పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం! | prepair to Pushkar ... the song! | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం!

Published Tue, Dec 16 2014 3:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

పుష్కరాలకు...  పాట చేద్దామనుకున్నాం!

పుష్కరాలకు... పాట చేద్దామనుకున్నాం!

చక్రి మరణం నాకు ఏ మాత్రం నమ్మశక్యంగా లేదు. అతను నాకు ఎంత ఆత్మీయుడంటే, గీత రచయితగా ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండడానికి ముఖ్య కారణమే అతను. చక్రి కెరీర్‌లో అతని సంగీత దర్శకత్వంలో అత్యధిక పాటలు రాసిన రచయితను నేనే. అలాగే, గీతరచయితగా నా కెరీర్‌లో నా పాటలకు అత్యధికంగా సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్ చక్రి. ‘ఇట్లు... శ్రావణి - సుబ్రహ్మణ్యం’తో మొదలైన మా కాంబినేషన్ ఇప్పటి దాకా ఆగకుండా సాగుతోంది.

వ్యక్తిగతానికి వస్తే, చక్రితో గడిపిన క్షణాలు, జరిగిన సంగతులు అన్నీ ఇన్నీ కావు. నేను కారు కొనుక్కోవడానికి కారణం - చక్రి. గీత రచయితగా తొలి రోజుల్లో నేను టూవీలర్ మీద తిరిగేవాణ్ణి. ఒకసారి హైదరాబాద్‌లో జోరున వర్షం. తడిసిపోయిన నేను గణపతి కాంప్లెక్స్ దగ్గర చెట్టు కింద నిలుచున్నా. అయినా వర్షం ధాటికి తడిసిపోతున్నా. ఆ సమయంలో అటు నుంచి తన ‘మ్యాటిజ్’ కారులో వెళుతున్న చక్రి బండి ఆపి, నన్నూ కారులో రమ్మన్నాడు. నా టూవీలర్ అక్కడ వదిలేసి వెళ్ళడం ఇష్టం లేక, వద్దన్నాను. ఆ తరువాత నేను కలిసిన వెంటనే చక్రి, ‘నువ్విక కారు కొనుక్కోవాలి’ అంటూ బలవంతపెట్టాడు. అలాగే, పాట రాసినందుకు నాకివ్వాల్సిన పారితోషికం డబ్బులు తన దగ్గరే దాచి ఉంచి, కారు కొనుక్కోవడానికి తగినంత పోగయ్యాక ఇచ్చాడు. అలా నేను నా మొదటి కారు కొన్నది చక్రి వల్లే! అలాగే, నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది కూడా చక్రే! స్టైల్స్ అంటే ఎలా ఉండాలి, ఏమిటనేది తనే నాకు చెప్పాడు. నన్ను ప్రత్యేకంగా సికింద్రాబాద్‌లోని ‘స్టైల్ జోన్’కు తీసుకువెళ్ళి, అన్నీ కొనిపెట్టాడు. అదీ అతనిలోని స్నేహశీలత.

 చక్రిలోని గొప్ప గుణం ఏమిటంటే, తాను ఎదుగుతూ పక్కవాళ్ళను కూడా ఎదగనిచ్చే వ్యక్తి. పక్కవాళ్ళ ఎదుగుదలను చూసి అమితంగా సంతోషించే వ్యక్తి. నా రచనలు అతనికి ఎంత ఇష్టమంటే, కెరీర్ తొలి రోజుల్లో ప్రతి పాటకూ రచయితగా నన్నే రికమెండ్ చేసేవాడు. కానీ, ఇతరులకు అది తప్పుగా అనిపిస్తుందేమోనని ఒక దశకు వెళ్ళాక నేనే వద్దన్నాను. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నా అన్నా. అతను నా మాటను అపార్థం చేసుకోలేదు. నా మనసులోని భావం గ్రహించాడు. చివరకు దర్శక, నిర్మాతలు వచ్చి, పాటలు నాతోనే రాయించమని అడిగినప్పుడు, ‘వాళ్ళే నిన్ను కోరుకొనే స్థితికి ఎదిగావు’ అంటూ ఆనందించాడు. అలాంటి వ్యక్తులు ఇవాళ అరుదు.
 గమ్మత్తేమిటంటే, గోదావరి తీరం నుంచి వచ్చిన నేను గోదావరి నది మీద రాసిన కవిత అంటే చక్రికి మహా ఇష్టం. అసలు ఆ కవితే మమ్మల్ని తొలిరోజుల్లో బాగా సన్నిహితం చేసి, కలిపింది. వచ్చే ఏడాదిలో గోదావరి పుష్కరాలు వస్తున్నాయనీ, ఏదైనా మంచి పాట చేద్దామనీ ఇటీవలే నాతో అన్నాడు. అందుకు సిద్ధమవుతున్నాం. రేపో, ఎల్లుండో ఆ పని మీద కలవాల్సింది. ఇంతలోనే అనుకోని ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. సినీ పరిశ్రమకనే కాదు... నాకు వ్యక్తిగతంగా కూడా చక్రి లేని లోటు ఎన్నడూ తీరనిదే!
 - భాస్కరభట్ల
 సినీ గీత రచయిత - చక్రికి సన్నిహితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement