ఆశలు ఆవిరి.. | One of the new land law in January | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి..

Published Tue, Dec 31 2013 5:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

One of the new land law in January

 సత్తుపల్లి, న్యూస్‌లైన్: జనవరి ఒకటి నుంచి కొత్త భూసేకరణ చట్టం అమల్లోకి వస్తున్న తరుణంలో హడావిడిగా జనరల్ అవార్డు జారీ చేయటం పట్ల కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి, జగన్నాథపురం భూ నిర్వాసితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నూతన భూ సేకరణ బిల్లు సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆమోదం పొందడంతో సింగరేణి భూ నిర్వాసితుల్లో చిగురించిన ఆశలు మూడు నెలలకే ఆవిరయ్యాయి. కొత్తచట్టం ప్రకారం ఎకరాకు గ్రామీణ  ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ ధర(రిజిస్ట్రేషన్)కు రెండు రెట్లు పెంచి ఇవ్వడంతో పాటు, దీనికి నాలుగు రెట్లు పరిహారం ఇచ్చేలా చట్టంలో పొందుపరిచారు.
 
 పునరావాసంలో అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ధేశించారు. దీంతో ఎకరాకు కనీసం రూ.12 నుంచి రూ.15 లక్షల వరకు నష్ట పరిహారం వచ్చే అవకాశం ఉండటంతో భూ నిర్వాసితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే మరో మూడు రోజుల్లో కొత్త చట్టం అమల్లోకి వస్తున్న సమయంలో భూములు స్వాధీనం చేసుకునేందుకు అవార్డు జారీ చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. 1894 చట్టం ప్రకారం కిష్టారం, లంకపల్లి పట్టా భూమి ఎకరాకు రూ.4 లక్షలు, కొమ్మేపల్లి, జగన్నాథపురంలలో ఎకరాకు రూ.3.50 లక్షలు చెల్లిస్తారు. అసైన్డ్ భూములకు నష్టపరిహారం ఇంకా తేల్చలేదు. సోమవారం లంకపల్లికి చెందిన 34 ఎకరాలకు రూ.1.48 కోట్లు డిపాజిట్ చేసి భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. అయితే అధికారులు అత్యుత్సాహంతో సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై తమ నోట్లో మట్టి కొట్టారని భూ నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 1015 ఎకరాల భూమి స్వాధీనం ...
 సత్తుపల్లి ఓపెన్ కాస్టు-2 విస్తరణలో 1015 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుంటున్నారు. కొమ్మేపల్లి రెవెన్యూ పరిధిలో 489 ఎకరాల పట్టా భూమి, 190 ఎకరాల అసైన్డ్ భూమి, 20 ఎకరాల ఇళ్ల స్థలాలు, చెరుకుపల్లి రెవెన్యూ పరిధిలోని జగన్నాథపురంలో 90 ఎకరాల పట్టా భూమి, 87 ఎకరాల అసైన్డ్ భూమి, 10 ఎకరాల ఇళ్ల స్థలాలు, కిష్టారంలో 96 ఎకరాల పట్టా భూమి, లంకపల్లిలో 34 ఎకరాల పట్టా భూమిని నిర్వాసితులు కోల్పోనున్నారు. దీంతో కొమ్మేపల్లి, జగన్నాథ పురం గ్రామాలకు చెందిన సుమారు 400 మంది నిర్వాసితులవుతున్నారు.
 
 తప్పులు సరిచేయకుండానే...
 భూ సేకరణ నోటిఫికేషన్లు తప్పుల తడకగా ఉన్నాయని, అవార్డు ఎంక్వైరీ నిలిపివేయాలని ఆరేళ్లుగా నిర్వాసితులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈ సమస్య పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి, అధికారుల చుట్టూ తిరిగారు. అయినా తప్పులు సరిచేయకుండా, నిర్వాసితుల కమిటీతో నష్టపరిహారంపై చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల తీవ్ర నిరసన, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.  ఏ సర్వే నంబరులో ఎవరున్నారు.. భూమి ఎంత ఉంది. అనుభవదారు కాలంలో ఎవరున్నారు.. పట్టాదారు కాలంలో ఎవరున్నారనే విషయం తేల్చకుండా అవార్డు ఎలా జారీ చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
 
 ఆందోళనలు ఉధృతం...
 కొమ్మేపల్లి, కిష్టారం, లంకపల్లి, జగన్నాథపురం గ్రామాలలో పట్టా భూములను స్వాధీనం చేసుకుంటూ అవార్డు జారీ చేయటం పట్ల దశలవారీగా ఆందోళనలకు నిర్వాసితులు సిద్ధమవుతున్నారు. సోమవారం సత్తుపల్లిలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాజకీయ పార్టీలతో అఖిలపక్ష కమిటీ వేసి సింగరేణి సీఎండీ కార్యాలయం, అసెంబ్లీ ముట్టడితో పాటు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి సమస్యలు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. కొత్త చట్టం ప్రకారం రైతులకు రూ.29 కోట్లు నష్ట పరిహారం పెంచి ఇవ్వటంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సింగరేణి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించటంతో తాము వీధిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దీనిపై మంగళవారం నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు.
 
 నడిరోడ్డులో నిలబెడుతున్నారు
 మా భూములు లాక్కుని మమ్మల్ని నడిరోడ్డులో నిలబెడుతున్నారు. మాకు అన్యాయం చేశారు. బొగ్గు తీసుకోవటానికి చాలా సమయం ఉన్నా.. మా భూములు తొందరపడి లాక్కొని ఎక్కువ డబ్బులు రాకుండా చేశారు. మాలాంటోళ్ల పట్ల ఎందుకు అంత కక్షో అర్ధం కావటం లేదు.
 - నాగరత్నం, కొమ్మేపల్లి
 
 హడావిడిగా ఎందుకు లాక్కుంటున్నారు  
 నూతన భూ సేకరణ చట్టం వచ్చిందని సంబరపడ్డాం. భూమిని ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు. మెరుగైన ప్యాకేజీ ఇవ్వమని ఆరేళ్ల నుంచి అడుగుతున్నాం. అంత హడావుడిగా మా భూములను ఎందుకు లాక్కుంటున్నారు. రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటి ?  
 - షేక్ సుభాని, కొమ్మేపల్లి
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement