మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం! | Searching for my boy good name : Allu Arjun | Sakshi
Sakshi News home page

మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం!

Published Mon, Apr 7 2014 11:11 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం! - Sakshi

మా అబ్బాయికి మంచి పేరు వెతుకుతున్నాం!

కథ పాతదా, కొత్తదా అనేది ముఖ్యం కాదు. బాగా తీశారా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం.  ఆ విధంగా చూసుకుంటే... ‘రేసుగుర్రం’ నిజంగా మంచి సినిమా అంటున్నారు  అల్లు అర్జున్.  ఈ నెల 11న ‘రేసుగుర్రం’గా ప్రేక్షకుల ముందుకు దూసుకురానున్నారాయన.  సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు కలిసి 
 నిర్మించిన ఈ చిత్రం తనకు భారీ విజయాన్ని  అందిస్తుందని నమ్మకంగా చెబుతున్నారాయన. నేడు బన్నీ పుట్టినరోజు.  ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ. 
 
  మంచి హ్యాపీమూడ్‌లో ఉన్నట్టున్నారు?
 మరి హ్యాపీనే కదండీ...
 
  అల్లువారింట్లో మరో హీరో పుట్టాడంటున్నారు!
 ఊరుకోండి సార్.. బేబీని పట్టుకొని హీరో ఏంటి! వాడు పెరగనీయండి. తర్వాత చూద్దాం. 
 
  అసలు నాన్న అయిన ఫీలింగ్ ఎలా ఉంది?
 ఇంకా ఆ మూడ్ నుంచి బయటకు రాలేదు. 
 
  అమ్మాయిల్లో మీకుండే ఫాలోయింగే వేరు. ఇప్పుడు బన్నీ ఓ బిడ్డకు తండ్రి అంటే.. ఆ విషయాన్ని వాళ్లు తేలిగ్గా జీర్ణించుకోలేరేమో!
 మీకు తెలీదేమో... ఎంత మెచ్యూరిటీ ఉంటే అమ్మాయిలు అంత ఇష్టపడతారు(నవ్వుతూ)
 
  పేరేమైనా అనుకుంటున్నారా?
 లేదు... పేర్లయితే వింటున్నాను. మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని కూడా మంచి పేరు ఉంటే చెప్పండని అడుగుతున్నాను. మంచి పేరు ఉంటే మీరు చెప్పినా పర్లేదు.
 
  జన్మ నక్షత్రాలను బట్టి కాదా పేర్లు పెట్టేది? ఆ సెంటిమెంట్లు మీకు లేవా?
 అసలు అలాంటివి నమ్మను నేను. పేరు బాగుంటే పెట్టేయడమే. 
 
  ఇంతకీ అబ్బాయి అమ్మ పోలికా, నాన్న పోలికా?
 అప్పుడే అర్థం కాదు. ముందు ముందు తెలుస్తుంది (నవ్వుతూ)
 
  ‘రేసుగుర్రం’ విషయానికొద్దాం. ఈ టైటిల్ మీకే యాప్ట్ అని అంటున్నారు. మీరేం అంటారు?
 అదే నాకూ అర్థం కావడంలేదు. అందరూ ఇదే మాట. బహుశా, నాకు ప్రతి విషయంలోనూ వేగం ఎక్కువ. ఆ కారణంగానే... అలా ఉంటున్నారేమో. 
 
  అసలు ఇది ఎలాంటి సినిమా?
 యాక్షన్ ఎంటర్‌టైనర్. అంతకు మించి చెబితే కిక్ ఉండదు. చూస్తేనే కరెక్ట్.
 
  యాక్షన్ ఎంటర్‌టైనర్లు చాలా చేశారుగా. మరి ఇందులో కొత్తదనం ఏంటి? 
 ‘ఆర్య’ సినిమా బావుంటుంది. అలాగే కొత్తగా ఉంటుంది. ‘బన్నీ’ సినిమా బావుంటుంది. అయితే... పాతగా ఉంటుంది. రెండూ హిట్లే. సో... ఇక్కడ బాగుండటం ముఖ్యం. ‘రేసుగుర్రం’ కచ్చితంగా బావుంటుంది. కథలో పాత ఫ్లేవర్ కనబడకుండా ఎంతవరకూ కొత్తగా చూపించొచ్చో అంతవరకూ ప్రయత్నించాం. అందుకే దీన్ని భిన్నమైన సినిమా అని చెప్పను. రెగ్యులర్ ఫిలిమే. స్క్రీన్‌ప్లే కూడా సురేందర్‌రెడ్డి గత చిత్రాల్లా ఉండదు. స్ట్రయిట్ నేరేషన్ ఫిలిం. ఫ్యాష్‌బ్యాక్‌లు కూడా ఏమీ ఉండవు. అన్నదమ్ముల మధ్య సాగే కథ. మాస్‌కి కావాల్సిన అన్ని అంశాలు మాత్రం మెండుగా ఉంటాయి. 
 
  బాలీవుడ్‌లో కొత్త కథలొస్తున్నాయి. వాణిజ్యపరంగా కూడా అవి విజయాలు చవిచూస్తున్నాయి. మీలాంటి హీరోలు పూనుకుంటే... ఇక్కడా మంచి సినిమాలొస్తాయి. ఎన్నాళ్లు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్లు? 
 కచ్చితంగా.. అందుకు నేనూ రెడీ. అయితే... అది నా ఒక్కడి చేతుల్లో లేదు. డెరైక్టర్ సైడ్ నుంచి కూడా రావాలి. దర్శకుడు ప్రయోగాత్మకంగా ఆలోచించగలగాలి. దాసరి, రాఘవేంద్రరావుగార్ల టైమ్‌లో ఓ వైపు బాపుగారు, కె.విశ్వనాథ్‌గారు ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా వెళుతూ.. వాణిజ్యపరంగానూ విజయాన్ని అందుకోగల దర్శకులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ మధ్య ‘క్వీన్’ సినిమా చూశాను. అద్భుతం అనిపించింది. అలా తీస్తే ఎక్కడైనా విజయం తథ్యం. 
 
  ‘క్వీన్’ చూశాక ‘ఇలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నామనే నిర్వేదానికి లోనై ఉండాలే? 
 యాక్టర్‌గా సినిమా చేయడం తేలిక, స్టార్‌గా సినిమా చేయడం కష్టం. ఎందుకంటే స్టార్‌కి రెస్పాన్సిబిలిటి ఎక్కువగా ఉంటుంది. అందరి శ్రేయస్సునూ గుర్తెరిగి ముందుకెళ్లాలి. 
 
  కానీ బాలీవుడ్‌లో స్టార్లందరూ యాక్టర్లయిపోతున్నారు. పాత్రల కోసం ఏ రిస్కునైనా చేస్తున్నారు? 
 అందుకే వాళ్లకు స్టార్‌డమ్ తగ్గిపోతోంది. అసలు బాలీవుడ్‌లో సల్మాన్, షారుక్, ఆమిర్, అక్షయ్, హృతిక్... తప్ప ప్రేక్షకులను హాలుకు రప్పించేవారు ఎవరున్నారు చెప్పండి? కానీ... మనకు పదిమంది దాకా ఉన్నారు. ఇద్దరు హీరోలు కలిస్తే కానీ అక్కడ ఓపెనింగ్స్ రాని పరిస్థితి. ఇక్కడ అలాకాదు... పదిమంది క్రౌడ్‌పుల్లర్స్ ఉన్నారు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే నటునిగా ఎదగాలి. అదే నా ధ్యేయం. 
 
  స్టార్లు ఎక్కువవ్వడంవల్లే మల్టీస్టారర్లు ఇక్కడ వేగాన్ని అందుకోలేకపోతున్నాయని భావించొచ్చా?
 మల్టీస్టారర్లు బాలీవుడ్‌వారికి అవసరమండీ. మనకు అక్కర్లేదు. పైగా ఇక్కడ మల్టీస్టారర్లు తీయడం అంత శ్రేయస్కరం కూడా కాదు. ఉదాహరణకు నాది యాభై కోట్ల మార్కెట్. చరణ్‌ది యాభై కోట్ల మార్కెట్. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటిస్తే అది వందకోట్ల సినిమా అవ్వాలి. కానీ కాదు. అరవై, డబ్భై కోట్లు చేస్తుంది అంతే. పైగా బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది. ఇద్దరం కలిసి నటించి వందకోట్లు లాగలేనప్పుడు అంత రిస్క్ ఎందుకు చేయాలి చెప్పండి?
 
  నెక్ట్స్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నారు కదా!
 ఆ సినిమా మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఈ నెల 10న ఆ సినిమా పూజా కార్యక్రమం ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement