పాటల రచయితలకు ఆహ్వానం:చెవిరెడ్డి
రేపు తిరుపతిలో వైఎస్సార్ సేవాదళ్ ఆధ్వర్యంలో పాటల ఎంపిక
తిరుపతి రూరల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమపాలన, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇస్తే మడమ తిప్పని నైజం, ఆయన చేయనున్న పాదయాత్రపై, నవరత్న పథకాలపై, చంద్రబాబు అవినీతి, అరాచక, అబద్ధాల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టనష్టాలపై, తెలుగు తమ్ముళ్ల దోపిడీ విధానాలపై చక్కని పాటలు రచించే గేయ రచయితలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వైఎస్సార్ సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు.
ఆయన శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు. రాసిన పాటలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్లో విననున్నట్లు తెలిపారు. మనసుకు హత్తుకునే చక్కని పదాలు, సామాన్యులకు సైతం చేరువచేసే పదప్రయోగంతో పాటలు రాసేవారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రచయితలకు తగిన పారితోషికం ఇస్తామని చెప్పారు. వివరాలకు సెల్: 98495 45556ను సంప్రదించాలని సూచించారు.