ఆ తర్వాతే ‘విజయ నిర్మల’ అయ్యా : విజయనిర్మల
‘‘మరో వందేళ్లయినా తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనివి విజయా వారి చిత్రాలు. మా ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం ప్రారంభోత్సవానికి ఆ స్టూడియోలో అమ్మోరు విగ్రహం సెట్ వేయించాను. నాగిరెడ్డిగారిని కెమెరా స్విచ్చాన్ చే సి, చక్రపాణిగారిని క్లాప్ ఇవ్వమని అడిగాను. కానీ చక్రపాణిగారు మాత్రం నాగిరెడ్డి హస్తవాసి మంచిది. ఆయననే క్లాప్ ఇవ్వమన్నారు. అలాగే చేశారు. అప్పుడు నాగిరెడ్డిగారు ‘‘ ‘పాతాళభైరవి’ సినిమాలోని పెద్ద విగ్రహం సెట్ కూడా ఇక్కడే వేశాం. ఆ చిత్రంలానే ‘అల్లూరి సీతారామరాజు’ కూడా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు. ఆయన మాటలు అక్షరాలా నిజమయ్యాయి’’ అని హీరో కృష్ణ చెప్పారు.
ప్రముఖ నిర్మాత బి. నాగిరెడ్డి జ్ఞాపకార్థం ప్రతి ఏటా అందించే శ్రీ బి.నాగిరెడ్డి స్మారక పురస్కారాన్ని 2014 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ చిత్రానికి ప్రకటించారు. ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘రేసు గుర్రం’ చిత్ర నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా. వెంకటేశ్వరరావులకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డు ప్రదానం చేశారు. సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మాట్లాడుతూ- ‘‘విజయా వారి చిత్రాల్లో నటించాక విజయనిర్మల అయ్యాను. ‘షావుకారు జానకి’ చిత్రాన్ని నాగిరెడ్డిగారు తమిళంలో రీమేక్ చేశారు.
అందులో జానకిగారు చేసిన పాత్రను నేనే చేశాను. ఈ సినిమాలో నేను ఎస్వీ రంగారావు పక్కన నటించాలి. కానీ, నేను చాలా పీలగా ఉన్నాననీ, ఆయనకు సరిజోడీగా ఉండనని ఎస్వీఆర్ వేరే అమ్మాయిని తీసుకోమన్నారు. కానీ నాగిరెడ్డిగారు ఎస్వీఆర్‌గారిని తీసేసి ఆయన పాత్రలో సుబ్బారావుగారిని ఎంపిక చేశారు. ఆయన పట్టుదలకు నిదర్శనం ఇది’’ అని చెప్పారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ -‘‘ఈ సినిమాకు అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డు ద్వారా వచ్చిన నగదును విజయా సర్వీసెస్ విభాగానికి అందజేస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘నాగిరెడ్డిగారు మంచి చిత్రాలు తీసి ఉండకపోతే తెలుగు సినిమాకు అంత మంచి చరిత్ర ఉండేదే కాదు. ఈ అవార్డు నాకు ఒక బూస్ట్‌లా ఉపయోగపడుతుంది’’ అని చిత్రదర్శకుడు సురేందర్‌రెడ్డి చెప్పారు.
ఈ అవార్డు కమిటీ జ్యూరీ సభ్యుల్లో ఒకరైన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ- ‘‘ఓ నిర్మాతకు సత్కారం చేయడం నిజంగా దేశంలో ఏ సంస్థ చేయలేదు. కానీ విజయా సంస్థ వారు చేయడం, అందులో నాకూ భాగస్వామ్యం కల్పించడం నిజంగా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ సమావేశానికి ముందు విజయా వారి చిత్రాల్లోని అలనాటి పాటలతో జరిగిన సంగీత విభావరి ఆహూతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని రావు బాలసరస్వతి, సింగీతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.