KJ Yesudas Biography And Filmography In Telugu - Sakshi
Sakshi News home page

K J Yesudas Life Facts: ఆయన జోల పాట పాడకపోతే అయ్యప్ప స్వామి నిదురపోడు!

Published Sat, Jan 28 2023 4:15 PM | Last Updated on Sat, Jan 28 2023 4:42 PM

KJ Yesudas Biography And Filmography In Telugu - Sakshi

ఓ పాట విని  దేవుడే భక్తి భావంలో మునిగిపోతే.. ఓ పాట విని సకల లోకాలు తన్మయత్వంలో మునిగిపోతే.. ఒకే పాట విని ప్రపంచమంతా మత్తుమందు చల్లినట్లు మైమరచిపోతే.. అది కచ్చితంగా యేసుదాసు పాటే. దక్షిణాదినీ ఉత్తరాదినీ  తన స్వరంతో మాయ చేసి ఓలలాడించిన గాన గంధర్వుడు ఏసుదాసు. మనుషులను తన పాటలతో మైమరపించడానికి దేవుడే ఏసుదాసు రూపంలో దివి నుండి భువికి దిగి వచ్చి ఉండచ్చని సంగీతజ్ఞుల అనుమానం. వెన్నెలను తేనెలో ముంచి దానిపై పూల రెక్కలను అద్దినట్లు ఏసుదాసు పాడిన పాటలన్నీ గంధర్వ లోకపు అద్భుతాలే. ఆయన పాటలను ఒక్క ముక్కలో చెప్పాలంటే అవి స్వరరాగ గంగా ప్రవాహం వంటివి. సంగీత ప్రపంచంలో  తిరుగులేని గాయకునిగా విరాజిల్లుతున్న ఈ గంధర్వ గాయకుడి గురించి ఆసక్తికర విషయాలు మీకోసం.. 

ఏసుదాసు అనగానే ఎవ్వరికైనా గుర్తుకొచ్చేది అయ్యప్పే. ఏసుదాసు పాటతోనే అయ్యప్ప  ఎక్కువ పాపులర్ అయ్యాడంటే అతిశయోక్తి కాదు. అయ్యప్పకూ ఏసుదాసుకూ మధ్య భగవంతునికీ భక్తునికీ మధ్య ఉండే  అవినాభావ సంబంధమే ఉంది. ఎంతగా అంటే నిత్యం శబరి మల అయ్యప్ప దేవాలయంలో  ఏసుదాసు లాలి పాట  పాడిన తర్వాతనే దేవుడు చల్లగా మత్తుగా నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాతనే దేవాలయం తలుపులు మూసుకుంటాయి.

కేవలం సంగీతాభిమానులను తన పాటలతో ఆనందింపజేయడానికే ఏసుదాసు భూమ్మీదకు వచ్చి ఉండాలి. పాట తప్పిదే మరో అజెండా లేదు. ఆ పాట కూడా అమృతంలో ముంచి తీసినట్లు తియ్య తియ్యగా వెన్నలతో కలిపినట్లు చల్ల చల్లగా ఉంటుంది.

మలయాళ సీమలోని కొచ్చిలో పుట్టారు ఏసుదాస్. అగస్టీన్ జోసెఫ్, ఎలిజబెత్ జోసెఫ్ దంపతుల ఏడుగురు సంతానంలో నెంబరు టూ మన జేసుదాస్.

 నాన్న కర్నాటక సంగీతంలో దిట్ట. రంగస్థల కళాకారుడు కూడా.నాన్నను చూసి చిన్నప్పుడే సంగీతంపై  మనసు పారేసుకున్నాడు ఏసుదాసు. తండ్రికి మంచి స్నేహితుడైన కుంజన్ వేల్ భాగవతార్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు.

 ఏసుదాస్ లోని టాలెంట్ ను చూసి గురువులే ఆశ్చర్యపోయేవారట. 1961లో ఏసుదాస్ కెరీర్ లోని మొదటి పాపులర్ సాంగ్ జాతి బేధం మత ద్వేషం అనే పాటతో మెరిసారు. మలయాళంలో  సుప్రసిద్ధ కవి నారాయణ గురు రాసిన ఈ పాట ఏసుదాసు పేరును మార్మోగేలా చేసింది.

 మలయాళంలో భార్య అనే సినిమాతో ఏసుదాస్ జైత్రయాత్ర మొదలైంది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసింది లేదు. చూస్తూ ఉండగానే దక్షిణాది భాషలన్నింటా తనదైన ముద్ర వేసేశాడు.

 మలయాళం, కన్నడం, తమిళంలో సమాంతరంగా సూపర్ సింగర్ గా కొనసాగారు. ఆ క్రమంలోనే  తెలుగులోనూ జెండా ఎగరేశారు.

 శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో వచ్చిన సినిమాలైతే జేసుదాస్ తప్ప మరో ఆలోచనే చేసేవారు కారు సంగీత దర్శకులు.

 అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలకు ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన స్వరం ఏసుదాస్ సొంతం.

ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ ఏసుదాస్ స్వరం పాతబడలేదు. మరింత నవ్యత్వాన్ని సంతరించుకుంది. అందరినీ మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది.

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మోహన్ బాబుకు జేసుదాస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. తను నిర్మించిన ప్రతీ సినిమాలోనూ  తప్పనిసరిగా ఒక్కటైనా జేసుదాస్ పాట ఉండి తీరాల్సిందే.ఆ పాటలు ఆ సినిమాకే హైలెట్ గా నిలిచాయి

జేసుదాస్ వంటి గాయకుడు దొరికితే సంగీత దర్శకులకు పండగే. జేసుదాస్ చేత ఎన్నో గొప్ప పాటలు పాడించారు మ్యాస్ట్రో ఇళయరాజా.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత మ్యూజిక్ సంచలనం ఏ.ఆర్.రెహ్మాన్ కు జేసుదాస్ అంటే చచ్చేంత భక్తి. తనకు మూడేళ్ల వయసునుండే జేసుదాస్ పాటలను వింటూ ఎదిగానని రెహ్మాన్ చాలా సార్లు చెప్పుకున్నారు. జేసుదాస్ స్వరం వింటే అది కేవలం దేవుడికే సాధ్యమవుతుందని రెహ్మాన్ కొనియాడారు.

జేసుదాసు అందుకున్న అవార్డులు రివార్డులకు అంతేలేదు. ప్రతీ ప్రాంతీయ భాషలోనూ  అవార్డు అందుకున్న జేసును జాతీయ అవార్డులు వచ్చి వరించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement