ఇరవై ఏళ్ళ తర్వాత... హిందీలో...
ఉత్తమ సినీ నేపథ్య గాయకుడిగా ఇప్పటికి ఏడుసార్లు జాతీయ అవార్డును అందుకున్న ఘనుడు కె.జె. ఏసుదాస్. దాదాపు రెండు దశాబ్దాల విరామం తరువాత ఆయన తాజాగా ఒక హిందీ సినిమా పాట పాడారు. అంతర్జాతీయంగా పేరొచ్చిన తాజా చిత్రం ‘బేర్‌ఫుట్ టు గోవా’లో ఆయన పాడడం వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటి దాకా 50 వేలకు పైగా పాటలు పాడిన ఏసుదాస్ తన తొలి చిత్రంలో పాడడంతో, దర్శకుడు ప్రవీణ్ మోర్చాలే ఆనందానికి అంతు లేదు.
ఒకే రోజున నాలుగు గంటల్లో 16 పాటలు పాడి, రికార్డు చేసిన అరుదైన రికార్డు ఏసుదాసు సొంతం. అయితే, ఆయన ఈ చిత్రంలోని ‘నైనా దో న్యారే...’ అనే పాటను రికార్డు చేయడానికి నాలుగు గంటల సమయం తీసుకున్నారు. ‘‘ఏసుదాస్ గళంలో ఈ పాట కొత్త అందాలు సంతరించుకుంది’’ అని చిత్ర యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.