ఊగించే తూగించే పాట
నా పాట నాతో మాట్లాడుతుంది
కేవలం 28 సినిమాలలో 300 పాటలు రాసి వాసికెక్కిన పదమాంత్రికుడు నా తండ్రి పింగళి. పింగళి ‘హలా’ పదంపై ఒక అపోహ ఉంది. ‘హలో’ ఆంగ్లపదాన్ని ‘హలా’గ మార్చి జగదేకవీరుని కథ సంభాషణల్లో కూర్చాడని. అది సరికాదు. శబ్దార్థ నిఘంటువులో ‘హలా’ అంటే అనుంగు చెలికత్తెను పిలిచే పిలుపు!
తెలంగాణలో త్వరగా రా అనే సందర్భంలో ‘ఎల్లెం రా’ అంటారు. ఎల్లెం ఏ పదం నుండి మాండలికంగా పురుడుపోసుకుందని గవేషిస్తే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాడే పింగళి పాట పల్లవి ఇలా ఉంటుంది.
‘‘స్వాముల సేవకు వేళాయే/ వైళమ రారే చెలులారా’’
వైళమ అంటే వేగముగా అని అపుడనుకున్నాను. వైళం - పల్లీయుల గుండె గొంతుకలో నుండి ఎల్లెంగా పల్లవించింది.
‘దేవదాసు’లో సముద్రాల ‘కుడి ఎడమైతే’ పాటలో ‘‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్’’- ఇక్కడ లాహిరి అంటే హైస్కూల్ రోజుల్లో పడవ, నావ- అనుకునేవాణ్ణి. లహరి అంటే తరంగం అనీ, లాహిరి అంటే మత్తు అనీ మత్తు సంద్రంలో ఉన్న వాడికి లంగరెందుకనే అర్థం అని మా ‘అమ్మ’ చెప్పింది తర్వాత.
గుణసుందరి మాట - పాటలతో గుర్తింపు పొంది ‘పాతాళభైరవి’ స్టార్ రైటర్‌గా మారి ‘మాయాబజార్’తో లెజెండ్ అయ్యాడు పింగళి.
ఇంతకీ నాతో మాటాడుతున్న పాట ‘మాయాబజార్’లోని ‘లాహిరి-లాహిరి-లాహిరి’లో. సంగీతం ఘంటసాల. అభిమన్యు ఏయన్నార్, శశిరేఖ సావిత్రి. సన్నివేశం ఒకే పాటలో అర్జునుడు - శశిరేఖ, శ్రీకృష్ణుడు- రుక్మిణి, బలరాముడు - రేవతి నౌకావిహారం చేయాలి.
ఇక్కడ మధువు మత్తు కాకుండ - వధువు మత్తు వలపు మత్తును లాహిరిగా మలుచుకున్నాడు పింగళి. మత్తులో ఉన్నవారు ఊగాలి - తూగాలి. కాని వలపు లాహిరిలో ఉన్నవారిని చూసి జగమునే ఊగించి తూగించారు పింగళి. ఆ జగము ఊగేది తూగేది తారాచంద్రుల విలాసాల పరవడిలో వరవడిలోనట. చంద్రుని వెన్నెలకు నీటి పరవళ్లకు సైంటిఫిక్ రీజన్ ఉంది. అదీ తెలుసు శాస్త్రీయ పింగళికి.
ముల్లును ముద్దాడినా రక్తం కళ్ల చూస్తుంది. పూవును కాలితో నలిపినా సుగంధాన్ని అద్దుతుంది. కనుకనే...
పూలవలపుతో పుట్టుకతో ఏ సువాసన కూడా తెలియని పిల్లవాయువుకు ఘుమఘుమ సొంతమైంది. అందుకే పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో.... అన్నాడు.
సచిన్ మాంచి ‘ఊపులో’ ఉన్నాడంటాం. అలల ‘ఊపు’ తియ్యని తలపులను చెలరేగిస్తుంది. ఆ కలకలలో మిలమిలలో ప్రేమ నౌకావినోదం సాగుతుంది. ఇలాగ వెన్నెల్లో సెలయేరులో ఉత్తినౌకకు అభిమన్యు శశిరేఖల ప్రేమను అంటించి ప్రేమనౌకను చేశాడు పింగళి.
తరువాతి చరణాల్లో శ్రీకృష్ణ రుక్మిణులు ఈ నౌకలో చేరుతారు. అభిమన్యు శశిరేఖలు వలపులూరుతున్న చిగురు యువప్రాయులు. శృంగార రసవత్క్రీడ ఫలరుచి తెలియని అస్కలిత ప్రణయమూర్తులు.
రుక్మిణీ శ్రీకృష్ణులు- దంపతులు- రాసక్రీడారుచి రాత్రులకొద్దీ - కౌగిళ్లకొద్దీ అనుభవించిన వారు. ప్రౌఢానంద పరవశతలెరిగిన పరిణత మనస్సుకలవారు. కనుక రెండో చరణాన్ని మరింతగా ఉసిగొలుపుతూ రాశాడు పింగళి.
రసమయమైన జగాన్ని రాసక్రీడకు ఈ మధురిమ ఉసిగొలిపిందట. ఏకాంతంగా ఉన్న ఆలుమగలు ఆరంభించే ప్రతి సంభాషణ కొసమెరుపు శృంగారపు అల్లరింపుకు దారితీస్తుందన్న రహస్యం ఈ ఆజన్మాంత ‘కవిబ్రహ్మ’చారికి ఎలా తెలిసిందో! ఇక్కడో విషయం చెప్పాలి.
‘మిస్సమ్మ’లో ఒక పాట ‘ఏమిటో ఈ మాయ’... అందులో పింగళి ‘వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా’ అని రాస్తే, అందరు అద్భుతం అంటే ‘చక్రపాణి’ రచయిత, నిర్మాత, పర్యవేక్షకులు ‘‘బ్రహ్మచారికి ఏముంటుందయ్య అనుభవం. అందుకే అలా రాశాడు’’ అన్నాట్ట.
అల్లరి మనములు ఝల్లుమనిపించే చల్లని దేవుని అల్లరిలో... వాయుదేవుడిని ‘చల్లని దేవుడిగా’ తెలుగించిన ఈ తెల్లవారు వెలుగంత చల్లని తెలుగింటి పాట దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అశోక్ తేజా అంటూ పింగళి రచనా లాహిరీలోకి లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తల్లీనమైపోయింది.
మోహన్‌బాబు ‘పోస్ట్‌మెన్’ చిత్రం కోసం పింగళి స్ఫూర్తిగా లాహిరిని ముమ్మారు ప్రయోగిస్తూ ‘లాహిరి లాహిరి లాహిరి నన్ను అల్లుకుంది చెలి మాధురి’ పాట రాశారు అశోక్‌తేజ.
డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత