చిల్లపల్లికి ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ’గా జాతీయ పురస్కారం
నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం
ఆ ఊరి జనాభా పదకొండు వందలు కూడా ఉండదు. ‘గ్రామాభివృద్ధికి జనాభా కాదు... చైతన్యం ప్రమాణం’ అనుకుంటే చిల్లపల్లి చిన్న ఊరు కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పెద్ద ఊరు. కేంద్ర ప్రభుత్వం ‘దీన్ దీయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్’ పురస్కారాలు ప్రకటించింది. అందులో ‘ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయితీ’ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయితీకి రెండో ర్యాంకు వచ్చింది. నేడు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్ లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముచేతుల మీదుగా చిల్లపల్లి గ్రామపంచాయతీ ఈ అవార్డులను అందుకోనుంది...
చిల్లపల్లి గ్రామంలో 1081 మంది జనాభా ఉండగా, అందులో 508 మంది మహిళలు ఉన్నారు. గ్రామంలో ఉన్న 33 స్వశక్తి సంఘాలలో 335 మంది సభ్యులు ఉన్నారు. వీరందరూ ‘శ్రీజ్యోతి గ్రామ సమైక్య సంఘం’ ఏర్పాటు చేసుకుని రూ.3.35కోట్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. రుణవాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడమే కాకుండా ΄పొదుపు ఖాతాల్లో సైతం డబ్బును జమ చేస్తున్నారు. కిరాణాషాపులు, కుట్టు మిషన్‌లు, కోళ్ల పెంపకం, పాడిగేదెలు, కంగన్ హాల్, చికెన్ షాప్, బ్యూటీపార్లర్, టిఫిన్ సెంటర్‌లు, డ్రాగన్ ప్రూట్స్ తోట, పిండిగిర్ని, కూరగాయల సాగు, విక్రయం, మెడికల్ షాపు, ఐకేపీ సెంటర్ నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం... మొదలైన పనులతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు.
సక్సెస్ మంత్రం ఇదే...
కొన్ని గ్రామాల్లో మహిళ సంఘాలలోని సభ్యులు డబ్బులు ΄పొదుపు చేసి, రుణాలు తీసుకొని బయట అధిక వడ్డీకి ఇవ్వడానికి ఇష్టపడతారు. దీనివల్ల సంఘాలకు, సభ్యులకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించిన చిల్లపల్లి గ్రామ మహిళలు ΄పొదుపు చేసిన డబ్బులతో పాటు, ప్రభుత్వం ఇచ్చే రుణాలను ఉపాధి కల్పన కోసం ఉపయోగిస్తున్నారు. దీనివల్ల తాము ఉపాధి పొందడంతో పాటు ఇతరులకు కూడా ఉపాధి చూపించగలుగుతున్నారు. రుణాలు తీసుకోవడంతో పాటు జీరో బకాయిలతో ముందుకు వెళుతున్నారు.
ఆర్థిక స్వావలంబన నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు చిల్లపల్లి ఆదర్శగ్రామంగా నిలుస్తోంది.‘గ్రామాల్లో ఉండడం దండగ’ అనుకుంటూ ఉపాధి కోసం పట్నం బాట పడుతున్న ఎన్నో కుటుంబాలకు చిల్లపల్లి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. పట్టణంలో బతుకీడుస్తున్న వాళ్లను కూడా ‘నేను నా ఊళ్లో హాయిగా బతక వచ్చు’ అనుకునేలా భరోసా ఇస్తోంది. ఇంతకు మించిన విజయం ఏమిటి!
– గుడ్ల శ్రీనివాస్ సాక్షి, పెద్దపల్లి ఫోటోలు: మర్రి సతీష్‌రెడ్డి
రైతు మిత్రులు
రమాదేవి, సరోజన, సౌజన్య... ముగ్గురు కలిసి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ధాన్యం వచ్చినప్పటి నుంచి తూకం వేసి మిల్లుకు తరలించే వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ప్రతి క్వింటాకు ప్రభుత్వం ఇచ్చే రూ.32 కమీషన్ తో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. రైతులకు చేదోడు వాదోడుగా ఉండడంతో పాటు ఐకేపీ సెంటర్‌ల ద్వారా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆ ఊళ్లో రోజూ పండగే!
ఆర్థిక స్వావలంబనలోనే కాదు ఆరోగ్యం, పారిశుద్ధ్యంలోనూ చిల్లపల్లి ముందు ఉంటుంది. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉంది. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పై, తల్లిదండ్రులకు పేరెంటింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ చిన్న ఊళ్లో గాఢమైన నిశ్శబ్దం రాజ్యమేలేది. పెద్ద సందడి ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ‘ప్రతిరోజూ మా ఊళ్లో పండగే. సందడే’ అన్నట్లుగా కనిపిస్తుంది. అది మహిళా చైతన్యానికి సంకేతమైన సందడి!
మినీ ఏటీఎంతో....
డ్వాక్రా సంఘంలో చేరిన తరువాత సుమారు ఐదుసార్లు లోన్ తీసుకున్నాను. మొదటిసారి తీసుకున్నప్పుడు గేదెలు కొనుగోలు చేశాను. ఆ ఆప్పు తీర్చి మళ్లీ లోను ఎత్తుకుని పిల్లల చదువులకు ఉపయోగించాను. మరోసారి లోన్ ఎత్తుకొని సెంట్రింగ్ కర్రలు కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నా. తరువాత మినీ ఏటీఎం నిర్వహించేందుకు ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు లోన్ తీసుకున్నా. మినీ ఏటీఎం నిర్వహణతో నెలకు పదమూడు నుంచి పదిహేను వేల వరకు ఆదాయం వస్తుంది. – కూర వనిత మినీ ఏటీఎం నిర్వాహకురాలు
అందుకే ఆదర్శంగా నిలిచింది
పన్నెండేళ్ల క్రితం మహిళ సంఘంలో చేరాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు రుణం తీసుకున్నా. మొదట్లో అయిదువేలు ఎత్తుకోని కుట్టుమిషన్ కొన్నాను. తరువాత లోన్లు తీసుకుంటూ మగ్గం, మెడికల్ షాపు ఏర్పాటు చేసుకున్నాను. స్త్రీనిధి కింద రూ.75వేలు తీసుకుని కిరాణాషాపు ఏర్పాటు చేసుకున్నాం. సంఘంలో లోన్ తీసుకోవడం, ఆ పైసలను సద్వినియోగం చేసుకోవడం, తిరిగి సకాలంలో చెల్లించడంలో మా గ్రామ సమాఖ్య ఆదర్శంగా నిలుస్తుంది. – అరె.శ్వేత మెడికల్ షాపు యజమాని
ఎన్నో గ్రామాలకు గెలుపు పాఠం
నలుగురు కలిస్తే ఎన్ని అద్భుతాలు సాధించవచ్చో నిరూపించింది చిల్లపల్లి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏ వ్యాపారానికైనా ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఈ విషయంలో చిల్లపల్లి మహిళలు పర్‌ఫెక్ట్‌గా ఉన్నారు. ‘ఫ్రెండ్లీ ఉమెన్ విభాగం’లో జాతీయ అవార్డు రావటం సంతోషంగా ఉంది. అయితే ఇది ఒక ఊరి విజయం మాత్రమే కాదు ఎన్నో గ్రామాలకు గెలుపు పాఠం. ‘మనం కూడా ఇలా చేసి విజయం సాధించవచ్చు’ అని ప్రతి గ్రామం ధైర్యం తెచ్చుకునే విజయం. – సంతోషం పద్మ, ఏపీఎం, మంథని
Comments
Please login to add a commentAdd a comment