నిన్నటి ఊసులు రేపటి ఆశలు | sweet memories of 2014 in tollywood | Sakshi
Sakshi News home page

నిన్నటి ఊసులు రేపటి ఆశలు

Published Tue, Dec 30 2014 11:08 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

sweet memories of 2014 in tollywood

 కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ రోజుతో 2014కు శుభం కార్డు పడుతోంది. సరికొత్త ఆశలు మోసులెత్తగా, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న వేళ... ఒక్కసారి గడచిన ఏడాది కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే... సినిమా రీలు గిర్రున తిరిగినట్లు ఎన్నెన్నో జ్ఞాపకాలు. వెళ్ళిపోతున్న 2014లో తాము చూసిన మార్పులు, రానున్న 2015కు వచ్చే చేర్పుల గురించి ఆయా విభాగాల్లోని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు... అనుభూతులు...
 
 ఎవరికైనా వర్తించే సూక్తి ఇది!
 - వెంకటేశ్, హీరో
 2014లో ‘దృశ్యం’ నాకొక స్వీట్ మెమరీ. సరైన సమయంలో వచ్చిన విజయం అది. ఈ విజయం ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయగల నమ్మకాన్ని నాలో నింపింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ మరో విషయం - యంగ్‌స్టర్స్ చాలామంది కూడా ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం. ఇక సక్సెస్ రేట్ అంటారా! జయాపజయాలు ప్రతి ఏడాదీ ఉండేవే! ఆ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. చక్కని ప్లానింగ్, హార్డ్‌వర్క్‌తో సిన్సియర్‌గా ముందుకెళ్తే విజయం తథ్యం. ఒక సీనియర్ కథానాయకునిగా నా అభిప్రాయమిది! మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడం, ప్రయోగాలు చేయడం... వీటి గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒక వయసు వచ్చాక, రకరకాల పాత్రలు చేసి అనుభవం పొందాక ఇక రొటీన్‌గా వెళ్లడం కరెక్ట్ కాదు. నాకే కాదు, ఎవరికైనా వర్తించే సూక్తి ఇది. అందుకే... వెరైటీ పాత్రలనే ఎన్నుకుంటున్నా.  రానున్న 2015లో ‘గోపాల గోపాల’తో రాబోతున్నా. అది కూడా రొటీన్ ఫార్ములా సినిమా కాదు. కథ, కథనం, పాత్రలు కొత్తగా ఉంటాయి.  
 
  అంతా ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నారు
 - సుద్దాల అశోక్‌తేజ, గీత రచయిత
 2014లో ‘లింగ’, ‘ఐ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పాటలు రాశాను. రచయితగా ఆత్మసంతృప్తినిచ్చిన పాటలైతే ఏమీ రాయలేదు కానీ, సంతృప్తినిచ్చిన పాట మాత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నేను రాసిన ‘నీలిరంగు చీరలోనా...’ పాటే. ఇంకా దాసరిగారి ‘ఎర్రబస్సు’లో కూడా పాట రాశాను. పరిశ్రమ మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది అంత బ్రహ్మండంగా అయితే లేదు. తక్కువగా కూడా ఏమీ అనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు విడుదలై సరిగ్గా ఆడకపోవడం మాత్రం బాధ కలిగించింది. బాధాకరమైన మరో విషయం ఏంటంటే... గొప్ప సాహిత్యం అందించాలని మాకుంటుంది. కానీ... ఆ అవకాశం మాత్రం లభించడం లేదు. ఆత్రేయగారు ఓ మాట అనేవారు. ‘ముందు నీకు నచ్చింది చేయ్. అది వాళ్లకు నచ్చకపోతే... వాళ్లకు నచ్చిట్టు చేయ్’ అని. ఇప్పుడు గీత రచయితలంతా ఫాలో అవుతోంది ఆ సూత్రాన్నే. ఈ ఏడాది ఉన్నంతలో మా గీత రచయితలంతా మంచి సాహిత్యాన్నే అందించారు.
 
 కాంట్రవర్సీ అంటేనే కథానాయికా..? - స్వాతి, హీరోయిన్
 2014 సాదాసీదాగా సాగిపోయింది. అయితే కొత్త హీరోయిన్లు కొంతమంది ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆనందం అనిపించింది. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన రాశీఖన్నా నాకు బాగా నచ్చింది. ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన హీరోయిన్లంతా గ్లామర్‌కే పరిమితమైపోయారనే విమర్శను నేను అంగీకరించను. ఎందుకంటే  గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో వాళ్లకు తెలీదు. నేను కథానాయికగా కెరీర్ ప్రారంభించాక, మొదట్లో అభినయ ప్రధానమైన పాత్రలకే మొగ్గు చూపాను. కానీ కెరీర్ దీర్ఘకాలం కొనసాగాలంటే, గ్లామర్‌గా కనిపించక తప్పదు. అందుకే, ‘స్వామి రా రా’ నుంచి నా అభిమతాన్ని మార్చుకొని కాస్త గ్లామర్‌గా కనిపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు తెలుస్తోంది గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో! ఈ ఏడాది అభినయపరంగా చెప్పాల్సి వస్తే -‘మనం’ సినిమాలో సమంత, శ్రీయల గురించి చెప్పాలి. సమంతది నిజంగా చాలా విచిత్రమైన పాత్ర. అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. ఇక శ్రీయ అయితే... ఆ సినిమాలో వెంకటగిరి చీర కట్టుకొని ఎంత అందంగా కనిపించారో! అలాగే.. ‘గీతాంజలి’ సినిమాలో అంజలి పెర్‌ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఆ దర్శకుడు తీయనున్న తదుపరి చిత్రంలో నేనే కథానాయికను. అయితే, అందరూ అది ‘గీతాంజలి’కి సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ, అదొక కొత్త కథ.
 
 ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల గురించి చెప్పే ముందు.. నాపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్. నాకు పెళ్లి ఖాయమైందనీ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయబోతున్నాననీ ఓ రూమర్ నాకెంత తలనొప్పి తెప్పించిందో మాటల్లో చెప్పలేను. ఆ టైమ్‌లో నేను ఫారిన్‌లో ఉన్నా. ఒకటే ఫోన్లు.  ‘పెళ్లి కొడుకు కూడా ఎవడో మీరే చెప్పేయండి... ఓ పని అయిపోతుంది’ అని మీడియా వారితో ఘాటుగా స్పందించా. అలాగే... కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తే... వాటికి వేరే రంగు పులిమి మాట్లాడటం నన్ను కాస్త బాధించింది. ఇక శ్వేతాబసు ఉదాంతం గురించి చెప్పేదేముంది. తన విషయంలో అందరూ ఓవర్‌గానే రియాక్టయ్యారు. చివరకు కాంట్రవర్సీ అంటేనే కథానాయిక అన్నట్లు తయారైంది సొసైటీ.
 
 దర్శకులే బాధ్యులు!
 - బోయపాటి శ్రీను, దర్శకుడు
 ఈ ఏడాది తొలినాళ్లలో బలహీనమైన బాక్సాఫీస్‌కి కొత్త ఊపిరులూదిన చిత్రం నా ‘లెజెండ్’. ఇది నేను గర్వంగా చెప్పుకునే అంశం. అయితే ఈ ఏడాది అత్యధికంగా చిత్రాలు విడుదలైనా, విజయాలు మాత్రం అరకొరగానే ఉండడం నన్ను బాధించింది. సినిమా సమష్టికృషి అయినా, జయాపజయాలకు బాధ్యులు కచ్చితంగా దర్శకులే. దర్శకుని సృజన పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ ఏడాది విడుదలైన ‘మనం’, ‘రన్ రాజా రన్’ సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. బాలయ్య వందో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాను నేను డెరైక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నా దగ్గరైతే కథ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బాలయ్య స్టేటస్‌కు తగ్గ కథను తయారు చేసి, మళ్లీ ఆయనకు ఘన విజయాన్ని అందిస్తా. ఆ సత్తా నాలో ఉంది.
 
 పరిశ్రమ పరిస్థితి బాగా లేదు!  - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), నిర్మాత
 ఈ ఏడాది ఆర్టిస్టుల పరిస్థితి హ్యాపీ... టెక్నీషియన్ల పరిస్థితీ హ్యాపీ. కానీ నిర్మాతల పరిస్థితే దారుణంగా తయారైంది. దానికి కారణం నిర్మాతల పొరపాట్లే. ఇక్కడ నిర్మాతకు నిర్మాతే శత్రువు. ఈ కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం. ముందు నిర్మాతల్లో మార్పు రావాలి. మార్పు రాకపోతే... ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నా విషయానికొస్తే 2014 సూపర్‌హిట్ ఇయర్. ఈ ఏడాది ప్రారంభంలో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించాను. ముగింపులో వచ్చిన ‘ముకుంద’ విజయపథంలో దూసుకుపోతోంది.
 
 బాధ్యత పెంచిన విజయాలు
 - అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు
  ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. నా మ్యూజిక్ డెరైక్షన్‌లో వచ్చిన ‘మనం, హార్ట్ ఎటాక్, ఒక లైలాకోసం, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలు సంగీతపరంగా సంచలనం సృష్టించాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో మ్యూజిక్ డెరైక్టర్‌కి కలిసి రావడం మొదట్నుంచీ జరుగుతోందే. ఈ ఏడాది నాకు కలిసొచ్చింది. దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నా. ఇక బయటి సినిమాల్లో నాకు నచ్చిన ఆల్బమ్ ‘వన్’. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఏడాది అత్యంత బాధాకరమైన విషయం చక్రిగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం. మంచి సంగీత దర్శకుడు. అలాగే గొప్ప వ్యక్తి కూడా. అలాంటాయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను.
 
 పరాజయాలకు కారణం అదే! - మార్తాండ్ కె.వెంకటేశ్, ఎడిటర్
 2014లో ఎడిటింగ్‌లో వచ్చిన పెద్ద మార్పు ఒక్కటే. సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కి మారడం. ఫిల్మ్ ఉన్నప్పుడు... భయం, భక్తి ఉండేది. కానీ... డిజిటల్‌గా మారాక ఆ గౌరవం తగ్గిందనే చెప్పాలి. దర్శకునికి ఒక వెర్షనూ, నిర్మాతకు ఒక వెర్షనూ, హీరోకి ఒక వెర్షనూ చేసి చూపిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివే. కాస్త ఇబ్బందికరమైన విషయం అదే. ఇక ఈ ఏడాది సక్సెస్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం కూడా ఓ విధంగా డిజిటలే అనాలి. ఎందుకంటే... ఫిల్మ్ ఉన్నప్పుడు అనుభవం, అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న సరైన టెక్నీషియన్స్ పనిచేసేవారు. కానీ డిజిటల్ వచ్చాక ఎవరికి వారే ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలకు పనిచేసిన తర్వాత డెరైక్టర్లయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ అనుభవం లేకుండానే డెరైక్టర్లైపోతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు సినిమాల విషయంలో పదిమంది కంట్రిబ్యూషన్ ఉండేది. సినిమా బాగా రాకపోతే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతల ముందు కరాఖండిగా చెప్పేసేవాళ్లం. వెంటనే దానికి తగ్గ మార్పులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు సినిమాలో లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, మన దగ్గరకు రావడం మానేస్తున్నారు. ఇది ఒక రకంగా అనారోగ్యకరమైన వాతావరణమే. ఓవరాల్‌గా డిజిటల్ కారణంగా ఎక్కువ సినిమాలు ఎలా వస్తున్నాయో, అలాగే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నా విషయానికొస్తే ‘దృశ్యం, ఉయ్యాల జంపాల’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశాననే సంతృప్తి ఉంది.
 
 ప్లానింగ్‌తో వెళ్తే విజయాలే! - రామ్‌ప్రసాద్, కెమెరామేన్
 ఈ ఏడాది తెలుగు సినిమా చిత్రీకరణ రీల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కి మారింది. కెమెరా విభాగంలో కొత్తగా చెప్పుకోవాల్సిన మార్పు అదే. నా వరకూ నేను పనిచేసిన ‘ఎవడు’, ‘లెజెండ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కెమెరామేన్‌గా నేను పూర్తి ఆనందంతో ఉన్నాను. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సక్సెస్‌రేట్ తక్కువగా ఉంది. సరైన ప్లాన్‌తో పకడ్బందీగా ముందుకెళ్తే ఈ అపజయాలను కొంతైనా అధిగమించొచ్చు. ఎందుకంటే... ఈ ఏడాది అపజయాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ల సంఖ్య కూడా ఎక్కువే. సరైన ప్లానింగ్ లేకషూటింగ్ డేస్ ఎక్కువై, అనవసరపు ఖర్చు పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా నాకిష్టమైన సినిమాలంటే.. ‘లెజెండ్’, ‘ఎవడు’ సినిమాల పేర్లే చెబుతాను. ఎందుకంటే విమర్శ అయినా, పొగడ్త అయినా... నాకు నేనే చేసుకుంటాను తప్ప మరొకరికి ఆ అవకాశం ఇవ్వను. నిజానికి మన కంటే హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో ఫొటోగ్రఫీ బాగుంటోంది. ఆ సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాధ కల్గుతుంటుంది. నేనెందుకు అంత గొప్పగా చేయలేకపోతున్నాను అని. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాను.
 
 - బుర్రా నరసింహ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement