Songwriter
-
తారీఫ్ కరే క్యా ఉస్కీ..
లిసా మిశ్రా.. గాయనిగా, గేయరచయితగా సంగీత, సాహిత్యాభిమానులకు ఏనాడో పరిచయం. తాజాగా నటనారంగంలోకి అడుగుపెట్టి తన అభినయ కళనూ ప్రదర్శించింది. ఆ ఫ్యాన్ బేస్నూ సంపాదించుకుంది.👉లిసా పుట్టింది ఒడిశాలోని బరంపురంలో. పెరిగింది అమెరికాలోని షికాగోలో. నాలుగో ఏట నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించింది. పదిహేనో ఏట నుంచి గిటార్లో శిక్షణ పొందటం మొదలుపెట్టింది. అకడమిక్స్ విషయానికి వస్తే ఇల్లినాయీ వెజ్లీయన్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ అండ్ రిలిజియన్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.👉పదమూడేళ్ల వయసులో లిసా.. యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి, తన పాటల వీడియోలను అందులో పోస్ట్ చేయసాగింది. అయితే ఆమె అలా వీడియోలు అప్లోడ్ చేయడం వాళ్లమ్మకు నచ్చలేదు. ఎందుకు అందరి కళ్లల్లో పడటం అంటూ అభ్యంతరం చెప్పింది. దాంతో కేవలం ఆడియో రికార్డింగ్స్‌ని మాత్రమే పోస్ట్ చేయసాగింది. ఆమె స్వరమాధుర్యానికి ఫిదా అయిపోయారు శ్రోతలు. ఆ ఆడియో పోస్ట్‌లకు వచ్చిన రెస్పాన్స్ చూసి లిసా వాళ్లమ్మ, కూతురి పాటల వీడియోలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 👉యూట్యూబ్‌లోని ఆమె పాటల వీడియోలకు అమెరికన్ పాప్ మ్యూజిక్ కూడా స్పందించింది. 2016, గ్రామీ అవార్డ్ గెలుచుకున్న ‘కలరింగ్ బుక్’ ఆల్బమ్‌లో పాడే అవకాశాన్నిచ్చింది. 2017లో ఎమ్మీ అవార్డ్స్‌కి నామినేట్ అయిన ‘బ్రౌన్ గర్ల్స్’ వెబ్ సిరీస్‌లోనూ థీమ్ సాంగ్ పాడింది.👉పాశ్చాత్య ప్రపంచంలో లిసా అంత కీర్తి సాధించినా.. ఆమె మీద భారత్ దృష్టి పడింది మాత్రం ఆమె ‘వీరే ది వెడ్డింగ్’లోని ‘తారీఫా’ పాటను పాడి, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాకే! ఇన్‌స్టాలో ఆ వీడియో చూసిన సోనమ్ కపూర్, రియా కపూర్లు ఆమెను బాలీవుడ్‌కి పిలిచి, ‘తారీఫా’ రిప్రైజ్ వర్షన్‌ను పాడించారు. దాంతో ఇక్కడా ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చింది. బాలీవుడ్ ప్రయాణాన్ని మొదలుపెట్టింది.👉‘జడ్జ్‌మెంటల్ హై క్యా’, ‘స్కై ఈజ్ పింక్’, ‘గుడ్ న్యూస్’, ‘జుగ్‌జుగ్ జియో’, ‘లైగర్’, ‘దోనో’ వంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలన్నీ హిట్టే! సినిమాల్లో పాడే చాన్స్ రాగానే తనకు ఇష్టమైన పాప్ మ్యూజిక్ వరల్డ్‌కి గుడ్ బై చెప్పలేదు. అక్కడా వినిపించడానికి ప్లాన్ చేసుకుంటోంది. గాయనిగానే కాదు పాటలను రాస్తూ తన రచనా పాటవాన్నీ చూపిస్తోంది.👉క్షణం తీరిక లేని ఆమె షెడ్యూల్లో తన కోసం కాల్షీట్ సర్దే వీలుంటుందేమో చూడమని ఓటీటీ రిక్వెస్ట్ చేసింది.. ‘కాల్ మి బే’ వెబ్ సిరీస్ ఆఫర్‌తో! ఎంతో ఉత్సాహంగా ‘యెస్’ చెప్పింది లిసా. ప్రాధాన్యమున్న పాత్రలో నటించి వీక్షకులు, విమర్శల ప్రశంసలు అందుకుంటోంది. ఆ సిరీస్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమ్ అవుతోంది.సింగర్, సాంగ్ రైటర్ అయిన నాకు యాక్టింగ్ అనేది సవాలే! చాలెంజెస్ అంటే ఇష్టం కాబట్టి యాక్టర్‌గానూ ఇంట్రడ్యూస్ అయ్యాను. మంచి రోల్స్ వస్తే నటననూ కంటిన్యూ చేస్తాను.– లిసా మిశ్రా. -
పాటల రచయిత గురుచరణ్ మృతి
ప్రముఖ పాటల రచయిత గురుచరణ్ (77) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. దివంగత దర్శకుడు మానాపురం అప్పారావు, దివంగత నటి ఎం.ఆర్. తిలకంల కుమారుడే గురుచరణ్. ఎంఏ చదివిన ఆయన ప్రముఖ పాటల రచయిత ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు.‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు’ (అల్లుడుగారు), ‘కుంతీకుమారి తన నోరుజారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల’ (రౌడీగారి పెళ్ళాం) వంటి దాదాపు 200లకుపైగా సూపర్ హిట్ పాటలను రచించారు గురుచరణ్. ముఖ్యంగా నటుడు మోహన్‌బాబుకు ఎంతో ఇష్టమైన పాటల రచయిత ఆయన. అందుకే తన చిత్రాల్లో కనీసం ఒక్క పాట అయినా తప్పకుండా గురుచరణ్‌తో రాయించేవారు మోహన్‌బాబు. చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో మెలోడీ, అర్థవంతమైన పాటలను గురుచరణ్ రచించారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
Taylor Swift: జనం మెచ్చిన పాప్ ప్రభంజనం
పాప్ పవర్‌హౌజ్ టేలర్ స్విఫ్ట్ పేరు పలికితే ‘రికార్డ్’ అనే శబ్దం ప్రతిధ్వనిస్తుంది. 2024 గ్రామీ అవార్డ్‌లలో టేలర్ ఆల్బమ్ ‘మిడ్నైట్స్’ ‘బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డ్ గెలుచుకుంది. దీంతో బెస్ట్ ఆల్బమ్ విభాగంలో వరుసగా నాలుగు సార్లు అవార్డ్ గెల్చుకున్న తొలి మహిళా గాయనిగా రికార్డ్ సృష్టించింది టేలర్ స్విఫ్ట్.... ‘ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది’ అంటారు. పలుకే కాదు... పాట కూడా పాడుతుంది అనుకోవచ్చు. అయితే అందరి విషయంలోనూ ఇది నిజం కాకపోవచ్చు. టేలర్ స్విఫ్ట్ విషయంలో మాత్రం అక్షరాలా నిజమైంది. ‘పెన్సిల్వేనియాలోని రీడింగ్ హాస్పిటల్లో పుట్టిన టేలర్ పుట్టగానే ఏడ్చింది అంటే నేను నమ్మను. పుట్టగానే తీయగా పాట పాడి ఉంటుంది’ అని ఆమె అభిమానులు చమత్కరిస్తుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ఇల్లంతా సంగీతమే’ అన్నట్లుగా ఉండేది టేలర్ ఇల్లు. తండ్రి స్కాట్ కింగ్స్ లీ స్విఫ్ట్ స్టాక్‌బ్రోకర్. సంగీతప్రేమికుడు. తల్లి ఆండ్రియా స్విఫ్ట్ మ్యూచువల్ ఫండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి ఆ తరువాత ఇంటికే పరిమితమైంది. ఆండ్రియా గాయకురాలు. టేలర్ తమ్ముడు నటుడు. అమ్మమ్మ ఒపెరా సింగర్. తొమ్మిదేళ్ల వయసు నుంచి పాటలతో ప్రయాణం మొదలుపెట్టింది టేలర్. పాటలోనే కాదు నటనలోనూ అద్భుతమైన ప్రతిభ చూపేది. స్థానిక పండగల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలలో టేలర్ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. షానియా ట్వైన్ పాటలతో స్ఫూర్తి పొందిన టేలర్ జానపదాలను ఇష్టపడింది. పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు స్థానిక కళాకారుడు రోనీ క్రీమర్ నుంచి గిటార్ ప్లే చేయడం నేర్చుకుంది. పాటలు రాసే విషయంలో కూడా రోనీ క్రీమర్ టేలర్‌కు సహాయపడేవాడు. కెరీర్ ప్రారంభంలోనే టేలర్ అనుభవజ్ఞులైన సంగీతకారులు, గేయ రచయితలతో కలిసి పనిచేసింది. ప్రపంచంలోని ప్రముఖులతో పోటీ పడి టైమ్ మ్యాగజైన్ ‘పర్సన్ ఆఫ్ ద ఇయర్–2023’కు ఎంపికైంది. గత సంవత్సరం యూఎస్ ఎకనామిక్ రిపోర్ట్‌లో టేలర్ ప్రస్తావన కనిపించింది. ‘పాప్ సింగర్ ప్రస్తావన ఈ రిపోర్ట్‌లో ఎందుకు వచ్చింది!’ అని చాలామంది ఆశ్చర్యపోయారు.‘ íఫిలడెల్ఫియాలో టేలర్ షోలకు జనాలు విపరీతంగా తరలివచ్చారు. బుకింగ్స్‌తో హోటళ్లు కిటకిటలాడిపోయాయి. ఒక్క నెలలోనే హోటళ్ల ఆదాయం భారీగా పెరగడానికి కారణం టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ షోకు వచ్చిన అభిమానులు’ అంటూ ఆ రిపోర్ట్‌లో టేలర్ స్విఫ్ట్ ప్రస్తావన కనిపిస్తుంది. నిద్రలేని రాత్రుల మిడ్నైట్స్ ‘నా నిద్రలేని రాత్రుల నుంచి వచ్చిన ఆల్బమ్ ఇది’ అని ‘మిడ్నైట్స్’ గురించి అంటోంది టేలర్ స్విఫ్ట్. ‘మిడ్నైట్స్’ను కాన్సెప్ట్ ఆల్బమ్‌గా రూపొందించింది. ఈ ఆత్మకథాత్మక గీతరచనలో పశ్చాత్తాపం నుంచి స్వీయ విమర్శ వరకు ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. పాటల రచన, సంగీత నిర్మాణానికి సంబంధించి ‘మిట్నైట్ ఆల్బమ్’ను విశ్లేషకులు ఆకాశాని కెత్తారు. తన గత ఆల్బమ్‌లతో పాటు ‘మిడ్నైట్స్’ను ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు వినిపించడానికి ఎరాస్ టూర్ (2023–2024)ని మొదలు పెట్టింది టేలర్ స్విఫ్ట్. -
ఏమోయి? తెలుసునా మోయి మోయి!
‘ఇంటర్నెట్టున ఏ నిమిషానికి ఏ ట్రెండు వచ్చునో ఎవరు ఊహించెదరు’ అని పాడుకోవాల్సిన టైమ్ ఇది. ప్రస్తుతం ‘మోయి మోయి’ అనేది వైరల్ ట్రెండ్‌గా మారింది.‘టిక్‌టాక్’లో వైరల్ అయిన సెర్బియన్ పాట నుంచి ఈ ట్రెండ్ వచ్చింది. ఈ ట్రెండ్‌లో భాగంగా రకరకాల మీమ్స్, పేరడీలు, రీల్స్ వస్తున్నాయి. ‘మోయి మోయి’కి సొంత డ్యాన్స్‌ను కూడా క్రియేట్ చేశారు. సెర్బియన్ సింగర్–సాంగ్‌రైటర్ టెయా డోర ‘మోయి మోయి’ సాంగ్ యూట్యూబ్‌లో 60 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. నిజానికి పాటలో ‘మోయి మోర్’ అని ఉంటుంది. అయితే మిస్టేక్ వల్ల‘మోర్’ కాస్త ‘మోయి’గా మారింది. తన పాట ట్రెండ్ కావడంతో టెయా డోర ఆనందంతో తబ్బిబ్బైపోతూ‘థ్రెడ్స్’లో ఇలా స్పందించింది... ‘సెర్బియన్ మ్యూజిక్ ప్రపంచవ్యాప్తం కావడం సంతోషంగా ఉంది. ప్రతిరోజూ ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వస్తున్నాయి. ఐ లవ్ యూ’ ‘మోయి మోయి’ ట్రెండ్ నేపథ్యంలో బాలీవుడ్ నటీమణులు ఉర్ఫీ జావెద్, డాలీ సింగ్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉర్వీ, డాలీసింగ్ల ‘మోయి మోయి’ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ‘వావ్’ అంటున్నారు. -
ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే రియా పాటలు
పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్ రైటర్, సింగర్ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి... దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్–బాలీవుడ్ మ్యూజిక్‌ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్’ ట్రాక్ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్ లిరిక్స్ రాయడం అంటే రియకు ఇష్టం. క్లాసికల్ సింగింగ్‌లో డిప్లొమా చేసిన రియకు థియేటర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘పర్మిషన్’ తరువాత వచ్చిన ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’కు మంచి పేరు వచ్చింది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్ హ్యావ్ ది టైమ్. ఒక ఫెస్టివల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్ హ్యావ్ ది టైమ్. అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది. మనలో ఎంత టాలెంట్ ఉంటే మాత్రం? టైమ్ లేకపోతే అంతే! అందుకే టైమ్ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్ సాధించడానికి కారణం అయింది. ‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్ హ్యావ్ ది టైమ్’పై పాప్ బీట్ మాత్రమే కాదు బాలీవుడ్ మ్యూజిక్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్ వీడియోల షూట్ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ. ‘ప్రతి నెల ఒక సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్లు, మ్యూజిషియన్లతో పనిచేయాలని, లైవ్ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ. -
యంగ్ టాలెంట్: మధుర స్వర రాగ మీరా
ఒకవైపు హిందుస్థానీ సంగీతం మరోవైపు వెస్ట్రన్ మ్యూజిక్... వెరసి ఆమె పాటకు కొత్త చూపును ఇచ్చాయి. ‘పాట అంటే వాద్యాల ఘోష కాదు... మనల్ని మనం పుస్తకంలా చదువుకోవడం కూడా’ అంటున్న మీరా దేశాయ్ పరిచయం... అమెరికాలో పుట్టి పెరిగినా, తన సంగీత, సాహిత్యాలలో ‘భారతీయత’ ఎక్కడికీ పోలేదు. సందేహం ఉంటే...‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టు బీ లాస్ట్’ ఈపీ(ఎక్స్టెండెడ్ ప్లే)లో పాటలు వినండి చాలు. తల్లిదండ్రులు మీరాకు గుజరాతి భాష నేర్పించారు. చిన్న వయసులోనే ఎన్నో భజనలను తల్లి ద్వారా నేర్చుకుంది. అలా తన మాతృభాషపై ఆసక్తి పెరిగింది, పదిహేడు సంవత్సరాల వయసులో తొలి పాట రాసిన మీరాకు తొలిసారిగా న్యూయార్క్‌లో జరిగిన ఒక సంగీత కచేరిలో హిందుస్థానీ శాస్త్రీయసంగీత దిగ్గజం పండిట్ జస్రాజ్ను చూసే అదృష్టం దక్కింది. ఆ క్షణమే తనకు హిందుస్థానీ సంగీతం అంటే చెప్పలేనంత ఇష్టం ఏర్పడింది. ప్రతిరోజూ తన చెవుల్లో హిందుస్థానీ సంగీతం మారుమోగేది. ఎందరు గాయకులో, ఎన్ని ఘరానాలో! హిందుస్థానీ దగ్గరే ఆగిపోలేదు. వెస్ట్రన్ మ్యూజిక్‌లో పదిసంవత్సరాల పాటు శిక్షణ పొందింది. ఫిమేల్ జాజ్ స్టార్స్...నైనా సిమోన్, నోరా జోన్స్, పాప్ సింగర్–సాంగ్ రైటర్స్ సారా బెరిలెస్, టోరీ కెల్లీ...తాను అభిమానించే జాబితాలో చేరిపోయారు. వారి ప్రభావం తన పాటలపై కనిపిస్తుంది. తన డెబ్యూ ఈపి ‘ఐ హ్యావ్ నెవర్బీన్ హ్యాపియర్ టూ బీ లాస్ట్’ విడుదలైనప్పుడు తనదైన సొంతగొంతు వినిపించింది. రకరకాల సంగీతధోరణుల ప్రభావంతో పెరిగిన మీరాకు అది అంత తేలికైన విషయం కాదు. ‘మనదైన సొంతగొంతు వినిపించాలంటే, కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి రావాలి’ అంటుంది మీరా. పాట అంటే వాయిద్యాల ఘోష కాదు. అందులో ఎమోషన్ డెప్త్ శ్రోతలను హంట్ చేయాలి. అది మీరా పాటల్లో వినిపిస్తుంది. ‘డివైన్’ పాటలో ఇలా రాసింది మీరా... ‘నా జీవితాన్ని తెరిచిన పుస్తకంలా చదువుకోవాలని ఉంది’ జీవితపుటలను తిరగేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే, ఎక్కడ ఆగిపోయాం, ఎక్కడికి వెళుతున్నాం, ఎక్కడికి వెళ్లాలి? అనే ప్రశ్నలకు సాధికారికమైన సమాధానాలు వెదుక్కోవచ్చు. ఇక ‘డిస్టెన్స్’ పాట దగ్గరికి వస్తే...దూరం పెరగడం అనేది అన్ని విషయాల్లోనూ భారమైన విషయమేమీ కాదు. కొన్ని విషయాల్లో అది శక్తిని ఇచ్చే పని. మనల్ని మనం పునరావిష్కరించుకునే పని. ఎక్కడి వరకో ఎందుకు? మనలోని బద్దకానికి దూరంగా జరిగితే, నిర్మాణరాహిత్యానికి దూరంగా జరిగితే... అదేమీ ప్రతికూలత కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడమే. వెదుక్కుంటూ వెళితే మన మూలాల జాడ దొరుకుతుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు వెళ్లడం ద్వారా తన రూట్స్లోకి వెళ్లింది మీరా. ‘ఆల్ మై లైఫ్ ఐ హ్యావ్ బీన్ ప్రేయింగ్ సెర్చింగ్ ఫర్ సమ్‌థింగ్...’ అని తన ‘డివైన్’ లో చరణాలను పాడుకునే ఉంటుంది ఇరవై ఆరు సంవత్సరాల మీరా. ఆమె వెదుకుతున్నది అక్కడ ఏమైనా కనిపించిందా? ఒకవేళ కనిపిస్తే అది కచ్చితంగా ఆమె పాటలో వినిపిస్తుంది. వేచిచూద్దాం. -
నా పనే మాట్లాడుతుంది
‘‘ఈ ఏడాది 65 పాటలు రాశాను. పబ్లిసిటీపై నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఏ వేదికపైనా మాట్లాడలేదు. నా పనే మాట్లాడాలని కోరుకుంటాను’’ అని పాటల రచయిత కృష్ణకాంత్ అన్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ చిత్రంలో అన్ని పాటలు రాసిన కృష్ణకాంత్ విలేకర్లతో మాట్లాడారు. ∙ఈ సినిమా టైటిల్ ‘పడిపడి లేచె మనసు’ అనుకోగానే ‘ప్రళయంలోనూ ప్రణయంతోనే పరిచయం అయ్యే మనసు పడిపడి లేచె మనసు’ అనే త్రీ లైన్స్ రాశాను. ఈ లైన్స్‌లోనే సినిమా కథ ఉంది. అన్ని ప్రేమకథలు ఒకేలా ఉంటాయి. కానీ ప్రేమికులు ఎదుర్కొనే సంఘర్షణ డిఫరెంట్. ఈ సినిమాలో ఓ కొత్త కాన్ఫ్లిక్ట్ ఉంది. అది ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ∙హను రాఘవపూడి అన్ని సినిమాలకు నేను పని చేశాను. ఆయన సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారంగానే ఉంటాయి. ఈ సినిమాలోనూ అంతే. విశాల్ చంద్రశేఖర్ కూల్‌గా ఉంటాడు. తనతో వర్క్ చేయడం ఈజీ. ∙నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరో ఒకరి పేరు చెప్పలేను. ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్‌తో ఒక్కో అనుభవం ఉంది. కీరవాణి, రెహమాన్గార్లతో కాకుండా అందరితో వర్క్ చేశాను. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్ర్రి, వేటూరిగార్లంటే నాకు ఇష్టం. వేటూరిగారు నాకు ప్రేరణ. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాసే పాటలు రిక్షావాడికి కూడా అర్థం అవుతాయి. ఐదేళ్ల క్రితం సినిమాలోని పాటల్లో బీట్స్‌కి ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు లిరిక్స్‌కి ఉంటున్నాయి. ∙ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చేశాను. డిఫరెంట్‌గా చేయడానికి సిద్ధమే. గీత రచయితలకు సాహిత్యంపై అవగాహన ఉండాలి. జీవితాన్నైనా చదవాలి.. లేకపోతే పుస్తకాలైనా చదవాలి. ∙ప్రభాస్ 20వ చిత్రానికి ఇప్పటివరకు మూడు పాటలు రాశాను. ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాకు సింగిల్ కార్డ్ రచయితగా చేశాను. రాజశేఖర్ ‘కల్కి’, నాని ‘జెర్సీ’లకు రాస్తున్నా. -
పెళ్లి వయసు
యాంకర్ నుంచి హీరోగా మారారు తమిళ నటుడు శివ కార్తికేయన్. ముందు కమెడియన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇప్పుడు హీరోగా.. ఇలా అంచలంచెలుగా ఎదిగారు. ఇలా తనలోని కొత్త టాలెంట్‌ను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉన్నారాయన. ‘మాన్ కరాటే’తో సింగర్‌గా కూడా మారారు. ఇప్పుడు పాటల రచయితగా కలం పట్టారు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘కోలమావు కోకిల’ సినిమా కోసం ఓ పాట రాశారు శివ కార్తికేయన్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. ‘కల్యాణ వయసు....’ అంటూ సాగే ఈ పాట మే 17న రిలీజ్ కానుంది. అన్నట్లు... ‘పెళ్లి వయసు’ అని పాట రాసిన శివ కార్తికేయన్‌కి పెళ్లయింది. ఒక పాప కూడా ఉంది. -
పాటల రచయితలకు ఆహ్వానం:చెవిరెడ్డి
రేపు తిరుపతిలో వైఎస్సార్ సేవాదళ్ ఆధ్వర్యంలో పాటల ఎంపిక తిరుపతి రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపాలన, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పని నైజం, ఆయన చేయనున్న పాదయాత్రపై, నవరత్న పథకాలపై, చంద్రబాబు అవినీతి, అరాచక, అబద్ధాల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై, తెలుగు తమ్ముళ్ల దోపిడీ విధానాలపై చక్కని పాటలు రచించే గేయ రచయితలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. రాసిన పాటలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో విననున్నట్లు తెలిపారు. మనసుకు హత్తుకునే చక్కని పదాలు, సామాన్యులకు సైతం చేరువచేసే పదప్రయోగంతో పాటలు రాసేవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రచయితలకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 98495 45556ను సంప్రదించాలని సూచించారు. -
దేవత నువ్వంటూ... భక్తుడు అయ్యాడే!
‘‘అమ్మాయి నడిచే దారి తెలుసు.. ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే దారి తెలీదు! తన కోసం యుద్ధం చేయడం తెలుసు.. తనతో కలసి ఏడడుగులు వేసే మార్గం తెలీదు! మౌనంగా ప్రేమించే యువకుల మనసిది’’ అంటున్నారు పాటల రచయిత వి.వి.రామాంజనేయులు. ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. సమైక్యంగా నవ్వుకుందాం... అనేది ఉపశీర్షిక. పూర్ణ కథానాయికగా నటిస్తున్నారు. రవిచంద్ర స్వరకర్త ఈ సినిమాలోని ‘ఓ రంగుల చిలకా..’ పాటతత్వం గురించి, ఆ పాట రచయిత వి.వి.రామాంజనేయులు మాటల్లోనే.. పల్లవి: ఓ రంగుల చిలకా.. చూడే నీ యెనకా అలుపంటూ లేనీ ఈ పిల్లాడి నడకా ఓ బంగరు తళుకా.. చుట్టూ ఏం కనకా ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ప్రేమలో పడితే.. రంగులన్నీ అమ్మాయిలోనే కనిపిస్తాయి. అమ్మాయి ఎటు వెళితే, అలుపనేది లేకుండా అబ్బాయి కూడా అటు వెళతాడు. అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. సాధారణంగా అడుగులు వేస్తుంటే చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వినకుండా ఎక్కడికి వెళ్తున్నావని రాశాను. పాపం.. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు? ఒకడు మౌనంగా ప్రేమిస్తున్నాడని! కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి.. నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే నాకు తెలిసినంత వరకూ.. ఓ అమాయకత్వంతో కూడిన అబ్బాయిలే ప్రేమలో పడతారు. (నవ్వుతూ..) అమాయకులే ప్రేమిస్తుంటారు. ప్రేమికుడిని పసివాడితో పోల్చడానికి కారణమదే. మా సినిమాలో హీరో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు ఏం మాట్లాడకుండా అమ్మాయిల వెనకాలే దూరంగా తిరుగుతుంటారు. పోనీ, అమ్మాయిలు వీళ్లను చూస్తారా? అంటే, ప్చ్... ఏం పట్టించుకోకుండా వెళ్తుంటారు. మనోళ్లు మాత్రం ఒక్కసారి అమ్మాయి వెనక్కి తిరిగి చూడకపోతుందా? అని ఎదురు చూపుల్లో తమ సమయాన్నంతా గడిపేస్తుంటారు. ప్రపంచంతో ఆ ప్రేమికుడికి సంబంధం లేదు. అమ్మాయే వాడి ప్రపంచం. ప్రేయసి గురించి ఆలోచిస్తూ, ఆమె కలల్లో గడిపేస్తూ నిద్ర కూడా మరిచిపోతుంటాడు. చరణం: నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వేవేలడుగులైనా నడిచే ఘనుడే ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమించిన అమ్మాయిని గొప్పగా చూడడం మొదలు పెడతాడు. అతడి స్నేహితులకు, మిగతావాళ్లకు విచిత్రంగా అనిపించే అంశం ఏంటంటే.. వీడు అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ, ఎవరైనా ఆ అమ్మాయిపై కామెంట్ చేసినా.. ఇంకేమైనా చేసినా.. గొడవకు దిగుతాడు. ఎంత భయస్తుడైనా ఆ సమయంలో యుద్ధానికి సిద్ధమవుతాడు. కొన్ని ప్రేమకథలు ఏడడుగులు (పెళ్లి వరకూ వెళ్లకుండా) వేయకుండా ఆగుతాయి. కానీ, ఎప్పటికైనా ఆ అమ్మాయితో ఏడడుగులు వేస్తాననే ఆశతో వేల మైళ్లు నడుస్తూనే ఉంటాడు. కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నువు నడిచే దారిని వదలని ప్రేమికుడే గుండె తలపుల్నే.. తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే మనకు ప్రపంచంలో ఏ దారైనా తెలియకపోవచ్చు. ఏ దారి ఎక్కడికి వెళుతుందో? తెలుసుకోవడం కష్టమే. కానీ, ప్రేమించిన అమ్మాయి దారి తెలుసుకోవడం చాలా సులువు. కాలేజీకి వెళ్తుందా? ఆఫీసుకు వెళ్తుందా? అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమె చిరునామా ఏంటి? ప్రతిరోజూ ఏ దారిలో వెళ్తుంది? అనే విషయాలను చాలా సులభంగా తెలుసుకుంటాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడైనా గాళ్ ఫ్రెండ్ వెళ్లే దారిని మాత్రం మరువడు. అమ్మాయి వచ్చినా.. రాకపోయినా.. ఆ టైమ్‌కి దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవత అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తుడిలా.. ఎప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? అని గుండె గది తలుపులు తెరిచి ఎదురు చూస్తుంటాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ మనకు కనిపిస్తారు. కొందరు ఆ స్టేజి నుంచి వచ్చిన వాళ్లయితే.. మరికొందరు ఆ స్టేజిలోనే ఉన్నారు. తర్వాతి తరంలో ఆ స్టేజికి వచ్చేవాళ్లు తప్పకుండా ఉంటారు. సాధారణంగా యవ్వనంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక అమ్మాయి వెనక తిరుగుతారు. ప్రపంచంలో అందరూ తప్పకుండా తిరుగుంటారు. మోడర్న్ యుగంలో ఓ అమ్మాయిని చూడగానే వెళ్లి, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ధైర్యంగా చెప్పే అబ్బాయిలకు కూడా ఏదో ఒక సమయంలో ఈ తరహా సందర్భం ఎదురయే ఉంటుంది. అటువంటి వాళ్లందరూ... ఈ పాట చూడగానే ‘నా కోసమే ఈ పాటను రాశారా?!’ అని భావించాలి. ఎక్కడ ఈ పాట వినపడినా తమకు తాము గుర్తు రావాలనే ఉద్దేశంతో రాసిన పాట ఇది. వి.వి.రామాంజనేయులు గీత రచయిత ఇంటర్వ్యూ: సత్య పులగం -
ఎదురీత ముందు విధిరాత ఎంత!
కొన్నాళ్ల క్రితం ఓ మ్యూజిక్ డెరైక్టర్ నాకు ఫోన్ చేశారు. తన కూతుళ్లిద్దరూ నోట్ బుక్‌లో ఏదో రాసుకుంటుంటే ఏమిటని అడిగారట ఆయన. వాళ్లు సినిమా పాట రాసుకుంటున్నామని చెప్పా రట. ఆడపిల్లలు, నోట్‌బుక్‌లో సినిమా పాట రాసుకోవడమేంటి, ఏదైనా రొమాంటిక్ సాంగ్ గానీ రాసుకోవడం లేదు కదా అని కంగారుపడి ఆయన చెక్ చేశారట. అది అలాంటి పాట కాదు. ‘నింగి నేల నాదే’ సినిమాలోని ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ అనే పాట. పిల్లలకి స్కూల్లో ఆ సినిమా చూపించారట. చాలా గొప్ప పాట, అందరూ తప్పకుండా నేర్చుకుని పాడాలి అని టీచర్ చెప్పిందట. ‘పాఠాలతో పాటు మీ పాటను కూడా నేర్పుతున్నారు స్కూల్లో’ అని ఆయన అంటే సంతోషం వేసింది. ఏ రంగంలో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒకదాని నుంచి స్ఫూర్తి పొందిన వాడే అయ్యుంటాడు. మహ్మాతాగాంధీ కూడా స్ఫూర్తి కోసం భగవద్గీత చదివేవారు. స్ఫూర్తి అనేది అంత అవసరం. నేను నా కెరీర్లో స్ఫూర్తిని కలిగించే పాటలు చాలా రాశాను... మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పెను, కొడితే కొట్టాలిలా, నవ్వేవాళ్లు నవ్వనీ... ఇలా! అయితే ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత’ పాట చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది వికలాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రాసింది. అన్ని అవయవాలూ సక్రమంగా పని చేస్తున్నవారికే స్ఫూర్తి అవసర మైనప్పుడు... శరీరంలో కొన్ని అవయవాలు లేక, తమ పనులు తాము చేసుకోలేని స్థితిలో ఉన్నవారికి స్ఫూర్తి ఎంత అవసరం! అందరితో సమానం కావడానికి ఎలాంటి ప్రేరణ అవ సరం! అలా ఆలోచిస్తూనే పెన్ను పట్టాను. ఈ పాటకు జన్మనిచ్చాను. ఆరాటం ముందు ఆటంకం ఎంత/ సంకల్పం ముందు వైకల్యం ఎంత?/దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత??/ఎదురీత ముందు విధిరాత ఎంత? నమ్మకమూ పట్టుదల/నా రెండు రెక్కలుగా/ఎగిరేస్తా ఏలేస్తా నా ఆశల ఆకాశన్నంతా సాధించాలి అన్న పట్టుదల ఉంటే వైకల్యం అడ్డు కాదు. ఆ నిజం తెలుసుకుంటే విధిరాతను మార్చొచ్చు. దురదృష్టాన్ని పారద్రోలవచ్చు. చేజారెను చేతులు/చెదిరేను గీతలు/ బెదిరించిన బాధలే వివరించెను బోధలు హీరోయిన్ ప్రమాదవశాత్తూ చేతులు కోల్పోతుంది. తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితికొస్తుంది. ఆ బాధ మొదటి రెండు లైన్లలోనూ ఉంటే, క్రమంగా తనలో పెరిగిన పట్టుదలను మూడో లైన్ చెబుతోంది. పాదాలను పిడికిలిగా/నా గుండెను గుప్పిటగా/మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యాన్నంతా... పట్టుదలతో తానేం చేయబోతోందో చెబుతోందా అమ్మాయి. చేతులు లేని స్థితిలో అలానే ఉండిపోతే తను అందరిలాంటి అమ్మాయిల్లాగే మిగిలిపోయేది. కానీ తను తన పనులు తానే చేసుకోవడం నేర్చుకుంది. కాళ్లతో వండుతుంది. తింటుంది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంది. చివరికి స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తుంది. పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం/ అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం/ చిరునవ్వే స్తుంటే సెలవంది శోకం/సహనంతో ఉంటే దొరికింది సైన్యం/చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం అంటూ తన విజయాన్ని ప్రపంచానికి సగర్వంగా చూపిస్తుంది తను. నిజానికిదో చైనీస్ మూవీ. డబ్ చేశారు. విదేశీ సినిమాల్లో పాటలుండవు. కానీ తెలుగులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వచ్చే ఒకచోట పాట పెట్టా లనుకున్నారు. ఆ సిట్యుయేషన్‌కి పాట కంటే ముందు ఒక మాట వచ్చింది నా మనసులోకి. ఆ అమ్మాయి ఓ యాపిల్‌ను కాళ్లతో తీసుకుని, నోటి దగ్గర పెట్టుకుని తింటుంది. అది తన ఆత్మవిశ్వాసం, ధైర్యం, స్థిరచిత్తానికి నిదర్శనం. అందుకే ఓ మాట రాశాను... ‘నాకెన్ని కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చినా కన్నీరు పెట్టను, పెట్టకూడదు కూడా. ఎందుకంటే తుడుచుకోవడానికి నాకు చేతులు లేవు కాబట్టి!’ ఆ తర్వాత ఈ పాట ప్రారంభమవుతుంది. ఇలాంటి పాటలు రాయాలంటే పాత్ర తాలూకు మనస్తత్వాన్ని, మానసిక స్థితిని తప్ప కుండా అనుభవించాలి. ఆ స్థానంలోకి వెళ్లి ఆ పాత్ర తాలూకు బాధను, సంఘర్షణను అనుభ వించగలిగితేనే ఈ విధంగా రాయగలం. లేక పోతే పాదాలను పిడికిలిగా పట్టుకుంటాను అన్న మాట ఎలా వస్తుంది! గుండెను గుప్పిటగా మలవడం అన్న వాక్యం ఎలా తడుతుంది! నిర్మాత సుధారాణిగారికి ఈ పాట వినిపించ గానే ఆవిడ కళ్లనీళ్లు పెట్టుకున్నారు. నేను కూడా దీన్ని నా జీవితంలో నేను రాసిన ఓ గొప్ప పాటగా భావిస్తాను. అయితే ఇది పాడే సందర్భం మాత్రం రాకూడదని కోరుకుంటాను. ఎందుకంటే వైకల్యం ఎవరికీ ఉండకూడదు. కానీ దురదృష్టం... చాలామంది వికలాంగులు ఉన్నారు. వాళ్లకి స్ఫూర్తి కలిగించే అవకాశం ఎప్పుడు వచ్చినా నేను ఈ పాటే పాడు తుంటాను. వాళ్ల కోసం ఈ పాట రాయగలిగి నందుకు సంతోషపడుతుంటాను! - చంద్రబోస్,గీత రచయిత -
నీ పయనమెచటికే ఓ చిలుకా!
పాట నాతో మాట్లాడుతుంది తండ్రి లబ్ద ప్రతిష్టుడైనప్పుడు పైగా అద్భుతంగా తన రంగంలో జాజ్వల్యమానంగా వెలిగిపోతున్నప్పుడు అదే రంగంలో కొడుకు ఉంటే అనేక చిక్కులు. ప్రతిదానికి తండ్రితో పోలిక. లోకులతో పాటు తను కూడా పోల్చుకుని ఇబ్బంది పడే క్షణాలు ఎన్నో. ‘బాగా చేస్తే ఆ తండ్రి కొడుకు కదా అద్భుతంగా ఉండక చస్తుందా’ అంటారు. బాలేకపోతే ‘పండితపుత్రుడు. చెట్టు పేరు చెప్పి కాయలు ఎంతకాలం అమ్ముకుంటాడు’ అనే మాట పడాలి. ‘‘ఇలాంటి బాధలు అలాంటి పుత్రులకు తెలిసినంత ఇతరులకు అర్థంకావు. ఒక్కోసారి కొడుకు చేసింది తండ్రికే నచ్చదు. నా తండ్రి జూనియర్ సముద్రాల రాసి అనేక మహావ్యక్తులతో ‘ఆహా’ అనిపించుకున్న ‘అందమె ఆనందం’ పాట మా తాత సీనియర్ సముద్రాలకు తొలిచూపులో నచ్చలేదు. అంతెందుకు నువ్వు సినిమాల్లోకి రాకముందు, వచ్చింతర్వాత నీ పాటలను మీ నాన్న ప్రజాకవి సుద్దాల హనుమంతు పాటలతో పోల్చి నిన్ను మెచ్చుకున్నవారు, తిట్టుకున్నవారు, తిడుతూ పత్రికల్లో రాసి - సభల్లో చెప్పి నిన్ను బాధకు గురిచేసినవారు ఎందరో అకళంక పురుషీవరులు నీకూ తెలుసు కదా!’’ అంది జూనియర్ సముద్రాల పాట. ‘నీవు ‘అందమె ఆనందం’ పాటవా’ అన్నాను. ‘‘అనుకున్నాను, నీవూ అలాగే అంటావని. కానీ కాదు.’’ అంది కొంటెగా. ‘‘మరి ఎవరమ్మా’’ అన్నాను. ‘కులదైవం’ చిత్రంలో ‘పయనించిన చిలుకను’ అంది. సంగీతం మాస్టర్ వేణు అనే హింట్ కూడా ఇచ్చింది. ‘అబ్బో... చాలా గొప్ప పాటవు. పొడవైన పాటవు సుమీ’ అన్నాను. నిడివెక్కువ గీతాలు రాసి అద్భుత కీర్తినందుకున్నారు. మా నాన్నారు ‘పాండురంగ మహాత్మ్యం’లో ‘హే కృష్ణా’ పాట కూడా పొడవు తీరులోనే కాదు. పేరు ప్రతిష్టల్లో కూడా అంది. ‘పయనించే ఓ చిలుకా... గొప్ప సింబాలిక్ సాంగ్. అన్నీ పోగొట్టుకుని పుట్టిన ఊరు విడిచి వెళ్లే ఒక కుటుంబ యజమానిని విషాదం మిగిలిన ఒక యువతిని ఉద్దేశించి చెప్పిన పాట. అలాంటి ఎందరికో ధైర్యాన్ని, ఓదార్పును ఇచ్చిన పాట. ఇక్కడ జూనియర్ సముద్రాల ఊరువిడిచిన గుమ్మడిని తొలిరెండు చరణాల్లో విషాదం పాలైన గిరిజను చిలుకతో పోలుస్తూ తుది రెండు చరణాల్లో చూపుతూ ఇద్దరికి సరిపోయే ఒకే పల్లవి కూర్చి అపూర్వంగా రచించిన పాట. పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయెను గూడు ఇంతే పల్లవి. ‘నీకీ ఊరుతో రుణం తీరిందీ ‘వెళ్లిపో’ అనే భావాన్ని చిలుకను మానవీకరిస్తూ గుమ్మడి పరంగా ‘తీరెను రోజులు నీకీ కొమ్మకు పోమ్మా ఈ చోటు వదలి ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము ఎటకో ఈ బదిలీ’’ అంటూ - మనిషి జన్మ మూడు దినాల ముచ్చటైన మజిలీ నిజాయితీగా ధర్మపథాన చనుమా ధైర్యమె నీ తోడు. ఓదార్చుతూనే ‘నిజాయితీ’ ధర్మపథం ధైర్యం ఒకే వాక్యంలో నిలిపిన గొప్ప సినీకవి. ఇంక రెండో చరణంలో ‘నీవెంతో కష్టపడి చేసుకున్నది మొత్తం పోయింది. నీ రెక్కలు చల్లగుంటే మళ్లీ పూర్వవైభవం వస్తుంది’ అన్న విషయాన్ని చిలుకీకరించుతాడు - మనిషిని పక్షిగా మలుస్తూ పుల్లాపుడక ఏరుకొని కట్టుకున్న గూడు పోయింది. ఫర్వాలేదు వానకు తడిసిన రెక్కలు ఎండకు ఆరి సేదదీరుతాయి. చేసిన కష్టం వృథా అయిందని వేదన వద్దు. సిరి-సంపద మనం కనుమూశాక మన వెంట రాదు - త్యాగం కూడా మనిషికి చేదోడే - పద - అంటాడు జూనియర్ సముద్రాల. తండ్రి రచనంత తాత్విక గంభీరంగా సులభ సుందరంగా. గిరిజను ఉద్దేశిస్తూ మూడో చరణంలో గీతోపదేశం చేశాడు జూ॥సముద్రాల. గత వైభవం ఇప్పుడు లేదు. మారిన పరిస్థితులకనుగుణంగా నీవు మారాలి. కన్నీరై కరుగుటే నీ తలరాత నీపై జాలి చూపేవారు లేరు. ఈ చరణం - చివరి చరణం కూడా గిరిజ పాత్రను ఉద్దేశించి సాగుతుంది చిత్రంలో చిలుకను మళ్లీ మానవీకరిస్తున్నాడీ చరణంలో ‘మరవాలి నీ కులుకులనడాలే మదిలో నయగారాలె’ తీరని వేదన తీయని ముసుగే శిరసున సింగారాలే ఓర్వలేని ఈ జగతికి నీపై లేవే కనికారాలే కరిగి కరిగి కన్నీరై కడతీరుటె నీ తలవ్రాలే చేరాతను - చేవ్రాలు అన్నట్టు తలరాతను - తలవ్రాలే అన్నాడు. ఇక నాలుగో చరణం - ఒక చిన్న ఓదార్పుతో - పాట ముగించాలనుకున్నాడు. గోడుమని విలపించుతారు నీ గుణం తెలిసినవారు జోడుగ నీతో ఆడిపాడిన స్నేహితులు - కన్నీళ్లతో నిన్ను దీవించుతారు. విడిచిన చోటుకు తిరిగి చేరుకోవడం ఈ లోకంలో తెలిసినవాడెవడు అన్న భావంతో రేపు ఏం జరుగుతుందో తెలిసిందెవరు అనే వేదాంతపరంగా ముగిస్తాడు. సినిమా ఈ పాటతోనే ప్రారంభమవుతుంది. ఒకవైపు గుమ్మడి కుటుంబ నేపథ్యం మరోవైపు ‘గిరిజ’ విషాద జీవిత నేపథ్యం తన భుజాలపై వేసుకొని పది సన్నివేశాలలో చెప్పాల్సింది ఒక పాటలో చెప్పాడు నా తండ్రి జూ॥సముద్రాల అంటూ ‘చిలక’లా వచ్చి హంసలా ఎగిరిపోయింది తండ్రి జూనియర్ సముద్రాలను వెదుక్కుంటూ... - డా.సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
మౌనమే మంత్రమౌతున్న వేళ... ఓ వేణుమాధవా!!
పాట నాతో మాట్లాడుతుంది... తన పెన్నులో సిరా వెన్నెల - నా తండ్రి సిరివెన్నెల. మాట తీరు వెన్నెల - మనసు తీరు వెన్నెల. మనిషి తీరు సిరివెన్నెల సీతారామరాత్రి సారీ... సీతారామశాస్త్రి. ఎంత బాగా చెప్పావు... పాటా! నీ మాటల ముత్యాల పోహళింపులో శాస్త్రిగారి కూతురువనిపించావు... ఇంతకూ నీవు... ‘‘నేను... నేను... ‘నేనున్నాను’ చిత్రంలో గాలి గాంధర్వపు గీతాన్ని... గుర్తించలేదా కవీ..’’ ఓ... నాకిష్టమైన పాటవి. ఎన్నో ప్రదేశాల్లో ఇప్పుడు వస్తున్న పాటల్లో ఆనాటి ఆపాత మాధుర్యమూ లేదు. అత్యంత సాహితీ సౌగంధమూ లేదన్న ఎందరు సాహితీ ప్రియులకో ‘నీ పేరు చెప్పి ఒప్పించేవాణ్ని. నేటి సినీసాహితీ స్రష్టంలో వాసి వసి వాడలేదని నిరూపించేవాణ్ని. సరే... ఇక చెప్పు. ‘నేనున్నాను’ సినిమా - కీరవాణి సంగీతం, పాడింది చిత్ర. సన్నివేశం - తన బతుకును చిగురింపజేస్తున్న కథానాయకుడు నాగార్జునకు ఆత్మనివేదన చేసుకునే సందర్భంలో పాట రాయాలి. ‘కథానాయికని వెదురుగా పోల్చుతూ - హీరో వేణుధరుడైన మాధవునితో ఉపమిసూత శూన్యంగా ఉన్న వెదురుగొట్టంలో మోహనుడి ఊపిరి ఎలా గాంధర్వమైందో... రాయరాదా తండ్రీ’ అన్నాను... అంది. వెన్నెల సిరాక్షరాలుగా మారుతూ... ‘వేణుమాధవా!’ అని పలికింది ‘సాకీ’గా. క్రియారూపంలో పల్లవిని పల్లవింపజేయడం సిరివెన్నెల పెన్నుకవ్వంలో భావాల మీగడ పెరుగును చిలికిన వెన్న తీయడమంత సులువు. వాతావరణంలో ఉన్న వాయువు గోపాలుని ఊపిరిగా మారి, పెదవులతో వేణువునూదగానే ఉల్లము ఝల్లుమనిపించే గాంధర్వంగా మోగడాన్ని తలచుకో- అన్నాను. అంతే! నా తండ్రి సిరివెన్నెల అందుకున్నాడు. సుకుమార సుందరంగా రసబంధురంగా- ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నది- ఆపైన ఆలస్యం లేకుండా రెండో వాక్యం... ‘ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో’ అంటూ దూసుకొచ్చింది. ఆ శ్వాసలో నేను కూడా విలీనమై ఆ పెదవులపై నేను కూడా మంత్రమై నీలోకి చేరని మాధవా’ అని పల్లవి పూర్తించాడు. నా తండ్రి సీతా గీతా రామశాస్త్రి ఇంక తొలి చరణం - మురళిని అనిర్వచనీయంగా - కవితా నిర్వచనీయంగా చరణీకరించడం - ఏ రుషులకు - తాపసులకు - మధుర భక్తులకు అందని మాధవుని పెదవులపై పవ్వళించే యోగం - రసాత్మక భోగం వెదురు మురళిదంటు అందుకోసం - ఎన్ని గాయాలు తొలచుకుంటేనో ఈ అద్వైత యాగ ఫలసిద్ది అంటూ మునులకు తెలియని జపములు జరిపినదా వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున - నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది (ఓం నమో నారాయణాయ) అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధీ - వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ - ముగించాడు. ఆ పైన రెండో చరణంలో ఏం చెప్పాలి? మురళి శరీరపరంగా తొలి చరణ సరళి ముగిసింది. ఇక ఆ ముదిత శరీరపరంగా చెప్పు తండ్రీ! అన్నాను. నిదుర రాని నడిరాతిరి సిరివెన్నెల కనుపాపల కదలికలో నేను తప్ప ప్రపంచమంతా గాఢనిద్రలో కదా అనే భావం తొణికిసలాడి మరో రూపంలో కాగితంపై ప్రసరించింది. వెన్నెల రేఖలా వెలుగుల వాకలా ‘చల్లని నీ చిరునవ్వులు కనపడక - కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా - అల్లన నీ అడుగుల సడి వినపడక - హృదయానికీ అలజడితో అణువణువూ తడబడదా- ఈ పాదం నడిపేది నువ్వె - నా నాదం పలికించేది నువ్వె - సినిమాలో నాయికకు పుట్టుకతో వచ్చిన గాన కళను ప్రోత్సహించినవాడు నాయకుడు. కనుక - చివరి నాలుగు వాక్యాలను నువ్వే నడుపు పాదమిది - నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది - నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధీ... అని సంపూర్ణించాడు సిరివెన్నెల. ఇందులో కథానాయకుని పేరు వేణు అని కవికి తెలుసు. పాట రాసినట్టుగా మాట్లాడటం - మాట్లాడినట్టు పాట రాయడం మీ కవులకు, సినీకవులకు సినారె నుండి సిరివెన్నెల దాక చెల్లిందే. కానీ క్రియాపదాలతో పల్లవించడం - అందమైన అర్థాలను ఊరిస్తూ - అందమైన చెవికీ - మనసుకు - సంగీతానికి ఉచ్చరించటానికి ప్రియంగా ఒదిగే పదాలను అల్లుకుంటూ కాగితంపై చూస్తే అలవోకగా మాటాడుకునే సాదా సీదా మాటలతో ‘పాట బొమ్మ అమ్మాయిల్ని వెన్నెల్లో ఆడించడం’ నా తండ్రి సిరివెన్నెలకు విరించి పెన్నుతో పెట్టిన విద్య. అంటూ... నా విధాత - క‘విధాత’ నా పిత సీతారామశాస్త్రి పాటలూరే రాతిరి రత్న పేటికలోనే నా బస - అంటూ తన శ్వాసలో చేరితే నేను గాంధర్వమయ్యానులే అని పాడుకుంటూ వెళ్లింది. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఆకాశం అమ్మాయైతే...
పాట నాతో మాట్లాడుతుంది హలో పెదనాన్నా! నేను చంద్రబోస్ కూతురును మాటాడుతున్నాను. ఓ అమృతవర్షిణీ... బావున్నావా బంగారుతల్లి - నేను అమృతవర్షిణిని కాదు. ఆ... అమృతవర్షిణి కాకుండా.. చంద్రబోస్‌కు... తమ్మీ బోసూ మాకూ సుచిత్రమ్మకు... తెలియకుండా నీకు. ఇంకో ‘నాలోని అపోహలను ఖండిస్తూ చంద్రముఖి సినిమాలో మనసులోని విషయాలు రజినీకాంత్‌కు తెలిసిపోయినట్టు... కొంచెం కోపంగా ‘పెదనాన్నా... నేను ‘గబ్బర్‌సింగ్’లో ‘ఏం చక్కని బంగారం’ పాటని. ‘అమ్మయ్య... నా హార్ట్‌బీట్ పెంచావు కదే. ఓకే ఓకే చెప్పు నీ జన్మ రహస్యం. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు ‘యువ రసజ్ఞతా హృదయాల రేబవలు దోచుకునే దొంగ’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీకి రెండు మూడు పల్లవులు ఇచ్చినా ఎవరికీ - దర్శకుడు గబ్బర్ సింగ్‌తో సంచలన దర్శక హరీంద్ర గర్జన చేసిన హరీష్ శంకర్‌కీ - ‘దేవి’కి నచ్చట్లేదు. నా తండ్రి చంద్రబోస్‌కి తింటున్నా, నిదురిస్తున్నా, నడుస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా దేవి బాణీయే శ్వాసక్రియగా మారింది. ఒకరోజు కార్లో వస్తూ రాయదుర్గం పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు ఆగాడు. ఆకాశం మేఘావృతమై మేఘసందేశం రచనకు ముందు కాళిదాసును కవ్వించినట్టు కవ్విస్తోంది. పెట్రోల్ బంక్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ అందరూ ఉద్యోగినులు - అటు కవ్విస్తున్న ఆకాశాన్ని, ఇటు దేవతల దోసిళ్లలో అమృతం పోస్తున్న విష్ణుమోహినిలా పెట్రోల్ పోసే అమ్మాయిలు. సరిగ్గా అప్పుడే నేను ఎదురై ‘ఆకాశం - అమ్మాయిలు’ ఇలా వెళ్లు డాడీ అన్నాను. ఇంకేం క్షణమాలస్యం కాకుండా పెదవుల్లో అలవోకగా వచ్చింది. ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే’ తర్వాత ‘సేమ్ లెంత్’... ఆనందం అల్లరిచేస్తే నాలా ఉంటుందే... అంతే... శభాష్... ఆకాశమా... శహభాష్ అమ్మాయిలు అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూనే దర్శక - సంగీత దర్శకులకు వినిపించారు. అటువైపు నుండి ‘సూపర్బ్ గోహెడ్’ అన్నారంతా. ఇంతలో సన్నని వాన మొదలైంది. ‘డాడీ తర్వాత వాక్యం కోసం మొదలైంది వాన’ అన్నాను. సామాన్యుడా చంద్రబోస్. వానల్లె నువ్వు జారగా... నేలల్లే నేను మారగా... వాగల్లె నువ్వు నేను చేరగా... అది వరదై పొంగి సాగరమవుతుందే హోలా... హోలా... నీ కళ్లల్లోన చిక్కానే పిల్లా... హోలా... హోలా... హోలా... హోలా... ఇక చాలా చాలా జరిగే నీవల్ల... పల్లవి పూర్తయింది. ఇక చరణం: - తన్నాసీ... సన్నాసీ... అన్నట్టుగా... మూడక్షరాల పదంలో చివరక్షరం ‘సీ’ పెట్టాలని ట్యూన్ డ్రైవ్ చేస్తోంది. ప్రాసల మంత్రనగరి ప్రభుత్వాధీశుడు చంద్రబోసుడు - అల్లేసీ... గిల్లెసి... సుగుణాల రాక్షసి ప్రియభయంకర పద ప్రయోగాల్లో గుండెను రసకైంకర్యం చేసే శక్తి ఉందని తెలిసిన పద హృదయ మర్మయోగి - దర్శకేంద్ర రస విశ్వవిద్యాలయా గీతాశాఖ ఉన్నతోద్యోగి చంద్రబోస్‌కు తెలియదా. సుగుణాల రాక్షసి - దయలేని ఊర్వశి రాక్షసికి సుగుణముండదు. ఊర్వశికి నిర్దయ ఉండదు ... అద్భుతం చంద్రబోస్... ఇంకో చరణంలో ‘మసి చేసినావే రుషిలాంటి నా రుచి (రుచి అంటే టేస్ట్ - రుచి అంటే కాంతి) ’ రెంటినీ అన్వయిస్తూ రచించిన చంద్రబోస్... ఏ కావ్యాలు ఔపోసన పట్టిన ఏ కవుల కన్నా తక్కువ కాదు. రెండు చరణాలు అద్భుతంగా రాశాక సాకి రాయాలి. కవ్వింపుగా, గిల్లింపుగా రాయాలనుకుని ఏం చక్కని బంగారం - ఎనిమిది దిక్కుల సింధూరం. మనసున రేపెను కంగారం - మెత్తని బంగారమెంత సున్నితమో ‘కంగారం’ యువ హృదయం తాలూకా తొట్రుపాటును ‘కంగారం’ అనడం ఎంత హాయిగా ఉందో. వన్నెల వయ్యారం తీయని ప్రేమకు ‘తయ్యారం’. వావ్... ప్రయోగ శరణం వ్యాకరణం కదూ... చంద్రబోస్ నీ చిలిపి పాటలతో రసజ్ఞులైన శ్రోతలకే కాదు. కవినైన నాకే థ్రిల్లింగ్‌గా, గిల్లింగ్గా ఉంది అనుకుంటుండగా... ‘వస్తా పెదనాన్నా’ అంటూ మణికొండవైపు మాయమైంది చంద్రబోస్ పాట. డా.సుద్దాల అశోక్ తేజ , పాటల రచయిత -
పరిమళాల పూబోణి... కృష్ణవేణి
ప్రతి సభలో ‘నా పాటల తండ్రి సినారె’ అంటూ నువ్వు సభికులతో చప్పట్లు కొట్టించుకుంటావు. నిజానికి సినారె నా తండ్రి - అంది సినారె పాట.‘మూడు వేల పాటల్లో నీవెవరు సోదరీ’ అన్నాను. ‘‘ఈ వరుసలేంటి’’అంది. ‘‘మనం ఇద్దరం సినారెని తండ్రి అంటాం. కనుక నాకు నీవు సోదరివే, చెప్పక్కా.’’ నేను శిఖరమస్తకుడు అని సినారెతో పిలిపించుకునే రెబల్‌స్టార్ కృష్ణంరాజు, అభినేత్రి వాణిశ్రీ నటించి రామకృష్ణ - సుశీల ఆలపించిన కృష్ణవేణిని అంది.సంగీతం విజయభాస్కర్. దర్శకుడు అద్భుత దార్శనిక దర్శకుడు వి.మధుసూదన్‌రావు. కథ చెబుతూ పెళ్లయ్యాక కృష్ణానదీ పరివాహక ప్రాంతాలలో ముఖ్యంగా శ్రీ పర్వతం - నాగార్జున సాగర్ నుండి సముద్రంలో సంగమించే హంసలదీవి దాకా పాటను నడిపించాలని చెప్పి తయారించిన బాణిని సినారె ముందుంచారు.సినీరంగంలోకి రాకమునుపే ‘కృష్ణవేణి తరంగిణి పయఃకింకిణులు’ నాగార్జున సాగర కావ్యంలో పలికించిన నా పాటల తండ్రిలోని కవితా పారిజాత హృదయం చిరునవ్వు నవ్వుకుంది తెలుగు మల్లెపూవులా. రావాల్సిన పాటే వచ్చిందే అని... ‘‘నాయిక చూపు నది వైపుగా నాయకుని చూపు తనదిగా (పెళ్లయింది కనుక) మారిన నాయిక వైపుగా ఇలా నాయకానాయిక హృదయాల్లోకి దూకు తండ్రీ’’ అన్నాను. నా తండ్రి సినారెతో - ఇచ్చిన బాణీ దారి చూపుతుంటే పలికాడు సినారె... ఆమె పల్లవిగా ‘‘కృష్ణవేణీ... తెలుగింటి విరబోణీ’ అతడేమనాలో క్షణంలో వెయ్యోవంతు ఆలస్యం లేకుండా ‘‘కృష్ణవేణీ... నా ఇంటి అలివేణీ’’ అంటుండగా - చిన్నారి చిరు పల్లవి వచ్చేసింది. పాట ప్రారంభమయ్యేది శ్రీ పర్వతం నుండి కదా ‘‘శ్రీగిరి లోయల సాగే జాడల విద్యుల్లతలు కోటి వికసింపచేసేవు’’ నిజానికి నాగార్జున సాగరంలో విద్యుత్తు కూడా పుడుతుంది. నాయికతో విద్యుల్లతలు అనిపించాను కనుక నాయకునితో ఏమనిపించాలనుకున్నారు. సినారె కళ్లలో దయ - ఒళ్లంత లయ తొణికిసలాడుతుంది. ఏళ్లుఏళ్లుగా... మనసు వెన్నపూస - మాటలో ప్రాస - తనది. అందుకే పైన విద్యుల్లతకు అనుబంధంగా ‘లావణ్యలతవై నను చేరువేళ శతకోటి చంద్రికలు వెలిగిస్తావనిపించాడు.’’ నాగార్జున గిరి కౌగిట ఆగి - నీళ్లను బంగారు చేలుగా మార్చేవు అనిపించాడు. నాయికది ‘వస్తువుపైన ఆలోచన కనుక బంగారు చేలు అన్నది కాబట్టి నా జీవనదివై ఎదలోన ఒదిగి పచ్చని (జీవితాంతం ఆరిపోని) వలపులు పండించమనిపించాడు. కృష్ణానదితో పాటు - వెళుతుంది సినారె కలం... అమరావతిలో రాళ్లను అందాల రమణులుగా తీర్చిదిద్దేవంటే ఏ శిల్పరమణులకు - ఏ దివ్యలలనులకు నోచని అందాలు దాచిన కృష్ణవేణి - అని/ ఆ తర్వాత చరణంలో... అభిసారిక అంటే ప్రియుని కోసం వెతుక్కుంటూ వెళ్లే నాయిక. ఇక్కడ నది కూడా సముద్రం కోసం వెళుతూ ఉంటుంది కనుక వాణిశ్రీ నోట ‘అభిసారికవై హంసల దీవిలో సాగర హృదయంతో సంగమించావంటే, కృష్ణంరాజుతో కొసమెరుపుగా నా మేని సగమై - నా ప్రాణ సుధవై సుధ అని ఎందుకనాలి సుధ అంటే సలిల సంబంధి అమృతం బతికించేది గనుక నిఖలము నీవై నిలిచిన కృష్ణవేణి అంటూ నదిని, పాటని అంటూ సాగరానికి - ఇటు ప్రేక్షకుల హృదయ సాగరాలకు చేర్చుతాడు సినారే. ఒక్కోపాట రాయడానికి పరిసరాలు - హృదయ పరిమళాలు కూడా తెలిసుండాలని ఆ రెంటిని కలిపే చతురతా ప్రాభవాలు కవి కలిగుండాలని పాట ద్వారా చూపిన నా తండ్రికి ఇటీవలే ‘కేంద్ర సాహిత్య ఫెలో’ అవార్డు వచ్చింది తెలుసా తేజా అంటూ సాయం సంధ్యవేళ నా తండ్రి రవీంద్రభారతికి వచ్చుంటాడు. వస్తా... అంటూ పరిమళాల నెవడాపునంటూ మా ఉప్పల్ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా సాగిపోయింది కృష్ణవేణిలోని కృష్ణవేణి పాట. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
కోడలికి అత్త స్వాగతం
డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత నా పాట నాతో మాట్లాడుతుంది నా పాట నాతో మాటాడింది. ఈ వారం నా గురించి చెప్పవూ అంటూ బుంగమూతి పెట్టి రాగాల గారాలు పోయింది. నా పాట - నీ గురించి చెప్పాలంటే ఇంకా ఎన్నో చెప్పాలి... అనుకుంటూ... జ్ఞాపకాల పారిజాత వనవిహారినయ్యాను. అప్పటికి ‘నమస్తే అన్న’, ‘మాయదారి కుటుంబం’, ‘రెండో కౄష్ణుడు’, ‘నిరంతరం’ సినిమాలకు రాశాను. మాయదారి కుటుంబంలో దర్శకరత్న దాసరి ప్రధాన పాత్ర చేస్తున్నారు. అందులో నటుడు ఉత్తేజ్ది ఒక పాత్ర. నేను ఉత్తేజ్ ఇంట్లో ఉండేవాణ్ణి. మా అక్కయ్య కొడుకే. ఉత్తేజ్ నన్ను దాసరిగారికి అన్నపూర్ణ స్టూడియోలో పరిచయం చేశాడు. మరునాడు ఉదయం 6-45కు రమ్మన్నారు. 6-44కు వారి దగ్గరికెళ్లా. ఆశ్చర్యం గురువుగారు అప్పటికే స్నానించి తెల్లని వస్త్రాల్లో కూచుని ఉండి నాకు షాక్ ఇచ్చారు. ప్రముఖ వ్యక్తికైనా, సాధారణ వ్యక్తికైనా ‘సమయపాలన’లో తేడా చూపకూడదనే పాఠం తొలిరోజే నేర్పిన గురువుగారికి పాదాభివందనం చేశాను. ఇంతవరకు రాసిన సినీగీతాలు కాదు మీ ఊళ్లో - నీ కోసం రాసుకున్న పాట వినిపించమంటే ‘నేలమ్మ’ ‘ఆకుపచ్చ చందమామ’ ‘టపటప చెమటబొట్లు’ వినిపించా. దగ్గరకు తీసుకుని వెన్నుతట్టి ‘నిన్ను సినీపరిశ్రమకు రాకుండా ఆపడం బ్రహ్మతరం కూడా కాదు, నేను అద్భుతమైన అవకాశం ఇస్తాను వెళ్లిరా’ అన్నాడు. ఆ తర్వాత తను అక్కినేని ప్రధాన పాత్రలుగా నటిస్తున్న ‘రాయుడుగారు - నాయుడుగారు’ సినిమాకు మద్రాస్ పిలిపించి తన ఆఫీసులోనే ఉండమన్నారు. దాసరి ‘పాట తయారి సభ’ భువన విజయంలా ఉంటుంది. దాసరి శ్రీకౄష్ణదేవరాయలులా కూచుని ఉంటే సంగీత దర్శకులు, పాటల రచయితలు, సహకార దర్శకులు టేప్ రికార్డర్‌తో సిద్ధంగా ఉంటారు. అదో అద్భుత సన్నివేశం. కేకే నగర్లో ఆఫీస్. బిక్కుబిక్కుమంటూ నేను. ప్రతిభాన్విత రచయిత తోటపల్లి మధు ఒక కొత్త పాటల రచయితను గురువు గారికి పరిచయం చేశారు. సన్నివేశం ఇలా చెప్పారు... ఆ కొత్త రచయిత (నేనూ కొత్త రచయితనే అప్పుడు) నేనూ కూచున్నాం. కొత్త కోడలును ఆహ్వానిస్తూ తాను, సుజాత పాడే గీతం- తెలుగుతనం ఉట్టిపడుతూ ఆ ‘కట్టూబొట్టూ’ కనపడుతూ ఉండాలి అన్నారు దాసరి. నన్ను రాయమనలేదు. వారం గడిచింది. ఓ వైపు కథాచర్చలు - మరోవైపు ఈ పాట సభ. ఆ కొత్త రచయిత సుమారు 60 పాటలు రాసి వినిపించారు. దర్శక బౄందానికి నచ్చట్లేదు. ఆ తరువాత ఒక ప్రముఖ పాటల రచయితను పిలిపించి అదే సన్నివేశం చెప్పారు. మరికొన్ని రోజులు గడిచాయి. ‘పాట’ పల్లవులు నచ్చట్లేదు. నేనేమో ఖాళీగా ఉంటున్నాను. ఒక రాత్రి నా పాట నాతో మాట్లాడడం ప్రారంభించింది. అవునూ! పాట నిన్ను రాయమనలేదు, అయినా నీవు అదే సన్నివేశానికి రాయొచ్చుగా అంది. ‘‘అలా చెప్పకుండా రాస్తే తప్పేమో’’ అన్నాను. ‘‘ఏం రాస్తే కొడతారా? నీకు చెప్పలేదు కదరా ఎందుకు రాశావ్ అంటారు. బాగుంటే సమయం వౄథా కాకుండా రాసినందుకు మెచ్చుకుంటారు కదా’’ అంది. ‘గురువుగారు మీకు జోహారు, అత్తచేత కోడల్ని స్వాగతించే సన్నివేశం సమకూర్చడంలో ఎంత సామాజిక స్పౄహ తండ్రి మీకు’ అనుకుని- ‘‘గడపలో కుడిపాదమెట్టూ కోడలా కడుపులో పెట్టుకుని దాచుకుంటానమ్మా ఒట్టు - నా ఒట్టు - మా వొట్టు (మా యొక్క మరియు మామయ్యపై ఒట్టు) దేవుడొట్టూ’’ కడుపులో పెట్టుకుని దాచుకుంటాననడంలో పల్లెతనం - తల్లితనం వెరసి తెలుగింటి చల్లదనం సమకూరింది. ఇంక ‘ట్టూ’లతో సాగిపోయింది. పసుపు కుంకుమ కలిపినట్టూ పసిడి వన్నెల కన్నెబొట్టూ కలికి పలుకూ తేనెబొట్టూ కట్టుకున్నది కంచిపట్టూ చీరకట్టూ నుదట చిన్నబొట్టు అచ్చుగుద్దినట్టు - చూడ సిరులిచ్చు మా తల్లి మాలచ్చిమైనట్టు ॥ పల్లవి క్షణాల్లో కుదిరింది తనకుతానే తెలుగు ఓణి - తెలుగు బాణీ తొడుక్కొని. కట్నాలకోసం కోడళ్లను కాల్చిచంపే అత్తమామల విషపుటాలోచన పటాపంచలయేలా ఉండాలి మొదటి వాక్యం అనుకున్నాను. కొట్టివేతలు, కామాలు లేకుండా పాట పూర్తయింది. ఏ పెరడుదీ మల్లెచెట్టు - ఎవ్వారె ఈ తోడబుట్టు మీగడలు గిలకొట్టినట్టు - ఈ గడుసుదే ఇంటిగుట్టు నడకతీరు - ఇంటి నడతతీరు - ఇంక నగవు తీరు ఇదిగో నట్టింట నా పంటలచ్చియే దిగినట్టు వినయాలు నుడుగులైనట్టు - విజయాలు అడుగులైనట్టు ప్రతిభ కన్నుల దాగినట్టు - పట్టుదల ముక్కు చూపెట్టు ఆదిలక్ష్మి - మర్యాదలక్ష్మి - రావె ఇష్టలక్ష్మి నాకు అష్టలక్ష్మి భోగ భాగ్యమీలైనట్టు... పూర్తి చేశా. మరునాడు భయభయంగా దాసరి కోడెరైక్టర్ ‘రవన్న’కు రహస్యంగా వినిపిస్తే ‘భలే వాడివయ్యా నీ భయం పాడుగానూ రా’ అంటూ చేయిపట్టుకుని గురువుగారి చాంబర్లోకి తీసుకెళ్లి... గురువుగారూ మనపాట అద్భుతంగా వచ్చిందనడం, పాటనే పాడి వినిపించడం... ‘శభాష్’ అని కీరవాణి గార్ని పిలిపించడం... పాటకు బాణీ రికార్డింగ్ గంటల్లో జరిగింది. నా పాట నా జ్ఞాపకాలపేటికలోకి వెళ్లింది. -
కొసరాజుతో రోజులు మారాయి...
నా పాట నాతో మాట్లాడుతుంది... ఏ పాటైనా రాయగలిగిన - రాస్తున్న నిన్ను ‘విప్లవకవి’ అన్నట్టే- అటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ఇటు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ రాసినా నా తండ్రిని సినీజానపద కవి సార్వభౌముడనే అంటారు తేజా.. అంటూ మొదలెట్టింది కొసరాజు పాట. మహాకవిగా గుర్తింపు వచ్చాక సినీకవి అయినాడు కొసరాజు. 1931లోనే జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలై, దానికి నాయకత్వం వహిస్తున్న కొసరాజు మునిస్వామి నాయుడి ప్రోత్సాహంతో ‘కడగండ్లు’ రైతు గేయాలు రాశారు. పింగళి లాగే 1930 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి వెనక్కివెళ్ళి, మళ్ళీ 1950 దశకంలో వచ్చి విజృంభించిన కొసరాజు అస్మదీయ జనకులు. మాటల రచయిత డి.వి.నరసరాజు పట్టుదలతో, మహా దర్శకుడు కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రానికి 1952లో మూడు పాటలు రాయడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో కొసరాజు కలంబలం తెలిసింది. అయితే, ‘రోజులు మారాయి’ సినిమాలో ఏడు పాటలు రాయడంతో కొసరాజు రోజులు మారిపోయాయి’ అంది కొసరాజు పాట. 600 చిత్రాల్లో 870 పాటలు రాశారు కొసరాజు. 1986 అక్టోబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ‘గురుబ్రహ్మ’కు బుర్రకథ రాసిన రాత్రే కన్నుమూశారు. ‘మూగమనసులు’లో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మ’ పాటలో ఒక దగ్గర ‘అది పెళ్లామంటే చెల్లదులే పళ్లు పదారు రాలునులే’ అని రాశాడు. పళ్లు 32 కదా 16 అని ఎందుకు రాశాడు! ‘పళ్లు’ ‘పదారు’ యతి కోసమని కొందరు చర్చించారట. యతి కోసమో, ప్రాస కోసమో కాదు ‘పదహారు’ సంఖ్య నూతన యవ్వనాన్ని సూచించే వయస్సుకు సంబంధించింది. పదహారేళ్ల మీద ఎన్నో పాటలు వచ్చాయి. ‘పదారు పళ్లురాలునులే’ అంటే నీ పడుచు పొగరు దించేస్తా అన్నది లోతైన అర్థం. సాహిత్యాన్ని, సమాజాన్ని, జీవితాలను కాచి వడబోసిన కవిఋషి తాత్త్వికుడు కొసరాజు. పద్యాలు, చారిత్రక కావ్యాలు, ద్విపద కావ్యాలు, బుర్రకథలు, లఘు కావ్యాలు, వ్యంగ్యం, తాత్వికత కలగలసిన సినీగీతాలు, ‘రైతుజన విధేయ రాఘవయ్య’ అంటూ ఆటవెలదులను రచించిన నా తండ్రిని కేవలం ‘జానపద సినీకవి’ అంటే నాకు చిర్రెత్తిపోదూ అంది కొసరాజు పాట. నేను ఆ పాటను సేదదీర్చి, ‘తల్లీ, నీవే సినీగీతానివి’ అంటే నేను 1957లో తోడికోడళ్లు చిత్రంలోని ‘ఆడుతుపాడుతు పనిచేస్తుంటే’ పాటను అంది గారాబంగా - గర్వంగా. తోడికోడళ్లు చిత్రం సంగీతం మాస్టర్ వేణు మహానటీనటులు అక్కినేని - సావిత్రి సందర్భం నీళ్లు పొలానికి చేతులతో ఎత్తిపోయడం. దోసిళ్లతో కాదు దొన్నెతో- దాన్ని గూడేయటం అంటారు. దాని కోసం ఏయన్నార్, సావిత్రి కొంత శిక్షణ కూడా తీసుకున్నారు. అత్యంత సహజంగా తెరకెక్కించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. గూడేస్తున్న సందర్భంలో పాట కావాలి. అందరి చూపు కొసరాజుపైనే - శ్రమ సౌందర్యాన్ని లలిత శృంగారంలో రంగరించి రాయగల విలువ తెలిసిన నెలరాజు, కవితల రాజు కదా కొసరాజు. ఇంక మొదలైంది. అలవోకగా, అవలీలగా కవిరాజు చేతిలో... ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్లు రాయగూడదు నాన్నా’ అన్నాను నేను. శభాష్ అంటూ అలాగే మొదలెట్టాడు. పాడేది భార్యాభర్తలు.. భర్త సాన్నిధ్యంలో ఉంటే కైలాసాన్నైనా మోయగలిగే బలవంతురాలవుతుంది సుకుమారమైన భార్య కూడా. అలాగే భార్య పక్కనే ఉంటే ఎంత పనైనా ఎడం చేత్తో అలుపుసొలుపు లేకుండా చేయగలడు భర్త. ఇంకేముంది పల్లవి పూర్తయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది/ ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది. మనకు కొదవేమున్నది. ఇంక చరణం - ‘గూడేస్తున్న చెలి ఒంపులు ఒయ్యారం ఊగుతూ.... విసురుతూవుంటే ఆమె గాజుల శబ్ద సంగీతం అలవాటైన భర్త గుండెఝల్లుమనిపించదూ’ అలా వెళ్లూ అన్నాను క్షణంలో చరణం పూర్తి చేశాడు. ఇంక ఏదో కొత్తగా చెప్పాలి ఈ శ్రమసౌందర్యాన్ని అపురూపంగా అపూర్వంగా చెప్పాలి. ఒకసారి కుంకుమశోభతో మెరిసే సావిత్రి నుదురు నెలవంకనూహించుకో అన్నాను. వెంటనే నా తండ్రి కొసరాజుకు చెమటతో తడిసి చెదిరే కంకుమ రేఖ జారి పెదలవులపై మెరిసినట్టనిపించి ‘‘చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తువుంటే తీయని తలపులు నాలో ఏవో తికమక చేస్తువున్నవి’’ అని పూర్తి చేశాడు. ఈ చరణమే ఒక శ్రమ సౌందర్యానందలహరిలా లేదూ అంది పాట- జోహర్ తాతా! కొసరాజా అన్నాను. అలా నన్ను అందంగా తీర్చిదిద్ది ఆదుర్తి, మాస్టర్ వేణు ద్వారా మీకొదలి తాను వెళ్ళిపోయాడంటూ ‘రసవన్నగం’లా నా రస హృదయంలో ఘనీభవించింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఊగించే తూగించే పాట
నా పాట నాతో మాట్లాడుతుంది కేవలం 28 సినిమాలలో 300 పాటలు రాసి వాసికెక్కిన పదమాంత్రికుడు నా తండ్రి పింగళి. పింగళి ‘హలా’ పదంపై ఒక అపోహ ఉంది. ‘హలో’ ఆంగ్లపదాన్ని ‘హలా’గ మార్చి జగదేకవీరుని కథ సంభాషణల్లో కూర్చాడని. అది సరికాదు. శబ్దార్థ నిఘంటువులో ‘హలా’ అంటే అనుంగు చెలికత్తెను పిలిచే పిలుపు! తెలంగాణలో త్వరగా రా అనే సందర్భంలో ‘ఎల్లెం రా’ అంటారు. ఎల్లెం ఏ పదం నుండి మాండలికంగా పురుడుపోసుకుందని గవేషిస్తే ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో సుభద్ర పాడే పింగళి పాట పల్లవి ఇలా ఉంటుంది. ‘‘స్వాముల సేవకు వేళాయే/ వైళమ రారే చెలులారా’’ వైళమ అంటే వేగముగా అని అపుడనుకున్నాను. వైళం - పల్లీయుల గుండె గొంతుకలో నుండి ఎల్లెంగా పల్లవించింది. ‘దేవదాసు’లో సముద్రాల ‘కుడి ఎడమైతే’ పాటలో ‘‘లాహిరీ నడి సంద్రములోన లంగరుతో పనిలేదోయ్’’- ఇక్కడ లాహిరి అంటే హైస్కూల్ రోజుల్లో పడవ, నావ- అనుకునేవాణ్ణి. లహరి అంటే తరంగం అనీ, లాహిరి అంటే మత్తు అనీ మత్తు సంద్రంలో ఉన్న వాడికి లంగరెందుకనే అర్థం అని మా ‘అమ్మ’ చెప్పింది తర్వాత. గుణసుందరి మాట - పాటలతో గుర్తింపు పొంది ‘పాతాళభైరవి’ స్టార్ రైటర్‌గా మారి ‘మాయాబజార్’తో లెజెండ్ అయ్యాడు పింగళి. ఇంతకీ నాతో మాటాడుతున్న పాట ‘మాయాబజార్’లోని ‘లాహిరి-లాహిరి-లాహిరి’లో. సంగీతం ఘంటసాల. అభిమన్యు ఏయన్నార్, శశిరేఖ సావిత్రి. సన్నివేశం ఒకే పాటలో అర్జునుడు - శశిరేఖ, శ్రీకృష్ణుడు- రుక్మిణి, బలరాముడు - రేవతి నౌకావిహారం చేయాలి. ఇక్కడ మధువు మత్తు కాకుండ - వధువు మత్తు వలపు మత్తును లాహిరిగా మలుచుకున్నాడు పింగళి. మత్తులో ఉన్నవారు ఊగాలి - తూగాలి. కాని వలపు లాహిరిలో ఉన్నవారిని చూసి జగమునే ఊగించి తూగించారు పింగళి. ఆ జగము ఊగేది తూగేది తారాచంద్రుల విలాసాల పరవడిలో వరవడిలోనట. చంద్రుని వెన్నెలకు నీటి పరవళ్లకు సైంటిఫిక్ రీజన్ ఉంది. అదీ తెలుసు శాస్త్రీయ పింగళికి. ముల్లును ముద్దాడినా రక్తం కళ్ల చూస్తుంది. పూవును కాలితో నలిపినా సుగంధాన్ని అద్దుతుంది. కనుకనే... పూలవలపుతో పుట్టుకతో ఏ సువాసన కూడా తెలియని పిల్లవాయువుకు ఘుమఘుమ సొంతమైంది. అందుకే పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో.... అన్నాడు. సచిన్ మాంచి ‘ఊపులో’ ఉన్నాడంటాం. అలల ‘ఊపు’ తియ్యని తలపులను చెలరేగిస్తుంది. ఆ కలకలలో మిలమిలలో ప్రేమ నౌకావినోదం సాగుతుంది. ఇలాగ వెన్నెల్లో సెలయేరులో ఉత్తినౌకకు అభిమన్యు శశిరేఖల ప్రేమను అంటించి ప్రేమనౌకను చేశాడు పింగళి. తరువాతి చరణాల్లో శ్రీకృష్ణ రుక్మిణులు ఈ నౌకలో చేరుతారు. అభిమన్యు శశిరేఖలు వలపులూరుతున్న చిగురు యువప్రాయులు. శృంగార రసవత్క్రీడ ఫలరుచి తెలియని అస్కలిత ప్రణయమూర్తులు. రుక్మిణీ శ్రీకృష్ణులు- దంపతులు- రాసక్రీడారుచి రాత్రులకొద్దీ - కౌగిళ్లకొద్దీ అనుభవించిన వారు. ప్రౌఢానంద పరవశతలెరిగిన పరిణత మనస్సుకలవారు. కనుక రెండో చరణాన్ని మరింతగా ఉసిగొలుపుతూ రాశాడు పింగళి. రసమయమైన జగాన్ని రాసక్రీడకు ఈ మధురిమ ఉసిగొలిపిందట. ఏకాంతంగా ఉన్న ఆలుమగలు ఆరంభించే ప్రతి సంభాషణ కొసమెరుపు శృంగారపు అల్లరింపుకు దారితీస్తుందన్న రహస్యం ఈ ఆజన్మాంత ‘కవిబ్రహ్మ’చారికి ఎలా తెలిసిందో! ఇక్కడో విషయం చెప్పాలి. ‘మిస్సమ్మ’లో ఒక పాట ‘ఏమిటో ఈ మాయ’... అందులో పింగళి ‘వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా’ అని రాస్తే, అందరు అద్భుతం అంటే ‘చక్రపాణి’ రచయిత, నిర్మాత, పర్యవేక్షకులు ‘‘బ్రహ్మచారికి ఏముంటుందయ్య అనుభవం. అందుకే అలా రాశాడు’’ అన్నాట్ట. అల్లరి మనములు ఝల్లుమనిపించే చల్లని దేవుని అల్లరిలో... వాయుదేవుడిని ‘చల్లని దేవుడిగా’ తెలుగించిన ఈ తెల్లవారు వెలుగంత చల్లని తెలుగింటి పాట దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అశోక్ తేజా అంటూ పింగళి రచనా లాహిరీలోకి లాహిరి లాహిరి లాహిరిలో అంటూ తల్లీనమైపోయింది. మోహన్‌బాబు ‘పోస్ట్‌మెన్’ చిత్రం కోసం పింగళి స్ఫూర్తిగా లాహిరిని ముమ్మారు ప్రయోగిస్తూ ‘లాహిరి లాహిరి లాహిరి నన్ను అల్లుకుంది చెలి మాధురి’ పాట రాశారు అశోక్‌తేజ. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
వీళ్ళు నా చాన్స్ లు కొట్టేశారు!
తెలుగు సినిమాకు సంబంధించి అది ఒక అరుదైన కుటుంబం. తండ్రి - వెన్నెలకంటి (రాజేశ్వర ప్రసాద్) గీత రచయిత, అనువాద చిత్రాల మాటల రచయిత. పిల్లలిద్దరూ అక్షరాలా ఆయనకు వారసులయ్యారు. పెద్ద కొడుకు శశాంక్ వెన్నెలకంటి డబ్బింగ్ చిత్రాల మాటల రచయితగా పదేళ్ళలో ఉన్నతశిఖరాలను అధిరో హించారు. చిన్న కొడుకు రాకేందు మౌళి నేరు చిత్రాలకూ గీత రచయిత, గాయకుడుగా పేరు తెచ్చుకుం టున్నారు. రానున్న ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే...’ చిత్రం ఈ ముగ్గురితో ఒక అరుదైన విన్యాసానికి సాక్ష్యమైంది. ఎస్పీబీ కుమారుడు ఎస్పీ చరణ్ తెలుగు, తమిళభాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కు వెన్నెలకంటి పాట, శశాంక్ మాట, హీరోగా రాకేందు ఆట- తెరపై అలరించనున్నాయి. బహుశా ఒక కుటుంబం నుంచి ఏకకాలంలో ముగ్గురు రచయితలు బిజీగా రచన చేస్తుండడం, ఒకే సినిమాకు ముగ్గురూ కలసి పనిచేయడం తెలుగులో అపూర్వ విషయమే. ఈ అరుదైన విన్యాసానికి కారకులైన ముగ్గురినీ ఒకచోట చేర్చి, జరిపిన ప్రత్యేక సంభాషణ... ‘ఫ్యామిలీ’ పాఠకులకు ట్రిపుల్ ధమాకా... కుటుంబం మొత్తం సినీ రచయితలైపోయారు. ఎలా ఉంది? వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఇప్పుడు కాదు... మా నాన్న గారి నుంచే మాది సినిమా కుటుంబం. ఏయన్నార్‌ను ‘శ్రీసీతారామ జననము’ (1944) చిత్రంతో హీరోగా పరిచయం చేసిన దర్శక - నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు, మా నాన్న గారు కోటేశ్వరరావు ఆబాల్యమిత్రులు. సినిమా ప్రొడక్షన్ విభాగంలో ఉన్న బలరామయ్య గారు దర్శక - నిర్మాతగా ఎదిగి, సంస్థకు ఏం పేరు పెడదామని మా నాన్న గారిని అడిగితే, ‘ఇదంతా నీ ప్రతిభే కదా! కాబట్టి ‘ప్రతిభా’ ఫిలిమ్స్ అని పేరు పెడదాం’ అని అన్నారట. ఆ సంస్థలో నిర్మించిన చిత్రాల్లో టైటిల్ కార్డుల్లో కూడా దర్శక - నిర్మాత బలరామయ్యగారి పేరుకు ముందుగా, చీఫ్ టెక్నీషియన్ల కన్నా పెద్ద పీట వేస్తూ ‘ప్రొడక్షన్ చీఫ్ - వి. కోటేశ్వర రావు’ అని మా నాన్న గారి పేరు పడేది. ఎప్పటికైనా నా పేరు కూడా అలా వెండితెర మీద చూసుకోవాలనే కోరిక చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. బి.కామ్ చదివి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ, సినిమా రచయితగా ఈ రంగానికి వచ్చాను. వెన్నెలకంటి అనే మా ఇంటిపేరుతో పాపులర్ అయ్యాను. గీత రచయితగా తొలి అవకాశం దర్శక - నిర్మాత, నటుడు ప్రభాకరరెడ్డి గారు ఇస్తే, నన్ను ప్రోత్సహించి ఇంతవాణ్ణి చేసింది - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. బాలు గారికి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి గారెంత చేశారో, బాలు గారు నాకు అంతకన్నా ఎక్కువ చేశారు. ఆయన లేకపోతే నేను లేను. శశాంక్ వెన్నెలకంటి: డబ్బింగ్, నేరు సినిమాల రచయితగా పదేళ్ళ క్రితం మొదలైన నా ప్రస్థానం వెనుక చాలామంది ప్రోత్సాహం ఉంది. నేను మొదలైంది అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా! ఏడో తరగతి చదువుతున్న రోజుల నుంచి స్కూల్లో నాటకాలు వేస్తూ, బహుమతులు సంపాదించా. హాలీవుడ్ చిత్రం ‘జురాసిక్ పార్క్’ను తెలుగులోకి అనువదించే అవకాశం నాన్న గారికి వచ్చినప్పుడు, మా నాన్న గారి అసిస్టెంట్ రచయిత మల్లూరి వెంకట్ ఆ సినిమాలోని ఒక చిన్న పిల్లాడి పాత్రకు నాతో డబ్బింగ్ చెప్పించారు. అప్పటి నుంచి నన్ను ఈ రంగంలో బాగా సాది, తీర్చిదిద్దింది - ఘంటసాల గారబ్బాయి రత్నకుమార్. ఆయనే నా గురువు. సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తారాకృష్ణ నాకు ఎంతో నేర్పించారు. బాలనటీనటులతో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రామాయణం’లో రావణ పాత్రధారిణికి నేను చెప్పిన డబ్బింగ్ బాగా గుర్తింపు తెచ్చింది. మా నాన్న గారితో పాటు వసంతకుమార్, శ్రీరామకృష్ణ, రాజశేఖర రెడ్డి గార్ల లాంటి ప్రసిద్ధ డబ్బింగ్ రచయితలందరి దగ్గరా పని చేశాను. వారి ప్రోత్సాహం, ప్రేరణ నాకెంతో ఉపకరించాయి. రోహిత్, సచిన్ లాంటి హీరోలకూ డబ్బింగ్ చెప్పా. తమిళ హీరో శింబుకు ‘కుర్రాడొచ్చాడు’ చిత్రానికి డబ్బింగ్ చెప్పాక ఆ తరువాత ‘మన్మథ’తెలుగు అనువాదానికి వచ్చినప్పుడు నిర్మాత - బాలూ గారి బంధువైన శివలెంక కృష్ణప్రసాద్, తాడేపల్లిగూడెం కె. విజయ భాస్కరరెడ్డిల ప్రోత్సాహంతో అనుకోకుండా ఆ సినిమాకు రచయితనయ్యా. వాళ్ళు రాయమని అడగగానే, రాస్తానన్నా. ఆ ‘మన్మథ’ చిత్రం, ఆ వెంటనే రాసిన ‘గజని’, ‘పందెంకోడి’ చిత్రాలు హిట్టయ్యేసరికి ఇక అనువాద రచయితగా స్థిరపడ్డా. అప్పటి నుంచి ఈ పదేళ్ళలో దాదాపు 200 సినిమాలకు రచన చేశా. తమ్ముడు కూడా సినీ గీత రచన, గానంతో మొదలుపెట్టి ఇప్పుడు హీరో అయ్యాడు. వారసుల్ని తేవడంలో మీ నాన్న గారి ప్రమేయం? వెన్నెలకంటి: (అందుకుంటూ...) నా ప్రమేయం ఏమీ లేదు. వాళ్ళకు సినిమా పట్ల ఆసక్తి ఉంది. అన్నద మ్ములిద్దరూ ఒకరికొకరు సలహాలిచ్చుకుంటారు. రాకేందుకు హీరో అవకాశమిస్తూ ఎస్పీ చరణ్ వాళ్ళు అడిగినప్పుడు కూడా వాడు, వాళ్ళ అన్నయ్య సలహా అడిగి, ఆ తరువాత వాళ్ళ అమ్మ ప్రమీలకు చెప్పి, ఆఖరుగా నాకు తెలియజేశాడు (నవ్వులు). పెద్దవాడేమో విజువల్ కమ్యూనికేషన్ చదివి, సినీ రచన వైపు వచ్చాడు. చిన్నవాడేమో లక్షల ఖర్చుపెట్టి, నేను ఇంజనీరింగ్ చదివిస్తే, పాటల రచన, నటన వైపు వచ్చాడు. వాళ్ళ ఆసక్తిని నేనెప్పుడూ నిరుత్సాహ పరచలేదు. నమ్మి, వదిలిపెట్టాను. అదే సమయంలో వాళ్ళ రచన, నటన విషయంలోనూ నేనేమీ జోక్యం చేసుకోను. కాకపోతే, వాళ్ళు చేసింది, రాసింది చూపించినప్పుడు ‘బాగుంది, బాగా లేదు’ అనే జడ్జిమెంట్ మాత్రం చెబుతుంటా. గీత రచయితగా, గాయకుడిగా పేరొస్తున్న రాకేందుకు నటించాలన్న కోరిక ఎలా వచ్చింది? రాకేందు మౌళి: మా నాన్న గారు లక్షల ఖర్చుపెట్టి ఇంజనీరింగ్ చదివించారన్న మాటే కానీ, చిన్నప్పటి నుంచి నా దృష్టి అంతా సినిమా మీదే! వెన్నెలకంటి: మా ఆవిడకు సంగీతం, నృత్యం బాగా ఇష్టం. అందుకే, వీణ్ణి ఎలాగైనా సింగర్‌నీ, డ్యాన్సర్నీ చేయాలని, అవి నేర్పించింది. కర్ణాటక సంగీతం వీడికి ఎంత బాగా వచ్చంటే... నెల్లూరులో ఇప్పటికి 50 ఏళ్ళుగా భిక్షాపూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలు జరుగుతున్నాయి. ఎస్పీబీ నాన్న గారైన సాంబమూర్తి గారు ప్రారంభించిన ఆ ఉత్సవాల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి తప్ప మహామహులంతా పాడినవారే. ప్రతిష్ఠాత్మకమైన ఆ ఉత్సవాలలో మా వాడు కచ్చేరీలిచ్చాడు. అందుకేనా రాకేందు గాయకుడిగా మొదలుపెట్టారు? రాకేందు: (నవ్వేస్తూ...) ముందు పాటలు రాశా. ‘ఆవారా’ సినిమా పాటల సీడీ కూడా విడుదలయ్యాక, సినిమా చివరలో ఒక పాట వస్తుందని చెప్పారు. ఒక్క రోజులో మిక్సింగ్‌కు వెళ్ళిపోవాలి. అన్నయ్య, నాన్న బిజీగా ఉన్నారు. దాంతో ఆ పాట నేనే రాశా. అలాగే, ‘షాపింగ్ మాల్’లో, ఇంకా కొన్ని చిత్రాల్లో రాశా. నేరు తెలుగు చిత్రం ‘అందాల రాక్షసి’కి ఆ చిత్ర దర్శకుడు నాతో పాట రాయించి, పాడించారు. అలాగే, ‘సాహెబా - సుబ్రహ్మణ్యం’ సినిమాలో పాటలన్నీ నేను రాసినవే. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో కూడా రెండు పాటలు రాశా. మొత్తం 70 దాకా పాటలు రాశా. కొన్ని పాటలు పాడా. ‘అందాల రాక్షసి’లో నేను రాసిన ‘ఏమిటో...’ పాట ఏకగ్రీవంగా హిట్టయింది. ఇక, నేనే రాసి, పాడిన ‘మనసు పలికే’ పాట ‘రేడియో మిర్చి’ అవార్డుల్లో ఉత్తమ వర్ధమాన గాయకుడిగా, రచయితగా అవార్డు తెచ్చింది. శశాంక్: నేనూ ‘రైడ్’, ‘శంభో శివశంభో’ లాంటి నేరు చిత్రాలకు మాటలు, కొన్ని సినిమాల్లో పాటలూ రాశా. ఒకే ఇంట్లో ముగ్గురు రచయితలు... మీ మధ్య మీకే పోటీ! వెన్నెలకంటి: వీళ్ళిద్దరూ రచయితలై, నా అవకాశాలు కొట్టేశారు. (నవ్వులు...) తమాషాలు పక్కనపెడితే, సినీ రచయితలైన సీనియర్ సముద్రాల గారు, వారి అబ్బాయి సముద్రాల జూనియర్ లాంటి మహామహులకు దక్కిన అదృష్టం నాకూ, మా కుటుంబానికీ దక్కడం ఆనందం. రాకేందు: అయినా, మాలో ఎవరి రచనా విధానం, శైలి వారిదే! పాటలోని ఆ టెక్చర్లోనే తేడా కనిపిస్తుంది. ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ అవకాశం ఎలా వచ్చింది? రాకేందు: అదో చిత్రమైన కథ. గతంలో ఎస్పీ చరణ్ తమిళంలో నిర్మించిన ‘అరణ్యకాండమ్’ తెలుగు అనువాదం జరుగుతున్నప్పుడు అన్నయ్య శశాంక్ బిజీగా ఉన్నాడు. దాంతో, కొంత నేను రాశా. ఆ పరిచయంతో చరణ్ ‘మూడు ముక్కల్లో...’కి నన్ను రచయితగా ఎంచుకున్నారు. గతంలో నేను నటించిన షార్ట్ ఫిల్మ్ చూసి, నన్నే హీరో పాత్ర చేయమని అడిగారు. కోదండ పాణి గారి మనుమరాలి ళ్ళిలో అడిగారు. శశాంక్: (మధ్యలో అందుకుంటూ...) రాకేందు నాకు ఫోన్ చేసి అడిగాడు. ఒప్పుకోమని చెప్పా. ‘నటన, రచన - రెండూ చేయడం కష్టం కాదా’ అని వాళ్ళడిగితే ‘అన్నయ్య రచన చేస్తాడ’ని చెప్పమన్నా. రచయితనుకున్న రాకేందు హీరో అయ్యాడు. రాకేందు: నిజం చెప్పాలంటే, సినీ రూపకల్పనలో ప్రతిపనీ నాకు ఇష్టమే. ఏ పని అయినా ఇష్టంగా చేసేస్తా. ‘మూడుముక్కల్లో...’ కూడా ఒక పక్కన నటిస్తూనే, నా షాట్ అయిపోగానే దర్శకత్వ విభాగంలో సహాయపడేవాణ్ణి. ఆడుతూ, పాడుతూ సినిమా చేసేశాం. దీని కన్నా ముందు సముద్రకణి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తయారైన ‘జెండా పై కపిరాజు’కి దర్శకత్వ శాఖలో పనిచేశా. ఒకేసారి నటన, రచన, దర్శకత్వం చేయడం? వెన్నెలకంటి: కష్టం. కానీ, ఇష్టం ఎక్కువున్నప్పుడు కష్టమనిపించదు. సమతూకం చేసుకోగలిగితే సాధ్యమే. శశాంక్: ఎస్పీబీ గారి ద్వారానే నాన్న నిలదొక్కుకు న్నారు. నేనూ సీరియల్స్‌లో ఎస్పీ చరణ్‌కు డబ్బింగ్ చెప్పి, పేరు తెచ్చుకున్నా. తమ్ముడికి కూడా ఎస్పీబీ కుటుంబపు సినిమాలో హీరో చాన్స రావడం విశేషం. రాకేందు: సెంటిమెంటల్‌గా మాకు అది అచ్చొచ్చింది. ఇంతకీ ‘మూడు ముక్కల్లో...’ విశేషాలేంటి? వెన్నెలకంటి: ఏకకాలంలో తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటిలో దర్శకురాలు మధుమిత తీసిన సినిమా ఇది. ‘మిథునం’ తరువాత లక్ష్మి, ఎస్పీబీ కలసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి నేను ఒక పాట రాశా. శశాంక్ మాటలు రాశాడు. రాకేందు నటించాడు. అంటే, ఇది మీ కుటుంబ చిత్రమన్నమాట... వెన్నెలకంటి: (నవ్వేస్తూ...) ఎస్పీబీ ఈ సినిమాలో నటిస్తూ, పాడారు. నిర్మాత ఎస్పీ చరణ్ కూడా ఒక చిన్న వేషం వేశారు. వెంకీ పోషించిన పాత్రకు ఎవరి గొంతూ సరిపోక, తెలుగులో తానే డబ్బింగ్ చెప్పారు. ఇక, ఎస్పీ చరణ్ చేసిన చిన్న వేషానికేమోశశాంకే డబ్బింగ్ చెప్పాడు. అలా ఇది మా ఒక్క కుటుంబమే కాదు, మాది, ఎస్పీబీదీ రెండు కుటుంబాల కథా చిత్రం. ఒకరి గురించి మరొకర్ని మూడు ముక్కల్లో చెప్పమంటే? వెన్నెలకంటి: (శశాంక్ గురించి) పేరునిలబెట్టే వారసుడు! శశాంక్: (తమ్ముడు రాకేందు గురించి...) ఆట, పాట, మాట - మూడింటికీ ఒక కొత్త అడ్రస్. రాకేందు: (తండ్రి వెన్నెలకంటి గురించి...) మంచితనం, మానవత్వం పుష్కలంగా ఉన్న మనసున్న మనిషి. ఫొటోలు: శివ మల్లాల రెంటాల జయదేవ శశాంక్: ‘కష్టపడి పనిచేస్తే సాధించ లేం. ఇష్టపడి చేస్తే సాధించగలం’ అని ‘గజని’లో రాసిన డైలాగే నాకు ఆదర్శం. డబ్బింగ్ రచన చేస్తున్న ప్పుడు కూడా నవతరం ప్రేక్షకులకు తగ్గట్లు ఆ రంగంలో ఏ మార్పు తీసుకురాగలనని ప్రయత్నించా. సక్సెస్ అయ్యా. డబ్బింగ్ చెప్పడం, నటించడం, మాటలు రాయడం, పాటలు రాయడం - ఇలా అన్నీ చేసినా, దర్శకత్వంపై మక్కువ. మంచి స్క్రిప్టుతో, కొత్త నటులతో, కత్తి మీద సామైన దర్శకత్వంలో పేరు తెచ్చుకోవాలని నా కోరిక. వెన్నెలకంటి: అప్పటి సముద్రాల నుంచి ఇవాళ్టి శ్రీమణి దాకా ఎవరు ఏ మంచి పాట రాసినా అది నాకు అభిమాన పాటే. ఆ రచయితకు నేను అభిమానినే. కాకపోతే ఆత్రేయ, వేటూరి గార్లకు పరమభక్తుణ్ణి. నా పాటలైనా చరణాలు కొంత గుర్తుం డవేమో కానీ, పాత పాటలన్నీ నాకు కంఠోపాఠం. పైగా, ఇతరులు రాసిన మంచి పాటలు గుర్తుంటే అలాంటివి రాయాలన్న స్పర్థతో బాగా రాస్తాం. 50 వేల పాటలు పాడినా, ఇప్పటికీ ప్రతిపాటా తొలి పాటలా శ్రద్ధగా పాడే ఎస్పీబీ మార్గం నాకు ఆదర్శం. రాకేందు: లక్షలు ఖర్చుపెట్టి మా నాన్న గారు ఇంజనీరింగ్ చదివించారు. కానీ, నా మనసంతా సినిమానే. అందుకే, ఇటొచ్చా. ఒకవేళ ఇంజనీర్నై ఉంటే, మధ్యరకం ఇంజనీర్‌గా మిగిలే వాణ్ణి. కానీ, ఇష్టపడి సినిమాల్లోకి రావడంతో పరిస్థితి వేరుగా ఉంది. ఫలానావాళ్ళ అబ్బాయినని చెప్పుకొనే కన్నా, కష్టపడి నా కాళ్ళ మీద నేను నిలబడాలనేది నా తపన. రచయితగా మా నాన్నగారు తొలి గురువు. సింగర్‌గా బాలూ గారి ఏకలవ్య శిష్యుణ్ణి. నటనలో చిరంజీవి, రజనీ కాంత్ గార్ల ఫ్యాన్‌ని. కమల హాసన్ గారిలా ఆల్రౌండర్నవ్వాలని కోరిక. -
చెవి కడుపునింపే పాట
ఈవారం సముద్రాల పాట నాతో మాట్లాడుతుంది. సినీసాహితీ జగత్తులో సముద్రమంత ముద్ర సముద్రాలది. ‘సాక్షి’ కోసం సముద్రాల గురించి ఆలోచిస్తుంటే నా గురించి చెప్పవూ అంది, విప్రనారాయణ చిత్రంలోని ‘ఎందుకోయి తోటమాలి’ పాట. ఇంకా ఏమందంటే- ‘‘నా వల్ల ఒక మహా సంగీత దర్శకునికి నామకరణం జరిగింది తెలుసా? సముద్రాల నన్ను మీ రసమయలోకంలోకి తీసుకొచ్చిన తర్వాత - ఒక బహుముఖీన ప్రజ్ఞావంతుడొచ్చి(శివశక్తిదత్తా)... స్వర ‘రసమ్రాట్’ రాజేశ్వర్‌రావును ఈ ‘ఎందుకోయి తోటమాలి’ని ఏ రాగంలో కట్టారు మాస్టారు మహత్తరంగ లోకోత్తరంగా ఉంది అంటే... ఏటవాలుగా నవ్వుతూ ‘కీరవాణి’ రాగం అన్నాడు. అంతే ఆ ప్రజ్ఞావంతుని పుత్రుని పేరు ‘కీరవాణి’ అయింది. విప్రనారాయణ సినీరచన - సముద్రాల. దేవదేవి (భానుమతి) విప్రనారాయణ(ఏఎన్ఆర్) బ్రహ్మచారివ్రతాన్ని తపోభంగం చేయాలని తోటకు నీళ్లు చేదిపోస్తున్న తరుణంలో పారదర్శకమైన ధవళచేలాంచలాలతో పలుచని తెల్లని చీరకట్టి విరహస్త్రీమూర్తిమత్వం సాక్షాత్కరించేస్తూ పాట పాడాలి.అక్కడ సముద్రాల అర్ధనిమీలిత నేత్రాలతో నాకోసం అన్వేషిస్తుండగా ఏవేవో పదగుచ్చాలు ఏవేవో భావలావికలు తన ముందు దోబూచులాడుతుండగా ‘‘ఎందుకోయి సముద్రాల అంతులేని యాతన నన్ను చూడు పనికొస్తానేమో’’ అన్నాను. ఇంకేం నిమిషంలో వెయ్యోవంతు కాలంలో నా ‘నడుంపట్టి’ తన శ్వేతపత్రాంకంపైన కూచుండబెట్టి అద్భుత శబ్దాల, భావాల ఆభరణాలు నాకు అలంకరిస్తూ పోయారు. అహర్నిశలూ భగవన్నామస్మరణంలో ఉన్న నటనలో అక్కినేని కళ్లు ఒక అలౌకికదివ్యానందంతో తేలిపోతుంటాయి. అతన్ని తన లౌకిక శరీరసోయగానందంలోకి రప్పించాలి. (‘ఇటు నుంచి గాకుంటే అటునుంచి నరుక్కురా’ గురజాడ అన్నట్టు). నిన్ను నిరంతరం ఏలుతున్నవాని సృష్టిలీలా విలాసమే నేను కూడా! ‘కన్నులారా కనరా’ అనే పదాలను కన్నార - కనరా అనడంలో తనివితీర చూసుకో ఈ తనుసౌందర్య ప్రకాశం చందమామ చిన్నబోయెంత గొప్పగా ఉంది. ఇది ఏ మరో సృష్టికర్త చేతిపనితనం కాదు. నువ్వు భజిస్తున్న శ్రీమన్నారాయణుడిదే సుమా - నాది కూడా. అలా తన వేపు- తన తనువు వేపు మళ్లిస్తుంది. ఇక్కడ ‘ఎఎన్ఆర్’ తన కళ్లతో మెల్లగా ఆమె తనువుపై దాహార్తికి అంకురార్పణ జరిగినట్టు అద్భుత నటనా విశ్వరూపం చూపిస్తారు. ‘వన్నె - వన్నెచిన్నెలీనూ ఈ విలాసం’లో కూర్చిన బాణి ఆ వాక్యాన్ని నడిపించిన తీరు స్త్రీ శరీర ఎత్తొంపులను సూచించేలా ఒలికించింది సముద్రాల, పలికించింది రాజేశ్వర్‌రావు. రెండో చరణంలో.. ఈ పూజా పునస్కారాలవల్ల ఎపుడో రాబోయే స్వర్గలోకంలో లభించబోయే విందులపైన ఆశ ఎందుకు. పక్కనున్న నీ ‘పొందు’ను ఆశించే చిన్నదాన్ని చూడవేం అనే భావాన్ని ‘పొందుగోరు చిన్నదాని పొందవేలా’ అన్న అందమైన పదపొందిక రసాన్నం వడ్డించిన విస్తరిలా పరిచి అటు విప్రనారాయణున్ని ఇటు సినీమా వీక్షించే ప్రేక్షకనారాయణుల్ని కూడా ఊరింపచేస్తుంది. సన్యాసిని ‘‘అందాల రాయా’’ అని సంబోధించడంతో పాటలోని లక్ష్యాన్ని క్లైమాక్స్‌కు తీసుకొస్తారు సముద్రాల. అందాల రాయా - అందరారా/ ఆనందమిదియే అందుకోరా బిందుపూర్వక దకారాలలో చెవి కడుపునింపే విందు ఉందని అందాల తెలుగు పదసముద్రునికి తెలుసు కనుకే సన్నివేశాన్ని పరాకాష్టకి చేర్చాడు.కేవలం పదకొండు వాక్యాలతో నటీనటులను దర్శక, సంగీతదర్శకులను, ప్రేక్షకశ్రోతలను 1954లో కట్టి పడేస్తే ఇదిగో ఇప్పుడు 2015లో కూడా లేవలేకపోతున్నారు. మీ రసైక హృదయులు అశోక్‌తేజ అంటూ సముద్రాల గారి పాట రాగాల గాలిలో విలీనమైంది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
నా పాట నాతో మాట్లాడుతుంది
అవును.... పాట కాగితంపైకి రాబోయే ముందు, రాస్తున్నప్పుడు, రాసిన తర్వాత నాతో మాట్లాడుతుంది. పూర్వం ధన్వంతరి దగ్గరకు ఎవరైనా వ్యాధిగ్రస్తులు రాగానే వారి శారీరక, మానసిక పరిస్థితి తెలుసుకుని, తన ఔషధమూలికల వనములోకి వెళ్లి నిశితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూసేవాడట. ఆ వ్యాధి తగ్గించగల ఔషధమూలిక తన కొమ్మలనో, రెమ్మలనో ఊపి, ‘ధన్వంతరీ నేను పనికొస్తానా చూడు’ అనేదట. అలా నా సన్నివేశానికి తగిన పల్లవినిస్తూ పాట నాతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మైకేలేంజిలోతో శిల మాట్లాడినట్టు, కృష్ణశాస్త్రితో ప్రకృతి మాట్లాడినట్టు, రవివర్మతో కుంచె మాట్లాడినట్టు, అమరశిల్పి జక్కన్నతో ఉలి మాట్లాడినట్టు, సచిన్ టెండూల్కర్‌తో బ్యాట్ మాట్లాడినట్టు... పాట తన కవితో మాట్లాడుతుంది. నాతో మాత్రమే కాదు ఏ పాటల రచయితతోనైనా పాట మాట్లాడుతుంది. సంకల్పాన్ని పరమ ప్రాణంగా భావించుకునే ప్రతి వ్యక్తి ఆత్మకణం బ్రహ్మకణంతో ట్యూన్ అవుతూనే ఉంటుంది. అలాగే కవికి పాటకి ఒక తపస్సంబంధం ఉంటుంది. కనుకనే పాట నాతో మాట్లాడుతుంది అంటున్నాను. డా॥సుద్దాల అశోక్‌తేజ,పాటల రచయిత ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోని ‘నీలిరంగు చీరలోన...’ : పాట పాటమాలి నానక్‌రాంగూడలో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. కృష్ణవంశీ కబురు పంపాడు. వెళ్లాక ఆయన అన్నమాట: ‘మీరు రాయబోయే పాట ఈ సినిమాకి గుండెకాయలాంటిది’. ‘ప్రతి పాట గురించి డెరైక్టరు ఇలాగే అంటారు...’ అని నవ్వాను నేను. ‘ఈ పాటలో జీవితం ఉండాలి, పండుగలుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి... అలాగని సుత్తిపాట కాకుండా అట్రాక్ట్ చేసేవిధంగా మొదలెట్టాలి’ అన్నాడు. నాలుగురోజుల తర్వాత ఒక పాట తీసుకెళ్లాను. కృష్ణవంశీకి నచ్చలేదు. ఆ పాటలో ‘నీలిరంగు చీర’ అన్న పదమొక్కటే నచ్చిందన్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ‘నీలిరంగు చీర...’ అనేది కేంద్ర బిందువు. పాట పాడేది ప్రకాశ్‌రాజ్, జయసుధ. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాని పాడడు. ఇక్కడ జీవితం గురించి చెప్పాలి... అదే సమయంలో అట్రాక్షన్‌గా ఉండాలన్నది నాకు బాగా నచ్చింది. జీవితం గురించి అట్రాక్షన్‌గా చెప్పలేం. ‘ఒకటే జననం... ఒకటే మరణం...’ అన్నట్టు వెళ్లిపోతుంది. సీరియస్‌నెస్ ఉన్నదగ్గర ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? మలేరియా బిళ్లను షుగర్ కోటింగ్‌తో ఇవ్వాలి. ‘నీలిరంగు చీర...’ అమ్మాయి కట్టుకునే వస్త్రం. ఆ సమయంలోనే నా మనసు పలికిన విషయం... ‘ఒరేయ్ అశోక్‌తేజా, జీవితానికి మించిన హొయలొలికించే జాణ ఇంకోటేదైనా ఉంటుందా!’ అని. ఇలాంటి సందర్భాన్నే నా పాట నాతో మాట్లాడుతుందని అన్నాను. జీవితాన్ని మించిన నెరజాణ లేదు. ఎప్పుడు ఏడిపిస్తుందో, నవ్విస్తుందో... ఎప్పుడు శిఖరానికి తీసుకెళుతుందో... పాతాళానికి పడేస్తుందో... పాపం అమ్మాయిల్ని నెరజాణలంటారుగానీ, అమ్మాయికంటే లక్ష రెట్లు ఎక్కువ నెరజాణ జీవితమే. ఇలా ఆలోచిస్తుండగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఏంటంటే... ‘అమ్మాయి గురించి చెబుతూ చెబుతూ వెళ్లి... అమ్మాయి కాదురా అమాయకుడా... జీవితంరా ఇది’ అని చెబితే ఎలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాను. ‘‘నీలిరంగు చీరలోన/ చందమామ నీవె భామా ఎట్ట నిన్ను అందుకోనే/ ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా/ నిన్ను ఎట్ట అదుముకోనే’’ మామూలుగా స్త్రీకి ఏడు రంగులుండవు. కానీ స్త్రీలో కేవలం శృంగారమే ఉండదు. అమ్మ ఉంది. తోబుట్టువుంది. స్నేహితురాలుంది. చిన్నారి వేలు పట్టుకుని నడిచే కూతురుంది. అందుకే ఏడు రంగులున్న నడుము అన్నాను. స్థిరంగా ఉన్నదాన్ని కౌగిలించుకుంటాం గానీ తిరుగుతున్నదాన్ని ఎలా కౌగిలించుకుంటాం. జీవితం కూడా ఒకే దగ్గర ఉండదు. ‘‘ముద్దులిచ్చి మురిపిస్తావే/ కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే’’ పదేళ్లకిందటి నా జీవితం ఎక్కడుంది! ఎప్పుడో నా చేజారిపోయింది. ‘‘మెరుపల్లె మెరిసే జాణ/ వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన/ పడనోడు ఎవడే జాణ’’ ‘‘జాణ అంటే జీవితం.. జీవితం నెరజాణరా దానితో సైయ్యాడరా ఎదురీదరా/ ఏటికీ ఎదురీదరా’’ ఈ పల్లవి చూపించగానే కృష్ణవంశీ బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ‘అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చావు అశోక్.. ఇక చరణాల్లో ఏం చేస్తావో నీ ఇష్టం’ అన్నాడు. మరొక వారం రోజుల్లో చరణాలు రాసుకుని వెళ్లాను. చరణాలు నచ్చాయి. కానీ మద్రాసులో మ్యూజిక్ డెరైక్టర్‌కి ఇచ్చాక... ఆయననుకున్న ట్యూన్లకి, నేను రాసిన చరణాలు పొంతన కుదర్లేదు. మ్యూజిక్ డెరైక్టర్ యువన్‌శంకర్‌రాజా. ‘చరణాలకు నేను ముందు ట్యూన్ ఇస్తాను. దానికి తగ్గట్టు మార్చ’మన్నాడు. నేనూ, కృష్ణవంశీ మద్రాసులో హోటల్ రూం తీసుకుని వారంరోజులుండి ఆ పనికానిచ్చాం. కృష్ణవంశీ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. మొదటి చరణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమన్నాడు. ఈ పాటకు సంబంధించి నా లక్ష్యమొక్కటే, అటు సి.నారాయణరెడ్డిగారికీ కనెక్ట్ అవ్వాలి, ఇటు సామాన్యుడికీ అర్థంకావాలి. చరణం: 1 ‘‘రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని’’ ‘‘పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయ్యె భామవంటిదే కష్టమనుకో’’ ‘‘ఏదీ కడదాకా రాదని/ తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకోని ’’ మనిషికి తనను మించిన అతిథి, ఆత్మీయుడు మరొకరు లేరు. ‘‘జాణకాని జాణరా - జీవితం నెరజాణరా జీవితం ఒక వింతరా - ఆడుకుంటే పూబంతిరా’’ బంతి మనల్ని ఆడుకుంటదా, మనం బంతితో ఆడు కుంటామా అనేది మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చరణం: 2 ‘‘సాహసాల పొలమే దున్నీ/ పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా’’ ‘‘బతుకు పోరు బరిలో నిలిచీ/ నీకు నువ్వే ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా’’ నీకు నువ్వే ఆయుధమవ్వాలనడంలో రెండు అర్థాలున్నాయి. ఒకటి ప్రపంచంతో పోరాడి గెలవాలి. నీలో ఉన్న బలహీనతలతోనూ పోరాడి గెలవాలి. ఇందులో ప్రతి మాట యూత్‌కి కౌన్సెలింగ్లా ఉపయోగపడాలి. అందుకే రామ్‌చరణ్‌తేజ స్టేజ్‌పై ‘ఇంతవరకూ చాలా సినిమాలు చేశాను అంకుల్. కానీ నాకు ఇంత మంచి పాట ఇచ్చింది మీరే’ అన్నాడు. ‘‘నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి’’ దీపావళి నిప్పుతో ఆడుకునే పండగ. ప్రమాదంతో ఆడుకోవడం. మనిషి జీవితంలో విధి ఎప్పుడూ నిప్పులు జల్లుతానే ఉంటుంది. ‘‘చెయ్ రా ప్రతి ఘడియ పండుగే/ చెయ్ర...చెయ్ర...చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా’’ రంగులరాట్నంలో ఒకడు గుర్రంమీద ఎక్కుతాడు, ఒకడు గాడిద మీద ఎక్కుతాడు. ఎవరు ఏ వాహనం ఎక్కినా అందరినీ ఒకేవిధంగా తిప్పుతుంది. ఒకే గమ్యానికి చేర్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రారంభం ఒక్కటే, ప్రస్థానం ఒక్కటే. జీవితం ఒక ఉత్సవంలాంటిది. జాతర చేయడానికే వచ్చాం. అందుకే జాతర చేయడానికే ఈ జన్మరా... అని ముగించాను. రిపోర్టింగ్: భువనేశ్వరి -
మనకు తెలిసిన మధుర గీతం... నడిపించు నా నావ
నడిపించు నా నావ.. నడిసంద్రమున దేవా... అన్న పాట తెలుగు క్రైస్తవలోకాన్ని మనోహరమైన ఆత్మీయతానుభవాల అత్యున్నతమైన అంచుల్లోకి తీసుకెళ్లిన భక్తి గీతం. ఈ పాట పాడని క్రైస్తవుడు లేడు, మోగని చర్చి లేదు, మారు మోగని క్రైస్తవ సభలు లేవు. మహాద్భుత క్రైస్తవ వక్తగా, రచయితగా, కవిగా ప్రసిద్ధి చెందిన రెవ. డా. ఎ.బి. మాసిలామణి రాసిన ఆణిముత్యంలాటి భక్తి గీతమది. లక్షలాది హృదయాలను స్పృశించిన మధురగీతం అది. జీవితంలో వైఫల్యానికి, విజయానికి మధ్యగల అగాథంలో యేసుక్రీస్తు నిండితే, అదెంత ఫలభరితమో తెలుపుతూ పరోక్షంగా అపోస్తలుడైన పేతురు జీవితానుభవాల పందిరికి అల్లిన గీతం అది. ఎంతో సరళమైన భాషతో అత్యంత ప్రగాఢమైన భావాలను శ్రోతల హృదయాల్లో గుమ్మరించడం మాసిలామణికి వెన్నతో పెట్టిన విద్య. నడిపించు నా నావ పాటలో ప్రభుమార్గము విడిచితిని- ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదిలితిని- పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై- ఇప్పుడు పాటింతు నీ మాట అన్న చరణం మాసిలామణి నిజాయితీకి, నిష్కల్మషత్వానికి, నిర్భయత్వానికి నిదర్శనం. దేవుడు నిర్దేశించిన స్థాయిని అందుకోలేక పడిపోవడం, మళ్లీ లేవడం అందరి అనుభవమే అయినా ప్రతి ఒక్కరూ తాము అందుకు మినహాయింపు అన్న పద్ధతిలో డబ్బా వాయించుకుంటున్న పరిస్థితుల్లో, తాను మాత్రం అందరిలాంటి వాడనేనని ఒప్పుకున్న మహనీయుడు మాసిలామణి. ప్రపంచస్థాయి వక్తగా అత్యున్నతమైన స్థితిలో ఉన్న తరుణంలో 1972లో నడిపించు నా నావ అనే ఈ పాట రాయడం, అందులో ఈ చరణాన్ని చేర్చడం మాసిలామణి సాహసానికి తార్కాణం. ఎలాంటి వ్యక్తినైనా తడిమి లేపి ప్రభువు పాదాలవద్ద పడవేసే శక్తి ఆయన పాటకుందంటే దానిక్కారణం ఆ పాటలు ఆయన జీవితానుభవాల్లో పుట్టడమే. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో 1914లో జన్మించిన మాసిలామణి పూర్వీకులు తమిళ ప్రాంతం వారు. ఎంతో సాదాసీదా క్రైస్తవ కుటుంబంలో పుట్టినా అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో లక్షలాదిమందికి ఆశీర్వాదకారకుడైన మహా దైవజనుడు మాసిలామణి.ఆయన తర్వాత నేనే అని చెప్పుకునే వాళ్లున్నా, ఆయనది మొదటి స్థానమైతే వాళ్లది వందవ స్థానమవుతుంది. మధ్యలో ఉన్న సంఖ్యలన్నీ ఖాళీయే! ఆయనలాంటి వక్త, రచయిత, కవి మళ్లీ పుడితే అది మహాద్భుతమే అవుతుంది. ఆ అద్భుతం జరిగినా జరగకున్నా మాసిలామణి జ్ఞాపకాలు, ప్రసంగాలు, పాటలు కనీసం వెయ్యితరాలకు వెలుగుబాటలు. మాసిలామణి గీత రచయిత -
పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం!
చక్రి మరణం నాకు ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. అతను నాకు ఎంత ఆత్మీయుడంటే, గీత రచయితగా ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమే అతను. చక్రి కెరీర్లో అతని సంగీత దర్శకత్వంలో అత్యధిక పాటలు రాసిన రచయితను నేనే. అలాగే, గీతరచయితగా నా కెరీర్లో నా పాటలకు అత్యధికంగా సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి. ‘ఇట్లు... శ్రావణి - సుబ్రహ్మణ్యం’తో మొదలైన మా కాంబినేషన్ ఇప్పటి దాకా ఆగకుండా సాగుతోంది. వ్యక్తిగతానికి వస్తే, చక్రితో గడిపిన క్షణాలు, జరిగిన సంగతులు అన్నీ ఇన్నీ కావు. నేను కారు కొనుక్కోవడానికి కారణం - చక్రి. గీత రచయితగా తొలి రోజుల్లో నేను టూవీలర్ మీద తిరిగేవాణ్ణి. ఒకసారి హైదరాబాద్‌లో జోరున వర్షం. తడిసిపోయిన నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర చెట్టు కింద నిలుచున్నా. అయినా వర్షం ధాటికి తడిసిపోతున్నా. ఆ సమయంలో అటు నుంచి తన ‘మ్యాటిజ్’ కారులో వెళుతున్న చక్రి బండి ఆపి, నన్నూ కారులో రమ్మన్నాడు. నా టూవీలర్ అక్కడ వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక, వద్దన్నాను. ఆ తరువాత నేను కలిసిన వెంటనే చక్రి, ‘నువ్విక కారు కొనుక్కోవాలి’ అంటూ బలవంతపెట్టాడు. అలాగే, పాట రాసినందుకు నాకివ్వాల్సిన పారితోషికం డబ్బులు తన దగ్గరే దాచి ఉంచి, కారు కొనుక్కోవడానికి తగినంత పోగయ్యాక ఇచ్చాడు. అలా నేను నా మొదటి కారు కొన్నది చక్రి వల్లే! అలాగే, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది కూడా చక్రే! స్టైల్స్ అంటే ఎలా ఉండాలి, ఏమిటనేది తనే నాకు చెప్పాడు. నన్ను ప్రత్యేకంగా సికింద్రాబాద్‌లోని ‘స్టైల్ జోన్’కు తీసుకువెళ్ళి, అన్నీ కొనిపెట్టాడు. అదీ అతనిలోని స్నేహశీలత. చక్రిలోని గొప్ప గుణం ఏమిటంటే, తాను ఎదుగుతూ పక్కవాళ్ళను కూడా ఎదగనిచ్చే వ్యక్తి. పక్కవాళ్ళ ఎదుగుదలను చూసి అమితంగా సంతోషించే వ్యక్తి. నా రచనలు అతనికి ఎంత ఇష్టమంటే, కెరీర్ తొలి రోజుల్లో ప్రతి పాటకూ రచయితగా నన్నే రికమెండ్ చేసేవాడు. కానీ, ఇతరులకు అది తప్పుగా అనిపిస్తుందేమోనని ఒక దశకు వెళ్ళాక నేనే వద్దన్నాను. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా అన్నా. అతను నా మాటను అపార్థం చేసుకోలేదు. నా మనసులోని భావం గ్రహించాడు. చివరకు దర్శక, నిర్మాతలు వచ్చి, పాటలు నాతోనే రాయించమని అడిగినప్పుడు, ‘వాళ్ళే నిన్ను కోరుకొనే స్థితికి ఎదిగావు’ అంటూ ఆనందించాడు. అలాంటి వ్యక్తులు ఇవాళ అరుదు. గమ్మత్తేమిటంటే, గోదావరి తీరం నుంచి వచ్చిన నేను గోదావరి నది మీద రాసిన కవిత అంటే చక్రికి మహా ఇష్టం. అసలు ఆ కవితే మమ్మల్ని తొలిరోజుల్లో బాగా సన్నిహితం చేసి, కలిపింది. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయనీ, ఏదైనా మంచి పాట చేద్దామనీ ఇటీవలే నాతో అన్నాడు. అందుకు సిద్ధమవుతున్నాం. రేపో, ఎల్లుండో ఆ పని మీద కలవాల్సింది. ఇంతలోనే అనుకోని ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. సినీ పరిశ్రమకనే కాదు... నాకు వ్యక్తిగతంగా కూడా చక్రి లేని లోటు ఎన్నడూ తీరనిదే! - భాస్కరభట్ల సినీ గీత రచయిత - చక్రికి సన్నిహితుడు -
పూటకు లేకున్నా.. పాటే ప్రాణంగా..
తెలంగాణ కోసం గజ్జెకట్టిన బందెల సదానందం తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలనుకున్నారు. పూటకు లేకున్నా ఊరూరూ తిరిగారు. తన పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాళ్లకు కట్టిన గజ్జెలు విప్పకుండా 18ఏళ్లపాటు ఆటపాటలతో అందరినీ మెప్పించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలను కార్యోన్ముఖుల్ని చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తన కల సాకారమైందని, ఇక తనకే ఆశలు లేవని చెబుతున్న సదానందం పాడిన పాటలు ప్రజలను ఉద్యమంవైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించాయి. - మధిర(దుగ్గొండి) దుగ్గొండి మండలం మధిర గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బందెల సదానందం పదో తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత కూడా చదువుకోవాలని అనుకున్నా ఆర్థిక పరిస్థితి సహకరించక చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు. సదానందం చదువుకునే రోజుల్లోనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని తీవ్రంగా బాధపడేవారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే బాగుండని అనుకునేవారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి కావాలనుకున్నారు. ఇందుకోసం తనకున్న పాటలుపాడే కళను ఆయుధంగా చేసుకోవాలనుకునేవారు. చేనుచెలకల్లో కూలి పనులు చేస్తూనే పాటలు పాడడాన్ని సాధన చేశారు. పూటగడిచే స్థితి లేకున్నా పట్టువిడవకుండా పాటే ప్రాణంగా ముందుకుసాగారు. బియ్యాల జనార్దన్‌రావు స్ఫూర్తితో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించేందుకు ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావు, నలుమాస స్వామి, కట్టయ్యలు తొలిసారిగా 1997లో మదిర గ్రామానికి వచ్చారు. దీంతో స్ఫూర్తి పొందిన సదానందం సహచర కళాకారులను వెంటబెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి పాటలతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు కృషి చేసేవారు. ఇలా మొత్తంగా 600 గ్రామాల్లో పర్యటించి పాటలు పాడారు. ప్రజాగాయకులతో ధూంధాం.. ప్రజా గాయకులు గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, జయరాజ్, ప్రముఖ నటుడు నారాయణమూర్తితో కలిసి సదానందం అనేక ధూంధాంలు నిర్వహించారు. తెలంగాణ పది జిల్లాల్లోనూ ప్రదర్శనలిచ్చి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యమంలో అనేకసార్లు స్వయంగా పాల్గొని పోలీసుల లాఠీదెబ్బలు చవిచూశారు. పాటల రచయితగా.. పాటలు పాడడమే కాకుండా సదానందం అనేక ఉద్యమ, సామాజిక గీతాలను సైతం రచించారు. మొత్తంగా 40వరకు పాటలు రాసిన ఆయన జై బోలో తెలంగాణ సినిమాలో గద్దర్‌తో కలిసి ‘పొడుస్తున్న పొద్దుమీద.. నడుస్తున్న కాలమా..’ పాట పాడారు. తోటి కళాకారులు ఖర్చుల కోసం బాధపడుతున్న సమయంలో తాను కూలికి వెళ్లి వచ్చిన కూలి డబ్బుల నుంచి కొంత మొత్తాన్ని వారి కోసం ఖర్చుపెట్టేవారు. ఉద్యమంలో తానూ ఒక భాగమై ముందుకురికిన సదానందం నేటికీ పూటగడవని స్థితిలోనే ఉండడం బాధాకరం. అయినా తనలో ఆ బాధన్నదే కనిపించనీయకుండా తెలంగాణ రాకతో తన స్వప్నం సాకారమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ ప్రజలను ైచె తన్యం చేయాలనే దృఢ సంకల్పంతో గ్రామాల్లో తిరిగా. అందరి పోరాటంతో ప్రజల కల నెరవేరింది. ఇప్పుడు నాకు ఏ ఆశలూ లేవు. కొత్త రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు రావాలి. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది’ అని చెప్పే సదానందం కోరిక నెరవేరాలని కోరుకుందాం. -
‘హమ్ హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత?
జీకే - కరెంట్ అఫైర్స్ 1. సెప్టెంబర్ 9వ తేదీని హిమాలయ దివస్‌గా ఏ రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది? ఎ) జమ్మూ కాశ్మీర్ బి) ఉత్తర ప్రదేశ్ సి) అరుణాచల్ ప్రదేశ్ డి) ఉత్తరాఖండ్ 2. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను ఎవరు సాధించారు? ఎ) కరోలిన్ వోజ్నియాకి బి) లీనా సి) మరియా షరపోవా డి) సెరెనా విలియమ్స్ 3. భారత సంతతి రచయిత నీల్ ముఖర్జీ రచించిన ఏ పుస్తకం మ్యాన్ బుకర్ బహుమతి-2014కి సంబంధించి తుది జాబితాకు ఎంపికైంది? ఎ) ది నేరో రోడ్ టు ద డీప్ నార్త బి) ఎ లైఫ్ అపార్ట సి) ద లైవ్స ఆఫ్ అదర్స డి) టు లైవ్స 4. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన భారత తొలి అథ్లెట్ ఎవరు? ఎ) సుశీల్ కుమార్ బి) యోగేశ్వర్ దత్ సి) అభినవ్ బింద్రా డి) జీతురాయ్ 5. 2014 యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు సాధించారు? ఎ) రోజర్ ఫెదరర్ బి) కీ నిషికోరి సి) మారిన్ సిలిక్ డి) నొవాక్ జకోవిచ్ 6. 2014 సెప్టెంబర్ 5న భారతదేశంతోపాటు పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన దేశం? ఎ) జపాన్ బి) ఆస్ట్రేలియా సి) బ్రెజిల్ డి) దక్షిణాఫ్రికా 7. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన ‘ది గ్రేట్ బ్యూటీ’ ఏ దేశానికి చెందింది? ఎ) ఫ్రాన్స బి) జర్మనీ సి) ఇటలీ డి) స్పెయిన్ 8. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎ) ఇమ్రాన్ ఖాన్ బి) షేక్ హసీనా సి) ఖలీదా జియా డి) ఆంగ్‌సాన్ సూకీ 9. టూట్సీలు, హుటూలు ఏ దేశంలో రెండు ప్రధాన తెగలు? ఎ) రువాండా బి) కెన్యా సి) సోమాలియా డి) ఇథియోపియా 10. 2014 మార్చిలో వికలాంగుల కోసం నిర్వ హించిన వింటర్ పారాలింపిక్స్‌లో ఏ దేశం అత్యధిక పతకాలు సాధించింది? ఎ) ఉక్రెయిన్ బి) జర్మనీ సి) కెనడా డి) రష్యా 11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు -2014, రాజ్యసభలో ఆమోదం పొందిన తేది? ఎ) ఫిబ్రవరి 18 బి) ఫిబ్రవరి 19 సి) ఫిబ్రవరి 20 డి) ఫిబ్రవరి 21 12. ఇటీవల మరణించిన బంగారు లక్ష్మణ్ ఏ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు? ఎ) జనతాదళ్ (యునెటైడ్) బి) జనతాదళ్ (సెక్యులర్) సి) సమాజ్‌వాదీ పార్టీ డి) భారతీయ జనతా పార్టీ 13. దుబాయ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ దేశం గెలుచుకుంది? ఎ) దక్షిణాఫ్రికా బి) పాకిస్తాన్ సి) ఆస్ట్రేలియా డి) భారత్ 14. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను ఏ రంగంలో ఇస్తారు? ఎ) సాహిత్యం బి) సంగీతం సి) శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు డి) చలనచిత్రాలు 15. 2014 ఫిబ్రవరిలో బయో ఏషియా అంత ర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఎ) బెంగళూరు బి) చెన్నై సి) కోల్‌కతా డి) హైదరాబాద్ 16. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స బ్యాంక్ ఏటీఎంను 2014 ఫిబ్రవరి 27న ఏ నగరంలో ప్రారంభించారు? ఎ) హైదరాబాద్ బి) ఢిల్లీ సి) చెన్నై డి) ముంబై 17. ఫార్చూన్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీ? ఎ) టాటా స్టీల్ బి) ఓఎన్జీసీ సి) ఐఓసీ డి) ఎ, బి 18. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? ఎ) ఏప్రిల్ 1, 2014 బి) జూన్ 1, 2014 సి) జూలై 1, 2014 డి) పైవేవీ కాదు 19. ఏ అధికరణను ఉపయోగించి రాష్ర్టపతి పాలనను విధిస్తారు? ఎ) ఆర్టికల్ 352 బి) ఆర్టికల్ 354 సి) ఆర్టికల్ 356 డి) ఆర్టికల్ 358 20. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్పర్సన్, మేనే జింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ? ఎ) ఉషా థొరాట్ బి) నిషీ వాసుదేవ సి) శ్యామలా గోపీనాథ్ డి) పైవారెవరూ కాదు 21. అణుధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త? ఎ) జేమ్స్ చాడ్విక్ బి) జె.జె. థామ్సన్ సి) హెన్రీ బెక్వెరెల్ డి) రూథర్ ఫర్డ 22. బోడోలాండ్ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించింది? ఎ) జీకే పిళ్లై బి) ఆర్కే సింగ్ సి) అనిల్ గోస్వామి డి) శశికాంత్ శర్మ 23. కేంద్ర పారా మిలటరీ బలగాల (సీఆర్పీ ఎఫ్) సేవలను కొనియాడుతూ రాసిన ‘హమ్‌హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత? ఎ) గుల్జార్ బి) జావేద్ అక్తర్ సి) ప్రసూన్ జోషి డి) గోవింద్ మిశ్రా 24. 2014 ఫిబ్రవరిలో లండన్‌లో విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశ అత్యంత విలువైన బ్రాండ్? ఎ) టాటా గ్రూప్ బి) ఎస్బీఐ సి) ఎయిర్టెల్ డి) రిలయన్స ఇండస్ట్రీస్ 25. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాజీ డెరైక్టర్ జనరల్ రాజీవ్ ప్రస్తుతం ఏ పదవిలో కొనసాగుతున్నారు? ఎ) సీబీఐ డెరైక్టర్ బి) చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషర్ సి) విజిలెన్స కమిషనర్ డి) ఏదీకాదు 26. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏ సంవ త్సరంలో జరిగింది? ఎ) 1911 బి) 1913 సి) 1921 డి) 1919 27. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరు గవర్నర్ల బోర్డ చైర్ పర్సన్‌గా నియమితురాలైన తొలి మహిళ? ఎ) నీతా అంబానీ బి) ఇంద్ర నూయీ సి) చందా కొచ్చార్ డి) కిరణ్ మంజుదార్ షా 28. {పముఖ హిందీ రచయిత అమర్‌కాంత్ ఇటీవల మరణించారు. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? ఎ) 2009 బి) 2007 సి) 2001 డి) 2004 29. ఇటీవల మరణించిన సిల్వరిన్ స్వేర్ ఏ రాష్ర్టం నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన తొలి మహిళ? ఎ) అసోం బి) మేఘాలయ సి) నాగాలాండ్ డి) మణిపూర్ 30. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారం- 2013 ఎవరికి లభించింది? ఎ) వీకే సారస్వత్ బి) అవినాష్ చందర్ సి) జయంత్ విష్ణు నార్లికర్ డి) కె. రాధాకృష్ణన్ 31. ఏడో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ ఎవరు? ఎ) గౌతమ్ గంభీర్ బి) దినేష్ కార్తీక్ సి) వీరేంద్ర సెహ్వాగ్ డి) యువరాజ్ సింగ్ 32. ఇండోర్ పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన రేనాడ్ లావ్లెనీ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? ఎ) ఉక్రెయిన్ బి) రష్యా సి) ఫ్రాన్స డి) స్పెయిన్ 33. మీటింగ్స విత్ రిమార్కబుల్ ఉమెన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎ) ఎ.జి. నూరాని బి) కరణ్ సింగ్ సి) నీనా వ్యాస్ డి) నట్వర్ సింగ్ 34. వైశాల్యంలో అతి చిన్న దేశం? ఎ) తువాలు బి) నౌరు సి) మొనాకో డి) వాటికన్‌సిటీ 35. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం? ఎ) 2010-15 బి) 2011-16 సి) 2012-17 డి) 2013-18 36. 2014 మార్చిలో బిమ్స్టెక్ దేశాల సమా వేశం ఏ దేశంలో జరిగింది? ఎ) భారత్ బి) థాయిలాండ్ సి) మయన్మార్ డి) శ్రీలంక 37. 69వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చాంపి యన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు? ఎ) మిజోరాం బి) రైల్వేస్ సి) కేరళ డి) సర్వీసెస్ 38. 2014 టెంపుల్టన్ ప్రైజ్ విజేత థామస్ హాలిక్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఎ) చెక్ రిపబ్లిక్ బి) కెనడా సి) యూకే డి) దక్షిణాఫ్రికా 39. జకార్తా ఏ దేశానికి రాజధాని? ఎ) ఫిలిప్పైన్‌స బి) ఇండోనేషియా సి) మలేషియా డి) థాయిలాండ్ 40. ఏ బ్యాంకును గతంలో ఇంపీరియల్ బ్యాం క్ అని పిలిచేవారు? ఎ) ఆర్బీఐ బి) ఎస్బీహెచ్ సి) ఎస్బీఐ డి) బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానాలు 1) డి; 2) డి; 3) సి; 4) డి; 5) సి; 6) బి; 7) సి; 8) డి; 9) ఎ; 10) డి; 11) సి; 12) డి; 13) ఎ; 14) సి; 15) డి; 16) సి; 17) డి; 18) ఎ; 19) సి; 20) బి; 21) సి; 22) ఎ; 23) బి; 24) ఎ; 25) సి; 26) డి; 27) డి; 28) ఎ; 29) బి; 30) సి; 31) డి; 32) సి; 33) బి; 34) డి; 35) సి; 36) సి; 37) ఎ; 38) ఎ; 39) బి; 40) సి. బ్రిక్స్ ఆరో సమావేశం బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో 2014 జూలై 14, 15 తేదీల్లో ఆరో బ్రిక్స్ సదస్సును నిర్వహించారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రోసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా హాజరయ్యారు. వీరితోపాటు అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)ను చైనాలోని షాంగైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికయ్యే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఐదు దేశాలు సమానంగా భరిస్తాయి. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధులకు ప్రత్యామ్నాయంగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బ్యాంకు మొదటి అధ్యక్షుడిని భారత్ నుంచి నియమిస్తారు. గవర్నర్ల బోర్డు తొలి చైర్మన్‌గా రష్యా దేశస్థుడిని నియమిస్తారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గలో ఆఫ్రికన్ రీజినల్ సెంటర్‌ను నెలకొల్పుతారు. మరో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రిజర్వ కరెన్సీ పూల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. బ్రిక్స్ గురించి సంక్షిప్తంగా.. ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ బ్రిక్ (ఆఖఐఇ) అనే పదాన్ని 2001లో ప్రవేశ పెట్టాడు. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి చెందిన ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలను కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలుగా అభివర్ణించాడు. 2050 సంవత్సరానికి ఈ నాలుగు దేశాలు అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందుతాయని అయన పేర్కొన్నారు. ఈ నాలుగు దేశాలు జనాభాలో అతిపెద్ద దేశాలు. బ్రిక్ మొదటి సదస్సు 2009 జూన్‌లో రష్యాలోని ఎకాతెరిన్బర్గలో జరిగింది. 2010 డిసెంబర్లో ఈ కూటమిలో ఐదో సభ్య దేశంగా దక్షిణాఫ్రికా చేరింది. అప్పటి నుంచి ఈ కూటమిని బ్రిక్స్ (ఆఖఐఇ)గా వ్యవహరి స్తున్నారు. 2011 బ్రిక్స్ సమావేశంలో మొదటి సారి పూర్తి సభ్యదేశంగా దక్షిణాఫ్రికా పాల్గొంది.