పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 29,816 కోట్లు
ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ శాఖకు రూ. 40,080 కోట్లు
దానితో పోలిస్తే దాదాపు రూ. 10 వేల కోట్ల మేర తగ్గిన కేటాయింపులు
పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లు ప్రతిపాదన.. పెంచిన పెన్షన్ల అమలుపై అస్పష్టత
⇒ వార్షిక బడ్జెట్‌లో ‘పల్లె’కు కాస్త ప్రాధాన్యం తగ్గినట్లు కనిపిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరంగా 2024–25 బడ్జెట్‌లో రూ. 29,816 కోట్లు కేటాయించారు. అందులో పంచాయతీరాజ్ శాఖకు రూ. 9,341.56 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 1,317.95 కోట్లను ప్రతిపాదించగా ఇతర పథకాల కింద వచ్చే గ్రాంట్లు, ఇతర నిధులను కలిపి మొత్తంగా రూ. 29,816 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఈ శాఖకు ఏకంగా రూ. 40,080 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు సుమారు రూ. 10 వేల కోట్లు తగ్గడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్
పెంచిన పెన్షన్ల అమలు లేనట్టేనా?
⇒ ఈ శాఖ పరిధిలోకి వచి్చన కేటాయింపుల విషయానికొస్తే 2024–25 బడ్జెట్‌లో చేయూత (ఆసరా పించన్లు) పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లు ప్రతిపాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు సహా వివిధ కేటగిరీల పెన్షన్లను రూ. 2,016 నుంచి రూ.4 వేలకు, దివ్యాంగులకు రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంపు అమలును ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెంచిన పెన్షన్ల అమలు ఇప్పుడప్పుడే ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం దివ్యాంగులకు నెలకు రూ. 4 వేల చొప్పున, వివిధ కేటగిరీల వారికి రూ. 2,016 చొప్పున చెల్లించేందుకు నెలకు రూ. 950 కోట్ల చొప్పున ఏడాదికి రూ.11,400 కోట్లు ఖర్చవుతోంది. ఇప్పుడు బడ్జెట్‌లో చేయూత పెన్షన్ల కోసం రూ. 14,628.91 కోట్లను ప్రతిపాదించడాన్నిబట్టి రూ. 3,228.91 కోట్లు అధికంగా కేటాయించారు. పెంచిన పెన్షన్ల అమలుకు రూ. 23 వేల కోట్ల దాకా (నెలకు రూ. 1,910 కోట్లు) అవసరమవుతాయి.
అయితే ఈ బడ్జెట్‌ను పెంచిన పెన్షన్లకు అనుగుణంగా ఖర్చు చేస్తారా లేక బడ్జెట్ కేటాయింపులకే పరిమితమవుతారా అన్నది వేచిచూడాల్సి ఉందంటున్నారు. పెంచిన చేయూత పెన్షన్లను ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వపరంగా సిద్ధమవుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇతర కేటాయింపులు..
⇒ గ్రామీణాభివృద్ధిశాఖకు (కమిషనర్ కార్యాలయం) రూ. 12,820 కోట్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) రూ. 295 కోట్లు, సీ డీ అండ్ పంచాయతీలు రూ. 3,117 కోట్లు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 1,142 కోట్లు ప్రతిపాదించారు. దీంతోపాటు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాల కోసం రూ. 750 కోట్ల మేర కేటాయింపులు చేశారు.
అలాగే మహిళా సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ‘ఇందిరా మహిళాశక్తి పథకం’కోసం రూ. 50.41 కోట్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ. 10 లక్షల జీవితబీమా కోసం ‘ఇందిరా జీవిత భీమా’కు రూ. 96.53 కోట్లు ప్రతిపాదించారు. స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణకు రూ. 120 కోట్లు కేటాయించారు. గ్రామీణ తాగునీటి సరఫరా (మిషన్ భగీరథ) కోసం రూ. 3046.26 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ. 72 కోట్లు, రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణానికి రూ. 20 కోట్లు కేటాయించారు.
ప్రస్తుతం వివిధ కేటగిరీలవారీగా ‘భరోసా’పింఛన్లు పొందుతున్న వారి సంఖ్య
(వృద్ధులు, ఇతర కేటగిరీలవారికి నెలకు రూ. 2,016 చొప్పున, దివ్యాంగులకు రూ. 4 వేల చొప్పున)
వృద్ధులు 15,81,630
వితంతువులు 15,54,525
దివ్యాంగులు 5.05,836
బీడీ కారి్మకులు 4,24,292
ఒంటరి మహిళలు 1,42,252
గీత కార్మికులు 65,196
నేత కార్మికులు 37,051
ఎయిడ్స్ రోగులు 35,670
బోదకాలు బాధితులు 17,995
డయాలిసిస్ రోగులు 4,337
మొత్తం 43,70,751
Comments
Please login to add a commentAdd a comment