రేవంత్‌రెడ్డి వర్సెస్‌ హరీశ్‌రావు | Revanth Reddy vs Harish Rao: Telangana | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి వర్సెస్‌ హరీశ్‌రావు

Published Sun, Jul 28 2024 3:32 AM | Last Updated on Sun, Jul 28 2024 3:32 AM

Revanth Reddy vs Harish Rao: Telangana

అప్పుల లెక్కలు సరే.. అమ్ముకున్న లెక్కలేవీ? 

ఆరు గ్యారంటీలను నమ్మితే.. ధోకా చేస్తారా? 

శాసనసభలో సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీశ్‌రావు మాటల యుద్ధం

ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేశారన్న హరీశ్‌ 

సోనియా, రాహుల్‌లతో హామీ ఇప్పించి.. వారి పరువు తీశారని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సభ్యుడు హరీశ్‌రావు ఆరోపణలు.. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించడంతో.. ఈ ఇద్దరి మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌రావు.. గతంలో తమ ప్రభుత్వం చేసిన అప్పులను ఎక్కువ చేసి చూపిస్తున్నారని, అది సరికాదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ హామీల అమలు కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదేమని నిలదీశారు.

ఇంతలో సీఎం రేవంత్‌ జోక్యం చేసుకున్నారు. ‘‘హరీశ్‌రావు అబద్ధాలు మాట్లాడుతున్నారు. లక్షల కోట్ల విలువైన ఔటర్‌ రింగ్‌ రోడ్డును రూ.7 వేలకోట్లకే తెగనమ్మారు. గొర్రెల స్కీం పేరుతో రూ.700 కోట్లు దండుకున్నారు. బతుకమ్మ చీరల్లోనూ అవినీతికి పాల్పడ్డారు. కాళేశ్వరం ఖర్చు విషయంలో గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లే అంటున్నారు. అప్పుల లెక్కలు చెబుతున్నారు.. కానీ అమ్ముకున్న లెక్కలు చెప్పడంలేదు.

రాష్ట్ర ప్రభుత్వ భూములను కాపాడాల్సింది పోయి.. ఎన్ని వేలకోట్ల విలువైన భూములు అమ్ముకున్నారో లెక్కలు తీద్దాం. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు అన్యాయం చేశారు. మీరు నిజాయతీ పాలన అందించి ఉంటే.. బతుకమ్మ చీరలు, కేసీఆర్‌ కిట్స్, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధమా?’’ అని సవాల్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండుసున్నా ఇచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

అబద్ధపు గ్యారంటీలతో పరువు తీశారు: మాజీమంత్రి హరీశ్‌రావు
సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల కరువు, వలసలకు రేవంత్‌రెడ్డి గతంలో ఉన్న టీడీపీ, ఇప్పుడున్న కాంగ్రెస్‌ కారణమని ఆరోపించారు. ‘‘బతుకమ్మ చీరల విషయంలో సీఎం మహిళలను అవమానపరిచారు. దీనిపై క్షమాపణ చెప్పాలి. ఆరు గ్యారంటీలపై రాహుల్‌ గాం«దీతో హామీ ఇప్పించారు. సోనియాగాం«దీతో కూడా లేఖ రాయించారు. కానీ అమలు చేయలేక.. సోనియా గౌరవం పోగొట్టారు. రాహుల్‌ పరువు తీశారు.

పేగులు మెడలో వేసుకుంటా, లాగులో తొండలు విడుస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి వాడిన రాక్షస భాషను చూసి జనం భయపడుతున్నారు. ముఖ్యమంత్రి కుర్చీ గౌరవం పోగొట్టవద్దని కోరుకుంటున్నాం’’ అని హరీశ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 500 హత్యలు, 1,800 అత్యాచారాలు జరిగాయని.. పోలీసులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ప్రతివారం సీఎం ప్రజలను కలుస్తారని చెప్పారని.. కానీ ప్రజాపాలనలో మొదటి రోజు తప్ప మళ్లీ అక్కడ కనిపించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పారీ్టయే పెద్ద ధోకా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులంతా ‘ధోకా.. ధోకా..’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు అభ్యంతరం వ్యక్తంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement