Nallamalupu Srinivas
-
నిన్నటి ఊసులు రేపటి ఆశలు
కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ రోజుతో 2014కు శుభం కార్డు పడుతోంది. సరికొత్త ఆశలు మోసులెత్తగా, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న వేళ... ఒక్కసారి గడచిన ఏడాది కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే... సినిమా రీలు గిర్రున తిరిగినట్లు ఎన్నెన్నో జ్ఞాపకాలు. వెళ్ళిపోతున్న 2014లో తాము చూసిన మార్పులు, రానున్న 2015కు వచ్చే చేర్పుల గురించి ఆయా విభాగాల్లోని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు... అనుభూతులు... ఎవరికైనా వర్తించే సూక్తి ఇది! - వెంకటేశ్, హీరో 2014లో ‘దృశ్యం’ నాకొక స్వీట్ మెమరీ. సరైన సమయంలో వచ్చిన విజయం అది. ఈ విజయం ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయగల నమ్మకాన్ని నాలో నింపింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ మరో విషయం - యంగ్‌స్టర్స్ చాలామంది కూడా ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం. ఇక సక్సెస్ రేట్ అంటారా! జయాపజయాలు ప్రతి ఏడాదీ ఉండేవే! ఆ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. చక్కని ప్లానింగ్, హార్డ్‌వర్క్‌తో సిన్సియర్‌గా ముందుకెళ్తే విజయం తథ్యం. ఒక సీనియర్ కథానాయకునిగా నా అభిప్రాయమిది! మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడం, ప్రయోగాలు చేయడం... వీటి గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒక వయసు వచ్చాక, రకరకాల పాత్రలు చేసి అనుభవం పొందాక ఇక రొటీన్‌గా వెళ్లడం కరెక్ట్ కాదు. నాకే కాదు, ఎవరికైనా వర్తించే సూక్తి ఇది. అందుకే... వెరైటీ పాత్రలనే ఎన్నుకుంటున్నా. రానున్న 2015లో ‘గోపాల గోపాల’తో రాబోతున్నా. అది కూడా రొటీన్ ఫార్ములా సినిమా కాదు. కథ, కథనం, పాత్రలు కొత్తగా ఉంటాయి. అంతా ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నారు - సుద్దాల అశోక్‌తేజ, గీత రచయిత 2014లో ‘లింగ’, ‘ఐ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పాటలు రాశాను. రచయితగా ఆత్మసంతృప్తినిచ్చిన పాటలైతే ఏమీ రాయలేదు కానీ, సంతృప్తినిచ్చిన పాట మాత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నేను రాసిన ‘నీలిరంగు చీరలోనా...’ పాటే. ఇంకా దాసరిగారి ‘ఎర్రబస్సు’లో కూడా పాట రాశాను. పరిశ్రమ మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది అంత బ్రహ్మండంగా అయితే లేదు. తక్కువగా కూడా ఏమీ అనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు విడుదలై సరిగ్గా ఆడకపోవడం మాత్రం బాధ కలిగించింది. బాధాకరమైన మరో విషయం ఏంటంటే... గొప్ప సాహిత్యం అందించాలని మాకుంటుంది. కానీ... ఆ అవకాశం మాత్రం లభించడం లేదు. ఆత్రేయగారు ఓ మాట అనేవారు. ‘ముందు నీకు నచ్చింది చేయ్. అది వాళ్లకు నచ్చకపోతే... వాళ్లకు నచ్చిట్టు చేయ్’ అని. ఇప్పుడు గీత రచయితలంతా ఫాలో అవుతోంది ఆ సూత్రాన్నే. ఈ ఏడాది ఉన్నంతలో మా గీత రచయితలంతా మంచి సాహిత్యాన్నే అందించారు. కాంట్రవర్సీ అంటేనే కథానాయికా..? - స్వాతి, హీరోయిన్ 2014 సాదాసీదాగా సాగిపోయింది. అయితే కొత్త హీరోయిన్లు కొంతమంది ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆనందం అనిపించింది. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన రాశీఖన్నా నాకు బాగా నచ్చింది. ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన హీరోయిన్లంతా గ్లామర్‌కే పరిమితమైపోయారనే విమర్శను నేను అంగీకరించను. ఎందుకంటే గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో వాళ్లకు తెలీదు. నేను కథానాయికగా కెరీర్ ప్రారంభించాక, మొదట్లో అభినయ ప్రధానమైన పాత్రలకే మొగ్గు చూపాను. కానీ కెరీర్ దీర్ఘకాలం కొనసాగాలంటే, గ్లామర్‌గా కనిపించక తప్పదు. అందుకే, ‘స్వామి రా రా’ నుంచి నా అభిమతాన్ని మార్చుకొని కాస్త గ్లామర్‌గా కనిపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు తెలుస్తోంది గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో! ఈ ఏడాది అభినయపరంగా చెప్పాల్సి వస్తే -‘మనం’ సినిమాలో సమంత, శ్రీయల గురించి చెప్పాలి. సమంతది నిజంగా చాలా విచిత్రమైన పాత్ర. అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. ఇక శ్రీయ అయితే... ఆ సినిమాలో వెంకటగిరి చీర కట్టుకొని ఎంత అందంగా కనిపించారో! అలాగే.. ‘గీతాంజలి’ సినిమాలో అంజలి పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఆ దర్శకుడు తీయనున్న తదుపరి చిత్రంలో నేనే కథానాయికను. అయితే, అందరూ అది ‘గీతాంజలి’కి సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ, అదొక కొత్త కథ. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల గురించి చెప్పే ముందు.. నాపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్. నాకు పెళ్లి ఖాయమైందనీ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయబోతున్నాననీ ఓ రూమర్ నాకెంత తలనొప్పి తెప్పించిందో మాటల్లో చెప్పలేను. ఆ టైమ్‌లో నేను ఫారిన్లో ఉన్నా. ఒకటే ఫోన్లు. ‘పెళ్లి కొడుకు కూడా ఎవడో మీరే చెప్పేయండి... ఓ పని అయిపోతుంది’ అని మీడియా వారితో ఘాటుగా స్పందించా. అలాగే... కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తే... వాటికి వేరే రంగు పులిమి మాట్లాడటం నన్ను కాస్త బాధించింది. ఇక శ్వేతాబసు ఉదాంతం గురించి చెప్పేదేముంది. తన విషయంలో అందరూ ఓవర్‌గానే రియాక్టయ్యారు. చివరకు కాంట్రవర్సీ అంటేనే కథానాయిక అన్నట్లు తయారైంది సొసైటీ. దర్శకులే బాధ్యులు! - బోయపాటి శ్రీను, దర్శకుడు ఈ ఏడాది తొలినాళ్లలో బలహీనమైన బాక్సాఫీస్‌కి కొత్త ఊపిరులూదిన చిత్రం నా ‘లెజెండ్’. ఇది నేను గర్వంగా చెప్పుకునే అంశం. అయితే ఈ ఏడాది అత్యధికంగా చిత్రాలు విడుదలైనా, విజయాలు మాత్రం అరకొరగానే ఉండడం నన్ను బాధించింది. సినిమా సమష్టికృషి అయినా, జయాపజయాలకు బాధ్యులు కచ్చితంగా దర్శకులే. దర్శకుని సృజన పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ ఏడాది విడుదలైన ‘మనం’, ‘రన్ రాజా రన్’ సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. బాలయ్య వందో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాను నేను డెరైక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నా దగ్గరైతే కథ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బాలయ్య స్టేటస్‌కు తగ్గ కథను తయారు చేసి, మళ్లీ ఆయనకు ఘన విజయాన్ని అందిస్తా. ఆ సత్తా నాలో ఉంది. పరిశ్రమ పరిస్థితి బాగా లేదు! - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), నిర్మాత ఈ ఏడాది ఆర్టిస్టుల పరిస్థితి హ్యాపీ... టెక్నీషియన్ల పరిస్థితీ హ్యాపీ. కానీ నిర్మాతల పరిస్థితే దారుణంగా తయారైంది. దానికి కారణం నిర్మాతల పొరపాట్లే. ఇక్కడ నిర్మాతకు నిర్మాతే శత్రువు. ఈ కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం. ముందు నిర్మాతల్లో మార్పు రావాలి. మార్పు రాకపోతే... ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నా విషయానికొస్తే 2014 సూపర్‌హిట్ ఇయర్. ఈ ఏడాది ప్రారంభంలో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించాను. ముగింపులో వచ్చిన ‘ముకుంద’ విజయపథంలో దూసుకుపోతోంది. బాధ్యత పెంచిన విజయాలు - అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. నా మ్యూజిక్ డెరైక్షన్‌లో వచ్చిన ‘మనం, హార్ట్ ఎటాక్, ఒక లైలాకోసం, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలు సంగీతపరంగా సంచలనం సృష్టించాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో మ్యూజిక్ డెరైక్టర్‌కి కలిసి రావడం మొదట్నుంచీ జరుగుతోందే. ఈ ఏడాది నాకు కలిసొచ్చింది. దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నా. ఇక బయటి సినిమాల్లో నాకు నచ్చిన ఆల్బమ్ ‘వన్’. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఏడాది అత్యంత బాధాకరమైన విషయం చక్రిగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం. మంచి సంగీత దర్శకుడు. అలాగే గొప్ప వ్యక్తి కూడా. అలాంటాయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. పరాజయాలకు కారణం అదే! - మార్తాండ్ కె.వెంకటేశ్, ఎడిటర్ 2014లో ఎడిటింగ్‌లో వచ్చిన పెద్ద మార్పు ఒక్కటే. సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కి మారడం. ఫిల్మ్ ఉన్నప్పుడు... భయం, భక్తి ఉండేది. కానీ... డిజిటల్‌గా మారాక ఆ గౌరవం తగ్గిందనే చెప్పాలి. దర్శకునికి ఒక వెర్షనూ, నిర్మాతకు ఒక వెర్షనూ, హీరోకి ఒక వెర్షనూ చేసి చూపిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివే. కాస్త ఇబ్బందికరమైన విషయం అదే. ఇక ఈ ఏడాది సక్సెస్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం కూడా ఓ విధంగా డిజిటలే అనాలి. ఎందుకంటే... ఫిల్మ్ ఉన్నప్పుడు అనుభవం, అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న సరైన టెక్నీషియన్స్ పనిచేసేవారు. కానీ డిజిటల్ వచ్చాక ఎవరికి వారే ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలకు పనిచేసిన తర్వాత డెరైక్టర్లయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ అనుభవం లేకుండానే డెరైక్టర్లైపోతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు సినిమాల విషయంలో పదిమంది కంట్రిబ్యూషన్ ఉండేది. సినిమా బాగా రాకపోతే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతల ముందు కరాఖండిగా చెప్పేసేవాళ్లం. వెంటనే దానికి తగ్గ మార్పులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు సినిమాలో లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, మన దగ్గరకు రావడం మానేస్తున్నారు. ఇది ఒక రకంగా అనారోగ్యకరమైన వాతావరణమే. ఓవరాల్‌గా డిజిటల్ కారణంగా ఎక్కువ సినిమాలు ఎలా వస్తున్నాయో, అలాగే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నా విషయానికొస్తే ‘దృశ్యం, ఉయ్యాల జంపాల’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశాననే సంతృప్తి ఉంది. ప్లానింగ్‌తో వెళ్తే విజయాలే! - రామ్‌ప్రసాద్, కెమెరామేన్ ఈ ఏడాది తెలుగు సినిమా చిత్రీకరణ రీల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కి మారింది. కెమెరా విభాగంలో కొత్తగా చెప్పుకోవాల్సిన మార్పు అదే. నా వరకూ నేను పనిచేసిన ‘ఎవడు’, ‘లెజెండ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కెమెరామేన్‌గా నేను పూర్తి ఆనందంతో ఉన్నాను. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సక్సెస్‌రేట్ తక్కువగా ఉంది. సరైన ప్లాన్‌తో పకడ్బందీగా ముందుకెళ్తే ఈ అపజయాలను కొంతైనా అధిగమించొచ్చు. ఎందుకంటే... ఈ ఏడాది అపజయాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ల సంఖ్య కూడా ఎక్కువే. సరైన ప్లానింగ్ లేకషూటింగ్ డేస్ ఎక్కువై, అనవసరపు ఖర్చు పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా నాకిష్టమైన సినిమాలంటే.. ‘లెజెండ్’, ‘ఎవడు’ సినిమాల పేర్లే చెబుతాను. ఎందుకంటే విమర్శ అయినా, పొగడ్త అయినా... నాకు నేనే చేసుకుంటాను తప్ప మరొకరికి ఆ అవకాశం ఇవ్వను. నిజానికి మన కంటే హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో ఫొటోగ్రఫీ బాగుంటోంది. ఆ సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాధ కల్గుతుంటుంది. నేనెందుకు అంత గొప్పగా చేయలేకపోతున్నాను అని. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాను. - బుర్రా నరసింహ -
చెర్రీ... బాబాయ్ జట్టు నేను... పెదనాన్న జట్టు
మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో నట వారసుడు వరుణ్‌తేజ్. ఫస్ట్ లుక్‌తోనే అభిమానుల్లో అంచనాలు పెంచేసిన ఘనత ఈ యువ హీరోది. వరుణ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘ముకుంద’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరుణ్‌తో సాక్షి జరిపిన సంభాషణ. కెమెరా ముందు తొలి అనుభవం ఎలా ఉంది? భయమేసిందండీ. నా అదృష్టం బావుండి ఫస్ట్ మాంటేజస్ షాట్స్ తీశారు. తర్వాత ఫైట్లు తీశారు. నేను ఫైట్లు బాగా చేస్తాను. ఎందుకంటే ముందే కొంత ట్రైనింగ్ తీసుకున్నా. తర్వాత ఓ చిన్న డైలాగ్‌తో యాక్టింగ్ పార్ట్ మొదలైంది. ఫస్ట్ నాలుగు టేకులు తీసుకున్నా. శ్రీకాంత్ అడ్డాల ఎక్స్ప్రెషన్తో సహా నెరేట్ చేసేవారు. అందుకే పోను పోను కేరక్టర్‌లోకి వెళ్లిపోయా. ఇందులో మీ పేరు ముకుందానా? అవును... అయితే సినిమాలో ఆ పేరెక్కడా వినిపించదు. ఓ సన్నివేశంలో ఫామ్‌పై ‘ముకుంద’ అని సైన్ చేస్తాను. ఆ సన్నివేశం తర్వాతే ఆ టైటిల్ ఖరారు చేశారు. టైటిల్‌కి తగ్గట్టే నా పాత్ర కూడా శ్రీకృష్ణుణ్ణి పోలి ఉంటుంది. కృష్ణుడు ఏం చేసినా లోక కల్యాణం కోసమే. అలాగే ఇందులో నేను కూడా. మాటలు తక్కువ. పనులు ఎక్కువ. భావోద్వేగాలను ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయను. నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ, పాత్రకు తగ్గట్టుగా సీరియస్‌గా చేయాల్సొచ్చింది. మెగా ఫ్యాన్స్ మాస్ పాత్రలే ఇష్టపడతారు. ఇందులో ఆలా ఉంటారా? మా ఫ్యామిలీలో ఎవరూ కావాలని మాస్ పాత్రలు చేయలేదు. వచ్చిన పాత్రల్ని ఎంత బాగా చేయొచ్చో అంత బాగా చేసి, మెప్పించారు. ఆటోమేటిగ్గా మాస్ ఇమేజ్ వచ్చింది. నేనూ అదే దారిలో వెళ్తా. ఇంతమంది దర్శకులుండగా శ్రీకాంత్‌నే ఓకే చేయడానికి కారణం? మేం ఆయన్ను ఓకే చేయడం కాదు, ఆయనే నన్ను ఓకే చేశారు. శ్రీకాంత్‌లాంటి డెరైక్టర్ తనకు తానుగా వచ్చి అడగడంతో నాన్న ఓకే చెప్పేశారు. ఓ అగ్ర నిర్మాత నన్ను ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు. అయితే... శ్రీకాంత్‌గారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆ ప్రాజెక్ట్ పూరి జగన్నాథ్‌గారి దగ్గరకెళ్లింది. ఆయన ‘హార్ట్ ఎటాక్’ కథ వినిపించారు. బాగుందనిపించినా కానీ... కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఫైనల్ కాలేదు. తర్వాత క్రిష్ ఓ కథ వినిపించారు. మొదటి సినిమానే ఇంత పెద్ద కథా అని భయమేసింది. కథ నచ్చడంతో ‘ఆగస్ట్ 8న షూటింగ్ స్టార్ట్’ అని ట్విట్టర్లో పెట్టాను. అయితే... క్రిష్ ‘గబ్బర్’ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల అది మెటీరియలైజ్ కాలేదు. ఏదేమైనా ఫస్ట్ కలిసింది శ్రీకాంత్‌గారే కాబట్టి ఆయనకే సినిమా చేయడం న్యాయమని నాన్న ఫీలయ్యారు. ఫస్ట్ నుంచి నటుడవ్వాలనే కోరిక ఉండేదా మీకు? మనసులో ఉండేది. 122 కిలోల బరువుండేవాణ్ణి. అందుకే చెప్పుకునేవాణ్ణి కాదు. మెల్లమెల్లగా 55 కిలోలు తగ్గాను. దాంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ‘మగధీర’ షూటింగ్ అప్పుడు ఫొటోలు దిగితే, అవి చూసి.. ‘నీది ఫొటోజనిక్ ఫేస్... ఇంట్రస్ట్ ఉంటే ట్రై చేయ్’ అని పెదనాన్న అన్నారు. స్వయంగా పెదనాన్నే అనేసరికి నా కోరిక చెప్పేశాను. ఇక, అమ్మానాన్న అయితే, నేనేం చేస్తానన్నా సపోర్ట్ చేస్తారు. స్పోర్ట్స్ బాగా ఆడతారా? ఇదివరకు లావుగా ఉండేవాణ్ణి కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ణి. ఇప్పుడు రెగ్యులర్‌గా ఆడుతున్నా. ఏడాది బాటు టెన్నిస్ ఆడాను. తర్వాత ఏడాదిన్నర పాటు బ్యాడ్మింటన్ ఆడా. రెండేళ్ల నుంచి వాలీబాల్ ఆడుతున్నా. ‘ముకుంద’లో నేను వాలీబాల్ ప్లేయర్‌ని. ఆ పాత్రకు నా స్పోర్ట్స్ నాలెడ్జ్ బాగా ఉపయోగపడింది. నటనలో మీకెవరు ఇన్స్పిరేషన్? పెదనాన్నే... ఆయన ‘విజేత’ సినిమా చూసి ఏడ్చేవాణ్ణి. గ్యాంగ్‌లీడర్, ఘరానామొగుడు, ముఠామేస్త్రీ చిత్రాలు చాలాసార్లు చూశాను. కమల్‌హాసన్ నటనంటే ప్రాణం. హాలీవుడ్లో ఆర్నాల్డ్, తెలుగులో ప్రభాస్ ఫైట్లంటే ఇష్టం. వారిని ప్రేరణగా తీసుకుంటాను తప్ప... ఇమిటేట్ చేయను. పెదనాన్న, బాబాయ్... వీళ్లద్దరిలో ఎవరంటే ఇష్టం? ఇద్దరూ ఇష్టమే. అయితే... పెద్దనాన్నంటే కాస్త ఎక్కువ ఇష్టం. నేనాయన పెట్ని. వీకెండ్లో ఆయన దగ్గరే ఉండేవాణ్ణి. చెర్రీ (రామ్ చరణ్) అన్నయ్య, కల్యాణ్బాబాయ్ ఓ జట్టు. నేను పెదనాన్న జట్టు. మీ ఫ్యామిలీపై వచ్చే రూమర్లు వింటే మీకేమనిపిస్తుంది? కొన్ని రూమర్లు చూస్తే నవ్వొస్తుంటుంది. ఎవరింట్లో సమస్యలుండవ్ చెప్పండి? కూర వండితే ఒకరికి నచ్చుతుంది. ఒకరికి నచ్చదు. మా ఇంట్లో సమస్యలు కూడా అలాంటివే. ‘ఆరంజ్’ టైమ్‌లో నాన్న కాస్త ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూశారు. అప్పుడు పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరూ నాన్నకు సపోర్ట్‌గా నిలిచారు. నైట్ పార్టీలకు వెళ్తుంటారా? అలాంటివి నాన్న పోత్సహించరు. ఇదివరకు రెండుమూడు సార్లు పబ్‌లకు వెళ్లా. అక్కడ వీకెండ్స్‌లో అమ్మాయిలు లేకపోతే రానీయరు. అందుకే వెనక్కి వచ్చేశాం. కొంతమందైతే.. ‘నేను ఎవరబ్బాయినో తెలుసా?’ అని ఆర్గ్యూ చేస్తారు. నాకు అలా చెప్పుకోవడం నచ్చదు. అందుకే అలాంటి ప్లేస్‌లకు వెళ్లకూడదనుకున్నా. నైట్ కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం. కారు తీసి అలా ఓ రౌండ్ వేసి వస్తుంటా. నెక్ట్స్ సినిమాలు? క్రిష్, పూరీ... ఇద్దరి సినిమాలూ ఓకే చేశా. - బుర్రా నరసింహ -
ఫుల్ క్లారిటీ...
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా తెరపై చూడాలని మెగా అభిమానులందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని రోజుల్లోనే వరుణ్ తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అతని తొలి సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైన విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత. లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. ఈ నెలాఖరుకి టాకీ పూర్తవుతుందని, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని యూనిట్ సభ్యుల సమాచారం. గోదావరి జిల్లాల్లోని భీమవరం, అమలాపురం... తదితర అందమైన ప్రదేశాల్లో 35 రోజుల పాటు తీసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట. కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన ఫుల్ క్లారిటీ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజానికి ఈ సినిమాకు ఇప్పటివరకూ టైటిల్‌ని ఖరారు చేయలేదన్నది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్. -
మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం!
కథ పాతదా, కొత్తదా అనేది ముఖ్యం కాదు. బాగా తీశారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. ఆ విధంగా చూసుకుంటే... ‘రేసుగుర్రం’ నిజంగా మంచి సినిమా అంటున్నారు అల్లు అర్జున్. ఈ నెల 11న ‘రేసుగుర్రం’గా ప్రేక్షకుల ముందుకు దూసుకురానున్నారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం తనకు భారీ విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారాయన. నేడు బన్నీ పుట్టినరోజు. ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ. మంచి హ్యాపీమూడ్‌లో ఉన్నట్టున్నారు? మరి హ్యాపీనే కదండీ... అల్లువారింట్లో మరో హీరో పుట్టాడంటున్నారు! ఊరుకోండి సార్.. బేబీని పట్టుకొని హీరో ఏంటి! వాడు పెరగనీయండి. తర్వాత చూద్దాం. అసలు నాన్న అయిన ఫీలింగ్ ఎలా ఉంది? ఇంకా ఆ మూడ్ నుంచి బయటకు రాలేదు. అమ్మాయిల్లో మీకుండే ఫాలోయింగే వేరు. ఇప్పుడు బన్నీ ఓ బిడ్డకు తండ్రి అంటే.. ఆ విషయాన్ని వాళ్లు తేలిగ్గా జీర్ణించుకోలేరేమో! మీకు తెలీదేమో... ఎంత మెచ్యూరిటీ ఉంటే అమ్మాయిలు అంత ఇష్టపడతారు(నవ్వుతూ) పేరేమైనా అనుకుంటున్నారా? లేదు... పేర్లయితే వింటున్నాను. మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కూడా మంచి పేరు ఉంటే చెప్పండని అడుగుతున్నాను. మంచి పేరు ఉంటే మీరు చెప్పినా పర్లేదు. జన్మ నక్షత్రాలను బట్టి కాదా పేర్లు పెట్టేది? ఆ సెంటిమెంట్లు మీకు లేవా? అసలు అలాంటివి నమ్మను నేను. పేరు బాగుంటే పెట్టేయడమే. ఇంతకీ అబ్బాయి అమ్మ పోలికా, నాన్న పోలికా? అప్పుడే అర్థం కాదు. ముందు ముందు తెలుస్తుంది (నవ్వుతూ) ‘రేసుగుర్రం’ విషయానికొద్దాం. ఈ టైటిల్ మీకే యాప్ట్ అని అంటున్నారు. మీరేం అంటారు? అదే నాకూ అర్థం కావడంలేదు. అందరూ ఇదే మాట. బహుశా, నాకు ప్రతి విషయంలోనూ వేగం ఎక్కువ. ఆ కారణంగానే... అలా ఉంటున్నారేమో. అసలు ఇది ఎలాంటి సినిమా? యాక్షన్ ఎంటర్టైనర్. అంతకు మించి చెబితే కిక్ ఉండదు. చూస్తేనే కరెక్ట్. యాక్షన్ ఎంటర్టైనర్లు చాలా చేశారుగా. మరి ఇందులో కొత్తదనం ఏంటి? ‘ఆర్య’ సినిమా బావుంటుంది. అలాగే కొత్తగా ఉంటుంది. ‘బన్నీ’ సినిమా బావుంటుంది. అయితే... పాతగా ఉంటుంది. రెండూ హిట్లే. సో... ఇక్కడ బాగుండటం ముఖ్యం. ‘రేసుగుర్రం’ కచ్చితంగా బావుంటుంది. కథలో పాత ఫ్లేవర్ కనబడకుండా ఎంతవరకూ కొత్తగా చూపించొచ్చో అంతవరకూ ప్రయత్నించాం. అందుకే దీన్ని భిన్నమైన సినిమా అని చెప్పను. రెగ్యులర్ ఫిలిమే. స్క్రీన్‌ప్లే కూడా సురేందర్‌రెడ్డి గత చిత్రాల్లా ఉండదు. స్ట్రయిట్ నేరేషన్ ఫిలిం. ఫ్యాష్బ్యాక్లు కూడా ఏమీ ఉండవు. అన్నదమ్ముల మధ్య సాగే కథ. మాస్‌కి కావాల్సిన అన్ని అంశాలు మాత్రం మెండుగా ఉంటాయి. బాలీవుడ్లో కొత్త కథలొస్తున్నాయి. వాణిజ్యపరంగా కూడా అవి విజయాలు చవిచూస్తున్నాయి. మీలాంటి హీరోలు పూనుకుంటే... ఇక్కడా మంచి సినిమాలొస్తాయి. ఎన్నాళ్లు ఈ యాక్షన్ ఎంటర్టైనర్లు? కచ్చితంగా.. అందుకు నేనూ రెడీ. అయితే... అది నా ఒక్కడి చేతుల్లో లేదు. డెరైక్టర్ సైడ్ నుంచి కూడా రావాలి. దర్శకుడు ప్రయోగాత్మకంగా ఆలోచించగలగాలి. దాసరి, రాఘవేంద్రరావుగార్ల టైమ్‌లో ఓ వైపు బాపుగారు, కె.విశ్వనాథ్‌గారు ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వెళుతూ.. వాణిజ్యపరంగానూ విజయాన్ని అందుకోగల దర్శకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ మధ్య ‘క్వీన్’ సినిమా చూశాను. అద్భుతం అనిపించింది. అలా తీస్తే ఎక్కడైనా విజయం తథ్యం. ‘క్వీన్’ చూశాక ‘ఇలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నామనే నిర్వేదానికి లోనై ఉండాలే? యాక్టర్‌గా సినిమా చేయడం తేలిక, స్టార్‌గా సినిమా చేయడం కష్టం. ఎందుకంటే స్టార్‌కి రెస్పాన్సిబిలిటి ఎక్కువగా ఉంటుంది. అందరి శ్రేయస్సునూ గుర్తెరిగి ముందుకెళ్లాలి. కానీ బాలీవుడ్లో స్టార్లందరూ యాక్టర్లయిపోతున్నారు. పాత్రల కోసం ఏ రిస్కునైనా చేస్తున్నారు? అందుకే వాళ్లకు స్టార్డమ్ తగ్గిపోతోంది. అసలు బాలీవుడ్లో సల్మాన్, షారుక్, ఆమిర్, అక్షయ్, హృతిక్... తప్ప ప్రేక్షకులను హాలుకు రప్పించేవారు ఎవరున్నారు చెప్పండి? కానీ... మనకు పదిమంది దాకా ఉన్నారు. ఇద్దరు హీరోలు కలిస్తే కానీ అక్కడ ఓపెనింగ్స్ రాని పరిస్థితి. ఇక్కడ అలాకాదు... పదిమంది క్రౌడ్పుల్లర్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే నటునిగా ఎదగాలి. అదే నా ధ్యేయం. స్టార్లు ఎక్కువవ్వడంవల్లే మల్టీస్టారర్లు ఇక్కడ వేగాన్ని అందుకోలేకపోతున్నాయని భావించొచ్చా? మల్టీస్టారర్లు బాలీవుడ్వారికి అవసరమండీ. మనకు అక్కర్లేదు. పైగా ఇక్కడ మల్టీస్టారర్లు తీయడం అంత శ్రేయస్కరం కూడా కాదు. ఉదాహరణకు నాది యాభై కోట్ల మార్కెట్. చరణ్‌ది యాభై కోట్ల మార్కెట్. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటిస్తే అది వందకోట్ల సినిమా అవ్వాలి. కానీ కాదు. అరవై, డబ్భై కోట్లు చేస్తుంది అంతే. పైగా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. ఇద్దరం కలిసి నటించి వందకోట్లు లాగలేనప్పుడు అంత రిస్క్ ఎందుకు చేయాలి చెప్పండి? నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు కదా! ఆ సినిమా మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ నెల 10న ఆ సినిమా పూజా కార్యక్రమం ఉంటుంది. -
మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు : చిరంజీవి
‘‘కష్టపడితేనే పైకొస్తామని, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని మా కుటుంబానికి చెందిన హీరోలందరికీ చెబుతుంటాను. మా అందరికీ అభిమానులే అండా దండా. మా మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా వరుణ్ ఆరున్నర అడుగుల అందగాడు. నాగబాబు చాలా అదృష్టవంతుడు. మెగా అభిమానులందరికీ తనంటే ప్రాణం’’ అన్నారు చిరంజీవి. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ లియో ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ముహూర్తపు దృశ్యానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, చిరంజీవి క్లాప్ ఇచ్చారు. కె. రాఘవేంద్రరావు, వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. పవన్ కల్యాణ్, డి. సురేష్‌బాబు, అల్లు అరవింద్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, అల్లు శిరీష్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని, కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన క్లారిటీ నేపథ్యంలో సాగే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. వచ్చే నెల 15న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని ‘ఠాగూర్’ మధు, నల్లమలుపు బుజ్జి తెలిపారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావు రమేష్, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కి జె. మేయర్, కెమెరా: మణికందన్.