SUDDALA asokteja
-
రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి
సినీ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ వెల్మజాల (గుండాల) : జన్మభూమి, కన్నతల్లి రుణం తీర్చుకునేందుకే అమ్మఒడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జాతీయ అవార్డు గ్రహీత, సుద్దాల ఫౌండేషన్ చైర్మన్ సుద్దాల అశోక్‌తేజ అన్నారు. గురువారం మండలంలోని వెల్మజాల గ్రామంలో గుర్రం జానకమ్మ, హన్మంతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో మాతృమూర్తులను సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసవమనే ప్రళయం నుంచి అష్టకష్టాలుపడి మనకు అమ్మ జన్మనిస్తే ఆమెకు కూడు పెట్టని రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు జానకమ్మ, హన్మంతుల పేరిట ఫౌండేషన్ స్థాపించి చంద్రునికో నూలు పోగులాగ తన వంతు సహాయంగా మాతృమూర్తులకు అమ్మ ఒడి, రైతులకు అమ్మ మడి, చిన్నారులకు అమ్మ బడి కార్యక్రమాలు స్థాపించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. జన్మనిచ్చిన ఊరుకు, తల్లిదండ్రులకు తగిన గౌరవం కల్పించినప్పుడే సమాజంలో సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు. సుద్దాల ఫౌండేషన్ ద్వారా శాశ్వతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని, తనకు రాజకీయంపై ఎలాంటి ఆశలు లేవని, కేవలం సంఘ సేవకే పరిమితమవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30 మంది మాతృమూర్తులను ఘనంగా సన్మానించారు. ఎంపీపీ సంగి వేణుగోపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ కాలె మల్లేషం, స్థానిక సర్పంచ్ మేకల రమేష్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గడ్డమీది పాండరి, సీపీఐ మండల కార్యదర్శి కుసుమని హరిశ్చంద్ర, ప్రజా కవులు రచ్చ భారతి, సునీతారెడ్డి, హరగోపాల్ పాల్గొన్నారు. -
పరిమళాల పూబోణి... కృష్ణవేణి
ప్రతి సభలో ‘నా పాటల తండ్రి సినారె’ అంటూ నువ్వు సభికులతో చప్పట్లు కొట్టించుకుంటావు. నిజానికి సినారె నా తండ్రి - అంది సినారె పాట.‘మూడు వేల పాటల్లో నీవెవరు సోదరీ’ అన్నాను. ‘‘ఈ వరుసలేంటి’’అంది. ‘‘మనం ఇద్దరం సినారెని తండ్రి అంటాం. కనుక నాకు నీవు సోదరివే, చెప్పక్కా.’’ నేను శిఖరమస్తకుడు అని సినారెతో పిలిపించుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు, అభినేత్రి వాణిశ్రీ నటించి రామకృష్ణ - సుశీల ఆలపించిన కృష్ణవేణిని అంది.సంగీతం విజయభాస్కర్. దర్శకుడు అద్భుత దార్శనిక దర్శకుడు వి.మధుసూదన్‌రావు. కథ చెబుతూ పెళ్లయ్యాక కృష్ణానదీ పరివాహక ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీ పర్వతం - నాగార్జున సాగర్ నుండి సముద్రంలో సంగమించే హంసలదీవి దాకా పాటను నడిపించాలని చెప్పి తయారించిన బాణిని సినారె ముందుంచారు.సినీరంగంలోకి రాకమునుపే ‘కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు’ నాగార్జున సాగర కావ్యంలో పలికించిన నా పాటల తండ్రిలోని కవితా పారిజాత హృదయం చిరునవ్వు నవ్వుకుంది తెలుగు మల్లెపూవులా. రావాల్సిన పాటే వచ్చిందే అని... ‘‘నాయిక చూపు నది వైపుగా నాయకుని చూపు తనదిగా (పెళ్లయింది కనుక) మారిన నాయిక వైపుగా ఇలా నాయకానాయిక హృదయాల్లోకి దూకు తండ్రీ’’ అన్నాను. నా తండ్రి సినారెతో - ఇచ్చిన బాణీ దారి చూపుతుంటే పలికాడు సినారె... ఆమె పల్లవిగా ‘‘కృష్ణవేణీ... తెలుగింటి విరబోణీ’ అతడేమనాలో క్షణంలో వెయ్యోవంతు ఆలస్యం లేకుండా ‘‘కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ’’ అంటుండగా - చిన్నారి చిరు పల్లవి వచ్చేసింది. పాట ప్రారంభమయ్యేది శ్రీ పర్వతం నుండి కదా ‘‘శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు’’ నిజానికి నాగార్జున సాగరంలో విద్యుత్తు కూడా పుడుతుంది. నాయికతో విద్యుల్లతలు అనిపించాను కనుక నాయకునితో ఏమనిపించాలనుకున్నారు. సినారె కళ్లలో దయ - ఒళ్లంత లయ తొణికిసలాడుతుంది. ఏళ్లుఏళ్లుగా... మనసు వెన్నపూస - మాటలో ప్రాస - తనది. అందుకే పైన విద్యుల్లతకు అనుబంధంగా ‘లావణ్యలతవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగిస్తావనిపించాడు.’’ నాగార్జున గిరి కౌగిట ఆగి - నీళ్లను బంగారు చేలుగా మార్చేవు అనిపించాడు. నాయికది ‘వస్తువుపైన ఆలోచన కనుక బంగారు చేలు అన్నది కాబట్టి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని (జీవితాంతం ఆరిపోని) వలపులు పండించమనిపించాడు. కృష్ణానదితో పాటు - వెళుతుంది సినారె కలం... అమరావతిలో రాళ్లను అందాల రమణులుగా తీర్చిదిద్దేవంటే ఏ శిల్పరమణులకు - ఏ దివ్యలలనులకు నోచని అందాలు దాచిన కృష్ణవేణి - అని/ ఆ తర్వాత చరణంలో... అభిసారిక అంటే ప్రియుని కోసం వెతుక్కుంటూ వెళ్లే నాయిక. ఇక్కడ నది కూడా సముద్రం కోసం వెళుతూ ఉంటుంది కనుక వాణిశ్రీ నోట ‘అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయంతో సంగమించావంటే, కృష్ణంరాజుతో కొసమెరుపుగా నా మేని సగమై - నా ప్రాణ సుధవై సుధ అని ఎందుకనాలి సుధ అంటే సలిల సంబంధి అమృతం బతికించేది గనుక నిఖలము నీవై నిలిచిన కృష్ణవేణి అంటూ నదిని, పాటని అంటూ సాగరానికి - ఇటు ప్రేక్షకుల హృదయ సాగరాలకు చేర్చుతాడు సినారే. ఒక్కోపాట రాయడానికి పరిసరాలు - హృదయ పరిమళాలు కూడా తెలిసుండాలని ఆ రెంటిని కలిపే చతురతా ప్రాభవాలు కవి కలిగుండాలని పాట ద్వారా చూపిన నా తండ్రికి ఇటీవలే ‘కేంద్ర సాహిత్య ఫెలో’ అవార్డు వచ్చింది తెలుసా తేజా అంటూ సాయం సంధ్యవేళ నా తండ్రి రవీంద్రభారతికి వచ్చుంటాడు. వస్తా... అంటూ పరిమళాల నెవడాపునంటూ మా ఉప్పల్ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా సాగిపోయింది కృష్ణవేణిలోని కృష్ణవేణి పాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఊగించే తూగించే పాట
నా పాట నాతో మాట్లాడుతుంది కేవలం 28 సినిమాలలో 300 పాటలు రాసి వాసికెక్కిన పదమాంత్రికుడు నా తండ్రి పింగళి. పింగళి ‘హలా’ పదంపై ఒక అపోహ ఉంది. ‘హలో’ ఆంగ్లపదాన్ని ‘హలా’గ మార్చి జగదేకవీరుని కథ సంభాషణల్లో కూర్చాడని. అది సరికాదు. శబ్దార్థ నిఘంటువులో ‘హలా’ అంటే అనుంగు చెలికత్తెను పిలిచే పిలుపు! తెలంగాణలో త్వరగా రా అనే సందర్భంలో ‘ఎల్లెం రా’ అంటారు. ఎల్లెం ఏ పదం నుండి మాండలికంగా పురుడుపోసుకుందని గవేషిస్తే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాడే పింగళి పాట పల్లవి ఇలా ఉంటుంది. ‘‘స్వాముల సేవకు వేళాయే/ వైళమ రారే చెలులారా’’ వైళమ అంటే వేగముగా అని అపుడనుకున్నాను. వైళం - పల్లీయుల గుండె గొంతుకలో నుండి ఎల్లెంగా పల్లవించింది. ‘దేవదాసు’లో సముద్రాల ‘కుడి ఎడమైతే’ పాటలో ‘‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్’’- ఇక్కడ లాహిరి అంటే హైస్కూల్ రోజుల్లో పడవ, నావ- అనుకునేవాణ్ణి. లహరి అంటే తరంగం అనీ, లాహిరి అంటే మత్తు అనీ మత్తు సంద్రంలో ఉన్న వాడికి లంగరెందుకనే అర్థం అని మా ‘అమ్మ’ చెప్పింది తర్వాత. గుణసుందరి మాట - పాటలతో గుర్తింపు పొంది ‘పాతాళభైరవి’ స్టార్ రైటర్‌గా మారి ‘మాయాబజార్’తో లెజెండ్ అయ్యాడు పింగళి. ఇంతకీ నాతో మాటాడుతున్న పాట ‘మాయాబజార్’లోని ‘లాహిరి-లాహిరి-లాహిరి’లో. సంగీతం ఘంటసాల. అభిమన్యు ఏయన్నార్, శశిరేఖ సావిత్రి. సన్నివేశం ఒకే పాటలో అర్జునుడు - శశిరేఖ, శ్రీకృష్ణుడు- రుక్మిణి, బలరాముడు - రేవతి నౌకావిహారం చేయాలి. ఇక్కడ మధువు మత్తు కాకుండ - వధువు మత్తు వలపు మత్తును లాహిరిగా మలుచుకున్నాడు పింగళి. మత్తులో ఉన్నవారు ఊగాలి - తూగాలి. కాని వలపు లాహిరిలో ఉన్నవారిని చూసి జగమునే ఊగించి తూగించారు పింగళి. ఆ జగము ఊగేది తూగేది తారాచంద్రుల విలాసాల పరవడిలో వరవడిలోనట. చంద్రుని వెన్నెలకు నీటి పరవళ్లకు సైంటిఫిక్ రీజన్ ఉంది. అదీ తెలుసు శాస్త్రీయ పింగళికి. ముల్లును ముద్దాడినా రక్తం కళ్ల చూస్తుంది. పూవును కాలితో నలిపినా సుగంధాన్ని అద్దుతుంది. కనుకనే... పూలవలపుతో పుట్టుకతో ఏ సువాసన కూడా తెలియని పిల్లవాయువుకు ఘుమఘుమ సొంతమైంది. అందుకే పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో.... అన్నాడు. సచిన్ మాంచి ‘ఊపులో’ ఉన్నాడంటాం. అలల ‘ఊపు’ తియ్యని తలపులను చెలరేగిస్తుంది. ఆ కలకలలో మిలమిలలో ప్రేమ నౌకావినోదం సాగుతుంది. ఇలాగ వెన్నెల్లో సెలయేరులో ఉత్తినౌకకు అభిమన్యు శశిరేఖల ప్రేమను అంటించి ప్రేమనౌకను చేశాడు పింగళి. తరువాతి చరణాల్లో శ్రీకృష్ణ రుక్మిణులు ఈ నౌకలో చేరుతారు. అభిమన్యు శశిరేఖలు వలపులూరుతున్న చిగురు యువప్రాయులు. శృంగార రసవత్క్రీడ ఫలరుచి తెలియని అస్కలిత ప్రణయమూర్తులు. రుక్మిణీ శ్రీకృష్ణులు- దంపతులు- రాసక్రీడారుచి రాత్రులకొద్దీ - కౌగిళ్లకొద్దీ అనుభవించిన వారు. ప్రౌఢానంద పరవశతలెరిగిన పరిణత మనస్సుకలవారు. కనుక రెండో చరణాన్ని మరింతగా ఉసిగొలుపుతూ రాశాడు పింగళి. రసమయమైన జగాన్ని రాసక్రీడకు ఈ మధురిమ ఉసిగొలిపిందట. ఏకాంతంగా ఉన్న ఆలుమగలు ఆరంభించే ప్రతి సంభాషణ కొసమెరుపు శృంగారపు అల్లరింపుకు దారితీస్తుందన్న రహస్యం ఈ ఆజన్మాంత ‘కవిబ్రహ్మ’చారికి ఎలా తెలిసిందో! ఇక్కడో విషయం చెప్పాలి. ‘మిస్సమ్మ’లో ఒక పాట ‘ఏమిటో ఈ మాయ’... అందులో పింగళి ‘వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా’ అని రాస్తే, అందరు అద్భుతం అంటే ‘చక్రపాణి’ రచయిత, నిర్మాత, పర్యవేక్షకులు ‘‘బ్రహ్మచారికి ఏముంటుందయ్య అనుభవం. అందుకే అలా రాశాడు’’ అన్నాట్ట. అల్లరి మనములు ఝల్లుమనిపించే చల్లని దేవుని అల్లరిలో... వాయుదేవుడిని ‘చల్లని దేవుడిగా’ తెలుగించిన ఈ తెల్లవారు వెలుగంత చల్లని తెలుగింటి పాట దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అశోక్ తేజా అంటూ పింగళి రచనా లాహిరీలోకి లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తల్లీనమైపోయింది. మోహన్‌బాబు ‘పోస్ట్‌మెన్’ చిత్రం కోసం పింగళి స్ఫూర్తిగా లాహిరిని ముమ్మారు ప్రయోగిస్తూ ‘లాహిరి లాహిరి లాహిరి నన్ను అల్లుకుంది చెలి మాధురి’ పాట రాశారు అశోక్‌తేజ. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
రేపు బైరాన్‌పల్లికి సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా మద్దూరు మండలం బైరాన్‌పల్లి గ్రామానికి 14న(శనివారం) సాంస్కృతిక సైన్యం శౌర్యయాత్ర తలపెట్టినట్లు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధి పాశం యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో ప్రజల ఆలోచనల మీద, సంస్కృతిపైన ఉన్న ఆధిపత్యాన్ని ఎదురించడానికి ప్రగతిశీల, ప్రజాస్వామ్య కవులు, ర చయితలు, కళాకారులు సాంస్కృతిక ఉద్యమం నిర్మించాలని ఈ నెల 7న జరిగిన సమావేశం తీర్మానించిందని పేర్కొన్నారు. ప్రజాకళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్, మాదాల రవి తదితరులు సమావేశమై తీసుకున్న నిర్ణయంలో భాగంగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బైరాన్‌పల్లి అమరులకు సబ్బండ కళల నివాళి అర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తేదీన ఇదే జిల్లాలోని దేవరుప్పుల మండలం కడవెండిలో తెలంగాణ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు నివాళి అర్పించనున్నట్లు తెలిపారు. -
నిన్నటి ఊసులు రేపటి ఆశలు
కాలచక్రంలో మరో ఏడాది గిర్రున తిరిగిపోయింది. ఈ రోజుతో 2014కు శుభం కార్డు పడుతోంది. సరికొత్త ఆశలు మోసులెత్తగా, కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్న వేళ... ఒక్కసారి గడచిన ఏడాది కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే... సినిమా రీలు గిర్రున తిరిగినట్లు ఎన్నెన్నో జ్ఞాపకాలు. వెళ్ళిపోతున్న 2014లో తాము చూసిన మార్పులు, రానున్న 2015కు వచ్చే చేర్పుల గురించి ఆయా విభాగాల్లోని సినీ ప్రముఖులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు... అనుభూతులు... ఎవరికైనా వర్తించే సూక్తి ఇది! - వెంకటేశ్, హీరో 2014లో ‘దృశ్యం’ నాకొక స్వీట్ మెమరీ. సరైన సమయంలో వచ్చిన విజయం అది. ఈ విజయం ఇలాంటి ప్రయోగాలు మరెన్నో చేయగల నమ్మకాన్ని నాలో నింపింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ మరో విషయం - యంగ్‌స్టర్స్ చాలామంది కూడా ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం. ఇక సక్సెస్ రేట్ అంటారా! జయాపజయాలు ప్రతి ఏడాదీ ఉండేవే! ఆ విషయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. చక్కని ప్లానింగ్, హార్డ్‌వర్క్‌తో సిన్సియర్‌గా ముందుకెళ్తే విజయం తథ్యం. ఒక సీనియర్ కథానాయకునిగా నా అభిప్రాయమిది! మల్టీస్టారర్ చిత్రాలను ప్రోత్సహించడం, ప్రయోగాలు చేయడం... వీటి గురించి నన్ను చాలామంది అడుగుతున్నారు. ఒక వయసు వచ్చాక, రకరకాల పాత్రలు చేసి అనుభవం పొందాక ఇక రొటీన్‌గా వెళ్లడం కరెక్ట్ కాదు. నాకే కాదు, ఎవరికైనా వర్తించే సూక్తి ఇది. అందుకే... వెరైటీ పాత్రలనే ఎన్నుకుంటున్నా. రానున్న 2015లో ‘గోపాల గోపాల’తో రాబోతున్నా. అది కూడా రొటీన్ ఫార్ములా సినిమా కాదు. కథ, కథనం, పాత్రలు కొత్తగా ఉంటాయి. అంతా ఆ సూత్రాన్నే అనుసరిస్తున్నారు - సుద్దాల అశోక్‌తేజ, గీత రచయిత 2014లో ‘లింగ’, ‘ఐ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలకు పాటలు రాశాను. రచయితగా ఆత్మసంతృప్తినిచ్చిన పాటలైతే ఏమీ రాయలేదు కానీ, సంతృప్తినిచ్చిన పాట మాత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో నేను రాసిన ‘నీలిరంగు చీరలోనా...’ పాటే. ఇంకా దాసరిగారి ‘ఎర్రబస్సు’లో కూడా పాట రాశాను. పరిశ్రమ మొత్తంగా చూస్తే మాత్రం ఈ ఏడాది అంత బ్రహ్మండంగా అయితే లేదు. తక్కువగా కూడా ఏమీ అనిపించలేదు. చిన్న చిన్న సినిమాలు విడుదలై సరిగ్గా ఆడకపోవడం మాత్రం బాధ కలిగించింది. బాధాకరమైన మరో విషయం ఏంటంటే... గొప్ప సాహిత్యం అందించాలని మాకుంటుంది. కానీ... ఆ అవకాశం మాత్రం లభించడం లేదు. ఆత్రేయగారు ఓ మాట అనేవారు. ‘ముందు నీకు నచ్చింది చేయ్. అది వాళ్లకు నచ్చకపోతే... వాళ్లకు నచ్చిట్టు చేయ్’ అని. ఇప్పుడు గీత రచయితలంతా ఫాలో అవుతోంది ఆ సూత్రాన్నే. ఈ ఏడాది ఉన్నంతలో మా గీత రచయితలంతా మంచి సాహిత్యాన్నే అందించారు. కాంట్రవర్సీ అంటేనే కథానాయికా..? - స్వాతి, హీరోయిన్ 2014 సాదాసీదాగా సాగిపోయింది. అయితే కొత్త హీరోయిన్లు కొంతమంది ఈ ఏడాది తమ ప్రతిభను నిరూపించుకోవడం ఆనందం అనిపించింది. ముఖ్యంగా ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా ద్వారా పరిచయమైన రాశీఖన్నా నాకు బాగా నచ్చింది. ఈ ఏడాది ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన హీరోయిన్లంతా గ్లామర్‌కే పరిమితమైపోయారనే విమర్శను నేను అంగీకరించను. ఎందుకంటే గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో వాళ్లకు తెలీదు. నేను కథానాయికగా కెరీర్ ప్రారంభించాక, మొదట్లో అభినయ ప్రధానమైన పాత్రలకే మొగ్గు చూపాను. కానీ కెరీర్ దీర్ఘకాలం కొనసాగాలంటే, గ్లామర్‌గా కనిపించక తప్పదు. అందుకే, ‘స్వామి రా రా’ నుంచి నా అభిమతాన్ని మార్చుకొని కాస్త గ్లామర్‌గా కనిపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు తెలుస్తోంది గ్లామర్‌గా కనిపించడం ఎంత కష్టమో! ఈ ఏడాది అభినయపరంగా చెప్పాల్సి వస్తే -‘మనం’ సినిమాలో సమంత, శ్రీయల గురించి చెప్పాలి. సమంతది నిజంగా చాలా విచిత్రమైన పాత్ర. అలాంటి పాత్రలు అరుదుగా మాత్రమే వస్తాయి. ఇక శ్రీయ అయితే... ఆ సినిమాలో వెంకటగిరి చీర కట్టుకొని ఎంత అందంగా కనిపించారో! అలాగే.. ‘గీతాంజలి’ సినిమాలో అంజలి పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చింది. ఆ దర్శకుడు తీయనున్న తదుపరి చిత్రంలో నేనే కథానాయికను. అయితే, అందరూ అది ‘గీతాంజలి’కి సీక్వెల్ అనుకుంటున్నారు. కానీ, అదొక కొత్త కథ. ఇక ఈ ఏడాది కాంట్రవర్సీల గురించి చెప్పే ముందు.. నాపై వచ్చిన కాంట్రవర్సీ గురించి మాట్లాడటం కరెక్ట్. నాకు పెళ్లి ఖాయమైందనీ, త్వరలో పెళ్లిపీటలు ఎక్కేయబోతున్నాననీ ఓ రూమర్ నాకెంత తలనొప్పి తెప్పించిందో మాటల్లో చెప్పలేను. ఆ టైమ్‌లో నేను ఫారిన్లో ఉన్నా. ఒకటే ఫోన్లు. ‘పెళ్లి కొడుకు కూడా ఎవడో మీరే చెప్పేయండి... ఓ పని అయిపోతుంది’ అని మీడియా వారితో ఘాటుగా స్పందించా. అలాగే... కొంతమంది హీరోయిన్లు ట్విట్టర్ ద్వారా తమ మనోభావాలను వ్యక్తం చేస్తే... వాటికి వేరే రంగు పులిమి మాట్లాడటం నన్ను కాస్త బాధించింది. ఇక శ్వేతాబసు ఉదాంతం గురించి చెప్పేదేముంది. తన విషయంలో అందరూ ఓవర్‌గానే రియాక్టయ్యారు. చివరకు కాంట్రవర్సీ అంటేనే కథానాయిక అన్నట్లు తయారైంది సొసైటీ. దర్శకులే బాధ్యులు! - బోయపాటి శ్రీను, దర్శకుడు ఈ ఏడాది తొలినాళ్లలో బలహీనమైన బాక్సాఫీస్‌కి కొత్త ఊపిరులూదిన చిత్రం నా ‘లెజెండ్’. ఇది నేను గర్వంగా చెప్పుకునే అంశం. అయితే ఈ ఏడాది అత్యధికంగా చిత్రాలు విడుదలైనా, విజయాలు మాత్రం అరకొరగానే ఉండడం నన్ను బాధించింది. సినిమా సమష్టికృషి అయినా, జయాపజయాలకు బాధ్యులు కచ్చితంగా దర్శకులే. దర్శకుని సృజన పైనే సినిమా ఆధారపడి ఉంటుంది. ప్రేక్షకుల జడ్జిమెంట్‌లో ఎప్పుడూ లోపం ఉండదు. ఈ ఏడాది విడుదలైన ‘మనం’, ‘రన్ రాజా రన్’ సినిమాలు కూడా నాకు బాగా నచ్చాయి. బాలయ్య వందో సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. ఆ సినిమాను నేను డెరైక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నా దగ్గరైతే కథ లేదు. ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా బాలయ్య స్టేటస్‌కు తగ్గ కథను తయారు చేసి, మళ్లీ ఆయనకు ఘన విజయాన్ని అందిస్తా. ఆ సత్తా నాలో ఉంది. పరిశ్రమ పరిస్థితి బాగా లేదు! - నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), నిర్మాత ఈ ఏడాది ఆర్టిస్టుల పరిస్థితి హ్యాపీ... టెక్నీషియన్ల పరిస్థితీ హ్యాపీ. కానీ నిర్మాతల పరిస్థితే దారుణంగా తయారైంది. దానికి కారణం నిర్మాతల పొరపాట్లే. ఇక్కడ నిర్మాతకు నిర్మాతే శత్రువు. ఈ కారణంగా సినీ పరిశ్రమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవసరం. ముందు నిర్మాతల్లో మార్పు రావాలి. మార్పు రాకపోతే... ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇక నా విషయానికొస్తే 2014 సూపర్‌హిట్ ఇయర్. ఈ ఏడాది ప్రారంభంలో ‘రేసుగుర్రం’ లాంటి బ్లాక్‌బస్టర్ నిర్మించాను. ముగింపులో వచ్చిన ‘ముకుంద’ విజయపథంలో దూసుకుపోతోంది. బాధ్యత పెంచిన విజయాలు - అనూప్ రూబెన్స్, సంగీత దర్శకుడు ఈ ఏడాది నాకు చాలా స్పెషల్. నా మ్యూజిక్ డెరైక్షన్‌లో వచ్చిన ‘మనం, హార్ట్ ఎటాక్, ఒక లైలాకోసం, పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రాలు సంగీతపరంగా సంచలనం సృష్టించాయి. ఒక్కో సంవత్సరం ఒక్కో మ్యూజిక్ డెరైక్టర్‌కి కలిసి రావడం మొదట్నుంచీ జరుగుతోందే. ఈ ఏడాది నాకు కలిసొచ్చింది. దీన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నా. ఇక బయటి సినిమాల్లో నాకు నచ్చిన ఆల్బమ్ ‘వన్’. ఆ సినిమాకు దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఏడాది అత్యంత బాధాకరమైన విషయం చక్రిగారు మనల్ని వదిలి వెళ్లిపోవడం. మంచి సంగీత దర్శకుడు. అలాగే గొప్ప వ్యక్తి కూడా. అలాంటాయన చనిపోయారంటే నమ్మలేకపోతున్నాను. పరాజయాలకు కారణం అదే! - మార్తాండ్ కె.వెంకటేశ్, ఎడిటర్ 2014లో ఎడిటింగ్‌లో వచ్చిన పెద్ద మార్పు ఒక్కటే. సినిమా ఫిల్మ్ నుంచి డిజిటల్‌కి మారడం. ఫిల్మ్ ఉన్నప్పుడు... భయం, భక్తి ఉండేది. కానీ... డిజిటల్‌గా మారాక ఆ గౌరవం తగ్గిందనే చెప్పాలి. దర్శకునికి ఒక వెర్షనూ, నిర్మాతకు ఒక వెర్షనూ, హీరోకి ఒక వెర్షనూ చేసి చూపిస్తున్నాం. ఎవరి అభిప్రాయాలు వారివే. కాస్త ఇబ్బందికరమైన విషయం అదే. ఇక ఈ ఏడాది సక్సెస్ రేట్ తగ్గడానికి ప్రధాన కారణం కూడా ఓ విధంగా డిజిటలే అనాలి. ఎందుకంటే... ఫిల్మ్ ఉన్నప్పుడు అనుభవం, అభిరుచి, జడ్జిమెంట్ ఉన్న సరైన టెక్నీషియన్స్ పనిచేసేవారు. కానీ డిజిటల్ వచ్చాక ఎవరికి వారే ఎడిటింగ్ చేసేసుకుంటున్నారు. ఒకప్పుడు ఓ పది సినిమాలకు పనిచేసిన తర్వాత డెరైక్టర్లయ్యేవారు. కానీ ఇప్పుడు ఏ అనుభవం లేకుండానే డెరైక్టర్లైపోతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు సినిమాల విషయంలో పదిమంది కంట్రిబ్యూషన్ ఉండేది. సినిమా బాగా రాకపోతే... ఆ విషయాన్ని దర్శక, నిర్మాతల ముందు కరాఖండిగా చెప్పేసేవాళ్లం. వెంటనే దానికి తగ్గ మార్పులు జరిగిపోయేవి. కానీ ఇప్పుడు సినిమాలో లోటుపాట్లు ఎత్తి చూపిస్తే, మన దగ్గరకు రావడం మానేస్తున్నారు. ఇది ఒక రకంగా అనారోగ్యకరమైన వాతావరణమే. ఓవరాల్‌గా డిజిటల్ కారణంగా ఎక్కువ సినిమాలు ఎలా వస్తున్నాయో, అలాగే ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇక నా విషయానికొస్తే ‘దృశ్యం, ఉయ్యాల జంపాల’ లాంటి విజయవంతమైన చిత్రాలకు పనిచేశాననే సంతృప్తి ఉంది. ప్లానింగ్‌తో వెళ్తే విజయాలే! - రామ్‌ప్రసాద్, కెమెరామేన్ ఈ ఏడాది తెలుగు సినిమా చిత్రీకరణ రీల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కి మారింది. కెమెరా విభాగంలో కొత్తగా చెప్పుకోవాల్సిన మార్పు అదే. నా వరకూ నేను పనిచేసిన ‘ఎవడు’, ‘లెజెండ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. కెమెరామేన్‌గా నేను పూర్తి ఆనందంతో ఉన్నాను. ఓవరాల్‌గా చూస్తే మాత్రం సక్సెస్‌రేట్ తక్కువగా ఉంది. సరైన ప్లాన్‌తో పకడ్బందీగా ముందుకెళ్తే ఈ అపజయాలను కొంతైనా అధిగమించొచ్చు. ఎందుకంటే... ఈ ఏడాది అపజయాల్లో కాస్ట్ ఫెయిల్యూర్ల సంఖ్య కూడా ఎక్కువే. సరైన ప్లానింగ్ లేకషూటింగ్ డేస్ ఎక్కువై, అనవసరపు ఖర్చు పెరుగుతోంది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సినిమాటోగ్రఫీ పరంగా నాకిష్టమైన సినిమాలంటే.. ‘లెజెండ్’, ‘ఎవడు’ సినిమాల పేర్లే చెబుతాను. ఎందుకంటే విమర్శ అయినా, పొగడ్త అయినా... నాకు నేనే చేసుకుంటాను తప్ప మరొకరికి ఆ అవకాశం ఇవ్వను. నిజానికి మన కంటే హిందీ, మలయాళం, తమిళ సినిమాల్లో ఫొటోగ్రఫీ బాగుంటోంది. ఆ సినిమాలు చూసినప్పుడల్లా నాకు బాధ కల్గుతుంటుంది. నేనెందుకు అంత గొప్పగా చేయలేకపోతున్నాను అని. ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నాను. - బుర్రా నరసింహ -
పరిశోధనలకు ప్రాణం పోయండి
వర్సిటీలకు డీఆర్డీవో డీజీ అవినాష్ చందర్ సూచన ఘనంగా ‘గీతం’ విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవం విశాఖపట్నం: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఆవిష్కరణలపైనే ఒక దేశం శక్తి సామర్థ్యాలు ఆధారపడి ఉన్నాయని రక్షణ శాఖ శాస్త్ర సలహాదారు, రక్షణ పరిశోధన-అభివృద్ధి (డీఆర్డీవో) డెరైక్టర్ జనరల్ డాక్టర్ అవినాష్ చందర్ పేర్కొన్నారు. దేశంలోని యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం పెంచాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు బోధనతోపాటు ఇంధన వనరులు, వాతావరణ మార్పు లు, రక్షిత మంచినీరు లాంటి అంశాలపై పరిశోధనలు జరపాలన్నారు. శనివారం విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. శాస్త్రసాంకేతి రంగంలో భారత్ ప్రపంచంలోనే మేటి శక్తిగా ఎదుగుతోందన్నారు. గీతం ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరురామకృష్ణారావు ఈ సందర్భంగా అవి నాష్ చందర్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. కె.రాఘవేంద్రరావు, సుద్దాల అశోక్‌తేజ, శైలజా కిరణ్‌లు డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1,220 మంది విద్యార్థులకు పట్టాలను అందచేశారు. వీరిలో పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసిన వారు 24 ఉన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 56 మందికి స్వర్ణ పతకాలను ఇచ్చారు. -
అభిరుచులకు అనుగుణంగా సినీ సాహిత్యంలో మార్పు
సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సింహాచలం: సినిమా రంగంలో ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా సాహిత్య విలువలు మారిపోతుంటాయని, దాన్ని ఆపలేమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని శనివారం ఆయన కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సినిమాల్లో సాహిత్య విలువలు తగ్గిపోతున్నాయని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ప్రేక్షకుల అభిరుచులను బట్టి సాహిత్యం తీరుతెన్నుల్లో మార్పులు వస్తుంటాయన్నారు. తన వరకు సాహిత్య విలువలను కాపాడుకునేందుకే ప్రయత్నం చేస్తున్నానన్నారు. సమాజాన్ని, సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదవాలని నేటి రచయితలకు తాను సూచిస్తున్నానన్నారు. గీతం యూనివర్శిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం సింహాచల లక్ష్మీనృసింహస్వామి వరస్రాదంగా భావిస్తునానన్నారు. డాక్టరేట్ అందుకునే ముందు స్వామిని దర్శించుకోవాలని వచ్చానన్నారు. అశోకతేజ దంపతులు కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రాకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు.