ్ జాతి బేధం మత ద్వేషం అనే పాటతో మెరిసారు. మలయాళంలో సుప్రసిద్ధ కవి నారాయణ గురు రాసిన ఈ పాట ఏసుదాసు పేరును మార్మోగేలా చేసింది. ► మలయాళంలో భార్య అనే సినిమాతో ఏసుదాస్ జైత్రయాత్ర మొదలైంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. చూస్తూ ఉండగానే దక్షిణాది భాషలన్నింటా తనదైన ముద్ర వేసేశాడు. ► మలయాళం, కన్నడం, తమిళంలో సమాంతరంగా సూపర్ సింగర్ గా కొనసాగారు. ఆ క్రమంలోనే తెలుగులోనూ జెండా ఎగరేశారు. ► శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో వచ్చిన సినిమాలైతే జేసుదాస్ తప్ప మరో ఆలోచనే చేసేవారు కారు సంగీత దర్శకులు. ► అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్వరం ఏసుదాస్ సొంతం. ► ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ ఏసుదాస్ స్వరం పాతబడలేదు. మరింత నవ్యత్వాన్ని సంతరించుకుంది. అందరినీ మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ► తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మోహన్ బాబుకు జేసుదాస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. తను నిర్మించిన ప్రతీ సినిమాలోనూ తప్పనిసరిగా ఒక్కటైనా జేసుదాస్ పాట ఉండి తీరాల్సిందే.ఆ పాటలు ఆ సినిమాకే హైలెట్ గా నిలిచాయి ► జేసుదాస్ వంటి గాయకుడు దొరికితే సంగీత దర్శకులకు పండగే. జేసుదాస్ చేత ఎన్నో గొప్ప పాటలు పాడించారు మ్యాస్ట్రో ఇళయరాజా. ► ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ సంచలనం ఏ.ఆర్.రెహ్మాన్ కు జేసుదాస్ అంటే చచ్చేంత భక్తి. తనకు మూడేళ్ల వయసునుండే జేసుదాస్ పాటలను వింటూ ఎదిగానని రెహ్మాన్ చాలా సార్లు చెప్పుకున్నారు. జేసుదాస్ స్వరం వింటే అది కేవలం దేవుడికే సాధ్యమవుతుందని రెహ్మాన్ కొనియాడారు. ► జేసుదాసు అందుకున్న అవార్డులు రివార్డులకు అంతేలేదు. ప్రతీ ప్రాంతీయ భాషలోనూ అవార్డు అందుకున్న జేసును జాతీయ అవార్డులు వచ్చి వరించాయి. -
ఘంటసాల గొప్ప గాయకుడు, మానవతావాది, సంగీత విద్వాంసులు
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 100 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 8 మే 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గొప్ప గాయకుడు, మానవతావాది, కళాకారులు అని చెపుతూ.. మా చిన్ననాటి రోజుల్లో దేవదాసు సినిమా పాటలు విని పెరిగానని, ముఖ్యంగా ఘంటసాల పాడిన శాంతినివాసం సినిమా మలయాళంలో అనువాదం అయినప్పుడు ఆ సినిమాకి ఘంటసాల తెలుగులో పాడిన తెలుగు పాటకు నేను మలయాళంలో పాడటం అది నా కెరీర్ లో రెండవ సినిమా అవడం చాలా అదృష్టమని తెలిపారు.. తన కెరీర్ ప్రారంభంలో ఘంటసాల గారితో కలసి పాడటం అప్పుడు వారి నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకోవడం అది తన అదృష్టం మరియు దైవ సంకల్పం అని చెప్పారు... అలాగే ఘంటసాల తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన అక్కినేని నాగేశ్వర రావు గారి సినిమాలకు కొన్ని పాటలు పాడటం, మేఘసందేశం సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం లభించడం నా అదృష్టమని తెలిపారు. ఘంటసాల గొప్ప గాయకుడు అని చెపుతూ ఈ కాలం గాయకులలో 100 కు 99 మంది వారిని ఆదర్శంగా తీసుకొని గాయకులుగా రాణిస్తారని, ఇదే విషయాన్నీ SPB బాలు ఎప్పుడు చెపుతుండేవారిని ఈ సందర్భంగా బాలుని కూడా నెమరువేసుకున్నారు... వారి ఆలపించిన భగవద్గీత ఇప్పటికి మనందరి మదిలో ఉంటుందని... నేను ఇప్పటికి భగవద్గీతని పూర్తి గా ఆలపించలేపకపోయానని కానీ ఘంటసాల అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగారని తెలిపారు. దక్షిణ భారత గాయకులు అందరికి ఎంత గొప్ప గౌరవం ఉందొ ఉత్తరాది గాయకులు అయిన లతా మంగేష్కర్, మహమ్మద్ రవి వంటి గాయకులు కూడా అంతే గౌరవం ఘంటసాల గారి మీద చూపే వారని తెలుపుతూ రెండు పాటల పల్లవులను పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు... ఘంటసాల భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులు అని తెలియచేస్తూ తన పూర్తి మద్దతుని తెలియచేసారు... చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు.. వారు మాట్లాడుతూ నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. యు.యెస్.ఏ నుండి చైర్మన్, గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యు.యెస్.ఏ ప్రవాసీ భారతీయ సమ్మాన్, సుబాష్ రజ్దాన్ , FACC డైరెక్టర్, GAPI వాలంటీర్ క్లినిక్ డా. శ్రీని గంగసాని M.D, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు వంశి కృష్ణ ఇరువరం, మలేషియా నుండి మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్, సింగపూర్ నుండి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, స్కాట్లాండ్ నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, UK అధ్యక్షుడు శివ చింపిరి, నైజీరియా నుండి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడు మూగలమర్రి లోకనాథరెడ్డి, స్విట్జర్లాండ్ నుండి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గని కడలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, పద్మవిభూషణ్ డా కెజే ఏసుదాస్ ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలపడం ఒక గొప్ప శుభపరిణామనని, ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయడానికి తోడ్పాటు అందించిందని తెలియచేస్తూ, ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాల కి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అందరు ముక్త కంఠంతో కోరారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డుతో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 103 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివారాలు మీ అందరికోసం: -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
జేసుదాసు సోదరుడు అనుమానాస్పద మృతి
తిరువనంతపురం : ప్రముఖ గాయకులు కేజే జేసుదాసు (యేసుదాసు) సోదరుడు కేజే జస్టిన్ అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. కేరళలోని కొచ్చిలోని బ్యాక్ వాటర్స్ వద్ద ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కొచ్చిన్ వల్లర్పాడమ్ కంటైనర్ టెర్మినల్ సమీపంలో జస్టిన్ శవం తేలుతూ కనిపించింది. అగస్టీన్ జోసెఫ్, ఎలిజిబెత్ జోసెఫ్ దంపతులకు అయిదుగురు సంతానం. అందులో జేసుదాసు మొదటివాడు. ఆయన సొంత సోదరుడే కేజే జస్టిన్. ఈయన సంగీత కారుడు, నాటక రచయిత. బుధవారం ఉదయం చర్చికి వెళ్లిన జస్టిన్ రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెతకగా ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులను సంప్రదించారు. బుధవారం త్రికక్కర పోలీసులు బ్యాక్ వాటర్స్ నుంచి జస్టిస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా కొడుకు మరణంతో జస్టిన్ కొంతకాలం నుంచి మనో వేదనకు గురవుతునట్లు, అంతేకాకుండా ఆయనకు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆ క్రెడిట్ వాళ్లదే
‘‘నేను అక్షరాల విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను. ఇది నా తల్లి నుంచి నేర్చుకున్నాను. నేను క్రిష్టియన్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ సంస్కృతంలోని అక్షరాలను నేర్చుకోమని ఆమె చెప్పారు. అది ఆమె నాకు అందించిన ఆశీర్వాదం’’ అని ప్రముఖ గాయకులు కె.జె.ఏసుదాస్ అన్నారు. చాలా కాలం తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఈరోజు లైవ్ కాన్సర్ట్ చేస్తున్నారు. ఈ సంగీత విభావరిలో ఏసుదాస్‌తోపాటు గాయకులు విజయ్ ఏసుదాస్, కల్పన కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మా అమ్మ అందించిన మరో ఆశీర్వాదం ఏంటంటే.. నాకు ఐదేళ్లున్నప్పుడు చదువు గురించి ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు. నార్మల్‌గా చదువుకుంటే చాలు. కానీ, కర్నాటిక్ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్రాపర్‌గా నేర్చుకోమని చెప్పారు. నాకు బ్రదర్స్, సిస్టర్ ఉన్నారు. వాళ్లు కూడా బాగా పాడేవారు. కానీ, ఈ విషయంలో నాన్నగారు నన్ను మాత్రమే ప్రోత్సహించారు. గురువు లేకుండా ఎవరూ గొప్పవారు కాలేరు. మనల్ని తీర్చిదిద్దిన గురువులంతా దేవుళ్లతో సమానమని నా నమ్మకం. నేను ఇప్పటివరకు ఏం సాధించినా అదంతా నా తల్లిదండ్రులు, గురువుల వల్లే సాధ్యమైంది. అలాగే నా పాటలు వినేవారు, సంగీత ప్రియుల ప్రార్థనల వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. అంతకుమించి మరేం లేదు. నా బ్రదర్ అలేఖ్య హోమ్స్ శ్రీనాథ్ నన్ను లైవ్ మ్యూజిక్ చెయ్యమని చెప్పారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ చేస్తున్నాను. మా అబ్బాయి విజయ్ వయసు ఇప్పుడు 40. నా వయసు 79. కానీ, నేను ఇప్పటికీ విద్యార్థినే’’ అన్నారు. విజయ్ ఏసుదాస్ మాట్లాడుతూ– ‘‘మొదట్లో నాన్నగారి అడుగుజాడల్లోనే వెళ్లాను. ఆ తర్వాత నా సొంతదారిలోనే వెళ్లాలని డిసైడ్ అయ్యాను. కొన్ని విషయాల్లో ఆయన గైడెన్స్ తీసుకుంటాను. ఇళయరాజాగారితో కలిసి నాన్నగారు చాలా సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు నేను, యువన్‌శంకర్‌రాజా కలిసి పనిచేస్తున్నాం. నేను రెండు సినిమాల్లో నటించాను కూడా. నాన్నగారి బయోపిక్ చేసే ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నాకు అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. కానీ, ఎవరైనా చేస్తే నేను ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు. -
స్వరరాగ గంగా ప్రవాహం
నవంబర్ 11న హైదరాబాద్‌లో స్వరరాగ గంగా ప్రవాహం జరగనుంది. ప్రముఖ గాయకులు కె.జె. ఏసుదాస్ లైవ్‌లో పాడనున్నారు. ఐదు దశాబ్దాలుగా అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వర సాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు ఏసుదాస్. తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. గతంలో మేస్ట్రో ఇళయరాజాతో, హీరోయిన్, భరత నాట్యం కళాకారిణి శోభనతో ప్రోగ్రామ్స్ నిర్వహించిన ‘11.2’ సంస్థ ఏసుదాస్ ప్రోగ్రామ్ని నిర్వహించనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏసుదాస్ లైవ్ కన్సర్ట్ జరగలేదు. తొలిసారి జరగనున్న ఈ కార్యక్రమం పోస్టర్‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.టి.ఆర్ విడుదల చేశారు. -
కేజే యేసుదాస్ కొత్త రికార్డు
-
బాలు రికార్డు బ్రేక్ చేసిన యేసుదాస్
మధుర గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించి.. ‘గానగంధర్వుడి’గా పేరుగాంచిన కేజే యేసుదాస్ కొత్త రికార్డు తన పేర లిఖించుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఆయన ఉత్తమ గాయకుడి అవార్డుకు ఎంపియ్యారు. మలయాళ చిత్రం ‘విశ్వాసపూర్వం మన్సూర్’లోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకుగానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఎనిమిదోసారి అవార్డు పొందడం ద్వారా యేసుదాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. 1940లో ఎర్నాకులంలో జన్మించిన యేసుదాస్.. కుంజన్ వేలు ఆసన్, రామన్‌కుట్టి భాగవతార్ ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. అనతికాలంలోనే గొప్ప గాయకుడిగా పేరు పొందారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ప్రదర్శనలు ఇచ్చిన యేసుదాస్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1961లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన యేసుదాస్.. వివిధ భాషల్లో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన సుమధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ గానగాంధర్వుడు 1972లో మొదటిసారిగా జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందారు. తర్వాత 1973, 76, 82, 87, 91, 93 సంవత్సరాల్లో కూడా అవార్డులు పొందారు. దీంతో ఆరు జాతీయ అవార్డులు పొందిన మరో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డును యేసుదాస్ బ్రేక్ చేసినట్లయింది. అవార్డు వద్దన్నారు.. 23 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ గాయకుడిగా ఎంపికైన యేసుదాస్.. 1987 నుంచి తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా కొత్త గాయకులకు ఈ అవకాశం లభిస్తుందని ఆయన ఉద్దేశం. సంగీత రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. -
కేణిలో ఆ ఇద్దరి పాట.. నిజంగా విశేషమే!
సాక్షి, చెన్నై: గానగంధర్వులు కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కలిసి పాడితే అది నిజంగా విశేషమే అవుతుంది. అలా 25 ఏళ్ల ముందు ఈ గాన తపస్విలు కలిసి ఆలపించారు. ఆ తరువాత సంగీత కచేరిలో ఒకే వేదికపై పాడి ఉండవచ్చుగానీ, సినిమా కోసం కలిసి పాడిన సందర్భం లేదు. అలాంటి అరుదైన సంఘటన కేణి చిత్రం కోసం జరిగింది. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకే పాటను కేజే.ఏసుదాస్, ఎస్పీ.బాలు కలిసి పాడారు. మలయాళ దర్శకుడు నిషాద్ తొలిసారిగా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్న ఇందులో సీనియర్ నటి జయప్రద, సుహాసిని, రేవతి, నటుడు పార్థిబన్, నాజర్, నటి అనుహాసన్, రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రగ్రాంట్ నేచర్ ఫిలిం క్రియేషన్స్ పతాకంపై ఆన్ సజీవ్, సజీవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఒక నక్షత్రహోటల్‌లో జరిగింది. నటి సుహాసిని చిత్ర ఆడియోను ఆవిష్కరించగా నటి జయప్రద, పార్థిబన్ తొలి ప్రతిని అందుకున్నారు. జయప్రద మాట్లాడుతూ.. తమిళంలో వరసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకు ముందు నినైత్తాలే ఇనిక్కుమ్, సలంగై ఒళి, ఏళైజాతి, దశావతారం వంటి చిత్రాల వరుసలో ఇప్పుడు కేణి వంటి మంచి చిత్రాల్లో నటించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను ఇందిర అనే సామాజిక బాధ్యత కలిగిని పాత్రలో నటించానని చెప్పారు. మహిళలు అభివృద్ధి చెందాలని అందరం చెబుతుంటామన్నారు. అయితే అలాంటి సమాజాన్ని స్త్రీలే సాధించుకోవాలని చెప్పే చిత్రంగా కేణి చిత్రం ఉంటుందని తెలిపారు. అదే విధంగా మంచి నీళ్లు అన్నవి తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు సంబంధించిన విషయం కాదన్నారు. నీరు అన్నది ప్రపంచ సమస్య అని, అలాంటి సమస్యను కథలో చేర్చిన దర్శకుడిని అభినందిస్తున్నానన్నారు. తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నా, తమిళంలోనూ నటించాలని కోరుకుంటున్నానని ఆమె అన్నారు. దర్శకుడు నిషాద్ మాట్లాడుతూ.. మలయాళంలో కిణరు తనకు ఏడవ చిత్రం అయినా, తమిళంలో కేణి తొలి చిత్రం అని తెలిపారు. తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం సామాజిక ఇతివృత్తంతో కూడి ఉంటుందన్నారు. నీళ్లు ఈ భూమిపై జీవించే ప్రాణులందరికి చెందుతాయన్నారు. అలాంటిది మానవులు మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటున్నారని అన్నారు. ఎండ, వాన లాంటివి ప్రకృతి ప్రసాదించినవని కరువుకు మాత్రం మనిషే కారణం అవుతున్నాడని అన్నారు. ఈ విషయాలను ఆవిష్కరించే చిత్రంగా కేణి ఉంటుందని దర్శకుడు తెలిపారు. -
ఇరవై ఏళ్ళ తర్వాత... హిందీలో...
ఉత్తమ సినీ నేపథ్య గాయకుడిగా ఇప్పటికి ఏడుసార్లు జాతీయ అవార్డును అందుకున్న ఘనుడు కె.జె. ఏసుదాస్. దాదాపు రెండు దశాబ్దాల విరామం తరువాత ఆయన తాజాగా ఒక హిందీ సినిమా పాట పాడారు. అంతర్జాతీయంగా పేరొచ్చిన తాజా చిత్రం ‘బేర్‌ఫుట్ టు గోవా’లో ఆయన పాడడం వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి దాకా 50 వేలకు పైగా పాటలు పాడిన ఏసుదాస్ తన తొలి చిత్రంలో పాడడంతో, దర్శకుడు ప్రవీణ్ మోర్చాలే ఆనందానికి అంతు లేదు. ఒకే రోజున నాలుగు గంటల్లో 16 పాటలు పాడి, రికార్డు చేసిన అరుదైన రికార్డు ఏసుదాసు సొంతం. అయితే, ఆయన ఈ చిత్రంలోని ‘నైనా దో న్యారే...’ అనే పాటను రికార్డు చేయడానికి నాలుగు గంటల సమయం తీసుకున్నారు. ‘‘ఏసుదాస్ గళంలో ఈ పాట కొత్త అందాలు సంతరించుకుంది’’ అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : భూమికి పచ్చాని రంగేసిన ట్టో అమ్మలాలా పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా వలవలవల ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో అమ్మలాలా పురుగులమందే నీకు పెరుగన్నమాయనో అమ్మలాలా చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥ చరణం : 1 జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా చేలు దున్ని చాళ్లుదీసె బీదబిక్కి జాతరో అమ్మలాలా ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥ చరణం : 2 చెమట జల్లు చిలకరిస్తే నేల పులకించురో అమ్మలాలా వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా తంగెళ్లు గన్నేర్లు పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥ చరణం : 3 ఎగువ పెన్నమ్మమతల్లి ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥ చిత్రం : శ్రీరాములయ్య (1998) రచన : కలెకూరి ప్రసాద్ సంగీతం : వందేమాతరం శ్రీనివాస్ గానం : కె.జె.ఏసుదాస్, బృందం -
గీత స్మరణం
పల్లవి : సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ॥ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో ॥ చరణం : 1 బొట్టుపెట్టి పూజచేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత ॥ విత్తునాటి చెట్టు పెంచితే... చెట్టు పెరిగి పళ్ళు పంచితే... తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది న్యాయమా? (2) ॥ చరణం : 2 ఆకుచాటు పిందె ముద్దు తల్లిచాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు ॥ ఉగ్గుపోసి ఊసు నేర్పితే... చేయిబట్టి నడక నేర్పితే... పరుగు తీసి పారిపోతే చేయిమార్చి చిందులేస్తే లోకమా ఇది న్యాయమా? (2) ॥ చిత్రం : అమ్మరాజీనామా (1991) రచన : దాసరి నారాయణరావు సంగీతం : చక్రవర్తి గానం : కె.జె.ఏసుదాస్ - నిర్వహణ: నాగేశ్