jagannathapuram
-
దేశంలోనే ఉత్తమ పల్లె జగన్నాథపురం
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు మంచినీటి వనరుల విభాగంలో మరో జాతీయ అవార్డు లభించింది. దేశంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జగన్నాథపురం గ్రామం నిలిచింది. ఉత్తమ జిల్లాల కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. దీంతోపాటు హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లను సరిగ్గా వినియోగించుకున్న విద్యాసంస్థల కేటగిరీలో రెండో స్థానాన్ని పొందింది. ఈ నెల 17న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ మరోసారి జాతీయ స్థాయిలో అవార్డు సాధించడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. అవార్డు ప్రకటించిన కేంద్రానికి, ఈ అవార్డులు రావడానికి ప్రేరణగా నిలిచిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జగన్నాథపురం గ్రామ పంచాయతీకి, పాలకవర్గం, సిబ్బంది, అధికారులను మంత్రి అభినందించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 11 కేటగిరీలలో 41 మంది విజేతలను ప్రకటించింది. ఇందులో ఉత్తమ రాష్ట్రంగా మధ్యప్రదేశ్, ఉత్తమ జిల్లాగా ఒడిశాలోని గంజాం, ఉత్తమ గ్రామ పంచాయతీగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం నిలిచాయి. నీటి వనరుల నిర్వహణకు... జలవనరులు, నదుల అభివృద్ధి గంగా పునరుజ్జీవన శాఖ అధ్వర్యంలో 2018 నుంచి జల, నీటి వనరుల నిర్వహణ అవార్డులను అందజేస్తున్నారు. ’జల సంపన్న భారత్’అనే ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న డ్రైవ్‌లో భాగంగా జాతీయ నీటి అవార్డులు వివిధ వ్యక్తులు, సంస్థలు చేసిన మంచి పని, ప్రయత్నాలను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తాయి. ఇది నీటి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పనకు, ఉత్తమ నీటి వినియోగ పద్ధతులను అవలంబించేలా వారిని ప్రేరేపించడానికి దోహదపడుతుంది. -
ఎనిమిదిళ్లు భస్మీపటలం
వేలేరుపాడు: వేలేరుపాడు పంచాయతీలోని జగన్నాథపురంలో బుధవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.45 లక్షల‡ ఆస్తినష్టం వాటిల్లింది. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. జగన్నాథపురంలో పోస్ట్‌మన్ షేక్ అక్బర్‌పాషా ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి పక్కనే ఉన్న చాంద్‌పాషా, పుతిలి, ని మ్మారి కృష్ణవేణి, మజ్జి రాంబాబు, శ్రీను, సావిత్రి, మణికంఠ ఇళ్లకు వ్యాపిం చాయి. ఆయా ఇళ్లలోని రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు వేగంగా చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధంతో స్థానికులు పరుగులు తీశారు. గ్యాస్ పేలుడు ధాటికి కొమ్మన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తలకు గాయమైంది. ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి గ్రామస్తులు మంటలను అదుపుచేశారు. వేలేరుపాడుకు 22 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్ఇంజిన్ ఆలస్యం గా వచ్చేటప్పటికీ సర్వం కాలిపోయాయి. ఆయా ఇళ్లలోని రేషన్, ఆధార్ కార్డులు, బ్యాంక్ పుస్తకాలు, సుమారు రూ.3 లక్షల నగదు, 20 కాసుల బంగారం, 15 తులాల వెండి, 6 క్వింటాళ్ల ధాన్యం, 2 క్వింటాళ్ల మినుములు, క్వింటా పెసలు, 8 టీవీలు, 6 ఇసుప బీరువాలు, ఫ్యాన్లు, కూలర్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. పెళ్లి కోసం దాచిన సొత్తు బుగ్గి అక్బర్‌పాషా తన చెల్లెలు నజీమా పెళ్లి కోసం ఇంట్లో దాచిన రూ.2 లక్షల నగ దు, ఆరు కాసులు బంగారు నగలు, రెం డు జతల వెండి పట్టీలు, సిద్ధం చేసిన రూ.లక్ష విలువైన ఫర్నీచర్ కాలిపోవడంతో కన్నీరుమున్నీరయ్యాడు. నిమ్మారి కృష్ణవేణికి చెందిన రూ.50 వేల నగదు, రెండు జతల బంగారు బుట్టలు, గొ లుసు, సావిత్రికి చెందిన 40 వేల నగదుతోపాటు రెండు కాసుల బంగారు నగలు బుగ్గికావడంతో ఘొల్లుమన్నారు. -
ఆశలు ఆవిరి..
సత్తుపల్లి, న్యూస్‌లైన్: జనవరి ఒకటి నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వస్తున్న తరుణంలో హడావిడిగా జనరల్ అవార్డు జారీ చేయటం పట్ల కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి, జగన్నాథపురం భూ నిర్వాసితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నూతన భూ సేకరణ బిల్లు సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆమోదం పొందడంతో సింగరేణి భూ నిర్వాసితుల్లో చిగురించిన ఆశలు మూడు నెలలకే ఆవిరయ్యాయి. కొత్తచట్టం ప్రకారం ఎకరాకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధర(రిజిస్ట్రేషన్)కు రెండు రెట్లు పెంచి ఇవ్వడంతో పాటు, దీనికి నాలుగు రెట్లు పరిహారం ఇచ్చేలా చట్టంలో పొందుపరిచారు. పునరావాసంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ధేశించారు. దీంతో ఎకరాకు కనీసం రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉండటంతో భూ నిర్వాసితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే మరో మూడు రోజుల్లో కొత్త చట్టం అమల్లోకి వస్తున్న సమయంలో భూములు స్వాధీనం చేసుకునేందుకు అవార్డు జారీ చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 1894 చట్టం ప్రకారం కిష్టారం, లంకపల్లి పట్టా భూమి ఎకరాకు రూ.4 లక్షలు, కొమ్మేపల్లి, జగన్నాథపురంలలో ఎకరాకు రూ.3.50 లక్షలు చెల్లిస్తారు. అసైన్డ్ భూములకు నష్టపరిహారం ఇంకా తేల్చలేదు. సోమవారం లంకపల్లికి చెందిన 34 ఎకరాలకు రూ.1.48 కోట్లు డిపాజిట్ చేసి భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. అయితే అధికారులు అత్యుత్సాహంతో సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై తమ నోట్లో మట్టి కొట్టారని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1015 ఎకరాల భూమి స్వాధీనం ... సత్తుపల్లి ఓపెన్ కాస్టు-2 విస్తరణలో 1015 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంటున్నారు. కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలో 489 ఎకరాల పట్టా భూమి, 190 ఎకరాల అసైన్డ్ భూమి, 20 ఎకరాల ఇళ్ల స్థలాలు, చెరుకుపల్లి రెవెన్యూ పరిధిలోని జగన్నాథపురంలో 90 ఎకరాల పట్టా భూమి, 87 ఎకరాల అసైన్డ్ భూమి, 10 ఎకరాల ఇళ్ల స్థలాలు, కిష్టారంలో 96 ఎకరాల పట్టా భూమి, లంకపల్లిలో 34 ఎకరాల పట్టా భూమిని నిర్వాసితులు కోల్పోనున్నారు. దీంతో కొమ్మేపల్లి, జగన్నాథ పురం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది నిర్వాసితులవుతున్నారు. తప్పులు సరిచేయకుండానే... భూ సేకరణ నోటిఫికేషన్లు తప్పుల తడకగా ఉన్నాయని, అవార్డు ఎంక్వైరీ నిలిపివేయాలని ఆరేళ్లుగా నిర్వాసితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి, అధికారుల చుట్టూ తిరిగారు. అయినా తప్పులు సరిచేయకుండా, నిర్వాసితుల కమిటీతో నష్టపరిహారంపై చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల తీవ్ర నిరసన, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ సర్వే నంబరులో ఎవరున్నారు.. భూమి ఎంత ఉంది. అనుభవదారు కాలంలో ఎవరున్నారు.. పట్టాదారు కాలంలో ఎవరున్నారనే విషయం తేల్చకుండా అవార్డు ఎలా జారీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు ఉధృతం... కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి, జగన్నాథపురం గ్రామాలలో పట్టా భూములను స్వాధీనం చేసుకుంటూ అవార్డు జారీ చేయటం పట్ల దశలవారీగా ఆందోళనలకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. సోమవారం సత్తుపల్లిలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీ వేసి సింగరేణి సీఎండీ కార్యాలయం, అసెంబ్లీ ముట్టడితో పాటు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి సమస్యలు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. కొత్త చట్టం ప్రకారం రైతులకు రూ.29 కోట్లు నష్ట పరిహారం పెంచి ఇవ్వటంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సింగరేణి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించటంతో తాము వీధిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. నడిరోడ్డులో నిలబెడుతున్నారు మా భూములు లాక్కుని మమ్మల్ని నడిరోడ్డులో నిలబెడుతున్నారు. మాకు అన్యాయం చేశారు. బొగ్గు తీసుకోవటానికి చాలా సమయం ఉన్నా.. మా భూములు తొందరపడి లాక్కొని ఎక్కువ డబ్బులు రాకుండా చేశారు. మాలాంటోళ్ల పట్ల ఎందుకు అంత కక్షో అర్ధం కావటం లేదు. - నాగరత్నం, కొమ్మేపల్లి హడావిడిగా ఎందుకు లాక్కుంటున్నారు నూతన భూ సేకరణ చట్టం వచ్చిందని సంబరపడ్డాం. భూమిని ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు. మెరుగైన ప్యాకేజీ ఇవ్వమని ఆరేళ్ల నుంచి అడుగుతున్నాం. అంత హడావుడిగా మా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి ? - షేక్ సుభాని, కొమ్మేపల్లి -
భద్రాద్రిని విడదీస్తే ఉద్యమమే
జగన్నాధపురం (వాజేడు), న్యూస్‌లైన్: తెలంగాణ నుంచి భద్రాద్రిని విడదీస్తే చూస్తూ ఊరుకునేది లేదని, తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలంగాణవాదులు హెచ్చరించారు. భద్రాద్రిని తెలంగాణ నుంచి విడదీయాలన్న ప్రయత్నాలను నిరసిస్తూ జగన్నాధపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై తెలంగాణవాదులు శనివారం నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణవాదులు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపే ప్రయత్నాల వెనుక.. దానిపై (భద్రాచలంపై) ప్రేమనో, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనో ఉందనుకుంటే పొరబడినట్టేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రాంతం నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసేందుకే భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలిపేందుకు అక్కడి నాయకులు, పాలకులు యత్నిస్తున్నట్టు చెప్పారు. భద్రాద్రిని సీమాంధ్రలో కలిపిన వెంటనే 1/70 చట్టాన్ని సవరిస్తారని, ఇక్కడి ఖనిజ సంపదను దోచుకుంటారని, అప్పుడు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రాచలం రాముడు తెలంగాణకే స్వంతమని అన్నారు. భద్రాచలం డివిజన్లోని కొందరు నాయకులు తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ నుంచి భద్రాచలాన్ని విడదీసేందుకు సాగుతు న్న యత్నాలకు వ్యతిరేకంగా డివిజన్లోని ప్రజలు, నాయకులు రాజకీయాల కు అతీతంగా ఉద్యమించాలని కోరారు. రాస్తారోకోలో టీజేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ జికె.శ్రీనివాస్, నాయకులు డెనార్జున రావు, దావూద్, వేణు, ఖాజావలి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. చర్లలో రాస్తారోకో చర్ల: భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలన్న డిమాండుతో రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో జరిగింది. ‘భద్రాద్రి రాముడు.. తెలంగాణ దేవుడు’, ‘భద్రాచలం డివిజన్‌ను తెలంగాణలోనే కొనసాగించాలి’ అని ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకుడు, కాం గ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు నల్ల పు దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్ తెలంగాణలో అంతర్భాగమేనని అన్నారు. దీనిని లాక్కునేందుకు ఆంధ్ర ప్రాంత నాయకులు కుటిల యత్నాలు సాగిస్తున్నారని విమర్శించారు. దీనిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ ముం దుకు రావాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కారంపూడి సాల్మన్‌రాజు, కెఎస్‌కె.నాయుడు, ఎస్డి.అజీజ్, కుంజా శ్రీనివాసరావు, అడ్డగర్ల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. -
జలదిగ్బంధంలో జగన్నాథపురం
జగన్నాథపురం (కోటనందూరు), న్యూస్‌లైన్ : వెదుళ్ల గడ్డకు వచ్చిన వరదనీరు జగన్నాథపురం గ్రామాన్ని ముంచెత్తింది. విశాఖ జిల్లాలో శనివారం కురిసిన భారీ వర్షానికి వెదుళ్లగెడ్డలోకి భారీగా వరదనీరు చేరింది. గత ఏడాది నీలం తుఫాన్‌కు జగన్నాథపురం వద్ద వెదుళ్లు గెడ్డకు గండ్లు పడ్డాయి. ఆ గండ్లకు ఇంతవరకు ఇరిగేషన్ అధికారులు మరమ్మతులు చేపట్టలేదు. శనివారం అర్ధరాత్రి సమయానికి వెదుళ్లగెడ్డలో వరదనీరు భారీగా రావడంతో గండ్ల గుండా వరదనీరు గ్రామంలోకి ప్రవేశించింది. ఎస్సీ, బీసీ కాలనీలతోపాటు గ్రామంలోని అధిక ప్రాంతాన్ని వరద ముంచెత్తడంలో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. వరదనీరు ఆదివారం గ్రామంలో నిలిచిపోవడంతో తాగునీటికి సైతం గ్రామస్తులు ఇబ్బందిపడ్డారు. వరదనీరు గ్రామం మీదుగా పంటపొలాల్లోకి ప్రవహించడంతో వరినాట్లు దెబ్బతినడంతోపాటు వరినారు కొట్టుకుపోయింది. గతేడాది నీలం తుఫాన్‌కు వెదుళ్లగెడ్డ ముంచెత్తడంతో ఈగ్రామం తీవ్రంగా నష్టపోయింది. మరల అలాగే జరిగిందని గ్రామస్తులు వాపోయారు. పది నెలలక్రితం పడిన గండ్లను పూడ్చకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఇబ్బందులుపడి నష్టపోవాల్సి వచ్చిందని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు వెదుళ్లగెడ్డకు నీలం తుఫాన్ సమయంలో పడ్డ గండ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతామని ఇరిగేషన్‌శాఖ డీఈ కృష్ణారావు తె లిపారు. జగన్నాథపురం ముంపుపై స్థానికులు ఆదివారం జిల్లా ఉన్నతాధికారులకు ఫోన్ ద్వా రా ఫిర్యాదు చేశారు. పరిస్థితిని సమీక్షించాలని ఇరిగేషన్‌శాఖ ఎస్ఈ కాశీవిశ్వేశ్వరరావు సిబ్బం దిని ఆదేశించారు. దీనిపై జగన్నాథపురం వచ్చి న డీఈ గ్రామంలో వరదనీటిని, వెదుళ్లుగెడ్డ గం డ్లను పరిశీలించారు. స్థానిక నేతలు డి. చిరంజీవిరాజు, గొర్లి రామచంద్రరావు, ఎర్రా చినసత్యనారాయణ, మాతిరెడ్డి బాబులుతో ఆయన చర్చించారు. ఆనంతరం డీఈ కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ వెదుళ్లగడ్డ గండ్ల శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపడతామన్నారు.