సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు మంచినీటి వనరుల విభాగంలో మరో జాతీయ అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లను సరిగ్గా వినియోగించుకున్న విద్యాసంస్థల కేటగిరీలో రెండో స్థానాన్ని పొందింది.
ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం నిలిచాయి.
నీటి వనరుల నిర్వహణకు...
జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ’జల సంపన్న భారత్’అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో భాగంగా జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు, సంస్థలు చేసిన మంచి పని, ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పనకు, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment